An Angry Young Woman

   నాకు సినెమా మోజు వారసత్వం లో వచ్చింది. మా అమ్మకు సినెమా అంటే చాలా ఇష్టం. అంతే కాదు సినెమా పట్ల ఆమెకున్న సెన్సిబిలిటీస్ కూడా గొప్పవే. మేము కలిసి చాలా పాత సినెమాలు చూశాము. ఆమె రెండోసారి, నేను మొదటి సారి. మేమిద్దరం ఓ సారి “ఉమ్రావ్ జాన్” సినెమాకెళ్ళాం. థియేటర్లో అమ్మ స్నేహితురాళ్ళు కొంత మంది వచ్చారు. వాళ్ళదరికీ ఏడుపుగొట్టు చిత్రం అనిపించినా, అమ్మకూ నాకూ చాలా నచ్చింది. ఇక కబుర్లలో చాలాసార్లు సినెమాలు దొర్లేవి. నేను పాత సినెమాలు చూడాలంటే అవి థియేటర్లలో రీ రన్ అవ్వాలి. రాజ్ కపూర్ సినెమాల్లాంటివి ఎప్పుడొచ్చినా నడిచేవి కాబట్టి అవి చూడగలిగాను. కాని కొన్ని నడవ్వు. అలాంటివి రావు. అమ్మ “దునియా న మానే”, “స్త్రీ”, “దో ఆంఖేన్ బారా హాత్”, “సుజాత”, “యే రాస్తే హైఁ ప్యార్ కే” లాంటి సినెమాల గురించి చెబుతూ అవి ఎందుకు గొప్ప చిత్రాలో చెప్పేది. దునియా న మానే లో స్త్రీల గురించి, సుజాత లో కులం గురించిన విమర్శనాత్మక ధోరణిని వివరించేది. అలా నన్ను ఇంఫ్లుయెన్స్ చేసింది. ఆ విధంగా నా వ్యక్తిత్వాన్ని కూడా మొదట్లో తనే మలచింది అనిపిస్తుంది. ఆమె పోయిన దశాబ్దాలతర్వాత ఇంటర్నెట్ అంటూ వొకటి వచ్చీ మళ్ళీ ఆ అపురూపమైన సినెమాలు చూడటం కుదురుతున్నది.

ఇప్పుడు నేను మాట్లాడేది 1937 లో వచ్చిన శాంతారాం చిత్రం “దునియా న మానే” (అంటే సమాజం ఒప్పుకోదు అని) గురించి. దీని గురించి ఎందుకు మాట్లాడాలి? ఒక తరం చూసిన చిత్రం, మా అమ్మ చెబితే నేను చూశాను, అంటే రెండో తరం చూసింది, ఇప్పుడు ఇలా నేను చర్చిస్తే మూడో తరం కూడా చూసే అవకాశం వుంది. అంతే కాదు చరిత్రలో కొన్ని నమోదు అయిన విషయాలు గుర్తు చెయ్యాలి, నమోదు కాని వాటిని నమోదు కూడా చెయ్యాలి. అందుకు.

1900 లో శరత్‌బాబు దేవదాసు వచ్చింది. 1927 లో ప్రేంచంద్ నవల “నిర్మల” వచ్చింది. రెంటికీ సామ్యం వుంది. ఒకటేమో వో పడుచు అమ్మాయి పెళ్ళి ముసలివాడితో కావడం. ఇప్పుడు ఈ చిత్రంలో కూడా అదే కథ. మొదటి రెండు నవలల్లో నాయికలు పరిస్థితులతో సర్దుబాటు చేసుకుంటారు. ఇందులో నాయిక అలా కాదు. 1973 లో వచ్చిన “జంజీర్” తో అమితాభ్ బచ్చన్ angry young manగా గుర్తింపు పొందాడు. అంటే అప్పటిదాకా రొమాంటిక్ హీరోల హవా నడిస్తే ఆ తర్వాత నుంచి అన్యాయాలతో పోరాడే నాయకుడుగా సినిమా మారింది. ఇందులో నాయిక angry young woman.

నిర్మల తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోతే ఆమె మేన మామ వాళ్ళు ఆశ్రయమిస్తారు. తను ముంబై లో బాగా చదువుకున్న అమ్మాయి. ఐతే కట్నం సమస్య కారణంగా పెళ్ళి చెయ్యడం కష్టంగా వుంటుంది. మేనమామ వో ముసలి సంబంధాన్ని తీసుకు వస్తాడు, కట్నం లేకుండా. పెళ్ళి చూపుల్లో ముసలి తండ్రీ, పక్కనే అతని పెళ్ళీడుకొచ్చిన కొడుకూ కూచుని వుంటారు. మాకు అమ్మాయి నచ్చిందని, రెండు మూడు రోజుల్లోనే పెళ్ళి అని చెప్పి లేస్తారు. నిర్మల దృష్టిలో వరుడు ఆ యువకుడే. ఆమె ఎలాంటి అభ్యంతరమూ ప్రకటించదు. పెళ్ళి మంటపంలో వరుడు, వధువు మధ్యనున్న తెర దించేసరికి ఆ ముసలి అతన్ని చూసి షాక్ తింటుంది. ఆమె ఏదన్నా అనేలోపు మేనమామ తంతులు తొందరగా పూర్తి చేయిస్తాడు. ఆ క్షణం నుంచే నిర్మల తన కోపాన్ని ప్రకటిస్తూ వస్తుంది. తన గొంతు కోసిన ఈ కుటుంబం ఇకనించి తనకు పరాయిది, నా కూడా ఎవరూ రానక్కర్లేదు అంటూ భర్తతో మెట్టినింటికి వెళ్ళిపోతుంది. ఆ ముసలాయనకి తల్లి లేదు, ఇంటి పెత్తనం పెద్దమ్మదే. ఆమె అత్త అవతారమెత్తి కోడలిని లొంగదీసుకోవాలనుకుంటుంది, అవమానం పాలు చేస్తుంది. కాని ప్రతి క్షణమూ నిర్మల ప్రతి అన్యాయాన్నీ బలంగా ప్రతిఘటిస్తుంది. భర్తతో కూడా ఇదే వైఖరి. నాటకం ఆడి ఆమెను ముసలాయన గదిలో బందీ చేసినా తీవ్ర ప్రతిఘటనే, లాంతరు దీపం తో ఇల్లు తగలబెట్టేస్తానని బెదిరిస్తుంది. ముసలాయనకు క్రమంగా నీరసం రావడం, సిగ్గు పడటం జరుగుతుంటాయి. అందరూ ఈ వయసులో పెళ్ళా అని గేలి చేస్తుంటే ముఖం దాచుకుని వెళ్ళాల్సిన పరిస్థితులు. కొడుకు పట్టణం లో వుండి చదువుకుంటున్న లోఫరు.

కూతురు సుశీల ఇల్లు వదిలి సంఘ సేవికగా పేరు తెచ్చుకుని, తన జీవితాన్ని సంఘ సేవకే అర్పిస్తుంది. నిర్మలను చూసి సుశీల సిగ్గు పడుతుంది ఆమె గొంతు కోసింది తన తండ్రేనని. వొకరోజు ఇంటికొచ్చిన కొడుకు తల్లి పట్ల అసహ్యకరంగా ప్రవర్తిస్తూ, తండ్రిని కూడా అవమానపరుస్తాడు. ఆ క్షణంలో చేతి కర్రతో కొడుకును కొట్టి అతని చేత తండ్రి కాళ్ళ మీద పడేలా చేస్తుంది నిర్మల. ఆ క్షణం పూర్తిగా మానసికంగా చితికిపోతాడు ముసలాయన. ఏదో తన స్వార్థం కోసం పెళ్ళి చేసుకున్నాడే గాని ఆమె గొంతు కోస్తున్నట్లు చూసుకోలేదు. కొడుకు, కూతురు, భార్య, బయటి వాళ్ళూ అందరూ తనవైపు వేలు చూపించి మాట్లాడుతుంటే ఈ క్షణంలో అదే నిజం అని గ్రహిస్తాడు. తన చేత్తోనే భార్య నుదుటి బొట్టును చెరిపేసి నువ్వు ఇకనించి స్వతంత్రురాలివంటాడు. ఆమె మరో వివాహం చేసుకుని బతకడానికి వీలు కల్పిస్తూ, చనిపోతున్నట్టు వొక ఉత్తరం వ్రాసి ఎటో వెళ్ళి పోతాడు. ఇక్కడ నిర్మల రెండు రూపాలు చూడొచ్చు. చివరిదాకా కోపిష్టి అమ్మాయిగా, అన్యాయాన్ని ఎదిరించే స్త్రీగా కనబడినా, చివర్లో ఆ బొట్టు చెరిపెయ్యడం అదీ కాస్త బేలను చేస్తాయి. ఎందుకంటే ఆమెలో హేతువూ వుంది, స్వాతంత్ర్యాకాంక్షా వుంది, రక్తం లో జీర్ణించుకున్న “సంస్కృతీ” వుంది. కొద్దిపాటి సంఘర్షణతో దాన్ని కూడా జయిస్తుంది. ఈ కథ 1937 లోనే వస్తే మన దగ్గర ఇప్పుడు కూడా ఎలాంటి చిత్రాలు వస్తున్నాయి? వాటిలో నాయిక పాత్ర ఎలా వుంటోంది?

సినెమాగా చూస్తే ఆ కాలానికి ఇది బాగా తీసినట్టే. ముఖ్యమైన అంశాలు తీసుకుని వాటి చుట్టూ సంఘటనలు తీర్చి అనవసరమైన సుత్తి (రెండున్నర గంటల చిత్రంలో) లేకుండా తీసారు. నిర్మల గా శాంతా ఆప్టే బాగా చేసింది. తను పాడిన పాట కూడా వుంది ఇందులో. కేశవరావ్ భోలే సంగీతం బాగుంది. ఈ పాటలు మొదటి సారి వింటున్నా చాలా నచ్చాయి, ఇన్నాళ్ళూ వినలేదేం అనిపించింది. పాటల్లో వొక ఇంగ్లీషు పాట కూడా వుంది. H W Longfellow వ్రాసిన A Psalm of life. ప్రొడ్యూసర్లు ఫతేలాల్-దాంలే లు. ప్రభాత్ ఫిల్మ్ కంపెనీ స్థాపించింది వీళ్ళే. వీళ్ళు దర్శకులు కూడా. “సంత్ తుకారాం” తీసింది వీళ్ళే. ఇక శాంతారాం పరిచయం అవసరం లేదు, మన కె విశ్వనాథ్ ని ఆంధ్రా శాంతారాం గా పిలుచుకుంటారు. ఈ చిత్రంలో నేపథ్య సంగీతం స్థానంలో సహజమైన incidental sounds ను మొదటి సారి వాడారు. పాటలు కూడా గ్రామోఫోన్ రికార్డు పెట్టి దానితో నటి కూడా పాడుతున్నట్టు చూపించారు. నాకు ఇప్పటికీ ఈ చిత్రం బోర్ అనిపించలేదు. అయితే పంటి కింద రాయిలా వొక విషయం వుంది. అది సంభాషణలు. స్వచ్చమైన హిందీ లో అక్కడక్కడా ఉర్దూ పదాలు. అదేమో వొక పల్లెటూరు. ఎందుకో అక్కడ శ్రధ్ధ పెట్టలేదనిపించింది. ఇంకా సంభాషణలలో సిధ్ధాంత చర్చ వుంది. అయితే అది చాలా కంట్రోల్ లో వుంది. షార్ప్ గా, క్లుప్తంగా, సూటిగా. అవసరం కూడా ఇలాంటి చిత్రల్లో. అలాగని పెద్ద పెద్ద డైలాగులు లేవు. మచ్చుకి నీకు సిగ్గు లేదూ అని ముసలాయన అన్నప్పుడు “వో పడుచు పిల్ల గొంతు కోసి పెళ్ళి చేసుకున్న ముసలాడి కంటేనా” లాంటి చురకలు. నచ్చిన అంశం అంత ప్రొగ్రెసివ్ స్త్రీ అయినా “సాంఘిక నమ్మకాలు” రక్తంలో కలిసిపోయి, వొక రకమైన అయోమయంలో పడి, దానితో సంఘర్షించి బయటపడటం.

మనం స్త్రీలు, స్వతంత్రం అంటూ మాట్లాడుతూ వున్నాము. గతంలో వీటి మీద ఎలాంటి గళాలు లేచాయి? అన్నది కూడా చూసుకోవాలి. అక్కడినుంచి మనం ఎంత ముందుకు వెళ్ళామూ అన్నది కూడా చూసుకోవాలి. అందుకూ ఈ వ్యాసం.

*

పరేశ్ దోశి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పరేశ్ గారు! మీకు సినీమా వారసత్వం, అభిలాష, చూసే దృష్టి, విశ్లేషణ మీ అమ్మ గారినుంచి వచ్చాయని చెప్పారు. అలాగే మా అందరికి, ముఖ్యంగా నాకు , మా తమ్ముడికి మా నాన్న గారినుంచి. ఇప్పుడు తలుచుకుంటే ఆ దృష్టి కోణం నన్ను ఆశ్చర్య పరుస్తుంది.. ఎంతో విశాలంగా ఆలోచించేవారు. ఒక విధంగా దేవదాసులానే. తెలుగులో ఇదేవిధంగా ఇలవేల్పు సినీమా. ఇలా ఎన్ని సినీమాలు. ఎంంతమంచిపాటలు. మీరు పరిచయంచేసిన సినీమా చూడాలి. మాకు ముచి సినీమాల పరిచయం మీ అమ్మగారి వారసత్వం పుచ్చుకున్న మీనుంచి ంంచి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు