ఆధునిక మలయాళ కవిత్వం-మహిళా చైతన్యం

   సామాజిక చైతన్య స్రవంతి సాహిత్యం. భిన్న నమ్మకాల, మూఢనమ్మకాల,విశ్వాసాల కుల మతాల ,మనస్తత్వాల  కలయిక  సమాజం. అలాంటి సామాజిక పొరల్లోనుంచి ఉబికి వచ్చిన సాహిత్యంలో వీటన్నిటి పాలు  హెచ్చు తగ్గులతో కనబడుతూ ఉంటాయి. చాలా విశాలంగా ఆలోచిస్తే ,మనిషి సృష్టించిన కులమత వర్గ భేదాలకు అతీతంగా ఆలోచిస్తే, ప్రపంచంలో రెండే కులాలు –స్త్రీలు –పురుషులు. మనస్తత్వాల ప్రాతిపదిక పై ఇలాంటి ఒక విభజన చేయవచ్చు.ఈ రెండు విభిన్నమనస్తత్వాలనీ ఆకాంక్షలనీ సరైన రీతిలో ఒకరినొకరు  అర్ధం చేసుకోక పోవటం,అంతగా అర్ధం చేసుకున్నా మానవ సహజమైన అహం ,రాజీ పడలేని మనస్తత్వం ,పరస్పరం ఇచ్చి పుచ్చుకోవలసిన సమానత్వం లోపించటం వగైరాలు  అపోహలకీ  అసంతృప్తికీ బాటలు వేయటం వల్ల ,మచ్చలేని పూర్ణచంద్రుడులా వెలగవలసిన స్త్రీ పురుష సంబంధాలు  శోకపు కరిమబ్బుల్లో చిక్కుకుపోతోందనేది  నేటి వాస్తవం . స్త్రీల వ్యక్తిగత సామాజిక సమస్యలను అనుభవించి తెలుసుకోలేని పురుషులకు ,స్త్రీలే చైతన్యవంతులై, వాళ్ళ సమస్యలను స్వానుభవాల్లోనుంచి వాళ్లే  అక్షర  బద్దం చేయడం అనేది  ఆనందదాయకమైన విషయమే .ఈ పరిణామాన్ని మనం అందరూ స్వాగతించాలి ;వాళ్ళ ప్రయత్నానికి  తగినంత ప్రోత్సాహం కూడా అందించాలి. ఇతరుల అనుభవాలను స్వానుభవాలుగా మలుచుకొని జీవితాన్ని సరిదిద్దుకునేవాడు  బుద్ధిమంతుడు. స్వానుభవం తోనే ఏదైనా నేర్చుకుంటాననీ ,ఇతరుల అనుభవాలనీ మిళితం చేసుకోలేననీ మొండికేత్తే వాడు మూర్ఘుడు .

చదువుకున్న మహిళ చరిత్రను తిరగవ్రాస్తుందని అన్నారు మహాకవి గురజాడ అప్పారావు. నిజమే.మహిళలను మాత్రమే కాదు మానవ సమాజాన్ని మొత్తం చైతన్యవంతం చేసేది చదివే. విద్య లేనివాడు వింత పశువు కదా!తను ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నానని తెలుసుకొని ,తను ఎలా ఉండాలని మేలుకొని  తన ఆకాంక్షలకు లక్ష్యాలకు అనుగుణమైన బాట ఉంటే ,ఆ బాట మీద, లేకపోతే తనదైన బాట ఏర్పరిచుకొని  సదా ముందుకు  సాగే వారిని చైతన్యవంతులని చెప్పవచ్చు.విద్య మనోవికాసాన్ని తట్టి లేపుతుంది ;ఆలోచనా శక్తిని పెంచుతుంది. తన సమాజం తీరు, ఇతర సమాజాల తీరు తెలుసుకోవడానికి అవకాశం కల్పించడమే కాక విచక్షణా శక్తిని కూడా  ప్రసాదిస్తుంది .

మహిళల్లో నేడు కనబడే ఈ చైతన్యం ఏ ఒక్క రోజో ఎక్కడ నుంచో ఊడి పడలేదు. సంవత్సరాలు , దురవస్థల చీకట్లో సహవాసం చేయటం వల్ల బీజం దాల్చిన ఈ చైతన్యం క్రమ క్రమంగా ఎదిగి ఈ స్థితికి చేరుకుంది  . బహుశా ఏ సామాజిక చరిత్ర పశీలించినా ,మహిళా చైతన్యం ఊపిరి పోసుకోవడానికి దోహదం చేసిన పరిస్థితులు ఒకేలానే  వుండవచ్చు. కాని మలయాళ సాహిత్యం లో మహిళా చైతన్యం గురించి వ్రాస్తున్నాను కనుక, మలయాళ సమాజం గురించీ, మలయాళ సమాజంలో   ఆ నాడు నెలకున్న స్త్రీల  స్థితిగతులు గురించీ  చాలా చాలా సంక్షిప్తంగానైనా చెప్పకపోతే ,సమంజసంగా అనిపించదు .

చారిత్రిక నేపధ్యం 

భారత దేశంలోని ఏ ప్రాంతం తాలూకు చరిత్ర పరిశీలించినా ,19వ శతాబ్దపు మలి రెండు దశాబ్దాల్లోనూ ఇరవై శతాబ్దపు తొలి రెండు దశాబ్దాల్లోనూ సంఘ సంస్కర్తుల ఉద్యమం ఎక్కువగా  జరిగినటు కనబడుతుంది.మూఢ నమ్మకాల, విచిత్ర ఆలోచనల కలనేత దుప్పటి కప్పుకొని సుఖ నిద్రలో వున్న సమాజాన్ని తట్టి లేపి చైతన్యవంతం చేసినవారు సంఘ సంస్కర్తలే. చైతన్యవంతమైన సమాజం స్థాపించడానికి ,విద్యను ఆయుధంగా మలిచారు  వాళ్ళు. తెలుగు రాష్ట్రాల్లో కందుకూరి అలాంటి సంఘ సంస్కర్తల గురించి మనం గుర్తు చేసుకుంటున్నట్లు మలయాళ సమాజానికి సంబంధించినంతవరకు ,ముగ్గురు సంస్కర్తులు  గురించి చాలా సంక్షిప్తంగా చెప్పుకోవాలి.వాళ్ళు  వివిధ కులాలకు చెందిన వారు.వాళ్ళు విడి విడిగా   తమ తమ  సమాజాన్ని చైతన్య వంతులుగా మార్చడానికి ,ప్రయత్నించడమే కాక ఆ ప్రయత్నంలో విజయం సాధించారు కూడా. వాళ్ళలో ముఖ్యుడు శ్రీ బ్రహ్మర్షి శ్రీ నారాయణ గురు.[1856-1928 ]. సరిగా కందుకూరికి సమకాలీనుడు ఇతను. వీరు గురించి వీరు చేసిన సాహిత్య సామాజిక సంస్కరణల గురించి వీరు సమాజాన్నీ  ,మహిళల జీవితాన్ని ఆలోచనా సరళినీ  ఎలా ఎంత మట్టుకు ప్రభావితం చేశారనే దాన్ని గురించి  తెలుగులో కూడా ఎనేన్నో పుస్తకాలే  వెలువడి వున్న నేపధ్యంలో ,నేను కేవలం రేఖామాత్రంగా ఈ వ్యాసం నిడివిని గుర్తుంచుకొని కేవలం నాలుగు వాచకాలు మాత్రమే వ్రాస్తాను.  సామాజికంగా ఈళవ[యాత]కులంలో పుట్టాడు శ్రీ నారాయణ గురు. కులపరమైన ఆంక్షలు అన్ని జీవిత రంగాల్లోకి వ్యాపించిన రోజులవి.నివాసం,దైవారాధన బట్టలు ఆభరణాలు ధరించే తీరు ,భాష ,ప్రవర్తన,మొదలైన వాట్ల పై ఆంక్షలు ఉండేవి .

అస్పృశ్యత ,అంటరాని తనం,రాజ్యమేలే ఆ రోజుల్లో నిమ్న కులస్తుడు  వల్ల  అగ్ర కులస్తుడు మైల పడితే నిమ్న కులస్తుడ్ని చంపే హక్కు కూడా ఉండేది . ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే కులంలో పుట్టాడు శ్రీ నారాయణ గురు. అతని ప్రయత్నం వల్ల అలనాటి ఈళవ సమాజంలో ఆచరణలో వుండి, నేడు లేని, మూడు దురాచారాలు, తాళి కట్టు ,పుళి కుడి తిరెండు కుళి [ఇక్కడ మహిళలకు సంబంధించిన విషయాలే ప్రస్తావిస్తున్నాను ]. పది పన్నెండు సంవత్సరాల ఆడపిల్లకి వివాహానికి ముందే సర్వ హంగామాలతోనూ తాళి కట్టే సంప్రదాయాన్ని తాళి కట్టు అంటారు. నిజమైన వివాహానికీ దీనికీ సంబంధం ఉండేది కాదు. గర్భిణి స్త్రీ ఏడో నెలలో పలు రకాల పుల్ల రుచులు కలిగినవాటిని కలిపి తాగడమే పుళి కుడి. ఆడపిల్లలు రజస్వలైనప్పుడు ,ఏడవ రోజు వాద్య ఘోషతో వాళ్ళను ఏటి వద్దకి తీసుకొని వెళ్ళి స్నానం చేయించి తీసుకురావటమే తిరెండు కుళి.ఈ మూడింటికీ విందు భోజనాలు మామూలే. శ్రీనారాయణ గురు గారి నిరంతర శ్రమ వల్ల ఈ మూడు దురాచారాలు కనుమరుగైనాయి.వివాహ విషయంలో అయితే  అతి సరళమైన వివాహ రీతిని ప్రవేశ పెట్టారు,శ్రీ నారాయణ గురు .ప్రాధమిక విద్యాలయాలు ఏర్పాటు చేసి ,ఆడపిల్లలకు కూడా విద్యాభ్యాసం అందించేరు.   మనిషికి ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అని భోదించిన శ్రీనారాయణ గురు రచించిన

చిరు కీడు చీమకైనను ,

తల పెట్టని సానుభూతిని

సదా కరుణాకరా ప్రసాదించు ,నీ

తిరుమేనిని వీడని తలంపునూ –

అనే  ఈ  పద్యం మానవత్వపు బావుటా పై వ్రాయదగ్గినది

మలయాళ సమాజం లో అగ్ర కులానికి చెందిన [బ్రాహ్మణులు ] చెందిన కులం  నంబూదిరి కులం.తొలి నాటినుంచి   పెద్ద ,పెద్ద భూస్వాములు,వాళ్ళు .పరశురాముడు గొడ్డలి వి‌సరినప్పుడు సముద్రం వెనక్కి వెళ్ళిందనీ అలా వెనకు వెళ్ళిన బూభాగమే కేరళ అని అంటారు. అలా ఏర్పడిన మొత్తం భూమిని 64 నంబూదిరి కుటుంబాలకు విభజించి ఇచ్చినట్లు కూడా ఇతిహాస కదల్లో అంటారు. ఏది ఏమైనా,  ఎక్కువ భూమి వాళ్ళ ఆధీనంలోనే వుండేది.అలాంటి  నంబూదిరి కులానికి చెందిన మహిళలు[వాళ్ళను అంతర్జనం అని అంటారు] అజ్ఞానంతో మగ్గుతూ బయట ప్రపంచపు వెలుగు చూడకుండా అంతా : పురంలోనే గడిపేవారు . వాళ్ళకు ఉండడానికి ఇంటి ప్రాంగణంలోనే  ప్రత్యేకంగా పెద్ద పెద్ద భవంతులు ఉండేవి . మగవాళ్ళు అంత : పురంలోకి వెళ్లకూడదనే ఆంక్ష  కూడా వుండేది . వాళ్ళు బయటికి రాకూడదు . భర్తని కూడా పగటి వేళ చూడరు నంబూదిరి స్త్రీలు . రాత్రి పూట భర్త అంత: పురంలో తనకు కేటాయించిన గదిలోకి వచ్చినప్పుడే ఏదైనా మాట్లాడుకోవాలి.అంతే కాదు ఆ రోజుల్లో,ముఖ్యంగా మాతృసామ్య వ్యవస్థ పాటించిన నాయర్ మీనోన్ సమూహంలో సంబంధం అనే ఒక వివాహ వ్యవస్థ ఉండేది. ఒక రకంగా చూస్తే ,కొంత వరకు నేటి లివ్ టుగెదర్ పద్ధతియే ఇది. కానీ ఈ సంబంధం అనే సంప్రదాయం సమాజం ఆమోదించిన ,అంగీకరించిన  సాంప్రదాయం. ఆ సాం ప్రదాయ ప్రకారం వివాహం అంటే తాళి కట్టు మంత్రాలు ఏమి ఉండవు . వధూవరులు   పెద్దల సమక్షంలో వధువుకి కొత్త బటలు అందించి సంబంధం ప్రారంభిస్తాడు వరుడు. ఆడపిల్ల పెళ్ళి తరువాత కూడా పుట్టింట్లోనే ఉండుంది. భర్త మాత్రం సాయంత్రం పూట వచ్చి పొద్దునే తన ఇంటికి వెళ్ళిపోతాడు.ఆమెకి  పుట్టిన పిల్లలు కూడా తల్లితో పాటు తల్లి ఇంట్లోనే వుంటారు. వాళ్ళకు తల్లి ఇంటి పేరే వర్తిస్తుంది. ఆస్తి ఆడపిల్ల/ఆడపిల్లల  పేరు మీదే ఉండేది; వారి తరపున ఇంటి పెద్దమేనమామ ఇంటి వ్యవహారాలు చూసుకునేవారు.పిల్లలు [పిల్లల తల్లి కూడా ]అప్పుడప్పుడు చుట్టం చూపుకు అన్నట్లు తండ్రి ఇంటికి [భర్త ఇంటికి ] వెళ్ళి వచ్చేవారు. ఇలాంటి పెద్ద పెద్ద కుటుంబాలను, [కొన్నిపెద్ద కుటుంబాల్లో 50 60 మంది కూడా ఉండేవారట!]ఇలాంటి ఒక ఉమ్మడి కుటుంబవ్యవస్థ పాటిచే ఇళ్లను, తరవాడు అని చెప్పేవారు.

నంబూదిరి కులంలో పెద్ద కొడుకు మాత్రమే,వివాహం చేసుకునేవాడు.పెద్ద కొడుకు,తన కులం నుంచే  ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు;సపత్నులు అందరూ ఒకే అంత: పురంలోనే కలసి బ్రతుకుతారు. వారి వివాహ సాంప్రదాయం భ్రహ్మణుల సాంప్రదాయ  వివాహ సంప్రదాయమే. తాళి కట్టు హోమం అన్ని వున్న సాంప్రదాయం . వివాహమైన తరువాత ఆడపిల్ల భర్త ఇంటికి వస్తుంది ; అంత: పురంలో కి ప్రవేశిస్తుంది. ఈ అంత:పుర మహిళల [అంతర్జనాల] దయనీయ బ్రతుకు గురించే వ్రాసారు ,విద్యావంతురాలై,చైతన్యం అందుకున్న లలితాంబికా అంతర్జనం . ఆ రచయిత్రి గురించి తరువాత మాట్లాడుకుందాం.

నంబూదిరి కులంలో,ఇంటికి పెద్ద కొడుకు కాని ఇతరులు, ఉన్నత కులస్తులైన నాయర్, మీనోన్  లేకపోతే ఇతర  అగ్రకులానికి చెందిన యువతితో సంబంధం లో ఉంటారు . ఆ యువతికి అతని వల్ల పుట్టిన పిల్లాడిని /పిల్లని ఆ నంబూదిరి పిల్లాడు గానే /పిల్లగానే గుర్తిస్తుంది సమాజం.ఏ రకమైన వివక్ష ఉండదు. చట్టపరంగా కూడా గుర్తింపబడినది ఈ వ్యవస్థ . కాని తండ్రి ఆస్తి మీద ఆ పిల్లకి / పిల్లాడికి  ఏ హక్కూ ఉండేది కాదు .తల్లితో పాటు బిడ్డ కూడా  తరవాడ్ లోనే ఉండేది .ఆడపిల్లకైతే ,ఆ నంబూదిరిని [లేకపోతే మరొక్కరిని ]  ఏ రోజైనా ఇప్పటినుంచి నీకూ నాకూ సంబంధం లేదు అని చెప్పడానికే కాదు మరొక్కరిని ఆ స్థానంలోకి ఆహ్వానించడానికి  సర్వహక్కులూ స్వాతంత్ర్యం కూడా ఉండేది . సమాజం అది అంగీకరించేది.

ఈ చారిత్రిక నేపద్యం తెలియకపోతే కొన్ని సంస్కరణల గొప్పతనమే కాదు కొన్ని గొప్ప మలయాళ రచనల గొప్పతనం కూడా తెలుసుకోవటం కష్టతరమవుతుంది కనుక ఈ వివరణ ఇవ్వవలసి వచ్చింది .

మలయాళ సమాజంలో అత్యధిక సంస్కరణకి గురైన కులం నంబూదిరి కులం. తరువాత కాలంలో అత్యంత చైతన్యవంత మైన కులం కూడా  ఇదే . ఈ కులాన్ని సంస్కరణల ద్వారా అభ్యుదయ పదానికి నడిపించి ,ముఖ్యంగా మహిళలను చైతన్య వంతులు చేసిన  సంస్కర్త వి. టి .భట్టదిరిపాడ్ [1896-1982] .నంబూదిరి సమాజంలోని మహిళకు సంబంధం అనే వ్యవస్థ వర్తించదు. పురుషులు పునర్వివాహం చేసుకోవచ్చు. కాని శాస్త్ర యుక్తంగా పెళ్ళి చేసుకొని తాళి కట్టిన భర్త పోతే వితంతువుగా దేవుడ్ని స్మరిస్తూ అంత :పురంలోనే  గడపాలి నంబూదిరి యువతి .సంబంధం అనే వ్యవస్థ వర్తించే కొన్ని కులాల్లో భర్త పోయినా ,భర్తను వదలేసినా ,భర్త వదలేసినా మరో సంబంధం పెట్టుకోవటం సాంప్రదాయ బద్దమే .

వి .టి .  భట్టదిరిపాడ్ [నంబూదిరి కులానికి చెందినవాడే ]   అనే సంస్కర్త  నంబూదిరి  కులానికి చెందిన వితంతువులకు పునర్ వివాహం జరిపించాడు. నంబూదిరి స్త్రీల విద్యాభ్యాసం గురించి కూడా పోరాడాడు. అంతే కాదు మొదటి సారిగా నంభూదిరి కులానికి చెందని  ఒక అమ్మాయితో నంబూదిరి యువకుడికి వివాహం జరిపించి కులాతీత వివాహానికి నాంది పలికేడు. తన అభ్యుదయ భావాలను ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం నంబూదిరి యువతి కేంద్రంగా సంస్కరణయే లక్ష్యంగా 1929 లో వంటింటినుంచి వేదిక పైకి అనే నాటకం వ్రాసి ప్రదర్శించారు. ఆశ్చర్యం ఏమిటంటే విప్లవాత్మకమైన ఆ నాటకాన్ని 1930 నుంచి నంబూదిరి కుల సంఘమైన యోగక్షేమ సభ వాళ్ళే, ప్రతి నంబూదిరి ఇంటి వద్ద ప్రదర్శించారు . భ్రహ్మణుడు మనిషిగా మారాలనేది ఆ నాటి నినాదం .

మలయాళ సమాజంలోని సంస్కర్తలు ఎక్కువగా విద్య గురించి ఉద్యమించారు. విద్యావకాశాలు కల్పించారు. దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడినప్పటికీ విద్య కేంద్ర బిందువుగా నిలిచింది. కుల మత జాతి వివక్ష లేకుండా,లింగ వివక్ష లేకుండా అందరికీ విద్య అందించే ప్రయత్నం జరిగింది. విద్య అందుకొని చైతన్య వంతులైన వారు ఆడ మగా తేడా లేకుండా రచనలు చేశారు . వారు అందుకున్న చైతన్యం వారు సృష్టించిన సాహిత్యంలో వెల్లి విరిసింది. తొలి రోజుల్లో మహిళలను చైతన్య వంతం చేయాలనే ఉద్దేశ్యంతో రచన చేసినవారు పురుషులే ;వారు వెలిగించిన జ్యోతిని,అందుకొని తమ ఆలోచనలతో అనుభవాలతో జాజ్వల్యమానం చేశారు ,రచయిత్రులు.

మహిళా చైతన్యం గురించి మాట్లాడేటప్పుడు రేఖా మాత్రంగా అయినా ప్రస్తావించవలసిసిన మరో సంస్కర్త అయ్యంకాళి [1863 –1914 ].మలయాళ సమాజంలోని మొదటి దళిత నాయకుడు ఇతడు. ఇతని గురించి వ్రాయవలసింది ఎంతో ఉన్నా ,విషయానికి పరిమితంగా ఉండాలి కనుక నాలుగు మాటలు మాత్రం వ్రాస్తాను. పులయ [మాల ]కుటుంబంలో పుట్టిన ఇతను అసలు చదువుకోలేదు. ఆ రోజుల్లో [1904] దళితులకు స్కూల్ ప్రవేశం నిషేధింపబడి ఉండేది. కేవలం దళిత బాల ,బాలికల కోసం ఒక స్కూల్ ప్రారంభించాడు ఇతడు . వాళ్ళను  విద్యావంతులుగా తీర్చి దిద్దటం  తన సంస్కరణలో ,అస్పృశ్యతతో జరిగే పోరాటంలో ముఖ్య ఎజెండా గా భావించాడు .

భారత దేశంలోని కొన్ని ప్రాంతాలతో పోలిస్తే ,ముందుగా ,ఇరవయో శతాబ్దపు ప్రారంభంలోనే,విద్యావికాసాలు ,తద్వారా  సామాజిక చైతన్యం అందుకున్న మలయాళ  సమాజంలోని  మహిళలు చైతన్య మూర్తులుగా ఉండడం సహజం . ఏ సమాజానికి చెందిన  సాహిత్యమైనా,ఆ సమాజం తాలూకు చైతన్యానికి ప్రతీకయే. ఆధునిక  మలయాళ కవిత్వంలో  మహిళా చైతన్యం గురించి చెప్పే ముందు,ప్రజలను చైతన్యవంతం చేయడానికి సంఘ సంస్కర్తలు సాహిత్యాన్ని వినియోగించిన రీతికి ఒక ఉదాహరణ చెప్పాలి .

నారాయణ  గురు చేపెట్టిన సంస్కరణోద్యమం ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసిందని ప్రస్తావించాను కదా. అతని శిష్యుల్లో ఒకరు మహాకవి కుమారన్ అసాన్. 1926 లో దురవస్థ అనే ఒక కావ్యం వ్రాసారు ఈ కవి. మత కలహాల వల్ల కుల వివక్ష వల్ల గొడవలు జరుగుతున్నప్పుడు అగ్రవర్ణానికి చెందిన వాళ్ళ ఇళ్ళు తగలబెట్టేటప్పుడు,అగ్రకులానికి చెందిన ఒక యువతి [నంబూదిరి యువతి ] తప్పించుకొని ఒక మాల గుడెసెలో దాంకోవటం ,ఆ గుడిసెలోని యువకుడు ఆమెకి ఆశ్రయం కల్పించటం ,ఆ తరువాత గొడవ సద్దుమణిగిన తరువాత  ఆమె,తనకు రక్షణ  కల్పించిన  ఆ  మాల యువకుడ్ని వివాహం చేసుకోవటం ఈ కావ్యంలోని విషయం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే .ఇరవయో శతాబ్దపు తొలి రోజుల్లోనే ,అట్టడుగు వర్గానికి చెందిన కొందరు మహిళలు కూడా విద్యావంతులైనారనే సంగతి గమనించవలసిన విషయం

ప్రజలను చైతన్యవంతులు చేసే ఇలాంటి నేపద్యంలో ఎదిగి విద్య అందుకున్న మహిళలు తమలోని చైతన్యాన్ని తమ రచనల ద్వారా  వెలువరిచటం  ప్రారంభించారు. కానీ తొలి దశలో కవిత్వంకన్నా కధను ఆశ్రయించారు వాళ్ళు.

స్త్రీవాద సాహిత్యమని ప్రత్యేకంగా ప్రస్తావించబడని ఆ రోజుల్లోనే ,సమాజంలో స్త్రీ ఎదుర్కొనే వివక్ష గురించీ , పీడన గురించీ  వ్రాసి దీపదార్లుగా నిలిచిన వాళ్ళు   ఇద్దరు. వాళ్ళు  కె .సరస్వతి అమ్మ ,మరియు లలితాంబిక అంతర్జనం.మలయాళ కవిత్వంలో మహిళా చైతన్యం గురించి ప్రస్తావించే ముందు ఈ ఇద్దరు గురించి కొంత ప్రస్తావించటం తప్పని సరి .

కె. సరస్వతి అమ్మ : 1919—1975.

పురుష ద్వేషి అని ఆ రోజుల్లో ముద్ర వేయబడిన సరస్వతి అమ్మ 12 కధా సంపుటాలు ,ఒక నవల ,ఒక నాటకం వ్రాసారు. 1958 లో పురుషులు లేని లోకం అనే ఒక వ్యాస సంపుటి కూడా  ప్రచురించారు.కొన్ని అమెరికన్ కధా సంకలనాల్లో ఈమె కధలు చోటు చేసుకున్నాయి.  పురుషాధిక్యాన్నీ  అనభిలషణీయమైన సామాజిక వాస్తవికతలనూ వ్యంగ హాస్య మిళితమైన భాషలో చిత్రీకరించారు ఆమె .మహిళ తన భర్తను ప్రేమించేది ఒక వ్యక్తిగా కాదు ;ఒక ఆదర్శంగా.తన భర్త పట్ల వున్న అభినివేశము [నిబద్దత ] అతని పట్ల వున్న ప్రేమ వల్ల కాదు తన ప్రాముఖ్యాన్ని పెంచుకోవటం కోసమే  అని వ్రాసారు ,ఈమె .మహిళలు పురుషుల మీద ఆధారపడడం తగ్గిస్తేనే స్త్రీ విముక్తి సాధ్యమనేది ఆమె అభిప్రాయం .  తొందర పడి కాకపోయినా ,కృష్ణ శాస్త్రి గారి మాటలోచెప్తే , ముందే కుసిన కోకిల ఆమె.ఏ రచన నైనా మూల్యాంగనం చేసినప్పుడు రచన చేసిన కాలాన్ని సామాజిక స్థితి గతులను కూడా  గుర్తుంచుకోవాలి. అలా మూల్యాంగానం చేసినప్పుడు అలనాటి ఆమె రచనలను  విప్లవాత్మక రచనలుగానే   అభివర్ణించాలి .ఆమె వ్రాసిన ,ఆడ బుద్ది అనే కధలో విలాసిని అనే పాత్ర అడిగిన ప్రశ్న చూడండి .

“నాకు అసలు అర్ధం కావటం లేదు.శాశ్వతమూ,పవిత్రమూ ఐన ప్రేమకి నశ్వరమైన, భౌతికమైన, వివాహం తాలూకు అవసరమేమిటీ ?”

ఈమె వ్రాసిన ఒక కధా సంపుటి తాలూకు అంగ్లానువాదం లభ్యం . సాహిత్య అకాడెమీ వారు ప్రచురించిన ఒక అనువాద  కధా సంకలనంలో [తెలుగు ]రెండు కధలు చదవచ్చు

లలితాంబికా అంతర్జనం :[1918—1987]

కవిత్వంతో రచనా రంగంలో అడుగు పెట్టిన ఈమె ,కవిత్వం ద్వారా తన భావాలను పూర్తిగా ఆవిష్కరించలేనని తెలుసుకొని కధారచన ప్రారంభించేరు . అగ్రకులానికి చెందిన నంబూదిరి కుటుంబంలో పుట్టిన అంతర్జనం,అలనాటి  నంబూదిరి సమూహంలో తిష్ట వేసి వున్న దురాచారాలగురించి,అలనాటి సామాజిక కట్టుబాట్టులోబ్రతికే  నంబూదిరి మహిళల ఇబ్బందుల గురించీ వాళ్ళ  జీవిత వ్యధ గురించీ వ్రాసారు . బాధాతప్తులైన మానవత్మల పట్లవున్న  సానుభూతియే నన్ను రచయిత్రి చేసిందని ప్రస్తావించి వున్నారు ఈ రచయిత్రి .

రచయిత్రిగా చేసిన తొలి రచన ముసుగు లో[మూడుపటత్తిల్ ]  అనే కధలో పాతిక సంవత్సరాలు నిండక ముందే చనిపోయిన పాప్పి అనే యువతి కధ చెప్పేరు లలితాంబికా అంతర్జనం. తప్పని పరిస్థితు ల్లో తన ప్రియుడ్ని కాదని ఒక అరవై సంవత్సరాలు నిండిన నంబూదిరికి నాలుగో భార్యగా వెళ్ళి  ,సపత్నుల తిట్లూ చీవాట్లూ భరిస్తూ అంత: పురంలోని వంట గదిలో పొగతోనూ చీకటితోనూ పగలంతా గడిపే ఒక చిన్న అమ్మాయి కధ ముసుగులో  అనే కధ  .

ఈ రచయిత్రి వ్రాసిన కధల్లో ప్రతికార దుర్గ చెప్పుకోదగ్గది ;సుప్రసిద్దం కూడా . చెడిపోయిన ఆవిడ అని సమాజం ముద్రవేసిన ఒక మహిళ  కోణంలో నుంచి ఆలోచిస్తూ ఆమె మానసిక విశ్లేషణ చేసిన గొప్ప కధ ఇది. తన భర్తను,అన్ని రకాలుగాను  సంతృప్తి పరచడానికి ప్రయత్నించిన ఆమె –నువ్వు ఒక వెలయాలుగా పో అనే భర్త సవాల్ స్వీకరించి   అతని పై కక్ష తీర్చుకుంటుంది. ఆమె అంటుంది –QUOTE—జనాలను చూడనివ్వండి ;వాళ్ళను కూడా తెలుసుకొనివ్వండి –పురుషుడికి మాత్రమే కాదు స్త్రీయలకు కూడా చెడిపోవటం ఎరుకే అని”

1938 లో వ్రాసిన కధ ఇది . అప్పుడు రచయిత్రి వయసు ముప్పది సంవత్సరాల కన్నా తక్కువే అనే విషయం గుర్తిస్తే ఆమె ఎంత సాహస వంతురాలని తెలిస్తుంది.

ఈ కధ తాలూకు మరో ముఖం కనబడుతోంది  నేరాంగీకారం [కుట్టసమ్మతం ]అనే కధలో. గుడి లో శ్రీకృష్ణుని లీలావిలాసాల గురించిన ప్రవచనం  విన్న ఒక పదినాలుగు సంవత్సరాల బాల వింతంతువుని కోరికలకు రెక్కలు వచ్చాయి .  భాగవత కధ చెప్పే అందగాడైన యువకుడ్ని శ్రీకృష్ణుని పూర్ణావతారంగా భావించింది ఆ పిల్ల . ప్రేమమే భక్తి ప్రేమమే మోక్షం అనుకోని ఒక సారి అతని చేతిలో ఇమిడి పోతుంది.  ఆ దేవుడ్ని ఎవరూ వెతకవద్దు. నేను తప్పు చేశాను ;నన్ను శిక్షించండి ;అని అంటుంది ఆ వితంతువు

లలితాంబికా అంతర్జనం రచించిన అగ్ని సాక్షి అనే నవల తాలూకు తెలుగు అనువాదం లభ్యమే. [ సాహిత్య అకాడెమీ ప్రచురణ ]

ఈ రచనల నేపద్యంలో నుంచి ,ఇప్పుడు కవిత్వానికి వస్తాం.

బాలామణి అమ్మ –1909 –2004 .

మలయాళ భాషలో బహుశా తొలి కవయత్రి అని చెప్పదగ్గ బాలామణి అమ్మ అతి చక్కగా అందమైన భాషలోసహజమైన  స్రైణ భావాలను ఆవిష్కరించినా ,ఆమెను ఒక స్త్రీవాద కావయత్రిగా ముద్ర వేయలేము.  మలయాళ విమర్శకులు ఈమెను మాతృత్వపు కవయత్రిగా  అభివర్ణిస్తారు. సాంప్రదాయ విద్యాభ్యాసమూ కావ్య శిక్షణ అందుకున్న ఆమె,కవిత్వంలో పాశ్చాత్య కవిత్వ ప్రభావం అసలు  కనబడదు.

స్త్రీ జీవితంలోని వివిధ ఘట్టాలను ఆదర్శ జీవిత ఘట్టాలుగా అనుకున్న  ఆమె స్త్రీ అనుభవించే పీడనల గురించి కానీ స్త్రీ స్వాతంత్యం గురించి కాని పెద్దగా స్పందించలేదు కనుక ఆధునిక అర్ధంలో ఒక స్త్రీ వాద రచయిత్రి కాదు బాలామణి అమ్మ. పురాణ కధాపాత్రలు ద్వారా తన దార్శనికత ఆవిష్కరించిన కవయిత్రి ఈమె .మానవ సహజమైన హింసాసక్తి ,ఎన్ని సార్లు పీకి పారేసినా, మళ్ళీ మళ్ళీ వేరు తన్ని మానవ సాంస్కృతిక చరిత్రలో రక్త ప్రవాహాలు సృష్టిస్తూనే ఉంది అనే వాస్తవాన్ని పరశురామ కధ అనే కావ్యం ద్వారా ద్వన్యాత్మకంగా చిత్రీకరించారు ఈ  కవయిత్రి .న్యాయాన్నీ ,కారుణ్యాన్ని సమన్వయ పరచటం మానవ జాతికి కుదురుతుందా అనే ప్రశ్నను లేవతీస్తున్నారు ఈమె  విభీషణుడు అనే కధా కావ్యంలో .1995 లో సరస్వతి సమ్మాన్ అందుకున్న ఈమె కమలా దాస్ ను కన్న మాతృమూర్తి .

విద్య వల్ల చైతన్యవంతులై కవిత్వం వ్రాసిన తొలి తరం మహిళల్లో కటత్తనాటు మాధవి అమ్మ ,సిస్టర్ మేరీ బానేజ్ఞ మొదలగు వారు కూడా  ఉన్నప్పటికీ[వారు కూడా స్త్రీ వాద రచయిత్రులు కావు ] ,బాలామణి అమ్మ విస్తృతంగా కవిత్వం వ్రాసి సహృదయుల మెప్పు పొందిన తొలి తరం కవయిత్రి కనుక ఆమె కవిత్వం గురించి కొంత ప్రస్తావించటం జరిగింది

కమలా దాస్ [ మాధవి కుట్టి ]—1934-2009

ఆధునిక మలయాళ సాహిత్యమనగానే ,అందులోనూ మలయాళ రచయత్రులు అనగానే సహృదయులకు వెంటనే గుర్తుకొచ్చే పేరు కమలా దాస్. మలయాళంలో ఈమె గొప్ప కధా రచయిత్రిమాత్రమే ;మలయాళ భాషలో ఈమె కవిత్వం వ్రాయలేదని అంటే కొందరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. నిజమే ;మలయాళ భాషలో గొప్ప కధలు వ్రాసిన ఈమె ,మలయాళీయే ఐనా ఆంగ్ల భాషలో గొప్ప కవిత్వం అందులోనూ స్త్రీవాద కవిత్వం వ్రాసి MOTHER OF MODERN INDIAN ENGLISH POETRY అనే కీర్తి సంపాదించారు.  అయినా గుండెలో కవిత్వం ఉన్నవారే  కధలు వ్రాస్తారనే  మాట ఉంది కదా .

1935 లో పుట్టిన ఈమె కవయత్రి నాలపాటు బాలామణి అమ్మ కుమార్తె , పేరు, నాలపాటు కమల. వి . ఎం .దాస్ అనే అతనితో వివాహం జరిగిన తరువాత కమలా దాస్ అయ్యారు ;తరువాత కాలం లో ఇస్లాం మతం పుచ్చుకున్నాక కమలా సురయ్య గా మారారు. మాధవి కుట్టి అనే పేరుతో మలయాళంలో గొప్ప  కధలు వ్రాసారు, మలయాళ భాషలో కధలు వ్రాసినా, ఆంగ్లం లో కవిత్వం వ్రాసినా విషయం స్త్రీయే ;స్త్రీల సమస్యలే ; స్త్రీత్వం గురించీ  ,స్త్రీల మనోభావాల గురించీ  ,వారి లైంగికత గురించీ  లైంగిక కోరికల గురించీ  నిర్భయంగా తన రచనల్లో ప్రస్తావించారు ఆమె .తన అనుభవాల,అంటే  ప్రేమ ,ప్రేమ నైరాశ్యం ,ప్రేమ వల్ల మోసపోవటం ,అందువల్ల కలిగిన మానసిక ఆవేదన మొదలైనవాటి  ఆవిష్కరణ  ఆమె కవిత్వం .1973 లో వెలువడిన   THE OLD PLAYHOUSE AND OTHERPOEMS అనే కవితా సంపుటిలో 31 కవితలు ఉన్నాయి . ఆమె వ్రాసిన ఈ పంక్తులు చూడండి :

నేను పాపిష్టురాలిని ;పవిత్రురాలు కూడా

ప్రియురాలిని ,వంచితరాలు కూడా

ఐనా తనను మనిషిలా చూడడటం లేదేమిటీ అనేది ఆమె ప్రశ్న

పురుషాధిక్యాన్ని వ్యతిరేకించింది కానీ  పురుష విద్వేషి కాదు,కమలా దాస్.  ఆమె ఒకానొక ముఖాముఖిలో ఇలా అన్నారు

“నేనొకటి చెప్తాను. పాశ్చాత్యలు స్త్రీవాదాన్ని వీక్షిస్తున్నట్లు నేను వీక్షించటం లేదు . పాశ్చాత్యుల దృష్టిలో స్త్రీవాదం అంటే పురుష విద్వేషమే .నేను పురుషుని  ఎప్పుడూ అసహ్యించుకోలేను;నేను నా భర్తను ప్రేమించాను ;ఇప్పటికీ నా అబ్బాయిలను  ప్రేమిస్తున్నాను .పురుష సానిధ్యం ద్వారా ఎంతో ఆనందం పొంది వున్నాను ,నేను . అందువల్ల నేను ఎన్నెడూ వాళ్ళను అసహ్యించుకోలేను. ఇతర దేశాల్లో నాకు తారసపడ్డ  స్త్రీ వాదుల్లో అధిక శాతం లెస్బియన్ లే .నేను లెస్బియన్ అని నేను అనుకోవటం లేదు . అవునా కాదా అని తెలుసుకోవటం గురించి ప్రయత్నించాను. ఆడవాళ్ళ పట్ల స్పందించలేక పోయాను . రాజకీయ వ్యవస్థ ఐనా ఆద్యాత్మిక వ్యవస్థ ఐనా నైతిక పునాది లేనివాట్నీని వదలటమే మేలు .”

మాధవి కుట్టి అనే పేరుతో ఎన్నో కధలు వ్రాసారు ఈమె . కమలా దాస్ వ్రాసిన కొన్ని కధల తెలుగు అనువాదం లభ్యమే

మలయాళీయే కానీ ,కమలా దాస్ కవిత్వం కానీ కధలు కానీ మలయాళ సమాజానికీ ,జీవితానికీ పరిమిత మైనవి  కావు.  భారతదేశంలోని  వివిధ నగరాల్లో బ్రతికిన  ఈమె కధలూ కధాపాత్రలూ ఆలోచనలు కూడా విశ్వవ్యాపకం  .దారి తప్పిన దాంపత్య జీవితాల నిట్టూర్పులు ,పరస్పరం మోసం చేసుకుంటూ బ్రతికే దంపతులు,ప్రేమ రాహిత్యం వల్ల ప్రియుడ్ని వెతికే భార్యలు తద్ఫలితంగా ఏర్పడిన నేర స్ఫృహ వగైరాలు చాలా కధల్లో కనబడుతాయి .కమాసక్తి లేని స్నేహం నిజమేనా ?స్త్రీ పురుషుల మధ్య వున్న స్నేహాన్ని వాళ్ళ మధ్య వున్న ప్రేమనీ  భిన్న తలాల్లోనుంచి  వీక్షించే ప్రయత్నం చేస్తుంది ఈ రచయిత్రి.

సుగద కుమారి . 1934 –2020

మలయాళ కవిత్వంలోని మరో మహిళా చైతన్య ధార ,సుగద కుమారి. స్త్రీ వాద ఉద్యమాల్లోనూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలోనూ చురుక్కుగా పాల్గొన్న సామాజిక కార్యకర్త  ఈ కవయత్రి. సైలంటు వ్యాలి పోరాటం లో ముందు వరసలో నిలబడి  పోరాడిన ఈమె ,కేరళా వనితా కమీషన్ అధ్యక్షురాలిగా కూడా పని చేసేరు . 12 కావ్య సంపుటాలు వెలువరిచారు. వాట్లో రాత్రి రాలిన వాన అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకున్నారు  కాక ,కేరళ సాహిత్య అకాడెమీ పురస్కారం వయలార్ పురస్కారం ఇలా ఎన్నో పురస్కారాలు కూడా అందుకున్నారు .2012 లో ప్రతిష్టాత్మకమైన సరస్వతి సమ్మాన్  కూడా  వరించింది ఈమెను.

కవిత్వంలో కనబడే గానాత్మకత వల్ల ఈమె కవిత్వం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. సుగద కుమారి కవిత్వంలో కనబడే ముఖ్య భావాలు ప్రేమ ,విషాదం.అసంతృప్తమైన అనురాగం తాలూకు అంతర్ దాహం మొదలైనవి. కృష్ణును

ప్రతీకలుగా తీసుకొని ఈమె రచించిన కవితల్లో ఎక్కువగా ఈ భావాలు గోచరిస్తాయి. పౌరాణిక పాత్రల ద్వారా తన భావాన్ని వ్యక్తపరిస్తున్నారు సుగదకుమారి .

జాతీయ ,అంతర్ జాతీయ అనుభవాలను తనలో ఇమిడించుకుని  ,తన మనసులో ఆత్మ నిష్టమైన వెచ్చదనంతో పొదిగి ,వాటిని అందంగా ఆవిష్కరించ గలిగిన కవయత్రి ఈమె. ఆదర్శాలు వలక పోస్తూ ఆత్మవంచన చేసే నేటి మానవుని నిరాశ్రయత్వాన్ని  శక్తివంతంగా ఆవిష్కరించే బయాఫ్ర అనే కవిత దీనికి ఒక ఉదాహరణ. బయాఫ్ర అనే పల్లెలో జరిగిన ఆకలి మరణాలకు స్పందించి  ఈమె వ్రాసిన కవిత ఇది  .ఈ కవితలో , విల్లు చేపెట్టడానికి సందేహించే అర్జునుని ప్రతీకగా సమర్థవంతంగా వినియోగించి చక్కగా భావావిష్కరణ చేశారు కవయత్రి.   ఆ కావ్యం ఇలా ముగిస్తుంది .

హంతకుడు ఎవడు ?

హతమైన వాడు ఎవడు?

పదునైన బాణం వేయబోతు

నీరసించి నిలబడుతున్నా

నపుంసకుడిగా మారిన అర్జునుడలా

పీడనకి గురవుతున్న స్త్రీత్వం  ,ఆలంబనా రహితమవుతున్న శైశవం,నిరంతరం దోపిడీకి గురవుతున్న ప్రకృతి మొదలైనవి ఆమెను అస్వస్థతకి గురి చేసాయి ;ఆమెను ఆత్మ విమర్శకి గురి చేశాయి  . ఆమె కవితల్లో ఎక్కువగా కనబడుతున్న ఒక ప్రతీక సముద్రం. సదా అస్వస్థంగా కదిలే కడలి,ఆమె కవి హృదయానికి ప్రతి బింబం!

మలయాళ కవిత్వంలో  ఒక కొత్త భావుకత్వపు అరుణోదయమైనది 1980 దశాబ్దపు ప్రారంభంలోనే అని నమ్మే కొందరు మలయాళ సాహిత్య విమర్శకులు ఉన్నారు . ఈ నూతన కావ్యాభిరుచిని ఆధునికానంతర కవిత్వం  అని సంబోధించారు ,మలయాళ కవి ,విమర్శకుడు శ్రీ అయ్యప్ప పనికర్ .నిజం చెప్పాలంటే మలయాళ కవిత్వంలో మహిళా చైతన్యం వెల్లివిరిసినది అప్పటినుంచే . నేడు మనం అనుకుంటున్న స్త్రీవాద సాహిత్యపు వెల్లువ కూడా అప్పుడే మొదలైంది.

ఈ రచయిత్రులు ముఖ్యంగా కేంద్రీకరించిన విషయాలు ఇవి .

స్త్రీ తన  జీవితాన్ని వ్యత్యస్తమైన రీతిలో అనుభవిస్తుంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న పురుషాదిక్యం స్త్రీ తాలూకు సహజ కోరికలను అణిచి వేసి ఆమెను పీడనానికి గురి చేస్తోంది. స్త్రీల ప్రత్యేకమైన అనుభవాలను అర్ధం చేసుకొని  ఆవిష్కరించడం స్త్రీలకే సాధ్యం. పురుషాధిక్యం సృష్టించిన భాషలో స్త్రీల అనుభవాలను ఇమడ్చలేము. స్త్రీ తన శరీరంతో వ్రాస్తుంది. అంతే కాదు ఆమె తన లైంగికతను కొనియాడాలి .

ఈ దృక్పధంతో ,రచన చేసే రచయిత్రులు  స్త్రీ లకు సంబంధించిన సత్యాలను అసలు జంగకుండా ఆవిష్కరించడమే కాక స్వానుభవాలను  వాస్తవికంగా ఆవిష్కరిస్తున్నారు,కూడా   .స్త్రీ స్వాతంత్ర్యం గురించిన తీవ్రమైన తపన కూడా కనబడుతుంది వీరి రచనల్లో . కొందరు కవులు కొన్ని కొన్ని సందర్భాల్లో పురుషుని ప్రవర్తనా రీతులనూ లైంగిక అలవాట్లనూ ఎగతాళి చేస్తున్నారు కూడా .

విజయలక్ష్మి [1960 ]రోస్ మేరీ [1960 ]సావిత్రీ రాజీవన్ [1956 ]వి .ఎం .గిరిజ [1961] మొదలైనవారు  ముఖ్యులైన స్త్రీవాద రచయిత్రులు.

విజయలక్ష్మి రచించిన మృగ శిక్షకుడు అనే కవిత పురుషాధిక్య సమాజంలో స్త్రీ అనుభవించే ఆత్మ సంఘర్షణను ,ఆవిష్కరించే అతి శక్తి వంతమైన కవిత .

వాడలా చూస్తే నా కంటిలో జాలి

నవ్వుతే  నీరసిస్తుంది దేహం

వంగి నమస్కరిస్తున్నాను తెలియకనే

చూడలేక పోతున్నాను,ఆ  అతి తేజస్సును

చుట్టూ చూస్తే నన్ను  లాగేస్తాయి ,ఆ కనులు

ఆ లోగా పీకి పారేయాలి నా కనులను

గోరుమొనలతో

కానీ కుదరటం లేదే ,దానికీ ,భయం ,భయానికి ,

బానిస నేను;  ఓడిపోయాను,తల దించి కూర్చున్నాను

వీపు పై నీ చేర్నాకోల కదలాడనీ

మేలుకొని ఉన్నాను ,సిద్ధంగా

వలయంలోకి  దూకడానికి [మృగ శిక్షకుడు అనే కవిత నుంచి—- అనువాదం –ఎల్ .ఆర్ .స్వామి  ]

స్త్రీ వ్యక్తిత్వాన్ని ,సమాజంలో గట్టిగా ప్రతిష్టి చేయడానికి చేసిన ప్రయత్నం  తచ్చన్ టే మకళ్ –వడ్రంది కూతురు

అనే కవిత .

స్త్రీ వ్యక్తిత్వాన్ని అలాగే అంగీకరించడానికి సిద్ధంగా లేని సమాజానికి తన హృదయాన్ని ఆవిష్కరిస్తోంది రోస్ మేరీ . స్త్రీ తాలూకు ఒంటరితనపు పవిత్ర వాతావరణంలో జీవితాన్ని సఫలం చేసుకోవాలనే ఆతృత,కోరిక ఈమె కవితలో కనబడుతుంది .చాలా చిన్న  చిన్న కోరికలు ,[వలరే చెర్రియ చెర్రియ మొహంగల్ ]నేను జాబాల [నేను జాబాల. ] మొదలగు కవితల్లో ఈ ధోరణి  గోచరిస్తోంది

సాయంత్రపు నీరెండలో

బంగరు రంగుల సాయం సంధ్యలో

నగరం నడి ఒడ్డున

ఖడ్గం తీసి నిలబడిన

వేలు తంపి విగ్రహం క్రింద, రాతి మెట్ల పైన  [వేలు తంపి మహారాజావారి ఆస్థానంలో దివాన్ ]

కుడి చేయ ఆంచి

అనంతశయనం చేసి

ఎదుట ప్రవహించే

నగర సౌందర్యాలను తిలకిస్తూ

గట్టిగా విజిల్ వెయాలని ఉంది

అలా బద్దకంగా పడుకున్నప్పుడు

వ్రేల మద్యనుంచి ఎగిరే ధూమం

అనంత వలయాలు చేసి

నరాలకు ఉన్మాదమిచ్చి

చివరకి ఈ ప్రపంచపు ముఖం మీద

గట్టిగా  ఊదాలనీ ఉంది           [చాలా చాలా చిన్న కోరికలు –రోస్ మేరీ–  అనువాదం –ఎల్ .ఆర్ .స్వామి  ]

నిత్య జీవితానికి సంబంధించిన అత్యంత సహజమైన స్వప్నాలు ,ఆత్మ  సంభాషణలు మొదలైనవి  సావిత్రీ రాజీవన్ రచించిన కవిత్వం తాలూకు ప్రత్యేకతలు. ఆమె వ్రాసిన ఈ ఖండిక  చూడండి:

ఇండియాకి భూపటం లా

ఒక శరీరమున్నది నాకు కూడా

ఆ శరీరంలో ఒక కడలి ఉందని

ఎగిసిపడే అలలు ఉంటాయని

ఆ కడలిలో మనిషి చేసిన

నావలు సంచరిస్తాయని

ఇంద్రదనుస్సులు ,రంగులు ,ఆకాశాలు

ప్రతిఫలిస్తాయని

శత్రుత్వమూ ప్రేమ మెరిస్తాయని

నావికుడు నాకు నేర్పాడు   [దేహాంతరము –సావిత్రీ రాజీవన్ –అనువాదం –ఎల్ .ఆర్ .స్వామి   ]

స్త్రీ శరీరంతో వ్రాస్తుందనే మాటను రుజువు చేస్తుంది వి .ఎం .గిరిజ కవిత్వం .ఆమె కవిత్వంలో కనబడే ప్రేమ శారీరిక సంబంధం లేని ఒక దివ్యానుభూతి కాదు . అది శరీరంలోవ్యాపిస్తుంది, ఇందనం లో,నిప్పులా.శృంగారానుభవం కోసం ఆతృత పడే  ఒక  హృదయం ఈమె కవితల్లో ప్రస్ఫుటంగా  ప్రతిఫలిస్తుంది. సముద్రంలో జ్ఞానస్నానం ,నిద్రారాహిత్యం , మాంస బద్దమేనా ప్రేమ [మాంస బద్దమైన రాగం ]వక్షోజాలు [ములకల్ ] మొదలైనవి, ఈమె  ముఖ్య రచనలు

ఈమె కవిత్వానికి ఒక ఉదాహరణ :

మెరుపుల రెక్కలు గల చుక్కలా

దాటుతానా ఆకాశ సముద్రం,వాడితో  ?

అక్కడ కూడా ఉంటాయా

జాలితో దుస్తులు తీసే చుంబనాలు ?

తెలుసుకునటుకు వాటేసుకునే స్నేహం ?

ఎవరికెరుక దూరమవుతాడా వాడు

మాంత్రిక పళ్ళెం లా

మాంస బద్దమేనా ప్రేమ ?

[ మాంస బద్దమేనా ప్రేమ  –వి .ఎం .గిరిజ—అనువాదం –ఎల్ .ఆర్ .స్వామి  ]

అనితా తంపి , ఈ తరానికి చెందిన మరో  కవయత్రి .స్త్రీలు మాత్రం అనుభవించే /అనుభవించగల ప్రత్యేక  వైయక్తిక అనుభూతులను ఆవిష్కరించే కవితలు రచించిన కవయిత్రి ఈమె .

మలయాళ భాషలో స్త్రీవాద సాహిత్యం భావనిర్భరంగా భావుకత తో నిండి ఉండుంది. నినాదాలు తక్కువ. చెప్పదలచుకున్న విషయం మామూలే అయినా ప్రతీకలతో,అప్పుడప్పుడు పురాణ పాత్రల సహాయంతో భావాన్ని బలంగా ఆవిష్కరిస్తారు కవయిత్రులు

ఇరవైఒకటో శతాబ్దపు  మలయాళ సాహిత్యంలో చెప్పుకోదగ్గ మరో కవయత్రి శ్రీలతా వర్మ. అభ్యుదయ సాహిత్యపు వెలుగులో రచనలు చేసిన ఈమె స్త్రీల మనోభావాలను కూడా చక్కగా ఆవిష్కరించే కవిత్వం వ్రాసారు . ఈ కవిత చూడండి ,ఒక ఉదాహరణ– .

ఎవరు కన్నీరు రాల్చగలరు

రావణుని అధికార పరిధిలో ఉన్నప్పుడు

ఏమిటి తేడా ,రాముడైనా రావణుడైనా

రా తో మొదలై డుతో ముగిస్తుంది

ఏది మేలు ?

ఇప్పుడు ,నేను చూస్తున్నది

పిడికిలి బిగించి  ,ముఖం దించక

ఇంచుమించు చివరి మహాసంగ్రామ నాయకుడ్ని

రాముడు కాదు ,అతను

రావణుడూ కాదు, నేనే    [శ్రీలత వర్మ— అనువాదం –ఎల్ .ఆర్ .స్వామి  ]

21 వ శతాబ్దంలో రచనారంగంలో అడుగు పెట్టి విస్తృతంగా రచన చేసే యువ రచయిత్రి ఇందు మీనోన్. ఆమె తొలి కధ , ద లెస్బియన్ కౌ[తెలుగులో లభ్యం –మనసు విప్పి –అనువాద కధా సంకలనం –విశాలాంధ్ర ప్రచురణ ] మలయాళ భాషలో సంచలనం సృష్టించింది. కేంద్ర సాహిత్య అకాడెమీ వారి  యువ పురస్కారం అందుకున్న ఈ యువ రచయిత్రి,కవయత్రి కన్నా కధకురాలుగా సుప్రసిద్ధురాలు;కవితా సంపుటాలు కూడా వెలువరిచారు.

ఇందు మీనోన్ వ్రాసిన అపరిచితులు అనే కవిత ఎలా ప్రారంభించారో చూడండి :

ఇంకా మనం అపరిచితులమే ,

కలసివున్నా సంవత్సరాలుగా

భూతద్దాలు పెట్టుకున్నాం మనం

ఐనా కళ్ళు కనబడలేదు ,అప్పుడు

గుడ్డి ప్రేమ! —————–    [ఇందు మీనోన్ –అనువాదం –ఎల్ .ఆర్ .స్వామి ]

చెప్పవలసిన విషయాలు మొత్తం చెప్పేసేనని నేను అనుకోవటం లేదు. ఇది  కేవలం ఒక విహంగ వీక్షణం మాత్రమే. . అందువల్ల ఈ విషయానికి సంబంధించిన  ఏ అంశమైనా , ఎవరి గురించైనా ప్రస్తావించకపోయివుంటే క్షంతవ్యుడ్ని. ఏది ఏమైనా మలయాళ కవిత్వంలో కనబడే మహిళా చైతన్యం గురించి ,ఈ మాత్రమైనా ,ఒక రేఖా  చిత్రంగా,  తెలుగు సహృదయులకు పరిచయం చేయాలనేదే నా ఉద్దేశ్యం  .

*

ఎల్. ఆర్. స్వామి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు