“నిద్రబో బొడ్డెమ్మ… నిద్రబోవమ్మ
నిద్రకు నూరేండ్లు.. నీకు వెయ్యేండ్లు
నిన్నుగన్న తల్లికి నిండ నూరేండ్లు
పాలిచ్చు తల్లికి బ్రహ్మ వెయ్యేండ్లు
పాలు అన్నం పెట్టి పాపడకాయ
నెయ్యి అన్నంబెట్టి నేరేడు కాయ
పెరుగు అన్నంబు… పెద ఉసిరి కాయ
ఆరగించు గౌరి అన్నమమృతంబు…”
ఆశ్వీయుజ మాసం వచ్చిందంటే ప్రకృతి రంగురంగు పూలతో, నిండైన జలకళతో వింత సోయగంతో శోభాయమానమవుతుంది. తెలంగాణ నేల, గ్రామాలు, నగరాలు బతుకమ్మ పండుగ వాతావరణంతో, బతుకమ్మ పాటలతో మార్మోగిపోతాయి. ఎంగిలిపూల బతుకమ్మ కన్నా ముందే ‘బొడ్డెమ్మ’తో మొదలై సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది. అత్తవారింటికి పోయిన ఆడబిడ్డలంతా తల్లిగారింటికి వచ్చి బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తంగేడుపూలు, గునుగుపూలు, కట్లపూలు, గడ్డిపూలు, చేమంతిపూలు, గుమ్మడిపూలు, బంతిపూలు ఇలా తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి దేవాలయం ముందో, చౌరస్తాలోనో, చెరువుకట్ట మీదనో పెట్టి, కోటి ఇంద్రధనస్సులు నేల మీదికి దిగినట్లు బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ, నాజూకు పాదాలతో తిరుగుతూ, పాటలు పాడుతూ ఆడపడుచులంతా తమ సంతానం, పంటలు, ఆరోగ్యం బాగుండాలని, సకల సంపదలు ప్రసాదించుమని గౌరీ దేవిని కొలుస్తారు.
కొంతమంది మనుషులను అంటరానివారుగా దూరం పెట్టినట్లే కొన్ని పూలను కూడా పూజకు పనికిరానివిగా చేసింది లోకం. అందుకు మంచి ఉదాహరణ లొట్ట పీసు పూలు. దేవునికి పెట్టకపోయినా సరే కనీసం వీటికి బతుకమ్మలో కూడా చోటు లేదు. బొడ్డెమ్మకు కూడా పెట్టవద్దన్నారు. దేనికీ పనికి రావనుకున్న ‘లొట్టపీసు పూలు’ అన్యాయానికి, మోసానికి, నమ్మక ద్రోహానికి మూగ సాక్షిగా మిగిలిపోయాయి ఈ కథలో.
ఎల్లయ్య పంతులు ఊళ్లె పంచాయితీలు చెప్పే పెద్ద మనిషి. తన భర్త శివుడు దినాం తాగి నానా రచ్చ చేస్తున్నాడని అడివమ్మ ఎల్లయ్య పంతులుకు ఫిర్యాదు అయితే ఎల్లయ్య పంతులు శివుడిని పిలిచి భయం చెప్పిండు. అడివమ్మ సంసారం సక్కబడ్డది. ఎల్లయ్య పంతులుకు ముగ్గురు బిడ్డలు. పెద్ద బిడ్డ సలుమ్మకు పెండ్లి అయింది. ఆమెకు ఒక కూతురు పేరు యమున, కొడుకు పేరు అశ్విన్. సలువమ్మ బతుకమ్మ పండుగకు తల్లిగారింటికి వచ్చింది. ఎల్లయ్య పంతులుకు ఎక్కడలేని సంబరం. మనుమరాలు యమునతోని ఎడతెగని ముచ్చట. ఎక్కడికి పోయినా ఇద్దరు కలిసే పోతున్నరు. ఓ నాడు తాతతోని చెల్కకు పోయి రాంగ చెరువు కట్ట మీది నుంచి వస్తున్నరు. చెర్లున్న లొట్టపీసుపూలు యమున కంట్లె పడ్డయి. అవి కావాలని పట్టుబట్టింది. తన దగ్గర పని చేసే పాపయ్యకు చెప్పి ఎల్లయ్య పంతులు లొట్టపీసు పూలు తెప్పించి మనుమరాలుకు ఇచ్చిండు. వాటిని ఇంటిదాకా తీసుకుపోయి బొడ్డెమ్మకు పెట్టడానికి తెచ్చిన్నని చెప్తే అవి పనికిరావని చెప్పింది వాళ్ళమ్మ. లొట్టపీసు పూలు ముఖం మాడ్చినయి.
తెల్లారితే ఎంగిలి పూల బతుకమ్మ. బొడ్డెమ్మను నిమజ్జనం చేసే రోజు. పెండ్లీడుకొచ్చిన ఆడపిల్లలంతా సలువమ్మ దగ్గరికి వచ్చారు. అందరూ కలిసి బొడ్డెమ్మను పెట్టి చుట్టూ చేరి సలువమ్మ
“బొడ్డెమ్మ బొడ్డెమ్మ … కోల్..
బిడ్డాలెందారు… కోల్..
నీ బిడ్డ నీల గౌరీ.. కోల్.. “
అని పాడుతుంటే మిగతా వాళ్ళందరూ గొంతు కలిపారు. మురిపెం తీరిన తరువాత, పొద్దు వంగిన తరువాత బొడ్డెమ్మను నిమజ్జనం చేయడానికి చెరువు కట్ట కిందికి చేరారు. “యమునకు సంతోషమైంది. చెర్ల లొట్టపీసుపూలు మదిల మెదులుతున్నై. యమునను చూసుకోమని సలువమ్మ చెల్లెకు చెప్పింది. యమున సూపంతా దూరంగున్న లొట్టపీసుపూల మీదుంది. అయి కూడా యమునలాగే గాలికి అందంగా నవ్వుతున్నై. వాటి తలలు గాలికి ఊపుతూ పిలుస్తున్నట్లు అన్పించింది. ఒంటేలుకు పోతనని సాకుతోటి పదేళ్ళ యమున లొట్ట పీసు పూల కాడికెళ్ళింది. సలువమ్మ చెల్లె పాట మీది మోజుతోని పిల్ల సోయి మర్సింది.
సలువమ్మ బొడ్డెమ్మను చెరువులో వేసి “నిద్రబో బొడ్డెమ్మ.. నిద్రబోవమ్మా..” అంటూ మంగళ హారతి పాట పాడింది. ఇంతల ఒక పిల్ల “అక్కా! బొడ్డెమ్మకు, బతుకమ్మకు తేడా ఏంద”ని అడిగింది. “గంగా, గౌరీలలో గంగను కొలిసేది బొడ్డెమ్మ పండుగ. గౌరీని కొలిసేది బతుకమ్మ పండుగ.” అని చెప్పి సలువమ్మ గట్టు మీదికి వచ్చి యమున ఏదని చెల్లెను అడిగింది. “చెల్లె బిక్కమొగమేసింది. అందరి ముఖాల్లో సంతోషం కనుమరుగయింది. సలువమ్మ మనసు కీడు శంకిస్తుంది. ఆందోళన పెరిగింది. చీకటి కమ్ముకుంది. అమ్మలక్కలు చెర్వుపొంటి వెతుకులాటల పడ్డరు. సలువమ్మ చెల్లెను తిట్టుకుంట పిల్లను కూతేసుకుంట వెతుకుతుంది. ఎవలో గట్టిగర్సిండ్రు. లొట్ట పీసుపూల చెట్లల్ల శవం తేలుతుందని. సలువమ్మ పై ప్రాణాలు పైనే పోయాయి.
తన అన్న ఇద్దన్న తీసుకువస్తే అడివమ్మ కూడా బతుకమ్మ పండుగకు తన పెద్దమ్మ ఇంటికి వచ్చింది. పెద్దమ్మతో విసుర్రాయి ఇసురుతుంటే ఇద్దన్న వచ్చి నిన్న ఎల్లయ్య పంతులు లొట్టపీసుపూల చెట్ల మధ్య శవమై తేలిండని చెప్పిండు. తన సంసారాన్ని నిలబెట్టిన దేవుడు ఎల్లయ్య పంతులు నడుమంత్రాన ఎట్లా పోయిండని అడివమ్మ కుమిలిపోయింది. పోలీసోల్లు శివుడ్ని అనుమానించి అరెస్టు చేశారు. ఇంతకూ ఎల్లయ్య పంతులును ఎవరు చంపారు. బుద్ధిమాట చెప్పినందుకు శివుడు చంపాడా? ఎల్లయ్య పంతులు దగ్గర పని చేసే నౌకరు పాపయ్య చంపాడా? సలువమ్మ చంపిందా? యమున చంపిందా? అడివమ్మతోని అక్రమసంబంధం పెట్టుకొని ఎక్కడ బయట పడుద్దోనని ఎల్లయ్య పంతులు తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడా? చిక్కుముడి విడిపోవాలంటే మనం కూడా యమునలాగే లొట్టపీసుపూల చెరువులో దిగాల్సిందే.
సినిమాటిక్ గా సాగిపోయే ఈ కథలో రచయిత నేపథ్యంగా తెలంగాణ సాంస్కృతిక చిహ్నమైన బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలను హృద్యంగా చెప్పడం వల్ల ఇదొక మంచి కథగా రూపుదిద్దుకుంది. లేదంటే ఒట్టి క్రైం కథగా తేలిపోయేది. ఆడబిడ్డలకు తల్లిగారింటి చుట్టూ అల్లుకున్న ఆత్మీయ అనుబంధం, అక్క చెల్లెళ్ళ అనురాగం, పెండ్లీడుకొచ్చిన అమ్మాయిల పండగ సంబరం, బతుకమ్మ పాటల మాధుర్యం, ఎల్లయ్య పంతులు పెద్దీర్కం, పరోపకార బుద్ధి, భర్తను కాపాడుకొని పసుపు కుంకుమను నిలుపుకోవాలనుకునే భార్య ఆరాటం, నౌకర్ల మోసకారితనం, అమాయకులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న వైనం, పోలీసు వాళ్ళ కర్కశత్వం, విసుర్రాయి తిప్పడంలోని తన్లాట, పనికి రావనుకున్న లొట్టపీసు పూల ప్రాధాన్యం అన్నీ ఎంతో లోతుగా చిత్రింపబడ్డాయి.
కథలో శివుడు లొట్టపీసుచెట్లు కొట్టి గ్రామంలో తడికలు అల్లే ఎరుకలి కుటుంబానికి చెందినవాడు. అతని మద్యపాన దురలవాటు వలన అతనిపై ఒక చెడు అభిప్రాయానికి వచ్చి చిన్న చూపుకు గురైనట్టుగానే, లొట్టపీసు పూలు విషపూరితమనే ఒక్క కారణం చేత వాటిని దూరం పెడుతారు. మానవ జీవనంలో శివుడు, లొట్టపీసుపూలు రెండూ అస్పృశ్యతకు, అణగారిన వర్గాలకు ప్రతీకలు. తడికలు అల్లి సమాజానికి ఉపయోగపడే శివుడుపై నేరం మోపి చివరికి నిర్దోషి అని తేలినట్టే, దేవతలను పూజించడానికి బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలలో పనికిరావని తేల్చేసిన “లొట్టపీసుపూలు”తమ ప్రయోజనాన్ని చాటుకుంటాయి. సంతానాన్ని కాపాడే బొడ్డెమ్మ మహిమో ఏమోగాని కథలో యమున బతుకుతుంది.
పాత్ర చిత్రణలో రచయిత చూపిన నేర్పు అద్భుతమనిపిస్తుంది. ఎల్లయ్య, అడివమ్మ, శివుడు, సలువమ్మ, యమున, పాపయ్య, అడివమ్మ పెద్దమ్మ, సలువమ్మ చెల్లె, పాపయ్య భార్య ఇలా ఏ పాత్ర అయినా మన చుట్టూ సమాజంలో రోజు కనిపించే పాత్రలే. కథంతా మన ఊళ్ళో, మన కండ్ల ముందర జరిగినట్లే కనిపిస్తుంది. వాతావరణ చిత్రణ, సన్నివేశ దృశ్యీకరణలో రచయిత చూపిన శ్రద్ధ, కథంతా రచయిత మెయిన్ టేయిన్ చేసిన సస్పెన్స్, ఊహించని మలుపులు పాఠకులను వెంటాడుతాయి.
కథలో ప్రత్యేక ఆకర్షణ రచయిత వాడిన భాష, సందర్భానుసారంగా ఉపయోగించిన సామెతలు. జాతీయాలు. తెలంగాణ తెలుగులోని నాద సౌందర్యం కథంతా పర్చుకుంది. “పీనుగు పోతుంటే ఊరి కన్నీటితో పెద్ద చెర్వుల నీళ్ళు రెండింతలయ్యాయి”, “ఊరుకూరంతా అగ్గిబుక్కినట్టు శివుని గుడిసె మీద బడ్డరు.” లాంటి కవితాత్మక వాక్యాలు కథా గమనానికి బలాన్ని చేకూర్చాయి. కథ ఆసక్తిగా, సరళ శిల్పంలో పాఠకుడిని చేయి పట్టి వెంట తీసుకుపోయే తీరు నచ్చుతుంది. ఉత్తమ కథా లక్షణమేమిటంటే పాఠకుడు కూడా ఆలోచించే విధంగా, కథలో సంచరించే విధంగా కొంత ఖాళీని వదిలిపెట్టడం. అది ఈ కథలో పుష్కలంగా ఉంది.
తంగేడుపూలలాగే ‘లొట్టపీసుపూల’కు కూడా సాహిత్య గౌరవాన్ని కల్పించిన యువరచయిత, తెలంగాణ వర్తమాన కథకు గట్టి హామీ. తన కథల ద్వారా ఉపరాష్టపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు గారి మెప్పు కూడా పొందిన శీలం భద్రయ్య వృత్తిరీత్యా తెలంగాణా మోడల్ స్కూల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ గా పని చేస్తున్నారు. శీలం భద్రయ్య ఇటీవలనే “లొట్టపీసుపూలు” పేరుతోనే తన తొలి కథా సంపుటిని వెలువరించారు. అంతకు ముందు ‘అంకురం’, ‘యాస’ కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించారు. సాహిత్య కృషికి పలు పురస్కారాలు కూడా పొందారు.
*
“లొట్టపీసు పూలు” నేటి కథా ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాయి. పేరుతోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ పుస్తకం మార్కెట్ లో దొరకడం లేదు. రచయితను సంప్రదిస్తే త్వరలో వస్తాయని చెబుతున్నారు. కనీసం ఈ కథపై సమీక్ష ఇవ్వడం ద్వారా ఈ కథలు చదవాలనే మా కోరిక కొంత వరకు తీరింది.
“లొట్టపీసుపూలు” కథ ఆద్యంతం కుతూహలంగా ఉంది. ఇలాంటి కథ చదివి చాలా కాలమయింది. 90లలో ఇలాంటివి వారపత్రికలలో వచ్చేవి. వాటి కోసం ఆసక్తిగా ఎదురుచూసేది.
సంస్కృతి, సంప్రదాయాలు జీవన నాగరికతకు పట్టుకొమ్మలు. సొంత భాష జీవగర్ర. రచయిత కథాశిల్పం, శైలి, ఎంచుకున్న వస్తువు బాగుంది. ఇవి ఉత్తమ రచయితగా నిలబెట్టే లక్షణాలు. కథ విశ్లేషించిన విధానం బాగుంది. రచయితకు, సమీక్షకుడు శ్రీధర్ కు అభినందనలు.
భారత ఉపరాష్ట్రపతి అభినందనలు అందుకున్న పుస్తకం అనగానే సహజంగా ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తితో పుస్తకాన్ని తెప్పించి చదివాను. కథలన్నీ చాలా బాగున్నాయి. తెలంగాణ భాషలో రాసినా నాకు చక్కగా అర్ధం అయ్యాయి. టైటిల్ కథ లొట్టపీసు పూలు విశ్లేషణ చాలా బాగుంది. పాఠకులుగా మేము గ్రహించలేని విషయాలను చెప్పారు. థాంక్స్.
లొట్టపీసు పూలు కథారచయిత మా సహోద్యోగి. ఉత్తమ రచయిత మాత్రమే కాదు, ఉత్తమ ఉపాధ్యాయుడు. భాషాభిమాని. రచనావ్యాసంగాన్ని తపస్సుగా భావించే వ్యక్తి. వారు విద్యార్ధుల చేత కూడా సాహిత్య సృజన చేయిస్తాడు. వారికి సాహిత్యంలో ఇంకా గొప్ప పేరు వచ్చే అవకాశం ఉందని భావిస్తూ, లొట్టపీసుపూలు కథను స్థూలంగా వివరించిన శ్రీధర్ గారికి అభినందనలు.
లొట్టపీసు పూలు కథ అద్భుతమైన కథ. పత్రికల్లో కథలు చదువుతున్నప్పుడు కొన్ని కథలు నిస్సారంగా ఉంటున్నాయి. అర్ధం కాకుండా అయోమయ పరిచేవిగా ఉంటున్నాయి. సారంగలో మంచి కథలను వివరిస్తూ, ఆ కథను కూడా అందిస్తున్నారు. రచయితకు అభినందనలు
డాక్టర్ వెల్లండి శ్రీధర్ “లొట్టపీసు పూలు” కథను విశ్లేషించి రీతి, పల్లెటూరి తెలంగాణ యాస భాష ఆకృతి వర్ణించిన వైనం ఆసక్తికరముగా ఉంది. పాఠకుడిని ఉత్సాహభరితముగా చదివించేలా ఉంది మీ సాహిత్యము. తెలంగాణలో తెలుగు
పూలు పుయ్యాలని ఆశించుతూ….
సత్యం
సార్ నమస్తే….
“లొట్టపీసు పూలు”పుస్తక సమీక్ష, అవగాహన చాలా బాగుంది. ఈ పుస్తకంలో కొన్ని కథలు వివిధ పత్రికల్లో చదివాను. పుస్తకానికి ఆ పేరు పెట్టడానికి కారణాల్ని చక్కగా వివరించారు. ఈ మధ్య కాలంలో వెలువరించిన పుస్తకాల్లో “లొట్టపీసు పూలు” బెస్ట్ సెల్లర్ జాబితాలో చేరిపోవడం ఖాయం అనిపిస్తోంది. మీ వ్యక్తిత్వం కూడా నాకు చాలా నచ్చుతుంది. మీ లాంటి వారితో పరిచయం భాగ్యం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణా సాహిత్యంలో మీరు మరిన్ని మైలు రాళ్ళు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్నేహ హాస్తాన్ని సదా కోరుకునే…. మీ భాస్కరా చారి కషివోజ్జల💐
Superb.. Sir..🙏🏻🙏🏻🙏🏻👌👌👌🤩🤩🤩🤝🏻🤝🏻🤝🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻✨✨✨👑👑👑👌👌🙏🏻
Superb sir..keep it up…🙏🏻🙏🏻🙏🏻👑👑🥳🥳👌👌👌👌🤝🏻🤝🏻👍🏻👍🏻👍🏻🙂👌👌🙏🏻🙏🏻
Superb sir..keep it up…🙏🏻🙏🏻🙏🏻👑👑🥳🥳👌👌👌👌🤝🏻🤝🏻👍🏻👍🏻👍🏻🙂👌👌🙏🏻🙏🏻
లొట్టపీసు పూలు’ కథలు ఇటీవల సాహిత్య వాతావరణంలో హల్ చల్ చేసిన కథలు. తెలంగాణ చరిత్రను, వర్తమాన గ్రామీణ జీవితాన్నీ తగిన సాంస్కృతిక నేపధ్యం నుంచి ప్రవేశపెట్టిన కథ ఇది. ఆర్ధిక, సాంఘిక, రాజకీయ పార్శ్వాలను గ్రామీణ అట్టడుగు జీవితాల సాంస్కృతిక, వాస్తవికత ద్వారా చిత్రించటంలో కథకుడు తగిన కళా నైపుణ్యాలనూ, మెలకువనూ ప్రదర్శించాడు. పాఠకుల అంచనాలకు అందకుండా కథను నడపటంలో రచయిత చూపెట్టిన నేర్పరితనం వల్ల ఈ కథ బోరు కొట్టదు. కధనాన్నీ, సంభాషణలన్నీ అచ్చనైన గ్రామీణ తెలంగాణా సహజ నుడితో నింపటం రచయిత ప్రత్యేకతగా కన్పిస్తుంది. తెలంగాణ గ్రామీణ మాటలూ, పదాలూ, సామెతలూ, పలుకుబడులూ ఈ కధలో స్థానిక వర్షాన్ని కురిపిస్తాయి. కుల, వర్గ, లింగ దృక్పధంతో జీవితాన్ని చూస్తూ, అధిక సంఖ్యాకుల ఆర్తినీ, ఆకాంక్షల్నీ, తండ్లాటల్నీ, తిరుగుబాట్లనీ మెరుగైన తాజా శిల్పంతో నమోదు చేయడం కధకుని ప్రతిభను పట్టిస్తుంది. విశ్లేషణ చేసిన శ్రీధర్ గారికి అభినందనలు.
ఈ కథలో వాస్తవికత, కాల్పనికత సమపాళ్ళలో ఉంది. రచయితకు సామాజిక పరిశీలన, వ్యక్తుల పరిశీలనా ప్రతిభ బాగుంది. బాహుబలి సినిమాలో కట్టప్ప మాదిరి పాపయ్య పాత్ర ఉంటుంది.
శివుడు, పాపయ్య పాత్రలకు దురవ్యసనం ఉంది. కానీ శివుడు నిర్దోషి. పాపయ్య దోషిగా నిలబడుతాడు. చెడు వ్యసనం ఒక్కటే కారణం కాకపోవచ్చు. ఇంకా ఏదో కారణం కావొచ్చు. పాపని దుర్మార్గానికి కారణం… అధిపత్య కులాలపై అణిచివేతకు నిరసనగా ఒక బానిస చేసిన తిరుగుబాటు కావొచ్చుననిపిస్తుంది.
కథలో కవితాత్మక వాక్య నిర్మాణ శైలి బాగుంది. చెప్పాల్సిన లోతైన వాక్యాలు ఇంకా విస్తృతంగా ఉన్నాయి. విశ్లేషణ బాగుంది.
కథ బాగుంది. అభినందనలు
పాఠకులను సంసిద్ద పరుస్తూ ఆసక్తిని రేకేత్తిస్తూ, రచయిత చెప్పాలనుకున్న పాయింట్ ను చక్కగా ఇంజక్ట్ చేశారు. కథలో వస్తువు, గ్రామీణ పలుకుబడి, సంస్కృతి, వాక్య, కథా నిర్మాణంపై పూర్తి పట్టును ప్రదర్శించారు రచయిత.
వ్యాస విశ్లేషణ చక్కని అవగాహనతో కథను సమగ్రంగా విశ్లేషిస్తూ రాశారు. అభినందనలు.
కథ బాగుంది….. కథను ఆసాంతం చదివించేలా శ్రీధర్ గారి కథా పరిచయం మరియు విశ్లేషణ ఆసక్తికరం.
కథ మరియు విశ్లేషణ చాలా బాగుంది. లోతైన విషయాన్ని కథలుగా మలచడం రచయితలకే సాధ్యం. దాన్ని విప్పి చెప్పడం విమర్శకులకే సాధ్యమవుతుంది. అలాంటి వేదికగా నిలవడం సారంగకే సాధ్యం. అందరికీ అభినందనలు.
Super sir
గ్రామీణ భాషను వాడి మంచి కథ రాశారు. తెలంగాణ రాష్ట్రం రావడంతో ఇక్కడి భాషకు ప్రాముఖ్యత వచ్చింది.
తెలంగాణ తెలుగులోని నాద సౌందర్యం కథంతా పర్చుకుంది.👌