శరన్నవరాత్రులు

తొలకరి జల్లు నుంచి కుండపోత వరకూ కురిసిన శ్రావణ, భాద్రపద మేఘాలు పసిపాప నవ్వుల్లా గుర్తుండి పోయాయి. అగ్రహారాన్ని ఆశ్వీయజమాసపు శీత వాయువు మెల్లి మెల్లిగా ఆక్రమించుకుంటోంది. సాయం సంధ్య వేళ శీతగాలులు దగ్గరి బంధువుల్లా చీటికి మాటికి పలకరిస్తున్నాయి. అప్పుడప్పుడే పురుడు పోసుకుంటున్న చిత్రమైన చలి అగ్రహారీకులకు కొత్త అనుభూతిని పంచుతోంది. ఆ చలి వణికించడం లేదు కాని  ఆపాదమస్తకం గిలిగింతలు పెడుతోంది. అగ్రహారం వెనుక గలగల పారే గోదావరి పాయ కౌసికలో నీళ్లు మట్టి రంగు నుంచి రాముడి శరీర రంగులా నీల జలద రమణీయ రూపంలోకి మారాయి. అగ్రహారాన్ని ఓ కొత్త వెలుగు అలా అలా ఆవరించుకుంటోంది.

ఆ వెలుగు… దసరా పండుగకు ముందు వచ్చే సంకేతం

ఆ వెలుగు… దసరా పండుగకు ముందు నెమలి చేసే నృత్యం

ఆ వెలుగు… దసరా పండుగకు ముందు వాహనాలకు అంటుకున్న మట్టి వాసన

ఆ వెలుగు… దసరా పండుగకు ముందు అమర్ టైలర్స్ కుట్టిన కాటన్ నిక్కర్ల పొగరు

అగ్రహారానికి దసరా అలా వచ్చింది. మూడు పండుగలు… వాటితో కలుపుకుని తొమ్మిది నవరాత్రుల కోలాహలం అగ్రహారంలో సంబరాలను అంబరాన్ని తాకేలా చేసేవి. నవరాత్రుల ప్రారంభానికి ముందే అగ్రహారంలోని ఇళ్లన్నీ అమ్మవారి దేవాలయాలుగా మారిపోయేవి. ప్రతి ఇల్లు నవరాత్రి శోభతో మిలమిలా మెరిసిపోయేవి.

దసరా అంటే అగ్రహారానికి ఓ వెండి పండుగ. రోజుకో అవతారంతో అమ్మవారు ప్రతీ ఇంట్లోను దర్శనం ఇచ్చేవారు.

***                                       ***                                     ***

విజయదశమి తెల్లవారు ఝామున నాలుగంటలైంది. అగ్రహారానికి ప్రారంభంలా కనిపించే గడియార స్థంభం దగ్గర కోలాహలంగా ఉంది. వేలాది మంది ఓ అపురూప దృశ్యాన్ని తమ కళ్లల్లో నిక్షిప్తం చేసుకుంటున్నారు.

సన్నగా రివటలా ఉన్న ఓ పాతికేళ్ల కుర్రాడు చొక్కా లేకుండా నడిరోడ్డు మీద నేలపై పడుకున్నాడు. అతని గుండెకి, పొట్టకి మధ్యలో ఎవరో ఒక పొట్లకాయ పెట్టారు. అలా పడుకున్న వ్యక్తికి పదడుగుల దూరంలో మరో నడీడు మనిషి చేతిలో కత్తిని కుడి ఎడమలవైపు లాఘవంగా తిప్పుతూ దానికి అనుగుణంగా, లయబద్ధంగా నృత్యం చేస్తున్నాడు. కుడిచేతితో పట్టుకున్న కత్తిని ఎడమ వైపునకు, ఆ తర్వాత కుడివైపునకు తిప్పుతున్నాడు. అదే కత్తిని ఎడమ వైపు నుంచి తల వెనుక భాగం నుంచి  కుడి వైపునకు తీసుకువచ్చి అత్యంత చాకచక్యంగా ప్రదర్శన చేస్తున్నాడు. అతనికి కొద్ది దూరంలో మరికొందరు యువకులు చేతిలో కర్రలతో విన్యాసాలు చేస్తున్నారు.

నడీడు మనిషి కత్తి తిప్పుతూ నేల మీద పడుకున్న యువకుడి వైపు వస్తున్నాడు. అంతటా ఉత్కంఠ. అంతటా ఆందోళన, చుట్టూ ఉన్న వేలాది మందిలో ఏం జరుగుతుందో అని భయం. కత్తి తిప్పుతున్న నడీడు మనిషి నేలపై పడుకున్న యువకుడి పొట్ట మీద ఉన్న పొట్లకాయ మీదా లాఘవంగా కత్తి విసిరాడు. అంతే పొట్లకాయ రెండు ముక్కలైంది. నేల మీద పడుకున్న యువకుడికి కనీసం కత్తి మొన కూడా తగలలేదు. ఆ తర్వాత కొంత సేపటికి పొట్లకాయ స్థానంలో అరటికాయ, దాని తర్వాత బీరకాయ…. ఇలా సైజ్ తగ్గిస్తూ చిన్న చిన్న కాయలు పెట్టారు. వాటన్నింటిని ఆ నడీడు మనిషి వరుసగా నరుకుతున్నాడు. చివరాఖరన గోళికాయంత నిమ్మకాయను ఉంచారు.

గడియార స్థంభ‌మంతటా ఊపిరి బిగిసిపోయిన గుప్పిటలా ఉంది.

గడియార స్థంభ‌మంతటా గెద్ద తన్నుకుపోతున్న కోడిపిల్లలా ఉంది

గడియార స్థంభ‌మంతటా తీర్థంలో తప్పిపోయిన చిన్నపిల్లాడిలా ఉంది

అదిగో అలాంటి సమయంలో ఆ కత్తిపట్టుకున్న నడీడు మనిషి పొట్టపై ఉన్న నిమ్మకాయని లాఘవంగా రెండుగా చీల్చాడు.

అంతే ఒక్కసారిగా చప్పట్లతో, కేకలతో, ఈలలతో గడియారం స్థంభ‌మంతా మరోమ్రోగింది.

***                                       ***                                     ***

ఆ పురాతన కళ పేరు చెడీ తాలింఖానా. ఈ అపురూపమైన కళ అగ్రహారం ఉన్న అమలాపురం సొంతం. బ్రిటీష్ సామ్రాజ్య వాదుల అకృత్యాలను ఎదుర్కోవ‌డానికి అబ్బిరెడ్డి రామదాసు గారు 1856 సంవత్సరంలో పురుడు పోసిన కళ.ఆయన తామ్రపత్రం అందుకున్న మహా కళాకారుడు.  ప్రతీ ఏటా దసరా చివరి రోజున అబ్బిరెడ్డి రామదాసుగారి కుటుంబీకులు ఈ కళని ప్రదర్శిస్తారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉన్న ముని మనవడి కుమారుడు అబ్బిరెడ్డి మల్లేష్ దసరాకు అమలాపురం వచ్చి ఈ కళను ప్రదర్శించి తమ వారసత్వాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కర్రసాము చేయడమంటే ఒక విద్యను ప్రదర్శించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రదర్శించడం. ఈ విద్యను ప్రదర్శిస్తున్న కొందరు కర్రసాము చేయడంతో పాటు అగ్గిబరాటా కూడా తిప్పేవారు. అగ్గిబరాటా అంటే లావుపాటి కర్రకి ఆ చివరా ఈ చివరా గుడ్డలతో ఫుట్ బాల్  అంత బట్టలు చుడతారు. ఆ బట్టల మూటలను కిరసనాయిల్ లో ముంచి అంటిస్తారు. అటూ ఇటూ నిప్పుల కొండల్లా మండిపోతున్న కర్రను మధ్యలో పట్టుకుని అగ్గిబరాటా సాము చేస్తారు. ఇలా చేస్తునప్పుడు చిన్న నిప్పు కణిక కూడా సాము చేస్తున్న వారిపై పడదు. అదీ ఆ కళావిన్యాసం చేస్తున్న వారి నైపుణ్యం. ఈ కళలన్నీ ప్రదర్శనకే తప్ప ఏ ఇతర వివాదాలకు ఉపయోగించకపోవడం ఆ కళ నేర్చుకున్న వారి గొప్పతనం.

దసరాకు ఇంకా నెల రోజులు ఉందనగానే  చెడీ తాలింఖానా కసరత్తు ప్రారంభమయ్యేది. అబ్బిరెడ్డి రామదాసుగారి ఇంటి ముందు జమ్మి పూజ చేసేవారు. అంటే అర్జునుడు విరాటకొలువులో అజ్ఞాతవాసం వీడే ముందు జమ్మి వృక్షానికి చేసిన ఆయుధ పూజ వంటిది. జమ్మి వృక్షానికి పూజ చేయాడాన్ని వారి భాషలో జమ్మి కొట్టడంగా పిలుస్తారు. ఈ పూజ అనంతరం చెడి తాలింఖానాలో ప్రధాన పాత్ర పోషించే కత్తులు, బరిసెలు, కర్రలు వంటి ఆయుధాలకు ఎంతో భక్తి శ్రద్ధ‌లతో పూజలు చేస్తారు. ఆ పూజ చాలా  నిష్ఠ‌ గా…. స్వయంగా అర్జునుడే చేసినంత శ్రద్ధ‌తో చేస్తారు. పూజ ముగిసిన తర్వాత యువకులు దాదాపు నెల రోజుల పాటు కత్తి సామూ, కర్రసామూ ప్రాక్టీస్ చేస్తారు. ఇది చూసేవారికి ఒళ్లు జలదరిస్తుంది. నెల రోజుల ప్రాక్టీస్ లో ఎవరైతే నిష్ణాతులో వారే దసరా నాడు చెడి తాలింఖానాను ప్రదర్శిస్తారు.  ఈ సాధన చేసే సమయంలో  సరిగా చేయని వారిని జట్టునుంచి తొలగిస్తారు. ఈ ప్రక్రియలో ఎలాంటి మొహమాటాలకు తావు లేదు. చెడి తాలింఖానా విన్యాసాలు ముగిసిన తర్వాత కొందరు పెద్దలు వారికి బహుమానాలు ఇచ్చేవారు. మరికొందరైతే రూపాయి నోట్లను దండలుగా గుచ్చి కర్రసాము అద్భుతంగా చేసే వారి మెడలో వేసేవారు. ఇలా వచ్చిన బహుమతుల్ని కూడా అమ్మవారి సేవలకే వినియోగించడం  కొసమెరుపు.

* **                               ***                                      ***

దసరా అంటే అగ్రహారంలో వాహనాల పండుగ. వాహనాల ప్రదర్శన అంటే ఆయా వీధులలో వందల సంవత్సరాలుగా ఉన్న సంప్రదాయం. ఈ సంప్రదాయానికి అగ్రహారం నిరంతరం ఆహ్వానం పలికేది. మైపాల వీధి హంసవాహనం, గండు వీధి శేష‌శ‌య‌న‌ లక్ష్మీ సమేత విష్ణమూర్తి వాహనం, రవణం వీధి వారి మహిషాసుర మర్ధిని, నల్లా వారి వీధి విజయదుర్గ, రవణం మల్లయ్య గారి వీధి గరుడ పక్షి, చెన్నమల్లేశ్వర స్వామి ఆంజనేయుడు, నంది, గరుడ వాహనం, కొంకాపల్లి వారి హంస, లక్క ఏనుగు వాహనాలు దశమి రోజు సాయంత్రం బయలుదేరి ఏ అర్ధ‌రాత్రో అగ్రహారానికి వచ్చేవి. విజయదశమి రాత్రి అగ్రహారం మహిళలు ఆ వాహనాల కోసం పళ్లాల‌లో కొబ్బరికాయలు, కర్పూరం అరటి పళ్లు, హారతి కర్పూరం తో ఇళ్ల ముందు నిల్చుండేవారు. ఇలా ఎన్ని గంటలైనా వాహనాల కోసం ఎదురు చూడడం అగ్రహారం అరుగుల మీద కూర్చున్న అతివలకు, పెద్దలకు, యువతీ యువకులకు ఓ వేడుక.

అప్పటి వరకూ గాఢ నిద్రలో ఉన్న పిల్లల్ని నిద్ర లేపి “వాహనం వచ్చింది లేవండి… లేవండి ” అంటూ నిద్ర లేపడం దశమి రోజు రాత్రి జరిగే అనవాయితీ. పిల్లలమైన మేం కూడా కళ్లు నలుముకుంటూ దేదీప్యమానపు వెలుగులలో వస్తున్న వాహనాలను,  వాటి ముందు చేసే విన్యాసాలను చూస్తూ నిద్రమరచిన గన్నేరు మొక్కలా ఉండేవాళ్లం. ఇక వాహనాలు రావని నిద్ర పోవచ్చునని అనుకుంటున్న సమయానికి తెల్లవారు ఝూమున కోర్టువారి తెల్ల ఏనుగు వాహనం వచ్చేది.

కోర్టు వారి ఏనుగు స్వర్గంలో ఇంద్రుడి ఐరావతంలా ఉండేది.

కోర్టు వారి ఏనుగు నడిచి వస్తున్న న్యాయంలా ఉండేది

కోర్టు వారి ఏనుగు అబద్ధపు ప్లీడర్లను తొక్కేస్తా అన్నట్లు ఉండేది

కోర్టు వారి ఏనుగు తెల్లగా మచ్చలేని చంద్రుడిలా ఉండేది.

***                                       ***                                     ***

దసరా పండుగ మూడు రోజులు పాఠశాలల ఉపాధ్యాయులు, సంగీత, నృత్య కళలు నేర్పే గురువులు కొందరు పిల్లల్ని వెంట పెట్టుకుని దసరా మామూళ్ల కోసం ఇంటింటికి రావడం ఓ ఆనందపు వేడుక.

అలా వస్తున్న పిల్లలంతా

“ఏదయా…. మీ దయా మా మీద లేదు

ఇంత నిర్లక్ష్యమా… ఇది మీకు తగదు

దసరా మామూళ్లుకు వచ్చితిమి విసురిసురు పడక

అయ్యవారికి చాలు ఐదు వరహాలు… పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు ”

అని పాడుకుంటూ ఇంటింటికి వచ్చేవారు. మా ఎలిమెంటరీ స్కూలు మాష్టర్లు నూకపెయ్యి ఎలీస్ గారు, పెమ్మరాజు వెంకటరావు గారు,  బోడసుకుర్రు నుంచి వచ్చే అనిప్పిండి కామేశ్వర రావు గారు, టీచర్ సులోచన గారితో మేమందరం అగ్రహారమంతా తిరిగేవారం. తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు తమ స్ధాయిని బట్టి మామూళ్లు ఇచ్చేవారు. పిల్లలమైన మాకు అటుకులు, బెల్లం, గుల్లశనగ పప్పు కలిపిన పప్పు బెల్లాలిచ్చేవారు.

ఈ వేడుక ఓ మహత్తర సన్నివేశం

ఈ వేడుక విద్యార్ధులు.. ఉపాధ్యాయుల మధ్య పెనవేసుకున్న తియ్యని అనుబంధం

ఈ వేడుక తల్లిదండ్రులకు, అగ్రహారీకులకు కనువిందు అపురూప ఆనందం

వినాయక చవితికి ఉన్నట్లుగా అమలాపురంలో శరనవరాత్రులకు నాలుగైదు పందిర్లు ఉండేవి కావు. ముస్లీం వీధిలో మాత్రమే ఓ పెద్ద పందిరి వేసేవారు. ఆ పందిర్లలో రోజుకో అవతారంలో అమ్మవారు దర్శనం ఇచ్చేవారు. తెల్లవారు ఝామున అమ్మవారి భక్తి గీతాలు పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లలో ఐదారు కిలోమీటర్లు వినిపించేవి. ఆ భక్తి పాటలలో నర్తనశాల సినిమాలో మాలిని వేషధారిణి సావిత్రి పాడిన “ జనని శివకామిని… జయశుభ కారిణి విజయ రూపిణి” అనే పాట ఖచ్చితంగా వినిపించేది. అలా ఉదయం తొమ్మిది గంటల వరకూ ముస్లీం వీధిలో భక్తి పాటల జోరు కొనసాగేది. అమ్మవారికి ఉదయం పూజలు, నైవేద్యాలు అయిన తర్వాత భక్తి పాటల స్ధానంలో సినిమా పాటలు వినపడేవి. అప్పుడే విడుదలైన యమగోల, వేటగాడు, ఊరికి మొనగాడు, మ‌ల్లెపువ్వు చిత్రాలలోని సూపర్ హిట్ పాటలతో ముస్లీం వీధి హోరెత్తిపోయేది. మళ్లీ సాయంత్రం వరకూ ఈ పాటలు వినపడేవి. సాయంత్రం కాగానే సినిమా పాటల స్ధానంలో భక్తి పాటలు ఓలలాడించేవి. ఈ తొమ్మిది రోజులు ముస్లీం వీధి పందిరిలో చింతామణి నాటకం, సత్యహరిశ్చంద్ర, గంగాధ‌ర్‌ మ్యూజికల్ పార్టీ వంటి ప్రోగ్రాములు ఉండేవి. రెండు నెలల మధ్య కాలంలో అమలాపురం సాంస్కృతిక శోభతో అలరారేది. నిజానికి ఆంధ్రులకు సంక్రాంతి పెద్ద పండుగే… అయినా అమలాపురం వాసులకు మాత్రం దసరా కూడా పెద్ద పండుగే. అంతే కాదు… ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంరంభం.

ముస్లీం వీధి తర్వాత మా అగ్రహారంలో ఉన్న కృష్ణారావు వీధిలో ఉన్న బెహరా ఎర్రంరాజుగారి కామాక్షి పీఠం భక్తితో నిండిపోయేది. రోజుకో అమ్మవారి అవతారాన్ని ప్రతిష్ఠించే వారు బెహరా ఎర్రంరాజుగారు. కామాక్షి పీఠం ఎదురుగా ఉన్న సంఘం గ్రౌండ్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ క్రికెట్ ఆడడం తప్ప మరో ధ్యాసేలేని మా కుర్రాళ్లందరం కామాక్షి పీఠంలో పెట్టే ప్రసాదాల కోసం ఎదురు చూసే వాళ్లం. ఆ రోజులలో తిన్న చక్రపొంగలి, దద్దోజనం ఇప్పటికి మా నోళ్లళ్లో నృత్యం చేస్తున్నాయి.

దసరా అగ్రహారీకులకు నవకాయ పిండివంటల సమ్మేళనం

దసరా అగ్రహారీకులకు కొన్ని జ్ఞాపకాల దొంతర

దసరా అగ్రహారీకులకు కంటి ముందు కదలాడే ఓ జాతర

దసరా అగ్రహారీకులకు సంస్కృతి అందించిన పగడాల పండుగ.

*

ముక్కామల చక్రధర్

17 comments

Leave a Reply to cnsyazulu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కోర్టు ఏనుగు లక్షణాల ఊహ అద్వితీయం.

    చెడీ తాలిం ఖానా విన్యాసాలు ప్రదర్శన కి తప్ప వేరే వినియోగించే వారు కాదు అన్న మీ మాట సామాజిక స్రృహా వ్యాఖ్యానం.

    అభినందనలు 🙏🌹🙏

  • ప్రారంభంలోనే చాలా బాగా వర్ణించి శరన్నవరాత్రుల సౌరబాలను రుచి చూపించారు. ఎప్పటిలాగే ఆగ్రహారంలోని వీధులన్ని పాఠకుడిని కూడా తీసుకెళ్ళారు అలాగే ఇప్పటికి అబ్బిరెడ్డి వారసులు కొనసాగిస్తున్న అద్భుతమైన చేడీ తాలీంకానా విన్యాసాలు పరిచయం చేశారు. అభినందనలు !

  • చాలా చక్కగా వర్ణించారు. చిన్న నాటి ఆ జ్ఞాపకాలను మళ్ళీ కళ్ల ముందుకు తెచ్చారు.
    ఏవి తల్లి నిరుడు కురిసిన హిమసమూహామలు అన్న శ్రీ శ్రీ కవిత కూడా గుర్తుకు వచ్చింది.
    ఒక సారి అమలాపురం జడ్పీ హైస్కూలు గురించి కూడా వ్రాయండి.

  • మహారచయిత ముక్కామల చక్రధర్ ముందు గా నీకు మనఃపూర్వక నమోవాకములు.
    మన అమలాపురం సొంతమయిన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు సామాజిక స్పృహ చింతన చేతన అత్యద్భుతంగా ఉన్నది ఉన్నట్లు పరంపరగా నడుస్తున్న యదార్ధ సంఘటనలను వాస్తవికతను విడవకుండా శక్తి ప్రదర్సనలను నైపుణ్యతలను చాకచక్యతను సంఘటితను మనం అందరం ఒకరి కోసం ఒకరు అనే స్పృహను వక్కాణించి అందరికీ విశదీకరించిన ఘనత నీకే చెల్లు ఓ రచయిత ముక్కామల చక్రధర్.

  • మధ్య మధ్యలో లేస్తూ మిగతా వన్నీ చూస్తూ , ఆఖరున కోర్టు ఏనుగు చూడడం, పిల్లలు గా చూసి మాపిల్లలకు కూడా చూ పించడం అమలాపురం లో గడిపిన జీవితానికి మిగిలిన తీపి గుర్తులు.
    అబ్బిరెడ్డి వీధి గురించి తెలుసు కానీ,ఆ కుటుంబ చరిత్ర నీ ద్వారానే తెలుసు కోవడం ఆశ్చర్యమే.
    యర్రం రాజు గారు పూర్వాశ్రమం లో, పాము డాన్స్ చేసేవారు. అప్పటికి మీరంతా బాగా పిల్లలేమో. కృషారావు వీధిలో సంఘం గ్రౌండ్ ఇప్పటికి అలాగే ఉందనుకుంటా
    చక్కటి కథనానికి అభినందనలు

  • ఇప్పుడే చదివాను అండి చాలా బాగుంది, actually నాకు అంతగా తెలీదు ఓకేఒకసారి అమలాపురం వచ్చి చూసాను అది కూడా ఇంట్లో ఫంక్షన్ వల్ల కానీ చాలా బాగుంది. మీ కథ నాకు కళ్ళకు కట్టినట్లు కనపడింది. ఆ ఒక్కసారి చూడడం మీ కథ వల్ల ప్రత్యక్ష అనుభూతి కలిగింది

  • అగ్రహారం తో పాటు అమలాపురంలో అన్నీ వీధి లుని touch చేశావు సూపర్ నీ మెమరీ
    నా లెక్కలో నీకు ఐఏఎస్ , ఐ పీ ఎస్ లు nothing నీవు ఎక్కడో వుండాలి నీ కున్న మెమరీ కి

  • ఎప్పటి లాగానే Chakradhar గారు అమలాపురం లో
    చిన్నప్పటి దసరా రోజులు గుర్తు చేశారు. Court
    ఏనుగు గుర్తు ఉంది. వస్తుందో రాదో తెలిసేది కాదు. చెడీ
    తాలింఖానా గురించి ఇప్పుడే తెలిసింది.
    అద్భుతహ.

  • Bagundira bujji . Court enugu marchipoyavu anukunnanu. Aina na porapatu kani nuvvu enduku marchipotavu. Bagundira.

    • నేను కోర్టు ఏనుగు మర్చిపోయాడు అనుకున్నాను మొదటి పేరా లో లేక పోతే

  • అమలాపురంలో, అందునా కుాచిమంచి అగ్రహారంలో దసరా కళ్ళకి కట్టినట్లు రాసావుబుజ్జీ. వాహనాల వరుస,లైటింగు జిగేలు, మార్వాడీల పందిరి అన్నీ గుర్తుకు తెచ్చావు అభినందనలు.మరియు దసరా శుభాకాంక్షలు

  • Very nice Mr.Chakradhar! Amar Tyler ni kooda baaga Gurtu chesaru. Appatlo Prakash Tylor ante NTR gariki kutte YAX Tylors antha Goppa Perundedi,AmarTylor maalanti Middle People ki andubaatuloundevaru.Radha Swamy Satsangam Bldg. Eduruga Chinna Baddi Kottu. Narayana Peta valla Kolatam kooda Chaviti Pandirilo anukuntanu, maa goppa ga undedi, Thank you very much, Gatha Jnapakalu Gurtu Chestunnanduku.

  • serannavaratrulu gurinchi Chala baga rasavu chinnappudu Amma Manali lepedi vahanalu chuddaniki nodes kallato Amma Hari arugu needs koorchune vallam court eanugu cache varaku andariki anumaname vastundo Rado anieaidi eamina your grate nee gnapaka sekhiki Nas Jigar nuvvu kalakalam ealage kathalu tasty sukhaga vundalani bhagavantudini kotranu

  • జై భేతా ల్ కి జై మరిచి పోయినట్టు వుంది..దసరా కే కదా..?
    బాగుంది…దసరా నీ మళ్లీ కళ్ల ముందుకి తీసుకు వచ్చావు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు