శంషాబాద్

నుషుల మధ్య నుంచి
నడిచిపోతూ టైం పాస్ చేస్తుంది
మనుమలు మనమరాండ్ల
జ్ఞాపకాలతో కాలం
ఉదయాస్తమయాలు నెమరు వేస్తుంది

మా ఇంట్లో
తారంగం ఆడిన మనుమడు
ఇప్పుడు గాలి మోటర్ ఎక్కి
పాట్నా ఐఐటిలో
చదువుకోవడానికి పోతున్నాడు

ఇక్కడ ఎర్ర బస్సులు
చెప్పులు లేని కాళ్లు
దిగులు మనుషులు
పల్లె వెలుగునీడల అడుగుజాడలు
దుర్భినీ వేసి వెతికినా కనిపించవు

చంకనెక్కి కన్నీళ్లు పెట్టుకుంటున్న
మనసును బలవంతంగా
ఇక్కడే దిగ విడిచి
దేశాలు సముద్రాలు దాటి
రాష్ట్రాల సరిహద్దులను దాటి
చెట్టుకు రూపాయలనే కాదు
డాలర్లను పౌండ్ లను రియాల్ లను
మేలిమి పంట కాయించడానికి
కేవలం వస్తువులను మాత్రమే కాదు

మనుషులు సైతం
ఎస్కలేటర్ మీదిమీంచి
ఎగుమతి అవుతుంటారు
దిగుమతి అవుతుంటారు

దుఃఖాలు ఉండవనీ కాదు
అవి నల్ల కళ్ళద్దాల చాటున
దాక్కోలేక జాలువారుతుంటాయి

పరామర్శలు పలకరింపులు
అచ్చోట మాట్లాడుకోవనీ కాదు
మొహమాటం ఆలింగనం చేసుకోనివ్వదు
చేతిలో చేయి కలపడంతో ఆగి
తిరిగి చూస్తూ సాగిపోతాయి అంతే

సిరిసిల్ల జగిత్యాల కోరుట్ల బస్టాండ్లలో
ఒకప్పుడు బొంబాయి బస్సు దగ్గర
కనిపించే వలస కొంగు ఒత్తుకునే up
వలపోత తెరిపివ్వని వర్షంలో
ఛత్రీలున్నా నిలువెల్లా తడిసిముద్దయ్యేవాళ్లం

ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టులో
నల్లని మబ్బులు కమ్మిన ఆకాశం
వెంట రెయిన్ కోటు వున్నా
బొట్లుగా కురిసే కన్నీళ్ళ తడిని
వెంటది వెంట డెట్టాల్ నీళ్లలో
మాప్ ను ముంచి శుభ్రపరిచి
డస్ట్ బిన్ లో వేస్తుంటారు

ఎన్నడూ ఇంటినీ మమ్మల్నీ
విడిచి దూరం పోలేకపోతున్న
నది దుఃఖ విచార ముఖాన్ని
చూడలేక మరల్చుకున్న చూపులు

అందరి మాటల మూటల ప్రేమల్నీ
ట్రాలి బ్యాగ్ లో సర్దుకొని
కూడా వెంట లాక్కెళ్తున్నాడు
ఉత్త శరీరాలే ఇక్కడ ఉన్నాయి గానీ
మా మనసంతా అక్కడే ఉంది

వేడి నిట్టూర్పుల ఉక్కపోత
మా కళ్ళ నిండా నిండిన చెమ్మ
బోల్డింగ్ పాస్ వైపు వెళ్తూ
దూరంగా గాలిలో చెయ్యి ఊపుతూ
లీలగా మనమడి చెయ్యెత్తు బొమ్మ

*

జూకంటి జగన్నాథం

3 comments

Leave a Reply to K.Wilson Rao Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ కవితలో గ్రామీణ నేపథ్యం నుండి పట్టణ ప్రాంతాలకు, ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు మారుతున్న వలసల తీరును, దానితో ముడిపడి ఉన్న భావోద్వేగాలను చాలా సున్నితంగా చిత్రీకరించారు. ఆధునిక వలస సంఘటనలను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి అంతర్జాతీయ ప్రయాణాల వైపు మళ్లుతున్న ప్రజల జీవితాల్లోని మార్పులను హృదయానికి హత్తుకునేలా వివరించారు. శంషాబాద్ విమానాశ్రయం నేపథ్యంలో మనుషుల మధ్య నడిచే కాలం గురించి, మనవరాళ్ల జ్ఞాపకాలతో నిండిన ఉదయాస్తమయాల గురించి ప్రస్తావించిన ఈ కవితా శీర్షిక ‘శంషాబాద్’ ను ఒక ప్రతీకగా చేసుకొని ప్రధానంగా మనవడు పాట్నాలోని IITలో చదువుకోవడానికి విమానం ఎక్కి వెళ్తుండటం కవితలోని ముఖ్య అంశం. ఇది పల్లె వెలుగునీడలు, ఎర్ర బస్సులు, చెప్పులు లేని కాళ్లు, దిగులు మనుషులు కనిపించని ఆధునిక వలస ప్రవాహాన్ని తెలియజేస్తుంది. ఇది కేవలం వస్తువుల ఎగుమతి, దిగుమతి మాత్రమే కాదని, మనుషులు సైతం ఎస్కలేటర్ల మీదుగా ఎగుమతి, దిగుమతి అవుతున్నారని ఆవేదనగా వ్యక్తం చేయడం బాగుంది.

    దుఃఖాలు ఉన్నప్పటికీ, అవి నల్ల కళ్లద్దాల చాటున దాక్కోలేక జాలువారుతున్నాయని, పలకరింపులు ఉన్నా.. మొహమాటం ఆలింగనం చేసుకోనివ్వకుండా, చేతిలో చేయి కలపడంతో ఆగిపోతాయని చెప్పడం అనేది వలస వెళ్లే వారి అంతర్గత భావోద్వేగాలను, బయటి ప్రపంచంతో వారి సంబంధాలను తెలియజేస్తుంది.

    గతంలో సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల బస్టాండ్లలో బొంబాయి బస్సు దగ్గర కనిపించే వలస కొంగును, తెరిపివ్వని వర్షంలో ఛత్రీలున్నా తడిసిముద్దయ్యే పరిస్థితులను, ఇప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నల్లని మబ్బులు కమ్మిన ఆకాశం కింద రెయిన్‌కోటు ఉన్నా, బొట్లుగా కురిసే కన్నీళ్ల తడిని డెట్టాల్ నీళ్లతో శుభ్రం చేసి డస్ట్‌బిన్‌లో వేస్తున్నారనే పోలిక ఆధునికత పేరిట మరుగున పడిపోతున్న మానవ సంబంధాలను, భావోద్వేగాలను స్పష్టం చేసింది.

    ఇంటిని, కుటుంబాన్ని విడిచి వెళ్లలేకపోతున్న బాధను “నది దుఃఖ విచార ముఖాన్ని” చూడలేక చూపులు మరల్చుకున్నారని చెప్పడం హృదయ విదారకంగా ఉంది.

    అందరి ప్రేమలను ట్రాలీ బ్యాగులో సర్దుకొని తీసుకెళ్తున్నా, ఇక్కడ ఉన్నది ఉత్త శరీరాలేనని, మనసంతా అక్కడే ఉందని చెప్పడం ప్రవాసుల హృదయాల్లోని తీరని లోటును, కుటుంబ బంధాల గాఢతను తెలియజేసింది.

    కవిత చివరిలో మనవడి బొమ్మను చూడటం కవి ఆవేదనకు పరాకాష్ట.మొత్తం మీద, ఈ కవితలో.. వలస వెళ్లే వారి అంతర్గత సంఘర్షణను, ఆధునికత తెచ్చిన మార్పులను, భావోద్వేగాల ప్రవాహాన్ని అత్యంత సున్నితంగా, వాస్తవికంగా చిత్రించారు. మీకు శుభాకాంక్షలు.

  • ………….
    జ్ఞాపకాలతో కాలం
    ఉదయాస్తమయాలు నెమరు వేస్తుంది
    …………….
    చెప్పులు లేని కాళ్లు
    దిగులు మనుషులు
    పల్లె వెలుగునీడల అడుగుజాడలు
    దుర్భినీ వేసి వెతికినా కనిపించవు…..

    Excellent expression jukanti sir congratulations to you 💐💐💐💐

    చంకనెక్కి కన్నీళ్లు పెట్టుకుంటున్న
    మనసును బలవంతంగా
    ఇక్కడే దిగ విడిచి
    దేశాలు సముద్రాలు దాటి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు