Dalit Lives Matter!

దళిత మహిళలపై హింసను వ్యతిరేకిస్తూ ఐక్యంగా నిలబడడానికి పిలుపు

  • ఇండియా సివిల్ వాచ్ ఇంటర్నేషనల్

 

“హథ్రాస్ లో, అత్యాచారానికి గురైన మహిళ ఇంటిని మూసేస్తారు పోలీసులు

ఆమె శవాన్ని హైజాక్ చేసి, ఒక హాంతకరాత్రి నిప్పంటిస్తారు

ఆమె తల్లి హృదయవిదారక ఆక్రందనలు వినిపించవు చెవిటి చెవులకు, ఏ దేశంలోనైతే

దళితులు రాజ్యమేలలేరో, అక్కడ వాళ్లు ఆగ్రహించలేరు, శోకించనూ లేరు.

ఇలా ఇంతకు ముందూ  జరిగింది, ఇలా మళ్లీ జరుగుతుంది.

. . . .

సనాతన, అదొక్క మంత్రమే దేశంలో అమలులో ఉన్నది

సనాతన, ఏదీ, ఎప్పటికీ మారని వ్యవస్థ.

ఇది ఎప్పటికి , ఎప్పటికీ పీడితులనే దోషులుగా భావించే తొత్తు-సమాజం

రేపిస్టులను రక్షించే పోలీసు వ్యవస్థ, కులాన్ని నిరాకరించే పత్రికారంగం.

ఇలా ఇంతకు ముందూ  జరిగింది, ఇలా మళ్లీ జరుగుతుంది.”

‘రేప్ నేషన్ ‘ అనే ఈ వెంటాడే కవితను మీనా కందసామి రాశారు. ఉత్తర ప్రదేశ్ లోని హథ్రాస్ గ్రామంలో  అధిపత్య కులానికి చెందిన నలుగురు ఠాకుర్లు మూకుమ్మడిగా బలత్కరించగా తీవ్రంగా గాయపడి చనిపోయిన 19 ఏళ్ల దళిత మహిళ గురించి ఆమె ఈ కవిత రాశారు.  ఆ భయానక కులహింస అంతటితో ఆగలేదు. ఈ ఘటన తరువాత పోలీసులు ఊహించలేనంత క్రూరంగా వ్యవహరిస్తూ, దర్యాప్తు విషయంలో ఆధిపత్యకులానికి చేందిన నేరస్తులకు అండగా నిలిచారు.

గత నెలరోజుల కాలంలో ఇలాంటి అత్యాచారాలూ హత్యలూ ఉత్తర భారతదేశంతటా జరిగాయి. శతాబ్దాలనాటి హింసాత్మక వ్యవస్థలో దళిత మహిళలపై సాగుతున్న దౌర్జన్యాన్ని ప్రస్తుత ఉగ్రవాద హిందూత్వం ప్రోత్సహిస్తోందనడానికి ఈ సంఘటనలే సాక్ష్యం.

గత నెలలోపు భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో జరిగిన దారుణమైన అత్యాచారాలూ హత్యలూ అంతర్జాతీయ సమాజాన్ని కదిలించాయి. కాషాయ ఉగ్రవాదం నీడలో దళితులపై, ముఖ్యంగా దళిత మహిళలపై సాగుతున్న   అనూహ్యమైన  ఈ దారుణాలను అరికట్టడానికి యునైటెడ్ స్టేట్స్ (యుఎస్ఎ), కెనడా, యూరప్, ఆసియా-పసిఫిక్ దేశాలలోని అనేక మంది విద్యావేత్తలూ, నిపుణులూ, సాధారణ పౌరులూ  భారతదేశ ప్రజా ఉద్యమాలతో తమ గొంతు కలుపుతూ ఒక పిటిషన్ జారీ చేశారు. ఈ అంతర్జాతీయ పిటిషన్ ఈ అనాగరిక దురాగతాలను తీవ్రంగా ఖండించింది. హథ్రాస్ సంఘటనకూ, ఈ మధ్య జరిగిన ఇలాంటి దారుణమైన సంఘటలన్నింటికీ కారకులైన అధిపత్య కులాల పురుషలపైనా, వారికి అండగా నిలిచిన పోలీసులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపైనా, సామాజిక కర్యకర్తలపైనా జరుగుతున్న దాడులనూ, ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్న వారి గుంతులు అణిచివెయ్యడాన్నీ తక్షణమే ఆపాలని ఈ పిటిషన్లో డిమాండ్ చేశారు.

ఆధిపత్య కులాల ప్రయోజనాలను పరిరక్షించే నిరంకుశ రాజ్యం  ద్వారా మాత్రమే న్యాయం సాధించటం సాధ్యం కాదని మనకు తెలుసు. భారతదేశంలో దళిత, ముస్లిం, ఆదివాసీ, కాశ్మీరీలకూ, అణిచివేతకు గురవుతున్న ఎంతోమదికీ న్యాయం జరగాలంటే కుల వ్యవస్థా,  యుద్ధపరాయణ పెట్టుబడిదారీ విధానమూ పూర్తిగా రద్దు కావలసిందే.

ఈ పిటిషన్ పై సంతకం చేసిన 1800 మందిలో ప్రపంచ ప్రఖ్యాత సామాజిక, రాజకీయ కార్యకర్తలూ, ప్రముఖ దళిత, నల్ల జాతి మేధావులూ, అలాగే సౌత్ ఏసియన్  స్టడీస్ అండ్ క్రిటికల్ రేస్ స్టడీస్, ఉమెన్స్ స్టడీస్, ఫెమినిస్ట్ స్టడీస్ యొక్క ప్రసిద్ధ పండితులూ ఉన్నారు. ఏంజెలా డేవిస్, గ్లోరియా స్టైనం, మౌడ్  బార్లో, బార్బరా హారిస్-వైట్, చంద్ర తల్పాడే మొహంతి, అర్జున్ అప్పదురై, శైలాజా పైక్, సూరజ్ యెంగ్డే, రాడ్ ఫెర్గూసన్, కేథరీన్ మెక్‌కిట్రిక్, మార్గో ఒకాజావా-రే, లారా పులిడో, హుమా దార్, నిడా కిర్మని, మరియు మినా ధండా వంటి పేర్లు ఉన్నాయి. వారితో పాటు  దళిత సాలిడారిటీ ఫోరం, యు.ఎస్.ఏ., నేషనల్ ఉమెన్స్ స్టడీస్ అసోసియేషన్, (NWSA), SEWA-AIFW (షియోన్ ఇండియన్ ఫ్యామిలీ వెల్నెస్), కోడ్ పింక్ , ఉమెన్స్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ బ్యూరో-క్యూజోన్ సిటీ,  ‘యాంటిపోడ్: ఎ రాడికల్ జర్నల్ ఆఫ్ జియోగ్రఫీ’ వంటి అనేక ప్రసిద్ధ పత్రికలు అకాడెమిక్ జర్నల్స్,  వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ పిటిషన్ను బలపరిచాయి. మిన్నెసోటా-మిన్నియాపలిస్,  ఒహాయో , మాసచుసెట్స్ రాష్ట్రాల్లోని పలు ప్రఖ్యాత విద్యాసంస్థలలోని ఉమెన్స్, జెండర్, అండ్ సెక్సువాలిటీ స్టడీస్ విభాగాలూ మానవ హక్కుల కార్యక్రమాలూ పిటిషన్ పై సంతకాలు చేశాయి.

అమెరికాలోని మినియాపలిస్  నగరంలో  తెల్ల  పోలీసు అధికారి నల్ల జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను దారుణంగా హత్య చేసిన ఉదంతం యు.ఎస్ లోనూ, ప్రపంచ నలుమూలల్లోనూ  బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమాన్ని తిరగ రాజేసిన ఈ చారిత్రక సమయంలో , భారతదేశంలో దళిత యువతిపై ఆధిపత్యకుల దురహంకారుల అత్యాచారం, హత్యా సంఘటనతో అమానవీయ హింసకు గురైన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, భారతదేశంలో హింసాత్మక హిందూత్వానికి అంటకాగుతున్న పోలీసు పాలనకు వ్యతిరేకంగా ప్రపంచ నలుమూలల్లా లక్షలాది మంది నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

ప్రఖ్యాత తత్వవేత్తా, రాజకీయ కార్యకర్తా ఏంజెలా వై. డేవిస్ ఈ పిటిషన్‌కు మద్దతుగా ఇచ్చిన ప్రకటనలో, తెల్ల ఆధిపత్యాన్నీ, జాత్యహంకారాన్నీ వివరించారు. బ్రాహ్మణ పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఆక్రోశం వెళ్లగక్కుతున్న  ఉన్న ఈ సమయంలో, అర్ధవంతమైన అంతర్జాతీయ సంఘీభావాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని ఆమె  నొక్కి చెప్పారు. అలాగే, ‘బ్లాక్ లైవ్స్ మేటర్,’ ‘దళిత లైవ్స్ మేటర్,’ ‘ముస్లిం లైవ్స్ మేటర్’ నినాదాలను  పేర్కోంటూ , వాటి మధ్య అన్వయం కుదర్చవలసిన అవసరాన్నీ, న్యాయం కోసమూ, మానవ గౌరవం కోసమూ సుదీర్ఘ పోరాటం చేయవలసి ఉన్న సందర్భాలను గుర్తు చేశారు. అమెరికాలో  బానిసత్వం ప్రబలంగా ఉన్నప్పుడు ఈ సమాజాల మధ్య నెలకొన్న  చారిత్రక సంబంధాలను ఆమె సూచించారు. అదే సమయంలో, దళిత మహిళలపై జాత్యహంకార, లైంగిక, జాత్యహంకార హింసకు వ్యతిరేకంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయాలని నల్లజాతి అమెరికన్లను ఆమె కోరారు.

నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ దళిత్ ఉమెన్ ఇన్ ఇండియా(NFDW) అనే సంస్థకు అధ్యక్షురాలైన రూత్ మనోరమ పిటిషన్ తన సంఘీభావం తెలుపుతూ, చారిత్రకా నిర్మాణాత్మకా జాత్యహంకార నేపథ్యంలో భారతదేశంలో దళిత మహిళలు అనుభవించిన దోపిడీనీ  అణచివేతనూ  వివరిస్తూ, కులా జాతీ  వివక్షలకు వ్యతిరేకంగా ఐక్యంగా కలసి పోరాడాలని  నల్లజాతి అమెరికన్లకూ , దళితులకూ పిలుపునిచ్చారు.

అత్యాచారాలూ హత్యల కేసులనేవి  మేధావులనూ, విద్యార్థులనూ, రచయితలనూ, కళాకారులనూ, పౌర స్వేచ్ఛా న్యాయవాదులనూ, కార్యకర్తలలనూ అరెస్టు చేస్తున్న నియంతృత్వ పాలన యొక్క లక్షణమని  పిటిషన్ పై సంతకాలు చేసిన మరి కొందరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు; ప్రధాన రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా అసమ్మతి వ్యక్తం చేస్తున్న వారినీ , కాశ్మీర్‌లో భారత ఆక్రమణను నిరసిస్తున్నవారినీ  క్రమపద్ధతిలో వేధిస్తూ, విచారణలు జరుపుతోంది ఈ ప్రభుత్వం. దోపిడీలూ, హత్యలూ, అత్యాచారాలూ చేస్తూ, భూములను లాక్కుంటూ, పీడితులను అవమానాలకు గురిచేస్తూ, క్రూరంగా హింస్తుస్తున్న హిందుత్వాన్నీ, కులవాదాన్నీ బహిరంగంగానే బలపరుస్తూ తన నిజ స్వరూపాన్ని  ప్రపంచానికి చూపిస్తోంది ఈ నిరంకుశ ప్రభుత్వం.

కానీ, హథ్రాస్ సంఘటన రాజ్యం మాఫీ చేసేసిన మరో సంఘటనగా మిగిలిపోదని ఈ పిటిషన్ పై సంతాకలు పెట్టిన అంతర్జాతీయ సంఘీభావం తెలియజేస్తోంది. పై సంతకం చేస్తూ తన వ్యాఖ్యలో, ఆసియాలోనూ, పశ్చిమ దేశాల్లోనూ సమాజాల్లోని బౌద్ధమతం గురించి అధ్యాయనం చేస్తూ ఎన్నో రచనలు చేసిన  పండితుడు క్రిస్టోఫర్ క్వీన్, జాతీ, కుల ఆధారిత హింస మధ్య సమాంతరాలను ఎత్తి చూపారు – “అమెరికాలో దేనికీ స్పందించని పౌరులూ, అవినీతి అధికారులూ అనుమతించిన జాత్యాహంకారం వలె, భారతదేశంలో దళితులు, మఖ్యంగా మహిళలూ బాలికలపై, క్రమంగా పెరుగుతున్న కులాత్మక హింస డెమోక్రసీకి మారుపేరని చెప్పుకునే దేశం గుండెలో చెలరేగుతున్న ప్లేగు లాంటిది.”

చివరగా, దళిత ఆదివాసీ అధ్యయనాల పండితురాలు రోజా సింగ్‌ సంఘీభావ వాఖ్యలకు మద్దతు తెలుపుతున్నాం: “జాత్యహంకారమూ  కులవాద లైంగిక హింసా  మహమ్మారిలా పెచ్చరిల్లిపోతున్న సమాజంలో కూడా మానవత్వమున్న మనుషులుగా మనం ఐక్యంగా నిలబడగలం. ఒక్క గొంతుతో ‘దళిత్ లైవ్స్ మాటర్ ‘ అని నినదించాలి. అవును , ఒక దళిత మహిళపై అత్యాచారం చేసి, ఆమెను హత్యా చేసి, శరీరాన్ని కాల్చివేసిన భయంకరమైన వాస్తావాన్ని మనం ఒప్పుకోవాలి. ఆ బూడిదనుంచి అంతర్జాతీయ ఒక్క సమూహంగా పైకి లేచి – ప్రపంచ ఉద్యమమై – న్యాయమూ గౌరవమూ ప్రపంచమానవులందరికీ అందాలని ఎలుగెత్తాలి. జూన్ జోర్డన్ కవితలో చెప్పినట్లు, ‘మనమే, మన కోసం ఎదురుచూస్తున్న వాళ్లం.’”

*

మమత, కె

2 comments

Leave a Reply to Peddanna Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • ఆగ్రహం, ఆక్రోశం రగల వలసిన సందర్భం. ఇంత ఘోరం జరిగితే స్పందించవలసినంతగా జాతి స్పందించకపోవడం చారిత్రిక విషాదం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు