వెదుకాడే నిమిషాలందున నిషాలందున …

కవుల్లో శ్రీశ్రీతోను, రచయితల్లో చెలంతోనూ కనెక్ట్‌ అయినట్టు ఎవరితోనూ కాలేకపోయాను. శ్రీశ్రీ మీద ఉండే ప్రేమ కేవలం ఆయన అక్షరాల వల్లనే. 

“విశ్వేశ్వరరావుగారిని అడగండి – ”

తల కూడా ఎత్తకుండా ఆయన మాట్లాడిన రెండు ముక్కలు అవి. ‘ఎక్కడుంటున్నారు సార్‌, మిమ్మల్ని కలవవచ్చా’ అని అడిగితే వచ్చిన జవాబు.

ఆయన సిల్కు లుంగీ, చొక్కా వేసుకుని ఉన్నారు. రైల్వే కళారంగ్‌లో ముందు వరుస సీట్లలో కూర్చుని, వేదిక మీదకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.

ముక్తసరి సమాధానం విన్నాక, మరో ప్రశ్నకు ఆస్కారం లేదని అర్థమయింది. ఒక పుస్తకం అందిస్తే, అట్ట పేజీ పక్కకు తీసి, లోపలి పేజీలో సంతకం చేసి ఇచ్చారు.

ఆయనకేదో సన్మానం చేస్తున్నారు. సికింద్రాబాద్‌ బోయిగూడలో సందుల గుండా వెడితే రాని ఆ సభాస్థలి దగ్గర పోలీసులు బాగానే మోహరించారు. ఆరోజు పొద్దున చిక్కడపల్లిలో కిన్నెర ఆర్ట్స్‌ మీటింగ్‌లో విరసం సభ్యులు, కొందరు అభిమానులు ఆయనను అడ్డుకోవడం, చిన్న పాటి గొడవ కావడం, అడ్డుపడినవారిని దాటుకుని ఆయన సభ లోపలికి వెళ్లిపోవడం, అప్పటికింకా  తెలియదు. అందుకే, పోలీసు బందోబస్తుకు కారణం కూడా అర్థం కాలేదు. అసలు ఆ చిక్కడపల్లి సభ గురించే తెలియదనుకుంటా, తెలిస్తే అక్కడికే వెళ్లేవాళ్లం.  నిరసనలు ఎదురవుతాయనే ఉద్దేశం తో కావచ్చు, శ్రీశ్రీ తన బస ఎక్కడో, కార్యక్రమం ఏమిటో చెప్పకుండా, విశ్వేశ్వర రావు అధీనం లోకి వెళ్ళిపోయారు. విశ్వేశ్వర రావు అంటే సినిమా నిర్మాత, దర్శకుడు, శ్రీశ్రీ కి సన్నిహితుడు.

మాకు బుద్ధి తెలిశాక, శ్రీశ్రీ హైదరాబాద్‌ వచ్చిన సందర్భం అదే. 1980 కావచ్చు. ఆయనను చూట్టం ఒక జరిగితీరవలసిన పనిగా అనుకుని రైల్వే కళారంగ్‌కు వెళ్లాము. వెళ్లాము వెళ్లాము అంటున్నానంటే నేనొక్కణ్ణే లేనన్న మాట, మిత్రులు రామూ, కృష్ణా.. ఇంకా ఒకరిద్దరం కలిసే వెళ్లి ఉంటాం.

ఏమీ గొప్పగా మాట్లాడలేదాయన. శ్రీశ్రీ స్పీచి ఏమంత రంజకంగా ఉండదని విన్నాము కానీ, మరీ అంత నీరసంగా ఉంటుందని అనుకోలేదు. పొద్దుటి సంఘటన ఆయన మనసులో మెదులుతూ ఉందనుకుంటా.

శ్రీశ్రీ ఉపన్యాసం బాగా లేకపోతేనేమి, ఆయన ధోరణి ఎట్లా ఉంటేనేమి, ఆయన గురించి ఎవరేమనుకుంటేనేమి, ఎమర్జెన్సీలో ఆయన ఏమి చేస్తేనేమి, ఆ రోజు పొద్దున ఏమి జరిగితేనేమి, బారా ఖూన్‌ మాఫ్‌.

సాహిత్యోద్వేగం కుదిపేస్తున్న మనసు, ఇరవయ్యేళ్లు కూడా లేని వయసు- అప్పుడు మాకు తెలిసింది ఒకటే.  ఆ మనిషిని చూడడం ఒక ధన్యత. ఆయనతో మాట్లాడేశాను. ఖడ్గసృష్టి పుస్తకం మీద ఆయన సంతకం తీసుకున్నాను.

“కాలేజీలో అందరూ మాట మాట్లాడితే మహాప్రస్థానం పేరు తీస్తున్నారు. చాలా ఏళ్ల కిందట ఆ పుస్తకం కొన్నాను. చదివాను కూడా. ఒకసారి అటకమీది పుస్తకాలు వెదికి, మళ్లీ ఓసారి చదవాలి”- అన్నాడు మానాన్న. ఆయన ఆంధ్రసారస్వత పరిషత్‌ ఓరియంటల్‌ కాలేజీలో సంస్కృతం లెక్చరర్‌. నేను కూడా ఆ కాలేజీలోనే విద్యార్థిని. మా నాన్న చెప్పినట్టు,మా కాలేజీలో శ్రీశ్రీ పేరు చాలా తరచుగానే ప్రస్తావనకు వచ్చేది. మా ప్రిన్సిపాల్ కేకేఆర్ కు కూడా బలమైన రాగద్వేషాలు ఉండేవి కాని, మాకు జ్ఞానం బట్వాడా చేయడం మీదనే ఆయన దృష్టి ఉండేది. మోతుకూరు నరహరిగారు అట్లాకాదు. బాలవ్యాకరణం పాఠం మానేసి అయినా సరే మహాప్రస్థానం చెబుతుండేవారు. మా బుర్రల్ని వాళ్లు పుటం పెట్టిన తీరుకు, మేమంతా సహజంగానే శ్రీశ్రీ మతం పుచ్చుకున్నాం. ఇదంతా 1977-78 ప్రాంతంలో. అటకమీది నుంచి మహాప్రస్థానం దిగివచ్చాక, మా నాన్నకూడా దాన్ని చదివేశాడు. సహజంగానే శ్రీశ్రీ సంస్కృత-తెలుగు భాషా పాండిత్యానికి ఆయన ముచ్చటపడి, ఆ మేరకు ప్రశంసలిచ్చారు.

పరిషత్‌లో చేరాకే నాకు శ్రీశ్రీ పేరు తెలిసిందని చెప్పలేను. చిన్నప్పట్నుంచి రేడియోలో చిత్రతరంగణి శ్రద్ధగా వినే కుటుంబంలో పెరగడం వల్ల, సినిమాపాటల రచయితగా ఆయన పేరు బాగా తెలిసే ఉంటుంది. ఆయన ఏ తరహా పాటలు రాస్తారో కూడా ఒక అవగాహన ఉండే ఉంటుంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని- అన్న ‘భూమి కోసం’ పాటా ‘తెలుగు వీర లేవరా’ – అన్న ‘అల్లూరి సీతారామరాజు’ పాటా రేడియోలోనూ మా గుండెల్లోనూ హిట్ సాంగ్సే. పరిషత్‌ విద్యార్థిత్వం శ్రీశ్రీని ఒక పాఠ్యపుస్తకంగా, ఇష్టమైన పఠనంగా మార్చింది. గడియారం శ్రీవత్స, నేను కలిసి కవితా కవితా- అన్న పాటకు, సంస్కృతం దట్టించి మరీ పేరడీ రాశాము.

1970 దశకం చివరలో జ్యోతి మాసపత్రికలో శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక మొదలయింది. దాన్ని పూరించడం మా నాన్నకు, నాకు ఒక  కామన్‌ యాక్టివిటీ. ఎన్నో నెలలు, ఆ పజిల్‌ ఒకటి రెండు గళ్ల దగ్గర మిగిలిపోయేది. చివరకు మేం రెండుసార్లు విజయవంతంగా దాన్ని పూర్తిచేశాము. పజిల్‌ పూర్తిచేయడం, దాన్ని కత్తిరించి కవర్లో పెట్టి, (మేం అప్పుడు నల్లకుంటలో ఉండేవాళ్లం) చిక్కడపల్లిలోని జ్యోతి మంత్లీ ఆఫీసుకు వెళ్లి ఇచ్చి రావడం సరదాగా ఉండేది. మరి కొంతకాలానికి ఆంధ్రజ్యోతి వీక్లీలో శ్రీశ్రీ ప్రశ్నలు జవాబులు మొదలుకావడం, ఉత్తరాల పేజీ దగ్గరనుంచి చివరిదాకా శ్రీశ్రీ పరిమళం అందులో ఉండడం- శ్రీశ్రీని మా పేరెంటల్‌ ప్యామిలీలో ముఖ్యమైన వ్యక్తిని చేశాయి.

శ్రీశ్రీని కలుసుకుని రెండు ముక్కలు మాట్లాడిన మరుసటి సంవత్సరం అనుకుంటాను, వేలానికి వచ్చిన ఆయన ఇంటిని రక్షించడానికి విరాళాల ఉద్యమం నడుస్తోంది. ఆయనకు సాయం చేయడానికి హైదరాబాద్‌లోనూ, వనపర్తిలోనూ పెద్ద సన్మానాలు జరిగాయి. శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయంలో జరిగిన సన్మానానికి వెళ్లాను. మేడ మీద సమావేశస్థలిలో జరిగిందా కార్యక్రమం. హాలు హాలు అంతా కిక్కిరిసిపోయింది. మునికాళ్ల మీద నిలబడితే కానీ, వేదిక మీద  మహాకవి కనిపించడం లేదు. హైదరాబాద్‌లో ఉన్న కార్మికసంఘాలవారు, ప్రజాసంఘాల వారు ఒక్కొక్కరుగా వచ్చి ఆయనకు దండ వేసో, శాలువా కప్పో, చిన్నవో పెద్దవో  డబ్బు కవర్లు  ఇచ్చి దండం పెట్టి వస్తున్నారు.  జనంలోంచి కొందరు ఆడవాళ్లు చేతుల గాజులు, మెడలో గొలుసులు తీసి ఇస్తున్నారు, మగవాళ్లు జేబులోని పర్సులను ఇచ్చేస్తున్నారు. నీ కవిని బతికించుకోవాలిరా.. అన్న తెన్నేటిసూరి పాట గుర్తొచ్చింది. సంపన్నులు, దాతలు చేస్తున్న సాయం కాదది. కష్టజీవుల సంఘాలు తమ కవి కోసం ఇస్తున్న నిలువుదోపిడి. ఎంత దుఃఖం వచ్చిందో ఎంత సంతోషం కలిగిందో ఎంత ఉద్వేగం పొంగిందో..

కారణం ఇప్పటికీ తెలియదు. కవుల్లో శ్రీశ్రీతోను, రచయితల్లో చెలంతోనూ కనెక్ట్‌ అయినట్టు ఎవరితోనూ కాలేకపోయాను. శ్రీశ్రీ మీద ఉండే ప్రేమ కేవలం ఆయన అక్షరాల వల్లనే.  ఆయనతో వ్యక్తిగతంగా దగ్గరగా వెళ్లాలని తపన ఉండేది కాదు. చెలంతో ప్రేమమాత్రం ఆయనతో వ్యక్తిగత అనుబంధం పెంచుకోవాలనుకునేంత.  ఇక లాభంలేదు,  చెలాన్ని చూసి, ఆయన ప్రేమను పొంది తీరాలనే  నిశ్చయం వచ్చిన సంవత్సరమే ఆయన వెళ్లిపోయారు. చెలం పోయాక, నెలరోజుల పాటు మనసులో అదే మెదులుతూ ఉండేది. ప్రపంచం అర్థరహితంగా కనిపించేది. . దాన్ని పోగొట్టుకోవడానికి, ఆయన సన్నిహితులతో కలం స్నేహం మొదలుపెట్టాను. రేమళ్ల చిన్నారావు, చిక్కాల కృష్ణారావు, బివి నరసింహారావు- వీళ్లందరికీ ఉత్తరాలు రాసేవాణ్ణి. పేరు గుర్తు రావడం లేదు కానీ, రమణాశ్రమ చెలానికి సన్నిహితురాలు ఒకరు మెహదీపట్నంలో ఉంటే ఆమె ఇంటికి వెళ్లి, తన దగ్గర ఉన్న పదుల కొద్దీ ఆల్బమ్స్ లోని చెలాన్ని గంటల కొద్దీ చూసి వచ్చాను. తరువాత కూడా భీమిలి ఆశ్రమంలో సౌరీస్‌ను చూసి, చిక్కాల కృష్ణారావుతో రమణాశ్రమ గాథలు వినివినీ చెలాన్ని కలుసుకున్నట్టే  ఫీల

య్యేవాణ్ణి.   1979 లో  మిత్రుడు పి.వి. రాములు ప్రచురణకర్తగా ఉన్న ‘కళాసౌరభం’ పత్రిక, ఒక సంచికను మా మిత్రబృందం అంతా కలిసి చెలం ప్రత్యేకసంచికగా తీసుకువచ్చాము. రంగనాయకమ్మ, త్రిపురనేని మధుసూదనరావుల ఇంటర్వ్యూలు ఆ సంచిక కోసం ప్రత్యేకంగా తీసుకున్నాము. రంగనాయకమ్మను, వరవరరావును, నిఖిలేశ్వర్‌ను తలచుకున్నప్పుడు, వారి అనంతర రాజకీయ సాహిత్య వ్యక్తిత్వాలు కాక, మొదటగా వారికి చెలంతో ఉన్న అనుబంధమే స్ఫురించి, ఎక్కువ ఆత్మీయంగా అనిపిస్తారు నాకు. బాలాంత్రపు రజనిగారిని ఈమధ్య ఒకటి రెండుసార్లు కలిసినప్పుడు కూడా నాకు మొదట చెలమే గుర్తొచ్చారు.  రేడియోలో ఇంటర్వ్యూ చేసి, ‘చాటునుండే ఎంకిని సబకు రాజేశావ’, అని చెలమే మురిసిపోయేట్టు చేసినందుకు రజని మీద ప్రేమ కలుగుతుంది.

మహాప్రస్థానం శ్రీశ్రీదే కానీ, అందులో చెలం కూడా ఉంటాడు. వారిద్దరిని ఒకేసారి కలుసుకోవాలని నాకు చిత్రమయిన కోరిక.  చెలాన్ని చూడనేలేదు. శ్రీశ్రీతో గడిపిందీ లేదు.  కానీ, ఆ జుగల్‌బందీ కావాలనిపించి, ఒకసారి భీమిలిలో కృష్ణారావును అడిగి, శ్రీశ్రీ-చెలం కలిసినప్పుడు ఎట్లా ఉండేవారు, ఏమి మాట్లాడుకునేవారు, చెప్పించుకున్నాను.

చెలం సన్నిహితులతో మెలిగి, ఊరట పొందినట్టుగానే, శ్రీశ్రీ సన్నిహితులతో మాట్లాడి సంతోషపడేవాడిని. తరువాత తరువాత ‘మహోదయం’ గొప్పదనం అర్థమయింది కానీ, మొదట కెవిఆర్‌ అంటే శ్రీశ్రీ రచనల ఎడిటర్‌గానే గౌరవం. చలసాని ప్రసాద్‌ను అయితే శ్రీశ్రీ నిష్క్రమణకు ఒక పరిహారంగా చూసేవాడిని. చలసాని లైబ్రరీలో తక్కిన అన్ని పుస్తకాలూ కాయితాలూ ఒక ఎత్తు, శ్రీశ్రీనుంచి వచ్చిన పోస్టుకార్డులూ, శ్రీశ్రీ రచనల కటింగులూ ఒక ఎత్తు. శ్రీశ్రీ స్మృతికి ఇరవైసంపుటాల వేదికను నిర్మించాడు ఆయన.  అట్లాగే హరిపురుషోత్తమరావు. హరితో మాట్లాడినప్పుడల్లా, ఆయనే శ్రీశ్రీ పేరెత్తేవాడు, లేదంటే నేనే రప్పించేవాడిని.

1983లో, ఇంకా విద్యార్థిగానే ఉన్న నాకు, ఒక పొద్దుటిపూట మిత్రుడు పెద్దపెద్దగా ఆందోళనగా చెబుతుంటే,  ఉలిక్కిపడి నిద్రలేచినప్పుడు శ్రీశ్రీ పోయారని తెలిసింది. అంతకు ముందు రోజు సాయంత్రమే ఆయన పోయినట్టున్నారు. వార్తలు ఆరోజుల్లో నెమ్మదిగా ప్రయాణించేవి. శ్రీశ్రీ పోయాక కూడా నాకు నెలరోజుల దిగులు పట్టుకుంది. సాహిత్య విద్యార్థిని నేను. చదవడం అంటే ప్రాణం. అదే జీవితం అనుకునే రోజులు.  సాహిత్య ప్రపంచంలోకి విద్యార్థిగా, పఠితగా ప్రవేశిస్తున్నప్పుడు చెలం, కృష్ణశాస్త్రి, కుటుంబరావు.. అందరూ సజీవులుగా ఉండి,  ఏదో ధీమాగా అనిపించేది. వారందరితో సమకాలంలో జీవిస్తున్నాను కదా అని కూడా గర్వంగా ఉండేది.  శ్రీశ్రీ అనేవాడు అంత తొందరగా వెళ్లిపోయే అవకాశం ఉందన్న ఊహ కూడా వచ్చేది కాదు. శ్రీశ్రీ పోవడంతో, అందరూ కలిసి నన్ను అనాథను చేశారన్న బాధ పట్టుకుంది. ముందూ శూన్యం వెనకా శూన్యమనుకోలేదు కానీఆ నిష్క్రమణ  అకాలంగా అనిపించింది.

శ్రీశ్రీ ని స్మరించుకుంటూ గొప్ప గొప్ప స్మృతి గీతాలు వస్తాయని అనుకున్నాను. ఎందుకో ఒక్క చెప్పుకోదగ్గ పాటా రాలేదు, పద్యమూ రాలేదు. ‘అంచనా వేయలేమతని చలచ్చంచల దీప్తలేఖిని’ -అని కెవిఆర్‌ భక్తితో అన్నమాటలు నిజమా?  అంచనాలు లేకపోనీ, ఒక దుఃఖగీతం కూడా రాలేదు.  శ్రీశ్రీ మరణవార్త తెలిసిన తరువాత రోడ్డు మీదకు వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సుల మీద విరసం వాళ్లు, విద్యార్థి సంఘాల వాళ్లు వేసిన పోస్టర్లు కనిపించాయి. ”కవీ, నీ గళగళన్మంగళ కళాకాహళ హళాహళిలో..” కరిగిపోయానని స్విన్‌బర్న్‌ కవికి శ్రీశ్రీ పలికిన నివాళే  శ్రీశ్రీకి స్మృతిగీతంగా ఆ పోస్టర్లలో పలకరించింది.

శ్రీశ్రీ సంతకం చేశాక నా దగ్గర ఉన్న పుస్తకాలన్నిటిలోనూ ‘ఖడ్గసృష్టి’ అతి విలువైనదిగా తయారయింది. శ్రీశ్రీ సారాంశాన్ని ఆచరణలోకి అనువాదం చేస్తున్న ఒక మిత్రుడు, ఒక సదసత్సంశయంలో చిక్కి, ఊరు వదిలివెళ్లిపోతున్నప్పుడు, బెజవాడ రైల్వేస్టేషన్‌లో శ్రీశ్రీ సంతకపు ఖడ్గసృష్టిని కానుకగా ఇచ్చాను. అపురూపంగా అందుకున్నాడు కానీ, అనేక మజిలీల అతని ప్రయాణంలో ఆ పుస్తకం ఎక్కడో మాయమైంది.

శ్రీశ్రీ నుంచి తేరుకున్నాననే అనుకున్నాను కానీ, ఆయన పోయిన ఆరేళ్లకు, 1989లో మళ్లీ  ఆయన నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఆధునిక తెలుగు సాహిత్యంలో చర్చలు, వాదోపవాదాలు అన్న అంశం మీద ఎం.ఫిల్‌ పరిశోధన చేస్తున్న నేను, అభ్యుదయ సాహిత్యోద్యమంలో వివాదాల దగ్గరికి వచ్చేసరికి శ్రీశ్రీలో కూరుకుపోయాను. విప్లవసాహిత్యం ప్రారంభమైన సందర్భంలో దానికి సమర్థకులు, ప్రచారకులు చాలామంది ఉన్నారు.  అభ్యుదయ ఉద్యమకాలంలో దానిని శత్రువుల దాడి నుంచి రక్షించే బాధ్యతను శ్రీశ్రీ అధికంగాను, స్వచ్ఛందంగాను తీసుకున్నారు. కవిగా శ్రీశ్రీలో మునకలేసిన ఆనందం వేరు, వచనశ్రీశ్రీలో విహరించిన సంతోషం వేరు. అప్పుడు మరోసారి శ్రీశ్రీ సంపూర్ణ రచనలు (1970 నాటివే, కెవిఆర్‌ సంకలించినవే) చదివేశాను. శ్రీశ్రీ పేరెత్తకుండా సంభాషణ చేయలేకపోయాను ఆ ఆరునెలల కాలం. ఎంఫిల్‌ నా ఒక్కడి సందర్భం. తక్కినవారికి నా అభిమానం విపరీతం, అసందర్భం.

ఇప్పుడు శ్రీశ్రీ మీద నా అభిమానం బేషరతుదని చెప్పలేను. ఆయన గురించే కాదు,  ఎవరి గురించీ  నిర్విమర్శగా ఉండలేను. కానీ, శ్రీశ్రీ నా జీవితంలోనూ, నా తరం జీవితంలోనూ, అతి సామాన్యమైన నా బోటి వాళ్లందరి జీవితంలోనూ ఉండగలగడం ఆశ్చర్యంగా ఉంటుంది. అక్షరాల వీధిలో సంచరిస్తున్నప్పుడు అతను తారసపడుతూనే ఉంటాడు.

కానీ, శ్రీశ్రీని దాటి ప్రపంచం ముందుకెళ్ళిపోయింది. శ్రీశ్రీని కలుపుకుని జీవితమూ ముందుకువెళ్లిపోయింది. కొత్తకలల, కొత్తకలాల, కొత్తయుద్ధాల సమ్మర్దంలో, లోకం తలమునకలై పోయింది.  యువకాశల నవపేశల సుమగీతావరణంలో గంధకధూమాన్ని ఘాటెక్కించే కొత్త కొత్త కవులు పదులూ వందలూ నూతన ఖడ్గసృష్టి చేస్తూనే ఉన్నారు.  బహుశా, ఈతరం లోని ఆనాటి నావంటి అసంఖ్యాక సామాన్యులు, అత్యంత సాధారణులు కూడా ఆ ఖడ్గసృష్టికర్తలకు పరవశులవుతూ ఉండి ఉంటారు.

శ్రీశ్రీ ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి సరోజని కలిసిన బందగీ

‘ నాన్నా, నేను మందవల్లిలో ఉన్నాను. శ్రీశ్రీ ఇంటి నెంబరు ఎక్కడో చెప్పగలవా?’

ఉగ్గుబాలతో రంగరించి పిల్లలకు అందించే గుణాలలో శ్రీశ్రీ కవిత్వం లేకపోతే ఎట్లా అని మా అమ్మాయి బందగీకి వాళ్ల అమ్మమ్మ గోపరాజు వర్థని చిన్నప్పుడే మహాకవిని పరిచయం చేసింది. తనకు ఆరేడేళ్ల వయస్సుకే శైశవగీతిని కంఠస్థం చేయించింది. అక్కడినుంచి సుధ అందుకుని ‘కవితా ఓ కవితా’ చదివించింది. ‘ఇంకా నేనేం విన్నానా?..” అని మా అమ్మాయి ఊపిరి కోసం క్షణమాగగానే, మా అబ్బాయి బోధి ‘నడిరే నిద్దురలో అపుడే ప్రసవించిన శిశువునెడదనిడుకుని…” అంటూ కేవల అలవాటైన మననంతో గొంతు కలిపేవాడు.ఇంగ్లీషు చదువుల్లో పడి వాళ్లు అంతకుమించి శ్రీశ్రీని కొనసాగించలేదు. శ్రీశ్రీని కాక మరే కవిత్వమూ చదవనూ లేదు. నాలాగా వారిని శ్రీశ్రీ బాధించడు లెమ్మని ఊరుకున్నాను.

బందగీ ఈ మధ్య చదువు పనిమీదే చెన్నై వెళ్లి, అక్కడి నుంచి ఫోన్‌ చేసింది, శ్రీశ్రీ ఇంటి నెంబరు కావాలని. నేనెప్పుడూ ఆయన ఇంటికి వెళ్లలేదు. అడ్రసు ఆ రోజుల్లో సుప్రసిద్ధమే కానీ ఇప్పుడు గుర్తు లేదు.

కానీ మా అమ్మాయి శ్రీశ్రీ ఇల్లు వెదికి పట్టుకుంది. శ్రీశ్రీ భార్యను పరిచయం చేసుకుంది. ఆయన ఎక్కడ కూర్చుని రాసుకునేవారో, ఆయన వస్తువులేవో అడిగి చూసింది. ఫోటోలు తీసుకుంది. ఎంత ఎగ్జైట్‌ అయిందో చెప్పలేను.

అంతే మరి, ఈ  శ్రీశ్రీ వదలడు.

*

కె. శ్రీనివాస్

కె. శ్రీనివాస్ సాహిత్య విమర్శకులు, తెలంగాణా సాహిత్య చరిత్ర గురించి ప్రామాణిక ప్రతిపాదనలు చేసిన సిద్ధాంత జీవి. పత్రికా రంగంలో నవీన యుగం జెండా ఎగరేసిన ప్రయోగవాది. "ఆంధ్ర జ్యోతి" దినపత్రిక ఎడిటర్.

26 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిజమే శ్రీశ్రీ ,చలం ఎంతకూ మనలని వదిలిపెట్టరు శ్రీనివాస్ . రాజకీయ భావజాలాలు వేరువేరు కావచ్చు . ఆలోచనలు వేరువేరు కావచ్చు . వాళ్ళ సృజన లో గొప్ప అనాది మానవ సంబంధం ఎదో పాఠకుడికి రక్త మజ్జాస్స్థిగతమై నిండిపోతుంది . అందుకే వాళ్ళు మనలో ఉండి మననుండి మన తరువాతి తరానికి కూడా బట్వాడా అవుతారు

  • వాట్ ఏ వాట్ ఏ రేసీ narrative …పదండి ముందుకు పదండి తోసుకు అన్నట్టుగా సాగిందీ స్మృతి మాలిక !!!

  • శ్రీ శ్రీ తో చలంతో పెనవేసుకున్న కవిత్వ బంధాన్ని కె.శ్రీనివాస్ గారు అద్భుతంగా పరిచయం చేశారు. శ్రీ.శ్రీ గారి ఇల్లుని చేరుకొని ఆయన వాడిని వాటిని చూసిన శ్రీనివాస్ కూతురుని నిజంగా అభినందించాలి.

  • చాలా బాగుంది సార్. శ్రీ శ్రీ , చలం గార్లు మీకు సమ్మోహం .. వారి జ్ఞాపకాల్ని పంచుకోవడం తో మీరు మాకు సమ్మోహం – గొరుసు

  • “శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయంలో జరిగిన సన్మానానికి వెళ్లాను. మేడ మీద సమావేశస్థలిలో జరిగిందా కార్యక్రమం. హాలు హాలు అంతా కిక్కిరిసిపోయింది. మునికాళ్ల మీద నిలబడితే కానీ, వేదిక మీద మహాకవి కనిపించడం లేదు. హైదరాబాద్‌లో ఉన్న కార్మికసంఘాలవారు, ప్రజాసంఘాల వారు ఒక్కొక్కరుగా వచ్చి ఆయనకు దండ వేసో, శాలువా కప్పో, చిన్నవో పెద్దవో డబ్బు కవర్లు ఇచ్చి దండం పెట్టి వస్తున్నారు. జనంలోంచి కొందరు ఆడవాళ్లు చేతుల గాజులు, మెడలో గొలుసులు తీసి ఇస్తున్నారు, మగవాళ్లు జేబులోని పర్సులను ఇచ్చేస్తున్నారు. నీ కవిని బతికించుకోవాలిరా.. అన్న తెన్నేటిసూరి పాట గుర్తొచ్చింది. సంపన్నులు, దాతలు చేస్తున్న సాయం కాదది. కష్టజీవుల సంఘాలు తమ కవి కోసం ఇస్తున్న నిలువుదోపిడి. ఎంత దుఃఖం వచ్చిందో ఎంత సంతోషం కలిగిందో ఎంత ఉద్వేగం పొంగిందో..”ఈ సమావేశం లో నేనూ ఉన్నాను.మీరు రాసింది చదివాక నాకు గుర్తుకొస్తోంది.
    ఆ రోజు నేలమీద కాలుపెట్టే వీలు లేనంత జనం శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయంలో.
    కొంతమంది యువకులు ముందుతరం దూతలు…పాట ఆరోజు అందరినీ ఉర్రూతలూగించింది.
    గోరాగారి నాస్తిక కేంద్రం లో పరిచయమైన మనిషి,ఈ నాటి నా జీవనసహచరుడు(అప్పటికి మేమింకా కలిసిబతకడం మొదలవ్వలేదు) ని ఈ మీటింగ్ కు తీసుకెళ్ళమని అడిగితే ఆ మర్నాడు తనకేదో కేసు ఉందని,రాలేనని అంటే శ్రీశ్రీ మీటింగ్ కంటే నీ డొక్కులో కేసెక్కువా అని పోట్లాడి మరీ వెళ్ళిన మీటింగ్ అది.
    థాంక్స్ శ్రీనివాస్ గారూ ఆ జ్ఞాపకాల తుట్టను కదిలించినందుకు.

  • హృదయంతో రాసే మీ రాతలకు మొహం వాసి… మోహంతో ఎదురు చూసే … మాలాంటి సాహిత్య అభిమానులను కట్టిపడేసిందీ కథనం. శ్రీ శ్రీ శబ్ద సౌందర్యం… చలం ఉరకలెత్తించే వచన శైలి.. కలబోతగా కమనీయం చేసింది మీ కథనం. అద్భుతం సార్. ధన్యవాదాలు.

  • Mee పుణ్యమా అని చాలా రోజులకు మా కే శ్రీ నీ చదివాను. చాలా గమ్మత్తు విషయం, ఈ వ్యాసం తో నాకు రెండు సందర్భాలు ఉన్నాయి. ఒకటి నేను కవిత్వం చదవ టం మా అక్క నేర్పింది. అందువల్ల కృష్ణదేవరాయ హల్ల్లో సన్మననికి వెళ్లి నమస్తే పెట్టాను. నా గొలుసు a సందర్భంగానే ఇచ్చేశాను. ఎవరో edichi నా తీసుకుంటున్నారు. మా అమ్మతో తిట్లు తిన్న తర్వాత అలిగి ఇంటికెళ్లకుండ మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్న. Hall chinnadi. కిక్కిరిసి ఉంది. ఆయన మొహంలో ఒక్క నవ్వు లేదు.
    రెండు ఆయన పోవటం. తర్వాత స్టీలేగా మహాప్రస్థానం చదవడం. చదివాను అని చెప్పుకోవడం. ఈ గ్యపకంలో న gyapaka ఎం ఉండటం. బస్ పాస్ పోగొట్టుకుని ఇంటికి నడిచి వెళ్ళాను.
    మీరు రాసింది చాలా ఫ్రెష్ గా ఉంది, మీ సమ్మోహన గతానుభవం, లో కాస్త స్థలం దొరికింది. Very touchingly written.

  • నిజంగానే శ్రీ శ్రీ , చలం సమ్మోహనం చేసేవారే. నిజమే శ్రీశ్రీ ,చలం మనలని ఎంతకూ వదిలిపెట్టరు శ్రీనివాస్ గారు. రాజకీయ భావజాలాలు వేరుకావచ్చు. ఆలోచనలు, ఆశయాలు వేర్వేరు కావచ్చు. వాళ్ళ సృజనలోని గొప్పతనం మానవ సంబంధం. అదే ప్రతి అభిమానికి అణువణువున నిండిపోతుంది . మీ అనుభూతుల్లో మేము కనిపించాం శ్రీనివాస్ గారు. ఎన్ని తరాలకైనా శ్రీశ్రీ చలం కనెక్ట్ అవుతూనే ఉంటారు. నేటి తరం కవిత్యంలోను, కథల్లోనూ వారద్దరూ సజీవులు. శ్రీశ్రీ ఖడ్గసృష్టి సివి ఏకలవ్వుని లేఖ తో అని చదివాను. సివి కూడా ఒక సంధర్బంలో చెప్పారు. అందుకే నాటి తరం స్పూర్తివంతులు. మీరు రాసిన వ్యాసం ఆద్యంతం అలా చదివించింది . నిజంగా సారంగా కి ఇది సమ్మోహనమే..
    ధన్యవాదాలు శ్రీనివాస్ గారు

    శాంతిశ్రీ

  • శ్రీ శ్రీ ని ఈనాటి ప్రపంచం నిజంగానే దాటేసిందా శ్రీనివాస్ గారూ! శ్రీ శ్రీ యిక ఏ అంశం లోనూ ఈ తరానికి అక్కరకు రాడా?

  • మళ్ళీ శ్రీ శ్రీ ని, సిప్రాలి పుట్టుకనీ జ్ఞాపకం చేశారు శ్రీనివాస్ అనలేను ..ఎందుకంటే ..అసలు మర్చిపోతే కదా! ఆయనతో ఒకటా, రెండా, ఏకంగా పది రోజులు….అక్కడా, ఇక్కడా కాదు…హ్యూస్టన్ లో మా సొంత ఇంట్లోనే…

    తరాలకి అతీతుడు శ్రీ శ్రీ …అమాయక వ్యక్తిగా..అక్షర శక్తిగా…

    –వంగూరి చిట్టెన్ రాజు

  • ఇది సమ్మోహనమే సార్.. మాకు కూడా.

  • మహాకవి జ్ఞాపకాలు ఆకట్టుకోవటంలో ఆశ్చర్యమేముంది.శ్రీనివాస్ గారి రచన అద్భుతంగా ఉంది.
    1983 -84 మధ్య శ్రీశ్రీ ఒక ప్రకటన చేశారు.తన పుస్తకాలను స్వయంగా ప్రచురిస్తున్నట్టూ దానికి సభ్యత్వంగా ఒక రూపాయి M.Oద్వారా పంపమని మేము చాలామందిమి పంపాము.ఆయన రిసిప్ట్లో కృతజ్ఞతలు చెప్పి సంతకం చేసి పంపటమే కాక వ్యక్తిగతంగా ఒక కార్డు కూడా స్వదస్తూరితో రాసి మాకు పంపారు.
    ప్రసాద్

  • ఆర్టికల్ బాగుంది.1982లో నా రెండు రోజుల శ్రీశ్రీ అను బంధం గుర్తుకొచ్చింది.

  • ఆయన చేసిన సాహిత్యసేవని మనం ఎప్పటికీ మరువలేం. మీలాంటి వారు – ఆయన సన్నిహితులు వెనుకటి ఆ అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన్ని ఇక్కడే మన మధ్యనే ఉంచుతున్న వారు ధన్యులు.

  • అర్ధ రాత్రి వాలుతున్న రెప్పలు విప్పారి అక్షరాల వెంట పరుగులు పెట్టేంత… ఏకాఎకిన ముగించేటంత…

  • నేనిదివరకే సారంగలో ఒక సారి రాశాను . 1979 లో నేను ఢిల్లీ లోని దక్షిణ భారత నటీ నట సమాఖ్య కార్య దర్శిగా ఉన్నప్పుడు శ్రీ శ్రీ గారిని ఢిల్లీ లోని కర్నాటక సంఘం సన్మానించింది. వారు వుంటున్న జగకి రాత్రి 8.30 గంటలకు నా స్కూటర్ మీద వెల్లితి, వారు ఒక బనియన్ తో పడుకొని ఉన్నారు. వారికి నమస్కరించి, శ్రీ శ్రీ గారూ, నేను విశాఖ వాడినే, ఇక్కడ నాటక సంస్థ లో కార్యదర్శిగా ఉన్నాను అని పరిచయం చేసుకున్నాను.

    వారు అన్న మొదటి మాట, ఈ వెధవ వూళ్ళో ఇవ్వాళ మందు దొరకదుట కదా! (ఆ రోజుల్లో ఢీల్లీ లో ఆదివారం మందు షాపులు మూసేసేవారు). నేను వెంటనే సర్, మీకు అబ్య్హ్యాంతరమ్ లేకపోతే మా ఇంట్లో కొంచెం మందు ఉంది. వెంటనే ఆయన లేచి షర్ట్, పంత్ వేసుకొని నాతో రావడానికి తయారయ్యే పోయారు .

    నా స్కూటర్ దగ్గరకి వచ్చే లోపుల , ఆయనతో నాదగ్గిర కొంచెం రమ్ము , కొంచె విస్కీ ఉన్నాయి అని చెప్పాను.

    అప్పుడు ఆయన ” ఇండియన్ రమ్మయిననేమీ , బ్రిటిష్ రమ్మయిననేమీ, రమ్ము (రండి) రామ్మే కదా అని చమత్కరించారు.

    ఇంటికి వెళ్ళాకా, నాకు ఆప్తు డు, మంచి మిత్రుడయిన సి.వి.సుబ్బారావు – సురా (అప్పుడు అతను ఢిల్లీ లో ఆర్ధికోపన్యాసుకుడిగా ఉండేవాడు) పిలిస్తే వెంటనే ఆటొ లో వచ్చాడు .

    సురా , శ్రీ శ్రీ గారు పోటీగా కవితలు , శ్రీ శ్రీ గరివీ శివసాగర్ సాగర్ గారివి, ఇతర విరసం సభ్యులవి ఆశువుగా చెప్పడం నా జీవితం లో మరువలేని సమయం .

    ఇంతలో, అమ్మ వచ్చి శ్రీ శ్రీ గారిని , అయ్యా ఏమి తింటారు, (రాత్రి 12 గంటలకు) , ఇంట్లో భోజనం ఉంది, అట్లు ఉన్నాయి అంటే , శ్రీ శ్రీ గారు “అట్లే కానివ్వండి” అన్నారు.

    తెల్లారే వరకూ జరిగిన ఈ అద్భ్యుత సంవేశం చివరలో , శ్రీ శ్రీ గారు “తాను చనిపోయినప్పుడు , తన దేహాన్ని విశాఖలో ఉన్న కింగ్ జార్జ్ (KGH) లో ఇవ్వాలనదే తన కోరిక అన్నారు.

    ఇవన్నీ నేను టేప్ చేశాను. మిత్రులు టంకశాల అశోక్, సురా కు ఇచ్చాను.

    వారు చనిపోయినప్పుడు, చెన్నై లో , ఈ విషయం పై జరిగిన రభస_ ఆంధ్రజ్యోతి లో పురాణం సుబ్రహ్మణ్య శర్మ చేసిన అర్ధం లేని గొడవ జరిగినప్పుడు. మిత్రుడు సురా , అరుణతార లో రాసేడు.

    ఎన్నో చేతులు మారిన ఆ సీడీ ఇప్పుడు దురదృష్టవశాత్తూ లేదు

  • అద్భుతం శ్రీనివాస్ గారూ. మీరు రాసింది నాకు అక్షరాలా వర్తిస్తుంది. ఐతే మీరు శ్రీ శ్రీ ని చూసారు కలిశారు. నేను కలుద్దామని మద్రాసు కు పోవాలని అనుకుంటూ టికెట్ కోసం పైసలు జమ చేసుకుంటున్నప్పుడే ఆయన వెళ్లిపోయారు శాశ్వతంగా మనల్ని వీడి. నాకు ఆయన వెళ్లిపోవడం ఒక పెద్ద షాక్.
    నా మనసులో ఉన్న దానికి అక్షర రూపం ఇచ్చిన మీకు అభినందనలు. నిజమే శ్రీ శ్రీ లో ఎన్ని లోపాలున్నా, మనకెన్ని విభేదాలున్న మనం ఇంతగా ప్రేమించడానికి ఆయన కవిత్వం మన తొలియవ్వన తోటల్లో కొత్త పూలు పూయించడమే అనుకుంటున్నా

  • శ్రీనివాస్ రాయడం మరచిపోయింది ఏమిటంటే, ఆ రోజు చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ లో శ్రీశ్రీ కి అడ్డంగా నిలబడి ఘెరావ్ చేసినవాళ్ళలో నేనూ ఉన్నాను. శ్రీశ్రీని చూట్టం అదే మొదలో అంతకు ముందు ఏడాది తిరుపతి సభల్లో చూశానో. అప్పటికి శ్రీనివాస్ కు నాకు పరిచయం లేదు.

  • ‘శ్రీశ్రీ మొదలంటా మానవుడు- చివరంటా మహర్షి- మధ్యలో మాత్రమే కవి- ఎప్పటికీ ప్రవక్త’

    శ్రీశ్రీ గారి సంస్మరణార్ధం వేటూరి గారు ఈనాడులో వ్రాసిన ఎడిటోరియల్!

    http://veturi.in/767

  • ఎంతోఉద్విగ్నంగా నేనూ,మా జీవన సహచరి జ్యోతి కలసి చదివాము . చలం మీద నా పరిశోధన. ఎంఫిల్ లో కేకేఆర్ గైడ్ . సారస్వత పరిషత్ . బందగీ మీ చిగురు కల నెరవేర్చడం . శ్రీ శ్రీ ఒక తరాన్నీ తీవ్రంగా ప్రభావితం చెయ్యడం , ఎన్నో విషయాలు , గొప్పగా ఉన్నాయి మీ జ్ఞాపకాలు ,

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు