అనుకోని  పరిచయం -జీవిత కాలం స్నేహం

వంగూరి జీవిత కాలమ్-76

1975 జూన్, జూలై సమయాలకి ఒక పక్క యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో పోస్ట్-డాక్టరల్ ఫెలో గానూ, మరొక పక్క పక్కనే ఉన్న టెక్సస్ సథరన్ యూనివర్శిటీ అనే అఫ్రికన్-అమెరికన్ విశ్వవిద్యాలయంలో పార్ట్ టైమ్ ఫిజిక్స్ పంతులు గానూ జీవితం ఒక గాడిలో పడింది. అప్పుడొక సారి చిన్న తమాషా జరిగింది. ఒకానొక శనాదివారాలు రైస్ విశ్వవిద్యాలయం లో డాక్టరేట్ విద్యార్ధులైన మహంతి, మూర్తి, పార్ధా. నేనూ మరికొంత మందీ హ్యూస్టన్ కి సుమారు 150 మైళ్ళ దూరం లో ఉన్న శాన్ ఏంటోనియో నగరం చూడడాని వెళ్ళాం. అదేమీ అక్కడి నైట్ క్లబ్బులు చూడడానికి కానే కాదు. అది టెక్సస్ లోనే కాక అమెరికా మొత్తానికి ఒక చారిత్రాత్మక నగరం.

టూకీగా చెప్పాలంటే…లాటిన్ అమెరికా అనబడే దక్షిణ అమెరికా దేశాల స్పానిష్ ప్రవాసులతో 250 సంవత్సరాల వయసు గల ఆ నగరం చరిత్ర పెనవేసుకుని పోయింది.  1820-40 ప్రాంతాలలో స్థానిక టెక్సస్ వాసులకీ, మెక్సికోకి చెందిన స్పానిష్ వారికీ జరిగిన అంత:కలహాలలో 1836 లో ఫిబ్రవరి 23 0 మార్చ్ 6,  లో అక్కడ జరిగిన Battle of Alamo లో నెగ్గి టెక్సన్ వీరులు మెక్సికో నుంచి స్వాతంత్ర్యం సంపాదించుకున్నారు. ఆ యుధ్ధం జరిగిన ఆ ఏలమో అనే ప్రదేశం యావత్ అమెరికా లోనే అందరూ సందర్శించుకునే ప్రదేశం. అయితే నాకు సంబంధించి ఆ నగరం అంతకన్నా ఎక్కువే. ఎందుకంటే అప్పుడెప్పుడో 1970 లో అస్సలు ఆ ఊరి పేరే తెలియని రోజుల్లో నాకు గ్రీన్ కార్డ్ అనుమతి ఆ నగరం నుంచే వచ్చింది. ఆ ఉత్తరం కాపీ ఇక్కడ పెట్టాను. మరి తీరా అమెరికా వచ్చేశాక ఆ నగరం చూడకపోతే ఎలా?

మేము నలుగురం అనుకున్నట్టుగానే పొద్దున్నే హ్యూస్టన్ లో బయలు దేరి మధ్యాహ్నానికి అక్కడికి చేరుకున్నాం. నా సొంత కారులో ఏకధాటిన 3 గంటల సేపు 200 మైళ్ళు నేను డ్రైవ్ చెయ్యడం అదే మొదటి సారి కాబట్టి ఆ థ్రిల్లే వేరబ్బా! ముందు ఆ ఏలమో అనే ఆ చిన్న కోట ని చూసి అక్కడ నుంచి ఆ నగరం డౌన్ టౌన్ లోనే అందరూ విహార యాత్రలు చేసే రివర్ వాక్ కి వెళ్ళాం. అక్కడ నదిలో నౌకా విహారం చేస్తూ కుటుంబ సమేతంగా ఒడ్డున ఉన్న వింతలూ, విడ్డురాలూ చూసి ఆనందించడం ఒక పెద్ద వేడుక. అప్పుడే ఒక తమాషా జరిగింది. నేనూ, మా స్నేహితులం ఒడ్డు మీద ఒక వంతెన మీద నుంచుని క్రింద నదిలో విహరిస్తున్న వారందరినీ చూస్తుంటే అందులో ఒక పడవలో ఒక ఇండియన్ కుటుంబం అవునో కాదో తెలియదు కానీ వాలకం అలాగే ఉన్న ఒక కుటుంబం కనపడ్డారు. నేను వాళ్ళని చూసి చేతులు ఊపి “ఏమండీ బావున్నారా?” అని శుధ్ద తెలుగులో సరదాగా అరిచాను. వెంటనే ఆ పడవలో ఉన్న అమ్మాయి చటుక్కున తలెత్తి “ఆ బావున్నాం. మీరెలా ఉన్నారు?” అని తిరిగి నాకేసి చూస్తూ అడగగానే నాకు మతిపోయింది!. భారతీయులు కనపడడమే అరుదు అయిన ఆ రోజుల్లో ఇలా ఎక్కడో శాన్ ఏంటోనియో అనే చిన్న టెక్సస్ నగరం లో తెలుగు మాట వినపడడం వింతలో వింత. ఇక వాళ్ళ పడవ ప్రయాణం ఆపేసి ఒడ్డు మీదకి రావడం, మమ్మల్ని కలవడం, వాళ్ళు తెలుగు వాళ్ళు అవడం, అప్పటికప్పుడు కలిసిన ఆ స్నేహం నాలుగున్నర దశాబ్దాలగా ఇంకా కొనసాగుతూనే ఉండడం గొప్ప విశేషంగానే చెప్పుకోవాలి. ఆ నాటి దంపతులే వసంత లక్ష్మి & మల్లిక్ పుచ్చా. అప్పుడు వాళ్ళ కొడుకు గిరీష్ కి ఆరేడు ఏళ్ళ వాడు. వాళ్ళు కూడా హ్యూస్టన్ నుంచి శాన్ శాన్ ఏంటోనియో చూడడానికి వచ్చారుట…మాలాగే!

తీరా చూస్తే ఈ వసంతా, మల్లిక్ ఎవరో కాదు. నాకు టెక్సస్ సదరన్ యూనివర్శిటీలో లెక్చరర్ ఉద్యోగం ఇచ్చిన నారాయణ రావు గారి భార్య (అప్పటికి రెండేళ్ళ క్రితం కారు ప్రమాదం లో మరణించారు) శారదాంబ గారు వసంత కి స్వయానా పెద్ద తల్లి. అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే నేనూ, వసంతా కాకినాడ లో పి.ఆర్. కాలేజ్ లో పి,యు,సి లో క్లాస్ మేట్స్…. నేను ఎమ్. పి. ఎల్ (మేథమేటిక్స్, ఫిజిక్స్, లాజిక్) అయితే తను బి.పి.సి (బయాలజీ, ఫిజిక్స్. కెమిష్త్రీ).. ఇలా బ్రాంచ్ వేరు కాబట్టి ఒకరికి ఇంకొకరు తెలియదు కానీ మా కుటుంబాలకి పేరంటాల రాకపోకలు ఉండేవి….ఇక మల్లిక్ పెద్దన్నయ్య శర్మ గారు కాకినాడ పోలీటెక్నిక్ కాలేజ్ ప్రిన్స్ పాల్ గా ఉండేవారు…మా ఇంటికి దగ్గర్లోనే వారి నివాసం…ఇప్పుడు ఆ ఇద్దరూ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ విద్యార్ధులే కూడా…వసంత ఫార్మకాలజీలో డాక్టరేట్, మల్లిక్ ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మాస్టరె చేస్తున్నారు..నేనేమో పోస్ట్ డాక్టరల్ కదా….అలా అనుకోకుండా జూన్/జులై, 1975 లో కలిసిన స్నేహం మూడు, పువ్వులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతూనే ఉంది.  వృత్తిపరంగా వసంత నాసా అంతరిక్ష కేంద్రం లో అత్యున్నత శాస్త్రవేత్త స్థాయికి చేరుకుని దురదృష్టవశాత్తూ గత 2015 సెప్టెంబర్ లో తన 69వ ఏట ఆకస్మికంగా బ్రైన్ హెమరేజ్ తో కైవల్య పదం చేరుకోవడం అత్యంత బాధాకరం. ఇక నేనూ, మల్లిక్ ఇప్పుడు కూడా ఇంచుమించు వారానికొకసారి అయినా కలుసుకుంటాం. పోతన భాగవత ఆణిముత్యాల సంస్థ వ్యవస్థాపకుడిగా మల్లిక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన పద్యాల ప్రాచుర్యానికి ఎనలేని కృషి చేస్తున్నాడు.

1975 లో ఆగస్ట్/సెప్టెంబర్ సమయానికి సెమిస్టర్ పూర్తి అయిపోయి నా ఫిజిక్స్ పార్ట్ టైమ్ ఉద్యోగం ఉంటుందా, లేదా అనుకుంటున్న సమయానికి అనుకోకుండా అలాంటిదే మరొక అవకాశం వచ్చింది. అది ఎలా జరిగిందో నాకు ఇప్పుడు పూర్తిగా గుర్తు లేదు కానీ స్థానిక హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజ్ లో టెక్నాలజీ విభాగం లో ఎలెక్టానిక్స్, వెల్డింగ్, వైరింగ్, కార్ రిపేర్లు మొదలైన వాటిల్లో డిప్లమా కోర్సులు ఉంటాయి అని విని, ఏమైనా లెక్చరర్ అవకాశాలు ఉన్నాయేమో అని అక్కడికి వెళ్ళగానే ఎలెక్ట్రానిక్స్ లో ఒక రెడ్డి గారు అనుకోకుండా పరిచయం అయ్యారు. ఆయన ధర్మమా అని అక్కడ కూడా ఈ సారి  పార్ట్ టైమ్ లో ఎలక్ట్రానిక్స్ పాఠాలు చెప్పే అవకాశం దక్కింది. అయితే ఇక్కడ వెసులుబాటు అల్లా, ఆ క్లాసులు అన్నీ రాత్రి పూటే ఉండేవి. ఎందుకంటే ఈ కమ్యూనిటీ కాలేజ్ లో చదివే విద్యార్ధులు అందరూ పగటి పూట ఉద్యోగాలు చేసుకుంటూ, తమ వృత్తివ్యాపకాలని అభివృధ్ది చేసుకోవడం కోసం రాత్రి పూట చదువుకునే వారే!. రాత్రి పూట కాబట్టి మా కిరాతకుడైన ప్రొఫెసర్ అనుమతి తీసుకునే అవసరం లేదు. దాంతో ఇప్పుడు నేను మూడు ఉద్యోగాలు…పోస్ట్ డాక్టరల్ ఫెలో, వారానికి మూడు రోజులు పగలు పార్ట్ టైమ్ ఫిజిక్స్ లెక్చరర్, వారానికి మూడు రోజులు రాత్రి పార్ట్ టైమ్ ఎలెక్ట్రానిక్స్ ఇన్ స్ట్రక్టర్… వెరసి నెలకి ఏకంగా వెయ్యి డాలర్ల సంపాదన!. 1975 ఏడాది చివర నా పరిస్థ్తితి అదనమాట.

మొత్తానికి అమెరికాలో అడుగుపెట్టిన ఆరేడు నెలలకి…1975 ఆఖరికి నాకు ఏదో చిన్న జీవనోపాధి అవకాశాలు వచ్చాయి. అప్పుడు సంపాదన మాట ఎలా ఉన్నా, నేను సుమారు ఆరు నెలలపైగా అటు టెక్సస్ సదరన్ యూనివర్శిటీ, ఇటు హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజ్ లలో ఉపాధ్యాయుడి గా పనిచేసిన అనుభవం నాకు అసలు అమెరికా అంటే ఇండియాలో ఉన్నప్పుడు హాలీవుడ్ సినిమాల ద్వారానూ, అమెరికా వచ్చాక టీవీలలోనూ చూసే అమెరికా కాదు అని స్పష్టంగా తెలిసి వచ్చింది. ఇదేమీ కొత్త విషయం కాదేమో. ఎందుకంటే తెలుగు సినిమాలు చూసి తెలుగు వారు అలా ఉంటారు అని అమెరికన్లు అనుకుంటే ఎలా ఉంటుందీ? ఈ రెండు చోట్లా విద్యార్ధుల తారతమ్యాలు గమనిస్తే సాధారణ అమెరికన్ కుటుంబాల జీవితాల పట్ల లోతైన అవగాహన కలిగింది. ఉదాహరణకి టెక్సస్ సరదన్ యూనివర్శిటీలో చదువుకునే వారు ఏదో ఒక డిగ్రీ చదువు కోసం వచ్చిన దిగువ మధ్య తరగతి ఆఫ్రికన్ అమెరికన్ సంతతి చెందిన మైనారిటీ వారు అధిక సంఖ్యాకులు. మధ్య తరగతి, ధనిక వర్గాల వారు చదువుకునే “తెల్ల జాతి” మెజారిటీ వారు ఉండే విశ్వవిద్యాలయాలలో డిగ్రీ కోర్స్ లకి ఎడ్మిషన్ దొరకడం వారికి ఆర్ధికంగానూ, కావలసిన మార్కుల పరంగానూ ఈ దిగువ ఆఫ్రికన్ అమెరికన్ లకి అంత సులభం కాదు.

ఇక్కడి విద్యార్ధుల నేపధ్యాలు గమనించి తమ పిల్లలు జీవితంలో పైకి రావడానికి వారి తల్లిదండ్రులు ఎంత తపన పడి చదివిస్తారో, విద్యార్ధులు ఎంత ఆసక్తిగా చదువు మీద శ్రధ్ద పెడతారో నేను ప్రత్యక్షంగా తెలుసుకుని….నాకు నేనే సిగ్గు పడ్డాను. ఎందుకంటే అంత వరకూ ఆఫ్రికన్ అమెరికన్ (నల్ల వారు అనే పదం వాడడం ఆ రోజుల్లో మరీ అంత చెడ్డ మాట కాదు కానీ మంచి మాట కాదు. ఇక నీగ్రో అనే మాట నిషిధ్దం) లని దూరం నుంచైనా సరే చూడగానే అనాలోచితంగా భయపడడం, వాళ్ళు స్నేహపూర్వకంగా “హలో’ అన్నా మనం ముడుచుకుపోవడం, వాళ్ళందరూ రౌడీలు, తాగుబోతులు, మగ్గింగ్ చేసి డబ్బు లాక్కునే బాపతు అని అనేక రకాల మూస భావాలు లోలోపల అయినా ఉండే నాకు కను విప్పు కలిగింది. విద్యార్ధులలో అన్ని వయసుల వారూ, ఆడా, మగా అందరూ క్లాస్ సమయానికి వచ్చి, ఎక్కడో కాకినాడ నుంచి వచ్చి అదో రకమైన అర్ధం కాని ఇంగ్లీషు యాస తో ఎంతో స్పీడ్ గా మాట్లాడే నన్ను అల్లరి చెయ్యకుండా పాఠం వింటూ. క్లాస్ అయ్యాక కూడా ఒకటికి పది సార్లు అర్ధం అయేదాకా చెప్పించుకోడం..ఇదంతా ఒక ఎత్తు.

అయితే….ఎక్కడి నుంచో ఇక్కడికి జీవనోపాధి కోసం “పారి పోయి” వచ్చిన వాడిగా నా మీద ‘జాలి’ పడి వ్యక్తిగతంగా అభిమానించడం మరొక ఎత్తు. “ఏ దేశం వాడివి, అమెరికాకి ఎంత దూరం, పడవలో వచ్చావా. అయ్య బాబోయ్ విమానం ఎక్కావా, అసలు నీకు ఇంగ్లీషు ఎవరు నేర్పారు, నీ కుటుంబం, అమ్మా, నాన్నా అక్కడ ఉంటే ఇక్కడ నీకు బెంగ గా ఉండదా, నీకు పెళ్ళి కూతురిని వాళ్ళే ఎంపిక చేసి పంపిస్తారా, అక్కడ మా క్రీస్తు చర్చ్, ప్రార్ధనలు ఉంటాయా, గాంధీని ఎప్పుడైనా చూశావా”…ఇలా నేను ఎదుర్కోని ప్రశ్నలు లేవు. ఇదంతా 45-50 సంవత్సరాల క్రితం మన దేశం గురించీ, మన దేశవాసుల గురించీ ఆ నాటి అమెరికా వాసుల పరిమితమైన పరిజ్ఞానం. వారి దైనందిన జీవితం లో ఇవన్నీ తెలుసుకునే అవసరం, అవకాశం లేనే లేవు. నాకు మొదట్లో చాలా ఉక్రోషం గా ఉండేది కానీ కొన్నాళ్ళకి మనకి అమెరికా గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది కానీ వారికి భారత దేశం గురించి తెలుసుకునే అవసరం లేదు కదా అని అర్ధం అయింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి కానీ, మన గొంగళీ గింబళీ అవ లేదు.

*

వంగూరి చిట్టెన్ రాజు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వసంత గారు దివంగతులైనపుడు మీరు వ్రాసిన శ్రద్ధాంజలి చదివాను సర్, ఆవిడ బహుముఖీన ప్రజ్ఞను, వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఏంతో కదిలించేలా వ్రాసారు.

    • మీ స్పందనకి ధన్యవాదాలు, నాగేశ్వర రావు గారూ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు