సంతకం కాదు, రాతను చూడాలి!

సుహృల్లేఖ – 3

ద్యం మనది. నేటి తెలుగు కవిత్వం రెండుగా చీలిపోయింది.

వచన కవిత్వం రాసేవారు ఒకవైపుంటే, ఛందోబద్ధకవిత్వం రాసేవారు ఇంకోవైపున్నారు. ఈ చీలిక గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నా, ఛందోకవిత్వం సాధారణస్రవంతి (mainstream) పత్రికలలో అంతగా కనిపించకున్నా, నన్నయాదులు వేసిన బాటను వదులుకోలేని ఉత్తమకవులూ, భాషాభిమానులూ ఓ పట్టాన పద్యాన్ని వదులుకోలేక రాస్తూనే ఉన్నారు. వీరంతా విశ్వనాథ వారసులు. ఛందస్సులో పద్యాలు రాసేవారు (రాయగలిగేవారు) అరుదుగానే వచనకవిత్వంవైపు చూస్తారు. వీరిలో చాలామంది శ్రీశ్రీ అజంతా బైరాగి వంటి కవుల తరువాత వచ్చిన కవుల్ని అంతగా చదవరు, గట్టిగా మెచ్చుకోరు.

ఇక నా తరంలో చాలామంది చాలా లేటుగా ఛందోబద్ధకవిత్వాన్ని చదవడం మొదలుపెట్టారు. వీళ్ళు “ఛందో బందోబస్తులన్నీ ఛట్‌ఫట్‌మని తెంచేసి”న శ్రీశ్రీ వారసులు. నేను చదివిన కవితా సంకలనాలలో ఛందోకవిత్వానికి చోటు దొరకలేదు. ఛందోబద్ధకవిత్వం రాయడం “కాళ్ళకు సంకెళ్ళు వేసుకొని నడవడం” లాంటిదని ఇస్మాయిల్ వంటి కవి ఎగతాళి చేశాడు.

ఛందస్సులో ఆధునిక కవిత్వంలోని విషయం ఇమడదనీ ఇప్పటి nuance రాదనీ వాదించే పండితులున్నారు. మామూలు మాటల్ని రాసి పాదవిభజనకై లైన్లకింద విరగ్గొడితే అదే వచనకవిత అని ఎగతాళి చేసే పండితులూ ఉన్నారు (“ఇక్కడ పేకేజీ పెట్టెలు అమ్మబడును!”). మొత్తానికి మంచి తెలుగు పద్యం (వచనకవితైనా ఛందస్సులో ఉన్నా) రెండు దార్లు వెతుక్కుంది. దీని వలన మంచి వచనకవితలకు రసికహృదయ స్పందన తగ్గింది, మంచి పద్యాన్ని ఆస్వాదించే శక్తియుక్తులు యువకవుల్లో తగ్గుతున్నాయి. నా తరం కవులు శ్రీశ్రీకి ముందు కవులను పెద్దగా చదువుకున్నవారు కాదు. “ఆదిమధ్యావసానేషు..” కంఠస్థం చెయ్యలేదు. “శ్రీవాణీగిరిజాశ్చిరాయ..” అనే ఆదికవితను ఏదో సినిమాపాటలో విన్నారు కానీ దానిపై సుదీర్ఘమైన చర్చ గురించి ఎరుగరు. ఇటీవల మళ్ళీ ప్రాచీనకవులపైన శ్రద్ధాసక్తులు చూపించడం మొదలై అందరూ “మంచి” పద్యం కోసం నాలుగునాళ్ళు నిలబడే కవిత్వం కోసం అర్రులు చాస్తున్నారు. ఇదొక శుభపరిణామం.

తెలుగులో కవితా సంకలనాల సంపాదకులకు ఎందుకో ఛందోబద్ధకవిత్వంపై మమకారం తక్కువ.

మన సంపాదకులకు ఎవరి prejudices వారికున్నాయి. ముద్దుకృష్ణ వైతాళికుల్లో జాషువాకు స్థానం లేకపోవడాన్ని విమర్శించినవారు, వెల్చేరు నారాయణరావు గారి 20th Century Telugu Poetryలో ఆకాలంలోనే వచ్చిన అద్భుతమైన కవితలు లేకపోవడాన్ని ఎత్తిచూపారా? ఇది ఆ సంకలనానికే లోపమని నేను నమ్ముతాను. Conspicuous by absence అంటారు కదా, అలాగన్నమాట ఈ రెండు దృష్టాంతాలూ, ఇంతే కాదు ఈ సంకలనాలనే reference booksగా చూసినవారికి తెలుగు కవిత్వం పూర్తి రూపం కనిపించకుండా పోతుంది, ముందుమాటల్లో ఆ సంపాదకులు తమ తమ limitations తెలియజెప్పినా సరే.

తెలుగులో ఎవరేం రాశారో తెలుసుకునేందుకు కావలసిన సామగ్రి మనకు అచ్చులో ఏనాడూ దొరకలేదు. ఔత్సాహికులైన పాఠకులు (వీళ్ళలో కవులే ఎక్కువ) ఎవర్నో అడిగి తెలుసుకోవలసిందే, ఆనోటా ఈనోటా విని పుస్తకాలు సంపాదించుకోవల్సిందే. తెలుగు కవులకు మంచి రచనలంటే ఉన్న passion ను harness చేసే ప్రయత్నం ప్రచురణకర్తలూ సంపాదకులూ చెయ్యలేదు. ఏకాకిగా రాసుకుంటూ ఎంత మంచి కవి అయినా ఎన్నాళ్ళుంటాడు? ఎంతటివాడికయినా ఒకానొకవేళ అస్త్రసన్న్యాసం తప్పదు. నాకు తెలిసీ రాయడం ఆపేసినవాళ్ళలో వనమాలి ప్రముఖులు. వీరి “రూప భేదం” (Split Image) వంటి కవితాసంపుటి తెలుగులో అరుదుగా వచ్చిన, తెలుగు విమర్శకులు పరీక్షించలేని జాతి రత్నం. వనమాలి పేరు మీరు విన్నారా? ఆయన శేషేంద్ర శర్మ గారి అబ్బాయి అని మీకు తెలుసా? ఇలాంటి ఉదాహరణలు ఇంకొన్ని ఇవ్వగలను. కానీ ఏం ప్రయోజనం?

ఈ అస్త్రసన్న్యాసం చేసినవారి వల్ల తెలుగు కవిత్వం నష్టపోయినది చాలా ఉంది. మన కవిత పరిపుష్టం కాకుండా పోవడం ఒకటైతే, రాజకీయ సోదినీ non-poetry నీ చదివి చదివీ నవతరం ఈ cliched gibberish నే కవిత్వం అనుకునే ప్రమాదం ఏర్పడి అదొక పెనుభూతమైంది. “సోది” అని నేను అంటున్న రచనలను “కవిత్వం వేషంలో వచ్చిన అకవిత్వం” అని ఒక విమర్శకుడన్నాడు, కొన్ని దశాబ్దాలకు పూర్వం. సరే, ఎవరైనా కొంత సోదిని భరించక తప్పదనుకున్నా, సెకండుకు అరవై రాజకీయ కేకల్ను పెట్టే వాళ్ళనేమనాలి? ఇది ఇటీవల సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా పత్రికల్లోనూ ఎక్కువైంది.

కదిలించేదే కవిత్వమని అనుకుంటే, దానిని సాధించడానికి కవులు కష్టపడాలి. మంచి కవిత్వం రాయడం సులువు కాదు. అదొక సూత్రానికి అందదు. ఎవరో telegram ఇస్తే రాసినట్టో తెచ్చిపెట్టుకున్నట్టో ఏదో “అంతర్జాతీయ దినం” వచ్చిపడిందనో ఈ సంపుటి అచ్చువేస్తే తప్ప ఆ ఫలానా అవార్డు రాదనో రాస్తే, కవి తనను తను మోసం చేసుకున్నట్టు కాకపోయినా, కవిత్వాభిమానులను మోసం చేసినట్టే. ఇది క్షంతవ్యం కాదు. ఇవే ధోరణులు కనిపిస్తూపోతే, రాను రాను చదివే వారి సంఖ్య బాగా పడిపోతుంది. దీనినే నానాటికీ తీసికట్టు అంటారు. ఇప్పటికే అంతమందిలోనూ అవార్డు కవులంటే లోపల్లోపల గౌరవం తగ్గుతోంది, ఎవరికి ఏ అవార్డు ఎలా వచ్చిందనే సంగతీ ఎవరి ప్రాపకం వల్ల వచ్చిందన్న సంగతీ viral ఔతూ ఉన్నాయి.

తెలుగు కవిత్వం ఇంకో రెండు దశాబ్దాలైనా ఉండాలంటే, అంతా నిష్కర్షగా వ్యక్తుల్ని వెనక్కు నెట్టి, విషయానికి పట్టం కట్టాలి. రాసినవాడి సంతకం కాదు, రాతను (content ను) చూడాలి. కొందరు ఇటువంటివాటిని చూసీచూడనట్టు ఊరుకొని, “మంచి రచనను సృష్టించాలి” అని ఆ గమ్యం దిశగా సాగిపోతారు. ఈ దారిని వెళితే తప్ప మనకు రక్షాకవచం దొరకదు, కవిత్వాభిమానులకు అనిర్వచనీయమైన రసానుభూతి దొరకదు. కనుక ఈ దారిన అందరమూ వెళదాం.

చివరిగా నేనిది కోపం (anger)తో రాసినదికాదు. పరివేదన (anguish)తో రాసినది. విజ్ఞులు గమనించగలరు. మళ్ళీ కలుద్దాం.
*

వాసు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు