వైరల్ అయిన ఆ కథ వెనక వేదన!

భావ చౌర్యం..నేనీ పదం పదేళ్ల క్రితం, కావ్య విశ్వనాథన్ అనే రచయిత్రి తన నవలలో వేరే వారి రచనలను వాడుకున్నారనే వార్తా కథనంలో చదివాను. అదే మొదటసారి నేనా పదాన్ని తెలుసుకోవడం. అప్పుడు నేనింకా పాఠశాల విద్యార్థినినే. నాకప్పుడు తెలియదు.. ఈ రోజు నేనిలా ఆ పదంతోనే మీ ముందుకు వస్తానని. 
   ఈ మధ్య నేను ఫేస్ బుక్ లోని ఒక గ్రూపు నిర్వహిస్తున్న పోటీకి “కాఫీ పెట్టవూ” అనే కథ రాశాను. ఆ కథ అనతి కాలంలోనే ఊహించని విధంగా వైరల్ అయ్యింది. ప్రముఖ రచయితలు సైతం నా కథను పొగుడుతూ కామెంట్స్ చేస్తుంటే, ఒక రచయిత్రిగా ఎంతో ఆనంద పడ్డాను. 
    కానీ అదే కథ వేరొకరి పేరుతో చలామణి అవుతూ,  వాట్సాప్ సందేశంలా నా చెంతకు వచ్చేసరికి గుండె ముక్కలు అయ్యింది. కోపం ముంచుకు వచ్చింది. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే, నా కథ  స్పోటిఫై అనే ఎఫ్ఎంలో ఒక అనామక కథగా వచ్చినప్పుడు, సోషల్ మీడియా మీద అసహ్యం వేసింది. 
  నేనీ రచనా రంగానికి కొత్త కావడం, నాకెవరూ మార్గ దర్శకులు లేకపోవడం వలన ఈ కథను నేను ఫేస్ బుక్ లో పోస్టు చేశాను. ఇలా పోస్టు చెయ్యబడిన కథ , పత్రికల్లో తీసుకోరని తెలిసి మధన పడుతుంటే,  రచయిత్రి శ్రావణి గుమ్మరాజు గారు, అఫ్సర్ గారి మెయిల్ ఐడి ఇచ్చి వారిని సహాయం కోరమని సలహా ఇవ్వడంతో, వెంటనే ఆయనకి సందేశం పంపి సహాయం కోరాను.  ఆయన నిండు మనస్సుతో స్పందించడం వలన ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చాను. వారికి నా కృతజ్ఞతలు. 
కాఫీ పెట్టవూ..

“కొంచెం కాఫీ పెట్టిస్తావా అమ్మా” మామయ్య ఆశగా అడుగుతుంటే, ఏం చెప్పాలో తెలియక అలా నిల్చుంది మాలతి.

“ఏమ్మా పాలు అయిపోయాయా”మళ్లీ ఆయనే అడిగారు.

భర్త కోసం  ఫ్రిడ్జ్ లో దాచి ఉంచిన కప్పుడు పాలు చూసారా ఏంటీయనా అని మనసులో అనుకుంటూ, “ఆ.. అ..వు..ను మామయ్య” తలదించుకుని సన్నని గొంతుకతో చెప్పింది మాలతి.

“పర్లేదు లేమ్మా” అంటూ మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ గోడ వారగా నడుచుకుంటూ వెళ్ళి తన వాలు కుర్చీలో కూర్చుండి పోయారు మామయ్య.

సుమారు యనభై ఏండ్లు ఉంటాయేమో. వయసులో ఉన్నప్పుడు దర్జాగా, తీరైన అవయవ సౌష్టవంతో, కండపట్టి నిండుగా ఉండేవాడు కాస్తా వయసు మీద పడేసరికి ఎముకల గూడులా సన్నగా అయిపోయాడు. వయసులో ఉన్నప్పుడు ఏ దురలవాట్లు లేకపోవడం చేతనేమో పళ్ళన్నీ ఊడిపోయినా, తన పనులు తాను చేసుకోడానికి శరీరం కొంతైనా సహకరిస్తోంది.

అయినా ఎముకలు తప్పా పిసరంత కండ కూడా కనిపించని ఆ దేహం ఒకప్పుడు కొండలా ఉండేదంటే బహుశా ఎవరూ నమ్మక పోవచ్చు నేమో! వయసు చేసే గాయంతో కండలన్ని కరిగిపోయాయి.

అరవై వసంతాలు కొండంత ప్రేమను పంచిన అతని భార్య పోయిన దగ్గర నుండి మరీ చిక్కి శల్యం అయిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు దగ్గర కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు. ఇప్పుడిలా గుక్కేడు కాఫీ చుక్కల కోసం అలమటిస్తూ ఉన్నాడు.

అతని భార్య బతికుండి ఉంటే అతనికోసం ఆమె కూడా కప్పుడు పాలు దాచి ఉంచేదేమో! అతడి ఆవేదనను అర్థం చేసుకునేదేమో! నోరు పిడచకట్టుకు పోతుంటే, నాలుకతో తడిచేసుకుంటూ, భారంగా నిట్టూర్పులు విడుస్తూ కూర్చున్నాడు. ఏ ఒక్క దురలవా టూ లేని పెద్దాయనకు ఈ కాఫీ తాగే అలవాటు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

లాక్ డౌన్ కారణం చేత, ఎక్కడా షాపులు తియ్యట్లేదు. పాల వాడు కూడా రాలేనని చెప్పేశాడు. ఎక్కడో పది కిలోమీటర్ల అవతల ఉన్న ఓ షాపు నుండి కొన్ని లీటర్ల పాలు సంపాదించి, తెచ్చాడు కొడుకు. అవన్నీ అయిపోయాయి అంటోంది కోడలు. ఓ గుక్కెడు కూడా మిగాల్లేదా అనుకుంటూ భారంగా చూసాడు.

ఇప్పుడు కొడుకింట్లో అతడో అతిథి మాత్రమే. ప్రశ్నించి, శాసించే అధికారం కానీ, శక్తి కానీ లేదిప్పుడు. మాటలు పలకడానికే ఓపిక ఉండదు. కోడలు మంచిపిల్ల కాబట్టి తను మాట్లాడే ముక్కలు ముక్కల్లాంటి భాషను అర్థం చేసుకుంటూ, అన్నీ సమయానికి అందిస్తూ ఉంటుంది. ఏదైతే ఏం వీళ్లకు భారం కాకుండా హాయిగా వెళ్లిపోతే చాలు అని రోజూ అనుకుంటూ ఉంటాడు.

శక్తి మేరకు రెక్కలు ముక్కలు చేసుకుని, కొడుకును ప్రయోజకుడిని చేశాడు. ఒక్కడే నలుసు కావడంతో , వాడి మీదే ఆశలన్నీ పెట్టుకుని ప్రేమగా పెంచాడు. వాడికి ఏదైనా చిన్న బాధ కలిగితే తట్టుకోలేక పోయేవాడు. కొడుకు నోరు తెరిచి అడిగితే చాలు.. అప్పొ సప్పొ చేసైనా తెచ్చి పెట్టేవాడు.

“ఆ రోజులు ఎంత హాయిగా ఉండేవో కదా!” గతాన్ని గుర్తు తెచ్చుకుని వెనక్కి వాలి ఆలోచనల్లో పడ్డాడు. జీవిత చరమాంకంలో ఉన్న అతడిప్పుడు చెయ్యగలిగింది అదొక్కటే. గతాన్ని, అది మిగిల్చిన తీపి గురుతులనూ నెమరవెస్తూ ఉండడం మాత్రమే అతను చెయ్యగలడిప్పుడు.

కొడుకుతో గడిపిన ఆ అమృత క్షణాలే అతడి స్మృతి పథంలో చిక్కగా నిండుకున్నాయి.

“వాడింకా లేవలేదా అమ్మా?” తన కొడుకును తలుచుకుంటూ మాలతిని ప్రశ్నించాడు.

“లేదు మావయ్య గారు. అలసి పోయినట్టు ఉన్నారు. తిన్నా వెంటనే నడుం వాల్చేసారు. లేప మంటారా?” మాలతి అడిగింది.

“వద్దులే తల్లీ.. పడుకోని. మళ్లీ ఎన్ని రోజులకు దొరుకుతుందో ఈ నిద్ర.” తనలో తను గొణుక్కుంటూ మెల్లగా చెప్పాడు. మాలతి వినిందో లేదో కానీ రాత్రి భోజనాలు సిద్దం చేయడానికి వంటింట్లోకి వెళ్ళి పోయింది.

” పాపం. ఎంత కష్ట పడతాడో నా కొడుకు” మనసులో భారంగా అనుకున్నాడు. వయసులో ఉన్నప్పుడు అతడు పడిన కష్టమేదో చిన్నది అయినట్టు.

ఒక ప్రైవేటు స్కూల్ టీచర్ గా పని చేసి, చాలి చాలని జీతంతో నెట్టుకు వచ్చి, రాత్రి పదకొండు వరకూ ట్యూషన్లు చెప్పి, మళ్లీ పొద్దున్న పెందళాడే బస్సెక్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు రెండు బస్సులు మారి, రక్తాన్ని చెమటగా ధార పోసి, కొడుకును ఓ గవర్నమెంట్ అధికారిని చేశాడు. ఆ కష్టమంతా మరచి, ఇప్పుడు కొడుకు కష్టం చూసి దుఃఖిస్తున్నాడు.

ఎంతైనా కన్న ప్రేగు కదా..మమకారం వదలలేక పోతున్నాడు. కుర్చీలో కూర్చుని అసహనంగా కదులుతూ ఆలోచనల్లో పడ్డాడు. ఆలోచనలు..ఇప్పుడు తనతో మిగిలి ఉన్నవి ఇవే కదా. వయసు మీద పడడం వల్ల చూపు మందగించింది. పుస్తకాలు చదవలేడు. వాలు కుర్చీలో కూర్చుని, పాత పాటలు అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉంటాడు.

కాఫీ నోట్లో పడకపోయే సరికి, తల లాగేస్తోంది. ధ్యాస మరాల్చడానికి పక్కనే ఉన్న రేడియో అందుకుని, తనకిష్టమైన దేవానంద్ పాటలు పెట్టుకుని వింటూ కూర్చున్నాడు.

ఇక రాత్రి కూరకు కూరగాయలు తీద్దామని, ఫ్రిడ్జ్ డోర్ తీసిన ప్రతీసారీ, భర్త కోసం దాచి ఉంచిన ఆ కప్పుడు పాలు తనతో ఏదో చెబుతున్నట్టు అని అనిపించింది మాలతికి. ఈ కరోనా కాలంలో పాలు దొరకడమే కష్టంగా ఉంది. భర్తకు సాయంత్రం పూట కాఫీ లేకపోతే, తలతిరుగుతుందని, ఎలాగోలా పాలు సంపాదించి , కొద్ది కొద్దిగా దాస్తూ నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ కప్పుడు పాలే మిగిలాయి. అవి మామయ్యకి ఇచ్చేస్తే , భర్త ఏం అనడు గానీ అతడు పడే అవస్థ తాను చూడగలదా! తల నొప్పితో విలవిలలాడుతాడు.

పక్కింట్లో అడిగి చూసింది. వాళ్లకూ పాలు దొరక్క డికాక్షన్ పెట్టుకుని తాగుతున్నారట. బయట షాపులూ లేవు. హోటల్స్ అసలే లేవు.

మామయ్య వాలు కుర్చీలో కూర్చుని, పాటలు వింటూ ఉన్నారు. పోనీలే కొంచెం అడ్జస్ట్ అయినట్టు ఉన్నారు అని అనుకుంది మాలతి.

“ఆయనకు కాఫీ ఇచ్చేటప్పుడు ఒకవేళ మామయ్య చూస్తే!” అని మనసులో ఒక నిమిషం పాటు అనుకున్నా, “ఆయన కష్టపడి వచ్చే మనిషి. పాపం కాఫీ కూడా లేకపోతే, అలసిపొడూ! మామయ్య అర్థం చేసుకుంటారులే” అని మళ్లీ సర్ది చెప్పుకుంది.

“పోనీ ఆ కప్పుడు పాలలో ఓ కప్పుడు నీళ్లు కలిపితే? లేదు లేదు.. ఆయనకు చిక్కని కాఫీ ఉండాలి.లేదంటే అస్సలు తాగరు.”

“పాపం మామయ్యకు కూడా తలతిప్పుతూ ఉందేమో! పాల పొడి ఉన్నా బాగుండు.”

“కప్పుడు కాఫీ చెరి సగం చేసి ఇస్తే!? హ్మ్మ్.. ఉన్న కప్పుడు లో చెరిసగం అంటే ఓ చెంచాడు. అదేం సరిపోతుంది ఇద్దరికీ?!”

“ఆయనకీ విషయం చెప్పి చూస్తే! నాకొద్దు మొత్తం నాన్నకి ఇచ్చే మని, తను అవస్థలు పడతారు. మళ్లీ రాత్రి డ్యూటీకి వెళ్ళాలి. వద్దొద్దు…”

“నిన్ననే గుర్తు పెట్టుకోవలసింది. ఆయన మటుకు ఉన్నాయని ఊరుకున్నా. ఈ రెడ్ జోన్ ఏరియాలో రానని పాలవాడు హ్యాండ్ ఇచ్చాడు. రేపాయన్ని పంపి కనీసం ఒక ఐదు లీటర్లైనా తెచ్చి పెట్టేసుకోవాలి. “

ఇలా సాగిపోయాయి మాలతి ఆలోచనలు.

భర్త మధ్యాహ్నం తిన్నాక  కునుకు తీసాడు.

“ఈ లాక్ డౌన్ పుణ్యమా అని కొంత తీరిక దొరికింది ఈయనకి. రోజూ ఎంత ఒత్తిడో! ఎంత శ్రమ పడతాడో!” నిద్రపోతున్న భర్తను చూస్తూ అనుకుంది మాలతి.

వాలు కుర్చీలో కూర్చున్న మామయ్యనూ చూసింది. ఆయనా కునుకు తీస్తూ ఉన్నాడు. వాలు కుర్చీలోనే ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. ఆయన పెట్టుకున్న పాత హిందీ పాటలు లయ బద్దంగా మంద్రంగా వినిపిస్తూ ఉన్నాయి.

“మామయ్య మేలుకునే లోపు ఈయన లేస్తే బాగుండు. కాఫీ ఇచ్చేస్తాను.” అని అనుకుంటూ భర్తను చిన్నగా కదిలించింది.

ఇంకా మత్తు దిగని అరమొడ్పు కళ్ళతో ఏంటని ప్రశ్నించాడు భర్త. “లేవండి..సంధ్య వేళ కావొస్తోంది. ఇంకా పడుకుంటే ఎలా?!” అంటూ మెల్లగా తట్టి లేపింది

“ఆప్పుడే సాయంత్రం అయిపోయిందా!” అనుకుంటూ నిద్ర లేచాడు భర్త. “మొహం కడుక్కుని రండి కాఫీ పెడతా”నంటూ వంట గదిలోకి వెళ్లిపోయింది మాలతి.

చప్పుడు లేకుండా మెల్లగా ఫ్రిడ్జ్ డోర్ తీసి, పాలు బయటకు తీసింది. వేడి చేసిన ఆ పాలలో కాఫీ కలుపుతుంటే, కమ్మటి కాఫీ వాసన ముక్కుపుటాలు తాకుతోంది.

కూర్గ్ నుండి తెచ్చుకున్న స్వచ్ఛమైన, పరిమళ భరితమైన కాఫీ గింజలతో చేసిన కాఫీ అది. దాని సువాసనకే సగం అలసట పోతుంది. ఉత్తేజితం చేస్తుంది. గదంతా కాఫీ సువాసనలు నిడుకుంటుంటే, మాలతి కాఫీ ఫిల్టర్ చేసి, ఒక గ్లాసు నుండి మరో గ్లాసులో పోస్తూ నురగలు తెప్పిస్తూ, భర్త కోసం చిక్కటి కాఫీ కలుపుతోంది.

“మాలతీ….మాలతీ…..” భర్త పెద్ద పెద్ద అరుపులు విని, కాఫీ కప్పు కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టీ గబగబా అడుగులు వేస్తూ వెళ్ళింది.

“ఏంటండి..టవల్ అక్కడే పెట్టాగా..” అంటూ వెళ్ళిన మాలతి, అక్కడి దృశ్యం చూస్తూ కొయ్యబారి నిల్చుండి పోయింది.

ఒళ్ళో రేడియో పెట్టుకుని, చేతులూ నేలను తాకుతూ కుర్చీలోంచి పక్కకు వాలిపోయి, నిర్జీవంగా పడి ఉన్న మామయ్యను చూసి, బిక్క చచ్చిపోయింది. భయం భయంగా ఆయన శరీరాన్ని పట్టుకొని తిన్నగా కూర్చోబెట్టబోయింది. జీవుడు వదిలిన ఆ దేహం కళా విహీనంగా, శీతలంగా మారి పోయినా, ఆ ముఖంలో మాత్రం ఏదో తెలియని ప్రశాంతత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తన బాగోగులు చూసే మనిషిని , తన కన్నా ముందే వెళ్ళిన తన నెచ్చెలి చెంతకు చేరుకున్నాడనేమో!  మూసి ఉన్న ఆ కళ్ళు నిద్రపోయినట్లు ఉన్నాయి. ఇక చెప్పడానికి, అడగడానికి ఏం లేదన్నట్టు ఆ బోసి నోరు బిగువుగా మూసి ఉంది. ఇక ఆ దేహంతో పని లేదన్నట్టు ఉచ్ఛ్వాస నిచ్వాసలు తమ ఉనికిని కోల్పోయాయి.

“మాలతీ….నాన్న…నాన్న…కదలటం లేదు మాలతీ” తండ్రి దేహం పట్టుకుని, వెర్రివాడిలా చెబుతున్న భర్త కళ్ళల్లో నీళ్ళు చూసి ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిండుకున్నాయు. కళ్ళతోనే ఆయనిక మనకి లేరు అని బదులిచ్చింది.

“ఇంతటి దుఖాన్ని తీర్చేవారు ఎవరు మాలతి? అనాథను అయిపోయాను..నేను అనాథను అయిపోయాను..మాలతి. నాన్న కూడా నన్నొదిలి వెళ్ళిపోయారా…ఇక నాకు అమ్మా నాన్న లేరా.. ఈ పాడు లోకంలో నా ప్రేగు బంధమే లేదా.. నాన్న వచ్చే నాన్నా…నా దగ్గరకు మళ్లీ వచ్చే నాన్నా..ఇదంతా ఒక డ్రామా అని చెప్పు నాన్నా..నన్ను ఆటపట్టించడానికి నువ్వు చేస్తున్న నాటకం అని చెప్పు నాన్న…ప్లీస్ నాన్నా వచ్చేవూ.. నువ్వు లేకుంటే నన్ను ఎవరు చూస్తారు.. నేనొచ్చే వరకూ వీధి గుమ్మంలో ఎవరు కాపు కాస్తారు. నా కష్టం చూసి ఎవరు కన్నీళ్లు పెట్టుకుంటారు… నా ఆనందం చూసి ఎవరు సంబరాలు చేసుకుంటారు.. నాకో చిన్న రోగమొస్తే ఎవరు నాన్న నన్నింకా  చిన్నపిల్లాడిలా చూసుకుంటారు!.. సాయంత్రం పూట నాతో ఎవరు నాన్న జీవిత అనుభవాలు , జ్ఞాపకాలు పంచుకుంటారు? నా పిచ్చి కబుర్లు ఆసక్తిగా ఎవరు వింటారు నాన్న. నా దెబ్బలు చూసి ఇకపై ఎవరు కన్నీళ్లు పెడతారు నాన్న.  నా వేలు పట్టుకుని అన్నీ నేర్పించిన నువ్వు,  నువ్వు లేకుంటే ఎలా బతకాలో నేర్పించలేదు కదా నాన్న.  నన్ను మోసం చేసి వెళ్లకు నాన్న.. తిరిగొచ్చే నాన్న.. తిరిగొచ్చెయ్ ” తండ్రి దేహన్ని పట్టుకుని ఏడుస్తున్న భర్త ఏడుపులో మాలతి కూడా జత కట్టింది. వెక్కి వెక్కి ఏడ్చింది. కొద్ది సేపటికే వాళ్ళ ఇల్లు స్మశాన రోదనలతో నిండిపోయింది.

సూర్యుడు అస్తమించాడు. గట్టు మీద పెట్టిన కప్పుడు కాఫీ చల్లారి పోయింది. మామయ్య చివరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయాడు. మాలతి కిచెన్లోని కాఫీ కప్పు వైపు నిర్వేదంగా చూస్తూ ఉండిపోయింది. ఇకపై కాఫీ తాగగలదో లేదో ఆమే చెప్పాలి..

*

కిరణ్ విభావరి

17 comments

Leave a Reply to Srinivas Sriranganayakula Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కాఫీ పెట్టవూ కధ కిరణ్ విభావరి గారు చాలా బాగారాశారు.

  • మంచి కథలకు వేదిక సారంగ. అది మాత్రమే కాదు రచయితకు అండగా నిలబడి తమని తాము ప్రూవ్ చేసుకునేలా చేస్తుంది. నేను కేవలం సలహా ఇచ్చా, నీ ఆవేదన అర్థం చేసుకుని నీ కథకు ఇక్కడ అవకాశం ఇచ్చిన గొప్ప మనసు అఫ్సర్ సర్ దే. నిజంగా చాలా సంతోషంగా ఉంది కిరణ్. కీప్ గోయింగ్. ఇది మంచి వేదిక నీ మరిన్ని కథలు సారంగలో రావాలి. ఆల్ ద బెస్ట్👍👍

    • అవును .. నిజంగా చాలా ఉన్నతమైన భావాలు కలిగిన పత్రిక.
      మీకు నా ధన్యవాదాలు

  • ఈ కథను నేను జూన్ లో మీ పేరుతోనే భావుక గ్రూప్ లో చదివాను…. మంచి కథ👌👌👌

    • ధన్యవాదాలు అండి 🥰 నేనూ అదే గ్రూపు పోటీకి రాశాను.

  • ఈ సందర్భంగా , సోదరి కిరణ్ విభావరి కి సవినయంగా విన్నవించుకుంటు తెలియ చేయునది ఏమనగా , ఆమె కధ ఈ ” కాఫీ పెట్టవూ” అనే దానిని , ఎవరో మిత్రులు వాట్సాప్ గ్రూప్ లో ఉంచి రచయిత ఎవరో పేరు తెలియదు కధ బాగుంది అని, ఆ కథను నాకు షేర్ చేయడంతో , నేను గూడా చదివి నా మనసుకు గూడా నచ్చడం మూలానా , నేను నా ” కానమోకు కధా వచనం ” అనే ఒక కథలు , విజ్ఞాన విషయాలు, జీవిత చరిత్రలు , నాకు నచ్చిన వాటిని ,ప్రధానంగా ” చదువ ద గు నెవ్వరు వ్రాసిన చదివి న దానిని మరువక పలువురికి వినిపించ పూనుట మేలు కదా !” అనే భావంతో ఆ అక్షరాలకు నా స్వర బద్ధంచేసి , ఇప్పటికి 310 వివిధ అంశాలను( కథలు , వ్యాసాలు, విజ్ఞాన విషయాలను) ఆ రచయితల పేరుతోనే చెప్పి మరి వాటిని యాంకర్ పోడ్ కాస్ట్ ద్వారా ఇలా పేస్ బుక్, వాట్సాప్ గ్రూపు ల్లో ఉంచి , నే చదివిన వాటిని ఆరాధనా పూర కంగా నలుగురికి అందించడమే ధ్యేయంగా చేస్తున్నా ను మినహా మరే దురుద్దేశం నాకు లేదు. నేనుగూడా ఉద్యోగ క్రాంతి పత్రికకు ఒక ఎడిటర్ గా 25 సం లనుండి కొనసాగుతూ , 2018 లో డిప్యూటీ సెక్రెటరీ టు గవర్నమెంట్ గా రిటైర్ న వాడిని . దయచేసి దీన్ని అర్ధం చేసుకొనవాల్సినదిగా కోరుతున్నాను. ఆమె ఆ పోడ్ కాస్ట్ ద్వారా నాకు వాయిస్ మెసేజ్ ఆ కధ తాను వ్రాసి నట్లు చెప్పినమీదట , నేను సమాధానం గా ఆమెకు క్షమాపణ ను చెప్పాను. అంతే గాని ఆకధ ను నేనే వ్రాశాను అని నేను చెప్పుకోలేదు! రచయిత పేరు తెలియదని అప్పటికి చెప్పాను. కాబట్టి దాన్ని ఇంత రాద్దాంతం చేయడం సమంజసం గాదు .మరొక సారి ఈ రచయిత్రి కి నా ఈ బహిరంగ క్షమాపణ ను తెలుపుతు న్నాను.

    • ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో ఇటువంటివి చాలా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

      ఇది నా ఒక్కరి సమస్య కాదండీ. చాలా మంది రచయితలు ఎదుర్కుంటున్న సమస్య. నేనో గ్రూపు పోటీకి పెట్టిన కథ, (నా fb Wall మీద కూడా పెట్టలేదు). అక్కడ నుండి వాట్సప్ లో చేరింది.

      పోనీ రచయిత పేరు ఉంటే, చాలా సంతోషం..కానీ అదేం లేకుండా ఒక సేకరణ అంటూ వచ్చినప్పుడు చాలా బాధ కలిగింది.

      ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతుందో అని గూగుల్ చేస్తే, ఒకరి fb లో పెట్టుకున్నారు. ఏదో ఆయనే రాసినట్టు.

      మీరు రాసినట్టు చెప్పకపోయినా , మీరు ఒక మొనిటైజెడ్ ఫ్లాట్ ఫాం మీద కథ చదువుతున్నప్పుడు , సదరు రచయిత అనుమతి తీసుకోవాలి.

      ఏ కథ అయినా గాలికి పుట్టదు కదా. ఒక రచయిత ఎంతో మధన పడి, ఎన్నో పనులు వదులుకుని రాస్తారు. నా వరకూ అయితే, నేను నా చదువు పక్కన పెట్టీ రాస్తున్నాను. అంత చేశాక, కనీసం క్రెడిట్ ఇవ్వకుండా వాడుకోవడం సబబు కాదు కదా అండి.

      ఇప్పుడు మనకో పాట నచ్చింది. దాని రచయిత పేరు తెలియదు అని, మనం మన ఛానెల్ లో పెట్టుకోము కదా. మీరు స్టాండర్డ్ fm లో కథ వినిపిస్తూ, మొనిటరీ బెనిఫిట్స్ పొందుతున్నప్పుడు, రచయిత సమ్మతి తీసుకోవాలని చట్టం చెబుతోంది. ఒక 75 ఏళ్ల క్రితం రచనలను మాత్రమే, మనం రచయిత అంగీకారం లేకుండా వాడుకోవచ్చు.

      మీరు నన్ను సోదరి అని సంబోధించినా, మీరు వయస్సులో, విజ్ఞతలో, లోక జ్ఞానం లో, నా కన్నా చాలా పెద్దవారు. మీరు క్షమాపణలు చెప్పాలని నేను కోరుకోలేదు. కేవలం నా లాంటి ఎందరో అనామక రచయితలకు న్యాయం జరగాలని ఆశించాను.

      • నేను ఏ విధమైన ఆర్ధిక లాభం ఈ ప్లాట్ ఫామ్ నుండి పొందడం లేదు. కేవలం సదరు రచనలను పలువురికి అందించి వారిని గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే ఉద్దేశించి నా స్వర బద్దం చేస్తున్నాను. మరే స్వార్ధం లేదని పలువురికి వాటి గొప్పతనం ను పంచాలనే సదుద్దేశంతో నే చేస్తున్నాను!.

  • “కాఫీ పెట్టవూ ” మనసును కదిలించింది.
    మనసు చలించె కథ.వైవిధ్యం ప్రతిబింబిస్తుంది..

    తండ్రీ కొడుకుల బంధాన్నీ కప్పుడు కాఫీతో ముడువేయడం… కోడలి మనస్తత్వం… మానవ నైజాన్నీ చిత్రించిన తీరు చాలా బాగుంది.

    వృధాప్యంలో వున్న తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతను…గుర్తుచేస్తూ ఆలోచింప చేస్తుంది.
    .

  • సూర్యుడు అస్తమించాడు. గట్టు మీద పెట్టిన కప్పుడు కాఫీ చల్లారి పోయింది. మామయ్య చివరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయాడు. మాలతి కిచెన్లోని కాఫీ కప్పు వైపు నిర్వేదంగా చూస్తూ ఉండిపోయింది. ఇకపై కాఫీ తాగగలదో లేదో ఆమే చెప్పాలి…….
    ముగింపు చాలా టచింగ్……. మంచి కథ……ధన్యవాదములు

  • కధలో అందరూ మంచివారే..పరిస్థితులే దుఃఖాన్ని కలిగించాయ్.హృదయాన్ని ద్రవింపజేశాయ్.అద్భుతమైన కధండి.ధన్యవాదములండీ.

  • మీ పోరాటం నచ్చింది. పోనీలే అని వదిలేయకుండా అందరి దృష్టికి తెచ్చారు.
    మీ కథ కరోనా నేపథ్యంలో మానవ సంబంధాల దుస్థితిని కళ్ళకు కట్టింది. అదో విషాదం. మీరు మరిన్ని మంచి కథలు రాయాలని కోరుకుంటున్నాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు