వృద్ధ మహిళల నుండి పసిపాపల వరకు వారిపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలు, హింస, హత్యలు సామాన్యజనాలకి తట్టుకోలేని ఆవేదన, భయం, అభద్రత, ఆగ్రహం కలిగిస్తున్న నేపధ్యంలో ఈ పరిణామాలు సమాజంలోని కొంతమంది వ్యక్తుల దుర్మార్గాల వల్లనే ఏర్పడినవని, ఇందుకు తాను తప్ప మిగతా సమాజమంతా బాధ్యత వహించాల్సిందే అన్నట్లు మాట్లాడుతూ ప్రతివాళ్లూ తమకి తోచిన పరిష్కారాలను సూచిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి నిందితుల ఎన్ కౌంటర్, వ్యభిచారాన్ని లీగలైజ్ చేయడం.
వీటిలో మొదటిది చట్ట వ్యతిరేక పరిష్కారం కాగా రెండోది చట్టబద్ధ పరిష్కారం. “స్పాట్ ఎన్ కౌంటర్”ల మీద ఇప్పటికే ఎంతో చర్చ జరిగిన కారణంగా ఎక్కువగా చర్చకు రాని “లీగలైజేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్”నే ఈ వ్యాసంలో ప్రధానంగా తీసుకుంటాను.
ఊరకే ఒక ఆలోచన స్థాయిలో మాత్రమే వున్నప్పటికీ దాని మంచి చెడుల్ని విశ్లేషణ చేయడంలో అనేకానేక సామాజికాంశాల్ని స్పర్శించే అవకశం వుంది కనుక ఈ టాపిక్ ఎంచుకున్నాను.
****
భారతీయ సమాజంలో పెళ్లికి ముందు సెక్స్ కి సంబంధించి అన్ని మతాలదీ ఒకటే దృక్పథం. దాన్ని శీలంతోటి ముడిపెట్టి చూడటమే జరుగుతుంది. అన్ని మతాల పురుషులకు తమ దాకా వచ్చే వరకు తమ భార్య కన్యత్వాన్ని కాపాడుకునే వుండి తీరాలని ఆశిస్తారు. దైహికమైన శృంగార ప్రక్రియని మానసికమైన శీలం (కేరక్టర్)తో అన్వయిస్తారు. స్త్రీల మీద ఫోకస్ చేసినంతగా ఈ శీలం అనే భావజాలం పురుషుల మీద వుండదు. తమ కుటుంబానికి చెందిన ఆస్థిపాస్తులు తమ వంశానికే చెందాలన్న కరుడు కట్టిన భూస్వామ్య విధానానికి శీలం, పాతివ్రత్య భావనలు ఒక తార్కాణం. ఆ విధంగా పాతివ్రత్యానికి స్వంత ఆస్థి వ్యవస్థకి సంబంధం వుంది. శీలం అనే భావన వివాహానికి పూర్వమే మనసులో పాతుకుపోయి వుండకపోతే వివాహానంతరం దాన్ని పాతివ్రత్యంగా పాటించే అవకాశం వుండదనే భయం వల్ల ఆడపిల్లల్లో అనేక ఆచార వ్యవహారాల ద్వారా నూరిపోయడం జరుగుతుంది. తమ మనశ్శరీరాల మీద పురుషుడి ఆధిపత్య జెండాని ఎగరవేయనిచ్చే బాధితులైన స్త్రీలు కూడా పట్టుబట్టే పితృస్వామ్య భావజాలమిది. ఆధ్యాత్మిక పురాణాలు, వివిధ కళారూపాలు, వినోద సాధనాలైన సినిమాలు నాటకాలు కూడా ఇదే విషయం మీద ఫోకస్ చేసేవి.
శీలం అనే విలువ తమకి అన్వయించని కారణంగా తన శృంగార బులపాటాల్ని తీర్చుకోడానికి పురుషాధిక్య సమాజం దేవదాసీ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. ఇదే అనేక పేర్లతో పిలువబడి చివరికి ఇప్పటి ఆధునిక వ్యభిచార వ్యవస్థగా కొనసాగుతున్నది. అంటే కొంతమంది స్త్రీలు అనేకమంది పురుషుల శృంగార వాంఛల లోడ్ ని మోయాలన్న మాట. తమ బతుకుతెరువు కోసం శరీరాన్ని అరగతీయాల్సి వుంటుంది. అవయవాల్ని అధికంగా ఉపయోగించాల్సి వుంటుంది. మనసులో పురుషుడి పట్ల సహజ ఆకర్షణ చంపేసి శరీరాన్ని పురుషుడి కామ దాహాన్ని తీర్చే చలివేంద్రంగా మార్చేయాల్సి వుంటుంది. మనసుకి శరీరానికి వున్న సమన్వయాన్ని, బంధాన్ని చంపేసే, స్త్రీల మీద అత్యంత క్రూరంగా అమలైన పాశవిక పితృస్వామ్య భావజాలమే వ్యభిచారం. ఇది బతుకుతెరువు కల్పిస్తుందన్న ఏకైక నెపంతో ఆ వృత్తిలో వున్న వారి సమస్త మానవ, పౌర, మానవీయ హక్కుల నుండి ఆ స్త్రీలను దూరం చేసేది వ్యభిచారం. ఇంకా మహా చిత్రమేమిటంటే ఇందులోని బాధితుల్నే తీవ్రంగా అసహ్యించుకునేలా చేస్తుంది సమాజం. వీరంటే సమాజంలో విపరీతమైన లోకువ. హీనంగా చూస్తారు. నీచంగా అభివర్ణిస్తారు.
రాజకీయ నాయకుల్ని, తమకు నచ్చని వారిని విమర్శించాలనుకుంటే “వీరి కంటే వ్యభిచారులు మేలు” అంటారు. “మీరు చేస్తే సంసారం – మేం చేస్తే వ్యభిచారం” వంటి సామెతల్ని వాడుతుంటారు. వ్యక్తిత్వ లోపమైన తీవ్ర లైంగిక స్వైరకల్పనను “మానసిక వ్యభిచారం” అని ఈసడిస్తారు. వ్యభిచారం కింద దేహాన్ని అద్దెకివ్వడం ఒక దయనీయమైన కుటుంబ పోషణ కోసం చేపట్టిన వృత్తి అని, అందులో స్త్రీల లైంగిక వాంచ ఇమిడి లేదని పట్టించుకోరు. మరి స్త్రీల మనసుల్ని, దేహాల్ని, వారి సమస్త అస్తిత్వాన్ని హింసకి, అవమానానికి, న్యూనతకు గురిచేసే వ్యభిచారానికి చట్టబద్ధమైన అనుమతి లభిస్తే? ఇది శీలం, విలువ వంటి సెంటిమెంటుతో ఆలోచించాల్సిన విషయం కాదు.
సెక్స్ అందుబాటులో లేని పురుషులే లైంగిక అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు సెక్స్ ట్రేడ్ ని లీగలైజ్ చేయాలని అనేవారు భావిస్తున్నట్లుంది. మరి పసిపిల్లలపై అత్యాచారాలు చేసే పక్కింటి అంకుల్స్ సంగతేమిటి? బాలికల్ని వేధించే పురుష కుటుంబ సభ్యుల సంగతేమిటి? సరే ఈ విషయాల్ని కాసేపు పక్కన పెట్టి వారి వాదనేమిటో గమనిద్దాం. లైంగిక అత్యాచారాలకు ఓ విరుగుడుగా వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలని వాదించేవారు చెప్పేదేమంటే వివాహానికి ముందు సెక్స్ అనుభవించడం నిషిద్ధమని చట్టం చెప్పనప్పటికీ మన దేశపు నైతిక సూత్రాలు, అతి కఠినమైన సాంఘీక కట్టుబాట్ల ప్రకారం ఒక్క వైవాహిక భాగస్వామితో తప్ప మరొకరితో సెక్స్ నిషిద్ధం. అంటే పెళ్లి చేసుకుంటే తప్ప అధికారికంగా శృంగారం అనుభవించే అవకాశం లేదు. మరి కౌమార్య దశ నుండే సెక్స్ కోరికలు కలుగుతున్నప్పుడు, ఇవాల్టి ఆధునిక జీవితంలో ముప్ఫై ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోలేని పరిస్తితుల్లో అంత కాలం పాటు ప్రకృతి నియమమైన సెక్స్ ని తొక్కిపెట్టి వుంచడం పురుషుల్లో నేర ప్రవృత్తికి దారి తీస్తుంది అంటారు వీరు.
ఈ సమస్య స్త్రీలకి కూడా వర్తించినప్పటికీ వారు అణచివేసుకోగలరని, స్త్రీలు లైంగిక నేరాలకి పాల్పడరని, అత్యాచారాలు చేయరని, కేవలం పురుషులు మాత్రమే లైంగిక అత్యాచారాలు చేస్తారు కాబట్టి వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయడం వల్ల వారి కోరికలు కొంతమేరకు తీరి నేర ప్రవృత్తి తగ్గుతుందని ఈ ఆలోచన సమర్ధకుల వాదన. ఎంతో తార్కికంగా కనిపించే ఈ ఆలోచన ఆచరణలోకి హాని రహితంగా అమలు చేయబడుతుందా? ఒక రహస్యంగా, హీనంగా, నీచంగా చూడబడే వృత్తికి రాజముద్ర లభిస్తే మరి సమాజంలో ఓవరాల్ గా స్త్రీల అస్తిత్వానికి దక్కే గౌరవం ఏమిటి? అస్తిత్వ అవమానం అత్యాచారాని కంటే ఎన్నో రెట్లు హానికరం. పురుషుడిని ఒక తిట్టు తిట్టాలన్నా స్త్రీలని దూషించనిదే సాధ్యపడని ఆ తిట్లకి సామాన్యుల దృష్టిలో బలమిచ్చే చట్టబద్ధత ఎంత ప్రమాదకరం స్త్రీలకి? స్త్రీలకి ఒట్టి మాటల్లో తప్ప ఏ మాత్రం గౌరవం ఇవ్వని సమాజంలో స్త్రీల పట్ల చులకన భావం మరింత పెరిగిపోదా? ఆ చులకన భావం వారి మీద మరిన్ని దాడులకు పురికొల్పదా? పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా “నైట్ వర్కర్” లేదా “సెక్స్ వర్కర్” అని పిలుస్తూ అదో వృత్తిగా గుర్తించేంత మెచురిటీ మన జనాలకుంటుందా?
****
ఇప్పటి పరిస్తితుల్లో మన దేశంలో వ్యభిచార వృత్తికి దోహదపడే అంశాలేమిటనేది అతి ముఖ్యమైన ప్రశ్న. గృహ హింసను తట్టుకోలేక భర్తల నుండి పారిపోయిన పేద వర్గాలకు చెందిన స్త్రీలు, తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుండి బైట పడ్డ అమ్మాయిలు, కుటుంబ వృత్తిగా ఇందులోకి దిగిపోయే ఆడపిల్లలు, ఆర్ధిక లేద సాంఘీక కారణాల వల్ల పెళ్లి కాని యువతులు, లైంగిక జ్ఞాన రాహిత్యం వల్ల, వావి వరసలు మరిచిన మగ పెద్దల లైంగిక కృత్యాల వల్ల ఇళ్లను వదిలేసిన యువతులు, బాల్య వివాహాల బారిన పడిన వారు, ….ఇలా ఎన్నో రకాల బాధాసర్పద్రష్టులు వ్యభిచార ఊబిలో చిక్కుకొంటుంటారు. ఇలా ఈ జాబితాలో వున్న వారందరూ పేదలే ప్రధానంగా. గ్రామీణ ప్రాంతంలో ఉపాధుల కొరత వల్ల నగరాలకు వలసపోయిన ఆడపిల్లల నగర జిలుగు తళుకుల వెనుక దాగి వున్న మాయా మర్మం పట్ల అజ్ఞానం కూడా కారణాలే.
ఫ్యూడల్ వ్యవస్థలో హింస పెట్టి ఆ వృత్తిలోకి లాగడం వుంటే, వినిమయదారీ సంస్కృతిలో ప్రలోభ పెట్టడం ప్రధానంగా వుంటుంది. స్త్రీల ట్రాఫికింగ్ కి వ్యతిరేకంగా పని చేసే ఒక మిత్రురాలు ఏమని చెప్పారంటే వ్యభిచారం కోసం హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే ముఠాలు గ్రామాలు, చిన్న పట్టణాల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం కాకుండా హైదరాబాద్ వంటి నగరాలకు వలస వచ్చి షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాల్లో పనిచేసే ఆడపిల్లల్ని ట్టార్గెట్ చేసి, వాళ్లు బస చేసే చవక రకం వర్కింగ్ వుమన్స్ హాస్టల్స్ దగ్గర కాపు కాసి, వారిని ప్రలోభ పెట్టి, జల్సాలు, సరదాలు అలవాటు చేసి, భవిష్యత్తులో సుఖాల గురించి ఆశ చూపిస్తారు. ఒక మూడు నాలుగేళ్లు “ఈ పని” చేస్తే లైఫ్ లో సెటిల్ అయేంతగా సంపాదించ వచ్చని, తరువాత మామూలుగా పెళ్లి చేసుకోవచ్చని నమ్మిస్తారు. (బహుశా ఈ కారణం చేతనేమో ట్రాఫికింగ్ ఇదివరకు గ్రామాల నుండి జరిగితే ఇప్పుడు నగరాల నుండే ఎక్కువగా జరుగుతున్నది.) వీళ్ల మాటలకి ప్రలోభ పడి ఏదో ఉద్యోగం చేసి సంపాదిస్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి నెలనెలా ఇంటికి డబ్బులు పంపిస్తుంటారు. అయితే ఆ తరువాతేం జరుగుతుందనేది అసలైన ప్రశ్న.
ఈ గతం వారిని భవిష్యత్తులో మానసికంగా వెంటాడదా? భాగస్వామిని మోసం చేస్తున్నామనే ఆత్మ న్యూనతని కలగచేయదా? ఒక “సెక్స్ స్టార్వింగ్ నేషన్”లో కొన్నేళ్లు ఈ వృత్తిలో వుంటే భయానక అనుభవాలు వారిని కృంగదీయవా? ఇప్పుడు కొంతమంది అడుగుతున్నట్లు లీగలైజ్ చేస్తే ఈ ఆశోపహతుల సంఖ్య పెరిగి అసలే బలహీనంగా, దుర్మార్గంగా వున్న మానవ సంబంధాలు గందరగోళమై ఒక సామాజిక అశాంతి పెరగదా? ఇది పేద, అల్పాదాయ వర్గాలని అతలాకుతలం చేసే ప్రతిపాదన. సెక్స్ వర్క్ చేస్తున్న యువతి/స్త్రీ కుటుంబాలు సమాజంలో దారుణ అవమానాలకి గురి అవుతారు. లీగలైజ్ చేస్తే అన్నీ ప్రభుత్వ లెక్కల్లోకి వస్తాయి. హోటళ్లు తమ అతిథుల వివరాల్ని ప్రభుత్వం రూపొందించిన రిజిస్టర్లలో నమోదు చేసినట్లు సెక్స్ వర్కర్ల, వారి కస్టమర్ల వివరాలు నమోదు చేయాల్సి రావొచ్చు. ఈ డేటా భవిష్యత్తులో వారి గౌరవనీయ జీవనానికి భంగకరం కావొచ్చు.
లీగలైజ్ చేయడం ద్వారా వుమన్ ట్రాఫికింగ్ తీవ్రంగా పెరిగిపోతుందనే భయం కూడా కొంతమందిలో వుంది. అయితే ఒకసారి లీగలైజ్ చేసాక అది స్వచ్చంద ట్రాఫికింగ్ గా మారొచ్చు. ఢిల్లీ, ముంబై, కోల్కత వంటి ఒక్కో మహానగరంలో తక్కువలో తక్కువగా 70 వేలకు పైగా సెక్స్ వర్కర్స్ వున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మరి లీగలైజ్ చేయడం వల్ల భారీగా పెరిగే కార్యకలాపాల్ని ప్రభుత్వం పర్యవేక్షణ సాధ్యమవుతుందా? అవినీతి పెరగదా?
సెక్స్ అనేది స్త్రీ పురుషుల ఇరువురికీ ముఖ్యమైన సహజాతం. అది ప్రకృతి ఏర్పాటు. వ్యభిచారాన్ని లీగలైజ్ చేయడం ద్వారా సెక్స్ అనేది పురుషుల ఆనంద, తృప్తి వ్యవహారంగా, అందుకు స్త్రీలు భాగస్వాములుగా కాక సాధనాలుగా భావించే సామాజిక వాతావరణం పెరుగుతుంది. ఇప్పటికే ఆ ధోరణిలో వున్న సమాజ గమనానికి ఊతమిచ్చినట్లవుతుంది.
కొంతమంది సామాజిక కార్యకర్తలు సెక్స్ వర్కర్స్ కి లైసెన్సులు ఇమ్మని డిమాండు చేసారు. వ్యభిచారం దానికదే తప్పని చట్టాలు చెప్పని నేపథ్యంలో సూక్ష్మంగా ఆలోచిస్తే వ్యభిచారాన్ని లీగలైజ్ చేయడం, సెక్స్ వర్కర్స్ కి లైసెన్సులు ఇవ్వడం ఒక్కటి కాదని తెలుస్తుంది. లీగలైజ్ చేయడం ద్వార పైన చెప్పిన సామాజిక, వ్యక్తిగత ఉపద్రవాలు సంభవించే అవకాశాలుంటాయి. లైసెన్సులు మంజూరు చేయడం వల్ల ఇప్పుడున్న పరిస్తితుల్లో సెక్స్ వర్కర్స్ గురయ్యే దోపిడీని కొంతమేరకు నియంత్రించడమే కాకుండా అనారోగ్య అవకాశాల్ని, అపరిశుభ్రతని పరిహరించే అవకాశం కలుగుతుందని సామాజిక కార్యకర్తలంటారు. అయితే ఈ డిమాండుని కూడా వారు ఇప్పుడు పెద్దగా ముందుకు తెస్తున్నట్లు లేదు. అసలు 2004లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించింది.
****
అసలు లైంగిక అత్యాచారాలకి పరిష్కారం కేవలం చట్టాల వల్లనే సాధ్యమవుతుందా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. చట్టాలు చేసినా ఒక కొత్త మార్పుకి అనుగుణంగా సమాజం పరిణామక్రమంకి గురవ్వాలి. అందుకు ప్రజల ఆలోచనల్లో, అవగాహనల్లో, ఆమోదాల్లో ఈ కింది మార్పులు రావాలి.
- వాంఛల్ని తొక్కిపోట్టడం అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా మంచిది కాదు. భీకరంగా కట్టడి చేయకపోతే విశృంఖలత్వమే సంభవిస్తుందని అనుకోవడం సరి కాదు. నిజానికి కఠినమైన కట్టడే అదుపుచేసుకోలేని వాంఛకి, అక్కడి నుండి నేర ప్రవృత్తికి దారి తీస్తుంది. పెళ్లికి ముందు సెక్స్ అంటే పాపం కాదని, దైహిక శీలం అనేదానికి అర్ధం లేదని, తీసుకోవాల్సింది జాగ్రత్తలే కానీ ప్రకృతి ఏర్పరిచిన ప్రేమని, సెక్సుని అనుభవించడంలో తప్పు లేదని, విలువలనేవి ఇద్దరి మధ్యన వుండే ప్రజాస్వామిక ప్రవర్తనకి, నిజాయితీకి, వారి మధ్య లాయల్నెస్ కి, వ్యక్తిగత విశ్వసనీయతకి సంబంధించినవని తెలుసుకొని అలాంటి సంబంధాల్ని ఆమోదించగలగాలి. మనలోని జడ్జిమెంటల్ యాటిట్యూడ్ పోవాలి.
- సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో మనకి సున్నా మార్కులొస్తాయి. ఆడపిల్లలు తమ శరీర ధర్మాల గురించి న్యూనతకి గురి కాకుండా తెలుసుకోగలిగితే ఆత్మ విశ్వాసంతో వ్యవహరించగలుగుతారు. మగ పిల్లలు కూడా సెక్స్ ఎడ్యుకేషన్, జెండర్ సెన్సిటైజేషన్ వల్ల ఆడపిల్లల్ని, స్త్రీలని సరిగ్గా అర్ధం చేసుకోగలగటమే కాక తమలోని విపరీత పోకడల్ని గుర్తించగలుగుతారు.
- మన ఇళ్లల్లో ఆడపిల్లల మీద ఫోకస్ చేసినంతగా మగపిల్లల మీద చేస్తున్నామా? ఆడపిల్లలకు స్వేచ్చ ఇస్తే ఇంటి పరువు పోతుందేమోనని భయపడతామే కానీ మగ పిల్లవాడు అంతకంటే ఘోరంగా నేరాల్లో చిక్కుకునే అవకాశాలుంటాయని ఆలోచిస్తామా అసలు? నిజానికి ఆడపిల్లల కంటే మగ పిల్లల మీదనే ఎక్కువ దృష్టి పెట్టాల్సిన సమయమిది. ఆడపిల్లల కంటే మగ పిల్లల్నే తప్పులు చేయడానికి ప్రోత్సహించే నేరమయ వాతావరణం, కన్స్యూమరిస్ట్ సంస్కృతి రాజ్యమేలుతున్నది ఇంటి బైట.
****
సమాజంలో సగ భాగాన్ని అణిఛి, హింసించే సంస్కృతికి వేల సంవత్సరాల చరిత్ర వుంది. దాన్ని నిర్మూలించాలంటే ప్రతి క్షణం ఓ చైతన్య యుద్ధం చేయాల్సిందే, కనీసం కొన్ని దశాబ్దాల పాటు!
*
సెక్స్ వర్క్ లీగల్ చేయాలి అనే దాని గురించి మీ తరపు వాదనకు 100% నేను అగ్రీ అవుతున్నాను. అయితే సెక్స్ కోరికలు తీర్చుకోవడం …దానిని మనం తీసుకునే ఆహారం తో పోల్చడం ఎక్కువ ఇంపార్తన్స్ ఇస్తున్నమేమో అనిపిస్తుంది. మన బాడీ అనేక విషయాలకు అట్రాక్ట్ అవుతుంది.ఎన్నో కావాలి అనుకుంటుంది.కానీ అన్ని అవసరాలు కావచ్చు కానీ ఆహారం అంత అత్యవసరం అయితే కాదు…సెక్స్ ఉన్నా పర్లేదు…లేకున్నా పర్లేదు..అనే భావన వస్తే బాగుంటుంది.సెక్స్ కావాలి అన్నప్పుడు మీరు అన్నట్లు ఒక డెమొక్రటిక్ వే లో…పార్టనర్ అంగీకారం తో చేసుకోవాలి అనే విలువను సమాజంలో పెంపొందించవలిసి ఉంది. అది పెళ్లికి ముందు అయినా..పెళ్లి తరువాత అయినా..ఎలా అయినా కూడా…consent is imp.
సింపుల్ గా చెప్పాలి అంటే…సంప్రదాయ వాదులు ప్రతీది సెక్స్ తో లింక్ చేసి ఎలా అయితే హైప్ క్రియేట్ చేశారో..అలానే సెక్స్ కోరిక తీర్చుకోవడం ఆహారమంత అవసరం అని మనం కూడా హైప్ క్రియేట్ చేయకూడదు. లైఫ్ లో ఉన్నా పర్లేదు..లేకున్నా పర్లేదు అనే భావన తీసుకుని రావడం వలన దాని మీద డెస్పరేషన్ పోయి…మిగతా ముఖ్యమైన విషయాల మీద ఫోకస్ పెరుగుతుంది.ఉదాహరణకు టీనేజ్ పిల్లలకు చదువు…కెరీర్ ముఖ్యం…అపుడు ఒక సమయం వరకు తమ శరీరం నుండి వచ్చే భావనలను కంట్రోల్ లో ఉంచుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. అలా అనేక సందర్భాల్లో… కూడా అప్లై చేసుకోవచ్చు.