వస్తున్నది కాసుకోండి, జన చైనా డ్రాగన్

ఫ్లైఓవర్‌ల క్రింద నివసిస్తూన్న కుటుంబాలనూ, మురికివాడలనూ చూసి, “ఇంత పేదరికం ఉందికదా? మరి నువ్వేం చేస్తున్నావు?” అని నన్ను నిలదీసింది.

చైనాకీ, భారతదేశానికీ చాలా పోలికలున్నాయి; ఎన్నో తేడాలూ ఉన్నాయి. చైనా విప్లవ విజయంతో స్ఫూర్తిని పొందిన తరానికి చెందినవాడినిగా ఆ దేశంలో జరిగిన, జరుగుతూన్న పరిణామాలను మరింత ఆసక్తిగా పరిశీలిస్తూ వచ్చాను. అంతర్జాతీయ ప్రారిశ్రామిక, వాణిజ్య, రాజకీయ వ్యవస్థలలో ఆ దేశపు స్థానం రోజురోజుకీ బలపడుతూనే ఉంది. ఈ మేరకు మనదేశం కూడా చైనాతో పోటీపడగల స్థానంలోనే ఉన్నది. ‘ఇండియాను సింగపూరు చేసేస్తాం,’ అని కొందరు దబాయిస్తూంటారు. అది అర్థంలేని మాట. మనల్ని మరోదేశంతో పోల్చుకోవాలి అనుకుంటే మొట్టమొదట చైనా గుర్తుకు రావాలి; ఎందుకంటే పెద్ద జనాభా కలిగిన, సువిశాలమైన, ప్రాచీన సంస్కృతులు వర్ధిల్లిన దేశాలు ఈ రెండూ. నిజానికి భారతీయ సమాజం, చైనీయ సమాజం కన్నా సంక్లిష్టమైనదీ, భాషాపరంగా, సంస్కృతిపరంగా బహుముఖమైనదీను. ప్రపంచంలో మరెక్కడాలేని కులవ్యవస్థ నేటికీ మన దేశమంతటా కొనసాగుతూనే ఉంది. చైనాలో నియంతృత్వం అమలులో ఉన్నదనీ, మనదేశంలో ప్రజస్వామ్యం వర్ధిల్లుతోందనీ చాలా కాలం గర్వపడ్డాను. ఈ కారణాలన్నింటి మూలానా చైనాకి వెళ్లడం అంటే భారతీయులకి ఉత్సుకతను కలిగించే, ఆసక్తిని పెంచే ప్రయాణం.

మొట్టమొదటిసారిగా చైనా వెళ్లింది – 1982లో యాన్‌తాయ్ అనే రేవుకి. ఇది బీజింగ్, షాంఘై నగరాలమధ్య, డాలియాన్‌కి అభిముఖంగా ఉండే – ఉత్తర చైనాలోని రేవు. యాన్‌తాయ్ కూడా అనేక ఇతర ఆసియా దేశాల రేవుల మాదిరిగానే జాలరుల కుగ్రామంగా మొదలై, యూరోపియన్‌ల రాకతో అంతర్జాతీయ వాణిజ్య రేవుగా అవతరించింది. దేశ స్వాతంత్ర్యం తరువాత ఆధునిక రేవుగా, పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా ఎదిగింది. యాన్ తాయ్ అంటే పొగ గొట్టం (లేదా బురుజు) అని అర్థం. ఓడ దొంగల రాకను ముందుగానే గుర్తించి, నగరవాసులను హెచ్చరించేందుకై, పాలకులు అక్కడ ఒక ఎత్తైన బురుజుని నిర్మించారు. ప్రమాదసూచనగా, కాపలాదారులు తోడేళ్ల లద్దెను మండించి, దట్టమైన పొగను సృష్టించేవారట. మన దేశంలాగానే – దూరదృష్టి కలిగిన పాలకులు, మహత్తరమైన చరిత్రను కలిగిన సువిశాలమైన చైనా కూడా సామ్రాజ్యవాదులకి దాసోహం కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

అది సెకండ్ ఇంజినీరుగా నా తొలి ఓడ; అందుచేత కుటుంబాన్ని వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. నాతో బాటుగా నా భార్య వింధ్య, మూడేళ్ల వయసున్న మా అబ్బాయి జైదీప్ కూడా ఉన్నారు. మొదటిరోజున సాయంత్రంపూట మేము షిప్పులోంచి బయలుదేరి టాక్సీ కోసమని నడుస్తూంటే – స్థానిక పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన బాయ్స్ హాస్టల్ దాటాం. చీరలో ఉన్న వింధ్యను చూసి, డాబామీద ఉన్న కుర్రవాళ్లు ‘ఆవారా హూ’ పాట అందుకున్నారు! మేం చేతులూపాం. ఆనాటితో మొదలుకొని మేమక్కడ ఉన్న పది రోజులూ సాయంత్రాలలో అటువైపు వెళ్లినప్పుడల్లా ఏదో ఒక రాజ్‌కపూర్ పాట పాడి మమ్మల్ని గౌరవించారు. ఒకరోజు మెరైన్ క్లబ్బుకి వెళ్లినప్పుడు, ఆర్కెస్ట్రా బృందం, మమ్మల్ని చూసి, వరసగా హిందీ సినీమా పాటలను వాయించారు! ఆ రోజు మాకు పండగే!

మేము యాన్‌టాయ్ వెళ్లేనాటికి మావో చనిపోయి ఐదారేళ్లే అయింది. అతని భావాల ప్రభావం ఇంకా సమాజంలో వేళ్లూని ఉంది. వీధుల్లో ఎటుచూసినా సైకిళ్లే; అడపా తడపా ప్రభుత్వ వాహనాలు; క్రిక్కిరిసిన బస్సులు, కొద్దిపాటి టాక్సీలు కనిపించాయి. ప్రైవేటు కార్లు మచ్చుకైనా లేవు. ఆడా, మొగా అందరూ ఒకే డ్రెస్సులో, సైకిళ్ల మీద – నిరంతర ప్రవాహంగా సాగిపోతూ కనిపించారు. బూడిద, ఆకుపచ్చ, నీలం – ఈ మూడు రంగుల్లోనే ఉండే వాళ్ల డ్రెస్సుని ‘మావో సూట్లు’ అని పిలిచేవారు (పాశ్చాత్య మీడియాలో). చాలా మంది టొపీలు కూడా పెట్టుకున్నారు.

ట్రాఫిక్ పోలీసులు స్పీకర్ల ద్వారా ఏవేవో సూచనలు ఇస్తూనే ఉన్నారు. ‘ప్రజాస్వామ్య గోడలు’ కనిపించాయి. వాటిపై అతికించిన న్యూస్ పేపర్లను ఆసక్తిగా చదివే యువతీ యువకులనూ, ప్రక్కనే వేసిన బెంచీలపై కూర్చొని టీ తాగుతూ, సిగరెట్లు పీలుస్తూ, చర్చలలో మునిగిపోయిన వృద్ధులనూ చూశాం.

మమ్మల్ని చూడడంతోటే కనీసం ముప్ఫై మంది సైకిళ్లు దిగి, మావెంట నడిచారు. మా గురించే ఏదో మాట్లాడుకుంటూ అతిగా నవ్వుకుంటూ – మొదట్లో మాకు ఇబ్బంది కలిగించారు గానీ కాసేపట్లో మాకు అలవాటు అయింది. ప్రసిద్ధిగాంచిన చైనా పింగాణీ టీ సెట్టు కొనాలని మా ఆలోచన. వాళ్లకి తెలియజేసేందుకు, టీ కప్పులు, సాసర్లు స్కెచ్ వేసి చూపించాను. ఆ స్కెచ్చిని ఒక్కరొక్కరుగా అంతా పరికించారు. మాళీ పెద్దగా నవ్వులు వినిపించాయి. మొత్తం బృందం అంతా పెద్దగొంతుకలతో చర్చించుకున్నారు; వాదించుకున్నారు. ఒకాయన తన వెంట నడవమన్నాడు. గుంపు ఇంకా పెద్దదైంది. చివరకి ఒక రెస్టారెంట్ వద్ద నిలిచిపోయాం. నా చిత్రకళా నైపుణ్యం,  వాళ్లకి తప్పుడు సంకేతాన్ని అందించింది! రెస్టారెంట్లో అడుగుపెట్టి అక్కడ ఉన్న కప్పులూ, మగ్గులూ ఎత్తి పట్టుకొని, ‘ఇవీ మాకు కావాల్సింది,’ అని అర్థం వచ్చేలా సైగలు చేసాం. మళ్లీ గుంపులో కలవరం మొదలైంది. అంతా స్వచ్ఛంగా నవ్వుకున్నారు. ముందుకి సాగాం. ఎట్టకేలకు పింగాణీ వస్తువులు అమ్మే దుకాణానికి తీసుకెళ్లారు.

మర్నాడు కూడా ఇదే విధంగా జనం మా వెంట పడ్డారు. అమ్మాయిలు వింధ్య చీర కొంగుని స్పృశించి, పరవశించిపోతూ నవ్వులు కురిపించారు. ఇంగ్లీషు తెలిసిన ఒక పెద్ద మనిషిని మా ముందుకి నెట్టారు. అతడు, ‘నేను ఇంగ్లీషు టీచర్‌ని,’ అని పరిచయం చేసుకున్నాడు. ‘హమ్మయ్య!’ అనుకున్నాం. గుంపులోని వారంతా అతని ద్వారా మాతో సంభాషించాలని పోటీ పడ్డారు. అతను తన చేతులతో సైగచేస్తూ, వాళ్లని వారించి, శాంతపరచాడు.

మావైపు తిరిగి, “వీళ్లల్లో ఎక్కువమంది, చైనా గురించి మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు,” అన్నాడు. అతని ఇంగ్లీషు మాకు అర్థంకావడంలో కొంచెం ఇబ్బంది కలిగింది. నెమ్మదిగా మాట్లాడమన్నాం.

“చైనా అంటే మాకు కూడా చాల ఆసక్తి ఉంది. రెండు దేశాలూ ఇంచుమించు ఒకేసారి వలసపాలన నుండి విముక్తి పొందాయి. మార్గాలు భిన్నమైనవి అయినా మన దేశాలు అభివృద్ధి దిశగా నడుస్తున్నాయి. చైనా సాధిస్తూన్న ప్రగతి కనిపిస్తూనే ఉంది. సాంస్కృతిక రంగాల్లో, ప్రజల మధ్య ఇంకా బలమైన సంబంధాలు ఏర్పడాలని కోరుకుంటున్నాం…,” ఇలా ఏదో చెప్పాను. ఆ ఆంగ్ల ఉపాధ్యాయుడు అనువదించి వినిపించాడు. వాళ్లంతా శ్రద్ధగా విన్నారు. చప్పట్లు కొట్టారు.

ఒకాయన ఏదో అన్నాడు; జనం చప్పట్లు కొట్టారు. టీచరుగారు అనువదించారు. ‘మరో పదేళ్లయ్యక మళ్లీ రండి. చైనా పూర్తిగా మారిపోతుంది,’ – ఇదీ అతని మాటల సారాంశం. వాళ్ల ఆత్మ విశ్వాసం ముచ్చట కలిగించింది. అతని మాటలు పూర్తిగా నిజం అయ్యాయి  ఆధునీకరణ దిశగా డెంగ్ జియావోపింగ్ 1980లొ చేబట్టిన సమూలమైన సంస్కరణలను దృష్టిలో పెట్టుకొని అతడామాట అన్నాడేమో?

ట్రాఫిక్ పోలీసుల నిరంతర ఉద్భోద గురించి, కూడళ్లలోని పోస్టర్ల గురించీ ఆ టీచర్‌ని అడిగాం. ట్రాఫిక్ రూల్స్‌ని అదేపనిగా వల్లెవేస్తున్నారనీ, మధ్య మధ్యలో పౌరులకు హితవులు పలుకుతున్నారనీ అతడు చెప్పాడు. ‘రోడ్డుమీద ఉమ్మకూడదు, పిల్లల చేయి పట్టుకోవాలి, వృద్ధులైన పాదచారులకు చేయూతనిచ్చి రోడ్డు దాటించాలి…,’ ఇటువంటివి అన్నమాట. ఆ పోస్టర్లపైన కూడా అటువంటి సూచనలే ఉన్నాయట. “చదవలేని వాళ్ల సంఖ్య ఇంకా ఎక్కువే గనుక, పోలీసులు వాటిని వివరిస్తున్నారు,” అన్నాడు.

నాకు ఉన్న ఒక సందేహం ఆ టీచర్‌కి తెలియజేశాను. “డాక్టర్ ద్వారకానాథ్ కొట్నిస్ గురించి ఎవరైనా విన్నారా?” అని అడిగాను. నా ప్రశ్నను గుంపుకోసం అనువదించాడు. మళ్లీ కలవరం. సమిష్టిగా వెలువడ్డ జవాబు ఈ విధంగా ఉంది:

“కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకున్నవాళ్లని చైనా ప్రజలు ఎన్నటికీ మరచిపోరు. ప్రతీ ఏటా పూర్వీకులను గుర్తుచేసుకొని, వారికి నివాళులు అర్పించే కింగ్‌మింగ్ పండగ (‘సమాధులను శుభ్రపరచే దినం’) నాడు నార్మన్ బెథూన్‌, కే-దీహువా (కొట్నిస్‌కి చైనా పేరు)లని తలచుకొని నివాళులు అర్పిస్తాం. వాళ్లను గురించి చైనా అంతటా బడిపిల్లలకు తెలుసు; ఎందుకంటే వాళ్లు మా పాఠ్య పుస్తకాలలో భాగం అయిపోయారు.” మాకు చాలా సంతోషం కలిగింది.

పైన చెప్పిన సంఘటనలు జరిగిన ముప్ఫై ఏళ్ల తరువాత ఒక నార్వీజియన్ కంపెనీలో (వాణిజ్య నౌకాసంస్థ కాదుగానీ, నౌకా రంగానికి సంబంధించినదే) పనిచేస్తూ షాంగ్‌హై మహానగరాన్ని చూసినప్పుడు కళ్లు జిగేలుమన్నాయి. తరచూ ఆ నగరానికి వెళ్లే అవసరం ఏర్పడింది.

2015నాటి షాంగ్‌హైలో ఏమి కనిపించింది? బ్రహ్మాండమైన భవనాలూ, పరిశుభ్రత, క్రమబద్ధమైన ట్రాఫిక్. అంతేకాదు – మురికిపేటలు, బిచ్చగాళ్లూ, పెంటకుప్పలూ, దోమలూ – ఇవేవీ కంటపడలేదు.

అంతటా ఆత్మవిశ్వాసం, ఉత్సాహం కనిపించాయి. మా కంపెనీ షాంగ్‌హై ఆఫీసు, మెరికల్లాంటి యువతీ యువకులతో నిండిపోయింది. వాళ్లంతా (అమెరికన్ యాసతో) చక్కటి ఇంగ్లీషు మాట్లాడతారు. వాళ్లకి చైనీస్ పేర్లతో బాటు ‘అమెరికన్’ పేర్లు కూడా ఉంటాయి; లేదా పెట్టుకుంటారు.

ప్రజలకి ఏది మంచో, ఏది చెడో అక్కడి ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. పౌరుల ప్రయాణలను, వలసలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. మా కంపెనీ చైనీయ ఉద్యోగులలో ఎక్కువమంది విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి, చైనాకి తిరిగివచ్చినవాళ్లే. ప్రభుత్వానుమతి లేకుండా విదేశాలకు వెళ్లే, లేదా అక్కడ స్థిరపడే అవకాశాలు చాలా తక్కువ. పైదేశాల్లో చదువుకొని వచ్చినవాళ్లని –

“మీరు అమెరికాలోనో, యూరప్‌లోనో ఉండిపోవాలని ఎందుకు అనుకోలేదు?” అని అడిగితే,

“చైనా ఇవాళ ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైన మార్పులు, అభివృద్ధి జరుగుతూన్న దేశం. అందరికీ ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. మేము ఇక్కడే ఉండి, ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాం. అంతేకాదు, మా కుటుంబాలను వదిలిపెట్టి ఉండడం మాకు ఇష్టం లేదు,” అన్నారు.

మా భారతీయ సహోద్యోగి, “అదంతా పార్టీ ప్రచారం;  వాళ్లలాగే అంటారు,” అని కొట్టిపారేశాడు. నాకు మాత్రం అతగాడి అభిప్రాయం తప్పేమో అనిపించింది.

గణితానికి చైనీయ సంస్కృతిలో పెద్దపీట వేస్తారు. అన్నింటినీ, అంకెలలో, శాతాలలో, సమీకరణలలో వ్యక్తీకరించడం వాళ్లకి ఇష్టం. మా షాంగ్‌హై ఆఫీసు ఫైనాన్స్ మేనేజరు బోనీ (అమెరికన్ పేరు) ఆడిటింగ్‌కని ఇండియా (బోంబే) వచ్చినపుడు శని ఆదివారాల్లో ఆమెకు ఊరు చూపించాం. అప్పుడు చాలా  ఆణిముత్యాలను వదిలివెళ్లింది. కొన్నింటిని ఉదహరిస్తాను:

చైనాకి షాంగ్‌హై = ఇండియాకి బోంబే

చైనాకి బీజింగ్ = ఇండియాకి ఢెల్లీ

పాత నగరం = టూరిస్టు ప్రపంచం

కొత్త నగరం = వాణిజ్య ప్రపంచం

ఉత్తర కొరియా = చైనా – సంస్కరణలు

ఇండియా = చైనా – కమ్యూనిస్ట్ పార్టీ

ఫ్లైఓవర్‌ల క్రింద నివసిస్తూన్న కుటుంబాలనూ, మురికివాడలనూ చూసి, “ఇంత పేదరికం ఉందికదా? మరి నువ్వేం చేస్తున్నావు?” అని నన్ను నిలదీసింది.

“నేనేం చేస్తాను? సక్రమంగా పన్నులు చేస్తున్నాను. అంతకుమించి నాబోటి పౌరుడు ఏం చెయ్యగలడు?”

“మరి మీ ప్రభుత్వం ఏం చేస్తోంది?”

“వాళ్లు చెయ్యగలిగినవి చేస్తున్నారు. టైం పడుతుంది.”

“ఇండియాలో కమ్యూనిస్టు పార్టీలేదా?”

“లేకేం? కనీసం మూడు పార్టీలున్నాయి – సి.పి.ఐ., సి.పి.ఎం., సి.పి.ఐ. (మావోయిస్ట్).”

“మావోయిస్టా? అంటే ఛైర్మన్ మావో…?”

“అవును”

“వాళ్లకి ఛైర్మన్‌లేడా?”

“ఉండే ఉంటాడు”

“మరైతే ఛైర్మన్ మావో పేరెందుకుపెట్టుకున్నారు?”

“నాకు తెలియదు, వాళ్లనే అడగాలి”

బోనీకి నా జవాబులు సంతృప్తి కలిగించలేదు. భారతీయ కమ్యూనిస్టు పార్టీలేవీ తమ విధులను సక్రమంగా నిర్వహించడంలేదనే అభిప్రాయం వెలిబుచ్చింది.

“అదంత సులభంకాదు,” అని మాత్రం అన్నాను.

“మావో గురించి ఇప్పటి చైనా యువతరం ఏమనుకుంటున్నది?” అని ఆమెను అడిగినప్పుడు,

“80% గుడ్, 20% బాడ్” అన్నది. మరుసటి సంవత్సరం ఆమెను అదే ప్రశ్న అడిగితే,

“70% గుడ్, 30% బాడ్” అంది!

“అదేమిటీ? ఏడాదిలో గుడ్ తగ్గిపోయి, బాడ్ పెరిగిపోయింది?” అంటే,

“కొత్త పార్టీ లైన్!” అంది, చాలా సీరియస్‌గా. ఆమె చిరునవ్వయినా చిందించి ఉంటే, జోక్ అనుకొని నవ్వేసేవాడిని.

ఒకసారి నేను షాంగ్‌హై వెళ్లినప్పుడు డిన్నర్ పార్టీలో చైనీయ మిత్రులంతా నా చుట్టూ చేరారు. వయసులో మా అబ్బాయికన్నా అంతా చిన్నవాళ్లే. చైనా కంట్రీ మేనేజర్‌కి ఇండియన్ కరెన్సీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. నా పర్సులో ఉన్న నోట్లను తీసి, అతనికి చూపించాను. మిగిలినవాళ్లు కూడా వాటిని కుతూహలంగా, నిశితంగా పరిశీలించారు. అన్నింటిపైనా గాంధీగారి బొమ్మ ఉందని గమనించారు. వాళ్ల నోట్లన్నింటిపైనా ఛైర్మన్ మావో చిత్రం ఉంటుంది.

“ఈయనెవరో మీకు తెలుసా?” అని అడిగాను.

“తెలుసు. ఛైర్మన్ గాంధీ,” అన్నాడు నా ప్రక్కనే కూర్చున్న ఒక మేనేజరు.

“కాదు,” అన్నాను.

“ప్రెసిడెంట్ గాంధీ,” అంది ఒకామె.

“వాళ్లకి ప్రైమ్ మినిస్టరే పెద్ద నాయకుడు,” అంటూ వివరించాడు చైనా హెడ్.

“అయితే మొదటి ప్రైమ్ మినిస్టర్, గాంధీ అయి ఉంటాడు.”

“కాదు.”

నా ప్రక్కన కూర్చున్న మేనేజర్‌కి చిరాకు పుట్టుకొచ్చింది. అప్పటికే రెండు రౌండ్లు లోపలికి వెళ్లాయి.

“ఛైర్మన్ కాదు, ప్రెసిడెంట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు…మరయితే ఎందుకు అతగాడి బొమ్మ అన్ని నోట్లమీదా ప్రింటు చేశారు?” అన్నాడు, విసుగ్గా.

నేను శాంతంగా, “మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకుంటే, మీకు గాంధీగారి గురించీ తెలుస్తుంది, అలాగే ఇండియా గురించి కూడా తెలుస్తుంది,” అన్నాను.

ఆ తరువాతి నెలలో మళ్లీ షాంగ్‌హై వెళ్లినప్పుడు గాంధీజీ ఆత్మకథను అక్కడి మా కంపెనీ ఉద్యోగుల లైబ్రెరీకి బహూకరించాను.

చివరిగా ఒక మాట. అన్ని సార్లు షాంగ్‌హై వెళ్లానుగానీ, ఏ ఒక్కరూ, ‘చైనా గురించి మీరేమనుకుంటున్నారు?’ అని మళ్లీ నన్ను ప్రశ్నించనేలేదు.  కానీ కొత్త తరానికి కూడా డాక్టర్ కొట్నిస్ ఎవరో తెలుసు.

[చిత్రాలు: వీకీపీడియా]

ఉణుదుర్తి సుధాకర్

2 comments

Leave a Reply to G Venkatramana Rao Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు