ఈ మధ్య వాట్స్ యాప్ విశ్వవిద్యాలయ గుంపులు వీధి కొకటి వెలసి రకరకాల పేర్లతో కొత్తకొత్త ప్రక్రియపాకాలు వండడానికి నడుముకు బెల్టు, తలకు కంకణం వంటి లపేటా చుట్టి ఒకరి మీదొకరు పోటీలు పడి– కోవిడ్ క్రిముల సహ్మారానికి ఒక్కో దేశం ఒక్కో మందు కనిపెట్టి ప్రజల మూతులు చిక్కాలతో కట్టి పొట్టల్లోనికి కొట్టినట్లు– తయారు చేయడం జగమెరిగిన సత్యం.
నిన్న అనుకోకుండా ఒక వాట్స్ యాప్ గ్రూపులో దూరి చదివితే ఒక సరికొత్త కవితా రూపం నా కంటపడింది! దాని పేరు “కుడి” అనే ప్రక్రియగా రాసిఉంది.
ఆ “కుడి” అనే పదం వినగానే “ఎడమ” కు వ్యతిరేకం అని టక్కున మనకు మనమే తీర్మానించుకొంటాం.
మరి కొందరు ద్రవహృదయులు “కుడి” అంటే “కుడవడం” ….తాగడం కదా!! అనుకొని అది షర్బత్తో,రమ్మో, జిన్నో, బీరో, మజ్జిగో, వైనో వంటి పానీయాల భ్రమలో పడతారు. ఆ ద్రవభావ మత్తునుంచి తేరుకొని తరువాయి ప్యారాగ్రాఫు లోనికి అడుగువేస్తే…”గుడి” కి రూపాంతరమే “కుడి” అట!!
అంటే మన భాష తెలుగుగా విడిపోక ముందు ద్రావిడ భాషలో అంతర్భాగమట! అప్పుడు “గు” ను ఇప్పటిలా కాకుండా “కు” గానే ఉచ్చరించే వారట. దానిని ప్రామాణికంగా తీసుకొని పురాతన భావజాలాన్ని కూడా పరిరక్షించాలనే ధ్యేయంతో “గుడి” అనే అర్థం తోనే “కుడి” అనే నూతన ప్రక్రియను తయారు చేశారట.
ఆ తాళింపుతో మనం ద్రవ భావం నుండి భక్తి భావం లోనికి తర్ఝుమా ఔతాం.
ఆ మరుక్షణమే గోదావరి, కృష్ణ రెండు నదులూ కలిస్తే గట్లు తెగేలాగా ఎలా పొంగి ప్రవహిస్తాయో ఆ విధంగా మనలో భక్తీ భయాలు జమిలిగా ప్రవేశింప చేసుకొని మరో ప్యారాలోనికి దిగిపోతే అక్కడ “కుడి” కవితా ప్రక్రియకు వివరణ.
ఇందులో నాలుగు పాదాలు ఉంటాయట. ప్రతి పాదంలో 10 నుంచి12 దాకా మాత్రలు ఉండాలట. మాత్రలు అంటే అవేవో ట్యాబ్లెట్లు కావు! లఘు(అంటే చిన్న) అక్షరాలు. రెండో పాదం చివరి పదము, నాలుగో పాదం చివరి పదానికి అంత్యప్రాస ఉండాలట.
ఆ నియమాలతో రాసి వేలాది మంది లైకులు కొట్టి వందలాది సాహిత్యప్రియులు పేజీలకు పేజీలు కామెంట్లు రాసిన ఒక కవిత!!
“అతని కుతకుత హృదయాలు
ఆమె కన్నులలో నిక్కరులు.
ఆమె వెనుకడుగుల కాలు
అతని సంకలో కురికే తేలు!!”
“మామూలుగా అన్నం కుతకుత ఉడుకుతుంది” అనే భావానికే మనం కట్టుబడి పోయి మరో రకంగా ఆలోచించని స్థాయిలో ఇరుక్కొన్నాం!అయితే తెలుగు సాహిత్య జగత్తులో తొలిసారి “కుతకుత” మాటను హృదయానికి జోడించి చెప్పడం కొత్త ప్రయోగం.ఆ కుతకుత పదంలో ఒక గొప్ప శబ్దసౌందర్యం ఉంది. సంగీత శాస్త్రం లోని స రి గ మ నాదాల లయ ఉంది. అటువంటి సొగసైన పదాన్ని హృదయానికి అనుసంధానించడంలోనే కవి హృదయం అర్థమౌతుంది!!
ఇక అందరూ తమ కవిత్వాల్లో హృదయాన్ని ఏక వచనం తోనే సంబోధిస్తారు. అలా కాకుండా ఇక్కడ బహువచన ప్రయోగం అమోఘం!! మన వ్యవహారాల్లో “శ్రీరాం” కు “లు” జోడించి గౌరవ వాచకం “శ్రీరాములు” గా పిలిచినట్లు “అతని గౌరవ హృదయం కుతకుత లాడుతూ ఉన్నది” అని తొలి వరుసకు అర్థం.
రెండో వరుసలో “ఆమె కన్నులలో నిక్కరు” అనికదా మన కవిగారి ప్రయోగం!! సాధారణ కవులు అయితే మొదటి వరుసలో”అతడు” అని ప్రారంభించి రెండో వరుసలో “ఈమె” అంటూ ఆమెను తన పక్షానికి చేర్చుకొని వాక్యాన్ని కొనసాగిస్తారు. అలా కాక “ఈమె” అని మొదలు చేయడం ఆధునికానంతర ఆంగ్ల సాంప్రదాయాన్ని సూచిస్తుంది. అమనం కూడా ఆమెను మన ఊహసుందరిగా కళ్ల నిండా ఒంపుకొంటాం.
ఇక్కడ కన్నులు అంటే చూపులు లేక ఆలోచనలు అని కవిభావన. ఇక “నిక్కరు” అనగానే అందరు పిలగాళ్లూ తొడలు కనిపించేలా తొడుక్కొనే నిక్కరో లేక మోకాలి చిప్పలదాకా కత్తిరించిన ప్యాంటో గుర్తుకు తెచ్చుకొంటారు. కవిగారి అంతరంగం అదికాదు.
“నిక్కము” అంటే నిజం అని తెలుగు నిఘంటువులు అన్నీ ఘోషిస్తున్నాయి కదా. అటువంటి నిక్కము నుండి “ము” విభక్తి కాబట్టి దానిని తొలగిస్తే “నిక్క” మిగులుతుంది. దానికి మరో విభక్తిమార్పు రూపం “రు” చేరిస్తే బాలు+లు= బాలురు అయినట్లు నిక్క+లు= నిక్కరు అవుతుంది. ఇది తెలుగు వ్యాకరణ సాంప్రదాయం! ఏతావాతా మనకు తెలిసేది ఏమిటంటే నిక్కరు అంటే నిజం అని!! రెండో పాదాన్ని “ఆమె కన్నులలో నిజం ఉన్నది” అని మనం అర్థం చేసుకొవాలి.
మూడవది “ఆమె వెనుకడుగుల కాలు” ఆమె అంటే ముందే వివరించడం జరిగింది కాబట్టి. ఇక వెనుక+అడుగుల వెనుకడుగుల అయ్యింది. అట్లని వెనుకకు అడుగులు వేయడం కాదు. “కాలు” అంటే మన శరీరంలో మనం నడకకు ఉపయోగించే కాలు కాదు. “కాలి పోవడం” అని కవిగారి ధ్వని. అయితే ఇక్కడ ఎవరు? ఎందుకు?ఎలా? కాలిపోవడం అంటే….ఆమె వెనుకడుగు వేయనంటే వేయను అని కాలి(మండి) పోతుంది.
చివరి పాదం “అతని సంకలో కురికే తేలు”
చంక అంటే మనిషి భుజం యొక్క అడుగుభాగం కదా!! ఉరికే అంటే వేగంగా వెళ్లే అని. ఇక తేలు అంటే తోకలో విషం ఉండే కీటకం కాదు. తేలి పోవడం అని అర్థం. అతను చేతులు చాచగా కనిపించిన చంకలో దూరి కలల లోకంలో ఆమె తేలి పోయింది అని అర్థం!!
చివరాఖరుగా ఆ నాలుగు పాదాల అర్థాన్ని మూడు ముక్కల్లో చెప్పాలంటే ….
“గౌరవనీయమైన అతని హృదయం కుతకుత లాడుతూ ఉంది. ఆమె కన్నులకు నిజం తెలిసింది, ఇక వెకుకడుగు వేయకూడదని మండి పొతూ అతడు చేతులు చాచగా కనిపించిన చంకలో దూరి కౌగిలించుకొని కలల లోకంలో తేలిపోయింది”
అంత లోతైన విశాలమైన విపులమైన వింగడింపు చదివిన తరువాత నేను రాసిన కవిత్వం గుర్తుకు వచ్చి నేను కవిని కాదని….ఎవరైనా అలా పిలిస్తే చెప్పుచ్చుకు కొడదామనిపించింది!!
(ఈ మధ్య వాట్స్ యాపులు, ఫేసుబుక్కుల గుంపుల్లో ఉత్పత్తి అయ్యే సరికొత్త కవిత్వాలను చదివిన తరువాత )
*
కవిత్వం వెర్రి తలలు వేయడమంటే ఇదే .