Tasty Bites Haleem @ South Gate 

గటి ఎర్రటి ఎండ పోయాక

చలి

ఈ రాత్రిలో

చినుకులని పిలిచింది

పడీపడనట్టు చినుకులూ రాలాయి

చిన్నపిల్లాడు చిటారుకొమ్మని ఊపి

చినుకుల్లాంటి ఆకులని రాల్చినట్టు

నిన్న

కెవిన్ గాడు, మెహబూబ్తో హలీమ్ తినడానికి వెళ్ళిన విషయం

తటాలున గుర్తొచ్చింది

నోటికేదో కొత్తగా తినాలని మనసు పీకడం వలన

ఇక పిలుచాను అతనిని

ప్రేమికులు కాముకులు ఒంటరివాళ్ళు స్నేహితులు సంచరించే ఈ రాత్రి గుండా

అలసిన దేహంతో మిగిలిన ఓపికతో అతనూ బయటకి వచ్చి

నా Avenger bike పై కూలబడ్డాడు

చినుకులు వదల్లేదు మమ్మల్ని

మోహించే ప్రియురాళ్ళ తలంపుల్లాగే

వాళ్ళు పెట్టని మా ఊహల్లోని వాళ్ళ ముద్దల్లాగే జల్లుమనిపించాయి

ఇక ఆగిపోయాము

చేరాల్సిన చోటు ముందు

రుచిని ఇవ్వగలిగేంత డబ్బులు డాబుగా ఉన్నాయి Gpay లో

డెబ్భై రూపాయల హలీమ్ని ఇవ్వమన్నాక

రొండు హస్తపు గరిటెల చికెన్ హలీమ్ని అరిచేయంత ప్లాస్టిక్ బౌల్లో అదిమాడు ఆ ముసల్మాన్

అయిదువేళ్ళు ఒప్పుకున్నన్ని ఏన్చిన బాదంపప్పులని

తన నోటిలో నానుతున్న పాన్ రంగుని పోలిన ఏన్చిన ఉల్లిముక్కలని చల్లి,

సర్వపోసి రెండు నిమ్మబద్దల్ని

ఒకే ఒక్క ప్లాస్టిక్ స్పూన్ని మా చేతుల్లోకి ఇచ్చాడు- పార్సెల్ చేసి.

మనుషులకు దూరంగా

SLS Annexure -1 ముందు ఎదురుబొదురు కూర్చుని

కవర్ ముడితీసి వాసనెయ్యని ఆ హలీమ్ని

ఒకే చెంచాతో ఒకే రుచిని రెండు నోళ్ళకు తినిపించుకున్నాం కదా మిలిందన్న

మనిద్దరి ఎంగిలి బహుశా ప్రేమ కదా

ఈ హలీమ్ నిండా అది

తినిపించుకుంటున్న ప్రతీసారీ కలపబడుతుంది కదా

ఈ చల్లదనానికి

ఒకటి నల్లగా ఇంకోటి ఎర్రగా ఉన్న

నోరులేని రెండు జీవులు

మన దగ్గర మోకరిల్లి ప్రేమగా ఒక స్పూన్ హలీమ్ పెట్టమని

కళ్ళతో భలే అడిగాయి కదా

*

ఈ జీవితంలో

రాత్రిని చల్లని గాలిని బైక్ రైడింగ్ని హలీమ్ని  ముసల్మాన్ని

నిన్ను, ఈ రెండు జీవులని ప్రేమించకుండా

ఒక కవిత ఎలా రాయను?

(1:55 ఏయమ్ ,యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మెన్స్ హాస్టల్ -ఐ టెర్రస్)

2

South Shopcom Terrace • Malabar Parotta

విప్లవాన్ని పాడుకుని విప్లవప్రేమికులు వెళిపోయాక

మిగిలింది నువ్వు నేనుతోపాటు

మనకు తెలియని కొందరు చీకటి ఆరాధకులు

మనమేం పట్టించుకోలేదు ఎవరిని

మనమాటల్లో మనము మాత్రమే ఉన్నాము

అప్పుడు చల్లగాలి ఎగిరిపోయింది ఎక్కడికో.

చంద్రుడు – ఎవరో ఆకతాయి పిల్లలు ఆడుకుంటూ

తుంపులు తుంపులుగా తుంపిన దూదిలాంటి

మేఘాల్లో ఇరుక్కుని‌.

నువ్వో కొత్త పరిచయం కదా!

HCU కాదు నీది

ఈ వాతావరణమూ కాదు నీది

నువ్వు చెబితేనే విన్నాను

నువ్వు ఏ మనుషుల్లోనూ కలవలేనిదానివని అంటే

Shopcom ఎదురుగా

ప్రశాంతంగా

నువ్వు నీ KTM Duke పైన

నేను నీ ఎదురుగా నా Avenger పైనా కూర్చుని

కొద్ది కొద్దిగా వచ్చిన నీ తెలుగుని

దారితప్పి ఇంగ్లీషూ హిందీలో ముచ్చటేసిన నిను చూస్తూ

లోలోపల కొద్దిగా బుగులు

“ఎంతందంగో ఉందో కదా ఈ మరాఠీ పోర్గీ”

వెన్నెలనంతా పిండి పూసుకున్నట్టు దేహచ్ఛాయ

ఇక ఇద్దరికీ ఆకలయ్యి

సౌత్గేట్ మీదుగా మలబార్ కేరళా రెస్టారెంట్లోకి నడకలు

ఆపై పార్శిల్ చేసిన నాలుగు పరోటా

కాంప్లిమెంటరీ చికెన్ మసాలా సూప్తోటి తిరిగి ఇక్కడికి

టెర్రస్పైకి

వణికే ఇనుప మెట్లను ఎక్కుతూ

లోపల భయం రేగి

నాకు Acrophobia వుందని చెప్పగా నువ్వు నాకంటే ఎక్కువ భయపడుతూ నా గురించి

మెల్లిగా

చెదిరిపోతున్న చీకటి

ఎప్పుడు రాని నేను ఈ టెర్రస్పై

నీ ఎదురుగా కూర్చుని.

ఎక్కడికో ఎగిరిపోయిందని అనుకున్న

చల్లగాలి ఇక్కడ పచార్లు చేస్తూ

గుటకలు మింగుతూ

నా ఎంగిలి నువ్వు తినొద్దని

తినడం మహాపాపమని స్థాణువువై నిన్నే చూస్తూ నేను

ఏమీ అనుకోక తినమని నువ్వు

ముక్కలు ముక్కలుగా తుంపిన పరోటా

అచ్చం

పిల్లలు విసిరేసిన దూదిలాగా, దూదులే ఆకాశంలో అమరిన మేఘాలలాగ

ఘాటైన చికెన్ మసాలా సూప్ పోసుకుని

సిగ్గుతో నిను చూసుకుంటూ తింటూ

“ఇక్కడే ఒక రోజు

ఒక్కదాన్నే

లాబ్లో అలసిపోయి ఎలాగో నిద్రపోయింది నేను”

అని చెబుతూ ఉంటే

ఆ రాత్రి

ఆ నువ్వు

ఎలా దిగాలుగా పడికుండిపోయుంటావో

ఆ వేళ వెన్నెలకాంతి ఉండుంటుందో లేదో ఊహిస్తూ నేను

కళ్ళనిండా ధారేమైనా ఒలికుంటుందో లేదో కూడా ఆలోచిస్తూ

నువ్వు చెప్పని నీ కథ ఏమై ఉంటుందా అని కూడా

ఈ రాత్రివేళలు

నువ్వు- నీకు

కొంత మాత్రమే తెలిసిన నాతో కలిసి

ఇలా మనుషులు కలిసే ఒకానొక అందమైన దృశ్యాన్ని చూస్తున్నందుకేమో

ఎప్పట్లాగే చెట్లు ఊగుతూ పక్షులు కూతలు వినిపిస్తూ

మరి ఎక్కడిదో సిగరెట్ వాసనేస్తూ

పొద్దూకేజాముకోసం ఎదురుచూస్తూ.

*

లిఖిత్ కుమార్ గోదా

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు