అదృశ్య దృశ్యాలు!

కరోనా కహానీలు -9

క్లిక్…

క్లిక్… క్లిక్…

ఫోటోలు.

జిగేల్…

జిగేల్… జిగేల్…

మెరుపు వెలుగులో రోలవుతున్న కెమెరాలు.

కొన్ని పూలగుత్తులు…

మరికొన్ని కరతాళ ధ్వనులు…

చేతుల్లో చెక్కు!

చెక్కు కాగితానికి చేరోవేపే కాదు, చుట్టుపక్కల చేతులు. చేతుల మీద చేతులు.

ఇస్తినమ్మా వాయినం… పుచ్చుకుంటినమ్మా వాయినం?!

నెక్స్ట్…

కమ్ ఫాస్ట్…

వరుసగా వచ్చి నిలబడ్డారు… ముత్తైదువలు?!

చెక్కు తర్వాత చెక్కు!

చెక్కుచెదరని చెక్కు!

అన్ని చోట్లా అదే చూడచక్కని పేరంటం?!

నిధి. పెను నిధి. రేపటి పెన్నిధి.

పేరుకు పోతున్నది.

ఊబకాయపు విరాళాలు.

సహాయ నిధికి సహాయం.

ముఖ్యమంత్రి సహాయ నిధి. ప్రధానమంత్రి సహాయ నిధి.

వ్యాపార కంపెనీల విధి.

సోషల్ రెస్పాన్సుబులిటీని చూసి మంత్రి ముఖం మంత్రముగ్ధమవుతున్నది.

దాన వీర శూర కర్ణులు!

కరోనా విపత్తుకు కదిలి వస్తున్న కంపెనీలు- అని మీడియా లైవులో కూస్తున్నది.

మెచ్చుకుంటూనో నొచ్చుకుంటూనో ట్రోలింగులు.

మీకేం దొబ్బింది? మీకంటే చిన్న కంపెనీలు మీకన్నా యెక్కువ విరాళాలు యిస్తుంటే, మీ లాభాలన్నీ దాచుకుదొబ్బారా?- కామెంట్.

వీళ్ళ కంపెనీల మీదున్న కేసులు యెత్తేయడానికి యిదో దగ్గరి దారి!- మరో కామెంట్.

కట్టాల్సిన టాక్సులు కట్టరు గాని- యింకో కామెంట్!

చాట్ క్లోజ్ బటన్ నొక్కాక సెల్లోంచి వీడియో సెండయింది.

షూట్ జరుగుతూనే వుంది.

ఉత్సవం మధ్యలో ఉరుము ఉరిమింది. పిడుగులాంటి గొంతు. ప్రతిధ్వనులు.

ఆగండి… మేమూ వస్తున్నాం!

మీరెవరు?

వలస కార్మికుల్లా వున్నారే?!

అంతకన్నా ముందు మీకు ఫండ్ యిచ్చిన కంపెనీ కార్మికులం!

గెటౌట్…

మీ కంపెనీల్లో మేం పనిచేశాం!

ప్లీజ్… బయటకు వెళ్ళండి…

మీ లాభాల్లో మాకు వాటా వుంది!

ఇది మినిస్టరుగారి మీటింగ్…

మినిస్టరుగారు అందుకునే చెక్కుల్లో మా శ్రమ వుంది!

సెక్యూరిటీ… పోలీస్…

ఆల్రెడీ మేం రోడ్డుమీదున్నాం… మమ్మల్ని యింకా కిందికి యీడ్చలేరు…

స్కౌండ్రల్స్…. డర్టీ పీపుల్…

బట్… వాళ్ళు మీ వోట్లు సార్…

యస్… య్యస్…

లైవ్ నడుస్తోంది సార్… ప్లీజ్ బిహేవ్ ప్రపార్లీ…

యస్… వాళ్ళ కోసమే యిదంతా….

వాటీజ్ యువర్ ప్రాబ్లమ్?

మా కంపెనీ విరాళం యిస్తున్నప్పుడు మేం వుండొద్దా?

వై నాట్?

బట్ యిలా అగ్లీగా…

ఉద్యోగాలు వూడాక అందంగా ఆనందంగా యెలా వుండమంటారు?

ఐ మీన్… డీసెంటుగా బిహేవ్ చెయ్యాలి కదమ్మా?

మీ మాట మీకు కూడా వర్తిస్తుంది!

వాట్?

మా కంపెనీ ప్రతినిధులు చెక్కులు యిచ్చేటప్పుడు ఆ కంపెనీ కార్మికులుగా మేం హాజరు కావడం అగౌరవమా?

హు…

సరే వుండండి…

ప్రోగ్రామ్ కానివ్వండి… మినిస్టరుగారికి టైం లేదు… షెడ్యూల్ ప్రాబ్లమ్ వస్తుంది…

మీ చెక్ యిచ్చారుగా, నెక్స్ట్ కంపెనీ…

ప్రెజెంట్ సార్…

చేతులు జోడించారు.

మినిస్టరుగారికి శాలువా కప్పారు.

పూలగుత్తులు అందించారు.

చిరునవ్వుతో నలుగురూ చెక్ అందిస్తున్నారు.

క్లిక్… క్లిక్…

జిగేల్… జిగేల్…

మీరెక్కడికి?

ఆ చెక్ యిచ్చేది మా కంపెనీయే సార్… ఆ చెక్కులో…

మీ శ్రమ వుంది… చెమట వుంది… రైట్?

వాడేంటి పడిపోయాడు… తాగా?

కాద్సార్… నాల్రోజులుగా అన్నం తినలేదు…

షిట్…

వాణ్ని బయటకు తీసుకువెళ్ళండి…

వాడికి తిండి పెడితే వాడే లేచి వెళ్ళిపోతాడు సార్…

ఇదేమైనా ధర్మసత్రమా?

లేదు సార్… అత్త సొమ్ము అల్లుడు దారబోస్తున్నాడని తెలుసు సార్!

యూ…

లైవ్ సార్…

వాడికి తిండి పెట్టండయ్యా…

వాడి వొకడికి పెడితే సరిపోదు సార్… మనం చేస్తున్న కార్యక్రమం ఆపేసి అన్నదాన కార్యక్రమం చేస్తూ పోవాలి!

ఫ్యామిలీలతో వచ్చేశారు సార్… రోడ్లు యెక్కేసారు సార్…

రెడ్ కార్పెట్ అవడం పనికొచ్చింది సార్… లేపోతే వాళ్ళ కాళ్ళు నెత్తురోడుతున్నాయి సార్…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి…

మినిస్టరుగారు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు… కాకపోతే యిది ప్రకృతి విపత్తు…

కాళ్ళకి చెప్పులిస్తే పోతారేమో కొడుకులు?

మెల్లగా…

మేం చెప్పులకోసమో చేరడు మెతుకుల కోసమో రాలేదు…

మరెందుకొచ్చారో?

ఉన్నపళంగా వుద్యోగాలు పీకేసిన కంపెనీల మీద చర్యలు తీసుకోరా?

వాళ్ళు నష్టాలతో నడపలేరు కదా?

అంత నష్టాలు వస్తే, మీకు కోట్లలో రిలీఫ్ ఫండ్ యెలా యిస్తునట్టో?

ఏయ్ నువ్వు నడువ్ బయటికి?

పోలీస్ జులుం నశించాలి!

ఆగండి… చెప్పండి…

ఇది ప్రతిపక్షాల కుట్ర!

సార్… మా పక్షమే మేం నిలబడలేనివాళ్ళం సార్…

మినిస్టరుగారు అడుగుతున్నారు కదా, పాయింటుకు రండి…

లక్షల్లో జీతాలు చెల్లించలేని వాళ్ళు కోట్లల్లో ఫండ్ మాత్రం యిస్తున్నారు…

అది కంపెనీల దాతృత్వం…

తమదగ్గర పనిచేసిన వాళ్ళకి కనీసం తిండి పెడితే అంతకన్నా తక్కువే అవుతుంది…

మేం యేమి చెయ్యాలో మీరు చెబుతారా?

మీ మీ కంపెనీలు మీ మీ కార్మికులని చూసుకుంటే యిలా రిలీఫ్ ఫండ్లు యివ్వక్కర్లేదు… యిలా మేం రోడ్లు యెక్కక్కర్లేదు…

అప్పుడు కూడా పేపర్లలో టీవీల్లో మీ దాతృత్వం గురించి చెప్పకుండా వుండరు…

ఇంతకీ మీరు నడిపించినట్టు మేం నడవాలా?

మేమేమన్నా గవర్నమెంటు అనుకుంటున్నారా నడవడానికి?

గవర్నమెంటులు మాత్రం మనం చెప్పినట్టు యెక్కడ నడుస్తున్నాయి?!

కనీసం నడుస్తున్నట్టు నటిస్తున్నాయి!

మీ గవర్నమెంటులే మేం చెప్పినట్టు నడుస్తాయి!

మరిదంతా యేంటి?

ఫార్మాలిటీ!

క్లారిటీ?

పిచ్చ క్లారిటి?!

అంతే… భేతాలుడికి సమాధానం దొరికినట్టు కార్మికులంతా టక్కున మాయమైపోయారు?!

యధావిధిగా కార్యక్రమం నడుస్తోంది!

రిలీఫ్ లేకుండా రిలీఫ్ ఫండ్స్ వొచ్చి చేరుతున్నాయి!

ఔను, యిది ధర్మమూర్తులున్న పుణ్యభూమి!!

*

బమ్మిడి జగదీశ్వరరావు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు