తమిళ మూలం:అశోకమిత్రన్
తెలుగు:దాము
అశోకమిత్రన్(1931-2017)వుత్తమ తమిళ రచయితలలో వొకరు. ఆయన అసలు పేరు జగదీశ త్యాగరాజన్. పుట్టి పెరిగింది సికింద్రాబాద్‌లో. దాదాపు 20యేళ్లు వచ్చేదాకా సికింద్రాబాద్‌లోనే వున్నాడు. అప్పటి జీవితానుభవాలతో కొన్ని కథలు, ‘జంట నగరాలు’ పేరుతో నవల రాశాడు. 250పైగా కథలు, రెండు డజన్ల నవలలు, నవలికలు రాసాడు. ఆయన కథల సంపుటి ‘అప్పావిన్ స్నేగితర్'(మా నాన్న స్నేహితుడు)కు 1995లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆయన మీద మూడు డాక్యుమెంటరీ ఫిలింలొచ్చాయి.
1952లో చెన్నై వెళ్ళిన అశోకమిత్రన్ చాలాకాలం పాటు దర్శక నిర్మాత యెస్.యెస్. వాసన్ దగ్గర పీఅర్వోగా పని చేశాడు.
ఆయన రచనల్లో మధ్యతరగతి జీవిత చిత్రణ యెక్కువ. సాదాసీదా మనుషులే పాత్రలు. చిన్న చిన్న సంఘటనల చుట్టే ఆయన వస్తువు తిరుగుతుంది. “మహా గొప్ప సంఘటనల గురించీ, దేశంలోని చరిత్రల గురించీ రాయచ్చు. కానీ చిన్న చిన్న సంఘటనలే మనుషుల మనస్సుల్ని ప్రభావితం చేస్తాయి” అంటారాయన.
యెటువంటి ఆర్భాటాలూ లేని సరళమైన శైలి ఆయనది. ఆయన రచనలు అనేక భాషల్లోకి అనువాదమయ్యాయి.
గత సంచికలో జి నాగరాజన్‌ను ప్రధాన పాత్రగా చేసుకొని ఐదుగురు ప్రముఖ తమిళ రచయితలు కథలు రాశారని చెప్పాను. అందులో వొక కథే యిది. యీ కథ చదివితే, నాగరాజన్ జీవితపు చివరి దశలో యెలా వున్నాడో తెలుస్తుంది.
(మూల కథ ‘విరల్’, 1982)
***
రాత్రి పది గంటలకు వున్నట్టుండి తలుపు తడుతున్న శబ్దం. రంగనాథన్ భార్య, “వద్దు. తలుపు తీయద్దు. ఆ తాగుబోతే వచ్చుంటాడు.” అంది.
అప్పుడు మద్యపాన నిషేధం అమలులో వుంది.
“రామస్వామినా?”
“అవును. సాయంత్రమే వచ్చినాడు. మీరు లేదని చెప్పి పంపించేసినా.”
వాకిటి తలుపు మళ్ళీ విపరీతంగా దడదడ లాడుతోంది. దాంతో పాటు రామస్వామి గొంతు, “రంగనాథన్! రంగనాథన్!”
రంగనాథన్‌కి నిద్ర పూర్తిగా చెడిపోయింది. భార్యను కోపంతో చూసాడు.
“నేను సాయంత్రమంతా యింట్లోనే పడున్నా కదా? యెందుకు చెప్పలేదు?”
“యెందుకు చెప్పేది? బిడ్డలు భయపడతారు”
“వాడు మిమ్మల్నేం చేశాడు?”
“వద్దు. తాగుబోతుల్ని యింట్లోకి తెచ్చి సంబంధాలు పెట్టుకోవద్దు”
యిప్పుడు తలుపు విరిగి పడిపోతుందేమో అన్నట్టుంది. దానికి తోడు, “రంగనాథన్! రంగనాథన్!” అని రామస్వామి గొంతు కడుపులో దేవినట్టు వినిపిస్తూ వుంది.
తప్పకుండా యిరుగు పొరుగు వాళ్లు మేలుకొనే వుంటారు. రేపు వుదయం వాళ్ళ విమర్శ వాళ్ళ కళ్ళల్లో వుంటుంది. వెలుతురులో కళ్ళు భయంకరంగా వుంటాయి.
ఆమె చెప్పిన దాంట్లో నిజం వుంది. తలుపు తీసిన వెంటనే రామస్వామిని చూసి అతనే భయపడిపోయాడు. ముఖంలో అడవిలా పెరిగిన గడ్డం, మీసం. సారాయి కంపు. బట్టల నిండా రక్త చారికలు. చెమట కంపు. యిద్దరు పిల్లలు నిద్ర లేచి, ఆమె చెప్పినట్టుగానే, రామస్వామిని చూసి భయపడి అరిచారు.
రంగనాథన్, “బిడ్డల్ని యెత్తుకొని నువ్వు వంటింట్లోకి పో” అని భార్యతో చెప్పాడు. అది చెప్తున్నప్పుడే, అక్కడ నేలంతా తేమగా వుంటుందని గుర్తొచ్చింది.
ఆమె మారు మాట్లాడకుండా వొక బిడ్డని యెత్తుకొని, యింకో దాన్ని నేల మీద బరబరమని లాక్కుంటూ వెళ్ళింది.
రంగనాథన్ రామస్వామిని వొక కుర్చీలో కూర్చోబెట్టాడు. వొక పాలకాడ్ తువ్వాలును నీట్లో తడిపి రామస్వామి ముఖాన్ని తుడిచాడు. రామస్వామి చేతిని పైకెత్తాడు. దెబ్బ తలకు కాదు. కుడి చేతికి తగిలుంది. రక్తం పెల్లుబుకుతా వుంది.
రంగనాథన్ చీకట్లో వీధి చివరికి పోయి అటూ యిటూ చూసాడు. ఆ వేళలో వొక బండి కూడా కనిపించలేదు. మళ్ళీ యింటికి పరిగెత్తుకొని వచ్చి, రామస్వామిని కుదిపాడు. “కొంచెం నడవగలవా? దగ్గర్లో వొక డాక్టరు దగ్గరికి పోయి, కట్టు కట్టుకొని వచ్చేద్దాం.”
రామస్వామి కష్టపడి సర్దుకుని కూర్చున్నాడు. “రేపు తెల్లార్తో సూసుకొందాం”, అతని ‘చూ’ ‘సూ’గా పలికింది.
“లేదు. చెయ్యి చాలా ఘోరంగా వుంది.”
రామస్వామి లేచి నిల్చోలేకపోతున్నాడు. రంగనాథన్ అతన్ని పట్టుకుని బయటికి తీసుకెళ్ళాడు. వాళ్ళు వీధిలోకి అడుగు పెట్టడమే ఆలస్యం, యింటి తలుపు మూసి, గొళ్ళెం పెట్టబడింది. ఆమె మనసు శాంతించింది.
అది యిరవై నాలుగు గంటలూ తెరచి వుంచే క్లినిక్. అక్కడ వొక నర్సు, వొక హెల్పర్ మాత్రమే వున్నారప్పుడు. నర్సు రామస్వామిని పైకి కిందికి చూసింది. హెల్పర్ అది కూడా చెయ్యలేదు. “మీరు రాయపేట ఆసుపత్రికే వెళ్ళిపొండి” అన్నాడు.
“యేం? మీరు చూడరా?”
“లేదు”
“యెందుకు?”
“దెబ్బ పెద్దదిగా వుంది. పోలీసు కేసయితే లేనిపోని తలనొప్పి”
“పోలీస్ గీలీస్ యేం లేదు. కొంచెం కింద పడిపోయారు, అంతే.”
“యెక్స్ రే అంతా తీయాల్సుంటుంది. మీరు అక్కడికే వెళ్ళిపొండి.”
“డాక్టర్ని పిలవవా అయితే?”
“డాక్టరు రారు సార్. యిది పోలీసు కేసు. మనిషి తాగున్నాడు.”
రామస్వామి అలానే వొక కుర్చీలో అడ్డదిడ్డంగా కూర్చొని వున్నాడు. వేరే వూరి నుండి చెన్నైకి వచ్చి వొక నెలయివుంటుంది. దొంగ సారాయి అమ్మే బస్తీలన్నీ అతనికి కొట్టిన పిండి.
“సరే. చేతికేదైనా ఫస్ట్ యెయిడన్నా చెయ్యండి. నేను ఆసుపత్రికే పిల్చుకెళ్తా.”
హెల్పర్ రామస్వామి చెయ్యి తుడుస్తున్నప్పుడు, రంగనాథన్‌కు కళ్ళు గిర్రున తిరిగాయి. రామస్వామి చూపుడు వేలు, నడిమి వేలు, రెండూ సగం కన్న యెక్కువ నలిగిపోయి వేలాడుతున్నాయి. హెల్పర్ యింకొంచెం దూది తీసుకురావడానికి వెళ్ళినప్పుడు, రంగనాథన్ రామస్వామిని అడిగాడు, “యిలా యెలా దెబ్బ తగిలింది?”
రామస్వామి తల మాత్రమే ఆడించాడు.
రాయపేటకు ఆ వేళలో బస్సు లేదు. సైకిల్ రిక్షాకు అది సాధ్యం కాని దూరం. అయితే, ఆసుపత్రికి పోవాలని చెప్పగానే, వొక ఆటో రిక్షా అతను మారు మాట్లాడకుండా వచ్చాడు. రంగనాథన్ బండిని క్లినిక్ గుమ్మంలో నిలిపి, లోపలి నుంచి రామస్వామిని పిల్చుకొని రావడానికెళ్ళాడు. రామస్వామి కొంచెం తన్ను తాను సంబాళించుకొని వున్నాడు.
“నిన్ను చాలా యిబ్బంది పెడుతున్నా రంగనాథన్”
“సరే, సరే, రా”
రంగనాథన్ రామస్వామిని చెయ్యి పట్టుకొని వచ్చి ఆటోలో కూర్చోపెట్టాడు. అతను కూడా యెక్కగానే, బండి బయలుదేరింది.
గాలి చల్లగా ముఖాన్ని తాకుతోంది. రామస్వామి చెప్పాడు. “చెయ్యి పోయింది. యింక చెయ్యి లేదు.”
“ఆసుపత్రికి పోయి చూద్దాం.”
“యింక రాయనే వీలు కాదు.”
రంగనాథన్‌కు దానికి వోదార్పుగా యేమి చెప్పాలో తోచలేదు. “యెక్కడపోయి యిట్లా దెబ్బ తాకించుకున్నావ్?”
రామస్వామి సన్నగా వణుకుతున్నాడు.
రాయపేట ఆసుపత్రి చేరాక, ఆటోరిక్షా అతను మీటరు మీద వొక పైసా కూడా అడక్కపోవడం రంగనాథన్‌కు బాధనిపించింది. కేవలం తడి దూదితో గాయాన్ని తుడిచి, వొక చిన్న కట్టు కట్టినందుకు ఆ క్లినిక్ మనిషి పది రూపాయలు తీసుకొన్నాడు.
ఆసుపత్రిలో క్యాజువాలిటీ విభాగంలో చీటీ రాసిచ్చే వ్యక్తిని వెతుక్కుంటూ రంగనాథన్ వెళ్ళాడు. అతను రామస్వామిని చూసి, “యెట్లా దెబ్బ తగిలింది?” అని అడిగాడు.
రామస్వామి బదులివ్వకుండా నిలబడ్డాడు. అతను మళ్ళీ అడిగాడు. రంగనాథన్ బదులిచ్చాడు. “వొక రిక్షా కొట్టేసింది.”
“రిక్షానా?”
“అవును. ఆటో రిక్షా.”
“రిక్షా కొడితే, చెయ్యి నలిగిపొతుందా?”
“లేదు. వేగంగా వచ్చి కొట్టేసింది.”
ఆ వ్యక్తి చీటీ రాయడం ఆపేసాడు.
రంగనాథన్ బొంగురు గొంతుతో చెపాడు. “ఆయనకే తెలియదు.”
“యేంది సార్, మీరు కూడా..చదువుకొన్నారు..”
“అయన పరిస్థితి చూస్తున్నారు కదా? యెక్కడో కొంచెం డోసు యెక్కువేసుకొన్నాడు.”
“అట్లనే గొడవకు దిగుంటాడు.”
“లేదండీ, ఆయన అట్లాంటి మనిషి కాదు.”
“సరే, యేం వుద్యోగం చేస్తాడు?”
“యేదీ లేదు.”
“యీయనకా?”
“అవును. యేండ్ల తరబడి పని లేకుండానే తిరుగుతున్నాడు.”
“మీరేమవుతారు?”
“స్నేహితుడ్ని. ఆయనతో కలిసి చదువుకున్నా.”
ఆ వ్యక్తి వొక చీటి రాసిచ్చి, “రండి, లోపలికి రండి” అని లోపలికి పిల్చుకొని పోయాడు.
వొక డాక్టరు దగ్గర సంతకం తీసుకొని అతనే వాళ్ళని యెక్స్ రే రూములోకి తీసుకొని పోయాడు. “అలా బయటే కూర్చొని వుండండి.” అన్నాడు.
రంగనాథన్ అడిగాడు, “రిజల్టు యిప్పుడే తెలుస్తుందా?”
“తెలార్తో రావాల్సుంటుంది మీరు. యిప్పుడు వూరికే వొక కట్టు కట్టి పంపించమని డాక్టరు చెప్పాడు.”
“కట్టు యెక్కడ కడతారు?”
“కొంచెం అలా కూర్చోండి. డ్రస్ చేసే ఆయన బయటికెళ్ళున్నాడు. రాగానే చెప్తాను. యిది యితనై చేసుకొన్న దెబ్బే కదా?”
“అవునవును.”
“యిలా తాగేసి వుండే ఆయన్ని బయటకు పంపిస్తున్నారే? యిక్కడ పోలీసతను యెవరైనా వుంటే యెంత యిబ్బందయ్యేదో తెలుసా?”
వరండాలో బెంచి మీద యెదురుచూస్తుంటే, మళ్ళీ రామస్వామి బాధపడ్డాడు. “యింక రాయనే వీలుకాదు.”
రంగనాథన్‌కు ఆక్రోషం తన్నుకొచ్చింది. “యింక నువ్వు రాసి యేం అవ్వాలి? భార్యా బిడ్డల్ని వూర్లో, వాళ్ళ బాధలకి వదిలేసి, యిక్కడికొచ్చి వేరే వాళ్ళ ప్రాణాలు తీస్తున్నావ్. యెవడెవడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని పని తీసిస్తే రెండు రోజులు కూడా వుండవు.”
రామస్వామి నిస్సహాయంగా రంగనాథన్‌ని చూసాడు.
అప్పుడు ఆసుపత్రికి యింకొక కేసు వచ్చింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే చావు. శరీరాన్ని వరండాలోనే పెట్టి, ముఖాన్ని కప్పేసారు. వొక ఆసుపత్రి సిబ్బంది రంగనాథన్ దగ్గరికొచ్చి, “మీరు లోపలికి పొండి.” అన్నాడు. రంగనాథన్ రామస్వామిని లోపలికి పిల్చుకొనిపోయాడు.
రామస్వామి చేతి నుండి వస్తున్న రక్తం ఆగిపోయింది. వేళ్ళు నలిగిపోవడం యింకా స్పష్టంగా కనిపిస్తూ వుంది. గాయం యింకా ఘోరంగా వుంది.
యిద్దరూ ఆసుపత్రి వదిలి బయటికొచ్చారు. రామస్వామి, “ఆకలేస్తుంది” అన్నాడు.
“యీ టైములో యిక్కడ తినేదానికి యేం దొరుకుతుంది?”
“పోలీస్ స్టేషన్ దగ్గర కఫే అమీనో అమీరో వుంది కదా?”
“నా దగ్గర రెండు రూపాయలు కూడా లేదు. యీ కట్టును ఆ క్లినిక్ వాడే వేసునుంటే, యింట్లోనే తినుండచ్చు.”
“నీ భార్య పెట్టుంటుందా?” రంగనాథన్ జవాబు చెప్పలేదు.
“యీ దెబ్బ కూడా యింకొకరి భార్య వల్లే తగిలింది.”
“యెవరు?”
“రామప్పన్”
“వాళ్ళింటికి యెప్పుడెల్లావ్? అక్కడేనా తాగింది?”
“లేదు. మీ యింటికొచ్చి నువ్వు లేదనగానే వాడింటికి పోయినా. వాడూ లేదంటే పాత్రల అంగడికి పోయినా.”
“పాత్రల అంగడిలో సారాయి అమ్ముతున్నారా?”
“టించరు. యీ రోజు తల యెక్కువగా తిరుగుతా వుండింది. వీధిలోనే పడిపొకూడదని మళ్ళీ రామప్పన్ యింటికి పోయినా.”
“వాడున్నాడా?”
“తెలియదు.” వాడి భార్యే తలుపు తీసింది. నన్ను చూసిన వెంటనే దబేలుమని తలుపేసేసింది. అప్పుడే తలుపులో చెయ్యి చిక్కుకుంది.”
రంగనాథన్‌కి గుండె గొంతులోకి వచ్చినట్టయింది.
“నేను ‘చెయ్యి చెయ్యి’ అని కేకలేసినా. నేనేదో చేయడానికొచ్చాననుకొని ఆమె తలుపుని యింకా గట్టిగా వేసి గడియ కూడా పెట్టింది.”
రంగనాథన్ రామస్వామిని హత్తుకొన్నాడు. “నీకేందిరా యీ తల రాత?”
“తర్వాత యెదురింటాయన వచ్చి ఆమెను తలుపు తెరవమని చెప్పి చిక్కుకున్న నా చేతిని బయటకు తీశాడు.”
“రామప్పన్ లేదా?”
“లేదే.”
రంగనాథన్ రామస్వామిని మెల్లగా కఫే అమీన్ వైపు నడిపించుకొని వెళ్ళాడు. రామస్వామి చెప్పాడు, “యింక నేను రాయనే రాయలేను రా.”
“లేదు రాయగలవు. రాయగలవు.”
“అయినా, నువ్వు చెప్పినట్టుగా నేనింక రాసి యేమవ్వాలి?”
“అంతా బాగవుతుంది. రేపు యెక్స్ రే రిజల్టు వస్తే అంతా తెలుస్తుంది.”
“రంగనాథన్, నాకు చాలా రోజుల నుంచి నిన్ను వొకటి అడగాలని వుంది.”
“యేంటి?”
“యెప్పుడో పరీక్షలో కాపీ కొట్టేందుకు నేను రాసింది నీకు చూపించాననే కదా నన్ను భరిస్తున్నావు?”
“యిప్పుడెందుకురా అదంతా?”
“నేను నిన్నే కదా కాల్చుకొని తింటుండా? యిక మీదట నేను రాయనే లేను. నన్ను యెవరూ కాపీ కొట్టలేరు.”
“యిదిగో చూడు, ఆ పోలీసు స్టేషను దాటే వరకైనా గోల చెయ్యకుండా రా.”
“నేనెప్పుడైనా తలుపు తడితే, తలుపును దబేలుమని మూయద్దని నీ భార్యకి చెప్పి వుంచు రా.”
“మాట్లాడకుండా రారా బాబూ. దయచేసి, యీ పోలీసుల్ని దాటేవరకైనా.”
“యింక నేను రాయలేను. రాయనే లేను.”
కఫే అమీన్ వచ్చింది.
***
తమిళ కథలకు అభిమానిని అయిపోతున్నా. Interesting గా వుంటున్నాయి. Simple and beautiful narration 💐💐