స్పిరిట్ గేమ్

జీవితమనే పాఠాన్ని అధ్యయనం చేసి, అనుభవాలను రచనలుగా అందించాలనుకునే   ఓ రచయిత్రినే నేను కూడా!

రైధింగ్ చీమలు గాయాలను కుట్టుకుంటూ వెళ్లిపోతాయి. నేనూ నా జీవిత గమనంలో నా అనుభవాల చిట్టాలను, గాయాలను కుట్టుకుంటు,  కథలనే అందమైన గురుతులుగా మలచి, పాఠకులకి అందిస్తున్నాను. నా చుట్టూ జరిగే ప్రతీ సంఘటన నాకు కథా వస్తువే. నేను చూసిన ప్రతీ జీవితమూ నా కథకు ప్రేరణే. కొన్ని కథలు నాకు విజయాలను అందిస్తే, మరికొన్ని కథలు మరపురాని మధురానుభూతులు నా సొంతం చేశాయి. అవన్నీ మూట గట్టుకొని సాగిపోతున్న నా సాహితీ పయనంలో మీరూ నా తోడుంటారు కదూ!
నా కథ గురించి…
కథ అనేది, ప్రతి పాఠకుడి జీవితానికి దగ్గరగా ఉంటూ, అతడి జ్ఞాపకాలను సన్నగా మీటాలి అని నా ఉద్దేశ్యం. 
ఈ కథ మీ చిన్ననాటి అనుభూతులను మీకోమారు పరిచయం చేసి తీరుతుంది. స్పిరిట్ గేమ్ లేదా ఓజా గేమ్ ఇలా రకరకాల పేర్లతో మనం చిన్నప్పుడు ఆడిన ఆటే ఇది. దాన్నే నా కథా వస్తువుగా మలచి, ఓ హెన్రీ లా ఒక మలుపు ఇచ్చే ప్రయత్నం చేశాను. నేనూ ఒక సైకాలజీ స్టూడెంట్ని కాబట్టి, నేను చదివిన కొన్ని అంశాలతో ముగింపు ఇచ్చాను. అయితే నా అన్ని కథల్లోలాగే ఈ కథలో కూడా సత్యాన్వేషణ పాఠకుడికే వదిలేసాను. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తారు, తప్పుప్పులను సరిదిద్ది నా సాహితీ పయనంలో తోడుగా నిలుస్తారని ఆశిస్తూ..
మీ
కిరణ్ విభావరి
“అంకుల్ ఇప్పుడు బయటకు వెళ్లొద్దు మీకు ఆక్సిడెంట్ అవుతుంది”

నేను చెప్పిన మాటలు విని అంకుల్ మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనిపించింది. మళ్లీ అంతలోనే ఏమనుకున్నారో ఏమో పెద్దగా నవ్వారు. నాతో ఏం మాట్లాడకుండానే నాన్నకి బాయ్ చెప్పి వెళ్లిపోయారు.

“నాన్న మీరైనా చెప్పండి అంకుల్కి ప్రమాదముంది నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది.” నేను వారించాను

నాన్న కూడా నన్ను పట్టించుకోలేదు. ఒక వెర్రిబాగుల వాడిని చూసినట్టు ఒక చిన్న చూపు చూసి గదిలోకి వెళ్ళి పోయారు.

ఏంటి వీళ్లు నేను చెప్పిన మాటలు నమ్మట్లేదు. ఒకవేళ ‘టాకింగ్ టు హెవెన్’ పుస్తకం చదివిన భ్రమలో నన్ను నేనే టెలిపతి వచ్చిన వాడిలా ఊహించుకోవడం లేదు కదా!! అనే అనుమానం వచ్చింది.

“టాకింగ్ టు హెవెన్” జేమ్స్ వాన్ ప్రాగ్ రాసిన ఈ పుస్తకం ఆత్మల గురించి నా ఆసక్తి గమనించి బాబాయ్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ పుస్తకం నాకు అద్భుతంగా నచ్చింది.. ఇందులో రచయిత ఆత్మలతో మాట్లాడుతాడు. చిన్నప్పటినుండే రచయితకు సిక్స్త్ సెన్స్ ఉంటుంది. తన టీచర్ కొడుక్కి ఆక్సిడెంట్ అయిందని, తన సిక్స్త్ సెన్స్ ద్వారా తెలుసుకొని, టీచర్ కి చెప్తాడు. టీచర్ రచయితను  నమ్మదు. కానీ నీ కొన్ని గంటల్లోనే టీచర్ కి ఫోన్ వస్తుంది మీ అబ్బాయికి ఆక్సిడెంట్ అయింది తొందరగా వచ్చి కలవమని. అప్పుడా టీచర్ రచయితకు సిక్స్త్ సెన్స్ గురించి చెప్తుంది. నీవు అదృష్టవంతుడివి అందుకే నీకు భగవంతుడు ఈ వరాన్ని ఇచ్చాడు.. దీన్ని నువ్వు ఇంకా  ఇంప్రూవ్ చేసుకుంటే గొప్ప వాడివి అవుతావు అని రచయితని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ మాత్రం నన్ను పట్టించుకునే నాథుడే లేడు. అంకుల్ కి ఆక్సిడెంట్ అయితే తప్ప నేను చెప్పింది నాకు సిక్స్త్ సెన్స్ ఉన్నది అనే విషయం వీళ్లు నమ్మరేమో.

నాన్న ఏదో ఫోన్ కాల్ వస్తే గబగబా చొక్కా వేసుకొని బయటికి నడిచారు. అమ్మని అడిగాను ఇంత రాత్రి పూట నాన్న ఎక్కడికి వెళుతున్నాడు అని.

“రాజారామ్ అంకుల్ కి యాక్సిడెంట్ అయిందట” అమ్మ చెప్పింది .

నా పెదాల మీద  గర్వంతో కూడిన చిరునవ్వు… అంటే నాకు సిక్స్త్ సెన్స్ వచ్చిందన్నమాట. నేను నవ్వడం చూసి అమ్మ తిట్టి పోసింది. నాకు మాత్రం అవేవి చెవికెక్కడం లేదు.

***

“నేను చెప్పినట్టే మా అంకుల్ కి ఆక్సిడెంట్ అయింది రా.

పాపం నా మాట వినీ ఉంటే ఆయన ఈ ప్రమాదాన్ని తప్పించుకునే వాడేమో” జరిగిందంతా నా ఫ్రెండ్స్ కి చెప్పాను. వారు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.

“అబ్బా నమ్మే సానులే ఏది నా గురించి చెప్పు?” అని అడిగాడు రవి

నేను కొద్దిసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసినట్టు చేసి, “ఇప్పుడు నిన్న టీచర్ కొడుతుంది” అని చెప్పాను.

అదేంటో వెంటనే టీచర్ చేతిలో ఉన్న డస్టర్ ను వాడి మీదకు విసిరింది.

నా ఫ్రెండ్స్ అందరూ నోరెళ్లబెట్టారు. నాకు ఇంకొంచెం గర్వం పెరిగింది.

“ఇంకా ఏమేమి ఉన్నాయి రా బుక్కులో” స్కూలు విడిచిపెట్టక ఇంటికి వస్తుంటే నా ఫ్రెండ్స్ అడిగారు.

“చాలా చాలా విషయాలు ఉన్నాయి రా మనకి ఇవన్నీ తెలియనే తెలియవు… చనిపోయాక మనిషి  ఆత్మ అవుతాడు అని తెలుసు కదా.. కానీ ఆత్మ తో కూడా మనం మాట్లాడొచ్చు . రచయిత ఆత్మల తో మాట్లాడి వారి చావుకి కారణం లేదా ఆత్మలు ఏదైనా చెప్పాలనుకుంటే అది తెలుసుకోవడం, ఇంకా ఆత్మ  తీరని కోరికలు తీర్చి పెట్టడం చేస్తాడు. లండన్లో చాలామంది ఆత్మ లకు ఆయన సహాయం చేశాడంట.” నేను చెప్తుంటే వాళ్లు ఆసక్తిగా నోరు వెళ్ళబెట్టి వింటున్నారు.

“ఒకసారి ఆత్మ తో మాట్లాడి అతన్ని ఎలా చంపారు? ఎవరు చంపారు అనే విషయం తెలుసుకొని పోలీసులకి పట్టించాడు.” వాళ్ల ఆసక్తి చూసి నేను ఇంకా చెప్పడం మొదలుపెట్టాను.

“మనల్ని ఎంతగానో ప్రేమించే వాళ్ళు చనిపోయాక కూడా మన తోటి ఉంటారని చెప్పాడు. నాకు మా తాతగారు నాతోనే ఉన్నాడేమో అనిపించింది” అని ఆ బుక్కు లో ఉన్న మిగతా విషయాలన్నీ కూడా వాళ్లకి వివరించి చెప్పాను.

రవి , కార్తిక్ ,రాహుల్ వీరు ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్. నేను చెప్పింది వాళ్ళు నమ్మడం తో ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు.

ఈవినింగ్ ట్యూషన్ నుండి వస్తున్నప్పుడు కూడా మా మధ్య ఇదే డిస్కషన్. మాకు కూడా ఆత్మతో మాట్లాడాలని గట్టిగా అనిపించింది. ఇంకేం రేపు ఆదివారం… అమావాస్య… కార్తీక్ గాడి పెంట్ హౌస్ … రాత్రి మూడు గంటలకి … అని ప్లాన్ చేసేసాడు రవి.

“మరీ రాత్రి మూడు గంటలకా?”

“అవును అప్పుడే అయితేనే ఆత్మలు అన్నీ మనకు కనిపిస్తాయి..”

“ఇంట్లో వాళ్లు పంపిస్తారా?”

“ఎవరు చెప్తారు…?!”

“అందరూ పడుకున్నాక మెల్లగా వచ్చేయడమే..”

మా ప్లాన్ రెడీ అయింది. ఇంట్లో అందరూ పడుకున్నాక మెల్లగా లేచి కార్తీక్ గాడు ఇంటివైపు వెళ్తుంటే దారిలోనే రవి గాడు ,రాహుల్ గాడు ఎదురయ్యారు. మాకోసమే ఎదురుచూస్తున్నట్టు ఉన్నాడు మేము రాగానే మెల్లగా గేటు తీసి, చప్పుడు చేయకుండా మమ్మల్ని తన వెంట తీసుకెళ్లాడు కార్తీక్.

అది పెంట్ హౌస్ అనే మాటే గాని.. ఒక చిన్న స్టోర్ రూమ్ లా ఉంది. పక్కన మన ఏవేవో పనికిరాని వస్తువులు పడేసి రూమ్ మధ్య భాగంలో మాత్రం కొద్దిగా స్థలం ఉంది ఎక్కడా కిటికీ అన్నదే లేదు. మాకు కావలసింది కూడా ఇదే కదా…. అనుకుంటూ… లోపలికి వెళ్లి, తలుపు వేసి, ముగ్గురం గుండ్రంగా కూర్చున్నాం.

చిమ్మ చీకటి… ఏం కనిపించడం లేదు. రవి గాడు తన పాకెట్ లో ఉన్న అగ్గి పెట్టి తో క్యాండిల్ వెలిగించాడు. దాని వెలుగు చుట్టూ కూర్చుని ఒకరి చేతిలో ఒకరు చేతులు పెట్టుకొని, ఎవరినైతే ఆహ్వానించాలి అని అనుకున్నాము ఆ ఆత్మ పేరు 20 నిమిషాలపాటు ధ్యానం గా పిలవాలి. దీనినే స్పిరిట్ గేమ్ అంటారు.

మేము ముగ్గురం భయస్తులం కాకపోయినా, ఎందుకో కొద్దిగా చెమట్లు పడుతున్నాయి. కానీ మా అందరికీ ఒకటే కోరిక ఆత్మను చూడాలి.

మేము పిలవబోయే ఆత్మగా హీరోయిన్ అనూష ని ఎంచుకున్నాము. ఆమె తన బాయ్ఫ్రెండ్ చేతిలో అత్యంత దారుణంగా చనిపోయింది అని వార్తలు వస్తున్నా, ఆమెను చంపింది మాత్రం ఎవరో సినిమా పెద్దలు అని వాళ్ల అమ్మగారు చెప్తున్నారు.

ఈ నిజం నిగ్గు తేల్చి, ఆమె వాళ్ళ అమ్మగారికి సహాయం చేయాలని మేము నలుగురం ఈ సాహసానికి పూనుకున్నాము.

నిజానికి మేము ఏడో తరగతి పిల్లలమే అయినా, ఆమె పై జరిగిన అత్యాచారం, హత్య మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసింది. ఏ నలుగురం కలిసిన ఇదే విషయం మాట్లాడుకుంటున్నాం. అందుకే ఈ విషయాన్ని నిగ్గు తేల్చాలని నిర్ణయించుకున్నాము.

నలుగురం కళ్లార్పకుండా ఆమె పేరును పిలుస్తూ, చాలా ధ్యానంగా క్యాండిల్ నే చూస్తూ కూర్చున్నాము. పది నిమిషాలు గడిచింది. కళ్ళు నొప్పి పెడుతూ నీళ్ళు కారుతున్నాయి అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా చేతిలో చేయి వేసుకుని ఒకరినొకరు పట్టుకొని కూర్చున్నాము.

ఇంకొక ఐదు నిమిషాలు గడిచాక, రూమ్ అంత చల్లగా అయింది. క్యాండిల్ లైట్ పెద్దగా వెలగడం మొదలు పెట్టింది. ఆ వెలుగు ఒకసారి కుడివైపుకి, మరోసారి ఎడమవైపుకి పూర్తిగా  వంగి, చప్పున ఆగిపోయింది.

మా అందరి వెన్నుల్లో వణుకు పుట్టింది. భయంతో బిగుసుకు పోయాము. ఏదో చిన్న కాంతి అటు ఇటు తిరుగుతూ ఆ గదిలో చీకటి లో తచ్చాడుతోంది.

“ఒరేయ్  మీకు ఆ వెలుగు కనిపిస్తోందా?” అని అడిగాను.

“అవును రా అదిగో అటు ఇటు కదులుతోంది?” రవి గాడు చెప్పాడు మిగతా వాళ్లకు కూడా అదే కనిపిస్తోంది. ఆ కాంతి అనూష ఆత్మని ఫిక్స్ అయిపోయి, భయంతో బయటకు పరుగు పెట్టాము.

అదేంటో ఎంత గింజుకున్నా స్టోర్ రూమ్ తలుపు రావట్లేదు బిగుసుకుపోయి ఉంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ గట్టి గట్టిగా అరుస్తూ అందరం కలిసి డోర్ లాగాము. చిత్రంగా తలుపు తెరుచుకుంది ఇక అంతే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి పరుగులు పెట్టాము.

మరు నాడు మా నలుగురికి మహా చెడ్డ జ్వరాలు వచ్చాయి.

హాస్టల్ నుండి వచ్చిన మా అక్కకు ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాను. ఆమె ఏదో పెద్ద జోక్ విన్నట్లు పెద్దగా నవ్వింది. అంతేలే మా భయాలు, మాకు జరిగిన అనుభవాలు మావి… ఎదుటివారికి ఏం తెలుస్తుంది?

“ఎందుకు నవ్వుతున్నావ్?” కోపంగా అడిగాను.

“మరి నవ్వక ఏం చేయమంటావు రా చింటూ??”అక్క ఇంకా నవ్వుతూనే ఉంది. దీనికి చెప్పి తప్పు చేశానేమో అనిపించింది.

“ఆ గదిలో ఒక్క కిటికీ కూడా లేదు మీరు తలుపు వేసుకున్నారు కాబట్టి.. గాలి కూడా  చొరబడే అవకాశం లేదు. గాలి లేనప్పుడు ఆక్సిజన్ ఉండదు దాంతో క్యాండిల్ ఆరిపోయింది. ఆక్సిజన్ లేనప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు ఇల్యూషన్ ని క్రియేట్ చేస్తుంది. మీరు చూసిన కాంతి కూడా ఒక ఇల్యూషన్. అలానే మీరు చాలా సేపు క్యాండిల్ ని చూశారు  , తర్వాత చిమ్మ చీకటి, ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లేక మీకు కాంతి ఊగిసలాడుతు కనిపించింది. చలికాలం కాబట్టి  తలుపులు బిగుసుకుపోతాయి. అందుకే మీరు ఎంత లాగినా తలపులు రాలేదు.” అంటూ మా అమాయకత్వం మీద జాలి చూపించింది.

ఏదో సైకాలజీ చదువుకుంది కదా నాకున్న టెలిపతి గురించి నమ్ముతుంది ఏమో అని చెప్పాను.

“మరి  అంకుల్కి నేను చెప్పినట్టే యాక్సిడెంట్ అయింది కదా?” దానిని ప్రశ్నించాను.

“ఆరోజు నాన్న ,రాజా రాం అంకుల్ కలిసి పార్టీ చేసుకున్నారు. ఫుల్ గా తాగి ఉన్నారు. నువ్వు ఆ పుస్తకం చదివిన ట్రాన్స్ లో ఉండి, యాక్సిడెంట్ అవుతుందని చెప్పగానే అంకుల్ కొద్దిగా నమ్మారు… అయినా పట్టించుకోకుండా తాగి డ్రైవ్ చేశారు. ఆ మత్తులో నువ్వు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఉంటాయి అదే భయంతో యాక్సిడెంట్ చేసుకున్నారు. అంతే” అది నవ్వుతూ చెప్పింది.

దాంతో నేను ఇంకా ఏం మాట్లాడ దలుచుకోలేదు. మరి క్యాండిల్ ఎందుకు కుడి వైపుకు వంగి మళ్ళీ ఎడమవైపుకు పూర్తిగా వంగాక, మధ్యలో కాసేపు నిలిచి ఆగిపోయింది?? అనే ప్రశ్న నాలో నేనే  ఉంచేసుకున్నాను.

*

కిరణ్ విభావరి

8 comments

Leave a Reply to Paramdamaiah Tirugabattin Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కధలు రాద్దామన్న ఉద్దేశం మంచిది . ప్రయత్నం గొప్పది. నా అనుభవం లో సాహిత్యం ఒక ఉత్పత్తి. వస్తువు. ప్రజలు తమకి పనికొచ్చే వాటినే కొంటారు. తాత్కాలికంగా కాసులో కీర్తో దొరకొచ్చు. కథ ప్రయోజనం అర్ధం కాలేదు

    • ప్రతీ సారి పనికొచ్చే, కంచికి చేరే కథలు రాయడం కుదరదు కదండీ.. ఒక వినూత్న ప్రయత్నంగా రాశాను.
      మీ సమీక్షకు ధన్యవాదాలు అండి

  • ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్
    ఓ ఫ్లైట్ ప్రమాదం జరిగితే
    కొన్నాళ్ళు వరుసబెట్టి అవే..
    అట్లానే ట్రైన్లూ..
    అంతర్వాహినిగా ప్రవహించే ఆలోచన్ల భయం మనిషి నుంచీ మనిషికి..
    ముగింపు అలా రాయడమో మంచి ఎత్తుగడ..
    పాఠకుల ఊగిసిలాట.. శాస్త్రం
    నమ్మకాల లోలాలకపు డోలాయమానంలో..

  • బాగుంది కథ . చిన్న సంఘటన … అలా అలా చదివించేసింది .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు