స్వేచ్ఛను మళ్ళీ చంపేశారు!

స్వేచ్ఛ గురించి ఇప్పటిదాకా బయట తెలిసింది ఆమె వ్యక్తిత్వం, వెలుగులు జిమ్మే ఆమె నవ్వు, వెన్నెల పూసే ఆమె ధైర్యం,తెగువ, లోతైన ఆలోచన, ఆమె లోని సున్నితత్వం, చలాకీతనం, న్యాయం కోసం ఆమె నిలబడ్డ తీరు… ఇవి మనకు తెలిసిన స్వేచ్ఛ. ఆమె ఆత్మహత్య వార్త సోషల్ మీడియాలో బయటకు రాగానే మనం తెలుసుకున్న స్వేచ్ఛ వేరు.

ప్రముఖ జర్నలిస్ట్ , కవయిత్రి, యాక్టివిస్ట్ స్వేచ్ఛ ఒక బలహీనమైన క్షణంలో ఆత్మహత్యకు పాల్పడింది. 24 గంటలుగా మీడియా ఆ అమ్మాయి ఆత్మహత్య పై హోరెత్తి పోతోంది. స్వేచ్ఛతో పరిచయమున్న వారికి, లేనివారికి అందరినీ ఈ ఆత్మహత్య నిస్సందేహంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలనుకోవటంలో తప్పు లేదు. కానీ దానికి చెల్లించే మూల్యం ఎంత? ఎవరి జీవితాలను పణంగా పెట్టి మనం ఆ విషయాలు తెలుసుకుంటున్నాము అన్న విషయంలో ప్రతి ఒక్కరూ మరోసారి ఆలోచించుకోవటం మంచిది.

స్వేచ్ఛ గురించి ఇప్పటిదాకా బయట తెలిసింది ఆమె వ్యక్తిత్వం, వెలుగులు జిమ్మే ఆమె నవ్వు, వెన్నెల పూసే ఆమె ధైర్యం,తెగువ, లోతైన ఆలోచన, ఆమె లోని సున్నితత్వం, చలాకీతనం, న్యాయం కోసం ఆమె నిలబడ్డ తీరు… ఇవి మనకు తెలిసిన స్వేచ్ఛ. ఆమె ఆత్మహత్య వార్త సోషల్ మీడియాలో బయటకు రాగానే మనం తెలుసుకున్న స్వేచ్ఛ వేరు.

ఆమె వ్యక్తిగత జీవితాన్ని బజారుకు లాగిన మీడియా జర్నలిస్టులు, యుట్యూబర్స్. మైకు తీసుకెళ్లి పదమూడేళ్ళ పిల్ల ముందు పెట్టి, మీ అమ్మ నీకేం చెప్పేది? ఇలాంటి పరిస్థితి గురించి చెప్పిందా? ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో ఏమైనా ముందే హెచ్చరించిందా? ఇలాంటి ప్రశ్నలతో గుచ్చి గుచ్చి ప్రశ్నించి తల్లి పోయిన పుట్టెడు  దుఃఖంలో వున్న చిన్నారి మనసు ను మరింత బాధ పెట్టే  వీడియోలు అవసరమా?

ఆమెకు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో, ఆమె ఎవరితో నివసిస్తోందో? ఆ గొడవల గురించి కూతుర్ని పోగొట్టుకున్న బాధలో వున్న తల్లి తండ్రులను ఒక్కో చానెల్ వాళ్ళు విడి విడిగా అడిగిన ప్రశ్ననే అడిగి, చెప్పిన సమాధానాన్నే మళ్ళీ మళ్ళీ రాబట్టి, వాళ్ళ ఇంటిలోని ప్రతి అంగుళాన్ని కెమెరా కళ్ల తో పదే పదే రీప్లే చేసి, ఆమె ఉరేసుకున్న దృశ్యాన్ని మళ్ళీ మళ్ళీ చూపించి.. ముక్కలుగా ముక్కలుగా మళ్ళీ స్వేచ్చను చంపేసే మీడియా కవరేజీ అవసరమా?

జర్నలిజం ఓ వృత్తి. ఒక చోట పని చేస్తున్నప్పుడు కొన్ని చేయాల్సి ఉంటుంది. అంత మాత్రం తెలియని జర్నలిస్టును కాను నేను. కానీ కనీసం మహిళా జర్నలిస్టులు కూడా కొంచెమైనా సెన్సిబులిటీ లేకుండా ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు మీడియా వ్యవస్థ మీద, దాన్ని పెంచి పోషిస్తున్న వ్యవస్థ మీద ఆగ్రహం కలుగుతుంది. దాని మొహాన ఉమ్మేయాలనిపిస్తుంది. ఈ వీడియో ల కింద వచ్చే కామెంట్ల పేరుతో స్వేచ్ఛ వ్యక్తిగత జీవితం మీద చల్లే బురద మీద, ఇచ్చే తీర్పుల మీద అసహ్యం వేస్తుంది.

ఎవరి జీవితం లో తప్పులు లేకుండా ఉండవు. అన్నీ సార్లు పొలిటికల్లీ కరెక్టు గా ప్రవర్తించలేము. స్వేచ్ఛ చేసింది తప్పో, వొప్పో ఆమెకు మాత్రమే సంబంధించిన  విషయం. కూతురి కోసమో, కన్నవారి కోసమో కాదో, తన కోసమే తాను ఈ నిర్ణయం తీసుకోకుండా వుండాల్సింది. రెండు మూడు రోజుల క్రితమే ఇంస్టా లో మెడిటేషన్ చేస్తున్న ఫోటో , దానికి పెట్టిన కాప్షన్ చూసిన వారికి, ఆమె నిర్ణయం వెనక వున్న సంఘర్షణ అర్థమవుతుంది. స్వేచ్ఛ లోపలి ఆలోచనలు, సంఘర్షణ, ఓ నమ్మకం కోసం, ఓ ఆసరా కోసం, ఒక ఆత్మీయ బంధం కోసం ఆమె తనతో తాను చేసిన యుద్ధంలో ఓడిపోయింది. పరాజిత స్వేచ్చ.

నిజమే. ఆ మాట బాధతో కన్నా కోపంతోనే అంటున్నా. చుట్టూ ఇంతమంది వున్నా, ఆ అమ్మాయి ఏడవటానికి, ఆమె బాధ వినటానికి, ధైర్యం చెప్పటానికి ఒక్క భుజం కూడా లేకపోయింది కదా. కన్నీరు తుడిచి జీవితాన్ని ప్రేమించటం నేర్పించలేకపోయాము కదా. అది సరే!  ప్రేమ లేకపోయినా, పెళ్లి లేకపోయినా, ప్రేమించిన వాడు బలహీనుడో , పిరికివాడో, మోసగాడో అయినప్పుడు పక్కకు జరిగి, వెనక్కు తిరిగి మరో దారి ఎంచుకోవటం యే పుస్తకాలు, యే కవిత్వం, యే స్నేహాలు, యే బంధాలు, యే బంధుత్వాలు ఇవ్వలేకపోయాయి కదా! అందుకు సిగ్గు పడుతున్నా.

స్వేచ్ఛను మళ్ళీ చంపేసినా మీడియా మొహం మీద, ఆ వీడియోల మీద, ఆ కామెంట్ల మీద ఉమ్మేస్తున్నా.

యే అపజయానికి నువ్వు భయపడ్డావో, సిగ్గు పడ్డావో ఇప్పుడు వీళ్ళంతా నిన్ను మళ్ళీ మళ్ళీ కుళ్లబోడుస్తుంటే ఈ గుడ్డి లోకం మీద యే మాత్రం జాలి కలగటం లేదు.

క్షమించు స్వేచ్ఛ!   నీ దుఃఖాన్ని ఇంత మందికి ఇలా పంచే బదులు నీ వైఫ్యల్యాన్ని కూడా నువ్వే నీ చున్నీ అనుకుని విసిరి పారేసి ఉంటే ఎంత బాగుండేది రా !

*

కల్పనా రెంటాల

3 comments

Leave a Reply to M S B P N V RAMA SUNDARI S A HINDI Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిన్నటి నుండీ గుండె అవిసి పోతోంది. మీ కోప ప్రకటన కాస్త solace

  • అబ్ తో ఘబరాకే యే కహ్‌తే హై కి మర్ జాయేంగే
    మర్ కే భీ చైన్ న పాయా తో కిధర్ జాయేంగే
    (ఇప్పుడు ఉద్వేగంతో ఇక చావు తప్ప దారి లేదంటారు
    చచ్చి కూడా శాంతి పొంద లేకపోతే అప్పుడు ఎక్కడికెళ్తారు)
    అంటాడు షేక్ ఇబ్రహీం జౌక్. ఈ ఓపెనింగ్ స్టేట్‌మెంట్ విని గాలిబ్ కూడా ఉలిక్కిపడ్డాడని చెప్తారు.
    స్వేచ్ఛ గురించి మీరు చెప్పింది అక్షర సత్యం కల్పన గారూ. మీడియోకి సెన్సిబిలిటీ చచ్చిపోయింది. చిన్నపిల్లల ముందు మైకులు పెట్టి అడిగిన ప్రశ్నలే అడగడం, ఆ తెలుగూ తెగులు పట్టి ఏడవడం, లాంటివి ఎన్నో వంకరలు ఉన్నాయి.
    అందరికీ వేర్వేరు నేపథ్యాలు ఉంటాయి. వాళ్లవైన ప్రత్యేక సమస్యలూ, సమాధానాలూ ఉంటాయి. ప్రాణం బలవంతంగా తీసుకోవడం అనేది సమాధానం ఎవరికీ ఎన్నడూ కాకూడదు.
    జయప్రద మూడు సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని అంటారు. కత్రీనా కైఫ్, దీపిక, ఐశ్వర్యా రాయ్ లాంటి లైమ్ లైట్‌ సెలెబ్రిటీస్‌ డిప్రెషన్‌లోకి జారుకుని తేరుకున్నారు. అందం వెంట విషాదం గూడు కట్టుకునే ఉంటుంది, గులాబీ చుట్టూ ముళ్లలా. జమున, వాణిశ్రీ గార్లలా ప్రొఫెషన్‌నీ, పర్సనల్ లైఫ్‌నీ ఖచ్చితమైన కట్టుబాట్లలో పెట్టుకోవడం, జీవితం పట్ల చాలా స్పష్టమైన అవగాహనతో మెలగడం అవసరం. వాళ్లకీ అనేక విషాద సంఘటనలు ఎదురయ్యాయి. కానీ జయించారు.

    కత్రీనా ఒక విలువైన మాట చెప్పింది…మనం ఎవరినో ఇష్టపడి, మన సంతోషాన్ని తీసికెళ్లి వాళ్ల చేతికి అప్పజెప్పకూడదు. మనకి తెలియని దారుల్లో వాళ్లు దాన్ని ఛిద్రం చేస్తారేమో. అందుకే మనం చేసే పని మనకి సంతోషాన్నిచ్చే పనుల్ని ఎంచుకుని మనం చేయాలి. అవతలి వాళ్ల నుంచి ఎన్నడూ ఏదీ ఆశించకూడదు. అలా చేస్తే మన జీవితాన్ని వాళ్లు దాన్ని ముక్కముక్కలు చెయ్యొచ్చు. అప్పుడు మనం ఏడ్చీ మొత్తుకునీ లాభం లేదు అని చెప్పింది.

  • నిజం కల్పన గారు. అందుకే నేను ఒక్క కామెంట్ పెట్టినా ఆ అమ్మాయిని అవమానించిన ఫీలింగ్ వస్తుంది. అసలు ఏం జరిగిందో హత్య లేక ఆత్మ హత్య అన్న విషయం ఆలోచించకుండా, ఒక వైపు తండ్రి వాడే చంపాడు అని చెప్తున్న జనాలు వెంటనే ఆ చావుతో తమ ఉనికి చాటుకోవడానికి ఆతృత పడుతూ దిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. మీడియాలు వీడియోలు అయితే యాక్ తూ లాగానే ఉన్నాయి. బతకాల్సిన ఆమె పాప మీద ఫోకస్ పెట్టిన పాపాన పోలేదు. ఆమెను, స్వేచ్ఛ తల్లి తండ్రులను ఊరడించే ఆలోచన లేదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు