ఈమధ్య ఒక దారుణాతి దారుణమైన సంఘటన జరిగింది. కులం, డబ్బుతో మదమెక్కి తమ వద్ద పనిచేస్తున్న ఒక దళితుడిని ఫోన్ కాజేసాడన్న నెపంతో చావచితకబాది గుండు గీసారు. పరమ క్రూరమైన మనుషులు వాళ్లు. ఇదే అనాగరిక సమాజం అయితే, మన కోసం మనం ఒక రాజ్యాంగమో, చట్టాలో ఏర్పాటు చేసుకోనట్టైతే…వాళ్లను అడ్డంగా నరికి కారం కూరినా సరిపోదనొచ్చు.
ఈ దారుణానికి ఒడిగట్టిన దుష్టుల్లో ఒక మహిళ ఉంది. పురుషస్వామ్య వ్యవస్థను జాగ్రత్తగా నెత్తిన పెట్టుకుని మోస్తున్న స్త్రీ ఆమె. కర్ర తీసుకుని అతన్ని ఎడా పెడా కొట్టింది. అది చూస్తున్నవాళ్లెవ్వరికైనా ఆమెని జుట్టు పట్టి ఇవతలకి లాక్కొచ్చి ఆ లెంప ఈ లెంప వాయించి పారేయాలనిపిస్తుంది…అందులో సందేహమే లేదు. స్త్రీ అనే కనికరం కూడా అక్కర్లేదు, ఆమె బావిలో కప్పనీ, పురుషస్వామ్య వ్యవస్థ చేతిలో ఆయుధమనీ తెలిసినా సరే!
ఆమె అలా కొడుతున్నప్పుడు అతనికి బాధ, కోపం…ఓర్వలేక లకారాలతో బూతులు తిట్టాడనుకుందాం. మనం అర్థం చేసుకోవచ్చు. అది అతని భాష. అతనికి అదే వచ్చు. కోపమొస్తే లకార, మకారాలే తప్ప మరో రకంగా ఎలా ప్రదర్శించాలో తెలీదు. పూర్తిగా న్యాయమైన విషయం. అతను అలా తిట్టుంటే తప్పు లేదు. ఎంచడానికీ లేదు.
ఈ విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది. చెలరేగిపోయారు. ఆమెని నానా బూతులు తిడుతూ…ఆమెకు, ఆ దళితుడికి రంకు అంటగట్టి…అది బయటపడిపోతుందనే కాబోలు కొట్టిందనీ లకార మకారాలేమిటి..కడుపులో, నోట్లో ఉన్న కుళ్లంతా వాంతులు, విరేచనాలు చేసుకోవడం మొదలెట్టారు.
అతను ఏమైనా అనుంటే అర్థముందిగానీ మీరెందుకు అలా తిడుతున్నారు? అది తప్పు అని చెప్తే…అందులో ఏం తప్పు? మాకొచ్చిన భాష ఇదే… మేమిలాగే తిడతాం అంటున్నారు. ఆమె తప్పు చేసింది కాబట్టి బూతులకు అర్హురాలు అంటున్నారు. ఇలా అన్నవాళ్లల్లో దళితులే ఎక్కువ. మగవారే ఎక్కువ.
ఈ దరిద్రం చూసి కొంతమంది స్త్రీలు, ఒక స్త్రీని అలా తిట్టడం తప్పు అన్నారు. వీళ్లలో దళిత స్త్రీలూ ఉన్నారు. అగ్రవర్ణాల స్త్రీలూ ఉన్నారు.
ఈ మొత్తం విషయం మీద పెద్ద రభస జరిగింది.
ఇక్కడ మాట్లాడుకోవలసినవి కొన్ని విషయాలున్నాయి.
ఒకటి ఆమె చేసిన పని… రెండోది ఆమెను అందరూ బూతులతో దాడి చెయ్యడం.
ఆమె చేసిన పనిని ఎవ్వరూ సహించరు. కానీ సోషల్ మీడియాలో పరమ నాగరికులుగా వ్యవహరిస్తూ, రోజువారీ పోస్టుల్లో సాధారణ భాషలో మాట్లాడుతూ, కోపమొచ్చినప్పుడు కూడా బూతులు లేకుండా నాగకరిమైన భాష మాట్లాడుతూ…ఇప్పుడు, దెబ్బలు తిని అన్యాయమైపోయిన ఆ మనిషిని అడ్డు పెట్టుకుని, స్త్రీల మీద మీకున్న విద్వేషాన్ని అంతా బయటకు కక్కుతూ ఆమెని బూతులు తిడుతున్నారంటే మిమ్మల్నేమనాలి? మీ భావజాలాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఆమె చేసిన పని తప్పేగానీ మీరు ఆమెని అలా బూతులు తిట్టడం కూడా తప్పే. మీ భాష తప్పు అంటుంటే మళ్లీ మా భాష ఇదే అంటారేంటి? బూతులు మీద సర్వాధికారం ఉన్నట్టు మాట్లాడతారేంటి? మేమూ అలాంటి అవమానాలు పడ్డవాళ్లమే అంటారా? మరి స్త్రీలుగా మేమూ పడ్డాంగా అంతకుమించిన అవమానాలు! వాటి మాటేమిటి?
ఈ దేశంలో అందరికన్నా ఎక్కువ అవమానాలు పడేది దళిత స్త్రీలే…కుల వివక్ష, జెండర్ వివక్ష ఈ రెంటికీ బలైపోతున్నవాళ్లు దళిత మహిళలు. ఎంత కోపమొచ్చినా, ఎంత అవమానపరచినా సోషల్ మీడియాలో వీళ్లు బూతులు తిట్టడం చూడలేదే!! మరి వీళ్లెందుకు మీలాగ అది మా భాష, మా హక్కు అని సిద్ధాంతాలు, రాద్ధాంతాలు చెయ్యట్లేదు?
మా వాదన ఏమిటి? సరిగ్గా వినండి ముందు… చీమ చిటుక్కుమన్నా, మిన్ను విరిగి మీదపడినా…అటు తిరిగి, ఇటు తిరిగి ఆడవాళ్ళని బూతులు తిట్టడం దగ్గరే ఆగుతున్నారు. మీ మీ లోలోపల ఉన్న పురుషస్వామ్య భావజాలమంతా బయటికి వస్తోంది. ప్రతీ విషయములోనూ అమ్మ, ఆలి జేసి తిట్టడమే. అప్పటికిగానీ మీకు మనశ్శాంతి దొరకట్లేదు. మీ బలమంతా మీ మీ అంగాల్లోనే ఉంది, అదే “మగతనం” అనుకుంటూ…ఆడవాళ్ల శీలానికి ఇంకా పవిత్రను అద్దుతూ, స్త్రీలను ఇంకా వస్తువులుగా, ఆస్తులుగా చూస్తూ…ఆస్తులను చెడగొడితే పరువు, మర్యాదలు పోయినట్టుగా భావిస్తూ…అంగాలు లోపలికి దూరిస్తే మీది పై చేయి అన్నట్టు భావిస్తూ…బూతులు తిట్టడాన్ని సమర్ధించుకుంటూ….ఆ బురదలోనే పొర్లుతూ…బురద మంచిదే అని కూడా వాదిస్తున్నారు. అతనికి ఆమెకు సంబంధం అంటగడుతూ “ఆమె రంకు బయటపడింది” అంటున్నారు. ఇంత బాధలో, ఇంత దారుణంలో కూడా మీకు కనిపించింది అదే. మీ బాధను వెళ్లగక్కడానికి ఆమెను చెరిచేయాలి. దిక్కుమాలిన శీలానికి పవిత్రత తొడగాలి. ప్రస్తుత విషయంలో కూడా.. ఆడదై ఉండి ఎలా కొట్టిందో అంటూ మొత్తం ఫోకస్ అంతా ఆమెపై పెట్టి ఆమెని బూతులు తిట్టడంలో నిమగ్నమైపోయారు. అక్కడ జరిగిన మొత్తం విషయం కన్నా ఆమె అతన్ని కొట్టడం మిమ్మల్ని ఎక్కువ బాధించింది. అతనికి జరిగిన అన్యాయం కన్నా ఆమె అతన్ని కొట్టడాన్నే తట్టుకోలేకపోతున్నారు. అది తప్పు అన్న స్త్రీలను కూడా బూతులు తిట్టి, వాళ్లను హేళన చేసి, అవమానిస్తేగానీ మీకు తృప్తి లేదు.
మీ అందరికీ ఒక స్త్రీ పరువు ఒక బూతు బరువు! ఇందులో మాత్రం కుల, మత, వర్గ భేదం లేకుండా ఐకమత్యం పాటిస్తున్నారు.
పైగా బూతులు అగ్రవర్ణాలవాళ్లు తిడితే ఒకలాగ, దళితులు తిడితే ఒకలాగ తీసుకోవాలని సిద్ధాంతీకరిస్తున్నారు.
మీ అభ్యుదయాలకో నమస్కారం!
తెనాలి రామకృష్ణ సినిమా చాలామంది చూసే ఉంటారు. కనీసం కథైనా విని ఉంటారు. సరే చిన్నగా చెప్తాను. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తాతాచార్యులు అనే ముసలి కవికి, తెనాలి రామకృష్ణుడుని చూస్తే మంటగా ఉండేది. ఎలాగైనా ఏడిపించాలని, రాయల ఆస్థానం నుంచీ తప్పించాలని ఆరాటపడుతుండేవాడు. ఓరోజు తలుపు దగ్గర కాపలి కాసేవానికి “కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్” అనే ప్రహేళికను ఇచ్చి తె.రా.లింగడిని అడగమంటారు. పాపం ఈ రాజకీయాలేవీ తెలియని ద్వారపాలకుడు అడిగేస్తాడు. అతను కచ్చితంగా దిగువ కులస్తుడే. అప్పుడు రామలింగడు “గంజాయి తాగి ఉన్నావా లంజల కొడకా! ఎక్కడి కుంజర యూధంబు దోమకుత్తుకజొచ్చెన్?” అంటాడు. పాపం ఆ ద్వారపాలకుడు తప్పైపోయింది స్వామీ క్షమించండి అంటాడు. ఇదే ప్రశ్న రాయలు అడుగుతాడు. ప్రభూ, స్వామీ అంటూ ఆ చమత్కారాన్ని విప్పిజెప్పి రాయల ప్రశంసలు పొందుతాడు. రాయలను బూతులు తిట్టలేదు. ఒకవేళ ఇది తాతాచార్యులే నేరుగా అడిగున్నా బూతులు తిట్టుండేవాడు కాదు. అక్కడ బూతులు పూర్తి స్ఫృహతో కావాలని ద్వారపాలకుడిని తిట్టాడు. అది మదం. ఎంత గొప్పవాడైతేనేం… సాటి మనిషికి గౌరవరం ఇవ్వలేనివాడి, స్త్రీని ఆస్తి అనుకున్నవాడి వివేకం, చదువు మంటల్లో తగలబడింది అనుకోవాలి. సరే, ఆ కాలంలో అంత వివేకం లేదనుకుందాం. అది చదువు కాదని, ‘విద్య’ రూపురేఖలు మనం మార్చుకున్నాం. దాన్ని చరిత్రగానే చూద్దాం. అంటే ఈ సందర్భాన్ని, ఈ విషయాన్ని మర్చిపోవడం కాదు కదా! అది ఇప్పటి సందర్భాలతో పోల్చుకుని మనమెంత ముందుకెళ్లామో అని తరచి చూసుకోవాలి. అందుకు చరిత్రను చదువుకోవాలి. ఇది కథే అనుకున్నా…కథలు అప్పటి సామాజిక పరిస్థితులను చెప్పడానికీ, యథాస్థితి మారకుండా ఉండడానికి రాస్తారు కాబట్టి ఈ కథలో చరిత్రనే చూడాలి.
సరే, ఈ కాలంలో సంగతులు చూద్దాం. ఆమధ్య స్కైబాబా “దెంగేయ్” అని ఒక కవిత రాసారు. అది ఒక ఉద్యమ నేపథ్యంలో రాసిన కవిత. ఉద్యమాన్ని గానీ, అతని ఆక్రోశానీ గానీ, కోపాన్ని, బాధనీ గానీ తక్కువ చేసే ఉద్దేశం లేదు. కానీ అతను చదువుకున్నవాడు, వివేకవంతుడు, ఉద్యమంలో ఉన్నవాడు….ఒకరిని తిట్టడం కోసం మళ్లీ స్త్రీనే కించపరిచే భావజాలం కావలసి వచ్చిందంటే మనం వివేకం, చదువు ఏమైపోయాయనుకోవాలి? భావజాలంలో అప్పటినుంచీ, ఇప్పటికి మనం ఏం మారామని?
చదువు, జ్ఞానం మనకేమివ్వాలి? మన భావాలను మన చేతిలో ఉంచుకోగలిగే శక్తిని ఇవ్వాలి. తీవ్రమైన భావావేశాలు కలిగినప్పుడు వాటిని విచక్షణతో అంతే తీవ్రంగా పదునైన మాటల్లో చెప్పగలిగే వివేకాన్ని ఇవ్వాలి. మాటల్లో తీవ్రత అంటే బూతులు కాదు.
నామిని సుబ్రమణ్యం నాయుడి మిట్టూరోడి కథలు చదివే ఉంటారు చాలామంది. ఆ పుస్తకం నాకొక గగుర్పాటు. అందులో భాష నాది కాదు. దాన్ని ఒప్పుకునే పరిణితి అప్పటికి లేదు. అది చదివాక వచ్చింది. ఎందుకొచ్చిందంటే అది ఆయన భాష అనీ, దానికి గౌరవం ఇవ్వాలని వివేకం నాకు కలిగింది కాబట్టి. నామిని కథల్లో అతని చిన్నప్పటి సంగతులు రాస్తూ…అమ్మని “లంజా ఇటు రావే” అని రాస్తారు. ఇదే వ్యాక్యం కాకపోయినా, ఇదే భావం. అమ్మని లంజ అనడం…కళ్లు పేలిపోతాయన్నంత పెద్ద విషయం నాకు. తన తల్లి గురించీ, వాళ్ల కష్టాల గురించి, అప్పటి సామాజిక పరిస్థితుల గురించీ, ప్రాంతీయ పరిస్థితుల గురించి రాస్తారు. పుస్తకం చదువుతూ ఏడ్చాను. నా పుస్తకంలో ప్రతీ పేజీ తడిసిందంటే అతిశయోక్తి కాదు. ఈ విషయాలను వాళ్ల సహజసిద్ధమైన భాషలో కాకుండా నాకొచ్చిన, నేను నాగరికం అనుకున్న భాషలో రాసుంటే నేను ఏడ్చి ఉండేదాన్ని కాదు. ఆ భాష, వాళ్ల పరిస్థితులకు అద్దం పట్టినట్టు చూపిస్తుంది. అదే నిజం. అదే రాయాలి. అది తప్పు అని ఎవరైనా అంటే వాళ్ళని చూసి జాలిపడాలి. ఆయన రాసిన సందర్భం, అక్కడి ఆచారవ్యవహారాలు అలాంటివి.
అయితే, నామిని “ఇస్కూలు పిల్లకాయల కథ”, “చదువులా చావులా” లాంటివి రాసారు. అందులో భాష గమనించండి. బూతులు ఉండవు. కానీ అదే వస్తు తీవ్రత. చదువులా, చావులా చదివి చలించిపోయాను. ఈ పుస్తకంలో ఒక్క బూతు పదం కూడా ఉండదు. ఎందుకు? నామిని భాష ఎందుకు మారింది? ఈ పుస్తకాల్లో వస్తువుకు అతను ఎంచుకున్న భాష ఎందుకు మారింది? దీనికి జవాబు మీకు తెలిస్తే మీకంటిన బురద మీకు కనిపిస్తుంది.
నా వ్యక్తిగత విషయం ఒకటి చెప్తాను. “చండాలం” అనే పదం నా నోటి ముందుండేది. నాకు తెలిసిన భాష అదే. నా చుట్టూ ఉన్నవాళ్లందరూ వాడే భాష, నేను విన్నది, మాట్లాడినది. జంధ్యాల సినిమాల్లో కామెడీలకి పడి పడి నవ్వేదాన్ని. పింజారీ పీనుగా అని తిట్టడం ఓ గొప్ప విషయంగా భావించేదాన్ని. నా భాష అదే. ఇప్పుడు పొరపాటున కూడా ఈ మాటలు నా నోటంట రావు. దీనికి నేను శ్రమ పడ్డాను. కావాలని, మనస్ఫూర్తిగా ఆ భాషను మార్చుకున్నాను. ఎందుకంటే ఆ భాష తప్పని, అది సాటి వ్యక్తిని అవమానించేదని తెలుసుకున్నాను కాబట్టి. పింజారీ అని తిట్టడం తప్పని, అది ముస్లింలలో ఒక కులం అనీ, ఉప్పర అని కూడా తిట్టకూడడని, కులం పేరుతో అవమానించడం, తిట్టడం తప్పనీ సోషల్ మీడియాలో నాకు ఈ పదాలు కనిపించిన చోటల్లా ఒక ఉద్యమంలా రాస్తూ వచ్చాను. ఎన్నిసార్లు రాసానో లెక్క లేదు. నేను చెప్పాక తెలుసుకున్నావాళ్లు ఆ పదాలు వాడడం మానేయడం కూడా గమనించాను. జంధ్యాల సృష్టించిన కామెడీలో అంగవైకల్యాన్ని, కులాన్ని, మతాన్ని హేళన చేసేవి ఎన్నో ఉన్నాయని గ్రహించాను. తరువాతెప్పుడూ వాటికి నవ్వు రాలేదు.
అయితే అసలు బూతులు వాడనేకూడదా? దీని సంగతి కూడా చూద్దాం. సోషల్ మీడియాలో ఈ బూతుల గోల తట్టుకోలేక గత ఏడాది స్వాతి వడ్లమూడి ఒక కవితా రాసారు.
“మా శరీరాలు మీ పెరట్లో ముర్రా జాతి గేదలైనప్పుడే
మా గర్భాలు మీ వంశాలకు ఇంక్యుబేటర్లైనప్పుడే
మా బిడ్డలు మీ మగతనాలకు అడ్రసులైనప్పుడే
మా నిషిద్ధ శృంగారాలు మీ విల్లులో అమ్ములైనప్పుడే
అవేవీ మావి కాకుండా పోయాయివాటికి జరిగే అవమానాలు మావెలా అవుతాయి?
లంజలమైనా పూకులమైనా మీకే, మాకు కాదు
మాదికాని యుద్ధానికి మేము రాము”…..పొమ్మంది.
ఇందులో బూతులే బూతులనీ గుండాపిండైపోయారు “మగానుబావులు”. ఇందులో బూతెక్కడుంది అసలు? బూతు పదాలున్నాయిగానీ బూతేది? భూతద్దంల్లో వెతికి చూసినా బూతు కనిపించదు. బూతు పదాలన్నీ బూతులు కావు. ఎప్పుడైతే వాటిని అవతలివాళ్లని అవమానించడానికి వాడతావో అప్పుడే అవి బూతులవుతాయి.
అవమానించడానికే వాడినప్పుడు, కనీసం వాడిన మనిషి నేపథ్యం బూతుల వాడకానికి సమర్థింపుగా ఉండాలి. అప్పుడు కూడా మనం ఒప్పుకోవచ్చు. చావచితకబాదుటుంటే ఆ దళితుడు ఆమెను తిట్టాడంటే మనం ఊరుకోవచ్చు. రాద్దాంతం చెయ్యక్కర్లేదు. అది అతని భాష అని సర్ది చెప్పుకోవచ్చు. కానీ అతనికి పాపం ఆ పరిస్థితుల్లో అంత ధైర్యం కూడా వచ్చుండదు. మీరు మాత్రం అతని పేరు పెట్టుకుని స్త్రీలను బూతులు తిట్టడం.
భాష ఎప్పుడూ సందర్భానికి తగ్గట్టుగా ఉండాలి. లేదా అక్కడ ప్రస్తావిస్తున్న ఆచార వ్యవహారాలకు సంబంధించినదైనా ఉండాలి. భాష అనంతం. అందులో ఎన్నో పదాలుంటాయి. కానీ మనం రాసేటప్పుడు కొన్నే పదాలను ఎంచుకుంటాం. కారణం..ఆ సందర్భానికి సరిపోవాలని, మన భావన సరిగ్గా తూకం వేసినట్టు తెలియజేయగలగాలని. ఒక్కోసారి, ఒక్క పదం కుదరక ఆగిపోయిన వాక్యాలెన్నో ఉంటాయి. రాయలనుకున్నది ముందుకి కదలనే కదలదు. ఆ పదం దొరికే వరకు మనశ్శాంతి ఉండదు. ఏదో ఒక పదం రాసేస్తే సరిపోతుందిలే అని అనుకోము కదా! బూతులు రాయం కదా!
భాష చాలా విలువైనది. అది లేకపోతే అభివృద్ధి లేదు. అభివృద్ధితో పాటూ మన భాష మారాలి. ఇదొక నిరంతర ప్రవాహం.
భావస్వేచ్చ, భావప్రకటనా స్వాతంత్ర్యం అంటే బూతులు తిట్టడం కాదు. మన స్వేచ్ఛ గురించి మాట్లాడేటప్పుడు అవతలివారికీ అంతే స్వేచ్ఛ ఉంటుందని, దానికి భంగం కలిగించకూడదని గుర్తెరిగి ఉండాలి. Aggressiveness కి assertiveness కి ఉన్న తేడా తెలుసుకోవాలి. తీక్షణంగా, తీవ్రంగా మన భావాలు చెప్పడం వేరు. కించపరుస్తూ, తిడుతూ చెప్పడం వేరు.
ఇదే విషయంపై మనకు ఆవలి ప్రపంచంలో పశ్చిమ దేశాల్లో కూడా “స్లట్‌వాక్” పేరుతో బూతులపట్ల నిరసనలు చేసారు. మేము స్లట్స్ అని ప్రకటించారు. దాన్ని ఒక అవమానంగా భావించకపోతే ఇంక తిట్టుగా ఉపయోగించలేరు కదా అన్నది అక్కడ ఉద్దేశం. ఇందులో ఒక చిక్కుంది. సెక్స్ వర్కర్లు, నల్లజాతి స్త్రీలు, మనదేశంలో అయితే దిగువ కులాలవాళ్లు ఈ మాటను ఇంత తేలికగా అనలేరు. వీళ్ల మీదే ఎక్కువ అత్యాచారాలు జరుగుతాయి. వీళ్లే ఎక్కువ అన్యాయాయలకు గురవుతారు. వాళ్లు ఆ మాట అనలేనప్పుడు, ఈ నినాదం మొత్తం స్త్రీలకు వర్తించనప్పుడు మనకు మనమే వివక్షను ఆహ్వానిస్తున్నట్టు. ఇలాంటి నినాదాలిస్తున్నప్పుడు ముఖ్యంగా మనలాంటి దేశాల్లో మరింత జాగ్రత్త వహించాలి. ఆ ఎరుకతో చెప్తున్న మాట….మేము లంజలం కాము. స్వాతి అన్నట్టుగా లంజలమైనా, పూకులమైనే మీకే వర్తిస్తాయి కానీ మాకు కాదు.
ఈ సందర్భంగా మరో ముఖ్య విషయం చెప్పాలి. మళ్లీ ఇవన్నీ అగ్రవర్ణ స్త్రీల భావనలు అని కయ్యానికి కాలుదువ్వడానికి తయారుగా ఉన్నవాళ్లకు….సోషల్ మీడియాలో ప్రస్తుత సందర్భంలో బూతులను నిరసించినది ఎక్కువగా దళిత మహిళలే. కాబట్టి మళ్లీ మమ్మల్ని కులం పేర్లతో విడదీయాలనే క్షుద్ర పన్నాగాలను మడిచి జేబులో పెట్టుకోండి. మేమంతా కలిసి నడవాలనుకుంటున్నాం. మేము ఎదుర్కొంటున్న వివక్షల విషయంలో స్థాయీ భేదాలు ఉన్నప్పటికీ మేమంతా పితృస్వామ్యంలో అవమానాలను ఎదుర్కొంటున్నవాళ్లమే. బూతులను ముక్త కంఠంతో నిరసిస్తున్నాం. మేము ఎదుర్కొంటున్న అవమానాల్లో స్థాయీభేదాలను గుర్తెరిగి, వాటిని ఆ యా తీవ్రతలతో ఖండిస్తున్నాం.
ప్రస్తుత సందర్భంలో మరొక వాదన కూడా పైకి వచ్చింది. అన్నిటికీ బూతులు తిట్టడం, ఎలాంటి విషయాలైనా బూతుల దగ్గర ఆగడం నిజమే, ఖండించాల్సిందేగానీ ఈ సందర్భంలో బూతులకు మద్దతిస్తూ బూతులు తిడుతున్నవాళ్ల వెనక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవాలి అంటున్నారు. సోషల్ మీడియాలో బూతులు తిడుతూ చేస్తున్న ట్రోల్లింగ్ వెనకాల ఉన్న బాధను అర్థం చేసుకోవాలి అంటున్నారు. ఈ సందర్భంలో మనం జరిగిన అన్యాయాన్ని ఖండించాలి, దానిపై దృష్టి పెట్టాలి కాబట్టి ఇప్పుడు ఈ ట్రోలింగ్ గురించి రభస చెయ్యకుడా ఉండడమే మంచిదని కొందరు అన్నారు. ఈ వాదన కొంతవరకూ నిజమే! నేను ఒప్పుకుంటున్నాను. కానీ అతనికి మద్దతుస్తున్నామన్న పేరుతో బూతులు మా హక్కు అని సిద్ధాంతీకరిస్తున్నవాళ్లకు “మేము లంజలం కాదు” అని చెప్పడం, బూతుల పేరుతో పురుషస్వామ్యానికి కొమ్ము కాస్తున్నారని అని వేడి చల్లారకముందే చెప్పడం కూడా అంతే ముఖ్యం అని గట్టిగా నమ్ముతూ….దీని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇంతకుముందు కన్నా గట్టిగా మాట్లాడదాం.
*
చాలా నిర్మొహమాటం, ధైర్యం రంగరించిన వ్యాసం.
తెలుగు ప్రేక్షకులు పడిపడి నవ్వటానికి
“తమ అభిమానహీరో వౌఅసులో ఎంతో పెద్దవాడైన కమేడియన్ ని పెద్ద కారణం లేకుండా లెంపకాయలు కొట్టినా” చాలు. If Audience are mentally tuned to enjoy a Humiliation, that itself becomes an accepted comedy.
Jandhyaala is not an exception.
Part of his Comedy pieces are outdated.
Bravo.
బ్రేవ్ ఎక్స్ప్రెషన్ అండి . మంచి విశ్లేషణ .
నిర్మోహమాటంగా, ఖచ్చితంగా మరియూ సహేతుకంగా మీ అభిప్రాయాన్ని రాసారు. నేను సమర్థిస్తున్నాను మరియూ అభినందిస్తున్నాను.
చాలా బాగుంది మేడమ్… విలువలు తెలిసిన వారికే విలువ ప్రాధాన్యత తెలుస్తుంది అనే విషయం మీ article చదివిన వారందరూ తెలుసుకుంటారు.
“… తీక్షణంగా, తీవ్రంగా మన భావాలు చెప్పడం వేరు. కించపరుస్తూ, తిడుతూ చెప్పడం వేరు.”
Very apt.
అర్ధవంతమైన..అవసరం అయిన article. అతిముఖ్య విషయాలతో ప్రవాహంలా సాగింది. బాగా చదువుకుని, మేధావులం అనుకుంటూ రచనలు చేసే ‘ఎందరో’ కూడా బూతులు కు తమ రచనల్లో స్థానం కల్పిస్తూనే ఉన్నారు. కేంద్రబిందువు తిరిగి ఆడదే. విచిత్రం ఏంటంటే ఇలా మాట్లాడకూడదు అంటూనే ఆ బూతులు కేవలం స్త్రీ కోసమే అన్నట్టు link చేస్తూ రాయడం. అసలర్ధం కాదు నాకు . మీరన్నది నిజమే. ఆ రచనకు తగ్గట్టుగా అతి కొద్ది మంది మటుకే వాడారు.
మంచి ఆర్టికల్ చదివిన తృప్తి.
Beautiful! Straight and succinctly said Sowmya garu!
Congratulations.