కొంత బతుకును రాయాలి: కాశిరాజు

తాజా కవిత్వంలో రాజా ఎవరూ అంటే కాశిరాజు! అది కేవలం పదాల ప్రగల్భం కాదు. తాజాదనం, ఎదురులేని ధైర్యం, అసమానమైన ప్రేమా మూడూ కలిస్తే కాశీ కవిత్వం అవుతుంది. కొన్ని వందల వాక్యాల మధ్య ఎక్కడో మారుమూల దాక్కున్నా కాశీ పంక్తి ఏదో కళ్ళకి చమక్కుమంటూ మెరుస్తుంది.

మీరు రాసిన మొదటి కవితా, దాని నేపథ్యం?

 ఇన్నాళ్లు అదే మొదటిది అని అనుకోలేదు గానీ, స్కూల్ లో మా స్కూల్ గురించే రాయమని మధునాపంతుల మాస్టారు అడిగేరు.  అప్పుడు రాసా.

మా హైస్కూల్ నాకెందుకిష్టమో, మా గొప్పిరేవు, స్కూల్ లో చింత చెట్లూ, అన్నాలు తినే కొబ్బరి చెట్టూ అన్నీ నిండిపోయాయి అందులో. స్కూల్ మీద ఇష్టమే నాతో బాగా రాయించింది అని అప్పుడాయన అన్నది బాగా గుర్తు నాకు.  తర్వాత చాన్నాళ్లకి మా ఊరు చీకటైతే ఎంత అందంగా ఉంటుందో ఒకరికి చెప్పే ప్రయత్నంలో రాసాను.  నేరేడులంక అనే కవిత 2014 లో అది కూడా భలే నచ్చుతుంది నాకు.

కవిత్వం ఎందుకు రాయాలి?

ఇదేం ప్రశ్న, పాస్ అని చెప్పి ఇంకో ప్రశ్నకు సమాధానం రాస్తే సరిపోతుంది అనుకున్నాను మొదట. తింటే ఆకలి తీరినట్టు, అలిస్తే నిద్ర అవసరం అన్నట్టు, బతికితే కొంత బతుకును రాయాలి. మనమేసుకున్న లేదా మనకేసిన ముద్రను బట్టి ఆ రాత ఫార్మాట్ ను ఎలా పిలిస్తే అది అవుతుంది అనుకుంటాను.

 మీరు రాసిన వాటిల్లో మీకు బాగా నచ్చిన కవిత? ఎందుకు?

 ఇలా అడిగితే చెప్పడానికి ఒక కవిత సిద్ధంగా ఉంచుకునుంటే బాగుండేది. నేను రాసిన వాటిల్లో ఏది బాగా నచ్చుతుందో చెప్పలేను. నేను చదివినవాటిల్లో అయితే చెప్పగలను. రాయడాన్ని ఇష్టపడతా గనక ఎందుకు అన్నదానికి ఇష్టమే కారణం. మోహన ప్రసాద్ గారి రాతలు ఇష్టం, ఏ ప్రక్రియ నచ్చుతుందో ఏ సబ్జెక్టు ఎక్కువగా చదవాలనిపిస్తుందో ఇంకా సరిగా గమనించలేదు.  పాశ్చత్య సాహిత్యం కూడా బాగా నచ్చుతుంది. ఇంకా ఎక్కువగా చదివితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలననిపిస్తోంది.

*

Check out

నిద్రోయినందుకు ముద్దు మాత్రమే ఇచ్చి
కనీసం తలుపు చప్పుడైనా చేయసాహసించలేని
పిరికి మనిషికి
ప్రాణాల్ని అలా ఎలా తోడిపెడతావు.

రాత్రి
అప్పుడప్పుడే చెరువుమీద చేతులు కడుక్కుంటుంటే
చుక్కలన్నీ
చెరువులో పడేసింది ఎవరోనని
మిణుగురులు వెతుక్కుంటున్నాయి.
సరిగ్గా అప్పుడే పక్కన నడుస్తూ పుట్టావు నువ్వు
“ఇంకెంత దూరం మీ ఊరు ” అంటూ –

ఇంకిప్పుడొద్దు, బస్సెన్ని గంటలకో చెప్పు
చెక్ ఔట్ టైం గుర్తుందిగా అనడుగుతుంటే
ఆ ఉందీ అంటాను.
నడిచిన అడుగుల్లో చెక్ ఇన్,
తిన్న సాంబార్ ఇడ్లీ చెక్ ఇన్,
కాపలాగా పబ్లిక్ టాయిలెట్ ముందు చెక్ ఇన్,
ఒకే గదిలో ఉండీ నిద్రపోవా అని
నవ్వుతూ అడిగేసినప్పుడూ చెక్ ఇన్…

ఒక్కోసారి నాలుగు గోడలమధ్య ఖాళీని మాత్రమే
వొదిలి రాగలం

*

కాశిరాజు

13 comments

Leave a Reply to కొల్లు వినోద్ కుమార్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిజమే..చమక్కుమనే కొత్తరకం వాక్యాలు కాశిరాజు రాయగలడు…కురుల లోంచి వచ్చే ఒక మత్తు పరిమళం వీచే వాక్యం..

    కాశీ…చెక్ ఇన్..టూ పొయట్రీ..

  • కాశిరాజు అంటే ఇష్టం. ఇప్పుడతని మాటలూ ఇష్టపడ్డాను

  • `బతికితే కొంత బతుకును రాయాలి `అనే మాట బాగుంది కాశి గారు

  • నువ్వు ఎంచుకున్న మార్గంలో.. సూపర్ సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • కవిత్వం కోసం కాశిరాజు ప్రాణాల్ని అలా ఎలా తోడిపెట్టగలడో అర్థమవుతుంది. ఇంకా చాలా బతుకును రాయాల్సిన బాధ్యత కాశిరాజుపై ఉంది.

  • ప్రేమ

    మళ్ళీ ప్రేమ

    మళ్ళీ ‘ బోల్డ్ ‘ అంత ప్రేమ

    మళ్ళీ ఇంకాస్త స్వచ్ఛమైన ప్రేమ

    కాశింత ప్రేమ….రాజుకున్న ప్రేమ

    ప్రేమ

  • ఒక్కోసారి నాలుగు గోడలమధ్య ఖాళీని మాత్రమే
    వొదిలి రాగలం… kiraaakh raa kaashee…

  • నాలుగు గోడల మధ్య, ఖాళీ ని మాత్రమే వదిలి రాగలం…!👍👌
    కవిత్వం రారాజు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు