రచయితగా, కార్యకర్తగా, నాయకత్వ స్థానంలో ఉన్నతమైన స్థానాన్ని పూరించారు. సృజనాత్మక వ్యాసంగం మాత్రమే కాదు, ఆలోచనల, భావజాల సంఘర్షణలో మనుషులు ఈ చైతన్యవంతమైన క్రమణిక వెనుక సమాజమే మేధోపరమైన మనుషులను తయారు చేసుకుంటుంది. సమాజ అవసరాలకు తగిన చైతన్యాన్ని తిరిగి మనుషులే స్వీకరిస్తారు. ఈ రెండు సమాంతర భావనలతో కలిసిమెలిసిన ప్రజల తరపు ప్రయాణం. మొత్తంగా ఈ చలనంలో మనుషులు ఏ బీజరూపం దగ్గర మొదలైనారు అనేది ముఖ్యమైన అంశం. సాహిత్యం, కళలు, రాజకీయాలు మానవ సృష్టి అయితే వాటి సారాంశం మనుషులు అనుభవంలో ఉన్నది. రాజకీయ అనువర్తనం నిత్యము బదిలీ అవుతుంది. రాజకీయ అభిప్రాయాలను దృఢంగా నిలబెట్టడానికి ఈ ట్రాన్స్ప రేషన్ కీలకం . ఇది లేకుంటే సృజన శీలురు కాలేరు. వ్యక్తిగత ఆకాంక్షలను దాటి సమాజ తలంలో పని చేయాలనే గ్రహింపు. మనుషుల సాంగత్యం. ఇవన్నీ ప్రజాపక్షం వైపు నుండి పనిచేయడానికి ఒక దారి.
విప్లవ భావజాల ఇరుసు ….
విద్యార్థి అందులోనూ సైన్స్ విద్యార్థిగా ప్రపంచాన్ని గమనిస్తున్న వరలక్ష్మి. తన అస్తిత్వం అనే ఒక ప్రాంతం చుట్టూ అల్లుకున్న ఆధిపత్య సంస్కృతి. దారి నిండా ఒక తెలియని వెలితి. తెలుగునేలలో భాగంగా ఉంటూనే ఉనికి కోసం పెనుగులాడుతున్న రాయలసీమ .ఆనేలపై ఏ ఊరు, పట్టణము అయినా కావచ్చు .ఆ ఊపిరి నుండి జీవితం ,చైతన్యం రూపు క డుతుంది .సాధారణ రైతు వారి కుటుంబంకు చెందిన వరలక్ష్మి భారత విప్లవో ద్యమానికి భావజాల ఇరుసు . యిది ఎలా సాధ్యం. ఇదొక భావతీవ్రత అని సరి పెడదామా. లేదా రొమాంటిసిజం అనే దగ్గర ఆగుదామా! సైన్స్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవలసిన విద్యార్థి సామాజికశాస్త్రం వైపుకు రావడం ఇదంతా పైకి కనబడుతున్న పరిణామక్రమం అనుకుంటే సరిపోదు.హృదయం, మెదడు కలగలసిన ప్రయాణం.
వరలక్ష్మి రెండు దశాబ్దాలుగా విప్లవ రచయితల సంఘంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏభై ఏళ్లుగా ప్రచురిత మవుతున్న విరసం అధికార పత్రిక అరుణతార వర్కింగ్ ఎడిటర్ . తిరుపతి మార్క్స్ అని పిలవబడే త్రిపురనేని మధుసూదనరావు ప్రభావం తొలిరోజులలో వరలక్ష్మి పై ఉంది. త్రిపురనేని నుండి సైద్ధాంతిక అవగాహనను, సాహిత్య ప్రభావాన్ని స్వీకరించారు. ఒక దగ్గిరతనం మధ్య ఉండే కాంతి వలయం. ఇవన్నీ వరలక్ష్మిని మార్క్సిజం ప్రభావం లోకి తీసుకువచ్చాయి. సుదీర్ఘకాలం విప్లవ రచయితల సంఘం కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పుడు కార్యవర్గంలో కొనసాగుతున్నారు. కథ,వ్యాసం, ఉపన్యాసకురాలుగా పరిణితి సాధించారు. అధ్యయనం ,ఆచరణ ఈ రెండిటి మధ్య ఉన్న సమతుల్యతను సాధించారు. మాటకు, రాతకు మధ్య పొంతన వుంది. అధ్యయన అంశాలను సామాజికావరణ నుండి స్వీకరించారు.
తనదైన విశ్లేషణ ఉంటుంది.
ఆవాజ్ , అవును మేము అర్భన్ మావోయిస్టులమే, శిశిర, కూడంగళం,రాజ్యాంగం కీనోట్ ప్రత్యేకమైనవి. లెక్చరర్ గా కొనసాగుతున్నారు. రాయలసీమలోని ప్రొద్దుటూరు శాశ్వత నివా సం .అక్కడనుండి తన కార్య క్షేత్రాన్ని విస్తరింప చేసుకుంటున్నారు. మార్క్సిజం తాత్వికత నుండి ఎక్కువ కృషి చేస్తున్నారు. తన పరిపక్వతను విశాలం చేసుకుంటున్నారు. వేగవంతమైన స్పందనలు ఆమె వ్యక్తిత్వంలో సహజం. సాహిత్యాన్ని, సామాజిక అంశాలను ఒకే రీతిలో వివరించగలరు. మన చుట్టూ అనేకమంది భిన్న భావజాలరంగంలో పనిచేసే దగ్గర మనుషులు ఉంటారు. ఒకే అంశంపై పని చేస్తూ భిన్నాభిప్రాయాలు కలిగిన వారు సహజం . ఏచర్చ లోనైనా లోతైన విశ్లేషణ ఉంటుంది .ఇది ఎలా సాధ్యం. పైకి కనిపిస్తున్న సాధారణత, తన దృష్టి ఒక ప్రాపంచిక దృక్పథాన్ని కలిగించాయి. ఒకానొక కమిట్మెంట్ ను తోవ చేసుకున్నారు.ఆదారిలో ఒక మార్గాన్ని రూపొందించుకున్నారు. సృజనాత్మక రంగంలో ఇదొక కష్టతరమైన మజిలీ. దీనిని చేరుకోవడానికి నిరంతర అభ్యాసం కావాలి.
వరలక్ష్మి తన స్థానాన్ని సరిగ్గా గుర్తించారు ఏ సృజన కారుడైన తను రాణిస్తున్న రంగంలో తన స్థానియత నుండి తాను ఎంతవరకు వెళ్ళగలడో అనేది గుర్తించడం ముఖ్యమైనది. రచయితలు కేవలం రచనకే పరిమితం కావాలా లేదా ,తమ రచన ఆచరణలో ఉపయుక్తం కావాలా ఈసమ్మిళిత అంశం తెలుగు సాహిత్యంలో, సామాజిక రంగంలో విస్మరణకు గురి అవుతుంది. భారత సమాజంలో రచయితల బాధ్యత అనేక రూపాలలో కొనసాగింది. ప్రజలు అనే భావనను రచయితలు స్వీకరించారు. రచన, ఆచరణ, అధ్యయనం అనే గీటురాటుపై నిలబడిన వారు. ఒక నిరంతర జ్వలనం మనుషులను భావోద్రేకానికి గురి చేయదు. ఆలోచనలను కలిగిస్తుంది. వర్తమానం కాలంలో ఫాసిజంపై గురించి చర్చ జరుగుతున్న దశలో భారత సమాజం గురించి ఆందోళన మాత్రమే సరిపోదు. దేశాన్ని ఈ దశ నుండి పూర్వస్థితికి తీసుకు రాగలగాలి. ఇక్కడ నిలబడి నిలవరించాలి.
భారతదేశమంటే ఇది కాదు అనే భావనకు వస్తారు. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని దాని విలువను, రాజ్యాంగ రక్షణకు కాపు కాసే క్రమంలో వరలక్ష్మి వంటి ఆలోచనపరులు అరుదు. ఈ సంఖ్య విస్తృతం కావలసి ఉంది . అయితే ఇక్కడ నిర్బంధం నిరంతరం కాపు కాసి ఉంటుంది. అనేకసార్లు ఈమె నేషనల్ ఇన్వెస్టిగేషన్ (NIA) చట్రంలో వున్నారు. అరడజనుకు పైగా’ ఊపా’ కేసులు సిద్ధంగా ఉన్నాయి.
రచయిత చుట్టూ ఈ వలయం ఎందుకు? కూడంగళం అణు విద్యుత్ ప్లాంట్ నిరసన పొద్దుటూరు అమ్మాయికి ఏం పని ? తనది కాని ప్రాంత ప్రజల పట్ల కన్సర్న్ఎందుకు? వ్యతిరేకంగా పనిచేసినందుకు తమిళనాడులో కొన్ని నెలల పాటు అక్రమ నిర్భంధం. అయినా సామాజిక కార్యకర్తగా దీనిని స్వీకరించారు. సైన్స్ విద్యార్థి, సామాజిక శాస్త్రాల పొందిక లో పని చేశారు. అయినా మానసిక విశ్లేషణ వైపు నుండి చూసినప్పుడు ప్రజ పక్షం వహించారు. సైద్ధాంతిక తీవ్రతను మనుషులు ఎలా సొంతం చేసుకుంటారు. విరసంలో కొత్తతరం ఆలోచనా స్రవంతులకు కిటికీలు తెరిచే ఉంటాయి. ఆలోచనను అందుకుని గమ్యాన్ని నిర్దేశించుకోవడమే ప్రధానమైనది.
ఈ క్రమాన్ని వరలక్ష్మి ఎలా దాటి వచ్చారు. తన భావ జాలాన్ని ఎవరు నడిపిస్తున్నారు .అనేక సమూహాలు. కొట్లాడుతున్నవారు .ఈ నేల తమది కాదా! అనే సందేహం ఉన్నవారు. కోట్లాది రూపాయల సహజ వనరుల కోసం విస్తాపనకు గురి అవుతున్న ప్రజలు.
మొత్తంగా భారత సమాజమే ఆమె గమనం.అభద్రత ఉన్న కాలంలో సంఘీభావ ప్రకటనే వరలక్ష్మి. భయపడని, తలవంచని , రాజీ పడని అక్షర క్రమం . వరలక్ష్మి రచయితగా, ఉపన్యాసకురాలిగా రాణిస్తున్నారు. ఇది ఒక స్ఫూర్తి. తన బాధ్యతల నుండి ప్రపంచం వైపు దృష్టి నిలిపారు.
*
వరలక్ష్మి గారి గురించి పరిచయం నేటి ప్రభుత్వ కేసులు వాటిని అధిగమించి సమాజం కోసం