శ్రీ గణనాథం…. భజామ్యహం

శ్రావణ మాసం.. పసుపు, పేరంటాలను అగ్రహారానికి వదిలేసి వీడ్కోలు తీసుకుంది.

శ్రావణమాసం… గుప్పెడు సెనగల్నీ.. గుండెల నిండా ప్రేమల్నీ పంచి చక్కా వెళ్లిపోయింది.

శ్రావణ మాసం… అగ్రహారానికి పట్టు  పరికిణీల్లాంటి జ్ఞాపకాలని దోసిట్లో వొంపి జరీ అంచులా జారి పోయింది..

శ్రావణమాసం… చిన్ని కృష్ణుడి పాదాలని ఇళ్లలోకి ఆహ్వానించి తాను నడుచుకుంటూ వెళ్లిపోయింది.

శ్రావణమాసం… భాద్రపదాన్ని బహుమతిగా ఇచ్చి తాత్కాలిక సెలవు తీసుకుంది.

****                                  *****                                           ****

భాద్రపదం… పొలాల్లో వరినాట్లతో వయ్యారంగా ఉంది….

భాద్రపదం… చల్లని గాలులకు ఊగుతున్న పొలాలు పసిపిల్లల నవ్వుల్లా ఉన్నాయి…

భాద్రపదం… పొలం గట్టు మీద కర్రతో నిల్చున్న రైతులు.. చేతిలో గరిటతో మహాశివుడికి అన్నం పెడుతున్న అన్నపూర్ణలా కనిపిస్తున్నారు.

భాద్రపదం… విఘ్నాధిపతిని అగ్రహారం ఇళ్లలోకి చేయి పట్టుకుని తీసుకు వస్తున్నట్లుగా ఉంది.

****                                  *****                                           ****

భాద్రపదమంటే… పందిళ్ల సందడి…

భాద్రపదమంటే… సాంస్కృతిక సంరంభం…

భాద్రపదమంటే… చింతామణి నాటకం

భాద్రపదమంటే… సత్యహరిశ్చంద్ర పద్యాలు..

భాద్రపదమంటే…  రికార్డింగ్ డ్యాన్సుల కోలాహలం..

భాద్రపదమంటే…  కోలాటాల కేరింత..

****                                  *****                                           ****

కొబ్బరి చెట్టు కంటే పొడవైన తాటి దుంగలు. గడియార స్థంభానికి కుడి వైపు… ఎడమ వైపు కనీసం ఐదారడుగుల లోతులో పాతిన దుంగలు. ముమ్మిడివరం గేటు వైపు వెళ్లే దారిలో ఇలాగే మరికొన్ని తాటి దుంగలు. అలాగే బస్టాండ్ కి వెళ్లే దారిలో మరికొన్ని తాటి దుంగలు భూమి లోపలికి పాతి అటు ఇటు కదలకుండా సపోర్టుగా సిమెంట్ చేసినంత బలంగా పునాదులు. నాలుగు వైపులా అల్లుకున్న తీగలా ఉండే  ఈ చలువ పందిరి వైశాల్యం అర కిలోమీటరు పైమాటే. మధ్యలో దాదాపు ఓ ఏభై తాటి దుంగల సపోర్టుతో తాటి ఆకులతో చలువ పందిరి. దట్టంగా నేసిన పట్టె మంచంలా ఉండేది ఆ పందిరి. వర్షపు జల్లులు పడినా  ఆ పందిరి కింద నిలబడితే ఒక్క  చినుకు కూడా ఒంటిపై పడదు.

వర్ష ధారకి ధారకి మధ్య కోసుకుపోయే ఖాళీ కూడా ఉండదు.

ఇది వినాయక చవితికి పదిహేను రోజుల ముందు నుంచే అగ్రహారానికి ప్రారంభంలో ఉండే గడియార స్థంభం దగ్గర వేసిన వినాయక  చవితి మంటపం. రేపు వినాయక చవితి అనగా శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, ఏనుగులు, నెమళ్లు, బ్రహ్మ, విష్ణువుల ఏడెనిమిది అడుగుల ఎత్తున ఉండే మట్టి విగ్రహాలు మంటపానికి వచ్చేవి. వీటిని ట్రాక్టర్లలో తీసుకు వచ్చేవారు. ప్రతీ ఏటా కొత్త దేవుళ్ల విగ్రహాలు రావడం చూసాను కాని సీతా లక్ష్మణ హనుమత్ సమేత రాముడి విగ్రహాలు పెట్టడం మాత్రం నాకు తెలీదు.  ఈ మంటపంలో కోనసీమకే ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వినాయకుడి బొమ్మ ఉండేది. ఆ బొమ్మది ఓ ప్రత్యేకత. బొమ్మ పక్కనే ఉన్న హుండీలో పది పైసలు వేస్తే వినాయకుడి కుడి చేయి అవలీలగా పైకి లేచి ఆ పది పైసలు వేసిన వారిని ఆశీర్వదిస్తుంది.

వినాయకుడు ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసుకోవడం ఓ శాస్త్రం. వినాయకుడి ఆశీర్వాదం తీసుకోవడం  ఓ అమాయకపు సంతోషం.

ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు జరిగిన పది రోజులూ ఏదో ఒక సమయంలో వినాయకుడి ఆశీర్వాదం తీసుకోవడం, అందుకోసం ఎలాంటి చిరుతిళ్లూ తినకుండా ఓ పది పైసలు దాచుకోవడం… ఐదో తరగతి తెలుగు వాచకంలో నెమలి ఈక దాచుకోవడమంత ఆనందం.

****                                  *****                                           ****

 

గడియార స్థంభం దగ్గర వేసే ఈ మంటపం నిర్వహణ బాధ్యత చిక్కాల సూర్యారావు గారిది. నిండైన ఆరడుగుల మనిషి. కోపం ఎలా ఉంటుందో ఆయనికి తెలీదు. ఈ పందిరి వేసిన ప్రాంతంలో చిక్కాల సూర్యారావు అండ్ సన్స్ పేరుతో ఓ బట్టల దుకాణం నడిపే వారు. ఆ పక్కనే ఉన్న కిరాణా దుకాణాల యజమానులు ఆకే నాగరాజు, వరదా వెంకటానందం ఈ మహాక్రతువు నిర్వాహకుల్లో ముఖ్యమైన వారు. వీరిద్దరిదికీ అక్కడే కిరాణా వ్యాపారం ఉండేది.  పందిరి చుట్టూ ఉన్న శరత్ ఏజెన్సీస్, పేర్లు లేని కిళ్లీ కొట్లు, పూల కొట్లు, విజయ ఫొటో స్టూడియో అధినేత విజయ రామారావు, నాయుడు  హొటల్ ఓనర్ నాయుడు, మర్ఫీ రేడియోల దుకాణం యజమాని… వీరంతా  ఈ మంటప నిర్వాహకులు. పది రోజుల పాటు వారి వ్యాపారాలన్నీ మూసే ఉండేవి. లేదూ వాటిని వారి వారి పిల్లలో, మరొకళ్లో చూసుకునే వారు. ఈ పందిరి వయసు నేటికి 70 ఏళ్ల పైమాట. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో కూడా ఈ వినాయక చవితి నవరాత్రోత్సవాలు నిరాటంకంగా జరిగాయని పెద్దలు చెబుతారు.

పెద్ద పందిరి కింద మరో చిన్న పందిరి వేసి అక్కడ పసుపు గణపతిని ప్రతిష్టించి, దాని పక్కనే మరో మట్టి గణపయ్యను పెట్టి పూజలు చేసే వారు. ఆ మండపం పక్కనే మరో స్టేజీ. దాని మీద ముమ్మిడివరం గేటు దగ్గరున్న శ్రీరామ సైకిల్ స్టోర్ వారి నుంచి తీసుకువచ్చిన హీరో సైకిల్ ఓ పక్కా, నంద్యాల రామారావు గారి స్టీలు కొట్టు నుంచి తీసుకువచ్చిన స్టీలు బిందె మరో పక్క దర్పంగా నిలబడుండేవి. ఇవి పందిరిలో లాటరీలో పెట్టిన బహుమతులు. మొదటి బహుమతి హీరో సైకిల్. రెండో బహుమతి స్టీలు బిందె. లాటరీ టిక్కట్ల పుస్తకాలు పట్టుకుని కొందరు కుర్రాళ్లు గడియార స్థంభం నుంచి వెళ్లే వారిని ఆపి లాటరీ టిక్కట్లు కొనిపించే వారు. మరికొందరు చిన్న పిల్లలు సీల్ చేసి… నాణాలు డబ్బాలో పడేంత కన్నం ఉన్న సీవండి రేకుల డబ్బాలతో అటు వైపు సైకిళ్ల మీద వెళ్లే వారిని ఆపి చిల్లర పైసలు ఆ డబ్బాలో వేయించుకునేందుకు సైకిల్ వెనుక పడేవారు.

వినాయక చవితికి ముందు రోజే పాల వెల్లులు, పూజా సామాగ్రి, వివిధ రకాల ఆకులతో ఉన్న పత్రి, పాలవెల్లికి కట్టే మొక్కజొన్న పొత్తులు, వెలక్కాయలు, మారేడు కాయలు, సీతా ఫలాలు, కొబ్బరి పువ్వులు విక్రయించే దుకాణాలు వెలసేవి. ఇక ఇంతింత కళ్లేసుకుని తామర పువ్వులు రారమ్మని పిలుస్తున్నట్లుగా ఉండేవి. పందిరి కింద నేల మీద కొందరు వీటిని విక్రయిస్తూంటే మరికొందరు సైకిల్ వెనక బుట్టలు కట్టుకుని అమ్మకాలు జరిపే వారు. వీరితో పాటు చిన్న పిల్లల ఆట వస్తువులు, బూరలమ్మే వాళ్లు, లక్కపిడతలు అమ్మే వారు, బుడగలమ్మే స్త్రీలు పందిరిలో సందడి చేసే వారు. యాచకులు ఉండే వారు కాని ఇప్పట్లా చంకల్లో చిన్న పిల్లల్నిఎరగా చూపించి యాచన చేసే వారు అప్పటికింకా రాలేదు. ఇక గడియారస్థంభం పందిరిలో సాంస్కృతిక కార్యక్రమాల జోరు, హోరు ఓ స్థాయిలో జరిగేది.

గడియారస్థంభం దగ్గర వేసిన వినాయక మంటపానికి పోటీగా పట్టణంలో మరో రెండు చోట్ల పందిళ్లు వేసే వారు. వారానికి ఒకసారి సంత జరిగే మార్కెట్ పందిరి ఒకటైతే, గడియార స్థంభానికి, ముమ్మడివరం గేటుకి మధ్యలో… రాజస్థాన్ నుంచి వ్యాపార నిమిత్తం వలస వచ్చిన శేట్ల పందిరి మరొకటి.

మూడు పందిళ్లలోనూ మూడు ధోరణులు కనిపించేవి. గడియారస్థంభం మంటపం కాసింత హుందాగా… పెద్దరికంతో ఉండేది.

గడియారస్థంభం పందిరిలో డీ.వీ.సుబ్బారావు వేదిక మీదకు వచ్చి సత్యహరిశ్చంద్ర నాటకం కాటిసీను ప్రారంభిస్తూ….

‘‘ఓ… అంథకారమపుడే బ్రహ్మండమంతయూ ఆవరించి ఉండే…

కన్నులున్న వారు సైతము గుడ్డివాండ్రను చేయుచున్నది కదా  ఈ అంథకారమూ’’ అంటూ డైలాగ్ చెప్పి

‘‘కలవారి ఇండ్ల లోపలి నిసానము లెక్కా…

అడుగు హంగులకు సిద్దాం…. జనముంబు…

మగలన్… వూ… రుకనిచ్చి’’ అని నవరాత్రి వేళ్లల్లో పద్యం అందుకుంటే అక్కడ నిటాలాక్షుడు గజ్జె కట్టి ఆడుతున్నట్లుగా ఉండేది. ఆ పద్యం వింటూ నాటకాన్ని చూస్తున్న వాళ్ల కళ్లల్లోంచి వచ్చిన కన్నీళ్లతో ఆ ప్రాంతమంతా కన్నీటి సంద్రమయ్యేది.

‘‘మామా సత్యవతీ పౌత్రా… ఆర్త రాష్ట్రులకునూ… పాండవులకునూ సంధి గావించి ఈ రాజలోకమునెల్లా కాపాడమని పాండవుల దూతనై నీ వద్దకు వచ్చితిని’’ అంటూ  చేతిలో వేణువుతో షణ్ముక ఆంజనేయులు రాజు రంగప్రవేశం చేసి…

‘‘తమ్ముని కొడుకులు సగపాల్లిమ్మనిరీ… ఈ… ఈ…ఈ…ఈ…

అటుల ఇష్టపడవయేననీ… నీ… నీ…నీ… నీ…

ఐదూళ్లిమ్మనిరి ఐదుగురకు…

ధర్మంబుతో… అ…అ…అ…అ…అ..

నీకు తోచినట్లు మనుపుము వారిన్… మావా…వా….వా…వా…’’

అంటూ పద్యం ఎత్తుకుంటే పందిరిలో ఉన్న వారంతా పాండవుల పక్షం వహించేందుకు సిద్ధమైన సైనికుల్లా ఉండే వారు.

****                                  *****                                           ****

మార్కెట్ దగ్గర వేసిన పందిరి కుర్రతనంతో కువకువలాడేది. ఈ పందిరిలో చింతామణి నాటకం.

‘‘ ఆ పంగనామాలు పెట్టుకున్నోయన ఎంత తెలివైనవోడే… ఆంజనేయుడి గుడి కట్టిత్తానని ఆరువేలు వసూలు చేసి ఏడెకరాల మాగాణి కొన్నాడే అమ్మా… అన్నట్లు… మరచానే.. సుబ్బిశెట్టిగారు మనింటికెప్పుడొచ్చారే’’ చింతామణి తల్లి.

‘‘ అమ్మా… మొన్న మేజువాణిలో రవ్వంత రంగు సేశారే’’ చింతామణి

‘‘రుచి తగిలిందన్నమాట. నీ సేయి సావా(మా)న్యమా తల్లీ… నీ చేయి తగిలితే ఎరగనోడు ఎలక్ట్రిక్ స్థంభం ఎక్కినట్టేనే తల్లీ’’

ఇక్కడ కుర్రకారే కాదు… ముదిమి వయసు వారు కూడా ఈలలు, గోలలతో  వన్స్ మోర్ ల కేక పుట్టించే వారు.

ఈ పందిరిలోనే  రాజమండ్రి నుంచి తీసుకువచ్చిన రాంబాబు రికార్డింగ్ డాన్స్ ట్రూప్ వారి రికార్డింగ్ డాన్సులు ఉర్రూతలూగించేవి.  వీటిల్లో జూనియర్ అక్కినేని నాగేశ్వరరావుగా వేల్పూరు వాసి వీర్రాజు, జూనియర్ ఎన్టీఆర్ గా రాంబాబు డాన్సులు చేసే వారు. అప్పుడప్పుడే తన స్టెప్పులతో అదరగొడుతున్న, అప్పటికింకా మెగాస్టార్ కాని  చిరంజీవి పాటలకి రాజమండ్రి కుర్రాడు వెంకటేష్ తన టెప్పులతో (స్టెప్పులతో) మార్కెట్ పందిరిని ఊపేసేవాడు. ఇక్కడ నిర్వహణంతా శోభన్ బాబులా ఒకే రంగు లాల్చీ, లుంగీ కట్టుకునే జంగమయ్యది. చేతిలో పొడవాటి కర్రతో టేజీ (స్టేజీ) మీదకి ఎవరూ రాకుండే చూసే బాధ్యత అతనిదే. ముఖాన సింధూరం బొట్టుతో… ఒకే రంగు బట్టలతో… నిరంతరం కోపంతో రగిలిపోతూండే జంగమయ్య అంటే మార్కెట్ పందిరికి వచ్చే వారందరికీ ఓ భయం. ఓ ఆందోళన. ఓ బెరుకు.

చింతామణి నాటకం ఆడుతుండగా జంగమయ్య వేదిక దగ్గరగా వస్తే చింతామణి చెల్లెలు చిత్ర అక్కనుద్దేశించి ‘‘ అక్కా.. అదిగోనే… జంగమయ్య బావగారు. నీ కోసం హీరో శోభన్ బాబులా తయారై వచ్చారు’’ అని ఎటకారం అడేది.

దానికి చింతామణి ‘‘ జంగమయ్య బావగారు సిక్కిపోయారే’’ అని సమాధానం చెప్తే…

చిత్ర అందుకు ప్రతిగా ‘‘ అవునే చింతామణక్క నీ సేతిలో సిక్కిపోయారే’’ అనేది.

ఈ వెటకారాలకు సంత పందిరి గిలిగింతలు పెట్టినట్లుగా నవ్వేది.

ఈ డైలాగులకి జంగమయ్య మరింత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ  జనంలోంచి వెళ్లిపోయే వారు.

శేట్ల పందిరి…. డబ్బులున్న వారి పందిరి.

శేట్ల పందిరి… విద్యుత్ కాంతులీనుతూ ధగధగలాడిపోయే వెండి పందిరి…

శేట్ల పందిరి… వంటి నిండా నగలతో వయ్యారాలు పోయే పందిరి…

శేట్ల పందిరి… వడ్డీలు… చక్రవడ్డీలతో కళకళలాడుతూ ఉండే పందిరి…

 

అది ఆ తరహాలోనే ఉండేది. ఇక్కడ కాకినాడ గంగాధరం మ్యూజికల్ పార్టీ, ఆచంట వెంకటరత్నం నాయుడు పౌరాళిక నాటకం, విజయనగరం కుమ్మరి మాస్టరి బుర్ర కథ వంటి రిచ్ ప్రోగ్రామ్ లు ఉండేవి. ఇక్కడ ఇంత రిచ్ గా ఉన్న శేట్ల కుర్రాళ్లంతా మార్కెట్ పందిరి కిందే సేద తీరేది.  ఈ మూడు పందిళ్లలో  ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయో డబుల్ క్రౌన్ షీట్లతో రంగురంగుల ఫొటోలతో ముద్రించి ఉండేవి. పందిళ్ల నిర్వాహకులు ముందుగానే వీటిని ముద్రించి చందాల కోసం వచ్చేవారు. సాంస్కృతిక కార్యక్రమాల షీట్ల చివరిలో కనిపించీ కనిపించనంత అక్షరాలతో ‘‘ సమయానుకూలంగా కార్యక్రమములు మార్చబడును. రద్దూ చేయబడును’’ అని ముద్రించే వారు. దీనికి కారణం చందాల వసూళ్లను బట్టి కార్యక్రమాలు ఉంటాయన్న మాట. ఈ ముందు జాగ్రత్త చర్య కారణంగా ఏ కార్యక్రమమైనా రద్దు అయినా నిర్వాహకులకు మాట రాకుండా ఉండేది.

****                                  *****                                           ****

ఇక అగ్రహారంలోని ప్రతీ వీధిలోనూ చిన్న చిన్న పందిర్లు వేలిసేవి. వినాయక చవితికి నెల రోజుల ముందే మా హడావుడి ప్రారంభమయ్యేది. కృష్ణారావు వీధిలో మా కుర్రకారుకి దైవమిచ్చిన తల్లిదండ్రులు కూచిమంచి బ్రహ్మానందం గారు దంపతులే మా చేత వినాయక పందిరి వేయించే వారు. మేం లాటరీలు పెట్టే వాళ్లం కాదు కాని మా వీధిలో వాళ్ల దగ్గరికి, అగ్రహారంలో మిగతా వీధుల వారి దగ్గరికి వెళ్లి చందాలు అడిగే వాళ్లం. మాకు చందా పుస్తకాలు కూడా ఉండేవి కావు. మా వీధుల్లో వాళ్లే మాకు రూపాయి, రెండు రూపాయలు చందా ఇచ్చేవారు.

వినాయక చవితి ముందే మా పీడీ గారు కూచిమంచి బ్రహ్మానందం గారింట్లో మేమే చిన్న పందిరి వేసే వాళ్లం. అందులోనే చిన్న మంటపం వేసి అక్కడే ఓ టేజీ కూడా వేసుకునే వాళ్లం. ప్రతీ ఏటా క్రమం తప్పకుండా మేం వేసే నాటకం పరమానందయ్య గారి శిష్యులు. ప్రతీ ఏటా అవే డైలాగులు…. అవే పాత్రలు…. అదే ప్రేక్షకులు….

రిహార్సల్ తక్కువే… దర్శకత్వమూ తక్కువే…

ఎవరికి తోచినట్లు వారు నటించుకుపోవడమే…

ఈ నాటకాన్నే తొమ్మిది రోజుల్లో ఓ నాలుగుసార్లు తక్కువ కాకుండా వేసేవాళ్లం.

వినసొంపైన గొంతు ఉన్న వాళ్లు అప్పుడే విడుదలైన సినిమాల్లోని పాటలు పాడే వాళ్లు. నా స్నేహితుడు, పాపయ్య మాస్టారి అబ్బాయి రాంబాబు షోలే సినిమాలో మెహబూబా.. మెహబూబా పాట పాడుతూ స్కూలుకి పుస్తకాలు తీసుకువెళ్లే స్టీలు పెట్టే మీద మ్యూజిక్  వాయిస్తూంటే ఆర్.డీ.బర్మన్ మా వీధిలోకి వచ్చాడా అన్నట్లు ఉండేది.  వీధిలో మాకంటే చిన్నారుల చేత పద్యాలు పాడించే వాళ్లం. అప్పటికప్పుడు సాంఘిక నాటకాలు రాసుకుని వాటిని ప్రదర్శించే వాళ్లం. నేను జీవితంలో తొలిసారిగా ప్యాంటు వేసుకున్నది ఓ నాటకంలోని పాత్ర కోసమే. డాక్టర్ పాత్రలో ఉన్న నేను అనివార్యంగా ప్యాంటు వేసుకోవాలి. నిక్కర్లు తప్ప ప్యాంట్లు లేని మేం దాన్ని సంపాదించడం కోసం నానా పాట్లు పడ్డాం. భానోజీ రామర్స్ కళాశాలకు స్థలదానం చేసిన వారి మనవడు, మాకు సీనియర్ అయిన భానోజీ రామర్స్ నుంచి ప్యాంటు తెచ్చుకుని ఆ నాటకాన్ని మమ అనిపించాం.

మేం సంపాదించిన చందాల కంటే ఎంత ఎక్కువ ఖర్చు అయ్యిందో కూడా మాకు తెలీదు. నవరాత్రుల ముగింపు రోజు వినాయక నిమజ్జనం ఇప్పుడంత ఆర్భాటంగా కాదు కాని కాసింత హడావుడిగానే చేసే వాళ్లం.

వినాయక చవితి వచ్చిందంటే కూచిమంచి అగ్రహారంలో భాగమైన నారాయణ పేట వాసుల కోలాటం  ఓ మహత్తర సమ్మేళనం. మురళీ కోలాటం అని పిలిచే  ఈ సాంస్కృతిక రూపకం ప్రతీ ఏటా ఒక్కసారే… అదీ వినాయక చవితి నాడే ప్రదర్శించే వారు. 60 మంది సభ్యులుండే ఈ కోలాటంలో 30 ఉజ్జీలు ఉండే వారు. ఉజ్జీ అంటే ఇద్దరు సభ్యుల జంట అన్నమాట. పెద్ద ఉజ్జీ, చిన్న ఉజ్జీలుగా 30 జంటలు చేతిలో కర్రలతో కోలాటాన్ని ప్రదర్శించే వారు. కోలాటానికి ఓ గురువు ఉండే వారు. ఆయనే కుడుపూడి కృష్ణమూర్తిగారు. ఆర్టీసీలో పని చేసే కృష్ణమూర్తి గారు వినాయక చవితికి పదిహేను రోజుల ముందే సెలవు పెట్టి రిహార్సల్స్ చేయించే వారు. ఆయన తమ్ముని కొడుకు కుడిపూడి నాగరాజు కోలాటంలో పాటలు పాడే వాడు. సీవండి దీపపు సిమ్మెను మధ్యలో ఉంచి దాని చుట్టూ కోలాటం చేసే 30 ఉజ్జీలు అంటే 60 మంది ఉండే వారు. హార్మోనియం వాయించేందుకు ఒకరు, డోలక్ తో మరొకరు పాటలకు మ్యూజిక్ ఇచ్చేవారు. ‘‘ శరణు శంకర తనయ… శరణు శరణు’’ అనే పాటతో కోలాటం ప్రారంభమయ్యేది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కోలాటం పట్టాభివీధి, కృష్ణారావు వీధితో పాటు దక్షిణా మూర్తి వీధిలో తిరిగేది.  నాలుగైదు భక్తి పాటల తర్వాత దేశభక్తి గీతాలను కూడా ఆలపించే వారు. ముఖ్యంగా గాంధీ మహాత్ముడిపై

‘‘ గాంధీ తాతా పురమును విడిచి వెడలి నాడవా…

అయ్యో వెడలి నాడవా… స్వర్గమునకు వెడలినాడవా…

మాత వెగచెనా… దేశమాత వెగచెనా ’’

అంటూ పాట పాడుతూ అందుకు లయబద్ధంగా కోలాటం చేసే వారు.

ఆ పాట పాడే సమయంలో చుట్టుపక్కల ఉన్న వారందరిలోనూ ఓ దేశభక్తి నాట్యం చేసేది.

ఆ తొమ్మిది రోజులూ… ఆధ్యాత్మికత, సాంస్కృతిక సమ్మేళనం..

ఆ తొమ్మిది రోజులూ… బండెనక బండికట్టిన గ్రామీణుల సౌరభం

ఆ తొమ్మిది రోజులూ… కోనసీమంతా చెల్లియో చెల్లకో రాగమాలిక

ఆ తొమ్మిది రోజులూ.. మూగ ప్రేమికుల వాలెంటైన్స్ డేస్…

వినాకయ చవితి మా అగ్రహారానికి  వెండి పండుగ.  ఆ తొమ్మిది రోజుల కోసం 356 రోజులు ఎదురు చూసే మధురానుభూతి.

*

ముక్కామల చక్రధర్

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మళ్ళీ చిన్న తనం లోకి తీసుకు పోయిన రచన.
    మా చిన్నతనం,, అంటే పిడి బ్రహ్మానందం గారు, ఇప్పుడు స్టేట్ బ్యాంకు ఉన్న స్థలం లో ఉండే వాళ్ళ పాత ఇంట్లో ఉండేవారు
    గడియారం స్తంభం పందిరి, ముమ్మిడివరం గేట్ పందిరి లోనే నిడదవోలు అచ్యుత రామయ్య బుర్ర కథ పెట్టేవారు. మార్కెట్ పందిరి లో నాజర్ ది పెట్టేవాళ్ళు. మాకు దూరం కాబట్టి ఎప్పుడూ వెళ్ళలేదు
    చల్లనీరజా ఒ చందమామ ఇలవేల్పు పాట తెగ వినేవాళ్ళం. అక్కడ మైకు లోంచి.
    నీ కథనం చదువుతోంటే, వినాయక పత్రి వాసన గుప్పు మని వచ్చింది మనసుకి
    ఇంకోటి రాయలేదు. మధ్యాహ్నం పెట్టే బోగం మేళం
    తేనెమనసులు సినిమా వచ్చిన తరువాత, సుకన్యని చూపించి, ఈ అమ్మాయిని వినాయక చవితి పందిరి మేళం లో చూ సేవాళ్ళం అని గొప్పగా చెప్పుకోవడం ఒక బలహీనత
    చాలా బాగుంది 5 స్టార్స్ అవుట్ అఫ్ 5

  • చ‌క్ర‌ధ‌ర్ గారూ…. చిన్న‌నాటి వినాయ‌క చ‌వితి సంరంభాల‌ను, సంబ‌రాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా రాశారు. మీ ర‌చ‌నా శైలి చాలా బాగుంటోంది. మిమ్మ‌ల్ని ఎలా అభినందించాల్సిందే….

  • Maha Adbhutam Sampradaya Hrudaya kavatam terichi Aavishkaaramayiindi. Gata smrutula nibaddata prasputeekaranamayyindi. Kalividitanam niswardata andaru kalasi oka mahat kaaryyani sa disalo cheyyadam Samskrutika Sampradaya lanu kaapadukuntu oka mahatkaryyani Iykamatyatato sadhinchadam Slaghaneyyam Mariyokasari nee kalam aavishkarana atyanta Adbhutam. O rachayita neevu mahaneeyata nu adhistinchaavu

  • Chakradhar garu… prathee 15 rojulaki okasari agraharam theesukelthunnaru …Deevinche vinayakudu , Narayanapeta kolatam , Chavithi pandillu… ivi anni Jeevithakala gnapakaalu …ekkada vunna marachipoleni anubhoothlu ……
    ఆ తొమ్మిది రోజులూ… ఆధ్యాత్మికత, సాంస్కృతిక సమ్మేళనం
    ఆ తొమ్మిది రోజులూ.. మూగ ప్రేమికుల వాలెంటైన్స్ డేస్… ivi aksharala nijam …ivi anni asvadinchina mana generation nijamga adrustavanthulu

  • అద్భుతం. ఇంకా నీ కాలం నుంచి చాలా విషయాలు జాలువారాలి. నేను ఇంకా పందిరి లో నే ఉన్నాను

  • <No words…super…..how you have remember all these names….just వినాయక చవితి ఎంత ఒక్కసారి కళ్లముందు కదిలింది…చాలా చాలా బాగుంది

  • Sri Gananaadham Bhajaamyaham chadivaa. Venakki chusi, raasi Mundu tharam vaallu kudaa chadivelaa chaalaa baagaa raasharu. Indulo paathradhaarulandarinee naynu chushanu (daggaragaa). Aa rojulu vaibhavam goppadi. Bhale jnapakaalu meelo daachukuni, battala madya mogali rekulla parimalaalu vedajalluthunnaru. Inkaa raayandi. Abhinandanalu. -Pemmaraju Gopalakrishna, Hyd

  • ఎప్పటి లాగే ఎదురు చూసేలా రాశావు….వినాయక చవితి నీ కళ్ళకు కట్టినట్లు చూపించే వూ బుజ్జి
    అయితే ఆకెళ్ళ సుబ్బమ్మ గారు ఇంటికి బిల్వ పత్రం కోసం వెళ్ళేవాళ్ళం..అలాగే పత్రి చాలా మటుకు ఇళ్ల నుంచి తెచ్చే వాళ్ళం భమిటి పాటి మేష్టారు దీక్షితులు శంకర్ వాళ్ళ ఇంటిలో పెద్ద ఉసిరి చెట్టు వగైరా
    ఇక పోతే బ్రహ్మానందం గారు ఒరిజినల్ గా అర పీడీ అనేవాళ్ళం
    మా బాబాయి పీడీ ఈయన asst PD memu College lo వున్నప్పుడు…బాగుంది….COVID time lo Amalapuram తీసుకు వెళ్ళావు ధన్యవాదాలు

  • Sri gananadham bhajamyaham Katha Chala bagundi chinnappati rojulu Marla gurtuki vachai Ammanu oppinchi programs ki eaila vellevallamo okka sari kallamundu kanipinchai paths rojulanni Marla maku andariki gurtu chestunnv bujji neeku many many thanks.

  • Orey Bujji annitikante jangamayya description ayana single colour dress super. Program lo entha hadavidi ga undevado, vati tharuvatha ante silent ga shop lo kurchunevadu. Cycle, steel bindi lottery inka super. Ma tatayya gariki chikkala suryarao garu KURUKSHETRAM natakaniki first line lo special seating vesevaru. Second show nunchi intiki veltu oka araganta panditlo undi vellevallam. Shanmukhi anjaneyaraju ragam intikelladaka vinapadutune undedi. Bagundira. Teepi jnapakalu.

  • Bhogaraju veedhi maa Tata garu Palagummi Subbaraogari intivadda pandiri lo oka burra kadha, Tolubommalata, Pendyala Srinivas kacheri, appudappudu maa pillala dramas undevi, Machiraju Trinadh, maa mena mavalu deal chesevaru, adi kooda touch cheste baagundedi, PD gari abbayi Prasad anukunta, memu shuttle adevallam, valla intlo Detective books ekkuva undevi.

  • వినాయక చవితి ముందుగానే వచ్చేసినట్లు కళ్ళకు కనిపించినట్లు ఉంది. నాటకాలు చుాసినట్లు నచ్చని ప్రోగ్రామ్లు లేక పోతే ఇంట్లో ప్రోగ్రామ్ పేరు చెప్పనాసెకండ్షోసినిమాలు చుాడటం గుర్తుకోస్తున్నాయి. చాలా బాగా రాసావు.

  • Excellent narration . Presenting the subject is awesome. The true events took place once again in my mind. I recalled my childhood days in real time. Writting style is ultimate. Chakradhar, ur memory nd description of events minutely is really wonderful. It is god gift to you. Continue with ur writings in future with different themes. All the best. Waiting for your next episode.

  • I too had memories of Vinayaka Chavithi celebration at Amalapuram Gaditarastambham..where taking blessing by dropping coins. It was purely innocence during childhood..very nice days to recollect those days..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు