స్వయం శిరచ్ఛేదం

నేను ఇలాగే  ఉంటానని ఊహించలేదు కదా

నువ్వూ ఇలా మారిపోతావని   అనుకోలేదెన్నడూ

1. 

అభిప్రాయాలు మార్చుకోవడం

ప్రవాహంతో  మార్పు చెందడం

మంచిదే

 

గిడసబారి పోవడం

ఘనీభవించడం

పెళుసుగా మారి ముక్కలుగా విరిగిపోవడం కన్నా

 

ఎప్పటికప్పుడు చిగురించడం

 నూతనంగా  వికసించడం

మళ్ళీ  మళ్ళీ మనకంటిన మురికిని కడుక్కోవడం

సమకాలీనం కావడం

మంచిదే.

2.

కానీ,

తల్లివేరును వదులుకోలేము  కదా

 

మనకు జన్మనిచ్చిన తల్లి పేగు

మనకింత ముద్ద పెట్టి బతికించే కాయలు కాసిన చేతులు

మనకు అనుక్షణం ఎగరడం నేర్పే   రెక్కలు

దిక్కుతెలియని చీకటి దారుల్లో గుడ్డిదీపాల వెలుగైన చూపులు

 

ఎట్లా నరుక్కుంటాము

సర్వస్వం ధారవోసి మనల్ని పెంచిన

తల్లివేరును

 

ఎట్లా ఎండబెడతాం

అనుక్షణం మన దూప తీర్చే

నీటిఊటను

ఎంతమారినా ఎట్లా విరిచేస్తాం

మన ప్రయాణానికే   ఆధారమైన

చుక్కానిని

 

మన బతుకు నిలిపే తల్లిపాలలో

అపనమ్మకాల విషాలనెట్లా కలుపుతాం

మనకు ఉనికినిచ్చే  చెమటచేతులకు

దురభిమానాల  దుర్వాసనలనెలా అంటగడతాం

 

మన ఎదుగుదలకు పందిరైన

స్వచ్చమైన బురద కాళ్ళకు

విద్వేషపు నెత్తురునెలా పులుముతాము.

3.

వాడు అతి నేర్పరితనంతో,

అనేకానేక అసహనాల  కుట్రలతో,

మన సోయి తప్పించి

కాళ్ళకింది జాగాలను

గుంజేసుకుంటున్నాడు

మన  తలల్ని మనచేతే నరికించి

మనవి  కాని జాగాల అగాధాల్లో

మనతో ఉన్మాద నృత్యం చేయిస్తున్నాడు

వాడు

మన మెడలమీద అతికించే

ఒకే తలతో,

ఒకే రూపాన్ని ధరించి,

ఒకే విద్వేష నినాదాన్ని మంత్రంగా జపిస్తూ

ఒకే ఉన్మత్త ఊరేగింపు గా

సాగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాడు

నువ్వూ అందుకే సిద్ధమౌతున్నావా?

*

నారాయణ స్వామి వెంకట యోగి

31 comments

Leave a Reply to Narayanaswamy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అన్న….వర్తమానపు విద్వేషపు కాలాన్ని బొమ్మగీసిన కవిత… బావుంది…💐
    మొద్దు నిద్రలో ఉన్న కాలాన్ని మేల్కొల్పే కవిత

  • నేటి అసహన పాలనను ప్రజల నిస్సహాయతతో కూడిన నిర్వేదాన్ని మూలాలను మర్చిపోతున్న కొత్త తరాన్ని చూపే కవిత. అభినందనలు సర్.

  • ఇప్పటి దేశ పరిస్థితుల్లో గొప్ప కవిత మిత్రమా. ముఖ్యంగా కవితా కృష్ణన్ పత్రికా ప్రకటన చాలా అనవసరం

  • ప్రస్తుతం ఈ కవిత రేపటి సెప్టెంబర్ 17 ను సూచిస్తుంది.

    ఒకే తలతో
    ఒక రూపాన్ని ధరించి
    ఒక విద్వేష నినాదాన్ని మంత్రంగా జపిస్తూ
    ఒకే ఉన్మత్త ఊరేగింపుగా
    సాగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాడు

    దేశంలో నాటకీయంగా జరుగుతున్న విద్వేష రాజకీయాన్ని చాలా సింపుల్గా నర్మగర్భంగా మీ వాక్యాల్లో జొప్పించారు.
    ఏ తొందరపాటు లేకుండా గొప్ప ఆలోచనతో వ్యూహాత్మకంగా రాసిన కవిత.

    వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ పోయెమ్ అన్నయ్యా . అభినందనలు 💐🎉🎊💝

    • భిన్నత్వాన్ని అణచివేసి నియంతృత్వాన్ని మనతో అంగీకరింపజేసే ప్రయత్నాలు అన్ని రంగాల్లో తీవ్రంగా జరుగుతున్నాయి.
      నెనర్లు తమ్ముడూ

  • ప్రశ్నని తలకెత్తుకున్న పదునైన కవిత.. గురితప్పని నడక.. చాలా బాగుంది స్వామిగారూ

    • కవిత సూటిగా రావడం వల్ల శక్తి తగ్గిందేమో అని భయపడ్డ. కాదని భరోసా ఇచ్చినందుకు నెనరులు రమేష్ గారూ

  • చుక్కాని లేదు, స్వఛ్చమైన బురద కాళ్ళను ఎప్పుడో ఈ చేతులతో వంచించాం. తలలు తాకట్టుపెట్టి ఉత్త మొండేలతో నడుస్తున్న విషాదం.ఇక్కడ ఒక నది ఉండేదని ‘ఒక నది కథ’ను పాడుకున్నాను కదా నిదురపోని కలలో! దానికి కొనసాగింపుగా ఈ క్షణాన్ని మండించిన కవిత. వైయక్తిక గాయంలా మొదలై… సామూహిక వేదనలా, దావానలంలా విస్తరించిన కవిత. బాధగా ఉంది. అందుకే బాగుంది.

    • అవునన్నా నదులెండిపోయిన బాధ బతుకులెండి పోయిన దుఃఖం మన తలలపై నృత్యం చేస్తున్న నియంతృత్వం పాదాలు – ఎటు చూసినా ఒక వేదనాభరిత వాతావరణం –
      కవిత నచ్చినందుకు నెనర్లు అన్న

  • టైటిల్ చాలా పవర్ఫుల్ గా ఉంది. కవిత కొంత extend అయినట్టుగా తోచింది. తల్లివేరును మర్చిపోతామా అన్న ప్రశ్న ఆలోచనాత్మకంగా అనిపించింది.

    • మంచి సూచనలు పరిశీలనలు శ్రీరామ్ గారూ
      నెనర్లు

  • ఆధునిక జీవితాన్ని, వ్యాపార సంస్కృతిని, మన జీవితాన్ని మన చేతుల్లో లేకుండా చేస్తున్న సామాజికతను కళ్ళకు కట్టినట్టు చెప్పారన్నా!కవిత చాలా బాగుంది.

    • నెనర్లు తమ్ముడూ
      భిన్నత్వమే ఊపిరిగా బతుకుతున్న మననుండి మన ప్రాణవాయువును గుంజేసుకుంటున్న సందర్భమిది

  • వేళ్ళు మరిచే కొత్త తరం వెన్ను మీద చురక..
    అభినందనలు

  • వేళ్ళను మరిచే కొత్త తరం వెన్ను మీద చురక…
    Abhinandanalu

    • Thank you for your valuable response Uma. We need to raise a collective voice and create the conscience to reject authoritarian rule and hegemony that suppresses diversity. It is natural to be diverse and no one can enforce anything on anyone.

  • సమకాలీన విషాదానికి కవిత గాఢంగా అద్దం పట్టింది. బాగుంది నారాయణస్వామి గారూ…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు