గుండె కొట్టుకోవడానికే కాదు.. హత్తుకోవడానికి కూడా!

కవి కోరుతున్న సహానుభూతిని సాధించడం వీలవుతుందా? అలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి పొందుతాం?

తీరం దాటిన నాలుగు కెరటాల్లో (2014) అనిల్ డ్యాని ఒకరు. ఆరేడేండ్ల వయసున్న ఈ కవి ‘ఎనిమిదో రంగు'(2017) పులుముకుని, ‘స్పెల్లింగ్ మిస్టేక్'(2019) సరిచేసుకుంటూ  అటు కవిగా, ఇటు విమర్శకుడిగా పరిణతి చెందుతున్నవాడు. కవిత్వం రాస్తున్న తొలి రోజుల్లో దివ్యాంగులపై రాసిన “దేహ కరచాలనం” కవిత గురించి మాట్లాడుకుందాం.

దేహ కరచాలనం

ఇలా ఉండాలనీ వాళ్ళకీ ఉండదు 
నవ్వొచ్చినప్పుడు ఏడ్వాలని 
కన్నీరొచ్చినప్పుడు తుడుచుకోవాలని 
కాలం గిల్లి పోయినప్పటి బాధను 
తల్చుకోవాలనీ ఉండదు   
ఏ మహాసముద్రం ముందో నిల్చుని 
నిన్ను ఈదగలనని చేసే శపధం  
గురుతొచ్చినప్పుడల్లా  
రమ్మంటూ పిలిచిన సముద్రమూ 
వెళ్ళలేవంటూ వెనక్కీ లాగే 
ఈ చక్రాల కూర్చీనీ విసిరేసి  
అమాంతం లంఘించాలనే కోరికా 
నీరుగారిపోతుంటాయి 
పొద్దున్నే సూరీడు 
చమురులో ఈదులాడే దీపాల 
సాయంత్రపు వెలుగులు   
కూర్చున్న దగ్గరే నీడ 
చిక్కటి నల్లరంగుతో  
పరుచుకుంటున్నప్పుడు 
కిటికీలోనీ చంద్రుడు 
నవ్వుతూ పలకరిస్తూ  
వేయిదీపాల దీపాల కాంతి 
నిడిన ముఖంలో 
తన మరకల్ని సరిచేసుకుంటాడు  
నవ్వడమొక్కటే కదా 
ఇక్కడ తెలిసిన విద్య    
ఎదురైన ప్రతీ నవ్వు 
దాని వెనుక దాగిన జాలి 
మొహమాటపు చేయూత  
దేహానికి నేలకి రాపిడై 
సలుపుతున్న గాయాలు  
రెండు చంకల కిందా 
ఆసరాకీ రోజూ  తోడొచ్చే 
రెండు కర్ర ముక్కలూ  
కూలిపోతున్న సౌధాలకి 
అడ్డుకట్టలై  కాపు కాస్తూ 
నిట్టనిలువునా పెరిగిన 
కొండనైనా ఎక్కి పొమ్మంటాయి 
సాగుతున్న దారంతా 
ముళ్ళకంచల హద్దు 
దేహం ఓ యుద్ద స్థలం 
నిలవరించడానికి , కలబడానికి   
అవహేళనలతో నిత్యం ఓ సైన్యం సిద్దం 
ఎక్కడా  గుండెలవిసి పోవు 
ఒలికిన నెత్తురూ చిక్కబడదు  
గుండె కొట్టుకోవడానికే కాదు  
హత్తుకోవడానికని  
నీరుగారి పోతున్న గుండెలకి  
రేపటి సూరీడొచ్చేవరకూ   
దేహం మొత్తం ఒక చెయ్యై 
కరచాలనం కోసం 
ప్రపంచాన్ని రమ్మంటుంది        
*
ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ‘గాల్టన్’అనే శాస్త్రవేత్త గిఫ్టెడ్ చిల్డ్రన్ (దివ్యాంగులు)గా ప్రతిపాదించారు. దివ్యాంగులపై సమాజంలో వున్న చిన్న చూపు, దివ్యాంగ సాహిత్యంపై కూడా వుందని యిప్పుడు వినిపిస్తున్న మాట.  సమాజంలో వున్న ఈ చిన్న చూపును పోగొట్టడం సాధ్యమేనా? అయితే ఎక్కడి నుంచి ప్రారంభించి, అవగాహన కల్పించాలి? సమాజ ప్రభావం చేత దివ్యాంగుల్లో పేరుకుపోయిన న్యూనతా భావం ఎలా తొలిగించగలం?   కవి కోరుతున్న సహానుభూతిని సాధించడం వీలవుతుందా? అలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి పొందుతాం?. ఖచ్చితంగా విద్య ద్వారానే సాధ్యం. 6-14 సం.ల వయసున్న పిల్లలందరికీ సార్వత్రిక, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని భారత రాజ్యాంగం (ఆర్టికల్-45) చెబుతుంది.
అయితే దివ్యాంగులను ప్రత్యేక అవసరాలు గల పిల్లలుగా పరిగణించాం. వారికి ప్రత్యేక విద్యను అందించాలని ప్రణాళికలు సిద్ధం చేసి  అమలు పరుస్తున్నాం. సాధారణ ప్రజ్ఞ కంటే ఎక్కువ లేదా తక్కువ ప్రజ్ఞా లబ్ధి వున్న వారు ప్రత్యేక అవసరాలు వున్న పిల్లలు (టెర్మన్ – మెరిల్ ప్రజ్ఞా విభాజనం ప్రకారం). ప్రత్యేక విద్యను కేవలం మానవత్వ పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించాలని “కొఠారి కమిషన్” సూచించింది. పిల్లల విద్యా అవసరాలు తీర్చడం, మూర్తిమత్వ వికాసం,  సాంఘికీకరణ, పునరావాసం కల్పించడానికి దోహదపడే కారకాలను వెలికితీసే శాస్త్రమే ప్రత్యేక విద్య అని చెప్పవచ్చును.
డన్ అనే శాస్త్రవేత్త ప్రకారం దివ్యాంగులను 12 వర్గాలుగా  (ప్రతిభావంతులు, బోధించగల బుద్ధిమాంద్యత ఉన్నవారు, తర్ఫీదు ఇవ్వగల బుద్ధిమాంద్యత ఉన్నవారు, మానసిక సమ యోజనం లోపించినవారు, భావోద్రేకం లోపించినవారు, భాషణ లోపం ఉన్నవారు, బధిరులు, కొద్దిపాటి వినికిడి లోపం ఉన్నవారు, దృష్టిలోపం ఉన్నవారు, కొద్దిపాటి దృష్టిలోపం ఉన్నవారు, అంగవికలురు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు) విభజించడం జరిగింది. వీరిని బడుల్లో సాధారణ పిల్లలతో పాటు కూర్చోబెట్టి విద్యను అందించాలని, తద్వారా చదువుల్లోనూ, ఆటోల్లోనూ, మూర్తిమత్వంలోనూ మెరుగైన ఫలితాలు ఆశించవచ్చని తెలుస్తుంది.
*
లస్యంగానైనా కొందరు కవులు నోటితో కాక హృదయంతో స్పందిస్తున్నారు. వారి పట్ల సానుభూతి కాదు..సహానుభూతి కావాలని అనిల్ డ్యాని వంటి కవులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.
“కిటికీలోని చంద్రుడు నవ్వుతూ పలకరిస్తూ
వేయిదీపాల దీపాల కాంతి నిండిన ముఖంలో
తన మరకల్ని సరిచేసుకుంటాడు”
-అనడం ఔచిత్యం గానూ అనిపించకమానదు.
ఇక్కడ కవి ‘కాలం గిల్లిపోయినప్పటి బాధ’ను అనుభవించి పలవరిస్తాడు. ‘నవ్వు, జాలి, మొహమాటపు చేయూత’ గురించి మాట్లాడుతాడు. అతనికి వారి ‘దేహం ఓ యుద్ధ స్థలం’ గా కనిపిస్తుంది. ‘Person with disability Act  – 1995’ ప్రకారం ‘చలన వైకల్యం’ గల  పిల్లలుగా పరిగణించబడిన వారి గురించి ఈ కవిత ద్వారా కవి తన స్పష్టమైన వైఖరిని తెలియజేయడం జరిగింది. వారు సాధించిన విజయాలు కన్నా ముందుగా లోపమే కనబడుతున్నందుకు కవి ఆవేదన వ్యక్తంచేస్తాడు. విసురుతున్న అవమానాల, అవహేళనల రాళ్లు మెట్లుగా మార్చుకోవాలని, నిండైన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలనే సందేశం వినిపిస్తాడు.
*

బండారి రాజ్ కుమార్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగుంది బండారి.. కవితను ఇంకొంచెం విశ్లేషిస్తే చదవాలనిపించింది,

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు