విషాదాంత ప్రేమకథ – ఫాతిమా

మరో సారి కథా సమయంలోకి అడుగు పెడదామా?!

కొన్ని కథల్ని చదువుతూ మధ్యలో ఆపాల్సిరావడం హింసగా ఉంటుంది.

పూర్తయిన తర్వాత కూడా కథ మనల్ని ఆవరించే ఉంటుంది. కథలోంచి చదువరిలోకీ, చదువరిలోంచి కథలోకీ ఏదో బట్వాడా జరుగుతూ ఉంటుంది.

సంఘటనా.. పాత్రా.. కథాస్థలమా..భాషా.. మొత్తానికి ఏదో కనెక్ట్‌ అవుతుంది. మాయాబజార్‌ పెట్టెలోలాగా  మనకు సంబంధించినదేదో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ దేవులాటలో కథకి మనం దాసోహమైపోతాం. అట్లా వశం చేసుకున్నాడు నన్ను సొలోమోన విజయకుమార్‌ తన కథలతో ఇటీవల. ఆయన ఫేస్‌బుక్‌లో రాసుకున్న కథలతో ‘మునికాంతపల్లి కతలు’ పుస్తకం వెలువడింది. అందులోని  ‘ఫాతిమా’ కథ నన్ను నలభై యేళ్ల కిందటి మాఊరికి లాక్కుపోయింది.

‘ఫాతిమా’ ఒక ప్రేమ కథ.  సినిమాలుగా, నవలలుగా, కథలుగా, కావ్యాలుగా వచ్చిన సవాలక్ష ప్రేమకథల వంటిదే ‘ఫాతిమా’ కూడా. కానీ వాటితో ఈ కథకు ఏదో తేడా ఉంది. ‘ఫాతిమా’ దళిత ప్రేమకథ. ఏ ప్రేమకి అయినా అడ్డొచ్చేవి మతం, కులం, ధనం. ఈ కథలో మతానికి కులం అభ్యంతరం అయ్యింది. నాయన మరణంతో పెదనాయన ఇంట్లో పెరుగుతున్న ఫాతిమాను తొలి చూపులోనే వలచాడు విజయుడు. హాస్టల్లో ఉండి పది చదివిన ఫాతిమా పేటలో కుట్టుపని నేర్చుకోవడానికి మునికాంతపల్లి నుంచి  రోజూ నడచి, స్వర్ణముఖి ఏరుదాటి, ఆటో ఎక్కుతుంది. ఈ నడక దూరం చాలు ప్రేమ అల్లుకుపోవడానికి. డిగ్రీ చవివిన విజయుడు ఫాతిమా కంట్లో పడడానికి సైకిలు మీద  ఎదురుపడుతూ చేసిన విన్యాసాలూ, ఆ తర్వాత సైకిలు నెట్టుకుంటూ వెండనడిచిన ప్రయాణాలూ రాగిచెరువుకట్టకింద యానాదోళ్ల చిరంజీవి గుడిసెలోనో, ఊరెనుక చిట్టడివిలోనో కలుసుకునే దాకా చేరుకుంది. ఇందాకా వచ్చాక  రహస్యకలయికలతో మనశ్శరీరాలు సంతృప్తి చెందవు. అందుకే సాయిబుల పిల్ల ఫాతిమా, మాల పిలగాడు విజయుడు లేచిపొయినారు గుంటూరికి. అయితే మైనరు తీరని ఫాతిమాని వెనక్కి తీసుకురావడం పోలీసులకి పెద్ద పనికాలేదు. ఆ తర్వాత అన్ని ప్రేమకథల్లో జరిగినట్లే ఈ కథలోనూ జరిగింది. లేచిపొయ్యేదానికి సాయం చేసిన స్నేహితుల్ని పోలీసులు కుళ్లబొడిచారు. వీరి ప్రేమకి బాసటగా నలచిన ఫాతిమా పెదనాయన కొడుకు సందానీని మతగురువుల దగ్గరకి ఈడ్చుకుపొయ్యారు. ఫాతిమాని ఏం చేసుంటారో చెప్పనవసరం లేదు. ఈ ఎడబాటును తట్టుకోలేని విజయుడు చాలామంది విఫలయువప్రేమికుల మాదిరే చెయ్యి కోసుకున్నాడు.

ఇట్లా చెబితే.. ఇదేం కథ? కొత్తగా ఏముంది ఇందులో అనిపిస్తుంది. నిజానికి అనార్కలి నుంచి మల్లీశ్వరి దాకా ఏ ప్రేమకథలో అయినా కొత్తగా ఏదీ ఉండదు. కట్టె, కొట్టె, తెచ్చె అనే మూడు ముక్కల్ని చెప్పే తీరులోనే తేడా అంతా ఉంటుంది. సొలొమన్  విజయకుమార్‌కి తొలి కథల్లోనే ఈ వొడుపు ఇంతలా ఎట్లా వొంటబట్టిందా అని అబ్బురమనిపిస్తుంది కథ చదువుతూ ఉంటే.

సొలోమోన్ విజయ్ కుమార్

‘ఈపాటికి ఊరంతా తెలిసిపొయ్యుంటాది. ఆ తురకోళ్లందురూ మా ఇంటిమిందకి పొయ్యుంటారు’ అంటూ.. లేచిపోవడానికి పేట రైల్వే స్టేషనుకి చేరుకున్న విజయుడి స్వగతంతో కథ మొదలవతుంది. ఆందోళనతో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫాతిమాను ఓదార్చి, ఆ వెంటనేకథను రెండేళ్ల వెనక్కి తీసుకువెళ్తాడు రచయిత.
అప్లికేషనలో అంటించడానికి ఫోటోకోసం స్టూడియోలో బురఖా గుడ్డను ముఖం మీద నుంచి తీసి నెత్తిమీదకి వేసుకున్నపుడు గొడుగు లైట్ల వెలుగులో తాను తొలిసారి చూసిన ఫాతిమాను ‘మునికాంతపల్లి వొంకినిగుంటలో బూసే తెల్లతావర పువ్వు మొకం పిల్ల’ అంటూ మనకు పరిచయం చేస్తాడు. ‘ఫాతిమాని జూసొచ్చినాక ఆ దినవంతా ఆయమ్మే అడుగడుక్కీ గెవణానికి రాజాగింది, రేతిరి కూడుదిని ఎప్పుట్లాగా నులకమంచం ఎత్తకపొయ్యి ఈదోకిట్లో యేస్కున్నాను. అద్దరేతిరి దాటతుణ్నెట్టుండాది, పొణుకోనుండానే గానీ నిదరబడితే గదా.. ఎవురో గొంతు పిసకతుణ్నెట్టు, జెరవొచ్చినట్టూ వుండాది. తాటితోపల్లో గుడ్లగూబి గుడగుడమంటుండాది. ఏటిగాలి వాకిట్లోకి రయ్యిమంటా కొడతుండాది..’ అని విజయుడు మనతో చెబుతున్నపుడు, ప్రేమలో పడ్డ తొలినాళ్లను గుర్తు చేసుకోకుండా ఉండలేం.  ‘రోజూ ఎందురో ఆడపిలకాయల్ని సూస్తావుంటాం, సూసినాక మన దార్న మనం గమ్మన పోతావుంటాం. వొక్క పాతిమాని సూసినప్పుట్నుంచే ఏవిటికని యాందో పెద్ద ఇదిగా అనిపిస్తుండాదే..!?’ అని అమాయకంగా ఆ ‘ఇది’ని మనలోపలెక్కడో గెలుకుతాడు. ఇట్లా ఫాతిమాతో పెనవేసుకుంటూ తీగసాగిన తీరును చెబుతూ చెబుతూ హఠాత్తుగా కథను ఆపేస్తాడు. ఇంక కథను చెప్పనంటాడు. చెప్పలేనంటాడు. ఫాతిమాతో లేచిపొయ్యే దాకా చెప్పి ఇట్లా ఆపేస్తే ఊరుకుంటామా? ఊరుకుండగలమా?  గుండెలు పిండేసేదేదో ఆ తర్వాత జరిగిందని మనకు అర్థం అయిపోతున్నా అదేమిటో తెలుసుకోవాలనే కుతూహలంలో కొట్టుకుపోతాం. ‘బాబ్బాబూ.. ఆ కాస్త చెప్పు నాయనా!’ అని బతిమలాడుకుంటాం. ఇక అప్పుడు పాఠకుల మీద దయ దలచి ‘సగం జెప్పి ఆపగొడుదు కాబట్టే సివరి నాలుగు మాటలు గూడా జెప్పేదానికి నన్ను నేను కస్టం మింద నిమ్మళం జేసుకున్నాను’ అంటూ వర్తమానంలోకి లాక్కువస్తాడు.

ఎడబాటు వేదనతో చెయ్యి కోసుకున్న తనను మందలిస్తూ, ‘ సదువుకునే పిల్లొడివి నీకు లంజి గావాల్సొచ్చింద్యా?’ అని రెండో మేనమామ అన్న మాటతో రెచ్చిపోయి నోటికొచ్చిన తిట్లు తిట్టి, ‘ ప్రేవిచ్చిన ఆడదానికి మా పల్లెల్లో పెట్టే పేరు లంజి’ అని మనల్ని కూడా దుఃఖపెడుతాడు. ఈ దుఃఖానికి సంకెళ్లు వేయడానికి ఫాతిమా వాళ్ల అన్న సందానీ పూనుకున్నాడు. ఒక రాత్రి ‘మందు’ కొనుక్కుని విజయుడిని స్వర్ణముఖి ఏట్లోకి తీసుకువెళ్లాడు. తాగిన తర్వాత విజయుడి రెండు చేతులూ పట్టుకుని మాట్లాడినాడు.  ఆ తర్వాత మాటాపలుకూ లేకుండా ఇద్దరూ నడుచుకుంటా ఊళ్లోకి వచ్చారు. విడిపోయే ముందు ఆగి, ‘ యాం..బావా?’ అనడిగాడు సందానీ. ‘సరే’ అన్నట్టుగా తల ఊపిన స్నేహితుడిని  ఆ నడిరాత్రి మునికాంతపల్లి నడివీధిలో గట్టిగా  కౌగిలించుకుని వెళ్లిపోయాడు సందానీ.

కథ ఇక్కడ ఆగిపోతుంది. మాల పిలగాడితో తన చిన్నాయన కూతురి ప్రేమను ఆమోదించి, అండగా నిలబడిన సాయిబుల పిలగాడు సందానీ  స్వర్ణముఖి నడినదిలో తన స్నేహితుడికి ఏం చెప్పాడో కథకుడు చెప్పకపోయినా మనకు తెలిసిపోతుంది. సందానీ, విజయుల ఆలింగనం నా కుడుపులో దేవుతున్నపుడు,  నల్లమల అడవుల్లో నక్సలైట్‌ నాయకులను ఇంటర్వ్యూ చేయడానికి నేను వెళ్లినపడు ఒకరాత్రి ఎదురైన దృశ్యం గుర్తుకువచ్చింది. ఎదురెదురుగా రెండు వరుసలుగా నిలబడిన దళాలు విడిపోతూ చేతులు కలుపుకుని, గుండెలకు ఒకరినొకరు హత్తుకుని, రెడ్‌సెల్యూట్‌ చెప్పుకుని కదలిపోయిన దృశ్యం. మళ్లీ కలుస్తామనే నమ్మకం లేని ఎడబాటు. మరణానికి సిద్ధమై చెప్పుకునే వీడ్కోలు. ఈ కథాంతంలో స్నేహితులిద్దరూ చేసుకున్న ఆలింగనం ప్రేమకు పాడెగట్టడానికి సిద్ధమై  ఒకరికొకరు చెప్పుకున్న వీడ్కోలు అనిపిస్తుంది. కథ పూర్తయ్యేప్పటికి లోపల గడ్డకట్టినదేదో కరిగితే బావుండుననిపిస్తుంది. ఒక దీర్ఘ నిట్టూర్పుతో చదువరులు కూడా ఈ ప్రేమ జంటకు వీడ్కోలు పలుకుతారు. అయినా ఫాతిమా వీడివెళ్లిపోదు. కథలు రాస్తూ విజయుడు మనకు తారసపడుతూనే ఉన్నాడు గానీ, తెల్ల కలువ ఫాతిమా ఎలా ఉందో, ఎక్కడ ఉందో అనే దిగులు మనలోపల గూడు కట్టుకునే ఉంటుంది.

ఇక ఫాతిమా కథలో రచయిత యధాలాపంగా చెప్పినట్టు అనిపించినా ఒక లోతైన మాట అంటాడు, ‘ఈ తురకోళ్లు యావిటికనో మొకాలు సిట్లిచ్చుకుంటా, వొచ్చే పొయ్యే మనుసుల్ని అనుమోనంగా ఎగాదిగా జూస్తుంటారు’ అని.  ఈ అనుమానపు చూపు సాయిబుల్లో నాటుకున్న నేపథ్యం, ఈ వాక్య చదివినపుడు చెళ్లుమన్నట్టుగా గుర్తుకొస్తుంది. మాల పిలగాడికి మంచం వేసి కూర్చోబెట్టి ఉడుకుడుకు ఇడ్లీలు పెట్టి టీ ఇచ్చిన సాయిబులు, అతడు తమ పిల్లను పెళ్లి చేసుకోవడాన్ని మాత్రం భరించలేరు. తలెత్తుకుని తిరగలేమని తెగేసి చెబుతారు. మాలపల్లెలోని విజయుడూ పేదవాడే, సాయిబులపాళెంలోని ఫాతిమా కూడా పేద పిల్లే. అయినా మతం ముందు, కులం ముందు పేదరికం చిన్నది. అది ఎంత లోతుగా నాటుకుపోయిందో, విజయుడితో లేచిపోయిన ఫాతిమాని పోలీసుల సాయంతో వెనక్కి తెచ్చుకోవడంతో అర్థం అవుతుంది.

‘ఫాతిమా’ కథ నెల్లూరు జిల్లా దక్షిణప్రాంతపు యాసలో సాగుతుంది. ఇది మా ఊరి ఒకప్పటి భాషే కావడం.. ఇంకా ఎదరామేలూ గోలీలాటా, నడి వీధిలో నులకమంచం మీద నిద్రా,  తెల్లారకముందే కొడుకు నిద్ర చెడకుండా మంచం కిందకే వొంగి పేడకళ్లాపి చల్లే అమ్మా, ఏటి ఇసుకలో పేటకి నడకా, చదువుకునే పిలగాళ్ల సైకిలు తొక్కుళ్లూ…బహుశా ఇటువంటివెన్నో ఈ కథలోంచి నాలోకి ప్రవహించి, బాల్య జ్ఞాపకాలను తట్టి లేపాయి.  మాలపల్లె మాటల సౌందర్యం సొలోమోన విజయకుమార్‌ కథలకు గొప్ప సొగసునిచ్చింది. ఈ పరిమళం అంటిన తెలుగు కథ మరింతగా ప్రకాశిస్తుంది. ‘ అబ్బే..ఇవన్నీ వొట్టి బూతులు’ అని చిరచిరలాడే వాళ్లు లేకపోలేదు.  వాళ్లను చూసి జాలిపడడం తప్ప ఏమీ చేయలేం.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఉమయ్యా! ఆ కథని మళ్లీ అంతే ఆర్ద్రంగా పరిచయం చేశావు.. నీ కిష్టమైన ఇలాంటి ఇంకొన్ని కథలు పరిచయం చేస్తావని ఆశిస్తాను..

  • వైనంగా చెప్పారు ఉమన్నా..విజయుడి కతల్లో తెలియని సొబగు వుంది.ఆ వాతావరణం ఎన్నో జ్ఞాపకాలను సెల పరడుతుంది.కత చదివిన తర్వాత జపాన్ ముల్లు దిగినట్టే వుంటది.
    మీ ప్రేమ పూర్వక పరామర్శ ఇలాంటి సజీవ భాషతో కతలు రాసేవోళ్లకు బలం,ధైర్యం ఇస్తుంది.
    ఫాతిమా కతను మరోసారి మతికి తెచ్చినందుకు మప్పిదాలు ఉమన్నా..

  • వైనంగా చెప్పారు ఉమన్నా..విజయుడి కతల్లో తెలియని సొబగు వుంది.ఆ వాతావరణం ఎన్నో జ్ఞాపకాలను సెల పెడుతుంది.కత చదివిన తర్వాత జపాన్ ముల్లు దిగినట్టే వుంటది.
    మీ ప్రేమ పూర్వక పరామర్శ ఇలాంటి సజీవ భాషతో కతలు రాసేవోళ్లకు బలం,ధైర్యం ఇస్తుంది.
    ఫాతిమా కతను మరోసారి మతికి తెచ్చినందుకు మప్పిదాలు ఉమన్నా..

  • ఒక కథను ఇంత అద్భుతంగా పరిచయం చేయవచ్చా అనిపించింది. సందర్భానుసారంగా కథలోని వాక్యాలను ఉటంకిస్తూ, అమూల్యమైన విశ్లేషణను జోడించిన ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు.

  • విషాదాంత ప్రేమకథను వివరించిన తీరు చాలా బాగుంది సార్..

  • మప్పిదాలు ఉమన్నకి, సారంగకి..

  • సార్…కథను..ఎంతలా గుండెకు ఎత్తుకోకుంటే ఇలా పరిచయం చేసారు.ఇజియన్న కథలు తెలుగు కథా సాహిత్యంలో ఒక కుదుపు…
    అసలు సిసలు మనసుల బతుకులు బొమ్మలు
    బొమ్మలుగా చిత్రించిన చిత్రకారుడు..
    మీ పరిచయం విశ్లేషణ చాలా బావుంది సర్…అన్నకు శుభాకాంక్షలు💐

  • మంచి కథకుడు మంచి కథను విశ్లేషించిన తీరు కథకు నిండుతనాన్ని తీసుకువచ్చింది. అన్నకు ధన్యవాదాలు. రచయితకు శుభాకాంక్షలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు