ఈ యేడాది మార్చి నెల పన్నెండవ తేదీ రాత్రి యాభైయేళ్ళ నా కూర్మినెచ్చెలి వాడ్రేవు పాండురంగారావు గారు (1936-2018) పుట్టపర్తిలో పరమపదించారు. అరవైనాలుగేళ్ళ క్రితం మార్చి పన్నెండవ తేదీననే న్యూఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాదెమి సంస్థ ఆవిర్భవించింది.
అకాదెమి సంస్థే మా ఇద్దరికీ మైత్రిని సంఘటించింది. నేను అకాదెమి కార్యదర్శి కృష్ణ కృపలానీ గారికి వ్యక్తిగత సహాయకునిగా ఉండిన కాలంలో రంగారావు గారు వారి దర్శనార్థమై రవీంద్ర భవన్ కు వచ్చారు. ఇద్దరమూ ఇరవైలలో ఉన్నాము; వారు నా కంటె రెండేళ్ళు పెద్ద. నా గదిలోనే వేచి ఉండవలసి వచ్చింది. పరస్పర పరిచయాలయ్యాయి. సాహిత్య అకాదెమి వార్షిక పురస్కారాలలో The Guide ఆంగ్ల నవలారచనకు గాను ప్రప్రథమ పురస్కార విజేత అయిన ఆర్.కె. నారాయణ్ గారిని అధికరించి వారు పిహెచ్.డి సిద్ధాంత వ్యాసరచన చేశారని తెలిసింది. రెండేళ్ళ మునుపు నారాయణ్ గారు కృపలానీ గారిని చూడటానికే వచ్చి, మీరిప్పుడు కూర్చున్న కుర్చీలోనే కూర్చున్నారని నేను వారితో అన్నాను. నారాయణ్ గారు నన్ను “టైమెంత?” అని అడిగారు. ఆయన చేతికి వాచీ లేకపోవటం చూసి, ఆ సంగతే అడిగాను. వాచీ ఉంటే ప్రతిక్షణం సమయం చూసుకోవలసి వస్తుందని; అట్లాంటి హెచ్చరిక తనకు ఇష్టం ఉండదని ఆయనన్నారు. ఆ విషయాన్ని తలచుకొని ఇద్దరం హాయిగా నవ్వుకొన్నాము. తమ ఆరాధ్యవ్యక్తిని గురించిన ఆ ఉదంతానికి ముగ్ధులై రంగారావు గారు నాతో మరింత సమయం గడపాలని అనుకొన్నారు.
ఇద్దరం కనాట్ ప్లేస్ లో సన్నీ కాఫీ హౌస్ కు నడుచుకొంటూ వెళ్ళాము. ఆర్.కె. నారాయణ్ గారిని గురించి, దేశంలో ఆంగ్ల రచనల తీరుతెన్నులను గురించి మాట్లాడుకొన్నాము. ఇళ్ళకు బయలుదేరే ముందు ఆయన నా డాక్టరేట్ వ్యాస విషయం ఏమిటని అడిగారు. నేను గలగలా నవ్వి, వట్టి గ్రాడ్యుయేట్ నని, పిహెచ్.డి చెయ్యలేదని చెప్పాను. ఆయన విస్తుపోయారు. తరచు కలుసుకొంటుండేవాళ్ళం. మా రవీంద్ర భవనానికి కిలోమీటరు దూరాననే రౌజ్ ఎవెన్యూలో ఆయన ఆంగ్లోపన్యాసకునిగా పనిచేస్తుండిన శ్రీ వేంకటేశ్వర కళాశాల భవనం ఇప్పటి ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాంగణంలో ఉండేది.
తరగతులు పూర్తయాక రంగారావు గారు అకాదెమికి నడుచుకొంటూ వచ్చేవారు. మేము మాట్లాడుకొన్నదంతా సాహిత్యాన్ని గురించే. అప్పటికి నేను టాగూర్, గాంధీ, నెహ్రూ గారల రచనలనే గాక ఆంగ్లంలో వెలువడిన ముల్క్ రాజ్ ఆనంద్, ఆర్.కె. నారాయణ్, మనోహర్ మల్గాంకర్, భబానీ భట్టాచార్య వంటి భారతీయ రచయితల నవలలను చదివి ఉన్నాను. రంగారావు గారు నేను ఎం.ఎ గాని, పిహెచ్.డి గాని ఎందుకు చేయలేదని అడిగారు. కృష్ణ కృపలానీ గారి వద్ద అసిస్టెంట్లుగా ఉన్న ముగ్గురు పిహెచ్.డి లు ఎప్పుడేది వ్రాసినా – ఒకప్పుడు రవీంద్రనాథ్ టాగూర్ గారు నెలకొల్పిన Visva Bharati Quarterly పత్రికకు సంపాదకులుగా పనిచేసిన న్యాయశాస్త్ర పట్టభద్రులైన కృపలానీ గారు సరిదిద్ది, మొత్తం తిరగరాసుకోవలసి వస్తున్నదని నేనన్నాను. చదువుకొనటమే గాని, డిగ్రీలను సంపాదించాలనే కోరిక లేదని – ఆనాటి యౌవనోద్వేగపు దూకుడు కొద్దీ సమాధానం చెప్పాను!
ఎంతో పట్టుబట్టి మరీ రంగారావు గారు నన్ను ఇంగ్లీషు ఎం.ఎ చదవమని పురికొల్పి, ఆ తర్వాత పిహెచ్.డి కి ప్రోత్సహించారు. పుస్తకాలు కొనే స్తోమతు లేక నేను ఆయన వ్యక్తిగతసంచయంలో నుంచి తీసుకొనేవాణ్ణి. వారు గ్రీన్ పార్క్ లో అద్దె ఇంటిలో ఉన్న రోజుల్లో అటకమీదికెక్కి పుస్తకాల కట్టలను దించటం నాకింకా గుర్తుంది. అన్నింటినీ నేలకు పరిచి, దుమ్ము దులిపి, పద్ధతిగా అమర్చి, నాకు కావలసినవాటిని ఎంపికచేసి ఇంటికి తీసుకువెళ్ళాను. ‘పుస్తకాలను ఇవ్వటం మూర్ఖుడి పనైతే, వాటిని తిరిగి ఇవ్వటం ఇంకా మూర్ఖుల వాలక’ మని అంటారే, అది మా పట్ల ఏనాడూ నిజం కాలేదు. ఆయన ఎంతో ఉదారస్వభావులు. విద్యార్థులకు సాయం చేయాలంటే ఎంతటి కష్టానికైనా వెనుదీసేవారు కారు.
కథ, నవల, వ్యాసం, పుస్తక సమీక్ష – ఏది వ్రాసినా, పరిష్కృతపాఠానికి మునుపు దాని తొలిరూపాన్ని నాకు చూపించేవారు. వాహ్యాళి సమయంలోనో, ధౌలా కువాలో ఆ రోజుల్లో ఖాళీగా ఉండే రైల్వే ప్లాట్ ఫారం బెంచిమీద కూర్చొనో మేము చర్చించుకొనేవాళ్ళం. రైళ్ళ రాకపోకలను చూస్తుండటమంటే మా యిద్దరికీ చిన్ననాటి నుంచి ఉన్న అభిమానవిద్యే.
ఆయన తమ తొలి నవల Fowl Filcher మొదటి ప్రతిని ముగించిన రోజు నాకెప్పుడూ జ్ఞాపకమే. నా స్పందనకోసం పట్టుబట్టడం వల్ల రాత్రంతా వారింటనే ఉండి దానిని చదివి ముగించాను. పగలంతా దానిని ఆసాంతం సమీక్షించుకొన్నాము. భారతీయతా సురభిళ పరిమళం ఉట్టిపడే విశిష్టమైన వారి సరిక్రొత్త ఆంగ్ల నుడికారం ఇంపుసొంపులు నన్నెంతగానో ఆకట్టుకొన్నాయి. నేనప్పటివరకు చదివిన రచయితలలో రాజా రావు మొదలుకొని భబానీ భట్టాచార్య వరకు పాశ్చాత్యదేశాల ఆంగ్ల పాఠకుల రసానుభూతికై వ్రాయటమే గాని, వారివలె భారత జాతీయ సంస్కార విశేషప్రతిఫలనాన్ని అంతగా ఉద్దేశించినట్లు కనబడదని ఆ రోజు వారితో నేనన్నాను. విదేశీయుల కోసమని గాక, ఆత్మీయమైన ఆంగ్ల భాషాప్రయోగానికి పూనుకొన్న రచయిత వారు. ఆ మాట విని ఆనందంతో ఉప్పొంగిపోయారు. నవలను ఇంకా పరిష్కరించాలని నేనన్నప్పుడు వారు వెంటనే అంగీకరించారు. ఎన్నో మార్లు సవరణలు చేయవలసివచ్చింది. సరిదిద్దిన ప్రతిసారీ మళ్ళీ చూడమనేవారు. తమ రచనను పలుపర్యాయాలు పునారచించే ఆ అలవాటు వారికి చివరి వరకూ సాగింది. వారి మాటే: Fine Tuning అని. ప్రచురణకర్త కోసం చాలా కష్టపడవలసి వచ్చింది. ఖుష్వంత్ సింగ్ గారు దానిని గుణోత్కృష్టతను గుర్తించాక – పెంగ్విన్ ఇండియా వారి తొలినాటి ప్రచురణలలో ఒకటిగా Fowl Filcher నవల అచ్చయి, ఎన్నో పునర్ముద్రణలను పొందింది.
కల్పనాత్మక సాహిత్యసృష్టికి సైతం ఆయన సువిస్తృతంగా పరిశోధన చేశారు. గ్రంథాలయాలలో అధ్యయనిస్తూ తమ తులనాత్మక పరిశీలనలకు నోట్సు వ్రాసికొనేవారు. ఈస్టిండియా కంపెనీ ప్రవేశకాలం నుంచి భారతదేశంలోని స్థితిగతుల పరిశీలనతో తెలుగు ప్రాంతాలలోని కథాసన్నివేశాలతో కొన్ని నవలలను వ్రాయమని నేను వారికి సూచించాను. ఏతత్ఫలితమే వారి The River Is Three-Quarters Full నవల. ఆ తర్వాతి రచనకు రెండు దశాబ్దాల పరిశోధన ఆవశ్యకమైంది. మరిన్ని రావలసి ఉండింది. అయితే, ఆయన విమర్శప్రకాశం బహుముఖీనంగా విస్తరిల్లింది. కళాశాలలో పతనమౌతున్న విద్యాప్రమాణాలను, నైతిక విలువలను అధికరించిన The Drunk Tantra ను వెలువరించారు.
నేను ఇండియన్ లిటరేచర్ పత్రికకు సంపాదకత్వం వహించినప్పుడు తెలుగు నుంచి ఆంగ్లంలోనికి అనువదింపబడిన రచనలు అతివిరళంగా ఉన్నాయని, వారి వంటి రచయితలు ఆ బాధ్యతను చేపట్టాలని అంటుండేవాణ్ణి. అది తమ సృజనాత్మక వ్యాసంగానికి అవరోధమని అనేవారు. ఎట్టకేలకు తెలుగు నుంచి అనువదించి రెండు కథా సంకలనాలను ప్రకటించారు. ఆ గ్రంథాల తుదిపలుకులలో అనువాదప్రక్రియలో తాము ఎదుర్కొన్న సమస్యలను గురించిన విపుల వివరణలను వ్రాశారు.
బోధనకళలో ఆయన గొప్ప ప్రజ్ఞాశీలి. విద్యార్థులు ఆయనను చెప్పలేనంతగా అభిమానించేవారు. నేను ఆయన తరగతిలో కూర్చొని ఆంగ్ల భాషా రచనలోని మెళకువలను గ్రహించాను. బోధనకు ఉపక్రమించినప్పుడు ఆయన సేకరించిన గ్రంథాలు, వ్రాసికొన్న నోట్సు, వ్యాసాల సైక్లోస్టైల్డ్ ప్రతులు నాకు ఆధారభూమికలయ్యాయి. ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర కళాశాలలో పదవీ విరమణ చేసిన తర్వాత వారు పుట్టపర్తికి చేరుకొని, శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాధ్యయన సంస్థలో దేశికులుగా ఉన్నారు. ఉపాధ్యాయవృత్తిని ఒక ఉద్యోగబాధ్యతగా కాక ఒక హృద్యోగధర్మంగా సంభావించినవారు.
మేము ఢిల్లీలో అడుగుపెట్టిన నాటినుంచి పరిచయం సిద్ధించి పరస్పరం ఎంతో చేరువయ్యాము. వారి కుమార్తె సుగుణ, ఇద్దరు కుమారులు శివ, గోపాల్ లతో మా అమ్మాయి, కొడుకులిద్దరికీ అవినాభావ సంబంధం నెలకొన్నది. తరచు కలుసుకొనేవాళ్ళం.
రంగారావు గారి ఔద్యోగికజీవితం టెలిగ్రాఫ్ డిపార్టుమెంటులో గుమాస్తాగా మొదలై విశ్వవిద్యాలయంలో అశేషవిద్యార్థిబృందాల భక్తిగౌరవాలను సముపార్జించిన ఆచార్యునిగా, మేలైన కథారచయితగా, నవలాకర్తగా, సాహిత్య పరిశోధకునిగా, సంపాదకునిగా, విమర్శకునిగా, అనువాదకునిగా సఫల పరిణామాన్ని చెందింది. ఆయన ఆధ్యాత్మిక గవేషణ యౌవనావస్థ నాటి నాస్తికత నుంచి పుట్టపర్తిలోని ప్రశాంతినిలయంలో తత్త్వశాంతిని చూరగొన్నంత వరకు ప్రస్థానించింది. అంతపర్యంతం తమ సహధర్మచారిణి, యావజ్జీవ సుఖదుఃఖభాగస్వామిని అయిన విజయలక్ష్మి గారి సన్నిధిరూపమైన పెన్నిధికి నోచుకొని నిరాయాసంగా పరమపదాన్ని చేరుకొన్నారు.
ఇంగ్లీషు నుంచి అనువాదం: ఏల్చూరి మురళీధర రావు
*
చాలా మంచి నివాళి ..వారికి దగ్గరయిన వారికి తెలుసు ఆయన ఎంత ప్రేమామ్రుతుడో .. DSRao గారికి ధన్యవాదాలు ..
ముకుంద రామారావు
హైదరాబాద్