నల్లటి రాగంలో
ఈ రహదారి పాడే
జ్ఞాపకాల పాటలు
నువ్వు ఎప్పుడైనా విన్నావా
నల్లటి దేహం కింద
చెట్టును కోల్పోయిన తల్లివేరు
బాధతో పాడే పాట ఉంది
గూడును పిట్టను కోల్పోయిన పుడక
వేదనతో పాడే పాట ఉంది
ఇంటిని మనుషులను కోల్పోయిన
ఒంటరి పునాది పాడే పాట ఉంది
నాగలిని రైతును కోల్పోయిన నాగేటి చాలు
బేలగా పాడే పాట ఉంది
పంటలను తోటలను కోల్పోయిన మాగాణి
పచ్చగా పచ్చిగా పాడే పాట ఉంది
నీటి కోసం పచ్చని పంట కోసం
ఎదురు చూసి చూసి అలసి పోయి
శాశ్వతంగా కన్నుమూసిన
బీడు భూముల మోడు పాట ఉంది
తెగిపడిన కలల గురించి
ఇంకిపోయిన ఎండిపోయిన
ఎర్రటి రక్తపు మట్టి పాడే పాట ఉంది
ఎన్ని బంధాలు అనుభూతులు
నవ్వులు జ్ఞాపకాలు
ఇక్కడ సమాధి చేయబడ్డాయో
ఇన్ని దుఃఖపు పాటలను
విని విని ఏడ్చి ఏడ్చి
తన కంటి కాటుక కరిగి
రహదారులు ఇంత నలుపెక్కాయేమో
రహదారులు విస్తరిస్తున్నంతమేర
సమాధుల తోట లా ఉంది.
*
మంచి కవిత సిద్దు.
నీదైన గొంతు
Bagundhi sir veryyyyy superrrr👌👌👌👌👌👌👌👌👌👌👌
చాలా బాగుంది.👌
ఏ రహదారి మీద కాలుమోపాలిప్పుడు ? సిద్దూ, రోడ్ల కింద ఎవరు నిద్రపోలేక మేల్కొన్నారు ?
బాగుంది.
బాగుంది
Nice sir