సెబాషో – చాసో!

చాసో తన అభిప్రాయాలను ఎప్పుడూ దాచుకోలేదు. నిర్మొగమాటం  అనే  ముళ్ళ  కుర్చీలో తను కూచునే వారు.

“తెలుగు కథలో  మార్క్సిజం  ప్రవేశపెట్టింది నేనే”. అన్నారు చాసో. వజ్రాల  వంటి  చాసో  కథల్లో ఎక్కడ ఉన్నది ఈ అవగాహన?  మాటల్లో సూటి దనాల టీకా మందు, చిత్రణలో  నేలబారు తత్వం ( దీన్నే  క్షేత్ర వాస్తవికత అని పండితీకరిస్తున్నారు), విజయనగరం చుట్టూ పక్కల ప్రాంతాల గురించే  రాసినా, విశ్వమంతటి గురించి  రాశాను అని  చెప్పిన చాసో కథలో లోకాన్ని, లోకంలో గల కథలోంచి ఆవిష్కరించిన సాధకుడు. నిరంతర సాధనలో రచయిత ఉండాలి అన్న దానికి  ఉదాహరణ  చాసో. నిత్య చదువరి.  ఎరుక  విశాలం చేసుకోవడం, తన  సహజ లక్షణం.

తన కథల్లో రాసి పదిల పర్చినవాటి కన్నా, చింపి పారేసినవి ఎక్కువ.  ఇది నేను రాసిందే కదా అన్న  తపన, యావ,  పెట్టుకోకుండా, తన రచనా ప్రమాణాలకు తగ్గట్టు ఆ కథలు  రాయలేక పోతే, వాటికి రద్దు శాసనాన్ని అమలు పర్చిన నాణ్యతా ప్రధాన సూత్ర ధారి, వేత్ర ధారి చాగంటి సోమయాజులు గారు.  తన కథల విషయంలో,  ఎలా ఒక నిక్కచ్చి వాక్యం, కథ యొక్క మొత్తం పే లోడ్  ( ఎగరాలంటే ఉండాల్సిన  తక్కువ బరువు) పట్ల  సదా క్రమ శిక్షణ గల కథాశిల్పి  చాసో.

ఆయన మాటల్లోనే మనకి తన అవగాహన  తెలుస్తుంది.

“నాకు ప్రేరణ ఇచ్చిన ఏ కథకుడూ  లేడు. నేను ఇష్టంగా వారి కథా శిల్పానికి అబ్బుర పడుతూ చదివిన కథకులు కావల్సినంత మంది  ఉన్నారు. వాళ్ళలో చెహోవ్ ప్రధానమైన వాడు.  మపాసా  తర్వాత  నాకు జీవితమే ప్రేరణ”.

“విజయనగర ప్రాంత జీవితానికి అంకితమైన కథలు రాశాను. మానవ జీవితం భూగోళం చుట్టూ ఎక్కడైనా ఒక్కటే.  నేను విజయనగరం ప్రాంతానికి పరిమితమై రాసినా మానవ జీవితం అంతటికీ వర్తిస్తుందనే నమ్మకంతో రాశాను”.

తన జ్ఞాన  విస్తృతికి, చాసో హవేలి లో విజయనగరం క్వాలిటీ సర్కిల్ గా  ఏర్పడ్డ  అయిదుగురిలో ఒక ముఖ్య కేంద్రంగా, చాసో నిలబడ్డారు. రోణంకి అప్పలస్వామి,  శ్రీరంగం నారాయణ బాబు, శ్రీరంగం శ్రీనివాస రావు, తానూ, ఆరుద్ర,  అప్పుడప్పుడు  అక్కడే కలిసే పురిపండా అప్పలస్వామి వీరి స్నేహాల గాఢ  ప్రతిఫలనం  వీరిలో ప్రతిఒక్కరి  సాహిత్య  సృజన భూమికను  విశాలం చేసింది. యువకులుగా ఉన్నప్పుడు  వారు చేసిన చర్చలు, తెలుసుకున్న ప్రపంచ  పరిణామాలు, వీరందరినీ  విశాల వామపక్ష  వర్తులంలోనే  జీవితాంతం ఉంచాయి.

చదువుకునేందుకు అప్పట్లో విజయనగరంలో  ప్రపంచ  సాహిత్య ధోరణులను పరిచయం చేసే అంతర్జాతీయ పత్రికలు  దొరికేవి. ‘జాన్ ఓ లండన్’  1919-1954 మధ్య ఇంగ్లాండ్లో అచ్చు అయిన పత్రిక. ప్రచురణ కర్త జార్జ్  న్యూనెస్ కంపెనీ. సాహిత్య, భాషా విషయాలకు మంచి ప్ర్రధాన్యత లభించే పత్రిక.  చాసో ప్రస్తావించే మరో పత్రిక  ‘ది క్రైటీరియన్’. దీని సంపాదకుడు గా టి.ఎస్.ఎలియట్  పని చేశాడు. చాసో ప్రస్తావించే మరో సాహిత్య పత్రిక  “ది అమెరికన్ మెర్కురీ.1924నుంచి 1981వరకు నడిచింది  1940-50 దశకంలో  తన  తొలి కథలు రాస్తున్న చాసో, ఇలా ఈ పత్రికల ద్వారా అందిన ప్రపంచ జ్ఞానం, అలాగే తన కథా రచనకు  ఉపకరించిన  మిత్ర పంచకం చర్చలు, పరిణామ స్వరూపంగా  తయారైన  వాడు. చాసో.  అలా సంఘం చెక్కిన శిల్పం చాసో కథా మూర్తిమత్వం. ఈ పునాది చాలా బలమైనది.

తన తొలి కథ “చిన్నాజీ”,  రెండో కూతురు  తులసి పసి దనాల్లో   (మే, 1942 భారతిలో  అచ్చు పడ్డది) రాసిన కథ. అప్పట్లో  తండ్రి ప్రేమ చాసో కథలో ఇలా జెండా ఎత్తి  నిలబడింది.ఇందులో శ్రీరంగం నారాయణ బాబు ప్రస్తావన కూడా వస్తుంది.  “ ప్రభాతానుద్దేశించి కోడి కూస్తుంది ,కాకులరుస్తాయి వర్షాగమనాన్ని సూచిస్తూ, కోయిల పాడుతుంది ,రేపు అయిదు గంటల ముప్ఫయియారు  నిముషాలకి ,కోడి కూయక పోయినా, కాకులరవక పోయినా సూర్యోదయమవుతుంది -నిబిడ నీరదాలంటూ వొస్తే కోయిల పాడకుండానే వర్షిస్తుంది,విప్లవ బీజాలు మనుషుల్లో వుంటే కవులు వీర గేయాలు పాడాలా? వెర్రికేకలేయ్యాలా, కోళ్లూ,  కాకులూ, కవులూ, కోయిలలూ లేకపోతే  ప్రపంచం ఆగిపోదు” .

“సూదిబెజ్జంలోంచి విశ్వాన్ని చూడగలిగే సూక్ష్మ జ్ఞానేంద్రియంతో మానవలోకాన్నవలోకించి అనుభవాన్నీ, ఆదర్శాలనీ, ఆత్మనీ, ప్రకృతీనీ, సమన్వయిస్తూ  మహా కావ్యం సృష్టి చేస్తున్నప్పుడు అడ్డంగా చిన్నాజీ వస్తే దాన్ని  పొమ్మంటానా ? ఊ హూ! మహాకావ్యమే  ఆగి పోవాలి”.

నేటికి  ఎనిమిది పదులకు  దగ్గరవుతున్న తులసి గారు, అప్పట్లో  మూడు నాలుగేళ్ల  బాలిక. చాసో తండ్రి గానే కాక కథా  రచయితగా కూడా పాటించే ప్రమాణాల విషయంలో సహజంగానే  తులసికి కూడా  మినహాయింపు లేదు.  ఒక సారి  యుక్త వయసు బాలిక తులసి  ఒక కథ రాయగా  చాసో  పెట్టిన  చీవాట్లు. ( తులసి గారే, చాసో సప్తతి సంచికలో తెలియచేసారు) “  తులసి ఆ వయసులో కథ రాసి  వినిపించగా చాసో స్పందన –

“ఆ రెండు పావు ఠావులు  చింపి అవతల పారెయ్యి.  ఎడిసినట్టుంది. ఆ ఉపోద్ఘాతం ఏమిటి?  మానవత్వం మీద వ్యాసం రాస్తున్నావా?  కథకి డైరెక్ట్ అప్రోచ్ వుండాలి. కన్సీల్ మెంటే ఆర్టు. గురజాడవారి పుస్తకం సూర్యారావు ఇచ్చింది చదివేవెమో? మరి ఇలా రాసి  తగలేట్టేవేం?”  ఆ పుస్తకం  “ఫస్ట్  లెసన్స్ ఇన్ స్టోరీ రైటింగ్”:  రచయిత బారీ  పైన్. ఈ  కథలు రాసే గైడు,  గురజాడ చదివారు.వారి లైబ్రరీ ప్రతిని  అవసరాల సూర్యా రావు, చాసో, చిన్న వయసులో  చాగంటి తులసి కూడా చదివారు. ఈ పుస్తకం కూడా, చాలా మంది తెలుగు కథా రచయితలకు, సాహిత్య  విమర్శకులకు  పరిచయంలో లేదు.  ఇలా ఉంటుంది  తెలుగు కథలు మాత్రమే రాసిన  చాసో ఆంగ్ల కథానికా రచనా శైలీ  అవగాహన. చెహోవ్, మపాసా తను చదివిన   కథకులు అని చెప్తూ, “తెలుగు కథలో  మార్క్సిజాన్ని ప్రవేశపెట్టిన  రచయితను నేనే” అని ఘంటాపథంగా  చెప్పుకున్న ఇరవయ్యో శతాబ్దపు తెలుగు కథకుడు  మరొకరు కనిపించరు.

భావ కవిత్వాన్ని స్పష్టంగా వ్యతిరేకించిన చాసో తన అభిప్రాయాలను ఎప్పుడూ దాచుకోలేదు. నిర్మొగమాటం  అనే  ముళ్ళ  కుర్చీలో తను కూచునే వారు. ఇతరులకు కూడా అదే రకమైన  ఆసనాలు. ఎక్కడ, ఎలా  చాసో కథానికల్లో  మార్క్సిజం  ఉన్నది అనేది ఒక  పెద్ద పరిశీలన.  నినాదాలు, ప్రచారం చేసే కళగా, సాహిత్య పాత్రను  తగ్గించకుండా, తన  నిరాడంబర,  నేలబారు,  నిక్కచ్చి చూపుతో,చాసో చెప్పిన కథల్లో గల ఆర్థిక వాస్తవికత  ముఖ్యమైనది. ఈ కోణం నుంచి చూస్తే, చాసో రాసిన  కథల్లో, ఆయా పాత్రల ఆర్థిక  స్థాయి, బతికేందుకు గల వెసులుబాట్లు, వారిని ఆస్థాయిలో ఉంచిన సామాజిక శక్తులు, ఇవన్నీ  భిన్నమైన  పొరల్లోనూ, ఒకదానితో ఒకటి కలగలిసిపోయి కనిపిస్తాయి.  ఈ ఆర్థిక  అంతస్సూత్రాన్ని   సమాజ చోదక శక్తిగా  గుర్తించడమే “ కథల్లో మార్క్సిజం ప్రవేశ పెట్టడం” అంటే అని మనం  అర్థం  చేసుకుంటే, ,  విశదంగా  కథలను  ప్రస్తావించి, పరిశీలించవలసిన  విమర్శ ఇంకా  చాసో కథల పైన  రాలేదు.  వారి కథలను, లైంగిక  సంబంధాల కథలు అని మాట్లాడి సంతృప్తి పడే వర్గం ఒకటి ఉన్నది – ఇదే ప్రశ్న వారిని అడిగినప్పుడు, “ ఆ కథల్ని ఆ దృష్టి తో రాయలేదు” అన్నారు చాసో.  మరి ఏ దృష్టో  అన్నది  ప్రస్తుతం కూడా  చర్చించ దగ్గ అంశమే.  ఈ విషయాలు దృష్టిలో  ఉండినందువల్లనే  బహుశా  చాసో “ తన కథల పై సరైన విమర్శ రాలేదు” అన్నారు. రచయితకు, రచనకు,  సమాజానికి  ఉండవలసిన  తాత్విక  బంధం చాసో బాగా  ఎరుగుదురు. చాసో  మార్క్సిస్ట్ కాదని చెప్పటానికి  ఎన్నో ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఒక జెవిత కాలం  అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపక  ముఖ్యుల్లో ఒకరుగా చాసో  తన  జీవితం యావత్తూ అరసంలోనే ఉన్నారు. దీనికి  సంబంధించి,  చాసో ని బాగా  చదివిన   దిగంబర కవిత్వోద్యమ భాగస్వామి, ప్రశస్తమైన వక్త, కవి, కథకుడు జ్వాలాముఖి  చెప్పినది  పూర్తి నిజం.  ““ చాసో గారు  ఎప్పుడు ఎదురైనా కొత్త వ్యక్తి తటస్థ పడితే వెంటనే స్వగతం లోకి వెళ్ళినట్టు గా అడిగే ప్రశ్న “ లెఫ్ట్ వింగర్ అవునా కాదా? అని తెలుసుకొనే ఆ తర్వాత అన్ని  విషయాలు అంచనా కట్టే వాడు. వాటం  తెలిసిన వామ పక్షీయుడు. తెలుగు కథా పరిణామంలో నిజమైన లెఫ్ట్ వింగర్. అదే వారి శాశ్వత చిరునామా”.

చాసో తెలుగు కథకి తూర్పు దిక్కు అంటే – అర్థం, రోజూ ఉదయించే కొత్త సూర్యుళ్ళ పురిటిగది  తూర్పు అని. తనలా అంతా ఎక్కువ ప్రపంచ అధ్యయనం కలిగి, అంతా తక్కువ రాసిన వారు అరుదు. తన ప్రాంతం పైన ప్రేమ, తానే కొన్ని కథలు అచ్చు వేసినప్పుడు, వాటికి “కళింగ  కథానికలు”  అని పేరు పెట్టారు వారు.

“మపాసా  తర్వాత  నాకు జీవితమే ప్రేరణ”.  అన్న  చాసో గారి కథల్లో,  మపసా పోలిక కథలు, ఆ బిగింపు, ఎక్కడెక్కడ పలుతాయో కూడా మనం  పెద్దగా ఇంకా పరిశీలన చేయలేదు.  కథని  సంభాషణ మీద నడపడం, చాసో కి ఇష్టమైన  పద్ధతి. దీనిపై బారీ పైన్ కూడా  ఆమోదముద్ర వేశారు. “ dialogue is done in the best possible way when the author sees his characters so clearly that he cannot imagine the possibility of their saying anything other than what he puts down  ”.  చాసో కథల్లో ఇలా సంభాషణలతో మొదలయ్యే కథలు, వాటి నడక,  ఈ బారీ పైన్ అనే ఉపాధ్యాయుడు చెప్పిన  కథా  సూత్రావళి కోణం లోంచి  చూస్తే, ఇంకా కొత్త కోణాలు  సాహిత్య లోకానికి అందివస్తాయి.

ఇరవై నాలుగేళ్లు గా  చాసో స్ఫూర్తి పురస్కారం  విజయనగరం నుంచి చాసో స్ఫూర్తి ట్రస్ట్ అందచేస్తున్నది.  వేంపల్లి  షరీఫ్,    చాసో జన్మదినం  జనవరి 17న, ఈ  పురస్కారం  అందుకుంటున్న  యువ కథకుడు. అతి తక్కువమంది  కథకులు, చాసో వలె తక్కువ రాసి, శాశ్వత కీర్తి  సంపాదించుకున్నారు. తన రచనను, ఏదో రాసీసాను కదా అని  సొంతం చేసుకోకుండా, దానికోసం  అక్కరలేని  డిఫెన్స్ లు  సిద్ధం చేసుకోడానికి తాపత్రయపడకుండా,  గ్రక్కున  విడిచిపెట్టే  నిర్మమతత్వం  చాసో లక్షణం.  అది ఆయనలో ఎలా  పరిణమించింది? “నాకు నేనే విమర్శకుడ్ని. నచ్చక పోతే,చించి పారేయటం ఈ నాటికీ అలవాటు. సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం గల రచయితని ”. కథా వజ్రాలు వదిలివెళ్లిన చాసో   వజ్రాల వలె  శాశ్వతుడు.  డైమండ్స్ ఆర్ ఫరెవర్  అంటే ఇదే మరి.  చుట్ట పొగలోంచి  నిప్పు కన్ను  తెరిచి చాసో చూసినట్టు లోపలా, బయటా  చూడడం కథకులకి ఎప్పుడూ ఒక పెద్ద బాల శిక్ష. కథ ద్వారా ఒక సాంఘిక నిఘా నేత్రం పని తీరుకి పరమ ఉదాహరణలు చాసో కథలు. వాటి  రహస్యాలలోనికి బహు భావి తరాల కథకులు ప్రయాణం చేసి, తమ శక్తి మేరకు ఆ అనుభవ  బాహుళ్య  సంపన్నులవుతారు.

*

 

రామతీర్థ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు