1.
సమాధి కప్పు కింద
యేవో చప్పుళ్లకీ మళ్లీ లేచి కూచున్నాను,
యీ సమూహంలోకి యెవరో కొత్త మిత్రులు.
నా మిగతా సహచరుల్ని తట్టి లేపాను,
‘లేలే, కొత్త మిత్రులు యెవరో, మళ్లీ,’
‘వాళ్లూ, వాళ్ల తంతులూ కానివ్వూ,
తరువాత పరామర్శిద్దాం, చప్పుడు చేయకు.’
*
గాలికి నిప్పు అంటుకుంది,
ఆకాశం భోరుమంది,
మేం విన్న ఆ పాత మంత్రాలూ, ప్రార్దనల్తో
హోరెత్తిపోయింది మా నేల
‘పద పద, అక్కడ సమాధికి కప్పు కడుతున్నారు, చూద్దాం’
*
యిపుడెవరూ లేరు,
అంతా నిశ్చబ్దం, స్మశాన నిశ్చబ్దం లాగ,
మేమందరం యీ సమాధి కప్పు కింద సమావేశమయ్యాం.
‘నీకు భలేగా కట్టారు, పైకప్పు,
మన విశ్రాంతికీ, సమావేశానికి బాగా వుంది నీదే’
‘అవును ,యిది నాదే,
నా వాళ్లు కట్టించారు,
నా విశ్రాంతి కోసం, మీరెవరు, అయినా
యిక్కడినించి వెంటనే నేనెగిరిపోవాలి కద.
యీ లోకంతో, యీ నేలతో నాకేం సంబంధం.’
‘యెవరు చెప్పారు, నువ్ యెగురుతావనీ,
యిక్కడితో సంబంధం లేదనీ,
యిదిగో,నీకు చెప్పిన వాళ్లందరూ యిక్కడే యెక్కడో
సమాధిలో వేల యేళ్లనించీ విశ్రమిస్తున్నారు,’
*
‘యెవరూ ఎగరలేరూ!,
నీకు పెట్టిన భోజనం యెంత సువాసనేస్తుందో,
మనకి వొట్టి వాసన చూడ్డమే కద.
మాకు యేడాదికోసారి వొస్తారు, నీకిప్పటికి ప్రతీ నెలా.’
వొక్కసారిగా అందరూ నవ్వారు.
‘భయపెట్టకండేం! యింతకంటే
భయాల్ని చూసుంటారు కద యీ కొత్త సహవాసి.’
‘మరి స్వర్గం మాటేవిటి,
నేనెపుడూ యెవరికీ హాని చేయలేదు కద.’
‘అవి వొట్టి గీతలూ, షరతులూ,
చూడూ, ఆ సోక్రటీసునుంచీ, విప్లవకారుల్నించీ,
మంచి మనుష్యుల్నించీ, హిట్లర్నించీ,
అనాది కాలం నుంచీ,
అసలు చెప్పొచ్చేదేమంటే,
చావుకి,
నీతికి,
యెలాంటి సంబంధం లేకుండా
అందరం యిక్కడే వున్నాం కద.
మన అనాది పూర్వీకులిపుడు గాఢ నిద్రలో వున్నారు.
చావంటే, వొక గాఢ మైకం, నిద్ర,
దీనికి స్వర్గం లేదు, నరకం లేదు.
చావు తరువాత పిలుపు వుంటుందని
అందరూ దాంట్లో శాంతినీ,మోక్షాన్నీ, నరకాన్నీ వెతుకుతారు.
మతాధికారులూ,తల్లీ,తండ్టీ, మతగ్రంధాలూ, ఆచారాలూ యివన్నీ నూరిపోసి,
ఆఖరికి నిన్ను పంపేది యిక్కడికే,
యిక్కడినుంచి యెక్కడికి అని
యిప్పటివరకూ మనతో పాటు నిద్రిస్తున్న
యీ అనాది పవిత్ర పురుషులతో పాటు
మనమూ కొంత విశ్రాంతి తీసుకోవాలి మిత్రమా,
వొక్క పిలుపు కూడా లేదిప్పటివరకూ,
రేపు అనేది తెలిసే వరకూ…
అంతవరకూ,
నీ సమాధి పైకప్పు కింద విశ్రమించనీ,
మా సమాధులకి కప్పు కట్టలేదెవ్వరు.’
అంటో మా మిత్రుల్నికేకేస్తున్నాను,
‘స్వర్గాల్ని గురించి ఆశ పెట్టిన పూర్వీకుల నిద్రకి
భంగం వాటిల్లకుండా యీ పైకప్పు వున్న సమాధికి రండి,
వర్షం మళ్ళీ విరుచుకుపడుతుందేమో?’
2.
వొక్కసారి వెనక్కి తిరిగి చుసినప్పుడు
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు
యింకోసారి అంతరిక్షం
జన్మం సమయం మార్చుకునేదేమో
యింకొక్కసారి
విశ్వాలు గ్రహాలు
ఆకారాన్ని సంతరించుకునే లోపే
వెనక్కి తిరిగి చూడలేదు
నీ అడుగుల చప్పుడు వినపడినప్పులా
వెనక్కి తిరిగి చూసే బద్దకం
తీరా నేను వెనక్కి తిరిగి చూసేసరికి
దుమ్ము లేవని నీ అడుగుల చప్పుడు
కృష్ణబిలాల నిశ్శబ్దపు
చీకటి చప్పుడు.
3.
యేది ఒప్పు యేది తప్పు
యే గమ్యస్థానికో తెలియని
అస్పష్టపు అంతరిక్షం ధ్వనించినప్పుడు
యిహలోకాలూ పరలోకాలూ పాతాళాలూ అన్నీ పుట్టాయి.
సాయం సంధ్యవేళ పక్షుల గుం పులో
నియమయాల గురించి తెలీకుండా కొన్ని పక్షులు
వెనక్కి తిరిగి రావడం ఉల్లంఘం.
మేఘాలు పోటెత్తినప్పుడల్లా, వర్షం కుంభవృష్టిగా కురిసినపుడు
కొన్ని అలలు మాత్రం ప్రసవించడం మానేసి వెనుతిరిగి వెళ్లిపోయాయి.
గొంగళిపురుగులు యింకో జన్మ యెత్తినపుడు
కొన్ని పురుగులు రంగుల్ని పూసుకోవడం మానేసి ఆత్మహత్యలు చేసుకున్నాయి.
రాల్చే ప్రతీ ఆకుకీ చెట్టుకు తెలుస్తుందేమో
అందుకే వీధి దీపాలు వెలిగినప్పుడో లేక
వెన్నెల్లో మాత్రమే ఆకుల్ని రాల్చుకుంటుంది చెట్టు.
మనం వెతికే గాలివానల్ని సృష్టించిన అంతరిక్షం
అప్పుడే విశ్వమండలం.
*
Sridhar Chandupatla గారికి అభినందనలు!
మీ కవితల్లోని లోతు ఘాడత కట్టిపడేసింది. ఇలాంటి అద్భుతమైన కవితలు మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నాను.