అనెస్థీషియా…

”మీరు కావాలంటే సర్జరీ చూసుకోవచ్చు” డాక్టర్‌ మనోహర్‌ అన్నాడు. ”రక్తం చూడలేను డాక్టరు గారూ…” వసుధ నీరసంగా నవ్వుతూ అంది. డాక్టర్‌ చిన్నగా నవ్వి ”ఎంత ఒక పదిహేను నిమిషాల్లో అయిపోతుంది” అన్నాడు. ”డాక్టర్‌ కాల్లో రాడ్స్‌ వేసాక నేను మామూలుగా నడవగలుగుతాను కదూ” వసుధ అనుమానంగా అడిగింది.”తప్పకుండా పరిగెడతారు కూడా” అన్నాడు డాక్టర్‌ నవ్వుతూ వసుధకు మెల్లగా అనెస్థీషియా ఇంజెక్షన్‌ ఇస్తూ. వసుధ క్షణాల్లో మత్తులోకి జారిపోయింది.

జరుగండి… జరగండి మగ గొంతు పెద్దగా వినిపిస్తున్నది. మత్తు మెల్లగా విడుతున్నది. స్టీల్‌రాడ్స్‌ వేసిన కుడికాలు చీలమండ దగ్గర్నించి మోకాలి కింది భాగం దాకా బరువుగా అనిపిస్తున్నది. నొప్పి తెలుస్తూ బాధతో మూల్గుతున్నది శాంత. మసగ్గా పోస్ట్‌ ఆపరేటివ్‌ వార్డ్‌ అని కనిపిస్తున్నది. స్ట్రెచర్‌ మీద కాబోలు గబగబా తీస్కెళుతున్నారు. లోపల ఒక మంచం దగ్గర ఆపారు. ”అమ్మా కొంచెం ఓర్చుకోవాలి. మంచం మీద వేస్తున్నాము. ఆపరేషన్‌ సవ్యంగా అయిపోయింది”. ఒక మొగ మొఖం పళ్ళన్నీ కనిపించేలా నోరు తెరిచి ముఖంలోకి ఒంగి చూస్తూ… ”అరెయ్‌ కొద్దిగా కాళ్ళదగ్గర గట్టిగా పట్టుకోండిరా నేను చేతులు పట్టుకుంటా” అని అరుస్తూ… అదేంటి చంకల కింద చేతులు పెడుతూ రొమ్ముల మీద చేతులు వేస్తున్నాడు… వసుధ చేతులు విదిలిస్తున్నది. అసలు ఛాతీమీద చేతులు వేయాల్సిన అవసరమే లేదు. అంత మత్తులోనూ వాడిలోని మాలిన్యపు వెకిలితనం ఆమెకి అర్థం అవుతున్నది. ఒకపక్క కాలి మీద కుట్ల పచ్చిగాయంలా సలుపుతున్నది నొప్పికి ఆగలేక అరుస్తున్నది. ఇంకోపక్క వీడు నర్సుగాడు చేస్తున్న వెకిలి బేష భరించలేకపోతున్నది. ఏడుపొచ్చి కన్నీళ్ళుబికాయి అతని చేయి విసిరికొట్టింది ”అదిగో అట్టా విసిరికొడతావు మరెట్లా లేపాలీ నిన్ను కొద్దిగా ఓర్చుకో” అంటూ వాడు మళ్ళీ అవసరం లేకపోయినా తన మునివేళ్ళతో రొమ్ములు తాకి చంకలకిందికి చేతులు పోనిచ్చి ఆ వసుధ మొఖం మీదకు వచ్చేలా తన శ్వాస వదులుతూ ‘జై హనుమాన్‌’ అంటూ వసుధను మంచం మీదకు జారవిడిచాడు. మళ్ళీ ఆమెకు దుప్పటి ఛాతీ దాక కప్పబోతుంటే వసుధ అతని చెయ్యి పట్టి ఆపేసింది. ”ఒద్దు… పో” అని అర్చింది. కానీ ఈ సగం మత్తులో ఉన్న ఆమె గొంతు బలహీనంగా మాత్రమే వినిపించింది. ”ఏంటీ నీళ్ళా కొంచెమాగు ఇంగో నాలుగు గంటలైయ్యాకే నీళ్ళు… ఓర్చుకోవాలి మరి” అంటూ దుప్పటితో పాటు తన వేలి చివర్లతో ఛాతిని తాకీ వెళ్ళిపోయాడు క్షణాల్లో…

వసుధ నొప్పికే అంతలా అరుస్తోంది అనుకుంది దగ్గరికంటా వచ్చిన నర్సు… ఉండమ్మా ఇంజెక్షన్‌ ఇస్తాను అంటూ నొప్పి తగ్గే ఇంజక్షన్‌ ఇచ్చింది.

ఈ నాలుగ్గంటల్లో వసుధ భర్త అనంత్‌ రెండుసార్లు లోపలికి వచ్చి వెళ్ళాడు. అతనికెలా చెప్పటం అని తటపటాయించింది. ”ఇక్కడేం బాగోలేదండి ఇక్కడ్నించి వెడదాం” అంది. ”వెళదాంలే నీ బీపీ, పల్సు అన్నీ సరిగా ఉండాలిగా తర్వాతే మన రూంకి పంపిస్తారు. కొద్దిగా శాంతంగా ఉండు” అన్నాడు భార్య కళ్ళ నీళ్ళు తుడుస్తూ.

– – –

స్పృహ వచ్చాక నాలుగ్గంటలలో అక్కడ తిరగాడుతున్న ప్రతీ మేల్‌ నర్సుని పట్టి పట్టి చూసింది. ఎట్టా గుర్తుపట్టడం? తను సగం మైకంలో ఉంది ఆఁ గొంతు… గొంతు గుర్తుపడుతుంది. కాళ్ళ దగ్గరున్న నర్సుల మీద అరుస్తూనే ఉన్నాడు. ఆఁ ఎవరితోనో ”ఈ సింహాద్రితో పెట్టుకున్నాడు వాడు… వాడి పని అయిపోయింది. ముక్కలుగా నరికి వైజాగు జైల్లో కూచుంటాను” అన్నాడు. వాడి పేరు సింహాద్రేనా? లేక వేరే పేరా… ఎట్టా… ఎట్టాగైనా వెళ్ళే లోపల వాడి పని పట్టాలి.

ఈ లోపల నాలుగు గంటలూ ముగిసాయి. డాక్టరు వచ్చి చెక్‌ చేసాడు. ఐపీకి పంపమని నర్సుకి చెప్పి వెళ్ళిపోయారు. ”అమ్మ ఇప్పుడు మిమ్మల్ని మీ రూముకి పంపిస్తాం” అంది నర్సు. ”ఆడాళ్ళుంటే బాగుంటుందమ్మా… మగ నర్సు వద్దు” అంది వసుధ ఆందోళనగా. ”ఏం కాదులేమ్మా… నేనుంటాగా” అంది. ”లేదు మా ఆయన్ను పిలువు నర్స్‌” అంటూ వసుధ మొండికేసింది. ఈ లోపల అనంతే లోపలికి వచ్చాడు. మగ్గురు మగ నర్సులు వచ్చారు. ఇద్దరు కాళ్ళ దగ్గర… ఒకరు ఆరడుగుల ఎత్తుండి బలంగా ఉన్నవాడు తల దగ్గరికి వచ్చాడు.వాడి డ్రెస్సు మీద 18  – సన్‌ హైట్‌ హాస్పిటల్‌ అని ఉంది. వాడు తన దగ్గరకు వచ్చి రెండు అరచేతులు తన ఛాతీవైపుకు చాపుతోంటే ”ఒద్దు…” అంటూ అరిచి చేతులు తోసేసింది. ”అదేంటమ్మా నడీడుకొచ్చిన ఆడదానివి తల్లసుంటి దానివి అట్టా అంటే ఎట్టా…” అంటున్నాడు వాడు వెకిలిగా నవ్వుతూ… అవును అదే గొంతు ఇందాక తను మత్తులో ఉండగా విన్నది. వీడి గొంతే వద్దు… వద్దు… వసుధ మళ్ళీ అరిచింది. ”ఒరే సింహాచలమా నువ్విట్టా రారొయ్‌… నేనట్టుకుంటాను అమ్మగారిని…” అంటూ ఇంకొ మగ మనిషి ముందుకు వచ్చాడు.

ఇదంతా చూస్తున్న అనంత్‌ వసుధ దగ్గరకు వచ్చి నేనున్నాగా వాళ్ళని వాళ్ళ పని చేయనివ్వు అని… ”బాబూ అమ్మగారిని స్ట్రెచర్‌ మీద వేయండి’ అన్నాడు.

– – –

సింహాచలం చాలా జాగ్రత్తగా కేవలం చంకల కింద మాత్రమే చేతులు వేసి వసుధను స్ట్రెచర్‌ మీదకు వదిలాడు. వసుధ ఆశ్చర్యపోయింది. ఇదే గొంతు… పేరులో కూడా సింహా అనే ఉంది. వేరే వాడా? వీడు కాదా? వసుధ గందరగోళ పడింది. వసుధకు స్ట్రెచర్‌ మీద ఒదిలిన సింహాచెలం వసుధను ఒక లోతు చూపు చూస్తూ వెళ్ళిపోయాడు. అదేంటి అట్టా చూసాడు తనను? ఆ చూపూ, స్పర్శ, గొంతు తనకు తెలుసే… వీడే వాడా? అనంత్‌ ఉన్నాడని బుద్దిగా ఉండి ఉంటాడా?

స్ట్రెచర్‌ మెల్లగా వసుధ గది వైపుకు కదలసాగింది.

ఆపరేషన్‌ అయ్యి మూడు రోజులు అయ్యింది. మెల్లగా కోలుకొంటుంది వసుధ. ఫిసియోధెరపిస్ట్‌ వచ్చి నడిపించుకు వెళ్తున్నాడు. మనవలూ – మనవరాళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్లు, స్నేహితులు – ఇరుగుపొరుగు వాళ్ళు అంతా వచ్చి వెళుతున్నారు. నవ్వుతూ మాట్లాడుతున్నా, మనసులో ఎక్కడో బాధ అవమానం సుళ్ళు తిరుగుతూనే ఉంది. వాడి స్పర్శ వెకిలి గొంతు… గుర్తుకొచ్చి ఛీదర పుట్టేస్తోంది. తనకు యాభై పై బడ్డ వయసు, వాడికో ముప్ఫై ఉంటాయి. కొడుకు వయస్సు. వాడికి తన తల్లి గుర్తుకు రాలేదా? అసలు ఇలా ఎంత మందితో చేసాడో… మత్తులో ఉంటే ఏఁవీ తెలియదు కదా… కానీ ఊరుకోకూడదు. ఏదో చెయ్యాలి.

ఆ రాత్రి అనంత్‌కి చెప్పింది వసుధ అవమానంతో రగిలిపోతూ ”ఊర్కోవద్దు వాణ్ణి చెంప పగలగొట్టండి” అంది ఆవేశంగా. అనంత్‌ మొత్తం విని ”ఊరుకో వసూ… ఇట్టాంటివి మామూలే. అయితే బలం పెట్టి పైకి లేపేటప్పుడు చేతులు తగిలి ఉండవచ్చుగా అట్టా ఎందుకు అనుకోకూడదు చెప్పు. ప్రతి ఒక్కరు అట్టాగే ఉండరుగా” అన్నాడు లాలనగా. ”లేదు వాడు నన్ను తాకాడు కావాలని నాకు తెల్సు” వసుధ కోపంగా అరిచింది. ఈ లోపల కూతురూ అల్లుడు, కొడుకు, కోడలూ వచ్చారు. ”ఏఁవయ్యిందమ్మా ఎందుకట్లా అరుస్తున్నావు?” కొడుకు పృధ్వి అడిగాడు. అనంత్‌కు ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు. ”సంజనా నువ్వోసారి అమ్మతో మాట్లాడు నువ్వు మాట్లాడమ్మాయ్‌” అని కోడలు ప్రవీణకు కూడా చెప్పి పృథ్వినీ, అల్లుడు ఉదయ్‌ను బయటకు తీస్కెళ్ళాడు. వసుధ కూతురికీ మొత్తం చెప్పింది ఆవేశంతో అవమానంతో కన్నీళ్ళు కార్తుంటే ”నేనేదో మత్తులో ఉన్నానని కొట్టి పారెయ్యబాకండి. నాకు బాగా తెలిసింది” అంది కరాఖండీగా చూపుడు వేలు గాలిలో ఆడిస్తూ ”మీరేమీ చెయ్యకపోతే నేనే ఏదైనా చెప్తాను… ఎంత మందితో ఈ పాడు పని చేస్తున్నాడో…” అంది కోపంగా.

”తప్పకుండా అమ్మ నువ్విప్పుడు ఊర్కో… మళ్ళా వాడు చేయడా? అప్పుడు చూద్దాం” అన్నాడు గదిలోకొచ్చిన పృథ్వి. ”మళ్ళీ చెయ్యకపోతే… వదిలేద్దామా…?” కోపంగా అంది సంజన. ”అవును వాడి పని పట్టాల్సిందే” అంది ప్రవీణ కూడా.

”హాస్పిటల్‌ పరువు పోతుందని… మత్తులో ఎక్కడ చెయ్యేస్తే ఇంకెక్కడ అనుకున్నావో అని మేనేజిమెంట్‌ వాళ్ళే అంటారేమో సంజనా” సంజనా భర్త ఉదయ్‌ అన్నాడు. ”ఏమన్నా ఎలా కప్పెట్టాలని చూసినా ఈ ఇష్యూని బట్టబయలు చేయాల్సిందే” సంజన కోపంగా అరిచినట్లే మాట్లాడింది. వసుధ ప్రేమగా కూతురు చెయ్యి పట్టుకుంది.

– – –

డాక్టర్‌ వచ్చి ”రాడ్స్‌ సెట్‌ అయ్యిందీ లేందీ ఒకసారి కాలు ఎక్స్‌రే తీయాలి” అని ఎక్స్‌రే రాసి నర్సుకి చెప్పి వెళ్ళిపోయాడు. ఈ లోపల ఎకౌంట్‌ సెక్షన్‌కి రమ్మని అనంత్‌కు పిలుపొచ్చింది. ”ఉండు నేను ఫీజ్‌ కట్టి వస్తాను. నేను తీస్కెళతాను నువ్వెక్కడికీ వెళ్ళబాకు” అని హడావుడిగా వెళ్ళిపోయాడు. అరగంటయ్యింది. ఇంకా అనంత్‌ రాలేదు. నర్సు విసుక్కొని ”లేదమ్మా… అక్కడే ఎక్స్‌రే డిపార్ట్‌మెంట్‌ వాళ్ళు విసుక్కుంటారు పదండి” అంది. వాడే వచ్చాడు మళ్ళీ… ”ఇంకెవరూ లేరా?” వసుధ చీదరగా మొఖం పెట్టి అంది. నర్సు ”లేరమ్మా ఈ రోజు చాలా మంది సెలవులో ఉన్నారు. ఈనే ఉన్నాడు మరి” అంది సింహాచలం వైపు సైగ చేస్తూ లేపు… అంటూ మంచం మీద కూర్చున్న వసుధను రెండు వైపులా పట్టుకొని వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టారు. వసుధ వాడి స్పర్శకి బిగుసుకుపోయింది అసహ్యంతో. వీల్‌ ఛైరు వేగంగా ఎక్స్‌రే డిపార్ట్‌మెంట్‌ వైపు కదిలింది. వాణ్ణి చూస్తున్న వసుధలో భయం ఉవ్వెత్తున లేచింది.

వీల్‌ఛైర్‌ నుండి టేబుల్‌మీదకు ఎక్కించేటప్పుడు చంకల కింద చేతులు పోనిచ్చి అనవసరంగా రొమ్ములను వాడు మునివేళ్ళతో కావాలని తాకడం గమనించింది వసుధ… వాడివైపు కోపంగా చూస్తూ అక్కడెందుకు వేస్తున్నావు చేతులూ అని వాడి చేతుల్ని విదిల్చికొట్టింది. ”ఏంటమ్మా అట్టా చూడకండి… చిన్న పిల్లాడ్ని మీ ముందు” అన్నాడు వాడు వెకిలిగా నవ్వుతూ… వసుధకు ఒక రవ్వ తనది భ్రమేమో అన్న అనుమానం పటాపంచలయ్యింది. ”ఏంటమ్మా – ఇంకా పేషంట్లున్నారు మీరు కాళ్ళు తిన్నగా పెట్టండి” అంటూ అరిచాడు టెక్నీషియన్‌. నర్సు అప్పటికే వెళ్ళిపోయింది. ”పక్కలకు తిరగండి” అని మళ్ళీ ఇంకో ఎక్స్‌రే తీసాడు.

”రిపోర్టు రూంకొస్తుంది తీస్కెళ్ళిపో” అంటూ ”వీరస్వామీ – నెక్ట్స్‌” అంటూ అరిచాడు. ఎంతగా ముట్టుకోవచ్చో అంతా ముట్టుకుంటూ వసుధను వీలు ఛైర్లోకి మార్చాడు సింహాచలం. తనను తీక్షణంగా అసహ్యంగా చూస్తూ విదిలించుకుంటున్న వసుధను మహా ఎక్కెసంగా చూస్తూ.

రూంకి వెళ్ళే ముందు ఎవరో సింహాచలాన్ని పిలిస్తే ”వస్తున్నారా ఉండు” అంటూ అటుగా వెళ్తున్న ఒక ఆయమ్మను ”ఓయ్‌ మాఁలచ్మీ ఇట్టారా అమ్మగార్ని రూం నంబరు 402కి తీస్కెళ్ళు… పైసలు ఇస్తార్లేవే డిశ్చార్చీ ఈ రోజే నేనూ అటే వస్తాగానీ నువ్వె తీస్కెళ్ళు ముందు” అని మాఁలచ్మికి వసుధను అప్పచెప్పి ”వస్తా అమ్మగారు సార్‌తో చెప్పి పైసలు ఇప్పియ్యండి ఏదో బీదోళ్ళం జీతాలు తక్కువ” అంటూ పరుగు పరుగున తనను పిలిచిన వైపుకెళ్ళి పోయాడు.

ఆవేశంతో గుండెలు భగభగమంటున్నాయి వసుధకి. ”మా లచ్మీ ఏమనుకోకు… సింహాచలం ఎట్టాంటివాడూ ఆడాల్లతో మంచిగా ఉంటాడా” అని అడిగింది. మాలచ్మి బిత్తరపోయింది వెంటనే వసుధ వెనక్కి వెళ్ళి వీల్‌ ఛెయిర్‌ను ముందుకు నెట్టసాగింది. ”నాకెందుకమ్మగారు ఆడెట్టాంటోడైతేనూ” అంటూ. ”చూడూ సారుకు చెప్పి నీకు ఐదు వందలు ఇప్పిస్తా చెప్పు” అంది. మాలచ్మి మొఖంలో ఒక వెలుగు వెలిగింది. వసుధ మొఖంలోకి చూసింది. వసుధ కనురెప్పలు చెమ్మగిల్లి ఉన్నాయి. ముక్కెరబడి ఉంది. ఈ సచ్చినోడు వసుధ మీద కూడా ఎప్పట్లాగే చెయ్యేసాడా అని అనుమానం వచ్చేసింది. మాఁలచ్మికి బాధేసింది వసుధనట్లాగ చూసి… ”డబ్బులేం ఒద్దులే అమ్మగారూ… ఎంతైనా ఆడోల్లం ఆడాల్లమే గదా…” అంటూ రూంకి తీస్కొచ్చి మెల్లగా ఇంకో నర్సు సాయంతో మంచంపైన పడుకోబెట్టింది. నర్సు వెళ్ళిపోయాక ”అమ్మగారూ ఆ సింహాచలంగాడు చిత్తకార్తె కుక్కండీ… పదేళ్ళని చూడడు అరవై ఏళ్ళు చూడడు. ఒకప్పుడు ఒక పన్నెండేళ్ళ వాళ్ళ ఊరి పిల్లని రేపు జేసేసిన కేసులో ఉండాడీడు” అంటూ రహస్యం చెబుతున్నట్లుగా వసుధ వైపు వంగుతూ కళ్ళింత చేస్తూ మూతి సున్నాలా చూడ్తూ అటూ ఇటూ ఎవరన్నా వింటున్నారేమోనని చూస్తూ ”ఈ చిత్తకార్తె కుక్క మేనేజిమెంటి ఎండీకి దూరపు చుట్టరికం అందుకే నడుస్తాయి వీడి అఘాయిత్యాలు. ఆపరేషన్‌ మత్తులో ఉన్న ఆడాళ్ళ మీద పాపం ఎట్టాంటే అట్టా చేతులు వేస్తాడమ్మా… మత్తులో ఏం జరిగిందో ఏమో అని వాళ్ళు మిన్నుకుంటారు పాపం. ఒకసారేం జరిగిందో తెలుసా అమ్మగోరూ… రెండ్రోజులుగా స్పృహలో లేని పేషంట్‌ను రాత్రిపూట పాడు చెయ్యబోయేడమ్మా ఆ పిల్ల తెలివిలోకొచ్చి గావుకేకలు వేస్తే వీడు దాక్కుండిపోయాడు. వాళ్ళ బంధువులు చాలా గొడవ చేస్తే మీ అమ్మాయి స్పృహలోనే లేదు… మా స్టాపులో అట్టాంటి మగాళ్ళే లేరు కావలిస్తే రుజువు చూపియ్యండి అని వాళ్ళమీదే అరిచాడీ ఎండీ సారు. ఈ సింహాచెలంకి మినిస్టరు కూడా కావల్సినోడే… ఏం చేస్తాం… మత్తులో ఉంటే ఏం చెయ్యరు గదా. అదీ, వీడి ధైర్యం రెండు సార్లు నాతో చెడుగా సెయ్యబోతే చెప్పెత్తాను. నా జోలికి రాడీడు. ఏవఁమ్మాగారూ, మీతో సెడ్డగా గానీ సేసాడేంటీ ఈ చిత్తకార్తెగాడు?” అంది సందేహంగా వసుధ వైపు చూస్తూ… వసుధ అంతా చెప్పింది.

”ఈణ్ణి కసకసా కోసి ఇసాఖ సముద్రంలో ఇసిరెయ్యాలమ్మగారూ” అంది మాలచ్మి కోపంగా.

”నువ్వు సాక్ష్యం చెబుతావా కంప్లైంటు ఇద్దాము” వసుధా ఆశగా అడిగింది.

మాలచ్మి ”వాడట్టాంటోడే అమ్మగోరూ… కానీ ఆ టయానికి నేనక్కడ లేను కదా” అంది చిన్నబోతూ, నేల వైపు చూస్తూ పోనీ ఎందుకి ఇరికించడం ఉద్యోఁగవు ఊడిపోతుందని భయపడ్తున్నది. పాపం అనుకొంది వసుధ. ”సరేలే మా లచ్మి ఇంద ఈ గీదు వందలూ ఉంచు” అంది వసుధ మాలచ్మి చేతిలో ఐదొందలు పెడ్తూ. ”ఒద్దులే అమ్మగారూ… నిజఁవు చెప్పినందుకు పైసలు తీసుకోమంటారా… ఒద్దులే కానీ ఒదలబాకండి అమ్మగారూ వీణ్ణేమన్నా సెయ్యాల మీలాంటివాళ్ళే ఉంటానమ్మగోరూ” అంటూ ఐదొందలూ మంచం మీద పెట్టేసి వెళ్లిపోయింది మా లచ్మి. అనంత్‌కి మళ్ళీ ఎక్స్‌రే డిపార్ట్‌మెంట్‌లో తనతో అసభ్యంగా చేసాడని చెప్పింది వసుధ. వెళ్ళి వాడెక్కడున్న తీసుకురమ్మంది లేదా ఎండీతో మాట్లాడమంది. కానీ అనంత్‌కి సింహాచలం కనపడలేదు. ఎండీ కూడా లేడు. వెనక్కి తిరిగి వచ్చేసాడు. డిశ్చార్చి అయ్యే రోజు సింహాచలం రాలేదు. ”మళ్ళీ చెకప్‌ కొచ్చినప్పుడు తప్పకుండా చెబుదాం సరేనా” అనంత్‌ అన్నాడు. ఈ లోపల డ్యూటీ డాక్టర్‌ వచ్చాడు చిన్న పిల్లాడు. బాధ్యతల్లో లేనట్లుగా చదువు నేర్చుకొనే స్టూడెంటులాగా ఉన్నాడు. ”ఓఁ సారీ యూ హేవ్‌టు కంప్లైంట్‌ ఎండీ. వాణ్ణి వదలకండి నాలుగు రోజుల తర్వాత ఎండీ గారొస్తారు” అన్నారు.

వసుధ అసంతృప్తితో ఇంటికి బయలుదేరింది. ఆ అవమానం, వాడి ఎకసెక్కపు చూపులు, మాఁలచ్మి చెప్పిన విషయాలు తల్చుకునే కొద్దీ, రక్తం సలసలా కాగసాగింది. భర్తమీద కోపంతో అరిచింది. ”ఆ రోజే చెప్పుతో కొట్టాల్సింది నేను మీరు కొడతారని ఎదురు చూడకుండా” అని.

– – –

రెండోసారి చెకప్‌ కోసం హాస్పిటల్‌కి వెళ్ళారు వసుధా – అనంత్‌, కూతురు సంజనాతో కలిసి. డాక్టరు ఆ మూడవ అంతస్థులో ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్నారు అక్కడికి రమ్మంటే లిఫ్ట్‌ ఎక్కి వెళ్ళారు. ఓటీ ముందు కూర్చున్నారు. ఈ లోపల అనంత్‌కి ఏదో ఫోన్‌ వస్తే మాట్లాడుతూ పక్కకెళ్ళాడు. ”వదులు… ఛీ… వదులు హెల్ఫ్‌” అంటూ మాటలు వినిపించాయి. అక్కడెవ్వరూ లేరు. నిశ్శబ్ధంగా ఉంది. సంజనా, వసుధ మెల్లగా వాకర్‌ సహాయంతో శబ్దం వచ్చిన వైపుకి వెళ్ళారు. సగం తలుపు తెరిచి ఉంది. ఆ వార్డు గదిలో మంచంపైన నిస్సహాయంగా పడి ఉన్న ఒక నడివయస్సు స్త్రీ కాలికి తనలాగే ఆపరేషన్‌ అయ్యింది పాపం. ఆమె మీదకు ఆసుపత్రి యూనిఫారం వేస్కున్న ఒకడు ఒంగి ఉన్నాడు. అరె ఎక్స్‌రే డిపార్ట్‌మెంటుకెళ్ళాలి లేవండమ్మ గారూ మీ కొడుకులాంటి వాణ్ణి అంటూ వెకిలిగా ఆమెను లేపే ప్రయత్నం చేస్తూ ఆమె ఛాతీని తాకుతున్నాడు. ఆమె తోస్తున్నది. ”లేడీ నర్సుని తీసుకురా నన్ను ముట్టుకోకు” అంటూ వాడు, వింటేనా… వాడే… సింహాచలమే సంజన వెంఠనే తన సెల్‌ఫోన్‌ తెరిచి ఫోటో తీసేసింది. వసుధ రక్తం మరిగిపోయింది. ఈ లోపల అనంత్‌ వెతుక్కుంటూ వచ్చేసాడు.

”చూడండి వాడేం చేస్తున్నాడో పట్టుకోండి వాణ్ణి మీరు నమ్మారా మాకే మత్తులో ఏదీ తెలీదన్నారు…” అని అర్చింది. సింహాచెలం ఉలిక్కిపడ్డాడు. సంజన ఫోటోలు తీస్తూనే ఉంది. సింహాచలం ”ఎక్స్‌రే డిపార్ట్‌మెంటుకు వెళ్తున్నా అమ్మగారూ లేవటం లేదు” అంటూ గొణిగాడు. ”కాదండీ పిచ్చిగా ఎటంటే అటు చేతులేస్తున్నాడు. ఆడ నర్సుని పిలవమంటే పిలవటం లేదు. అయినా ఈ హాస్పిటల్‌ వాళ్ళను అనాలి. ఇట్టాంటి నీచుల్ని పనిలో పెట్టుకొన్నందుకు తల్లి వయసని కూడా లేదు” అంటూ వలవలా ఏడవసాగింది. మరుక్షణం అనంత్‌ కొట్టిన దెబ్బకి నేల మీద పడ్డాడు సింహాచెలం.

వసుధ ఆగ్రహంతో పేషంట్‌ మంచానికున్న వాకింగ్‌ స్టిక్‌తో వాణ్ణి కొట్టసాగింది కసిగా. సంజన జరిగింది రూం ముందు గుమిగూడిన వారికి వివరించసాగింది. ఓటీ నించి బయటకొచ్చిన సర్జన్‌ ”వీడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మినిస్టర్‌కి దగ్గరని నోరు నొక్కేస్తున్నారు. ఈసారి ఊర్కునేది లేదు. సంజనా గారూ మీరు ఫోటోలు తీసి మంచి పని చేసారు. నాకు ఫార్వర్డ్‌ చేయండి” అంటూ వెళ్ళి సింహాచలం చెంప పగలగొట్టాడు. ”మీతో కాదులెండి. నేను ఎలా వెళ్ళాలో నాకు బాగా తెలుసు అంది ఈసారి ఈ పేషంట్‌కు నేను సాక్ష్యం చెబుతాను. నేను బాధితురాలినే అంది” వసుధ.

హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయ్యాక సంజన తన స్నేహితురాలు లాయర్‌ వాసంతిని ఇంటికి తీస్కొచ్చింది. ”సాక్ష్యం దొరికితే మంచిదే కానిజీ దొరక్కపోయినా బాధిత స్త్రీ కేసు కూడా వేయచ్చు” అంది వాసంతి. పోయినసారిలాగా ఈసారి కూడా వాడు రాకపోతే ఎట్లా అని బెంగపడింది వసుధ. కానీ సింహాచెలం వచ్చాడు. ఇంతలో అక్కడికి మాఁలచ్మీ వచ్చింది. ”అయ్యో అమ్మగారు అర్జెంట్‌ కేసుంటే అటెల్లానండీ” అంటూ మంచం మీద ఏడుస్తున్న పేషంట్‌ను ఓదారుస్తూ, ”ఏటైనాదండీ ఈ అమ్మగోరితో కూడా ఎదవేశాలు ఏశాడేంటండీ…? ఈ నా బట్టని అడ్డంగా నరికెయ్యాల అమ్మగోరూ ఈసారి సాచ్చెం ఇవ్వడానికి నేను కూడా వస్తానండీ చెడుని పాతరెయ్యడానికి ఒక పద్దెం సెప్పినా తప్పులేదండీ” అని వసుధతో అంటూ సింహాచలం వైపు  చూస్తూ ”థూ నీ బతుకు సెడ” అని తపుక్కున ఊసింది.

*

 

 

గీతాంజలి

7 comments

Leave a Reply to గీతాంజలి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎంత బాగా రాసారు. నా చిన్నప్పుడు అంటే ఇంటర్ లో అనుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ను కొట్టాను. అతను సేతస్కోప్ తో హార్ట్ బీట్ చూస్తూ చెస్ట్ నొక్కుతున్నాడు. నేను చెప్పేది ఎవరికి అర్థంకాలేదు. విచిత్రంగా మా అమ్మ కూడా నన్ను తిట్టింది. ఆ బాధ అందరికి అర్థం కాదు. అభినందనలు గీతాంజలి గారు.

  • ఆస్పత్రులలో అత్యంత సహజంగా జరిగే లైంగిక వేధింపుల గురించి బాగా రాశారు. గీతాంజలి గారికి అభినందనలు.

  • చాలా బాగారాశారు గీతాంజలి గారూ . ఇది తరచూ జరుగుతున్న అత్యాచారమే

  • నాకూ ఉన్నాయి ఇటువంటి అనుభవాలు. యాక్సిడెంటయి చెయ్యి యిరుగుతే ఆపరేషన్ చేశారు ఆదిత్య హాస్పిటల్, హైదరాబాద్ లో. ఫిజియో తెరఫిష్ట్ తిక్క చేష్టలు చేశాడు.

    • థాంక్స్ జ్వలిత గారూ… ఇది నా అనుభవం కూడా….

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు