సముద్రానికి మరోవైపు…

అవును.. ఆ నవ్వుతున్న యమున మొహంలో పొంగే సముద్రాన్ని ఎవరైనా చూశారా??

వివేక్ శానభాగ గత అయిదేళ్లలో తెలుగు సాహిత్యంలో వినిపిస్తున్న పేరు. ఘాచర్ ఘోచర్ నవల తెలుగులో వచ్చినప్పుడు వివేక్ పేరు బాగానే తెలుగు పాఠకుల్లోకి వెళ్లింది. కన్నడ సాహిత్యంలో వచ్చే రచనలమీదా ఆసక్తి ఇంకాస్త ఎక్కువయ్యింది కూడా. సమకాలీన కన్నడ రచయితల్లో వివేక్ ఇప్పుడు చాలా పాపులర్ రచయిత. ఘాచర్ ఘోచర్ ప్రపంచంలో ఉన్న పద్దెనిమిది భాషల్లోకి అనువాదమైంది. ఇప్పుడు వచ్చిన “ఒకవైపు సముద్రం” తెలుగులో వచ్చిన రెండో పుస్తకం….

    ఇంతకీ ఏముదీ పుస్తకంలో? ఒక నాటి ఉత్తర కన్నడ ప్రాంతపు జీవితాలున్నాయి. అప్పటి ఆర్థిక, సామాజిక జీవన చిత్రికతో పాటు అత్యద్బుతమైన మానసిక స్థితులని కూడా గమనించగలం. పండరి, యమున అనే అత్తాకోడళ్ల సంభాషణతో ఆ కథలోకి అడుగు పెట్టిన మనం దేవరాయ పెరడు మీదుగా అతని ఇంట్లో మెట్రిక్ చదువుకోవటానికి వచ్చిన పురంధర జీవితంలోకి వెళ్లిపోతాం. పురంధర అనే ఒక వ్యక్తి చుట్టూ అల్లుకున్న కథలో మనకు మనంగా అనుభవించిన ఒకనాటి పల్లె జీవితాన్ని,  ఒక పెళ్లి జరగటానికి వెనుక ఎన్నిరకాల విషయాలు అల్లుకుని ఉంటాయో, ఎన్ని ఎత్తుగడలు ఉంటాయో చూడొచ్చు.

సునంద, రత్న ఇద్దరూ తనకు నచ్చిన అమ్మాయిలే కానీ రత్నని వద్దనుకోవటానికి పురంధరకి ఉన్న కారణం అంతుబట్టనట్టే ఉంటుంది కానీ అది సెల్ఫ్ రెస్పెక్ట్ నుంచి వచ్చిన తిరస్కారంగా అనిపిస్తుంది. వాసుదేవ మామ అంత సహాయం చేసినా అతని కూతుర్ని చేసుకోవటానికి అంగీకరించని పురంధర ఒకపక్క స్వార్థ పరుడిగానూ, రెండోపక్క ఆత్మాభిమానం ఉన్నవాడిగానూ ఒకేసారి కనిపిస్తాడు. ముంబై వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ సంతోషంగా గడపాలనుకున్న అతని కల నెరవేరకుండానే,  గ్రామీణ  ప్రాంతంలో బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడిపోతాడు. నిజమే మనలోనూ ఎంతమంది పురంధరలు లేరూ..? ఇలా ప్రతీ పాత్రా, ప్రతీ సన్నివేశం అడుగడుగునా మన గతకాలం నాటి స్థితి గతులని గుర్తు చేస్తూనే ఉంటాయి.

    నిజానికి ఇక్కడ ఏదీ కథానాయకుని, కథా నాయకి పాత్ర అనేది అర్థం కాకుండానే కథ మొత్తం పూర్తి చేశాక ఒకసారి ముసలి పండరికి నమస్కరిస్తాం. ఆమె వంటి ఒక వృద్ద మహిళ తీసుకున్న నిర్ణయం కథలో ఒక గొప్ప  విషయంగా అనిపిస్తుంది. ఇక పురంధర, సునందల పెళ్ళి జరగటానికి గోదావరి చేసిన ప్రయత్నాలు, తండ్రిలేని పేద విద్యార్థిగా పురంధర ఎదుర్కున్న అవమానాలూ మనలో 1990లకి ముందుండే ఎన్నో జీవితాలని కళ్లముందు కదలాడేలా చేస్తాయి.

     యశవంత కన్న కలలూ మహానటుడు కావాలనుకున్న వాడూ ఎలా జీవితంలో ఉన్న ప్రాక్టికాలిటీనీ, సమాజ పోకడలోని సత్యాన్ని అర్థం చేసుకున్నాడో చూసినప్పుడు. అతని నాటక సమాజంలోని పెళ్లైన ఆడ స్నేహితురాలి ప్రేమ, అనుకోని పరిస్థితుల్లో యశవంత “పురంధర”గా మారి పోవాల్సి వచ్చిన సందర్భమూ కాసేపు మనల్ని ఆ కన్నడ పల్లెల్లో బురద మట్టి దారుల్లో తిరుగాడేలా చేస్తాయి. ఇంటినుంచి పారిపోయి పుణేలొ నాటక సమాజంలోకి అక్కడి నుంచి సినిమాల్లోకి వెళ్లి ఒక వెలుగు వెలగాలనుకున్న యశవంత మళ్లీ ఊరికి వచ్చేస్తాడు. పురంధరను కలుస్తాడు. అతనికి ఆ నాటక సమాజపు నాటి రోజులని గురించి విఫల ప్రేమని గురించి చెప్పినప్పుడు. “నీలా నాది ఉత్తేజకరమైన కథ కాదు. వదిలేయ్” అని ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, చక్కని భార్యతో ఉన్న పురంధర చెప్పటం ఎప్పటికీ మనం మర్చిపోలేం. అలా ఆ రామతీర్థానికి వెళ్లే దారిలో నడుస్తున్న వాళ్లిద్దర్నీ అనుసరిస్తూ మనల్ని మనం గుర్తుచేసుకుంటూ నడుస్తూ వెళ్లటం తప్ప మనం ఏమీ చేయలేం..

   మొత్తంగా ఒకవైపు సముద్రం ఒకానొక సామాజిక వాతావరణ చిత్రీకరణ. ఎన్నో పాత్రలు అలా వచ్చేస్తాయి. అయితే ఏ పాత్రా తన ప్రత్యేకత లేకుండా మనలోపలికి వచ్చి నిలిచిపోకుండా మాత్రం ఉండదు. మూడు పేరాలకు దాటని నిడివిలోనే ఎప్పటికీ మర్చిపోలేకుండా ఉండిపోయేలా దిద్దుకున్నాడు రచయిత. విఠోబా పాత్ర రెండే రెండు మాటలు మాట్లాడతాడు. అతని కానీ అతన్ని మీరెప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే మనలో చాలామంది,మి అలాంటి మనుషులనీ, అలాంటి కుటుంబాలనీ చూసి ఉంటాం. కొన్ని సార్లు మనింట్లోనే చూసి ఉంటాం. ప్రతీ మనిషిలోనూ ఒక అవకాశ వాదాన్ని, దాన్ని దాటలేని నిస్సహాయతనీ చూడగలం.

    మొదలైన దగ్గరనుంచీ అలా సాదాసీసాదాగా నడుస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ పూర్తయ్యే వరకూ వదిలిపెట్టలేం. అనువాదం కూడా మూలమంత అద్బుతంగా చేసిన రంగనాథ రామచంద్రరావు గారిని మెచ్చుకోకుండా ఉండలేం. ఘాచర్ గోచర్ చదివిన వాళ్లందరికీ వివేక్ శానభాగ రచనా శైలి తెలిసిపోతుంది. ఈ పుస్తకం కూడా అంతే ఎక్కడా మాటల్లో మెరుపులు ఉండవు. డ్రమటిక్ మలుపులు కనిపించవు. మొత్తం పూర్తిచేసేవరకూ కథ ముగింపుని ఊహించే అవకాశమే లేదు. పురంధర, యశవంత ఇద్దరిలో ఎవరు కీలక పాత్ర అని ఆలోచించే సమయానికే అసలు మనం ఎవరమూ ఊహించని విధంగా, అసలు ఈ కథలో వీరెవరూ ముఖ్యమైన పాత్రలు కారనీ. ఇది వాళ్ళందరి జీవితాలనీ కలిపి చెప్పిన కథ అని తెలిసిపోయి, మనం దేవరాయ, పండరి ల ఇంటివెనుక చిట్టడవిలాంటి పెరడులో రెండు ఇళ్లకీ మధ్య ఉన్న సరిహద్దు దగ్గిర నిలబడి రమాకాంతని చూసి నవ్వుతున్న యమున మొహంలోకి తదేకంగా చూస్తూ ఉండిపోతాం…

    అవును.. ఆ నవ్వుతున్న యమున మొహంలో పొంగే సముద్రాన్ని ఎవరైనా చూశారా??

పుస్తకం : ఒకవైపు సముద్రం

కన్నడ మూలం: వివేక్ శానభాగ

తెలుగు: రంగనాథ రామచంద్రరావు

పబ్లిషర్: ఛాయ, హైదరాబాద్

పుస్తకం అమేజాన్‌లో దొరుకుతుంది. 

నరేష్కుమార్ సూఫీ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు