Second Life

సైబర్ టవర్స్ జంక్షన్ లో కనిపించిందది.

ఆఫీస్ కు వెళ్తున్నప్పుడు గమనించాను.

బిల్ బోర్డు మీదున్న అమ్మాయిలో ఏదో ఆకర్షణ ఉంది. ఆమెకి నలభై ఏళ్ళుంటాయి కావొచ్చు. అతనూ సుమారు అదే వయసు.

ఒడ్డునుంచి బయల్దేరుతున్న పడవ.

చుట్టూ అందమైన వ్యాలీ. పడవ మధ్య చెక్కమీద తను కూర్చునుంది.

డ్రై ఫిట్ టీ షర్ట్, షార్ట్స్ వేసుకునుంది.

గాలికి కదలకుండా జుట్టును ఉండలా చుట్టి కట్టుకునుంది.

అతను మోకాలు లోతు నీళ్ళలో నిలబడి కట్టేసి ఉన్న పడవను వదులుతున్నాడు. నవ్వుతూ ఆమె చెయ్యందిస్తూ ఉంది.

 

బిల్ బోర్డు మీద పెద్ద అక్షరాలతో ‘సెకండ్ లైఫ్’ అని, దానికింద చిన్న అక్షరాలతో-

‘లివ్ లైఫ్ అగైన్.. ఫ్రమ్ ది బిగినింగ్’ అని రాసుంది.

 

ఇంకా బిల్ బోర్డు కింద కుడి కార్నర్ లో-

‘లైఫ్ గేమ్స్ Inc.,’

అని ఉంది.

***

Cyberpearl, HITEC City. హైదరాబాద్.

వానచుక్కల టోన్ వినిపించింది.

ఫోన్ తెరిచి చూస్తే టెలీగ్రామ్ యాప్‌లో “Rachit, can we meet?” అని ఉంది.

దాదాపు ఏడేళ్ళయ్యింది మేము పరిచయమై కానీ తను ఇలా నా పేరుతో పిలవడం మొదటిసారి.

నేనూ ఇన్నేళ్లలో తననెప్పుడూ రియల్ పేరుతో పలకరించలేదు.

“KiKi, is everything alright?” అంటూ రిప్లై టైపు చేసి సెండ్ నొక్కాను. “will be down there in 15” అని ఇంకో టెక్స్ట్ పంపాను.

రోజుకు కాసేపైనా వర్చువల్ గా కలుస్తాం. పరిచయం అయ్యాక ముఖాముఖం కలిసింది చాలా తక్కువ సార్లే. నేను జపాన్ లో ఉంటుండటంవల్ల కలవడానికి అవకాశం ఉండేది కాదు. వారం కిందే ఏదో ఆఫీస్ పని మీద నెల రోజుల కోసం హైదరాబాద్ వచ్చాను.

డ్రాఫ్ట్ చేస్తున్న ఈమెయిల్ ని సేవ్ చేసి, ల్యాప్⁠టాప్ లిడ్ క్లోస్ చేశాను. టేబుల్ మీదున్న సిగరెట్ ప్యాకెట్ జేబులో వేసుకుని ఎలివేటర్ వైపు అడుగులు వేశాను.

బ్లాక్-2 ఎలివేటర్ ఎప్పుడూ బిజీ గానే ఉంటుంది. నేను పట్టేంత స్పేస్ దొరికింది. ఇంత మందిలో ఎవరో ఒకరు గ్రౌండ్ ఫ్లోర్ నొక్కే ఉంటారు.

ఎలివేటర్ దిగి, బ్యారియర్ గేట్ స్వైప్ చేసి బయటికొస్తూ చూశాను. ఎండకాలాన్ని గుర్తుచేస్తూ అన్ని చెట్ల మధ్య ఇప్పుడే పూస్తూన్న ఓ తురాయి చెట్టు.

ఓరగా ముఖాలు చూసుకుంటూ పక్కపక్కనే నడుస్తున్న ప్రేమికుల్లా ఉన్నాయి Cyberpearl టవర్స్ రెండూ. శారీరక సాన్నిహిత్యం లేని ప్రేమికుల్లా నిలబడి ఉంటాయవి. సరిగ్గా గమనిస్తే బ్లాక్-1 బిల్డింగ్ కాస్త అందంగా feminine గా కనిపిస్తుంది. నేను పనిచేసే జపనీస్ కంపెనీ బ్లాక్-2 లో ఉంటుంది. తనది బ్లాక్-1.

రెండు టవర్స్ మధ్య వి-షేప్ లో ఉన్న ఖాళీ స్థలంలో చిన్న గార్డెన్. అందులోనే ఒక చిన్న కాఫీ షాప్ ఉంటుంది. కాస్త దూరంలో లాండ్ స్కేపింగ్ సహజంగా ఉండటానికని కావొచ్చు, గుట్ట నుంచి విడదీసి తీసుకొచ్చి పడేసిన రెండు పెద్ద పెద్ద రాళ్ళు. నేల కనపడనన్ని మొక్కలు. ఆ పక్కనే ఆర్టిఫీషియల్ వాటర్ ఫాల్.

తనకంటే రెండంతల ఎత్తున్న ఆ రాయికి ఒరిగి నిలబడి ఉంది తను. కుడికాలు కొద్దిగా వెనక్కి వంచి పాదాన్ని రాయికి ఆనించింది. రెండు చేతుల్లో రెండు కాఫీ కప్స్.

తను వేసుకున్న గౌన్ మడిచిన మోకాలి మీదివరకు జరిగి, కాళ్ళు పైవరకు కనిపిస్తున్నాయి. తను అదేం పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. కళ్ళలో ఎప్పుడూ కనిపించే స్ట్రెస్, ఈరోజు ఇంకాస్త ఎక్కువగా. ఎప్పటికంటే కాస్త ఎక్కువ వయసున్నట్టు కూడా కనిపించింది. జుత్తులో అంతకు ముందు కనిపించిన బ్లూషేడ్ హైలైట్స్ లేవిప్పుడు. ప్లమ్ రంగు లిప్స్టిక్. కుడికంటి కింద నల్లని మడత.

కళ్ళతోనే పలకరింతలు ఇచ్చిపుచ్చుకున్నాక, కుడిచేతిలో ఉన్న కాఫీ కప్పు నాకందించి, ఎడమచేతిలో ఉన్న కప్పుని కుడి చేతిలోకి మార్చుకుని సిప్ చేసింది.

సిగరెట్ వెలిగించి తడి అంటకుండా పైపైపెదాలతో ఒక పఫ్ లాగి తనకి అందిస్తూ “ఈజ్ ఎవిరీథింగ్ ఆల్రైట్?” అనడిగాను.

2.

సెకండ్ లైఫ్, వెర్షన్ 1.0  

 ఫీచర్స్:

నింగి, నేలా, సముద్రం, బీచ్, టౌన్, ఇల్లు, మనుషులు, ప్రేమ…

మరికొన్ని యాడాన్స్.

గేమ్ సెటప్:

నింగి.

మా ఇద్దర్నీ ఎప్పుడూ నిరాశ పరచదు.

నాకు సిమెంట్ తో కలసిన నీలం ఆకాశం ఇష్టం. తనకి నీలంతో కలిసిన పింక్ ఇష్టం.

 

నేల.

చుట్టూ సుమారు వందమైళ్ళు.

వందమైళ్ళు చాలంటాన్నేను. లేదు, ఇంకా explore చేద్దామని తను.

 

సముద్రం.

నేల మీద సముద్రమో, సముద్రం మీద నేలో.

 

బీచ్.

ఆ బీచ్ ని ఆనుకొని ఒక 21st century టౌన్. ఆమె అభిరుచికి తగ్గట్టు కట్టుకున్నట్టు ఉంటుందా టౌన్. ఆ టౌన్ కి కొంచెం దూరంలో చిన్న పొలం, అందులో అన్ని రకాల చెట్లు.

మొక్కలంటే నాకిష్టం. భూమిని హత్తుకునే గడ్డి తనకిష్టం.

 

పొలాన్ని ఆనుకుని ఒక కొండ, కాస్త దూరంలో ఒక లోయ, ఒక నది, నది ఒడ్డున కట్టేసిన పడవ.

ఆ టౌన్ నుండి చుట్టూ వంద మైళ్ళ వరకు అడుగడుగూ మేము ఇష్టపడి కట్టుకున్నదే.

ఇంకా ఒకట్రెండు చిన్న ఊర్లు కావాలని పట్టుబట్టింది. లోయలో ఒకటి, కొండమీద ఇంకోటి, బీచ్ పక్కన టౌన్ ఉండనే ఉంది. ఎందుకో, కొండ మీద ఉండే ఊర్లంటే ఆమెకి ఇష్టం. కొండ అంచున ఉన్న ఆ ఇల్లంటే మరీ ఇష్టం.

 

ఇల్లు.

మరీ పెద్దదేం కాదు.

కిచెన్, గరాజ్, డెక్, చిన్న గార్డెన్.

బెడ్రూం మాత్రం unfinished!

మా ఇష్టాలకు తగ్గట్టు ఇల్లు. మూడ్ కి తగ్గట్టు గోడలూ, రంగులూ.

కానీ, కలిసి ఇంట్లో ఉండాలంటేనే ఏదో గిల్ట్. అందుకే చాలావరకు ఇంటికి దూరంగా టౌన్ లో తిరుగుతుంటాం. జీవితంలో ఉండే చాలా ఒత్తిళ్ళ మధ్య ఈ టౌన్ ఒక పెద్ద ఆటవిడుపు మాకు. లోకల్ వైనరీస్ ఈ టౌన్ కి మరొక ఆకర్షణ.

మనుషులు.

నాకంటే తనకే ఎక్కువిష్టం.

మనుషులకు దూరంగా ఉండాలనిపించినపుడు మాత్రం పొలానికి వెళ్తుంటాం. ఇద్దరికీ చేంజ్ అంటే ఇష్టం, కొత్త మనుషులంటే తనకి, కొత్త ప్రదేశాలంటే నాకు. మొన్ననే లోయలో ఉన్న ఇల్లు ఖాళీ చేసి క్లిఫ్ మీదున్న ఇంటికి మారాము. అంతకు ముందు బీచ్ హౌస్ లో ఉండేవాళ్లం.

ప్రేమ.

సచ్ ఎ కాంప్లికేటెడ్ అల్గారిధం.

ఇద్దరం విడివిడిగా చాలా సార్లు ఈ ప్రేమ పజిల్ ని సాల్వ్ చేస్తూ దెబ్బలుతిని అలసిపోయాం. కలిసి కూడా మళ్ళీ అదే పని చేయడం ఎందుకంటుంది తను.

యాడాన్స్ (Addons) కొన్ని:

ఎమోషన్.

ఇది ప్రపంచంలో రోజూ బ్యారల్స్ కి బ్యారల్స్ పుట్టి చివరకు స్కాచ్ లో నీళ్లలా తేలుతుంది.

అసూయ.

ఎమోషన్ కి ఒక పక్కన ఉంటుంది దీని కంట్రోల్. ఇంకో పక్కన త్యాగం.

ఇవి కొంచెం CPU ఇంటెన్సివ్. ఈ యాడాన్స్ ని మాత్రం అస్సలు సెటప్ చేయొద్దంటుంది తను.

వర్షం.

రాండమ్ ఇంటర్వెల్ లో కురిసేట్టు సెటప్ చేసుకున్నాం.

వర్షం కోసం ఎదురు చూడటం ఇద్దరికీ ఇష్టమే.

3.

కొన్నాళ్ళకు ముందు.

ఒక రోజు.

ఊహూ, సరిగ్గా చెప్పాలంటే తనతో సెకండ్ లైఫ్ మొదలుపెట్టాక దాదాపు ప్రతీ రోజూ.

***

టౌన్ మార్కెట్ లో కూరగాయలు, వైన్ కొనుక్కుని ఇంటికెళ్ళాను. కార్ గరాజ్ లో పార్క్ చేసి, గరాజ్ నుంచి కిచెన్ లోకి వెళ్ళాను. సాధారణంగా ఈ టైమ్ లో ఇంట్లోనే ఉంటుంది తను. నిజానికి SecondLife వెర్షన్1.0 గేమ్ మ్యాపు మీద తనెక్కడుందో చూడొచ్చు. కానీ, తనకోసం ఇలా వెతుక్కుంటూ వెళ్లడమే ఇష్టం నాకు.

గోడలు లైట్ పింక్ లో ఉన్నాయి.

“ఐయామ్ హోమ్! కికీ?” పిలుస్తూ కిచెన్ లోకెళ్ళాను.

అవకాడో డిప్ తయారుచేస్తూ కనిపించింది. నీహైట్ స్కర్ట్ వేసుకుని ఉంది. అలల్లాంటి లేయర్డ్ లాంగ్ హెయిర్. కర్లీ సైడ్ బ్యాంగ్. బ్లూ హైలైట్స్ తో కిచెన్ ఫ్లష్ సీలింగ్ లైట్ వెలుగులో జుట్టు ఆమె ముఖానికి కొత్త అందాన్ని ఆపాదించింది.

“హేయ్ సిసీ, మై సోల్⁠మేట్!” అంటూ తన తడి చేతులు నాకంటకుండా దూరం పెడుతూ నవ్వుకుంటూ ఎదురొచ్చింది.

“సొ గుడ్ టు సీ యూ!” హగ్ ఇస్తూ తేడా గమనించాను. తన చెస్ట్ కొలతల్లో, బోన్ స్ట్రక్చర్ లో ఏదో మార్పు ఉంది. బయటికంటే కాస్త పొడుగ్గా ఈ ప్రొఫైల్ లో ఇంకా అందంగా కనిపిస్తుంది.

తెచ్చిన సామాన్లని ఫ్రిజ్ లో పెట్టాను.

చేతులు తుడుచుకుని పిటా చిప్స్ బౌల్ లో పోసి ఇప్పుడే వస్తానుండు అంటూ పౌడర్ రూమ్ వైపు పరిగెత్తింది.

క్యాబినెట్ నుండి రెండు బోర్ డొవ్ గ్లాసులు తీసి ఐలాండ్ మీద పెట్టి రెడ్ వైన్ తో నింపాను.

హై చైర్ లో కూర్చుని, ఐలాండ్ మీదున్న తన మ్యాక్ బుక్ ను దగ్గరికి లాక్కుని చూశా. నవల బాగానే ముందుకెళ్లింది. ఈరోజు బాగానే టైమ్ పెట్టినట్టుంది. ఈ లెక్కన పూర్తి చేస్తే ఇంకో మూన్నాలుగు వారాల్లో నవల పూర్తవుతుంది.

రైటింగ్ మా ఇద్దరికీ స్ట్రెస్ రిలీవర్. మమ్మల్ని కలిపింది కూడా లిటరేచరే.

ఇద్దరి మధ్య పరదాలేం ఉండవు. కానీ ఈ ఇంట్లో ఉన్నంతసేపు వీలయినంత వరకు తన ఫామిలీ గురించి మాట్లాడదు. నా పిల్లల గురించి నేను కూడా.

“సో, సిసీ, హౌ వాస్ యువర్ డే?” అంటూ షర్ట్ సరిచేసుకుంటూ వచ్చి, వెనకనుండి నా షోల్డర్ మీద చేతులేసి నిలబడింది. వస్తూ వస్తూ గోడల రంగులు కూడా బ్లూ రంగులోకి మార్చింది.

“చూస్తుంటే నీ నవల ఓ కొలిక్కి వచ్చినట్టుంది?!” అంటూ మెడ వెనక్కి తిప్పి వైన్ గ్లాస్ అందించి “కాంపాయ్” అన్నాను.

కాంప్లెక్స్ వైన్ ఫ్లేవర్స్ అంటే తనకిష్టం. సిప్ చేసాక నాలుక చివరంచు దగ్గర్నుంచి గొంతులో చేరేవరకు వైన్ ఫ్లేవర్ కనీసం నాలుగుసార్లన్నా మారాలంటుంది. నాకు మాత్రం డెన్స్ ఫ్లేవర్స్ ఇష్టం.

“యా… నా పనివొత్తిడినంతా నవల మీద చూపించా” అంటూ నవ్వింది. నవ్వినపుడు తన కళ్ళూ, పెదాలూ, ముక్కూ, చెంపలూ పోటీపడ్డాయి.

“ఈ వీకెండ్ ఫామ్ కి వెల్దామా? బోట్ రైడ్ కూడా వెళ్లొచ్చు.” వైన్ సిప్ చేస్తూ అన్నాను.

“సరే చూద్దాం గానీ, వైన్ బావుంది. ” అంది.

“నీ నవల చివరి చాప్టర్ కొంత చదివా. వాళ్ళిద్దరి గురించే ఆలోచిస్తున్నా” పిటా చిప్ తో డిప్ ని తోడుకుని తింటూ అన్నాను.

“ప్రేమని కాపాడుకోవడం నీళ్ళమీద నడిచినంత కష్టం.” గ్లాస్ లోని ద్రవాన్ని ఒవెల్ షేప్ లో తిప్పుతూ అంది.

“ఊఁ. platonic కి పొరలు చాలా పలుచన. వాళ్ళిద్దరి మధ్య ఫీలింగ్స్ ఉన్నాయా లేవా అనేది చెప్పడం కష్టం. కానీ ప్రేమలో హానెస్టీ కనిపించింది. కథని ఎలా ముగిస్తావో చూడాలి. ” అంటూ సీలింగ్ వైపు చూసుకుంటూ డెక్ మీదికి వెళ్ళాను.

నా వెనకే బాటిల్ తీసుకుని తనూ వచ్చింది.

ఆ తర్వాత తలకిచుట్టుకున్న వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ (VR Headset) ఎంతసేపటికి తీసేశానో గుర్తులేదు.

4.

“ఆయన ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నారు. ఈసారి తిరిగి రారనుకుంటా!” సిగరెట్ రెండు పఫ్స్ తాగి, ఫిల్టర్ చుట్టూ అంటుకున్న సన్నటి ప్లమ్ కలర్ రింగ్ ని ఓసారి చూసి నాకందించింది.

“మరి పిల్లలు?”

“పిల్లలు నాతోనే ఉంటారు”

“..”

“టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ డ్రామా. నా వల్ల కాదు ఇక.”

“.. నువ్వూ వెళ్లొచ్చు కదా?”

“లేదు రచిత్, రోజూ ఆ నరకం నేను పడలేను.”

“..” చివరి పఫ్ తాగుతూ తనవైపు చూశాను.

ఖాళీ అయిన తన కాఫీ కప్ ని తీసుకుని నా కప్ కింద జోడించి, సిగరెట్ ని అందులో ఆర్పేశాను.

“ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆఫీస్ లో కూడా స్ట్రెస్ ఎక్కువైంది. డెవలప్మెంట్ కి డైరెక్టర్ ని చేశారు నన్ను. సెకండ్ లైఫ్ గేమ్ వెర్షన్ 2.0 ఈ నెలాఖరుకి లైవ్ లోకి పంపించాలి.” ట్రాష్ క్యాన్ వైపు వెళ్తుంటే నా పక్కనే నడుస్తూ చెప్పింది.

ట్రాష్ లిడ్ ఓపెన్ చేసి పట్టుకుంది. కప్స్ పడేసి, జేబులోంచి పాక్ తీసి ఇంకో సిగరెట్ వెలిగించాను.

తన కళ్ల కిందున్న నల్లటి మరకలను చూపిస్తూ “నిద్ర పోతున్నట్టు లేదు నువ్వు?” అన్నాను.

ఇద్దరం మౌనంగా రెండు టవర్స్ ని చూస్తూ పార్క్ చివరంటా నడిచాం.

“జపాన్ తిరిగి వెళ్తున్నారా?” వెనక్కి తిరిగి నడుస్తున్నపుడు అడిగింది.

“నెలాఖరుకి టికెట్ ఉంది”

“ఇక్కడే ఉండొచ్చు కదా రచిత్?” ఈరోజు తను నన్ను పేరుతో పిలవడం ఇది మూడవసారి.

“..”

“సరే, వెళ్తానిక” రెండు బిల్డింగ్స్ మధ్య ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి అంది.

బ్లాక్-1 వరకు తనతోపాటే వెళ్ళి, బై చెప్పి తిరిగి బ్లాక్-2 వైపు నడిచాను.

5.

రెండు నెలల తర్వాత.

టోక్యో, జపాన్.

***

నిమిషానికోసారి సెకండ్ లైఫ్ వెర్షన్ 2.0 మ్యాప్ లో తన లొకేషన్ కోసం చూస్తు బీచ్ లో నడుస్తున్నా.

ఏదో మార్చాలని ప్రయత్నించి ఓడిపోయి వెనక్కి వెళ్తున్నట్టు అలలు.

మామూలుగా అయితే నేరుగా ఇంటికే వెళ్తా. కానీ ఈరోజు ఇంకాసేపు ఇక్కడే ఉండాలనిపించింది.

వెతకాలి. తననూ, నన్నూ వెతుక్కోవాలి.

ఎప్పట్లాగే టౌన్ మార్కెట్ లో వైన్ కొనుక్కుని క్లిఫ్ మీదున్న ఇంటికి బయల్దేరా.

గరాజ్ డోర్ స్వైప్ చేసి ఇంట్లోకి నడిచాను. ఇంటి గోడలు ఇంకా బ్లూ రంగులోనే ఉన్నాయి.

“కికీ, ఐయామ్ హోమ్!” అలవాటుగా పిలుస్తూ హై చైర్ లాగి కూర్చున్నా. కిచెన్ ఐల్యాండ్ మీదున్న మ్యాక్ బుక్ లిడ్ ఓపెన్ చేసి చూశా.

నవల Last updated date ఇంకా రెండు నెలల క్రితందే ఉంది.

బయటికెళ్లాలనిపించింది.

పొలంవైపెళ్లి మేము ఎప్పుడూ కూర్చునే క్రీపర్ పందిరి కింద కాసేపు కూర్చున్నా. పక్కనే ఉన్న వీపర్ మొక్క చుట్టూ తను నాటిన పింక్ బల్బ్స్ ఇప్పుడిప్పుడే పైకి లేస్తున్నాయి.

తర్వాత కొండను దాటి నది వరకూ నడుచుకుంటూ వెళ్లి, కట్టేసి ఉన్న పడవని చూస్తూ ఒడ్డున కూర్చున్నా.

దృశ్యాలన్నీ మసగ్గా మారుతుండటంతో కంటి తడి తుడుచుకోడానికి వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ తీసేసి పక్కన పెట్టాను.

*

రవి వీరెల్లి

15 comments

Leave a Reply to MV Rami Reddy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “ప్రేమను కాపాడుకోవడం నీళ్ల మీద నడిచినంత కష్టం”

    అందుకే ఎవరూ కాపాడుకోవట్లేదు.
    సెకండ్ లైఫ్ కాన్సెప్ట్ బావుంది

  • Wow.
    Brilliantly done.
    Perhaps the first story in Telugu of holographic game world love.

  • బ్రిలియంట్ కాన్సెప్ట్!! చాలా బావుందండీ!

  • కథ చాలా బాగుంది రవీ ! చాలా జాగ్రత్తగా చదవవలసిన కథ

  • దేన్ని సరిగ్గా మనస్సుకెక్కించుకోలేక సతమత మయ్యే ఈనటి యువతరానికి ప్రతిబింబమేమో అన్నట్లు లేదా? పూర్తిగా చదవాలనిపించిది సో మంచికథ

  • బుద్ధిగా, జాగ్రత్తగా చదువుకుంటూపోయాక… కొంతవరకూ అర్థమైంది. రొడ్డకొట్టుడు కథన శైలి నెత్తిన ఓ మొట్టికాయ వేసి, అత్యాధునిక సంక్లిష్ట జీవనచిత్రాలకు పదునైన అక్షరరూపం కల్పించారు. అభినందనలు రవి గారూ.
    – ఎమ్వీ రామిరెడ్డి

  • sariggaa oka sandhi samayaana etu vellaalO teliyani tanaana

    global thought process

    too good.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు