హూ కేర్స్! ఆమె దెయ్యమే! ఆమె పిశాచే!

Netflix లో బుల్ బుల్ సినిమా చూశాక…

వనిలో కోయిలనై

కోయిల పాడే గానమునై
గానము కోరే చెవినై
నా చెవిలో నే ధ్వనిస్తా

అని పాడుకుంటూ చెట్టుచేమల వెంట తిరిగే చక్కని పిల్ల బుల్బుల్.

తనకి ఎందుకు ఎర్రని బట్టలు తొడిగారో, ఎందుకు గోరిటాకు పెట్టారో, ఎందుకు తల మీద కొంగు కప్పారో అర్థం కాక అమయాకంగా చెట్టెక్కి కాయలు కోసుకుంటున్న బుల్బుల్‌ని చూ డ్డానికొచ్చాడో చిన్న కుర్రాడు. దగ్గరదగ్గర తన వయసే! కొత్త నేస్తమనుకుంది.

చెట్టు దింపి, ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లి సింగారిస్తూ కాలికి మెట్టెలు తొడుగుతున్న అత్తయ్యని ఇవెందుకు తొడుగుతున్నావని అడిగింది.

“అక్కడ ఒక నరం ఉంటుంది, ఆ నరాన్ని అదిమిపెట్టి ఉంచకపోతే ఆడపిల్ల ఎగిరిపోతుంది” అంది అత్తయ్య.

“పక్షిలాగానా?” అమాయకంగా అడిగింది.

అత్తయ్య బుర్ర దించుకుని చెప్పింది “కాదు. నిన్ను వశం చేసుకోడానికి”.

“వశం చేసుకోవడమంటే ఏంటి అత్తయ్యా?”

ఆ ప్రశ్నకు జవాబు లేదు.

ఏదో తతంగం జరిగింది. బాగా నిద్రొచ్చేసింది. కళ్లు తెరిచి చూసేసరికి పల్లకీలో కొత్త మనుషుల మధ్య…భయంతో కెవ్వున అరిచింది.

“ఏమిటా అరుపు?” ఓ పెద్ద గొంతు విసుక్కుంది.

“భయపడుంటుందిలే” నిన్న చుసిన నేస్తం. హమ్మయ్య కాస్త ధైర్యం వచ్చింది బుల్బుల్‌కి.

“కథ చెప్పనా?” భయం పోగొట్టడానికి అడిగాడు. “ఊ” అంది.

“చాలాకాలం క్రితం ఇక్కడ ఒక పెద్ద దెయ్యం ఉండేది! అడవిలో చెట్ల మీద తిరుగుతూ ఉండేది…కాళ్లు వెనక్కి తిరిగుంటాయి….”

వింటూ వింటూ ఇల్లు చేరుకుంది. ఇదెవరిల్లు? ఇక్కడెవరుంటారు? నేనెందుకు ఇక్కడికి వచ్చాను? మనసులో ఎన్నో ప్రశ్నలు! ఒక పెద్ద మొద్దబ్బాయి వచ్చాడు. బొమ్మ…బొమ్మ అంటూ ఎక్కడెక్కడో తడుముతున్నాడు. మరో పెద్ద మనిషి వచ్చాడు. మొద్దబ్బాయిని మందలించాడు.

“ఆ అబ్బాయేడి?” అడిగింది ఆ పెద్దమనిషిని.

“ఎవరు?”

“నన్ను పెళ్లి చేసుకున్నవాడు!”

“నిన్ను పెళ్లి చేసుకున్నది నేను” బదులిచ్చాడు.

“కాదు. అతను నాలాగే చిన్నపిల్లాడు, నాతోపాటూ పల్లకీలో వచ్చాడు, నాకు మంచి మంచి కథలు చెప్పాడు. అతని పేరు సత్య” అయోమయంగా చెప్పింది బుల్బుల్.

“కాస్త పెద్దైతే నీకు భర్తకి, మరిదికి తేడా అర్థమవుతుందిలే” అంటూ నవ్వేసాడా పెద్దమనిషి, ఠాకూర్!

కాలం దొర్లిపోయింది ఎప్పటిలాగే! సత్య, బుల్బుల్ పెద్దవాళ్లయ్యారు. వాళ్లతోపాటూ వాళ్ల స్నేహమూ పెరిగింది. కలిసి కథ రాస్తున్నారు. భద్రంగా ఒక పుస్తకంలోకెక్కిస్తున్నారు.

సత్యతో నవ్వుతూ మాట్లాడడం మొదబ్బాయ్యి భార్యకి ఎందుకు నచ్చదో తెలీదు. ఠాకూర్‌ తనతో సఖ్యంగా ఉండడం ఆవిడకి ఎందుకు అసూయ కలిగిస్తుందో అర్థం కాదు.

మొద్దబ్బాయి భార్య ఆ ఇంటి చిన్న కోడలు, వయసులో తనకన్నా చాలా పెద్దది, తోటికోడలు, అక్క వరస…ఎప్పుడూ ఏదో గూడార్థంలో మాట్లాడుతుంటుంది. సత్యతో కలిసి కథ రాయడానికి కూర్చోబోతుంటే ఆవిడ ఆపుతుంది. బంగారంపెట్టుకో, ఆభరణాలు పెట్టుకో, కాలివేలికి మెట్టె వదులైనట్టుంది అంటూ ఏదో స్ఫురించేటట్టు మాట్లాడుతుంది!!

కాలివేలికి మెట్టెలు…వశం చేసుకోవడానికి…ఎవర్ని? ఎందుకు? ఇప్పుడు వదులవ్వడం…దానర్థం? మళ్లీ మళ్లీ అవే మాటలు!

బుల్బుల్‌కి ఇవేమీ పట్టవు. లోకం పోకడ చేరని ఎత్తులో స్నేహాకాశంలో పక్షిలా విహరిస్తుంటుంది!

సత్యని పైచదువులకోసం లండన్ పంపించేస్తారు. తనలో సగం తనని విడిచివెళ్లిపోయినట్టనిపిస్తుంది బుల్బుల్‌కి. విరిగిపోతుంది…నలిగిపోతుంది…ఏడ్చి బొబ్బలు పెడుతుంది. ఎవరు వింటారు? ఎవరు వినిపించుకుంటారు?

వాళ్లిద్దరూ కలిసి రాస్తున్న పుస్తకం తెరిచి చూసింది…సత్య, బుల్బుల్…రెండు పేర్లు తడిమి తడిమి చూసుకుంది. కోపంతో, బాధతో పుస్తకాన్ని ముక్కలు ముక్కలుగా చింపి మండుతున్న కట్టెల్లో పడేసింది.

ఆ కట్టెలు ఠాకూర్ కుంపట్లో మంట ఎగదొయ్యడానికి తోటికోడలు పోగేసినవేనని బుల్బుల్‌కేం తెలుసు పాపం!

తోటికోడలి సంగతేంటి? మొద్దబ్బాయినిచ్చి పెళ్లి చేసారు. అతను బుర్ర ఎదగని పసిపిల్లాడు. ఆమె జీవితం నీరుగారిపోయింది. కోపం, బాధ, ఈర్ష్య, అసూయ…కట్టెలుగా పోగేసింది. నిప్పు రాజేసింది.  అతని అన్నయ్య ఠాకూర్ పంచన చేరింది. ఆ వెలుగులో బంగ్లా ధగధగా మెరిసేది. జీవితాన్ని వెలిగించుకున్నాననుకుంది. బుల్బుల్ చిన్నపిల్లగా ఉన్నంతవరకూ ఆ మెరుపులకేం కొదవ లేదు. బుల్బుల్ పెరిగి పెద్దదైంది. ఠాకూర్ ఆమె మీద ఆసక్తి చూపిస్తున్నాడు. ఇది ఆవిడకి నచ్చలేదు. కొరివి బయటకు తీసింది. మంటలు ఎగదోసింది.

అన్నీ తన తెలివితేటలే అనుకుంది పాపం, అమాయకురాలు! జగన్నాటకంలో తనొక పావునని తెలుసుకోలేకపోయింది. నాటకకార్తలు తన తండ్రి, తాత, ముత్తాత, ఠాకూర్, మొద్దబ్బాయి ఇలా తనజాతి కానివారందరూ అన్న ఎరుకే లేకపోయింది. అదే కదూ వాళ్ల విజయం! కథను బయటనుంచి చూస్తున్న ప్రేక్షకులకూ కనిపించలేదు ఆవిడ దుస్థితి. ఆవిడని తిట్టుకున్నారు. మెటికలు విరిచారు. రాక్షసీ అన్నారు. పాపం ప్రేక్షకులు! అమాయకులు! నాటకంలో పావులే కదూ!

ఠాకూర్ గదిలోకొచ్చి చూసాడు. ఏడ్చి ఏడ్చి అలిసిపోయి పడుకుంది బుల్బుల్. నిప్పుల కొలిమిలో ఆశగా రాసుకున్న కథంతా కాలిపోయింది సత్య, బుల్బుల్ పేర్లు తప్ప! అవే ఠాకూర్ కళ్లల్లో పడ్డాయి. అసలు రూపం బయటికొచ్చింది. ఇనుపకడ్డీ తీసుకుని పడుకున్న పిల్ల కాళ్లు విరిచేసాడు.

నొప్పి, బాధ చిన్న పదాలైపోయాయి. ఏడుపు, కన్నీళ్లు వచ్చే స్థితి కాదు. అంతా శూన్యం!

డాక్టరు వచ్చాడు. మాంసం ముద్దలో చిక్కుకున్న కాలి పట్టీలు బయటకి తీసాడు. కట్లు కట్టాడు. ఎలా జరిగింది అని అడిగాడు. మెట్ల మీంచి పడిపోయిందన్నారు. మెట్లమీంచి పడిపోతే కాళ్లు మాంసం ముద్దలవుతాయా! నమ్మలేకపోయాడు డాక్టరు.

ఎందుకు నమ్మలేడూ! ఇందులో కొత్తేముంది! తోసేసి పడిపోయావనడం, నీకే నడవడం చేతకాలేదనడం, నడవమేంటి అసలు ఏదీ చేతకాదనడం, దద్దమ్మవనడం, కాదని ఎదిరిస్తే దెయ్యానివి అనడం, నేను నిన్ను ఉద్ధరించడానికొచ్చిన ప్రత్యక్ష దైవాన్నని నమ్మబలకడం…ఇదే కదూ తరతరాల విజయ రహస్యం!

బుల్బుల్‌కి స్పృహ వచ్చింది. కాళ్లకి కట్లు, భరించలేని నొప్పి, కదలలేని పరిస్థితి, ఏడ్చే ఓపిక కూడా లేదు.

మొద్దబ్బాయి వచ్చాడు. ఆడుకో ఆడుకో అంటూ ఆమె మీదకి ఎగబాకాడు. వద్దు, వద్దు…భరించలేకపోతున్నాను దిగిపొమ్మంది. పైజామా విప్పాడు. ఆడుకున్నాడు. కాళ్లల్లోంచి రక్తాలు ధారలు కట్టాయి. నోట్లోచి శబ్దం బయటకి రాలేదు. అచేతనమైపోయింది.

పాపం, మొద్దబ్బాయి! మొద్దబ్బాయి అయితే మాత్రం మగాడు కాదూ?! మగాడన్నాక కోరికలుండావా ఏంటి! అతని తప్పేముంది అని కదూ అంటారు! అంతే అంతే అతని తప్పేం లేదు! అలా జరిగిపోయిందంతే

“అలా జరిగిపోతుంటాయి! నువ్వు నోరెత్తకు! పెద్ద పెద్ద కుటుంబాల్లో ఇవన్నీ సహజమే. మనసులోనే దాచుకున్నావంటే డబ్బు, హోదా, గౌరవం అన్నీ నీ సొంతం. అతని మానసిక స్థితి సరిగ్గా లేదు…నీకు మాత్రం తెలీదా ఏంటి?” తొడల మధ్య నెత్తురు తుడుస్తూ నచ్చజెప్పింది తోటికోడలు.

నవ్వింది బుల్బుల్. అది చిన్నప్పటి అమాయకపు నవ్వు కాదు! సత్యతో కబుర్లాడుతున్నప్పుడు వచ్చే ఆహ్లాదపు నవ్వూ కాదు! అది లోకం దృష్టిలో దెయ్యపు నవ్వు!

లండన్ వెళిపోయిన సత్య ఐదేళ్ల తరువాత తిరిగొచ్చాడు. ఇంటికొస్తున్న దారిలో, అడవిలో దెయ్యం తిరుగుతోందన్నారు. మనుషులని చంపేస్తోందన్నారు.

మనుషులంటే పురుషులు. వాళ్లే మనుషులు!

నవ్వుతూ కొట్టి పారేసాడు. ఇంటికొచ్చాడు. సర్వాంగ సుందరంగా, ముగ్ధ మనోహరంగా, చిద్విలాసంగా కనిపించింది బుల్బుల్.

“ఎన్నాళ్లకి మేం గుర్తొచ్చాం! అంతా క్షేమమేనా? ఈ ఐదేళ్లుగా ఇల్లు గుర్తు రాలేదేం నీకు?” అడిగింది…అదే చెమ్కీల నవ్వు.

“అయ్యో అదేం లేదు. నేను ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను. మీ గురించి ఎన్నోసార్లు అన్నయ్యను అడిగాను. మూడేళ్ల క్రితం రెండో అన్నయ్య చనిపోయినప్పుడే వద్దామనుకున్నాను. ఈ ఐదేళ్లల్లో ఇల్లు ఎంత మారిపోయింది! ఠాకుర్ అన్నయ్య ఇల్లొదిలి వెళిపోయాడు. పసిమనసువాడు రెండో అన్నయ్య చనిపోయాడు…ఏమైంది ఈ ఇంటికి?!”

“చిన్న ఠాకూర్‌ని దెయ్యం చంపేసింది అంటున్నారు.”

“దెయ్యమా? వదినా మీరు కూడా ఇవన్నీ నమ్ముతున్నారా!” నవ్వేసాడు సత్య.

చిన్నవదిన దగ్గరకి తీసుకెళ్లింది బుల్బుల్. మొద్దబ్బాయి భార్య విధవాశ్రమంలో ఉంది. చూడ్డానికి వెళ్లాడు. ఆవిడ శోభ అంతా పోయింది. గుండు గీసారు. తెల్ల చీర కట్టారు. ఆమె తాను ఇంకా తెలివైనదనే అనుకుంటోంది. ఆ అమయాకత్వాన్ని మాత్రం ఆమెనుంచి ఎవరూ దూరం చెయ్యలేకపోయారు.

దెయ్యం చిన్న ఠాకూర్‌ని పీక కొరికి చంపేసింది అంది చిన్నొదిన కూడా! తనతోపాటూ ఇంటికి రమ్మన్నాడు సత్య. ఇంటికెళ్లాక మళ్లీ మాములే…కట్టెలు పోగేసింది, నిప్పు రాజేసింది. కానీ ఆమెకేం తెలుసు ఈసారి బుల్బుల్ అందులో కాలిపోడానికి సిద్ధంగా లేదని, అవసరమైతే పీక కొరికి రక్తం తాగేస్తుందని!

కాళ్లకు కట్లు కట్టడానికి రోజూ వస్తున్నాడు డాక్టరు. సత్య కంటపడ్డాడు. కట్లు కడుతున్న డాక్టర్‌తో చతుర్లాడుతోంది వదిన. ఇద్దరూ తుళ్లి తుళ్లి నవ్వుకుంటున్నారు. డాక్టర్‌ని పరిశీలనగా చూసాడు. అందగాడు. వయసులో ఉన్నవాడు. వాళ్లిద్దరూ అంత చనువుగా ఉండడం సత్యకి పొసగలేదు.

“వదినా…ఆ డాక్టరుతో అంత చనువుగా…అదీ నెత్తిన కొంగేసుకోకుండా…విచ్చలవిడిగా” చివరి ముక్క తప్ప మిగతాదంతా బయటికే అన్నాడు సత్య.

సూటిగా చూసింది అతనివైపు. “మీరంతా ఒకటే! ఒక్కలాగే ఆలోచిస్తారు!” మనసులో అనుకుంది. బయటకి నవ్వింది, అదో వెటకారపు నవ్వు!

డాక్టర్‌కి సత్యను పరిచయం చేసింది. నేను వెళ్లి దినకర్ మాస్టర్ భార్యను పరీక్షించాలి అంటూ బయలుదేరాడు డాక్టర్.

“దినకర్‌గారు మంచి వ్యక్తి.” అన్నాడు సత్య.

“అవును…అతని భార్య ఒంట్లో విరిగిపడిన ఎముకలనడిగితే తెలుస్తుంది అతని మంచితనం” బుల్బుల్ అంది.

“అడిగితే, మెట్లమీంచి పడిందంటాడు” అన్నాడు డాక్టర్ అదోలా నవ్వుతూ.

సత్యకి ఏమీ అర్థం కాలేదు. అదేరోజు రాత్రి దెయ్యం సంగేతేదో చూస్తానని అడవిలోకి బయలుదేరాడు, దినకర్‌ మాస్టర్‌ను వెంటబెట్టుకుని. దెయ్యం వచ్చింది. దినకర్‌ని ఈడ్చుకెళ్లింది. రక్తపు మడుగులో ముంచింది.

ఊర్లో దెయ్యం గోల ఎక్కువైపోయింది. స్త్రీలను అన్యాయంగా హింసించే మగాళ్లెవ్వరూ మిగలట్లేదు. దెయ్యం వాళ్లందరి నెత్తురు తాగేస్తోంది.

ఒక భార్య ఉండగా రెండో భార్యను తెచ్చుకున్నాడు ఓ ఆసామి. ఇద్దరూ సఖ్యంగా ఉండాలన్నాడు. ఆ ఆసామిని దెయ్యం ఈడ్చుకెళ్లి చంపేసింది.

భార్యని చావచితక్కొట్టి చిత్రహింసలు పెట్టాడు మరో ఆసామి. వాడినీ దెయ్యం పీక నులిమి చంపేసింది.

ఒకచిన్నపిల్లని…పసిమొగ్గని చిదిమేయాలని చూసాడు ఓ ముదురు ముతక మనిషి. దెయ్యం అతని పీక నులిమేసింది. కాళికాదేవి వచ్చి వాడి పీక కొరికేసింది అని చెప్పింది ఆ పసిపిల్ల.

దెయ్యం చంపుతోందనే తప్ప ఎవర్ని చంపుతోందో, ఎందుకు చంపుతోందో పరిశీలించే స్పృహే లేదు ఎవరికీ! మరోపక్క డాక్టరుతో వదిన స్నేహం సత్యని కలవరపెడుతోంది. వదినని పిలిచి మాట్లాడాడు.

“సరే అయిపోయిందేదో అయిపోయింది. మీవల్ల తప్పు జరిగిపోయింది. మీరు ఒంటరిగా ఉన్నారు. తప్పొప్పులు చెప్పేవారు లేరు. ఆ డాక్టర్ మిమ్మల్ని వశం చేసుకున్నాడు…”

పగలబడి నవ్వింది బుల్బుల్.

“ఇంటికి రమ్మని అన్నయ్యకు ఉత్తరం రాసాను. అతనొస్తాడో లేదో! మిమ్మల్ని మీ పుట్టింటికి పంపిస్తే మంచిదనిపిస్తోంది” సత్య చెప్పాడు.

“మీరంతా ఒక్కటే…ఒక్కలాగే ఆలోచిస్తారు!” ఈసారి బయటికే అంది గంభీరంగా.

సత్య మాటలను విదిలించుకుంటూ వెళిపోయింది.

ఊరి చివరి అడవిలో దెయ్యం సంగతి అంతు పట్టట్లేదు. సత్య పోలీసు అధికారులతో మాట్లాడాడు. చనిపోతున్నవారందిరినీ పరీక్షిస్తున్నది ఆ డాక్టరేనని తెలిసింది. అన్ని రిపోర్టులూ ఒకేలాగ ఉన్నాయి. డాక్టర్ మీద అనుమానం వచ్చింది. అడవి పక్కనే ఇల్లు అతనిది. మాట్లాడడానికి వెళ్లాడు.

ఓ చిన్న కుర్రాడు ఏడ్చుకుంటూ వచ్చాడు బుల్బుల్ దగ్గరకి. నిన్న రాత్రి మా అమ్మని మా నాన్న బయటకి గెంటేసాడు. ఇవాళ మా అమ్మ నదిలో శవమై తేలింది అని చెప్పాడు.

“ఎక్కడున్నాడు మీ నాన్న?” అడిగింది. సత్యా ఠాకూర్‌తో వెళ్లాడు అని చెప్పాడు.

సత్య, డాక్టర్ ఎక్కి కూర్చున్న బండి తోలుతున్నాడు వాళ్ల నాన్న. దెయ్యం వచ్చింది. బండి తోలుతున్నవాడి పీక నులిమేసింది.

ఇవాళ దెయ్యం అంతు తేల్చాల్సిందేనని నిశ్చయించుకున్నాడు సత్య. చేతిలో ఉన్న గన్‌తో అన్నివైపులా కాలుస్తున్నాడు.

కాల్పుల మధ్యలో దెయ్యాన్ని చూసాడు డాక్టరు. అదిరిపడ్డాడు. మళ్లీ పరిశీలనగా చూసాడు. కాళ్లు చూసాడు. తను రోజూ కట్టు కట్టే కాళ్లు! వెనక్కి తిరిగున్నాయి. తను మాత్రం ముందుకు నడుస్తోంది. చాలా ముందుకి! ఎవరూ అందుకోలేనంత ముందుకి!

“కాల్చొద్దూ కాల్చొద్దు…” అరిచాడు. “ఆమెని ఏం చెయ్యొద్దు…” అరుస్తూనే ఉన్నాడు డాక్టరు.

“ఏం? ఎందుకు ఆమెని కాపాడాలనుకుంటున్నావు? ఆమె నీకేమవుతుంది?”

“నాకు ఒక మంచి స్నేహితురాలు మాత్రమే. కానీ నీకు, మీ కుటుంబానికీ ఆమే అన్నీ….”

సత్య ఆ మాటలేవీ వినిపించుకోవట్లేదు. అడవికి నిప్పంటించేసాడు.

“ఎంత పని చేసావు! ఆమె దెయ్యం కాదు. దేవత. చిన్నపిల్లని ఒక నీచుడి చేతుల్లోంచి కాపాడిన దేవత. మెదడు ఎదగలేదని చెప్పుకుంటూ తిరిగే ఒక మృగాన్ని మట్టు పెట్టిన దేవత! భార్యని నానాహింసలు పెట్టిన భర్తని హతమార్చిన దేవత…” చెప్పుకుంటూ పోతున్నాడు.

“పెద్ద కోడలుగారూ..పెద్ద కోడలుగారూ…” అరుచుకుంటూ ఆమెను వెతుక్కుంటూ వెళ్తున్నాడు డాక్టరు.

అప్పుడు…ఆ మాట విన్నాడు సత్య. భోరున ఏడ్చాడు.

అన్నయ్యకో ఉత్తరం రాసాడు…”పెద్దయ్యాక మీలా అవ్వాలనుకునేవాడిని. ఇప్పుడూ మీలా అయిపోతానేమోనని భయంతో ఇల్లొదిలి వెళిపోతున్నాను. బహుసా మీలా అయిపోయాననే భయం వల్లనే కాబోలు వెళిపోతున్నాను. మనందరి రక్తం ఒకటే. ఆ రక్తమే మన చేతుల్లో చారికలు కట్టింది. మనదరం ఒకటే జాతి!”

అన్నేళ్ల తరువాత ఇంటికొచ్చిన ఠాకూర్ ఉత్తరం చదివాడు. దీర్ఘంగా నిట్తూర్చాడు. కళ్లు మూసుకుని పడుకున్నాడు. ఆమె మళ్లీ వచ్చింది. దెయ్యం మళ్లీ వచ్చింది.

అవును అన్యాయాలను ఎదురించే స్త్రీని దెయ్యమనే అంటుంది సమాజం. తన హక్కు కోసం తాను నిలబడితే కాళ్లు వంకర అంటూ కించపరుస్తుంది. ఆమె స్వేచ్ఛాగాలులు పీలుస్తూ పైకెగరాలనుకున్నప్పుడల్లా ఆకాశానికి నిప్పంటించేస్తుంది

ఆమె దెయ్యం! చాలాయేళ్ల క్రితమూ ఆమెను దెయ్యమనే అన్నారు. మన చిన్నప్పుడూ అన్నారు. ఇప్పుడూ అంటున్నారు.

పూర్వకాలంలో స్త్రీ ఏ మాత్రం తెలివితేటలు చూపించినా మంత్రగత్తెనీ, చేతబడులు చేస్తుందనీ, దెయ్యం పట్టిందనీ హింసించి చంపేసేవారు. అలా చెయ్యకపోతే ఆమె ఎక్కడ మెదడుకు పదును పెడుతుందోనని భయం! తమ చెప్పుచేతల్లోంచి ఎగిరిపోతుందేమోనని భయం! నేను మనిషిని అంటుందేమోనని భయం!

కాస్త ధైర్యం, తెలివితేటలు చూపించే స్త్రీ పిశాచి. మనసులో కోరిక ధైర్యంగా బయటపెడితే రాక్షసి. ముక్కు చెవులు తెగ్గోస్తారు. పద్మినీ, శంకిణీ, హస్తీనీ అని విభజనలు. శాకినీ, ఢాకినీ అని పేర్లు.

చంపే సంస్కృతిని దాటి వచ్చాక స్త్రీ గయ్యళి అయ్యింది. ఏ కాస్త ఆత్మాభిమానం చూపించినా గయ్యాళితనం అంటగడతారు. ఆఖరుకి చిన్నపిల్లలు సరదాగా చదువుకునే చందమామలో కూడా గయ్యాళి భార్య కథలే! చిన్నప్పటినుంచీ నూరిపొయ్యడమన్నమాట!

మరిప్పుడు? ధైర్యం, ఆత్మాభిమానం చూపిస్తూ తన హక్కుల కోసం పోరాడే స్త్రీ ‘ఫెమినిస్ట్’. ఏ మార్గం దొరకకపోతే ఏం చెయ్యాలి? ఏదైతే న్యాయమో దాన్ని అన్యాయమని చూపించాలి. ఫెమినిజంలో న్యాయం ఉంది కనక దాన్ని కొట్టిపారేయలేం గనక ‘ఫెమినిస్ట్ అన్న మాటనే బూచిని చేసేయాలి. స్త్రీవాదమంటే మగవాడిని అసహ్యించుకోవడమే అని డప్పు కొట్టి చాటాలి. కుక్క-మేక కథలోలాగ మేకని కాజేయాలంటే నలుగురూ పన్నగం పన్ని దాన్ని కుక్క అనాలి.

సాధికారత అంటే స్త్రీ అధికారం అని నమ్మబలకాలి. స్త్రీవాదమంటే మగవాడిని తొక్కేయడం అని నిరూపించాలి. ‘ఫెమినిస్ట్’ అని ఇలా కోట్స్‌లో రాసి వేరు చెయ్యాలి. వీళ్లతో చేరితే మీరూ చెడిపోతారు అని ఇతర స్త్రీలను భయపెట్టాలి. ఫెమినిస్ట్ అవడమంటే చెడిపోవడమని నమ్మబలకాలి. బుల్బుల్‌లాంటి స్త్రీని దెయ్యాన్ని చేసి, ఆమె తోటికోడలు లాంటి స్త్రీలని ముందుకు తీసుకొచ్చి ఇదిగో ఇదే స్త్రీవాదమని మసిపూసి మారేడుకాయ చెయ్యాలి.

తరాలు మారినా ప్రయత్నం మారలేదు. ఆమెను దెయ్యాన్ని చెయ్యాలి. తప్పదు. చెయ్యకపోతే ఆమె ఎగిరిపోతుంది…చేతికి అందనంత ఎత్తుకి…ఆకాశంలోకి!

దెయ్యం, పిశాచి, రాక్షసి, గయ్యాళి ఏమైనా అననీ!

హూ కేర్స్! ఆమె దెయ్యమే! ఆమె పిశాచే! అయితే ఏంటి? ఆమె నిలబడుతుంది…ఆమె ముందుకి నడుస్తూనే ఉంటుంది. వేగం పెంచుకుని ఎగురుతుంది…పైకి…పై పైకి!

*

ఆలమూరు సౌమ్య

పుట్టిన ఊరు విజయనగరం. ప్రస్తుతం దేశ రాజధానిలో మకాం. కుటుంబంలో సాహిత్యాభిరుచి ఉండడం, తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉండడం వలన చిన్నప్పటినుంచీ తెలుగు సాహిత్యం మీద మక్కువ పెరిగింది. రాయలన్న తపనతో బ్లాగు మొదలెట్టాను. NATS 2013 కోసం కొత్త కథల ఆహ్వానం చూసి మనమూ రాస్తే బావుంటుందే అనిపించి తొలి ప్రయత్నం చేసాను. "ఎన్నెన్నో వర్ణాలు" అనే కథ NATS 2013 లో ప్రచురితమయ్యింది. అదే నా మొట్టమొదటి కథ. ఆ కథను "వాకిలి" సాహిత్య పత్రికలో మలిప్రచురణ చేసారు. అప్పటినుండీ కథలు, సమీక్షలు, వ్యాసాలు, అనువాద కవితలు..అడపదడపా రాస్తూ ఉన్నాను.

25 comments

Leave a Reply to Dr.M.Jagan Mohan Reddy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Netflix లో bulbul movie చూసిన రోజు నిద్ర రాలేదు.చాలా బాగా రాసారు.

  • గొగోల్ ‘ఓవర్ కోట్’ ని గుర్తుకు తెచ్చారు సౌమ్యా! స్త్రీల ఆత్మాహుతిని నిరసన రూపంగా గ్లోరిఫై చేసే టాగూరు, గురజాడల కథలకన్నా బాగుంది. ఐతే చివర ఉపన్యాస ధోరణి ఎడిట్ చేస్తే ఇంకా బావుండేది.

    • ఇది రెవ్యూ అని నెమ్మదిగా అర్థమయింది!!!

      • Yes. మీకు జవాబులో రాద్దామనుకున్నా! ఇది బుల్బుల్ సినిమా చూసాక నా స్పందన. Thank you

  • సినిమా తీసిన డైరెక్టర్ మనసులో ఏముందో కానీ, మీరు ఆ కథని, అద్భుతం గా కళ్లకు కట్టినట్లు చూపించారు. అందరి అమ్మాయిల గుండెల్లో చెలరేగే తరతరాల వేదనని, ఒక్కరై వినిపించారు. ఆ బుల్బుల్ నీ, మీ సమీక్షనూ ఇప్పట్లో మరచిపోలేను.

    • Thank you 🙂 ఒక వారంపాటూ నా బుర్రలో తిరుగుతూనే ఉంది ఈ సినిమా!

  • చాలా చిత్రమైన సినిమా ఇది. పైకి థ్రిల్లర్ లా కనిపిస్తుంది కానీ ఫెమినిస్ట్ ఐడియాలజీని మార్మికంగా చెపుతుంది. గట్టిగా నిలబడిన స్త్రీల మీద సమాజం వేసే ముద్రలని వారికే తిరిగి గురి పెట్టిన విధానాన్ని మీ రివ్యూ చక్కగా విశ్లేషించింది. ఎదురుగాలికి తిరుగులేదు.

    • అవును. subtle గా ఎన్నో విషయాలు చెప్పింది ఈ సినిమా! Thank you.

  • ఎంత బాగా రాశారో మాటల్లో చెప్పలేను. మళ్ళీ ఒక సారి సినిమా చూసిన అనుభూతి కలిగింది, ప్రతి ఫ్రేమ్ కళ్ళముందు కదిలింది. తోడికోడలి విషయంలో మీ అబ్సర్వేషన్ కు హ్యాట్సాఫ్. చివరి లైన్స్ లో కూడా బాగా సమ్మరైజ్ చేశారు. అమేజింగ్ రైటప్.

    • Thanks వేణు. జనసామాన్యంలో అత్తగార్లని, తోటికోడళ్లని, ఆడబడూచులను గయ్యాళులుగా చూస్తారుగానీ అది కూడా పితృస్వామ్య కుట్రలో భాగమే! వాళ్లూ బాధితులే! దీని వెనుకు సామాజిక, చారిత్రక సాంస్కృతిక కోణాలను అర్థం చేసుకోవాలి.

  • సౌమ్య గారూ సూపర్ అండి ..నేను చూసాను బుల్బుల్ సినిమా..కళ్ళకు కట్టినట్లుగా మీరు అక్షరబద్దం చేసారు. సమాజంలో స్త్రీ ని ఎలా చూసేవారో హింసించేవారో.. స్త్రీకి స్త్రీ ఎలా శత్రువో .. వంచితురాలి వ్యధ, తిరుగుబాటు అన్నీ అద్భుతంగా చిత్రించారు. మీరు రాసిన విధానం కూడా ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా ఒక రాత్రి పదికోజుల క్రితం చూసాను .. ఇంకా నన్ను వెన్నాడుతుంది.. ప్రతి స్త్రీ హృదయాన్ని తడుముతుంది.. ఆవేదనను నింపుతుంది..ఆలోచనను రేకెత్తిస్తుంది

  • బాగుంది సౌమ్యా…సినిమా చూసినదానికన్నా ఈ రైటప్ ఇంకా నచ్చింది…గుడ్…

  • ఇలాంటి సినిమాలు గతంలో అంటే.. సుమారు 1974 1975 లో శ్యామ్ బెనెగల్ తీసిన అంకూర్, నిషాంత్ చూసుంటే.. ఈ సినిమా వాటి కన్నా విభిన్నంగా ఉందో లేదో తెలిసేది. అవార్డ్స్ కోసం తీసే సినిమాలు. ఆధృక్కోణం లొనే చూడాలి. రెండు గంటల సినిమా నిడివి సమాజంలో మార్పు తెస్తుందని అనుకోలేము.

    మీరు బుల్బుల్ సినిమాకు రివ్యూ వ్రాశారు.

  • ఫెమినిస్ట్ బూచి ఎలా అయిందో సవినయంగా రాశారు, అభినందనలు సౌమ్య గారు.

  • ఓ స్త్రీ ఎప్పుడెప్పుడు దెయ్యం అయే ఛాన్సెస్ ఉన్నాయో విపులంగా చర్చించారు. ఈ మూవీ ఇంతవరకూ చూడలేదు. ఇప్పుడు చూస్తాను. బట్ మూవీలో ఏం చెప్పారో కానీ.. స్త్రీ చుట్టూ అల్లబడే రకరకాల భావజాలపు చట్రాలను బాగా చెప్పారండీ.

  • ఇది సినిమా చూసిన అనుభూతిని ఇచ్చింది. కాల్లు…మెట్టెలు….వశపరుచుకొవడం…. అమాయకపు…… స్పందన….. రివ్యూ… రాసినట్టు కాకుండా కథ చెబుతున్నట్టె ఫీలింగ్…. బాగుంది

  • సినిమా చూశాక ఇది చదివా, చాలా బాగా రాశారు.

    “మతి స్థిమితం లేదు , లేదు అంటూనే ఆ విషయానికి వచ్చే సరికి మతి బాగానే పని చేసింది” మొద్దు అబ్బాయికి

  • ఎంత గొప్పగా రాశారండి ,
    భరణీ చిత్రలేఖ చెప్పినట్లు ఆ సినిమా ఆత్మ ని మా ముందు ఆవిష్కరించారు. ఎక్కడో ఓ చోట ఈ తిరుగుబాటు వస్తుంది రావాలి కూడా…స్త్రీల ని వారి కోణంలో చూసే వరకు వారి మీద ఇంతకాలం గా సాగించిన దాష్టీకం తెలుసుకోలేం. రాక్షసి అని, భరితెగించిందని, దెయ్యం అని ‌‌‌…ఇలా రకరకాల సంకెళ్ల తో బదించబడిందని ఒప్పుకొని పశ్చాత్తాపడే రోజులు వస్తాయని ఆశిస్తున్నాను.

  • మేడం మీరు రాసింది అంతా బాగుంది కానీ ఫెమినిజంని సాదించాలి అనుకుంటే ముందు మానవత్వం ని సాదించాలి, మనలో ఉన్న ఈర్ష, అసహ్యం అన్నీ పోవాలి అది ఆడ, మగ ఇద్దరిలోనూ. ఏదన్నా ఒక అన్యాయం జరిగినప్పుడు ఒక ఆడదానిలా,ఒక మగాడిలా కాదు ఒక ప్రాణం ఉన్న జీవిలా చూడండి, అసలు తప్పుకి మూలం ఎక్కడ ఉందో తెలుస్తుంది. మనుషులు పోరాడాల్సింది ఫెమినిజం కోసమో లేక ఇంకేదో ఇజం కోసం కాదు హ్యూమనిజం, అది జరిగినపుడు ఆడవాళ్లకి ఫెమినిజంతో పని ఉండదు. Thank you🙏

  • చాలా బాగుంది మీ సమీక్ష….ఆలోచన ధోరణి….

  • చాలా చాలా బాగా రాశారు సౌమ్య, సినిమా చూసినా, ఇంత లోతుగా ఇలా అర్థం చేసుకోలేను ఖచ్చితంగా. చదివేటప్పుడు వినపడ్డ వాక్యపు గొంతు పవర్ ఫుల్ గా ఉంది. Thank you for writing this.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు