“ఇంకా ఎన్ని రోజులు ఈ కోర్స్ ఉంటుంది డాక్టర్ గారూ?”
“అది మీ మీదే ఆధారపడింది. నేను చెప్పిన విధంగా ఆలోచిస్తూ ఉంటే అతి త్వరలో ఈ స్థితి నుంచి బయటపడతారు.”
“తప్పకుండా డాక్టర్!”
****
పరబ్రహ్మం భారతీయ రైల్వేలో ఉద్యోగి. లోకో పైలెట్‌గా దాదాపు ముప్పై ఏళ్ల అనుభవం ఉంది. చిన్నతనంలోనే రైల్వే ఉద్యోగం సంపాదించి, అందులో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు గొప్ప లోకో పైలెట్‌గా పేరు పొందాడు. ఇంజన్‌ను షెడ్డు నుంచి స్టేషన్ ప్లాట్‌ఫాం వరకు తీసుకొచ్చే స్థాయి నుంచి ఇప్పుడు సూపర్ ఫాస్ట్ రైలు నడిపే దాకా ఎదిగాడు. అవిభక్త ఆంధ్రరాష్ట్రంలో అనేక చోట్ల పనిచేసి, చివరకు తిరుపతికి చేరాడు. మొత్తం తిరుపతి డివిజన్లోనే మంచి లోకోపైలెట్‌గా పేరు తెచ్చుకున్నాడు.
రైల్వేలో లోకో పైలెట్ స్థానం విశిష్టమైనది. రెలును నడపడం వారి పని. వృత్తిలో భాగంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, డ్యూటీ చేసిన ప్రతిసారి కొన్ని వేలమందిని వాళ్ళ గమ్యస్థానాలకు చేరుస్తారు. శారీరక, మానసిక సమస్యలు వారి వృత్తిలో భాగమైపోతాయి. ఇప్పుడంటే రైల్వేలో అధునాతన సాంకేతిక అభివృద్ధి జరిగింది కానీ, ఒకప్పుడు పరిస్థితి వేరు. ఏకబిగిన 8-10 గంటలు ఆ ఇంజనులో ఉండాలి. తిండి తినటానికైనా , కాలకృత్యాలు తీర్చుకోవటానికైనా కష్టమే! ఇంజనులో ఏదైనా లోపం వచ్చి ఆగిపోతే మొత్తం ప్రయాణికుల బాధ్యత వాళ్ల మీదే ఉంటుంది. ఆ ఆగిపోవటం ఏ అడవిలోనో అయితే ఇంకా జాగ్రత్తగా రైలును, అందులోని ప్రయాణికుల్ని చూసుకోవాల్సి ఉంటుంది.
ఎందరో ఆత్మహత్యలు చేసుకోవటానికి రైలు పట్టాలపై పడుకుంటారు. రైలు దగ్గరికి వచ్చేదాకా లోకోపైలెట్‌కి వాళ్ళు కనిపించరు. చివరి నిమిషంలో చూసి రైలు ఆపినా వారి ప్రాణాలను కాపాడలేని సంకట స్థితి. అటువంటి ఎన్నో చావుల్ని చూసి కూడా మొండిగా వృత్తిని కొనసాగించాల్సి ఉంటుంది.
సరిగ్గా పదేళ్ల క్రితం సంగతి ఇది! పరబ్రహ్మం అప్పుడు సికింద్రాబాదు డివిజన్లో పనిచేసేవాడు. ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును సికింద్రాబాద్-నాగపూర్ సెక్షన్ వరకు పరబ్రహ్మం తోలాల్సి వచ్చింది. బల్లహార్ష ఊరు దాటిన తర్వాత, రైలు 130 కి.మీల వేగంతో దూసుకుపోతూ ఉంది. ఆ సమయంలో అనూహ్యంగా రైలు పట్టాల మీద ఎవరో పడుకున్నట్టు పరబ్రహ్మానికి కనిపించింది. అంత వేగంతో వెళ్తున్న రైలును అప్పటికప్పుడు ఆపాలా? ఆపితే రైల్లో ఉన్న వెయ్యి మందికి ప్రమాదం! ఆ ఆలోచనతో రైలును ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. దగ్గరికి వచ్చాక తెలిసింది పట్టాలపై పడుకున్నది ఓ అమ్మాయి అని.
మరుసటి రోజు పేపర్లో ‘కుటుంబ కలహాలతో రైలు కింద పడి యువతి ఆత్మహత్య’ అని వార్త చదివి బాధపడ్డాడు. అప్పటి నుంచి పరబ్రహ్మం మనసు మనసులో లేదు. ఒకలాంటి చిత్రమైన వ్యథ అనుభవిస్తున్నాడు. ఆ అమ్మాయి తన వల్లే చనిపోయిందని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడప్పుడూ నిద్రపట్టక కొన్ని రోజుల పాటు ఇబ్బందిపడుతూ, ఇన్నాళ్ల తర్వాత చికిత్స కోసం డాక్టర్ చంద్ర దగ్గరకు వచ్చాడు.
చంద్ర తిరుపతిలో పేరున్న మానసిక వైద్యుడు. తన దగ్గరికొచ్చిన అనేక మందిని బాగు చేశాడు. ఇరవై ఏళ్లుగా ఆ వృత్తిలో ఉంటూ రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన చికిత్సా విధానాలు కొత్తగా ఉంటాయని అందరి అభిప్రాయం.
*****
“నేను చెప్పిన మందులన్నీ సరిగ్గా వేసుకుంటున్నారుగా?”
“ఏ ఒక్క రోజూ మర్చిపోకుండా వాడుతున్నాను డాక్టర్.”
“అలా అయితే మీరు త్వరలోనే మామూలు మనిషిలా అవుతారు. మీకున్న మానసిక స్థితి నుంచి కోలుకుంటారు.”
“నాకు నమ్మకం లేదు డాక్టర్! రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టక పోవటం, అది కలో, నిజమో తెలియకపోవటం, అప్పుడప్పుడు ఆ చనిపోయిన అమ్మాయి ఆకారం నిద్రలో కనిపించటం.. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి.”
“తరచుగా మీకు ఇటువంటి పరిస్థితి కలుగుతుంటే భయపడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో కానీ ఇలా అవ్వదు కదా? ధైర్యంగా ఉండండి. ఇప్పటిదాకా నేను చెప్పిన విధానాలన్నీ పాటించారు. ఇంకొన్ని రోజుల్లో మీరు ఈ స్థితి నుంచి కోలుకుంటారని నా గట్టి నమ్మకం.”
“మీ మీదే భారం వేసానండీ!”
“పరబ్రహ్మం గారూ! మీరు చేసే పని ఎంతో ధైర్యంతో కూడుకున్నది. అందరూ లోకోపైలెట్ అవ్వలేరు. అందుకు ఎంతో నైపుణ్యం ఉండాలి. మీ వృత్తిలో మీరు ఎదిగిన విధానం అభినందనీయం.రైలు నడుపుతున్నప్పుడు అందులో ఉన్న వెయ్యిమంది మీ బాధ్యత. ప్రతిసారీ మీరు డ్యూటీ ముగించి, మీ గమ్యస్థానానికి చేరుకున్నపుడు ఆ వెయ్యిమందినీ సురక్షితంగా చేర్చినట్టే! అందుకు మీరు గర్వపడాలి. ఇప్పటివరకు మీరు అటువంటి ఎన్ని డ్యూటీలు చేసుంటారు! అంటే ఎన్ని వేల మందిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చుంటారో ఆలోచించండి. మీరు చెప్పే ఆ దుర్ఘటనలో మీ ప్రమేయమేం లేదు. ఇప్పటికి మీరు వెళ్ళి రండి. నేను చెప్పిన తేదీకి మళ్ళీ ఒక సెషన్ ఉంటుంది. అప్పుడు తప్పక రావాలి.”
“అలాగే!”
చంద్ర తన అనుభవంతో పరబ్రహ్మం పరిస్థితిని అంచనా వేసి, ఈ సమస్య ఎప్పుడైతే పెరిగే సూచనలు కనిపిస్తాయో అప్పుడు ఉద్యోగం మానేయాలని పరబ్రహ్మానికి సూచించాడు. లోకో పైలెట్‌కు ఇటువంటి మానసిక సమస్య ఉందని తెలిస్తే అధికారులు వెంటనే అతణ్ని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. తనకు వచ్చిన ఈ సమస్య చాలా చిన్నదైనా, అది తీవ్రతరమైతే కచ్చితంగా భయపడాల్సిన విషయమే! అతని చేతిలో వెయ్యి మంది ప్రాణాలున్నాయి.
*****
పరబ్రహ్మం ఆరోజు ఉదయమే లేచి తన పనులన్నీ ముగించుకుని, ఇంటి ముందు వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. భార్య కాఫీ తెచ్చి పక్కనే కూర్చుంది.
“ఇవాళేంటి వార్తలు?” అంది.
“కొత్తగా ఏముంటాయిందులో? రోజూ ఉండేవే! అవే రాజకీయ కుట్రలు, పెరిగిన ధరలు, ప్రతిపక్షాల నిరసనలు, సినిమా కబుర్లు.. ఎప్పుడూ ఉండేవే! ఇవాళ పత్రికలో మన ఊరు గురించి వేశారు చూడు.”
“తిరుపతిలో నిన్న జరిగిన దక్షిణభారత అభివృద్ధి సదస్సులో ఆంధ్ర, తమిళనాడు ప్రభుత్వాల వివిధ శాఖల మంత్రులు పాల్గొన్నారు.’ ఇది మొదటి పేజీ ముఖ్యాంశం.
“ఆ సదస్సుల వల్ల మనకు ఒరిగేదేమీ లేదులెండి. ఇంతకీ మీరివాళ డ్యూటీకి ఎన్ని గంటలకు వెళ్ళాలి?”
“తొమ్మిదింటికల్లా నేను లోకో షెడ్డులో ఉండాలి. త్వరగా కానివ్వు, నేను తయారవుతాను.”
ఎప్పటిలాగే తయారై, వెళ్ళొస్తానని భార్యకు చెప్పి బయల్దేరి పరబ్రహ్మం ముందుగా రైల్వే లోకోషెడ్డు చేరుకున్నాడు. తను తీసుకెళ్లాల్సిన ఇంజన్‌ని ఒకసారి పరీక్షించాడు. అన్నీ సరిగ్గా ఉన్నాయో, లేదో చూస్కొని తన అసిస్టెంట్ కుమార్‌కు అతను చెయ్యాల్సిన పనులేంటో చెప్పాడు. తన ఇష్టదైవం వెంకన్నను మనసులో స్మరించుకుని, రైలింజన్‌ని లోకోషెడ్డు నుంచి తిరుపతి రైల్వేస్టేషన్‌కి నడిపించటానికి సిద్ధమయ్యాడు. ఇంతలో తనకు ఎవరో ఫోన్ చేశారని కబురొచ్చింది. ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ లోకో షెడ్డులోని ఆఫీసుకు వెళ్ళాడు.
“హలో! లోకో పైలెట్ పరబ్రహ్మం గారేనా?”
“అవునండీ! మీరెవరు?”
“నేను స్టేషన్ మాస్టర్ మూర్తిని మాట్లాడుతున్నాను.”
“అయ్యా! నమస్తే. ఇంజిన్ తీసుకొని నేరుగా స్టేషన్‌కి వస్తున్నాను. పది నిమిషాల్లో బోగీల్ని కలుపుకొని వచ్చేస్తున్నాను.”
“అది సరే! నేను అందుకోసం కాదు ఫోన్ చేసింది. ఇంకో ముఖ్యమైన విషయం మాట్లాడటానికి ఫోన్ చేసాను.”
“చెప్పండి. దేని గురించి?”
“నువ్వు ఇంజన్‌తో సహా బోగీల్ని కలుపుకొని స్టేషన్‌కి వచ్చాక నా ఆఫీసుకి వచ్చేయి. నేను ఇక్కడే ఉన్నాను.”
“ఇంజన్ రన్నింగ్‌లో ఉండగా, దాన్ని వదిలేసి ఎలా రావటం? అది రూల్స్‌కి వ్యతిరేకం కదా! మీకు తెలుసుగా?”
“నిజమే! నీ ఇంజిన్ ఎక్కడికీ వెళ్ళదు. నీ అసిస్టెంట్ ఉన్నాడుగా! అతను చూసుకుంటాడు. ఐదే ఐదు నిమిషాల పని. నువ్వేమీ కంగారు పడకు. నేను చూసుకుంటాను. నాదీ పూచీ.”
“అలాగే! ఇప్పుడే బయల్దేరుతున్నాను.”
తన అసిస్టెంట్ కుమార్‌ని మరొక్కసారి ఇంజన్ కండీషన్ గురించి విచారించి, అన్నీ సరిగ్గా ఉన్నాయని అనుకున్నాక ఇంజన్‌ను షెడ్డు నుంచి స్టేషన్ వైపుగా నడిపించాడు. మధ్యలో బోగిల్ని కలుపుకొని, పూర్తి రైలుగా మార్చి తిరుపతి స్టేషన్‌కి తీసుకొచ్చాడు. ఇప్పుడది తిరుపతి-కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ రైలు.
కుమార్‌కు ఇంజన్‌ని అప్పగించి, ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పి కిందకు దిగగానే, పదేళ్ల కిందట ఆ అమ్మాయి మరణించిన విషయం హఠాత్తుగా గుర్తొచ్చి ఇబ్బంది పెట్టింది. వెంటనే పక్కకు వెళ్లి, డాక్టర్ చంద్ర చెప్పిన మందులు వేసుకుని స్టేషన్ మాస్టర్ ఆఫీస్ వైపు నడిచాడు.
*****
ఆఫీస్ బయట కోలాహలంగా ఉంది. నలుగురు మనుషులు నిలుచుని ఉన్నారు. వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది రాజకీయ నాయకుల వెంట తిరిగే మనుషులని. పరబ్రహ్మం వాళ్ళని చూసుకుంటూ లోపలికెళ్ళాడు. స్టేషన్ మాస్టర్ మూర్తితోపాటు ఇంకో వ్యక్తి ఆఫీసులో ఉండటం గమనించాడు.
“అదిగో మాటల్లోనే వచ్చేశారు బ్రహ్మంగారు. రండి రండి” అన్నాడు మూర్తి.
“నమస్తే మూర్తి గారు! నన్ను రమ్మనారు. విషయం ఏంటి?” అని అడిగాడు పరబ్రహ్మం.
“ఆ విషయానికే వస్తున్నా! ఇదిగో వీరు సత్య గారు. ముఖ్యమంత్రికి బాగా కావలసినవారు. ఇవాళ మీరు డ్యూటీ చేసే తిరుపతి-కన్యాకుమారి రైలులోనే మదురై వరకు ప్రయాణించబోతున్నారు. వీరిని మీకు పరిచయం చేద్దామనే నా ఆఫీసుకు రమ్మంది. వీరిని జాగ్రత్తగా మదురై చేర్చాలి. అది మీ బాధ్యత.”
“వీరొక్కరే కాదు మూర్తి గారూ! రైల్లో ఉన్న వెయ్యి మంది బాధ్యతా నాదే. ఒక్కసారి నా రైలు ఎక్కిన తరువాత మంత్రైనా, మామూలు మనిషైనా నాకు ఒక్కటే! నా వృత్తి ధర్మం నేను చేస్తాను.”
“అది తెలుసునయ్యా! మన స్టేషనుకు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినపుడు ఇలా గౌరవించటం ఒక పద్ధతి. నీకు డ్యూటీ, ఇల్లు తప్ప మిగతావి పట్టవు” అని మూర్తి అంటున్న మాటలకు అడ్డుపడి సత్య వంక చూస్తూ “నమస్కారం సత్యగారూ! మిమ్మల్ని క్షేమంగా మదురై చేర్చే బాధ్యత నాది” అన్నాడు పరబ్రహ్మం. ఆ తర్వాత మూర్తి వైపు తిరిగి “మీరు ఆఫీసుకు రమ్మంటే ఏదో ముఖ్యమైన విషయం ఉంటుందని అనుకున్నాను. విషయం ఇదే అయితే మీరు ఫోన్లోనే చెప్పుండొచ్చు కదా! ఇంజన్ రన్నింగ్‌లో ఉంది. ఇక నేను వెళ్ళొస్తాను” అని అక్కడి నుంచి కదిలాడు.
అతని ప్రవర్తనను లోలోన తిట్టుకుంటూ “మీరేమనుకోకండి సత్యగారూ! మా పరబ్రహ్మం లోకం తెలియని మనిషి. మీకూ, మీ వాళ్లకూ ఫస్ట్ ఏసీలో సీట్లు రిజర్వు చేశాం. పదండి మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను” అన్నాడు మూర్తి.
*****
స్టేషన్ మాస్టర్ ఆఫీస్ నుంచి వస్తూ ఆ రోజు ఉదయమే దినపత్రికలో చదివిన ఒక వార్త గుర్తుచేసుకున్నాడు పరబ్రహ్మం.
“పబ్లిక్ సర్వీస్ ఉద్యోగ నియామకాల్లో అవినీతి. ముందుగానే ఉద్యోగాలను అమ్ముకున్న వైనం. ఇందులో ముఖ్యమంత్రి సమీప అనుచరుడి హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ప్రతిపక్షం..” ఆ సమీప అనుచరుడు ఎవరో ఇప్పుడు అర్థమయ్యింది.
ఇంజన్‌లోకి వెళ్ళి తన సీటులో కూర్చుని రైలు బయలుదేరటానికి స్టేషన్ మాస్టర్ ఇచ్చే సిగ్నల్ కోసం ఎదురుచూస్తూ సత్య గురించి ఆలోచించాడు. ‘ప్రభుత్వం పెట్టిన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి, అన్ని అంశాల్లో కష్టపడి చదివి, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో, వాళ్ళకి దక్కాల్సిన ఉద్యోగాలు వేరే ఎవరో అయోగ్యులకు ఇవ్వటం ఎంత పెద్ద తప్పు! ఎందరి జీవితాలతో ఆడుకున్నాడతను! వాళ్ళ కుటుంబాలు ఎంత క్షోభ అనుభావించుంటాయో! ఇటువంటి ఆరోపణలున్న వ్యక్తిని గొప్పగా నాకు పరిచయం చేయటం ఏమాత్రం బాగోలేదు..’ ఇలా అనుకుంటుండగానే రైలు బయలుదేరటానికి సిగ్నల్ వచ్చేసింది.
రైలుని ముందుకు నడిపించాడు. తిరుపతి, కన్యాకుమారి మధ్య 700 కి.మీల దూరం ఉంది. ఒక్కపుడు ఇదే దూరాన్ని పూర్తి చెయ్యటానికి ఒక రోజు పట్టేది. రైల్వేలో సాంకేతిక అభివృద్ధి కారణంగా ఇప్పుడు తొమ్మిది గంటల్లోనే పూర్తి చేయొచ్చు.
రైలు మెల్లిగా వేగం పుంజుకుని 120 కి.మీల వేగాన్ని అందుకుని దూసుకుపోతోంది. చిత్తూరు దాటేసింది. ఇంకొంతసేపట్లో తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో దూరంగా ఒక గుంపు రైలు పట్టాలపై నిల్చుని ఉండటం పరబ్రహ్మం కంటబడింది. కొందరు యువకులు పట్టాలపై నిలబడి ఏవో నినాదాలు చేస్తూ, చేతిలో ఏవో జెండాలు పట్టుకుని నిల్చున్నారు
వెంటనే అప్రమత్తమై వారిని హెచ్చరించటానికి హారన్ కొట్టాడు. దాన్ని లెక్కచేయకుండా అలానే పట్టాలపై నిల్చున్నారు. ఇప్పుడు రైలును ఆపితే మొత్తం ప్రయాణికులకు ప్రమాదం జరిగే పరిస్థితి. రైలు ఆగకుండా రావడం చూసి కొందరు పట్టాల నుంచి తప్పుకుని పక్కకు పరిగెత్తారు. వారిని చూసి పరబ్రహ్మం కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. పెనుప్రమాదం తప్పిపోయిందని అనుకున్నాడు. కానీ జరగాల్సిన ఘోరం ముందుంది. కొంతమంది పక్కకు తప్పుకున్నా ఇంకొందరు అలాగే పట్టాలపై పడుకుని ఉన్నారు. జరగబోయేదేమిటో అర్థమైంది.
ఆ క్షణం తనకు తెలుసు తన రైలు కింద పడి కొందరు చావబోతున్నారని. కానీ ఏమీ చేయలేని పరిస్థితి తనది. ఆ ప్రదేశంలో రైల్వేసిబ్బంది ఎవరూ లేరా? ఆ యువకులను పక్కకు లాక్కెళ్ళడానికి ఎవరూ రారా? అసలు ఎవరు వీళ్ళంతా? రైలు కిందే పడటం ఎందుకు? ఇలా ఆలోచించేలోపే రైలు కొందరి మీది నుంచి వెళ్ళిపోయింది. తన చేతిలో ఏమీలేదు.
కొద్దిదూరం వెళ్ళాక రైలును ఆపాడు పరబ్రహ్మం. అప్పటికే రైల్వే అధికారులకు విషయం చేరిపోయింది. మళ్ళీ రైలు బయలుదేరదీయమని సిగ్నల్ ఇచ్చారు. చేసేదేమీ లేక రైలుని ముందుకు నడిపించాడు. రైలు సేలం చేరిన తరువాత విచారణ కోసం అక్కడికొచ్చిన అధికారులకు జరిగిన విషయం చెప్పాడు. వారి చావుకు తానూ బాధ్యుడినే అన్న భావంతో కుంగిపోతూ, ఏం చెయ్యాలో తోచక ఇంజనులోని తన కుర్చీలో చతికిలపడ్డాడు.
ప్రాథమిక విచారణ తర్వాత రైలును ఆపాల్సిన పనిలేదని, కన్యాకుమారి చేర్చాలని అధికారులు ఆదేశించారు. తప్పదన్నట్టు రైలుని యథాప్రకారం ముందుకు నడిపించాడు. గంట ఆలస్యంగా రాత్రి ఏడింటికి రైలు మదురై చేరుకుంది. అక్కడ ఇరవై నిముషాల హాల్ట్. మధ్యాహ్నం మూర్తి పరిచయం చేసిన సత్య అక్కడ దిగి, స్టేషన్ నుంచి బయటికి వెళ్ళటం గమనించాడు పరబ్రహ్మం. మళ్ళీ రైలును కన్యాకుమారి వైపు నడిపించాడు. అరగంట ఆలస్యంగా రాత్రి తొమ్మిదిన్నరకి రైలు కన్యాకుమారి చేరుకుంది.
*****
అదే రోజు రాత్రి వార్తల్లో – “ఆంధ్రరాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్షల్లో జరిగిన అవినీతికి నిరసనగా కొందరు యువకులు చేపట్టిన రైల్‌రోకోలో విషాదం నెలకొంది. ఇందులో ముగ్గురు యువకులు ప్రాణాలర్పించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు ఒత్తిడి తెచ్చాయి”. ఆ వార్త విన్న వెంటనే అసలు నిందితుడెవరో అర్థమయ్యింది పరబ్రహ్మానికి. అన్యాయంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ పనిలో తానూ ఒక భాగమయ్యాననే బాధ. ఎవరో చేసిన అన్యాయానికి ఏ సంబంధం లేని తనలాంటి వాళ్ళు ఎందుకు ఈ వేదన అనుభవించాలనే ప్రశ్న. చనిపోయినవారికి న్యాయం దక్కుతుందా లేదా అన్న ఆలోచన. అన్నీ కలిసి అతనికి నిద్రపట్టనివ్వకుండా చేశాయి.
ఏది ఏమైనా, మరుసటి రోజు రైలును తానే నడపాలి. తిరుపతికి చేర్చాలి. మానసికంగా దృఢంగా ఉంటేనే రేపు రైలును నడపగలను అని తనకి తాను ధైర్యం చెప్పుకుని, చంద్ర చెప్పిన మాటలను గుర్తుచేసుకుని, నిద్రపోవడానికి ప్రయత్నించాడు.
మరుసటి రోజు రైలు తిరుపతి ప్లాట్‌ఫాం మీదకు వచ్చింది. జరిగిన దుర్ఘటన గురించి స్టేషన్ మాస్టర్ మూర్తి అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చి, ఇంటికి చేరుకున్నాడు పరబ్రహ్మం. జరిగిన విషయం భార్యకు చెప్పి, మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించాడు. ఎంతకీ నిద్ర రాలేదు. వెంటనే డాక్టర్ చంద్రకి ఫోన్ చేశాడు.
*
నాన్న అనుభవాలే నా కథలకు పునాది
* నమస్తే అజహర్ గారూ! మీ గురించి చెప్పండి.
నమస్తే! మాది నంద్యాల. పుట్టి పెరిగింది అక్కడే! తమిళనాడు శస్త్ర యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి, ఆ తర్వాత టీసీఎస్‌లో రెండున్నరేళ్లపాటు ఉద్యోగం చేశాను. ఆ తర్వాత అది మానేసి ప్రస్తుతం సివిల్స్‌కి సన్నద్ధమవుతున్నాను.
* సాహిత్యంతో మీకు పరిచయం ఎలా ఏర్పడింది?
మా నాన్న ఆర్టీసీ కండక్టర్‌గా పని చేసేవారు. అమ్మ ప్రైవేటు స్కూల్లో టీచర్. నాన్న సినిమాలు బాగా చూసేవారు. అమ్మ పుస్తకాలు బాగా చదివేది. వాళ్లిద్దరి వల్ల సినిమాలు, సాహిత్యం మీద ఇష్టం ఏర్పడింది. చిన్నప్పుడు చందమామ పుస్తకాలు, బాలసాహిత్యం బాగా చదివేవాడిని. అందుకు ముందుగా మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. నన్ను, మా అక్కను కూర్చోబెట్టి దినపత్రికల్లో వచ్చే సంపాదకీయాలు తప్పులు లేకుండా చదివించేది. అందువల్లే తెలుగు చదవడం మీద ఆసక్తి పెరిగింది. ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు మా అక్క చాందిని నాకు ‘సచిన్ జీవితచరిత్ర’ పుస్తకం కొనిచ్చింది. నేను ఇంజినీరింగ్‌కి వచ్చాకే తెలుగు సాహిత్యంలో క్లాసిక్స్ చదవడం మొదలుపెట్టాను. మొదట చేతన్ భగత్ నవలలు, ఆ తర్వాత మున్షీ ప్రేమ్‌చంద్ సాహిత్యం, ఆపైన చలం ‘మైదానం’, వంశీ గారి ‘మా పసలపూడి కథలు’.. అలా ఒకదాని తర్వాత ఒకటి చదివాను. ఆ తర్వాత అది అలా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం నా దగ్గర మూడు వందల పుస్తకాలున్నాయి.
* మీలో రచయిత ఉన్నారని ముందుగా గుర్తించిందెవరు?
ముగ్గురు. వాళ్లే నన్ను రాయమని ప్రోత్సహించారు. తమిళంలోని ‘పొన్నియన్ సెల్వం’ నవలని నాగరాజన్ కృష్ణమూర్తి గారు తెలుగులోకి అనువదించారు. ఆ నవలని ‘దాసుభాషితం’ వెబ్‌సైట్‌లో పెట్టినప్పుడు చదివాను. నాగరాజన్ కృష్ణమూర్తి గారితో మాట్లాడాలని చాలా ప్రయత్నించాను. మూడు నెలల తర్వాత ఒక మెయిల్ ఐడీ దొరికింది. దానికి ఒక మెయిల్ రాసి పంపాను. అయితే ఆ మెయిల్ ఐడీ రచయిత నాగరాజన్ కృష్ణమూర్తి గారిది కాదు. ఇండోర్ ఐఐఎంలో ఉండే ఒక ప్రొఫెసర్‌ది. ఆ విషయం తెలిశాక మళ్లీ కృష్ణమూర్తిగారి మెయిల్ ఐడీ కోసం ప్రయత్నం చేశాను. చివరకు ఆయన బ్లాగ్ అడ్రస్ తెలుసుకుని మెయిల్ చేశాను. ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడారు. నేను ఆ పుస్తకం గురించి రాసిన పద్ధతిని మెచ్చుకుని, నన్ను కథలు రాయమని ప్రోత్సహించారు. ఒకరకంగా నాలో రచయితకు బీజం వేసిన వ్యక్తి ఆయన. అలాగే, బండి నారాయణస్వామి గారి ‘అర్ధనారి’ నవల చదివి దాని గురించి Telugu Quoraలో రాశాను. అది ఆయనకు మెయిల్ చేశాను. నారాయణస్వామి గారు ఫోన్ చేసి అరగంట సేపు మాట్లాడారు. అనంతపురం వస్తే తప్పక కలవమన్నారు. Quoraలో పుస్తక వేదిక ద్వారా పరిచయమైన వాత్సల్య గుడిమళ్ళ గారూ నాలో కథకుడున్నాడని గుర్తించి, రచనల వైపు ప్రోత్సహించారు.
* ఇది మీ తొలి కథ కదా! ఈ కథ రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
మా నాన్న నంద్యాల-శ్రీశైలం దారిలో కండక్టర్‌గా పనిచేసినప్పుడు శ్రీశైలం ఘాట్ రోడ్డులో డ్యూటీ చేసేవారు. ఘాట్ రోడ్డులో బస్సు ప్రయాణం అంటే రకరకాల అనుభవాలు ఉంటాయి. చుట్టూ అడవి. పచ్చదనం. రాత్రిపూట ఏదైనా సమస్య వచ్చి మధ్యలో బస్సు ఆగిపోతే తెల్లారే దాకా అక్కడే బస్సులో ఉండిపోవాల్సిందే! ఆ టైంలో ఆడవి జంతువులు బస్సు దగ్గరికి వచ్చేవి. మా నాన్న ఈ అనుభవాలన్నీ మాతో పంచుకునేవారు. అవి నా మనసులో ముద్రపడిపోయాయి. నేను ఉద్యోగం చేసేటప్పుడు దేశంలో రకరకాల ప్రాంతాలు తిరిగాను. ఒకసారి సోమనాథ్ వెళ్లినప్పుడు అక్కడ ఒకాయన పరిచయమయ్యారు. ఆయనది హర్యానాలోని కురుక్షేత్ర. లోకోపైలెట్‌గా పనిచేశారు. తన వల్ల రైలు ప్రమాదంలో మరణించిన ఒక యువతి గురించి ఆలోచిస్తూ మానసికంగా ఆయన పడ్డ ఇబ్బంది గురించి నాకు చెప్పారు. నేను కథ రాయాలని అనుకున్నప్పుడు మా నాన్న చెప్పిన అనుభవాలు, ఆ లోకో పైలెట్ మానసిక వేదన గుర్తొచ్చాయి. రెండూ కలిపి వారం రోజుల్లో కథ రాశాను.
* ఇందులో ప్రధాన పాత్రకి ‘పరబ్రహ్మం’ అని పేరు పెట్టారెందుకు? అదేమైనా సెంటిమెంటా?
ఇంజినీరింగ్ చదివేటప్పుడు ‘పరబ్రహ్మం’ అని నాకో స్నేహితుడు ఉండేవాడు. చాలా అమాయకుడు. ఏదైనా కథలో అమాయక పాత్ర గురించి చదివితే నాకు అతనే గుర్తొస్తాడు. ఈ కథలోని ప్రధాన పాత్ర లోకం తెలియని అమాయకుడు. అందుకే ‘పరబ్రహ్మం’ అని అతని పేరు పెట్టాను.
* ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?
ప్రతివారికీ వాళ్ళ ప్రాంత కథలు చెప్పాలని ఉంటుంది. నాకు మా ఊరు, రాయలసీమలోని ప్రత్యేకతలు కథల రూపంలో చెప్పాలని ఉంది. అందుకు తగ్గట్టుగానే కొన్ని ఆలోచనలున్నాయి. కథలు రాయాలన్న ఆలోచనతో 60-70 అంశాలను నోట్స్ రాసి పెట్టుకున్నాను. వాటిని కథలుగా మార్చే ప్రయత్నం చేయాలి.
*
పాఠకులకి అసలు తెలియని లోకో పైలట్ జీవితం, ఉద్యోగంలోని మానసిక ఒత్తిడి.. గురించి కథ రాయడం, రాసిన తీరు బాగుంది. ఇలా సాహిత్య పరిచయానికి నోచుకోని మరిన్ని జీవితాల్ని, సమాజ కోణాల్ని కథలుగా మలచండి. మీ ప్రాంతపు కథలు రాయాలనే మీ కోరిక నెరవేరాలని ఆశిస్తూ.. All the Best.
మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు విజయ్ గారు. మరిన్ని మంచి కథలను రాయటానికి ప్రయత్నిస్తాను.
నాకు కథ చాలా నచ్చింది అజహర్ గారు. మీరు ఇలాంటి మంచి కథలు మరెన్నో రాయగలరు.
All the best!
మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు మనోహిత గారు.
Anna lokesh ni, superb anna story telling process 👌.
Thanks Lokesh.
మొదటి కథే అయినా చాలా అనుభవం ఉన్న రచయితలా రాశారు. కథను నడిపించిన శైలి మధురాంతకం రాజారాం వంటి వారిని తలపిస్తుంది.
మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు దర్పణం శ్రీనివాస్ గారు.