విగ్రహాలు మాట్లాడనివ్వవు!

మొత్తం మూడుసార్లు వీరేశలింగం మరణించాడు. కానీ బతికిన కాలంలో ఆయన చేసిన పనులు ఆయన్ని మరణించాకా జీవించేలా చేసాయి.

‘వీరేశలింగము పంతులుగారి వంటి దేవతలను భారతదేశమెప్పుడు మరచిపోయిన అప్పుడు మనకు దుర్దశ సంప్రాప్తమైనదనియె చెప్పవచ్చును. పంతులు గారి వంటి ధైర్యము, ఉత్సాహము, కార్యశూరత మన దేశీయులలో నెప్పుడు నాటగలమో, అప్పుడే పంతులుగారి చిహ్నమును స్మరించగలిగినవారమౌదుమని నా నిశ్చితాభిప్రాయము.’

  • కట్టమంచి రామలింగారెడ్డి

మనుషుల్ని దైవాంశ సంభూతులుగా కారణజన్ములుగా వర్ణించడం భావవాదం. తమ జీవితాల్ని నలుగురి మంచికోసం వెచ్చించిన వ్యక్తుల్ని అమానుషులుగా చిత్రించి చేసే వ్యక్తిపూజ వారిని విగ్రహ మహాత్ములుగా తయారు చేస్తుంది. కృతజ్ఞతతో కావొచ్చు అభిమానంతో కావొచ్చు మనిషిని విగ్రహం చేయడమంటే వారి భావజాలానికి సమాధి కట్టడమే. వారి ఆదర్శవంతమైన జీవితాచరణ మరుగున పడి కేవల ఆరాధన మాత్రమే మిగులుతుంది. ఆ మహనీయుల జీవితం లోని మంచి చెడ్డల్ని సరిగా బేరీజు వేయకుండా చేసే పొగడ్తలు కీర్తన స్థాయికి భజనల స్థాయికి చేరుకుంటాయి. వ్యక్తులు పురాణ పురుషులై పోతారు. ఒక ‘హనుమాన్ చాలీసా’నో భోగినీ దండకమో తయారవుతుంది. అది సమాజానికి మంచి చేయదు. కారణం: విగ్రహ పూజ వున్న చోట విగ్రహ విధ్వంసం కూడా వుంటుంది. భిన్న ప్రాంతమో కులమో మతమో విరుద్ధ భావజాలమో ముందుకు వచ్చినప్పుడు కొత్త గీతల్లోంచీ వారి చరిత్ర పునర్మూల్యాంకనానికి గురి అవుతుంది. వారి వ్యక్తిత్వం యాసిడ్ పరీక్షను యెదుర్కొంటుంది. చీమూ నెత్తురూ వున్న మహాత్ముల జీవితంలో చోటుచేసుకున్న ప్రాధాన్యం లేని సంఘటనలు కూడా సూక్ష్మదర్శినిలో చూసే పరిస్థితి యేర్పడుతుంది. అప్పుడు పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు వేరవుతాయి. అలా కావడం మంచిదే. ఆ యా వ్యక్తుల జీవితంనుంచి స్వీకరించాల్సింది యేదో తిరస్కరించాల్సింది యేదో తేలిపోతుంది. వారివల్ల సమాజానికి జరిగిన మేలు స్పష్టమౌతుంది. వారి తప్పుల నుంచి నేర్చుకుంటాం. అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం. ధర్మరాజుల నిజ రూపాలు జానపదుల నాలుకలపై కథలుగా సామెతలుగా నలుగుతాయి. ఆ పరిణామాన్ని యెవరూ అడ్డుకోలేరు. సీతని పరిత్యజించిన రాముడు సైతం విమర్శకి పాత్రుడౌతాడు. అలా అన్జెప్పి వారిలోని మంచికి యెప్పటికీ ధోకా వుండదు. అది స్మరణీయమే. సదసద్విచక్షణగల విమర్శకుడు శివుడిలాంటి వాడు. చల్లటి చంద్రుణ్ణి శిరస్సున ధరిస్తాడు, కాలకూట విషాన్ని కంఠంలో దాచి వుంచుతాడు. ఇది లోక రీతి కావాలి.

అయితే కేవలం మంచిని మాత్రమే చూసేవాళ్ళు, దాన్ని గ్లోరిఫై చేసి శ్లాఘించేవాళ్ళు కొందరుంటారు. మరికొందరు చెడుని మాత్రమే మాగ్నిఫై చేసి ఖండనకి మాత్రమే పరిమితమై అందులో ఆనందం వెతుక్కుంటారు. విమర్శ – అయితే అనుకూలంగానో కాకుంటే వ్యతిరేకంగానో వుంటుంది తప్పితే సంయమన దృష్టితో వుండదు. విచక్షణ స్థానంలో దురభిమానం, వివక్ష చోటుచేసుకోవడం వల్ల భిన్నాభిప్రాయానికి తావుండదు. భిన్నాభిప్రాయాల పట్ల అసహిష్ణుత సైతం ముందుకు వస్తుంది. భూస్వామ్య సమాజ అవలక్షణాల్లో యిదొక ముఖ్యాంశం. వీరేశలింగంలా లబ్ధప్రతిష్టులైన వొకానొక కవినో సంస్కర్తనో వున్నతీకరించే క్రమంలో ఆ వ్యక్తి నీడన యెంతో మంది మసకబారి పోతారు. ఆ వ్యక్తి తల చుట్టూ కాంతి వలయాన్ని సృష్టిస్తారు. ఫలానా వారికి ముందు అంతా చీకటి ఆ తర్వాత అంతా చీకటే అన్న మాటలు పుట్టుకొస్తాయి. అందువల్ల వాళ్ళు యుగకర్తలై పోతారు. ఆ యా రంగాల్లో యితర సమకాలీనుల కృషి మరుగునపడి పోతుంది (వీరేశలింగానికి ముందు వెనక సంస్కర్తలూ రచయితలూ ప్రజా సేవకులూ అయిన సామినేని ముద్దునరసింహం, నరహరి గోపాలకృష్ణమశెట్టి, భాగ్యరెడ్డి వర్మ, త్రిపురనేని రామస్వామి వంటి వారి కృషికి సరైన గుర్తింపు కొనసాగింపు లేకపోడానికి కారణాలు యిటువంటిధోరణిలోనే చూడొచ్చు). సమాజం ప్రజాస్వామికమయ్యే కొద్దీ యీ అవలక్షణాల్ని ప్రశ్నించే గొంతులు పుట్టుకొస్తాయి. అజ్ఞాతమైన అస్తిత్వాల్ని వెలికితీయాల్సిన సందర్భం వస్తుంది. మహాత్ముల మహానుభావుల మహాకవుల మహా – మహాల … జీవితాలపై వ్యక్తిత్వాలపై మూల్యాంకనాలూ పునర్మూల్యాంకనాలూ అవసరమౌతాయి. అందుకు తమదైన చోటు కోసం వేదిక కోసం అన్వేషణ మొదలౌతుంది. ఇటీవల సామాజిక మాధ్యమాలు అటువంటి స్వరాలకు వేదిక కావడం గమనించవచ్చు. అయితే మరో పక్క యీ స్వరాల పట్ల ‘అసహనం’ కూడా ప్రబలుతోంది. భిన్న అభిప్రాయాల ప్రకటనకు అవకాశం లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ భావజాలాల్ని అణచివేసే కూటరాజనీతి అమలౌతోంది. బహుళత్వ భావనకూ భిన్నత్వానికీ తూట్లు పొడిచే వైఖరి హెచ్చవుతోంది. దేశంలో బానిస భావాన్ని పెంపొందించే దిశగా – అనేకతని తిరస్కరిస్తూ యేకాత్మ వాదాన్ని బలపరుస్తూ వందల అడుగుల యెత్తయిన విగ్రహాలు మొలుస్తున్నాయి. అవి ఆధిపత్య భావనకు తావులవుతున్నాయి. ఈ సందర్భంలో వీరేశలింగం నూరేళ్ళ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన తెలుగు సమాజానికీ సాహిత్యానికీ చేసిన సేవని మరోసారి బేరీజు వేయడానికి పూనుకోవడం యెంతయినా సమంజసం. అది వ్యక్తి పూజ జాడ్యం సోకకుండా చేయాల్సిన పని ; యెందుకంటే విగ్రహాలు తర్కాన్ని అంగీకరించవు. సమత్వ భావనకు చోటివ్వవు. నిజానికి విగ్రహాలు మాట్లాడనివ్వవు.

***

నవీన యుగ కర్త (చిలకమర్తి) నవ్యాంధ్ర బ్రహ్మ(అయ్యదేవర) యుగపురుషుడు (భావరాజు) నవయుగ వైతాళికుడు ఆధునిక వాజ్మయ నిర్మాత గద్య తిక్కన వంటి బిరుదులతో అనేకధా ప్రశంసలు పొందిన రావుబహద్దూర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చేపట్టిన సంఘ సంస్కరణలు సాహిత్య ప్రక్రియలు ఆనాటి సమాజంపై సాహితీకారులపై చూపిన ప్రభావం అపరిమితం. ఆయన కేవలం సంస్కర్త మాత్రమే కాదు. పత్రికాధిపతిగా సంపాదకుడిగా విద్యావేత్తగా శతాధిక గ్రంథ కర్తగా తన కాలాన్ని శాసించాడు.

భారతీయ తత్త్వశాస్త్రాలైన లోకాయతాన్నీ చార్వాకాన్నీసాంఖ్యాన్నీ శ్రామిక సంస్కృతినీ పునాది చేసుకుని ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రచారం చేసిన దార్శనికులెందరో వున్నారు. వేమన వీరబ్రహ్మం వంటివారు ఈ నేలకు చెందిన ఆధునికులు. గురజాడ వీరేశలింగం లాంటివాళ్ళు వలసవాద ప్రభావానికి లోనైన వాళ్ళు. ‘కన్ను గానని వస్తు తత్త్వం కంచ నేర్పరు లింగిలీజులు’ అని నమ్మి భౌతికవాదాన్నీ హేతు దృష్టినీ అలవరచుకున్నవాళ్ళు. ఈ ఆధునికులు పాశ్చాత్య నాగరికత వ్యాప్తికి కృషి చేశారు. అనివార్యంగా చొచ్చుకొస్తున్న విదేశీ సంస్కృతికి స్వాగతం చెప్పారు. కొత్త చదువులతో ప్రపంచ ద్వారాలు తెరుచుకోవడంతో తమ మతంలో సంఘంలో పాతుకుపోయిన దురాచారాల్లోని అమానవీయ కోణాల్ని అర్థం చేసుకోగలిగారు. నూతన భావాల్ని ప్రచారం చేయడానికి యింగ్లీషు సాహిత్యంనుంచి ఆధునిక ప్రక్రియల్ని తెలుగులోకి అనువర్తింపజేసుకున్నారు. వీరేశలింగం జీవితాన్నే చూద్దాం:

‘బ్రాహ్మణుండను హూణ భాష నేరిచి యందు

          నే బ్రవేశ పరీక్ష నిచ్చినాడ

నాంధ్రమున నొకింత యభిరుచిగలవాడ

          దేశాభివృద్ధికై లేశమైన

బ్రాలుమానక పాటుపడ నిచ్ఛగలవాడ

గవితా పటిమ కొంత గలుగువాడ

…       …       …       …       ’

                   (వివేకవర్ధని పత్రిక తొలి సంచిక)

భారతీయుల్ని భౌతికంగానే మానసికంగా బానిసలు చేసుకోడానికి ప్రవేశపెట్టిన ఇంగ్లీషు చదవుల్ని ముందుగా అంది పుచ్చుకొని లబ్ధి పొందిన వాళ్ళు బ్రాహ్మణులే. బూజుపట్టిన పాత ఆచారాలు సంప్రదాయాలు అభివృద్ధికి ఆటంకాలని వారు గ్రహించారు. వాటిని వదులుకోలేకపోతే తమ జాతికి అభ్యుదయం లేదని తెలుసుకున్నారు. ఆ క్రమంలో కొత్త పాలకులకు దగ్గరయ్యారు. వారివద్ద నెలజీతపు భృత్యులయ్యారు. ఆర్థికంగా స్థిరపడ్డారు (ఇంగ్లీషు చదువులు చదివిన వెంకటేశం డిప్టీ కలెక్టరై అగ్రహారం భూములన్నీ కొనేస్తాడని అతని తల్లి భావించడం కన్యాశుల్కంలో చూస్తాం). అయితే కొత్త చదువుల ద్వారా పొందిన యెరుకతో వీరిలోనే మరో సెక్షన్ స్వేచ్చాస్వాతంత్ర్యాలవైపు దృష్టి సారించి తెల్ల దొరలకు వ్యతిరేకంగా వుద్యమించడం మరో కోణం. సాంస్కృతిక పునరుజ్జీవన కాంక్ష కూడా అందుండి పుట్టినదే. అందులో భాగంగా మత సంస్కరణ భావాలు మొదలయ్యాయి. బ్రహ్మ సమాజం లాంటి సంస్థలు అలా యేర్పడినవే. హిందూ మత దురాచారాలకు వ్యతిరేకంగా వుద్యమం మొదలైంది. ఆంగ్లేయ పాలకుల మద్దతుతో సమాజంలో మతంలో మార్పుల కోసం కృషి చేసిన బ్రహ్మ సమాజాన్ని ప్రచ్చన్న క్రైస్తవంగా ఆ నాటి సంప్రదాయ వాదులు భావించారు.

వీరేశలింగం నాటి సమాజంలో వున్న పరిస్థితుల్ని ఆయన రచనలద్వారానే గ్రహించవచ్చు. ముఖ్యంగా ఆయన స్వీయ చరిత్ర అందుకు ప్రథమాకరంగా వుపయోగపడుతుంది (అది వొట్టి స్వీయ చరిత్ర కాదనీ , ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనీ చిలకమర్తి లాంటివారు కితాబిచ్చారు). వీరేశలింగం సమకాలికులూ అనుయాయులూ శిష్యులూ రాసిన ఆత్మకథల్ని పక్కనబెట్టుకుని ఆయన స్వీయ చరిత్రలోని నిజానిజాల్ని నిర్ధారించుకోవచ్చు. వాటి ద్వారా కూడా ఆనాటి సమాజాన్నీ ఆయన వ్యక్తిత్వాన్నీ తెలుసుకోవచ్చు. ఆ రోజుల్లో బుద్ధిజీవులు అయితే ఆయనకు తీవ్రాభిమానులు లేదా బద్ధ శత్రువులు. అందువల్ల సంస్కర్తగా వీరేశలింగాన్ని అంచనా కట్టాలంటే వాటన్నిటినీ సమగ్రంగా తులనాత్మకంగా అధ్యయనం చేయాలి. సారం చేదుగా వున్నా తియ్యగా వున్నా గుణపాఠాలు నేర్చుకోడానికి ఆటంకం కారాదు.

***

వీరేశలింగానికి యుక్త వయస్సు వచ్చేసరికి కేశవ చంద్రసేనుల వంటి వారి వుపన్యాసాలు చదివి మతసంస్కరణ దిశగా ఆలోచనలు చేశాడు. బెంగాలులో మొదలై తెలుగు నేలకు పాకిన బ్రహ్మ సమాజ భావాలు వొంటబట్టించుకున్నాడు. చిన్ననాటి మతవిశ్వాసాలు వదులుకున్నాడు. విగ్రహారాధనని వ్యతిరేకించాడు. ఏకేశ్వరోపాసకుడయ్యాడు (నిజానికి భారతీయ సమాజంలోని బహుదైవ ఆరాధనలోని అనేకతని యీ యేక దైవ భావన మింగివేసింది). మూఢ విశ్వాసాలని నిరసించాడు. దెయ్యాలపై నమ్మకాన్ని ఖండించాడు. మంత్ర తంత్రాలని కొట్టిపారేశాడు. చేతబడుల్ని సవాలు చేశాడు. పురాణేతిహాస పాత్రల్ని విమర్శనాత్మకంగా చూస్తూ హేళన చేశాడు. అయినా ఆస్తిక్య బుద్ధికి దూరం కాలేదు.

కడుపులో పెరిగే ఆడపిల్లని అమ్ముకునే రోజుల్లో వీరేశలింగం బాల్యవివాహాల్ని కన్యాశుల్కాన్ని వ్యతిరేకించాడు. ముక్కుపచ్చలారని పసిపిల్లల్ని మూడుకాళ్ల ముసలివాళ్ళకిచ్చి చేయడం అన్యాయమని యెలుగెత్తి చాటాడు. వేశ్యా సాంగత్యం తప్పు అని త్రికరణశుద్ధిగా నమ్మాడు. వీరేశలింగంలో వచ్చిన ఆధునిక సంస్కరణ భావాల ప్రచారానికి సాహిత్యాన్ని వొక బలమైన సాధనంగా యెన్నుకున్నాడు. నవలలు నాటకాలు ప్రహసనాలు వ్యాసాలు … మొ. ఆధునిక సంప్రదాయ ప్రక్రియలద్వారా ప్రజలను కొత్త సమాజంలోకి నడిపించాలనుకున్నాడు. ఈ మార్పు ఆయనలో కలగడానికి ముఖ్య కారణం సామినేని రచించిన ‘హితాసూచిని’. ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించకపోడానికి కారణాలేవైనా ఆయన ఆలోచనలమీద ఆ గ్రంథం చూపిన ప్రభావం మాత్రం అమేయం. అదే విధంగా చెరుకూరి ఉమారంగనాయకులు బందరు నుంచి ప్రకటించిన ‘పురుషార్థ ప్రదాయిని’ కూడా వీరేశలింగం సంస్కరణ ఆలోచనలకు యెంతగానో దోహదం చేసింది. వివేకవర్ధని పత్రికకు ప్రేరణ పురుషార్థ ప్రదాయినే అని చెప్పడం తప్పుకాదు.

బారో బ్రాడ్షా మెట్కాఫ్ మాక్దోనాల్డు వంటి దొరల సాయంతో వీరేశలింగం రచనల్ని పాఠ్యపుస్తకాలుగా స్వీకరించడం వల్ల ఆయన రాబడి పెరిగింది. చల్లపల్లి బాపనయ్యలాంటి వారి సహకారంతో పత్రికతో పాటు ముద్రణాలయం నిర్వహించే స్థాయికి వీరేశలింగం   ఆర్థికంగా యెదిగాడు. ఆయనలా రచనలమీద ధనార్జన చేసినవాళ్ళు ఆ కాలంలో లేరేమో!   ప్రార్థనా సమాజం నుంచి సంస్కరణ సమాజం స్త్రీ పునర్వివాహ సమాజం మీదుగా చివరికి హితకారిణి సమాజం వరకూ స్త్రీవిద్యా వ్యాప్తికీ వితంతు పునర్వివాహాలకూ వితంతు శరణాలయాల నిర్వహణకూ పిఠాపురం రాజా సూర్యారావు, జమీందారు పైడా రామకృష్ణయ్య మొ. వారెందరో ఆర్థికంగా ఆయనకు కొండంత అండగా వున్నారు. ఆయన మిత్రులు ప్రత్యక్ష పరోక్ష శిష్యులు అభిమానులు వీరేశలింగానికి పెట్టని కోటలా రక్షణగా నిలిచారు. ఇందరు కలిస్తేనే వీరేశలింగం. ఆ విధంగా వీరేశలింగం వొక్కరు కారు. పెక్కురు. బ్రాహ్మణ వాదం అనేకుల శ్రమని వొకడికి అంటగడుతుంది.

తన పెరిగిన ఆదాయాన్ని వీరేశలింగం దాచుకోలేదు. స్కూళ్ళూ శరణాలయాలు పుర మందిరాలు గ్రంథాలయాలు … యిలా అన్నీ ప్రజోపయోగ కార్యక్రమాలకే వినియోగించాడు. పుస్తకాలు ప్రచురించాడు. తన కార్య క్షేత్రం మద్రాసుకి మార్చుకోక ముందే మద్రాసులోనూ బెంగళూరులోనూ సమాజ మందిరాలు నిర్మించాడు. మహాదాతగా పేరుపొందాడు. తన జీవిత కాలంలోనే యెందరికో ఆదర్శ ప్రాయుడయ్యాడు. ఆ కాలంలో వీరేశలింగం కల్ట్ (cult) వొకటి తయారైంది అన్నా అతిశయోక్తి లేదు. ఆయన ఆచరణ వొక సెన్సేషన్. జీవితం సెలబ్రేషన్.

వీరేశలింగం అంత ఖ్యాతిని ఆర్జించడానికి కారణం : ఆయన సామాజిక సాహిత్య రంగాల్లో సవ్యసాచిలా పనిచేయడమే. గురజాడ లాంటి చాలామందిలో సంస్కరణ భావజాలం రచనా వ్యాసంగానికి మాత్రమే పరిమితం. వారిది ప్రధానంగా కళా దృష్టి. మరికొందరు కేవల సంస్కర్తలు. వీరేశలింగంలా రెండు క్షేత్రాల్నీ రెండు కళ్ళుగా భావించినవాళ్ళు అరుదు. ఆయన ప్రాథమ్యం సంఘ సంస్కరణే గానీ సాహిత్యాన్ని సామాజిక సేవకు సాధనంగా వాడుకున్నాడు. ‘విశ్వశ్రేయ: కావ్యం’ అన్న సుఉక్తిని పాటించాడు. రచన జగద్ధితం కోసం అని నమ్మి ఆచరించాడు. మమ్మటుడు చెప్పిన కావ్య ప్రయోజనాలన్నిటినీ ( యశస్సు, ధనం, వ్యవహార జ్ఞానం , ఉపదేశం, ఆనందం) ఆయన తన రచనల ద్వారా సాధించాడు. అందుకు ఆయన సాహిత్య సృజనలో కళా విలువలతో రాజీపడ్డాడని కూడా చెప్పొచ్చు (గురజాడ).

***

వీరేశలింగం చేపట్టిన సంస్కరణలు హిందూ మతానికి గొడ్డలి పెట్టులా పరిణమించాయని సంప్రదాయ పండితులు గగ్గోలుపెట్టారు. వారందరి నోళ్ళూ తన పరపతితో, పాండిత్య పటిమతో మూయించాడు. అయితే   సమకాలికులైన కొక్కొండ వేంకట రత్నం వంటి సంప్రదాయ వాదుల వ్యతిరేకతను మాత్రమే ఆయన యెదుర్కోలేదు, తనతో పాటు యెన్నో సమాజ హిత కార్యక్రమాల్లో ముఖ్యంగా స్త్రీ పునర్వివాహాలకు ఆర్థికంగా, నైతికంగా మద్దతు తెలిపిన మిత్రులతో కూడా శత్రు వైఖరి అవలంబించాడు. ఇది ఆయన వ్యక్తిత్వంలో ఆచరణలో కనిపించే ప్రధాన వైరుధ్యం. ఆత్మూరి లక్ష్మీనరసింహం ఏలూరు లక్ష్మీ నరసింహం న్యాపతి సుబ్బారావు వీరేశలింగం యీ నలుగురూ సంఘ సంస్కరణ కార్యక్రమాల కారణంగా వైరి పక్షం వారితో దుష్టచతుష్టయం అని పిలిపించుకొన్నారు. తన ఆధిపత్య స్వభావం వల్ల అధికార దర్పం వల్ల ప్రచార వ్యామోహం వల్ల మొండి వైఖరి వల్ల ఆ ముగ్గురు మిత్రులతో సైతం విరోధం కొనితెచ్చుకున్నాడు(లియోనార్డు). తన శిష్యుల్నీ అనుయాయుల్నీ దూరం చేసుకున్నాడు. బసవరాజు గవర్రాజు లాంటి యే వొకరిద్దరో తప్ప చివరి దశలో ఆయనతో నిలిచినవాళ్ళు తక్కువ. చివరికి నాళం కృష్ణారావు రావు న్యాపతి సుబ్బారావు కూడా ఆయనకు విరోధులయ్యారు. టంగుటూరి ప్రకాశం పంతులు కందుకూరి కార్య శూరత్వాన్ని మెచ్చుకుంటూనే తన తమ్ముడు శ్రీరాములు తరపున వకాల్తా పుచ్చుకుని కోర్టులో కేసు నడిపి వీరేశలింగం అనైతిక వర్తనని రుజువు చేశారు. న్యాయమూర్తి స్టీవర్ట్ యిచ్చిన తీర్పుతో వీరేశలింగం నవనాడులూ కుంగిపోయాయి. నైతికంగా బలహీనుడైపోయాడు. రాజ్యలక్ష్మమ్మ మరణం(1910) తర్వాత వొకసారీ కోర్టు తీర్పు తర్వాత మరోసారీ 27 మే 1919న చివరిసారీ మొత్తం మూడుసార్లు వీరేశలింగం మరణించాడు. కానీ బతికిన కాలంలో ఆయన చేసిన పనులు ఆయన్ని మరణించాకా జీవించేలా చేసాయి.

వీరేశలింగం సంస్కరణ భావాల ప్రచారానికి ఆయన స్థాపించిన వివేక వర్ధని పత్రిక యెంతగానో ఉపయోగపడింది. సంఘంలో పాతుకుపోయిన అవినీతిని బహిర్గతం చేయడానికి పత్రిక మంచి సాధనమైంది. న్యాయస్థానాల్లో మునిసిపాలిటీలో వైద్యశాలల్లో రెవిన్యూ శాఖలో మొత్తం ప్రజా జీవితంలో పెద్దమనుషులుగా చెలామణి అయ్యే అవినీతి పరుల్ని పత్రికా ముఖంగా నిర్భీతిగా యెండగట్టాడు. ఒక విధంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కి వీరేశలింగం ఆద్యుడేమో! చిరకాల మిత్రులు తనకి దూరమయ్యాకా వారికి కూడా పత్రికలో తాటాకులు కట్టాడు. ఆత్మూరి లక్ష్మీ నరసింహం కారణంగానే వీరేశలింగం బ్రహ్మ సమాజ కార్యక్రమాలకు దగ్గరయ్యాడు. కానీ ఆయన మీద కూడా ‘దంబాచార్య విలసనం’ రాసి ప్రకటించాడు. ఆయన తిరిగి కోపంతో వివేకవర్ధని పత్రిక ప్రతుల్ని నడిబజారులో దహనం చేశాడు. అందుకు ఆయన్ని కోర్టుకు యీడ్చాడు. తనకు సంస్కరణ వుద్యమంలో అనునిత్యం చేదోడు వాదోడుగా వున్న రాజమండ్రి పురప్రముఖుడు ఏలూరి లక్ష్మీ నరసింహం పట్ల కూడా యిలాగే ప్రవర్తించాడు. ఆయన గురించి ‘మహారణ్య పురాదిపత్య ప్రహసనం’, ‘తిర్యగ్విద్వన్మమహాసభ ప్రహసనం’ రాశాడు. అదే ధోరణిలో యితరులు రాస్తే సహించలేకపోయాడు. వీరేశలింగం నైతిక వర్తన గురించి టంగుటూరి శ్రీరాములు పత్రికా ముఖంగా ప్రశ్నించినందుకు ఆయనపై వీరేశలింగం కోర్టులో కేసులు వేశాడు. చివరికి అదే కోర్టులో ప్రకాశం పంతులు వాదనా పటిమకు దిగ్భ్రాంతుడై చేసిన తప్పునో చేయని తప్పునో అంగీకరించి తల దించుకున్నాడు. ఆ పరాభవాన్ని పరాజయాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు.

వితంతు వివాహాలను వీరేశలింగం అట్టహాసంగా జరిపాడు. ఒక్కో పెళ్ళికీ వెయ్యి రూపాయలకు పైగా ధారాళంగా ఖర్చుపెట్టాడు. మంగళ వాద్యాలు, వూరేగింపులు, పురోహితులు అయిదు రోజులపాటు భోజనాలు … ప్రతి పెళ్ళి వొక జాతరలా వుత్సవంలా జరిపాడు. మళ్ళీ పెళ్లి చేసుకోబోయే వధువుకి వంటి నిండా నగలు పట్టు చీరలు , వరుడికి వుద్యోగం, వుద్యోగం వచ్చే వరకూ జీవన భృతి, వుండటానికో యిల్లు యేర్పాటు చేసేవాడు. ఆ వైభవోపేతమైన జీవితానికి ఆశపడి కొందరు పునర్వివాహానికి ముందుకొచ్చేవారంటే అతిశయోక్తి లేదు. కన్యాశుల్కం నాటకంలో గిరీశం బుచ్చమ్మని పెళ్ళిచేసుకుంటే వచ్చే లాభనష్టాల బేరీజు వేస్తూ యీ లెక్కలు కడతాడు. కానీ స్త్ర్రీ పునర్వివాహ వ్యాప్తికీ ప్రచారానికీ యీ కానుకలు ఆడంబరాలు తోడ్పడేవి. చివరికి తాను ఆజీవితం ద్వేషించిన వేశ్యావృత్తి విషయంలో కూడా వీరేశలింగం రాజీ పడ్డాడు.   ఈ పెళ్ళిళ్ళకు భోగం మేళాలు ఏర్పాటు చేయాలన్న మిత్రుల ప్రతిపాదనను కూడా అంగీకరించాడు. కానీ తన ఇంట్లో దానికి చోటులేదని ఖరాఖండిగా చెప్పాడు.

వీరేశలింగం దొరల ప్రాపకం సంపాదించడమే కాదు. వారి మన్ననలు పొంది రావుబహద్దూర్ అయ్యాడు. జీవితాంతం బ్రిటిష్ వారికి అత్యంత విధేయుడిగానే వున్నాడు. తన సంస్కరణ కార్య కలాపాలకు దొరలతో తనకున్న స్నేహ సంబంధాల్ని స్వేచ్చగా వాడుకున్నాడు. వితంతు వివాహాలకు వందలాది విద్యార్థులు రక్షణ వలయంగా వుండటం వొక యెత్తయితే   డజన్ల కొద్దీ పోలీసు బలగాలు అండగా నిలబడేవి. అందుకు పోలీసు ఉన్నతాధికారుల సాయం తీసుకునేవాడు. న్యాయాధీశుల పురప్రముఖుల పరోక్ష మద్దతు కూడగట్టేవాడు. వధువు యెవరయిందీ చివరి నిమిషం వరకూ తెలియనిచ్చేవాడుకాడు. ఆ విషయంలో గొప్ప గోప్యత పాటించేవాడు.

గమనించాల్సిన మరో విషయం యేమంటే వీరేశలింగం ఆర్భాటంగా చేసిన చాలా పునర్వివాహాలు విఫలమయ్యాయి. తొలి పెళ్ళే పెడాకులై మూడునాళ్ళ ముచ్చటైంది. మొదటి పునర్వివాహం విడాకులకు దారితీసినప్పటికీ   తర్వాతి పెళ్ళిళ్ళ విషయంలో కూడా వీరేశలింగం జాగ్రత్త పడలేదు. ‘సంస్కరణ వెర్రి’లో వుండిపోయాడు. ఈ పెళ్ళిళ్ళు వధూవరుల పరస్పర అంగీకారంతోనో ప్రేమతోనో చేసినవి కావు. ఆదర్శ వివాహాలు చేసుకుని సంఘాన్ని వుద్ధరిద్ధామన్న ఆవేశం కొందరిది. పరస్పరాంగీకారంలేని యీ పునర్వివాహాల గురించి వితంతువుల దైన్యం గురించి వరుల అవలక్షణాల గురించి చెలం మేనత్త మాటలు చూస్తే వీరేశలింగం చేసిన పెళ్ళిళ్ళ లోగుట్టు తెలుస్తుంది. అడ్డం తిరిగిన గిరీశాల కథలు అర్థమౌతాయి. బుచ్చమ్మల నిస్సహాయతా గోచరమౌతుంది.

ఈ పెళ్ళిళ్ళకు వున్న మరో పరిమితి యేమంటే వధువులందరూ దాదాపు బాలవితంతువులే. పెళ్లి అయిందన్న మాటే గానీ భర్తలతో కాపురం చేసిన వాళ్ళు కాదు. సమాజం గురించి గానీ జీవితం పట్ల గానీ పెద్దగా అవగాహన వున్నవారూ కారు. చేసుకోబోయే వరుడి గుణగణాల గురించి వారికి యెరుక కూడా వుండేది కాదు. తమిళ జాతీయకవి సుబ్రహ్మణ్య భారతి అసంపూర్ణ నవల ‘చంద్రిక కథ’ వీరేశలింగం నిర్వహించిన పునర్వివాహాల్లోని లోటుపాట్లని యెత్తిచూపడానికి రాసిందేనని చెబుతారు (దిగవల్లి).

వీరేశలింగం వుద్యమస్థాయిలో చేసినవి కులాంతర వివాహాలు కావు. అందరూ బ్రాహ్మణ పిల్లలే. గోత్రాలు శాఖా భేదాలు వంటి పట్టింపులు కూడా ఉండేవి. అప్పటికి అదే ముందడుగు అనుకోవాలి. లేదా సమాజం నుంచి ఆమోదం పొందడానికి మరి కొంత మంది తల్లిదండ్రులు యువతీ యువకులు ముందుకు రావడానికి ఆయన కులం బరిని అధిగమించడానికి సిద్ధపడలేదు అని భావించాలి.

మరో ముఖ్య విషయం చెప్పుకోవాలి. స్త్రీ పునర్వివాహాలన్నిటిలో బ్రహ్మ సమాజ పద్ధతులకు భిన్నంగా హైందవ మతాచారాలే పాటించాడు. అది అతని అనుయాయులకు సహచరులకు కూడా రుచించని దాఖలాలున్నాయి. యిన్ని పరిమితుల మధ్య ఆక్షేపణల మధ్య కేవలం వొక కులానికి సంబంధించిన వొక చిన్న సంస్కరణ కారణంగా వీరేశలింగానికి అపరిమితమైన కీర్తి లభించిందని యిప్పటి వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు. నిజానికి కింది కులాల్లో మారు మనువు అసలు సమస్యే కాదు. అయినా వొక పది పదిహేనేళ్ళ కాలంలో జరిగిన యీ వివాహాల కారణంగా సమాజంలో చాలా మార్పు వచ్చింది. తొలిరోజుల్లో వున్న సామాజిక భీతి తొలగిపోయింది. రాను రానూ ఆడపిల్లల తల్లిదండ్రులు స్వచ్చందంగా ఐచ్చికంగా ముందుకు రావడం మొదలైంది. నెమ్మదిగా పెళ్ళి ఖర్చులు కూడా తగ్గుముఖం పట్టాయి. స్త్రీ పునర్వివాహానికి జనామోదం లభించింది.

బ్రహ్మ సమాజం ప్రభావానికి లోనైన దరిమిలా వీరేశలింగం అనేక బ్రాహ్మణ ఆచార సంప్రదాయాల్ని ఖండించినప్పటికీ స్వయంగా 1906 వరకూ భుజమ్మీద జంధ్యం తీయలేదు. వితంతు వివాహ నిర్వహణకు తన బ్రాహ్మణ అస్తిత్వ చిహ్నాన్ని వాడుకోవాల్సి వచ్చిందని ఆయన నచ్చ బలికాడు. పునర్వివాహాల్లో భోజనాల యేర్పాట్లు వంట బ్రాహ్మణుల చేతిమీదగానే జరిగేవి. సహపంక్తి భోజనాలు ప్రోత్సహించిన రఘుపతి వెంకట రత్నం నాయుడి స్నేహంలో సైతం వీరేశలింగం బ్రాహ్మణేతరుల చేతి వంట తిన్న దాఖలాలు లేవు. ఆయన సంస్కరణలు ఆలోచనలు సొంత కులం దాటి బయటికి పోలేదేమో అనడానికి యిదొక వుదాహరణ మాత్రమే. కానీ ఆ నాటి సామాజిక పరిస్థితుల నుంచి ఆయన ఆచరణని చూడాలి.

అంతమాత్రం చేత ఆయన కృషి అన్నివిధాలా విఫలమైందని చెప్పరాదు. చిన్నతనంలోనే భవిష్యత్తు అగోచరమై సమాజ నిరాదరణకీ అవమానాలకీ అవహేళనలకీ గురైన స్త్రీలకు యెందరికో వీరేశలింగం శరణాలయం ఆదరువు చూపింది. జీవితంలో యే గతీ లేని వారికి పరిష్కార మార్గం కనపడింది, దారీ తెన్నూ లేని అభాగ్య స్త్రీలు వీరేశలింగంగారి తోట దారి పట్టారు( శ్రీపాద – అరికాళ్ళకింద మంటలు). వితంతు శరణాయాల్ని నిర్వహించడంలో ఆయన యెన్నో అపవాదులు యెదుర్కొన్నాడు. వితంతు పునర్వివాహాల విషయంలో ప్రాణ హానికికి సైతం వెరవలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా పట్టిన పట్టు వదలని తత్త్వం ఆయనది.

***

స్త్రీ విద్యకు వీరేశలింగం ఆద్యుడు కానప్పటికీ ఆయన స్థాపించిన బాలికా పాఠశాలలూ వివాహిత స్త్రీలకోసం ప్రత్యేకంగా నిర్వహించిన బడులూ స్త్రీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయి. జ్ఞాన ద్వారాలు తెరిచాయి. ఆత్మ గౌరవ స్వరానికి వేదికలయ్యాయి. స్వేచ్చాయుత వర్తనకు నూతన మార్గాలు పరిచాయి. ఆత్మ విశ్వాసానికి పునాదులు వేశాయి. స్త్రీ విద్యా ప్రచారాన్ని ఆయన తన భార్య రాజ్యలక్ష్మమ్మతోనే మొదలు పెట్టాడు. వీరేశలింగం చేపట్టిన అన్ని కార్యక్రమాలకు రాజ్యలక్ష్మమ్మగారి ప్రోత్సాహం అపరిమేయమైనది. వారిద్దరినీ మహాత్మా జ్యోతీబా సావిత్రీ బాయి పూలే దంపతుల కృషితో పోల్చవచ్చు. కందుకూరి దంపతుల కార్య క్షేత్రం బ్రాహ్మణ సమాజానికి పరిమితమే గానీ పూలే దంపతులు శోషిత జాతుల అభ్యున్నతికి ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాడారు. ఇటువంటి మహానుభావులవల్ల స్త్రీ విద్య ప్రజోద్యమ స్థాయికి యెదిగింది.

వేశ్యా వృత్తి వ్యతిరేకత విషయంలో లో వీరేశలింగం చాలా కఠినంగా వ్యవహరించేవాడు. వేశ్యా సాంగత్యం గురించి చాలా పట్టింపు వుండేది. న్యాయవాది చిత్రపు కామరాజు వేశ్యా ప్రియత్వాన్ని అంగీకరించలేక తనకెంతో అవసరమైనప్పటికీ ఆయన దగ్గర చేసే కొలువు మానుకున్నాడు. గురజాడ సృష్టించిన సౌజన్యారావు పంతులు (కన్యాశుల్కంలో), మాధవయ్య (కొండుభట్టీయంలో) వీరేశలింగం వ్యక్తిత్వానికి నమూనా పాత్రలు అని చెబుతారు. వీరేశలింగం పట్ల గురజాడకి గౌరవం వుందిగానీ ఆయనలోని బలహీనతల్ని హేళన చేయడానికో విమర్శనాత్మకంగా యెత్తిచూపడానికో వెనకాడలేదు (కె వి రమణారెడ్డి).

ఈ వేశ్యా ద్వేషం కారణంగానే తన ‘కవుల చరిత్ర’లో ముద్దుపళని లాంటివారి పేర్లు సైతం ప్రస్తావించలేదు. దేవదాసీల సంగీత సాహిత్య వైదుష్యాన్ని గుర్తించలేదు. ‘రాధికా సాంత్వనం’ ముద్రించిన బెంగుళూరు నాగరత్నమ్మతో వివాదానికి తెగబడ్డాడు. తెల్ల పాలకులతో తనకున్న పరిచయాలు పురస్కరించుకొని సమాజానికి కీడుచేస్తాయని వావిళ్ళ వారు ముద్రించిన పుస్తకాలను నిషేధింపచేసే వరకూ వెంటపడ్డాడు. వేశ్యావృత్తిని ద్వేషించిన వీరేశలింగం దాని నివారణకు నిర్మాణాత్మక ప్రయత్నాలు చెయ్యలేదు. అన్నీ వొక్కరే చెయ్యాలనేం నిబంధన లేదు గానీ స్త్రీల దుస్థితి పట్ల యెంతో మానవీయంగా నిండైన హృదయంతో స్పందించిన మనిషి వేశ్యావృత్తిలో మగ్గిపోయేవారి దైన్యం పట్ల కనీసపు జాలి కూడా చూపలేదు. ఈ విషయంలో మాత్రం ఆయన ఆధునికుడు కాలేకపోయాడు. ప్రజా స్వామికంగా ఆలోచించలేకపోయాడు.

తాను చేపట్టిన ఆధునిక భావ వ్యాప్తికీ సంస్కరణ కార్యక్రమాలకూ వీరేశలింగం ఆంగ్లేయ ప్రభువుల నుంచీ రావుబహద్దూర్ బిరుదు పొందడం అటుంచితే అవకాశం అవసరం వచ్చిన ప్రతి సందర్భంలోనూ దొరల పాలన పట్ల పదేపదే తన విశ్వాసాన్ని ప్రకటిస్తూనే వచ్చాడు. అందుకు బలమైన వుదాహరణ: వందేమాతరం వుద్యమంలో పాల్గొన్నందుకు తనకెంతో యిష్టుడూ పుత్ర సమానుడూ అయిన ప్రియ శిష్యుడు కామరాజు హనుమంతరావుకి స్వయంగా నిశ్చయించిన పెళ్లిని సంవత్సరం పాటు వాయిదా వేశాడు. చివరికి యికపై స్వాతంత్ర్యోద్యమంలో పాల్గోను అన్న మాట తీసుకుని షరతుల మీద పెళ్లి చేయడానికి వొప్పుకున్నాడు. ఈ వ్యవహారంలో వీరేశలింగం పద్ధతిని వ్యతిరేకించిన చిలకమర్తి లక్ష్మీనరసింహం మీద కూడా అలిగి ఆయనతో చానాళ్లు మాట్లాడలేదు. గాడిచర్ల లాంటి దేశభక్తులకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం యిచ్చి వారికి శిక్షపడేందుకు కారణమయ్యాడు. అందువల్ల వీరేశలింగాన్ని దేశద్రోహిగా చిత్రించినవారూ వున్నారు. నిజానికి వీరేశలింగం జీవితంలోని యీ ఘట్టం చాలా మంది స్వకీయులకే మింగుడుపడలేదు. ఆయన్ని బ్రిటిష్ ఏజంట్ అనీ comprador అనీ నిందించారు (త్రిపురనేని వెంకటేశ్వర రావు).

కార్య సాధనలో ఆయన పాటించిన పద్ధతులూ మార్గాలూ విమర్శకు గురైనప్పటికీ అందుకు వీరేశలింగం చూపిన తెగువా పట్టుదలా అద్వితీయాలు. అవే ఆయన్ని కార్య క్షేత్రంలో కడదాకా నిలబెట్టాయి. తన జీవిత సర్వస్వాన్నీ నమ్మిన విలువలకోసమే అంకితం చేశాడు.

‘తన దేహము, తన గేహము,

తన కాలము, తన ధనంబు, తన విద్య జగ

జ్జనులకు వినియోగించిన

ఘనుడీ వీరేశలింగ కవి ….’

అన్న చిలకమర్తి మాటలు అక్షర సత్యాలు. ఆయన అపూర్వ త్యాగ నిరతి సడలని కర్తవ్య దీక్ష భావితరాలకు ఆదర్శంగా నిలిచాయి. ఆయన జీవితం నుంచీ స్వీకరించాల్సినవీ తిరస్కరించాల్సినవీ గ్రహించాడానికే యీ నాలుగు మాటలు. అంతే తప్ప సామాజిక సాహిత్య రంగాల్లో ఆయన చేసిన కృషిని చిన్నబుచ్చడం కాదు. సంస్కరణల యుగం దాటి సమాజంలో సమూలమైన మార్పుకోసం ఆలోచిస్తున్న తరం యిది. ప్రజా ప్రయోజనాలు సామాజిక బాధ్యతలు సాహిత్య అవసరాలు ప్రాథమ్యాలు వాటిని అధ్యయనం చేసే పద్ధతులు ప్రతి తరానికీ మారుతూ వుంటాయి. సాహిత్య చరిత్రలో ఖాళీల గురించి అందుకు కారణాల గురించి యిన్నాళ్ళూ గుర్తింపుకు నోచుకోని వర్గాలు స్వీయ అస్తిత్వ స్పృహతో కదలబారుతున్న కాలం యిది. వీరేశలింగం మరణించి నాలుగైదు తరాలు గతించాకా ఆయన ప్రాసంగికత గురించి మరోసారి చర్చించుకోడానికి శత వర్ధంతి సందర్భం దోహదం చేస్తుందని ఆశంస.

 

 

ఏ.కె. ప్రభాకర్

13 comments

Leave a Reply to కె.కె. రామయ్య Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వీరేశలింగం గారిని ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది. నిజంగా ఆయనలోని అన్ని కోణాలను పాటకులకు చక్కగా వివరించారు.. సమాజ పరిణామ క్రమంలో వచ్చిన అస్తిత్వ వాదాలను ఆహ్వానిస్తూ గత తప్పిదాలను సవరించుకుంటూ పోవడం తప్పా చేయగల్గింది ఏమీ లేదు.. మీరన్నట్లుగా విగ్రహాలు మాట్లాడనివ్వవు….లోపాలను వదిలేసి మంచిని గ్రహించడమే ఈతరం చేయవాల్సింది.. ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన మీకు..తెలుసుకునే అవకాశం ఇచ్చిన అఫ్సర్ గారికి కృతజ్ఞతలు

  • హిందూ సమాజంలో దళితులతో సహా రెండు వందలకు పైగా కులాలు వున్నాయి. బ్రాహ్మణ సామాజికవర్గం అని రాయాల్సిన చోటెల్లా ఈ కమ్యూనిష్టు రచయిత హిందూ సమాజం సంఘం అని రాశారు. ఇది అతివ్యాప్తి దోషం. అలనాటి హేతువాదులందరూ పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకులన్న వాస్తవాన్ని దాచి సిఆర్ రెడ్డిని ఆశ్రయించడం పచ్చి అవకాశవాదం.

    • వ్యాసం మొత్తంలో హిందూ పదం ఎన్నిసార్లు ఏ సందర్భంగా వచ్చింది – -బ్రాహ్మణ శబ్దం ఎన్నిసార్లు ఏ యే సందర్భాల్లో వాడానో చూసి కామెంట్ చేస్తే బాగుండేది డానీ !
      సి ఆర్ రెడ్డిని నేను ఆశ్రయించ లేదు. వ్యక్తి పూజ మంచిది కాదు అని చెబుతూ వ్యతిరేకించాను. అందులో ‘పచ్చి అవకాశవాదం’ ఏంటో చెప్పండి.
      పోతే దళితులు బహుజనులు అందర్నీ హిందూ మతస్థుల్లో చేర్చడంలో మీ ఉద్దేశం సెలవివ్వండి.
      చర్చ మంచిదే. కాస్త ప్రజా స్వామికంగా వుంటే బాగుంటుంది.

  • ‘కేవలం వొక కులానికి సంబంధించిన వొక చిన్న సంస్కరణ’ అని తేల్చేశారు. బెంగుళూరు నాగరత్నమ్మతో తెగబడ్డారన్నారు. దానికి కారణమైన ‘రాధికా సాంత్వనం’ అశ్లీలమా కాదా అనేది మీరు గాని, (ఉమా మహేశ్వర రావు గాని) ఎందుకు దాటవేశారు?
    బాలెన్స్ డ్ గా అనిపిస్తూ చాల తెలివిగా వీరేశలింగాన్ని డీగ్రేడ్ చేశారు. విగ్రహ పూజ ఏమో గాని మీ వ్యాసం చదివితే కొత్తవాళ్ళు ఎవరికీ ఆయన మీద రవ్వంత గౌరవం కూడా కలగదు.

  • దళితులు వేరే మతాల్లోనికి మారితే తప్ప వాళ్ళు హిందువులే. ఆ మాట అంబేడ్కరే చెప్పారు. “ఈ వజ్ బొర్న్ ఏ హిందు” అన్నారాయన.

  • సి.ఆర్.రెడ్డి గా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ( 1880 – 1951 ) ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది, ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. మైసూరు మహారాజా కళాశాలలో ఆచార్యునిగా, ప్రిన్సిపాల్‌ గా, మైసూర్ విశ్వవిద్యాలయ రూపకర్తగా, మైసూర్ సంస్థానం విద్యాశాఖాధికారిగా పనిచేసిన 12 సంవత్సరాల కాలంలో హరిజనులకు పాఠశాలలలో ప్రవేశం కల్పించడానికి కృషి చేశారు.

  • ” ఆయన ( కందుకూరి వీరేశలింగం ) జీవితం నుంచీ స్వీకరించాల్సినవీ, తిరస్కరించాల్సినవీ గ్రహించాడానికే యీ నాలుగు మాటలు. అంతే తప్ప సామాజిక సాహిత్య రంగాల్లో ఆయన చేసిన కృషిని చిన్నబుచ్చడం కాదు. సంస్కరణల యుగం దాటి సమాజంలో సమూలమైన మార్పుకోసం ఆలోచిస్తున్న తరం యిది.” అన్నది ఎ. కె. ప్రభాకర్ గారి ముఖ్యోదేశం. యీ సమగ్ర వ్యాసాన్ని ఆ కోణంలో చూడాలని విన్నపం.

    ” అలనాటి హేతువాదులందరూ పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకులన్న వాస్తవం ” అనే వాదన కన్నా ఇప్పుడు ఏ ఉద్యమాలు, ఏ అస్తిత్వవాదాలు, ఏ చైతన్య మార్గాలు సమాజశ్రేయస్సుకు ఉపయోగ పడతాయో వాటిగురించి ఆలోచించకూడదా ?

    అయినా కందుకూరి గురించి మనకందరికీ తెలిసిన విశేషాలు కొన్ని ఇక్కడ ( వికీపిడియా నుండి ) :

    బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు , ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన కందుకూరి వీరేశలింగం హేతువాది . ఆయన జీవితం సంఘసంస్కరణ, సాహిత్య కృషులతో పెనవేసుకు పోయింది.

    సంఘ సంస్కరణ సమాజము స్థాపించి, మతమనే ముసుగులో అధోగతిలో ఉన్న హైందవ సమాజములోని దురాచారములపై, మూఢ విశ్వాసాలు, సనాతనాచారాలపై ఆయన జరిపిన పోరాటము చిరస్మరణీయమైనది. ప్రజలను చైతన్యవంతులను చెయ్యడానికి వివేకవర్ధని పత్రికను ఆయుధంగా వాడుకున్నాడు.

    బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు ఆయన అకుంఠిత దీక్షతో పనిచేసాడు. ఆయన చేసిన ఇతర సంస్కరణ కార్యక్రమాలొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. తానే స్వయంగా చదువు చెప్పేవాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు.

    వేశ్యా వ్యవస్థ పాతుకుపోయిన ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా వివేకవర్ధనిలో వివేకవర్ధనిలో వ్యాసాలు రాసాడు.

    కందుకూరి సంఘసేవలో ఎంత కృషి చేసాడో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకడు.

    తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కల కందుకూరి 130 కి పైగా గ్రంథాలు వ్రాసాడు. ఆన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు వ్రాసాడు. స్వీయ చరిత్ర వ్రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు.

    సంగ్రహ వ్యాకరణం వ్రాసాడు. నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం) లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసాడు.

  • గొరుసన్నా! నీ తిర్పతి జ్యోతి పేపర్ పెద్ద ఉమా కందుకూరి వీరేశలింగం గారి గురించి ” సంస్కరణలో సంస్కారం ఏదీ? ” అనే వ్యాసం రాసారు చూడు అన్న దురుమార్గుడు పరాయోళ్ల కధల సిన్న ఉమా ( జి. ఉమామహేశ్వర్ ). ఇందులో నా తప్పేవీ లేదు.

    ” నువ్వు కన్నుమూసిన వందో సంవత్సరాన కూడా విమర్శనాత్మకంగా మాట్లాడుకునే పరిస్థితి లేదు పంతులయ్యా ఇక్కడ. అందుకే ఆవు వ్యాసాలనే మేం ఈ సంవత్సరం అంతా వల్లెవేసుకుంటున్నాం. వందేళ్ల తర్వాత కూడా నీకేం దిగుల్లేదులే! నిన్ను విగ్రహంగా మార్చేసుకుని పూజలతో మోస్తున్నవాళ్ళు నీ మీద ఈగ కూడా వాలనివ్వరు.
    ఇట్లు,
    నీ మనుమడు.. కాదు, కాదు
    బెంగుళూరు నాగరత్నమ్మ మునిమనుమడు
    ఆర్‌. ఎం. ఉమామహేశ్వరరావు ”

    https://epaper.andhrajyothy.com/2162127/Andhra-Pradesh/20-05-2019#page/4/1

  • గొరుసన్నో !

    ” ప్రచారం వల్ల ఎవరూ గొప్ప కవులు కారు! ~ అన్న ఉషా యస్‌ డానీ గారి విశ్లేష్ణాత్మక వ్యాసంకు దారి సూపినోడూ నీ పరాయోళ్ల కధల సిన్న ఉమానే!!

    గురజాడ, శ్రీశ్రీలను సాహిత్యంలో అందరికీ ప్రాతినిధ్యం వహించిన కవులు అనే అర్థంలో మహాకవులు అనడం ఒక అతివ్యాప్తి దోషం. గురజాడ కార్మికుల గురించి రాయలేదు. గురజాడను అధిగమించి శ్రీశ్రీ కార్మికుల గురించి రాశాడు. అయితే శ్రామికుల పరిధికి మించి ఆయన రాయలేదు.

    శ్రీశ్రీ నిర్మించిన సాహిత్య వేదిక మీద ఇంకో మెట్టు పైకెక్కి శివసాగర్‌ విప్లవ భావకవిత్వాన్ని సృష్టించాడు.

    అయితే, సామాజిక చరిత్రలో ఒక విచిత్రంగా కమ్మ సామాజిక వర్గం తమ కులానికి చెందిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిని సహితం పక్కన పెట్టి శ్రీశ్రీతోపాటూ గురజాడను, వేమనను కూడ భుజాన వేసుకుంది. ఈ క్రమం కమ్యూనిస్టు పార్టీల వేదికల మీద చాలా వేగంగా సాగింది.

    1970ల తరువాతి కాలంలో శివసాగర్‌, గద్దర్‌, కలేకూరి తదితరుల్ని ప్రోత్సహించింది కూడా కమ్యూనిస్టు వేదికలే.

    లెజండ్స్‌ వాళ్ల కాలానికి మాత్రమే అధిపతులు. తరువాతి కాలానికి వాళ్ళు లీడ్‌ ఇవ్వగలరు గానీ లీడ్‌ చేయలేరు. చారిత్రక, సామాజిక, వ్యక్తిగత పరిమితులు అందరి మీదా వుంటాయి. ఆ పరిమితుల మధ్యనే కొందరు సమాజం మీద గొప్ప సానుకూల ప్రభావాలను వేస్తారు. వాళ్ళనే తరువాతి తరాలు గుర్తు చేసుకుంటారు. గురజాడ, శ్రీశ్రీ, శివసాగర్‌ తదితరులు ఆ కోవలోనికి వస్తారు.

    ప్రచారం వల్ల ఎవరూ గొప్ప కవులు కారు! ~ ఉషా యస్‌ డానీ
    ( అసలు పేరు అహ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ జర్రానీ )
    https://www.andhrajyothy.com/artical?SID=791565

  • అర్రే , అర్రీ బుర్రీ యవ్వారం చేస్తూ , ” ఇట్లు, నీ తంపుల మారి రావయ్య”
    అని చేవ్రాలు రాయడం మర్సిపొయ్యా ! చమించన్నో గొరుసన్నా!!

  • గొరుసన్నా! ( ప్రముఖ సీనియర్ కధా రచయిత గొరుసు జగదీస్పర రెడ్డా !! )

    పదుగురి ప్రయోజనం కోసం, సామాజిక బాధ్యతతో కందుకూరి వీరేశలింగం గారి గురించి ఓ విశ్లేణాత్మక అద్భుత వ్యాసం ఇచ్చిన ఏ.కె. ప్రభాకర్ గారిని పలకరించాను; నా అవధులు దాటి, నాకున్న అర్హతేవిటీ అనే సందేహాన్ని ఆవలకు నెట్టి … విద్యార్ధి ఓ ఆచార్యవర్యుడి ముందు నిలబడిన ఆనందాన్ని పొందుతూ.

    ఏ.కె. ప్రభాకర్ గారి ఫోను నంబర్ ( Mobile : 8074239193 ) ఇచ్చి పుణ్యం మూటకట్టుకున్న “తొవ్వ ముచ్చట్లు” ప్రొ. జయధీర్ తిరుమలరావు గారు కూడా ” విగ్రహాలు మాట్లాడనివ్వవు! ” వ్యాసం ఎంతో బాగున్నది అంటూ తమ అభినందనలు తెలిపారు.

    • కందుకూరి ప్రాసంగితను నిష్పాక్షికంగా అంచనా వేయడానికి చేసిన సాహసాన్ని సరైన స్పిరిట్ తో స్వీకరించినందుకు థేంక్యూ రామయ్య గారూ !
      ‘కోపంతో తాపంతో రాగంతో ద్వేషంతో
      అచ్చమైన మనుషుల్లా నిండు బతుకు బతుకుదాం’
      అంటాడు మార్క్స్ వొక చోట.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు