ఆటవిక న్యాయంపై అంత క్రేజ్‌ ఎందుకు?

హంతకులను, రేపిస్టులను ఎవరు తయారు చేస్తారు? ఏ వ్యవస్థ వారికి జన్మనిస్తుంది?

నదంతా చేతులు కాలాక ఆకులు పట్టుకునే సమాజం. అది వైరస్‌ అయినా, వాక్సిన్‌ అయినా ఏదైనా అంతే. ఇటీవల చైత్ర అనే ఆరేళ్ల అమ్మాయిని రేప్‌ చేసి చంపేశాడు ఓ ఉన్మాది. పోలీసు శిక్షల భయానికి వాడే సూసైడ్‌ చేసుకొని చనిపోయాడు. ఒకవేళ వాడే పోలీసులకు చిక్కి ఉంటే…మన సమాజం నుండి వెంటనే వచ్చే మొదటి డిమాండ్‌ అతడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని. లేదా ఉరిశిక్ష వేయాలి అని. ఈ డిమాండ్‌లను సోషల్‌ మీడియా వేదికగా రాసే వారందరూ సమస్యల మూలాల్లోకి వెళ్లరు. ఎందుకంటే వారికి అంత ఆసక్తి, ఓపిక ఉండదు. నాలుగు బూతులు తిట్టి, తమ తమ కోపాన్ని వెళ్లగక్కి, రోటీన్‌ లైఫ్‌లో చిక్కుకుపోవడమే వారికి ఇష్టం తప్ప, సమస్యకు మూలం ఎక్కడ ఉందో ఆలోచించే ప్రయత్నం చేయరు.

హంతకులను, రేపిస్టులను ఎవరు తయారు చేస్తారు? ఏ వ్యవస్థ వారికి జన్మనిస్తుంది? ఎందుకు ఈ ప్రశ్నలకు సమాధానం వెతకరు? ఈ నేపథ్యంలోనే ప్రముఖ కవయిత్రి జూపాక సుభద్ర గారు రాసిన ‘‘ఈ నేరలోకానికి ఏ సిచ్చ లేదా!’’ అనే కవిత ఇందుకు సరైన సమాధానం.

‘‘ఆనికి సదువు సందెలెందుకు లేవో
అచ్చురాలొదిలి ఆగమెందుకైండో
జెర జెప్పుండ్రి
ఆడు సదువుకొని కొలువుల కొలుపుల్లేక
ఆగంపచ్చిని జేసి గంజాయికి గుంజినోల్లెవరు?
సారా కషాయాల నిషాలు నిండిన పశువును జేసిందెవరు?
గుట్కాలు గుమ్మరిచ్చుకునే రొచ్చుగుంటంజేసిందెవరు?
సెల్లుఫోనులకు సినేతంజేసి సెడగొట్టిందెవరు
నీతుల్లేని సీన్మల తోని వాన్ని బూతోన్ని జేసి
వాన్ని నాశనం పదారుబాల్లు జేసిన పానంగుత్తోల్లెవరు?’’
అంటూ ఆర్ధ్రంగా అడిగిన ప్రశ్నలు చాలా లోతైనవి.

తప్పు ఎవరిదో, లోపం ఎక్కడ ఉందో తెలిపే నిలదీత ఈ కవిత. నేర సమాజాన్ని తయారు చేసేది పాలక విధానాలే. పౌరులను, పౌరుల హక్కులను కాలరాస్తూ మనుగడను కొనసాగించే ఈ పాలన వ్యవస్థే ఈ అత్యాచార హత్యలకు కారణం.

రేపులు చేస్తున్నది ఎవరు? రేపులకు గురవుతున్నది ఎవరు? వారికి విధిస్తున్న శిక్షలు రాజ్యాంగ పరిధిలోనేనా అన్నది ఎవ్వరూ అంతగా పట్టించుకోవడం లేదు.

పోలీసు శిక్షలు పడుతున్నదంతా పేద బీద జనాలకే తప్ప, కృారమైన హింసాప్రవృత్తితో నేరాలు చేసే బలవంతులకు కాదు. పబ్బులో తాగి తందనాలాడి అమాయకులపై చేయి చేసుకునే ఎంపీ, ఎమ్మెల్యేల తనయుల, సోదరులను కనీసం పల్లెత్తు మాటకూడా అనలేరు. వారు చేసే నేరాలు ఆలస్యంగానైనా వెలుగు చూడడం కూడా అరుదే. ఇవేవి పట్టించుకోదు ఈ లోకం. వారు పట్టించుకోవాలంటే రేపులకు గురయ్యేవారికి కులం ఉండాలి. కులం లేనివారిని మీడియా కూడా పెద్దగా పట్టించుకోదు అనడానికి అనేక సాక్ష్యాలు సజీవంగానే లభిస్తాయి.

ఒక నేరం జరిగాక తక్షణ శిక్షలు అమలు చేసి, చేతులు దులుపుకునే వ్యవస్థ పయనం ఎటు వైపు దారి తీస్తున్నది. పతనదారుల్లో కూరుకుపోతున్నది. ఇలాంటి అత్యాచారాలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతాయా? అనేది ఆలోచించడం లేదు. దిశ ఎన్‌కౌంటర్‌ చేసిన అధికారులు సైతం ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడి దిక్కులు చూస్తున్నారు. కోర్టులకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నములుతున్నారు. మాస్‌ హిస్టీరియా ఎటు నడిపిస్తే అటు నడిస్తే దానికి చట్టం, కోర్టులు ఎందుకు? ఇట్లా రాజ్యాంగానికి  హక్కులకు, నిత్యం విఘాతం కలుగుతూనే ఉంది.

అందుకే ఇప్పుడు శిక్షించాల్సింది, సంస్కరించాల్సింది రేపిస్టులను కాదు, రేపిస్టులను తయారు చేస్తున్న ఈ వ్యవస్థను. సమస్య మూలాల్లోకి వెళ్లి శాశ్వత పరిష్కారాలు ఆలోచించాలి. కుటుంబ సభ్యులు తమ బాధ్యతలను విస్మరించినట్టే విద్యావ్యవస్థ కూడా విలువలను పట్టించుకోవడం లేదు.

ఇక సమాజం చేష్టలుడిగి చూడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఆకలి, పేదరికాన్ని అందించే రాజ్యం సెల్లుఫోనుల్లో విచ్ఛలవిడిగా పోర్నోగ్రఫీని అందించి యువతను రేపిస్టులుగా తయారు చేస్తున్నది. మంచి చదువు చెప్పించి ప్రయోజకులను చేసే నిబద్ధత ప్రభుత్వాలకు లేదు. ఉంటే…ఆడపిల్లను అర్థం చేసుకోవడానికి కావాల్సిన జెండర్‌ సెన్సిటివిటీపై అవగాహనను పెంచే ఒక్క పాఠమైనా ఇంత పెద్ద విద్యా వ్యవస్థలో ఉందా?

ఒక్క ఇంట్లోనైనా పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామా? అందుకే మనకు రోగం మీద కంటే రోగి మీదే కోపం కట్టలు తెగుతున్నది. రోగాన్ని పూర్తిగా నయం చేయడం కంటే తాత్కాలిక ఉపశమనాల మీదే మనకు ఆసక్తి ఉన్నంత కాలం ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉంటాయి.

*

పసునూరి రవీందర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు