అమెరికాని కనుగొన్న వాడెవరు అని చిన్నప్పటి నుండీ చదువుకున్నం కదా? మరి ముగ్గురు కొలంబస్లు ఎక్కడి నుండి వచ్చారు? ఎవరు? ఏమిటీ కథాకమామిషు? అనుకొంటూ మొదలు పెట్టాను.
కథల సూచిక అంటూ 19 శీర్షికలైతే ఉన్నాయి. అయితే ఇవి కథలనాలా, నవలనాలా, ట్రావెలాగ్ అనాలా అనే డైలమాలో పడ్డాను.
శీర్షికలు వేర్వేరుగా పెట్టినా మొత్తం అంతా ఒక ప్రవాహంలా కథ, కథనం ఉంది. అందుచేత నవల అనే చెప్పాలి. అయితే అమెరికాకి రచయిత్రి ఆమెభర్త, అత్తగారు ప్రయాణానికి సన్నద్ధం అయిన దగ్గరనుండి వరసగా అమెరికాలో జీవితం , విశేషాలు స్నేహాలు మొదలుకొని రాస్తూ రాస్తూ చివరికి మేరా భారత్ మహాన్ అనుకొంటూ హైదరాబాదులో దిగడం వరకూ రాసారు కనుక యాత్రాచరిత్ర గాను పరిగణించవచ్చా.
నామట్టుకునేను నవలా రూపక యాత్రాచరిత్రగానే పరిగణిస్తూ పరిచయం చేయదలిచాను.
సోమరాజు సుశీలగారు విద్యావంతురాలు. స్వయంగా పరిశ్రమ ప్రారంభించి విజయవంతంగా నడిపించిన సమర్థురాలు. ఈ అనుభవంలో చిన్నపరిశ్రమలు- పెద్దకథలు, ఇల్లేరమ్మ కథలు,దీపశిఖ, పెళ్ళిపందిరి అనే కథాసంపుటాలు వెలువరించారు. మరాఠీ నుండి రామాయణ, మహాభారత కథలను స్వేచ్చానువాదం చేసారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త డా.వై. నాయుడమ్మ జీవితచరిత్రను రాసారు.
తెలుగులో హాస్య వ్యంగ్యరచనలు చేసే రచయిత్రులే అతి తక్కువ. ఆ తక్కువలో సోమరాజు సుశీల ప్రముఖంగా చెప్పుకోదగిన రచయిత్రి.కొందరి రచనలలోనూ, తెలుగు సినీమాలలోనూ హాస్యం పేరిట చెప్పే ద్వంద్యార్థాల సంభాషణలు, వెర్రివేషాలూ కావు సుశీలగారి రచనలు. అతి సున్నితంగా, తగలాల్సినవారికి చురుకుమనిపించే వ్యంగ్యం, హాస్యం ఆహ్లాదకరంగా చదువుతూ చదువుతూ పెదాల మీద చిన్న చిరునవ్వుని మెరిపిస్తాయి.
నేను కథ చెప్పదలుచుకోలేదు!
మనవరాలు పుట్టిన ఏణ్ణార్ధానికి కూతురి కాన్వొకేషను కోసం భర్తా, అత్తగార్లతో కలసి రచయిత్రి చేసిన అమెరికా యాత్రలోని సరిగమల, పదనిసల్లాంటి చమక్కులు, సందర్భాలు మాత్రమే చెప్తాను. వీళ్ళు ముగ్గురే ఈ ముగ్గురు కొలంబస్ లు. సుశీల అనే కొలంబస్ అమెరికాని కొత్తగా చూపుతారు ఇందులో.
మొదటికథంతా వాళ్ళు అమెరికాయాత్ర మొదలవ్వక ముందు వీళ్ళ సంసారం గొడవలు, పాత్రలపరిచయాలే. అమెరికాలో పిల్లలుంటే ఆదివారాలన్నీ తీగల గుండా పిల్లల కబుర్లు ఎప్పుడు వస్తాయో అని తల్లిదండ్రులకు ఫోను ముందు తపస్సే కదా. అలాగే చివరాఖరికి సుశీలగారి అమ్మాయి ఫోనులోకి వస్తుంది .ఎప్పటిలాగే తల్లికూతుళ్ళ ప్రేమపూర్వక దెప్పుళ్ళూ,అవీ అయ్యాక సంభాషణ మార్చడానికి రచయిత్రి మనవరాలి గురించి అడుగుతుంది. ఇక అంతే. ఏ తల్లికైనా పిల్లల ముచ్చట్లు చెప్పుకోటానికి విసుగనేదే రాదు. భగవంతుడదేమి మాయ పెట్టాడో గాని అమెరికాలో కూడా అంతేనని తేలి పోయిందంటుంది రచయిత్రి.
భార్యని పెట్టే చిత్రహింస అంటే సినిమాల్లో చూపించేవి కాదంటారు రచయిత్రి. పిలిస్తే పలకక పోవడం,మాటలు వినిపించుకోకపోవటం, రెస్టు తీసుకోవాలనుకునే సరికి కాఫీకోసమో,ఇంక దేనికోసమో లేచేలా చేయడం కూడా కనిపించని చిత్రహింసలే అంటారు ఓ సందర్భంలో రచయిత్రి.
తిరుగు ప్రయణానికి ముహూర్తం పెట్టుకొని మరీ ఎట్టకేలకు ముగ్గురూ బయల్దేరతారు.దానికి ముందు పిల్లలకోసం తీసుకెళ్ళాల్సిన లిస్ట్ వాటికోసం హైరానా వుండనే వుంటుంది.
ఎప్పుడూ ఎవరిండ్లలోనూ నిద్దర చేయలేదని కౌన్సిలేటు వాళ్ళకి తెలుసో ఏమిటో వెంటనే వీసాలిచ్చేసారని వాళ్ళమీద కూడా చెణుకులు విసురుతుంది రచయిత్రి.
మద్రాసువెళ్ళే ట్రైనులో భోషాణం లాంటి పెట్టెలు ఎక్కించి ప్రయాణం చేసి రైల్లో కొత్తపెళ్ళి కూతురుఇచ్చిన ప్రసాదాలు తిని ఎట్టకేలకు మద్రాసు చేరుతారుట.
ఎవరైనా అమెరికా వెళ్తున్నారంటే చుట్టాలు, పక్కాలు, స్నేహితులు వగైరాలందరు వాళ్ళ పిల్లలకోసం పంపించే పేకెట్లు వగైరాలతోనే సగం లగేజి ఉండటం సర్వసాధారణం. అంతేకాదు చదువు తున్న పాఠకులకు కూడా మద్రాసులో గ్రాండ్ స్వీట్ షాపు తెలుస్తుందండోయ్.
ఎయిర్ పోర్టులో ఉన్న వాళ్ళందరూ అమెరికా పిల్లల అమ్మానాన్నల్లాగే ఉంటారనటం, అందంగా అటూ ఇటూ తిరుగుతున్న ఎయిర్ హోస్టెస్ లను చూడటం చదువుతున్న మనకి సరదాగానే ఉంటుంది.
ఎట్టకేలకి మన ముగ్గురు కొలంబస్ లు అమెరికాకి అతిధులుగా చేరుతారు.
యూఎస్ వెళ్ళీవెళ్ళగానే రచయిత్రిభర్త గార్డెనింగు పని మొదలెడతాడుట. అత్తగారు అణువణువులోను దేవుడుంటాడని ముందు నీళ్ళజగ్గుని పెట్టుకొని చూస్తూ పారాయణం చేసుకుంటుంది అని చమత్కరించారు
పక్కింటి పిన్నిగారని కూతురు చెప్పినామె నిజానికి లావుపాటి పిన్నిగారు కాదండోయ్ కేరిన్ అనే అమ్మాయి మంచి మంచి కేకులు తెస్తుంది సరే ఫ్రిజ్ లోంచి తనకు కావలసిన కూరలు, వంటలూ పట్టుకు పోతుంది అని చెప్పటం పాఠకులకు ఆశ్చర్యం అనిపిస్తుందే కానీ ఇంట్లోకి సర్వస్వతంత్రంగా వచ్చి తెరచి ప్రతీ వాళ్ళూ తీసుకు పోతుంటారుట. కేరనే తన బంధువులు అందరి దగ్గరికీ వీళ్ళని తీసుకెళ్తుంది. కేరన్ కేన్సర్ సర్వైవర్ అని తెలిసీ ,ఆమె జేస్తున్న కార్యక్రమాలు విని మనం కూడా విస్తుపోతాం. ఆనందంగా జీవించటం ఎలానో కేరన్ జీవితం తెలుపుతుంది.
ముప్పై రోజులపాటు తిరిగేందుకు మూడువందల డాలర్ల పెట్టి ఆమ్ ట్రాక్ పాస్ కొనుక్కుని అమెరికా హాయిగా ముగ్గురు కలసి అన్ని ప్రాంతాలూ చక్కబెట్టి అమెరికాలోని బంధుమిత్రుల ఆతిథ్యం పొందుతూ చేసే అక్కడి జీవితం మీద రచయిత్రి చేసే కామెంట్లు ఆహ్లాదంగా ఉంటాయి. రైలు ప్రయాణాల్లో అమెరికాలో కూడా కొందరు మహిళల పట్ల కనపరిచే వివక్షల్ని వివరించినప్పుడు పాఠకులమనసూ నొచ్చుకుంటుంది.అక్కడ కూడా గురువారం సాయి బాబా భజనల్నీ, శుక్రవారం విష్ణు,లక్ష్మీ,లలితాసహస్రనామాలు అమరికన్ యాసతో పఠించటం వినవచ్చును ఏప్రెల్ నెల్లో కూడా మంచు కురవటం అనుభూతి చెందొచ్చును.
అనేక గంటల రైలుప్రయాణం మనచేత కూడా చేయించి సీనియర్ సిటిజన్ల పెట్టెలో కూచుని రక రకాల మనుషుల్ని, మనస్తత్వాలని గమనించవచ్చును.
బయట పదార్థాలు ముట్టకుండా వాళ్ళే వండుకొని తెచ్చుకుని తినే జూస్ పెద్దల్ని గురించి తెలుసుకుంటాం. 86 ఏళ్ళ వయసులోనూ హాయిగా రైలు ప్రయాణం చేస్తున్నామె జీవితం తెలిసి ఆశ్చర్య పోతాం. అరగంటకోసారి వాష్ రూంకి వెళ్ళినట్లు రైల్లో ఓమూల కేటాయించిన పెట్టెలో సిగ రెట్లు వూది పారేయొచ్చు.నేరేడు పండు రంగులో నల్లగౌను వేసుకుని షూటైన వాసనలు వెదజల్లుతూ కబుర్లు చెప్పే ఆమెని చూసి రైల్లో ఆడవాళ్ళ మొఖం చిట్లించి ‘అలాంటి వాళ్ళని ఎందుకు ఎక్కించావ’ని కండక్టర్ని నిలదీయడం చూసి ఇక్కడ కూడానా ఈ వివక్ష అని విస్తుపోతాం.
అమెరికా వెళ్ళి చూడకపోతే బాగుండదని యూనివర్సల్ స్టుడియో, నయాగరా, డిస్నీలాండ్ తిరిగేసి తిమింగలాల ఆటకీ డాలర్లు వదిలించుకోక తప్పదు కదా.
పదవులూ హోదాలూ పెరగగానే ఎవరెస్ట్ మీద కూర్చుని సాటి వాళ్ళని పిపీలకాల్లా చూసే పెద్దల్ని మనం ఎరుగుదుం.
ఫార్మసీ స్కూల్ డీన్ గారు, అతని కొడుకు గారువచ్చి పాపాయి కోసం షెల్ఫ్ చేస్తుంటే మరీ మరీ ఆశ్చర్యపోతాం. మనకాలంలో కాస్త డబ్బు వచ్చే ఉద్యోగంచేస్తే విరిగిన కుర్చీకి మేకైనా కొట్టం.డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించీ,మన పని మనమే చేసుకుందామనేది మనకేం తెలుసు.
చివరాఖరికి మన రచయిత్రి గారి జన్మదినానికీ కూతురూ,అల్లుడూ దేవాలయానికి తీసుకు వెళ్తే అక్కడ కూడా అక్కడా,ఇక్కడా గుడుల తులనాత్మక పరిశోధనగా చెప్పుకొస్తుంది.ఆఖరికి ఆదివారం సంతకి వెళ్ళినప్పుడు కూడా అదే పద్ధతి.
అదేవిధంగా కూతురు శైలజ తీసుకు వెళ్ళిన కాన్సెర్ట్ కి వెళ్ళిన రచయిత్రి ఆ కార్యక్రమం అనుభూతిస్తూనే మనదేశంలో ఆదరణ లేని కచేరీల గురించి ఆవేదన చెందుతుంది.
ముగ్గురు మదర్లు ఉన్నామంటూ మదర్స్ డే నాడు అనేకానేక టూరిస్ట్ స్థలాలు చూసి చివరికి
షానండోవా ప్రయాణం. బ్లూరిడ్జ్ కొండల ప్రాంతంలోకి ప్రవేశించి ఆ కొండలలోనే పాతాళ భైరవి సినిమాలోలా షానండోవా లోయకన్నా ఇవతలగా ప్రకృతి పెట్టిన అందమైన బొమ్మలకొలువు లాంటి “లూరేకావెర్న్” అనబడే గుహలు. రెండు పక్కలా వున్న అందమైన స్పటికాకృతులను తెలుసుకోవచ్చు. ఆ ప్రాంత ప్రకృతి వర్ణన చదివితే మాయా బజార్ మయసభలోలా సహజ వనాలు, సహజ సెలయేర్లూ,సహజనదుల్నీ చూసినట్లే వుంటుంది. అందుకే వనవిహారం చేయాలన్న కోరిక తీర్చుకున్నారుట రచయిత్రి.
ఇంతకీ అమెరికా దర్శనానికి బయలు దేరిందే అమ్మాయి స్నాతకోత్సవానికి.ఆ సందర్భంలోనూ తన పీహెచ్డీ పట్టా గవర్నర్ చేతిమీదుగా అందుకోలేకపోయిన విషయం తలచుకుంటుంది రచయిత్రి.ఎంత చదువుకున్నా కొన్నికొన్ని ముఖ్య సందర్భాల్లో కూడా భార్యలు కుటుంబ బంధాల వలన తమ ఇష్టాలను కోల్పోవలసిన పరిస్థితులు సుమారు నలభై యాభై ఏళ్ళ క్రితం సర్వసాధారణమే కదా !
ఇందులో ప్రస్తావించినవే కాక మనవరాలి ముచ్చట్లూ, తల్లీకూతుళ్ళ ప్రేమపూర్వక దెప్పుళ్ళూ హాస్యం, వ్యంగ్యం కలగలిసి పాఠకులకు కూడా ఆహ్లాదకరంగా వుంటాయి. బయలుదేరిన దగ్గరనుండి అమెరికా,ఇండియాలో ప్రతీ సంఘటనలోనూ సహజసిద్ధమైన తులనాత్మక చింతన అంతటా వ్యక్తం అవుతూ వుంటుంది.కుటుంబ జీవితాలూ,మానవీయ విలువలూ,వివాహాలూ, విడాకులూ,పిల్లల పెంపకం,ఇంటిపనులు పంపకం,చదువులూ,వుద్యోగాలూ వీటి అన్నింటినీ సమయానుకూలంగా రచయిత్రి సానుకూలంగా స్పష్టమైన విశ్లేషణ చేయటం సముచితంగా వుంటుంది. తన పరిశీలనలో అక్కడ వున్నకాలంలో ఆలోచిస్తే కౌటుంబిక విలువల్ని అకారణంగా ఎవరూ ధ్వంసం చేసుకోరంటుంది రచయిత్రి.
ఈ యాత్ర ముగింపులో బొంబాయిలో దిగిన ముగ్గురు కొలంబస్ లకూ దాహంతో నోరెండిపోయి ఫ్రూటిలను కొనుక్కుని తాగిన తర్వాత చెత్తబుట్ట ఎక్కడుంది అని కనిపించిన వ్యక్తిని అడుగుతే ఎక్కడైనా పడేయండి పర్వాలేదంటాడుట. మనదేశం కదా మనిష్టమే ఇష్టం అని ముగిస్తుంది రచయిత్రి.
ఈ పుస్తకం మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరివరకూ చూపులు పంక్తులు వెంట పరుగులు తీస్తాయి.పెదాలు మాటిమాటికీ చిరునవ్వుల్ని అతికించుకుంటూనే వుంటాయి.ఈ పుస్తకం ప్రతిపేజీలో అన్వర్ గీసిన రేఖాచిత్రాలు కథనాన్ని మరింత రక్తికట్టిస్తూ మనసును ఆకట్టుకుంటాయి.
సాధారణ అమెరికా యాత్రాచరిత్రలకు భిన్నంగా అనేక కొత్త విషయాలను ప్రస్తావించటమే కాకుండా వాటికి కొత్త కొత్త రుచులను జోడించి పాఠకులకు మనసునిండేలా వుంది.సోమరాజు సుశీల రాసిన ఈ ముగ్గురు కొలంబస్ లు తప్పక చదవవలసిన పుస్తకం
*








సుభద్రాదేవి గారి పుణ్యమాని సోమరాజు సుశీల గారి ఆహ్లాదకర, ఆరోగ్యకర; అదే సమయంలో వ్యంగ్యాత్మక సమయాల్ని అనుభూతించగలిగాను.
ముగింపులోని చమక్కులు మరింతగా ఆకట్టుకున్నాయి.
సుభద్రాదేవి గారికి అభినందనలు, ధన్యవాదాలు.