లాహిరీ నడి సంద్రమున…

1

ది చలికాలమేగాని ఓడ ప్రయాణిస్తున్నది మంచుకురిసే సముద్రాల గుండా కాదు. ఒక్క వర్షాకాలం తప్పిస్తే –  నిత్యం ఎండ కాసే హిందూ మహాసముద్రం అది. బాయిలర్ సూటు, హెల్మెట్ ధరించి టూల్ బాక్స్ చేత పుచ్చుకొని జూనియర్ ఇంజినీరు మహేశ్ డెక్ మీద నడుస్తూ ఉంటే ఎండ వెచ్చగా వొంటికి తగులుతూ హాయిగా ఉంది. గాఢమైన నీలంరంగులో సముద్రం తళతళలాడుతూ ఉంది; అక్కడక్కడా తెల్లటి నురగ. ప్రశాంతంగా ఉన్నప్పుడల్లా ప్రతీసారీ ఏదో కొత్తదనంతో పలకరిస్తుంది. తుఫానులో మాత్రం భయానకమే. కెరటాలు పెద్దగా లేవుగానీ గాలి విసురుకి రేగిన సన్నటి జల్లులు డెక్ ని తడుపుతున్నాయి. పక్కలకు నెమ్మదిగా ఊగుతూ, సముద్రతలాన్ని చీలుస్తూ ఓడ వేగంగా ముందుకి సాగుతోంది. ఇంజిన్ సృష్టిస్తూన్న కంపనలకు మెయిన్ డెక్ స్వల్పంగా అదురుతున్నది.

క్యాట్ వాక్ కి అటూ ఇటూ ఉన్న రెయిల్స్ ని పట్టుకోకుండానే మహేశ్ నడవగలుగుతున్నాడు. కొత్తగా వేసిన పెయింట్ వాసన వేస్తూన్న డెక్ మీద అతడు సేఫ్టీ షూస్ తో నిలకడగా అడుగులువేస్తూ ఫోక్సెల్ వైపుగా ముందుకి సాగుతున్నాడు. ఇంజిను రూము వేడిలో, పగలో రాత్రో తెలియని విద్యుత్కాంతులలో నెలల  తరబడి డ్యూటీ చేసే మహేశ్ కి అప్పుడప్పుడూ ఇలా డెక్ మీదకి రావడం కూడా ఒక ఆటవిడుపే.

కార్గో ట్యాంక్ లను శుభ్రపరచే కార్యక్రమంలో ఉన్న  డెక్ సరంగు, అతని ఓడ కళాసుల బృందం కనిపించారు. తెరిచి ఉన్న ట్యాంక్ మూతల చుట్టూ మూగి లోపలికి చూస్తున్నారు. మహేశ్ ని చూస్తూనే, డెక్ సరంగు ఖాన్,

“క్యా పాంచ్ సాబ్, కైసే ఆనా హువా? (ఏమిటిలా వచ్చారు?)” అంటూ పలకరించాడు.

“సెకెండ్ సాబ్ పంపించాడు. విండ్లాస్ స్టీమ్ ఇంజిన్ లో గ్లాండ్ పేకింగు మార్చాలి,” అని హిందీలో జవాబిచ్చాడు మహేశ్.

“సెకండ్ సాబ్ ఇత్నా జల్దీ ఆప్కో నహీ ఛోడెంగే (సెకెండ్ ఇంజినీరు ఇప్పట్లో నిన్ను వదలడులే)!” అన్నాడు సరంగు నవ్వుతూ.

నిజమే, తాను ఈ ఓడలోకి వచ్చి ఏడాది అవుతోంది. సెలవు అడిగితే ఇదిగో అదిగో అంటున్నారు. కానీ ఈ ఏడాది కాలంలోనే మంచి పనిమంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. సెకండ్ ఇంజినీరుకి నమ్మిన బంటుగా మారాడు. అందరితోనూ సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఇదే తన మొదటి ఓడ; ‘మొదట కష్టపడితే తరవాత అంతా సులభమేలే’ అంటారు సీనియర్లు. ఆ సాకుతోనే జూనియర్ ఇంజినీర్లని బాగా తోముతారు; రోజుకి పన్నెండేసి గంటలు పని చేయిస్తారు. ఒకసారి షిప్పులో జాయినయితే రోజూ పనే. ఆదివారం లేదు, దీపావళి లేదు, రంజాన్ లేదు, క్రిస్మస్ లేదు.

సరంగుని ఉద్దేశించి, “రాజు ఎక్కడున్నాడు?” అన్నాడు మహేశ్.

“ఇక్కడే, ట్యాంక్ లోపల ఉన్నాడు. మెషీన్ క్లీనింగ్ అయిపోయింది, తుడుపులు (మాపింగ్) అవుతున్నాయి.”

రాజు కూడా తెలుగువాడే. అసలు పేరు రాజారాం. కళింగపట్నంవాడు. సీమేన్ గా పనిచేస్తున్నాడు. ఆ ఓడలో వాళ్లిద్దరే తెలుగు వాళ్లు. తరచూ కలుసుకుంటూ, మాట్లాడుకుంటూ ఉంటారు. రాజు పాత పాటలు బాగా పాడతాడు. మౌత్ ఆర్గాన్ వాయిస్తాడు. ఘంటసాల అభిమాని. పాత తెలుగు సినీమా పాటల పుస్తకాలు వెంట తెచ్చుకున్నాడు. మహేశ్ తనకి ఇష్టమైన పాటల్ని పాడించుకుంటూ ఉంటాడు. రాజు వంటకూడా బాగా చేస్తాడు. మహేశ్ కేబిన్ కి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేసి తీసుకొస్తాడు. ఒకటి రెండు బీరు సీసాలు అందించడం వరకూ మహేశ్ వంతు. ఈ ఓడనుండి సెలవు మీద ఇంటికి వెళ్లగానే రాజు పెళ్లి చేసుకోబోతున్నాడు. తను తప్పకుండా పెళ్లికి రావాలన్నాడు. ఒట్టు వేయించుకున్నాడు. ఈ మధ్య రాజు నోట తరచూ వినిపిస్తూన్న పాట – ‘నా హృదయంలో నిదురించే చెలీ…’.

***

డెక్ మీద పని పూర్తి చేసుకొని కేబిన్ కి వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది. హడావుడిగా స్నానం చేసి యూనిఫాం వేసుకొని ఆఫీసర్స్ సెలూన్ కి పరుగు తీశాడు. డ్యూటీలో ఉన్న సెకెండ్ మేట్, థర్డ్ ఇంజినీరు తప్ప మిగతా ఆఫీసర్లంతా భోజనాలు చేస్తున్నారు. జూనియర్లకు కేటాయించే చిట్టచివరి టేబిల్ వద్ద కూర్చొని,  పక్కన ఉన్న డెక్ కాడెట్లను పలకరించాడు. సీనియర్ కాడెట్ – బక్షీ – సర్దార్; మహేశ్ కి మంచి స్నేహితుడు. కాడెట్లకి మద్యం సరఫరాపై నిషేధం ఉంటుంది గనక బక్షీ అప్పుడప్పుడూ మహేశ్ కాబిన్ కి వచ్చి చాటుగా ఓ బీరు తాగి పోతూంటాడు. తత్కారణంగా మహేశ్ తో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాడు; పైగా వాగుడుకాయి. సీనియర్ ల మధ్య సంభాషణలను, సంవాదాలను, కంపెనీతో, ఏజెంట్లతో రేడియో మెసేజీల ద్వారా కేప్టెన్, చీఫ్ ఇంజినీర్లు – నెరపే ఉత్తర ప్రత్యుత్తరాలను, ఇతర తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు  మహేశ్ కి చేరవేస్తూంటాడు.

మహేశ్ తన టేబిల్ మీద ఉన్న మెనూ కార్డుని పరికించి స్వీట్ కార్న్ సూప్ తీసుకురమ్మని స్త్యూవర్డ్ కి పురమాయించాడు. సూప్ తీసుకోవడం మొదలు పెట్టాడో లేదో – పని దుస్తులలో ఉన్న డెక్ సరంగు కంగారుగా సెలూన్ లోకి ప్రవేశించాడు; అతని మొహంలో ఆందోళన. మొదటి టేబిల్ వద్దకు వెళ్లి కేప్టెన్ నీ, చీఫ్ ఆఫీసర్నీ ఉద్దేశించి,

“సాబ్! అప్నా ఆద్మీ లోగ్ టేన్కీ మే గిర్గయా (మన మనషులు ట్యాంక్ లో పడిపోయారు).” అన్నాడు.

కేప్టెన్, అతనికి అటూ ఇటూ కూర్చున్న చీఫ్ ఇంజినీరు, చీఫ్ ఆఫీసర్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పరిస్థితి అర్థమైపోయింది.  తింటున్నది వదిలేసి ముగ్గురూ బయటకు ఉరికారు. మిగిలిన ఆఫీసర్లు వాళ్లను అనుసరించారు. ఒకరి వెంట ఒకరు మెయిన్ డెక్ వైపుగా ఏలీవే (కారిడార్) లో వడివడిగా నడుస్తున్నారు.

“సబ్ కో డెక్ మే టర్న్-టూ కరో,” అన్నాడు చీఫ్ ఆఫీసర్, సరంగుని ఉద్దేశించి.

“సబ్ లోగ్ ఉధర్ హీ హై సాబ్! (అంతా అక్కడే ఉన్నారు)”

“ఇంజిన్ క్రూ కో భీ బులావ్!” అన్నాడు చీఫ్ ఇంజినీరు లాహిరీ.

చీఫ్ ఆఫీసర్, సీనియర్ డెక్ కేడెట్ తో, “బ్రిడ్జ్ కి ఫోన్ చేసి, జనరల్ అలాం మ్రోగించమని సెకండ్ ఆఫీసర్ కి చెప్పు. ఇప్పుడే, అర్జెంట్!” అన్నాడు.

ఓడ అంతటా జనరల్ అలాం నిర్దయగా మ్రోగసాగింది. ఆ అవిరామ ప్రమాద ఘంటిక నేటి దుర్దినానికి సంకేతంలాగా మహేశ్ చెవులను సోకింది. అతని గుండె జోరుగా కొట్టుకోసాగింది. చెమటలు పట్టాయి. నోరు ఎండిపోయింది. ‘రాజు ఎలా ఉన్నాడో?’ ఇదే అతని ఆలోచన.

***

రాజుతో బాటు ఉస్మాన్ అలీ అనే రత్నగిరికి చెందిన మరో మహారాష్ట్ర సీమేన్, వాళ్లిద్దరినీ రక్షించబోయి జారిపడిన గుజరాతీ కసాబు – కనుభాయ్ పటేల్ – మొత్తం ముగ్గురు ట్యాంక్ లో పడి ఉన్నారు. ఆ ముగ్గురూ మహేశ్ తో బాటు ఆ ఓడలో ఏడాది క్రిందట ఇరాన్ లోని అబదాన్ రేవులో జాయిన్ అయిన వాళ్లే. మొత్తం సిబ్బందిని – ఆఫీసర్లనీ, క్రూ సభ్యులనూ – మార్చినప్పుడు బొంబాయినుండి అంతా కలిసి విమానంలో టెహరాన్ వెళ్లి అక్కడి నుండి బస్సులో అబదాన్ చేరుకున్న బృందంలోని వాళ్లే. అందుచేత వారందరి మధ్యా ఒక సంఘీభావం ఉన్నది.  నిజానికి వాళ్లంతా కూడా ఇక సెలవు మీద ఇంటికి వెళ్లిపోవాలని తహతహ పడుతున్నారు.

ట్యాంక్ లో పడిపోయిన ముగ్గురికీ స్పృహ తప్పి అరగంట అయిందని సరంగు చెప్పాడు. ఆక్సిజెన్ ఇరవై శాతంకన్నా తక్కువైతే ప్రాణం పోవడానికి పది నిమిషాలు చాలని అందరికీ తెలుసు.

“నసీబులో ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది,” అన్నాడు సరంగు ఏడుపు ఆపుకుంటూ.

“ఇంకేముంది? అంతా అయిపోయింది. ఖల్లాస్,” అన్నాడు అప్పుడే వచ్చిన థర్డు ఇంజినీరు. చీఫ్ ఇంజినీరు లాహిరీ అతడిని గుర్రుగా చూసి,

“నోర్మూసుకో! అయినా నువ్వు ఇక్కడికెందుకు వచ్చావ్? పోయి ఇంజిన్ రూములో ఉండు – నేను రమ్మనే దాకా. ఇంజిన్ లాగ్ బుక్ లో జరిగింది రాయాలి. డ్రాఫ్ట్ చెయ్యి, నేను చూస్తాను.” అని గర్జించాడు. థర్డ్ ఇంజినీరు మొహం మాడ్చుకొని వెళ్లిపోయాడు. నెమ్మదస్తుడూ, అందరికీ గౌరవపాత్రుడూ అయిన చీఫ్ ఇంజినీరు ఈ విధంగా విరుచుకుపడడం మహేశ్ కి ఆశ్చర్యం కలిగించింది.

ఆఫీసర్ల మధ్య మామూలుగా ఉండే కనీస మర్యాదలూ, స్నేహపూర్వకమైన సంబోధనలూ అడుగంటిపోవడాన్ని మహేశ్ గమనించాడు. అంతటా ఉద్రిక్తత ఆవరించింది. టెంపర్లు రాజుకుంటున్నాయి. కేప్టెన్ తో సహా సీనియర్లందరి నోటా ఇంగ్లీషు, హిందీ, పంజాబీ బూతులు ధారాళంగా వెలువడుతున్నాయి.

సెకండ్ ఇంజినీరు మహేశ్ ని ఉద్దేశించి, “పాంచ్ సాబ్, ట్యాంక్ వెంటింగ్ ఫ్యాన్ స్టార్ట్ చెయ్యి, త్వరగా!” అని కేకపెట్టాడు.

అది స్టీం టర్బైన్ తో నడిచే ఫ్యాన్. దాన్ని స్టార్ట్ చెయ్యడమంటే కనీసం అరగంట తతంగం. మహేశ్ పంప్ రూమ్ వైపుగా పరుగుతీసాడు.

వెంటింగ్ ఫ్యాన్ ని నడిపే స్టీం టర్బైన్ ని నెమ్మదిగా ఆవిరితో వేడిచేస్తూ మహేశ్ అనుకున్నాడు – ‘దీన్ని మొదటే ఎందుకు నడిపించలేదు? ట్యాంక్ లో ఆక్సిజెన్ శాతం ఎంత ఉన్నదో తెలుసుకోకుండా మనుష్యుల్ని ఎవరు వెళ్లనిచ్చారు?’

అయిదు నిమిషాలు కూడా కాలేదు. సెకెండ్ ఇంజినీరు పరుగెత్తుకుంటూ వచ్చి, “ఇంకా స్టార్టు చెయ్యలేదా?” అన్నాడు.

“అబ్బే! ఇంకో పావుగంటైనా పడుతుంది. టెంపరేచర్ బాగా పెరగాలి కదా,”

“ఆ, గాడిదగుడ్డు! ఎమెర్జెన్సీలో అవన్నీ చూడనక్కరలేదు. నువ్వు స్టార్ట్ చెయ్యి. నేను ఇంజిన్ రూమ్ కి ఫోన్ చేసి తీన్ సాబ్ కి చెబుతాను, బాయిలర్ ప్రెషర్ తగ్గకుండా చూడమని,” అని కార్గో కంట్రోల్ రూమ్ కి పరుగెత్తాడు.

***

తనతోబాటు ట్యాంక్ లోపలికి వెళ్లడానికి వాలంటీర్లు కావాలని కేప్టెన్ ప్రకటించగానే అక్కడున్న వాళ్లల్లో చాలామంది ఆఫీసర్లు, క్రూ సభ్యులూ చేతులెత్తారు. కేప్టెన్ ని ‘మేమున్నాం కదా, మీరు వెళ్లవద్దని’ వారించి, చీఫ్ ఆఫీసరు ముందుకొచ్చాడు.

చీఫ్ ఆఫీసరు, సీనియర్ కేడెట్ బక్షీ డ్రెస్ మార్చుకొని, వీపులకి గాలి సిలిండర్లు, మొహాలకు మాస్కులు, తలలకి హెల్మెట్లు  తగిలించుకొని ట్యాంక్ లోకి ప్రవేశించేసరికి మరో ఇరవై నిమిషాలు గడచిపోయాయి. మరో పదిహేను నిమిషాలయ్యాక రొప్పుతూ ట్యాంక్ బయటకి, డెక్ మీదకి వచ్చారు. చీఫ్ ఇంజినీరు తన పోలరాయిడ్ కెమేరా తో ఫోటోలు తీస్తున్నాడు.

“గాలి సిలెండర్లు ఖాళీ అయిపోయాయి. హడావుడిగా పైకి వచ్చేశాం,” అన్నాడు చీఫ్ ఆఫీసరు ఆయాసపడుతూ.

“ఎలా ఉన్నారు – ట్యాంక్ లో పడిపోయిన వాళ్లు?” కేప్టెన్ కంగారుగా అడిగాడు.

కాస్త ఊపిరి పీల్చుకున్నాక చీఫ్ ఆఫీసర్ వివరించాడు, “ఏమో – ఇప్పుడే చెప్పలేం. కిందంతా బురదగా, చిత్తడిగా ఉంది. కాలు జారి పడ్డాను. నిచ్చెనకు దగ్గరలో పడిపోయిన కసాబుకి లైఫ్ లైన్  హార్నేస్ తొడిగేందుకు నాలుగు సార్లు ప్రయత్నించాం. అయితే అది జారిపోతోంది. అతడ్ని కదిలించడానికి మాకు సాధ్యపడలేదు. చాలా బరువుగా ఉన్నాడు. నిచ్చెన మీదనుండి పడ్డాడు కదా, తలకు బాగా దెబ్బ తగిలింది, చాలా రక్తం పోయినట్టుంది,”

అందరి మనసుల్లోనూ ఒకటే ప్రశ్న – “ఎవరైనా ఇంకా బతికి ఉన్నారా?”. కానీ ఏ ఒక్కరూ బయటకు అనలేకపోయారు.

సిలిండర్లను మార్చారు. మరో పది నిమిషాలు గడిచిపోయాయి. రెండోసారి థర్డ్ ఆఫీసరు, బక్షీ వెళ్లారు.

రెండోసారి కూడా ఒట్టి చేతులతోనే తిరిగివచ్చారు. అయితే ఈసారి వాళ్లకొక కొత్త ఆలోచన వచ్చింది. ఫోల్డింగ్ స్ట్రెచర్ ఉపయోగిస్తే మనుషుల్ని బయటకు తీయడం సులభం అవుతుందని వాళ్లకు తట్టింది. ఆ ఏర్పాట్లకు మరో పావుగంట పట్టింది. మరో అరగంటలో ముగ్గుర్నీ బయటకు – మెయిన్ డెక్ మీదకి తీసుకురాగలిగారు. సమయం నాలుగు దాటింది.

మూడు శవాల్నీ పక్క పక్కనే పేర్చారు. సరంగు బిగ్గరగా ఏడవసాగాడు. అతన్ని కౌగలించుకొని కేప్టెన్ కూడా ఏడుస్తున్నాడు. అక్కడున్నవాళ్లందరికీ దుఃఖం ముంచుకొచ్చింది.

“యే కైసే హువా?…టేన్కీ మే సిరఫ్ ఖానే కా తేల్ థా? (ఇది ఎలా జరిగింది? టాంకులలో తీసుకొచ్చింది కేవలం వంట నూనే కదా?)” అంటూ  దుఃఖిస్తున్నాడు చీఫ్ ఆఫీసర్. నిజమే, బ్రెజిల్ నుండి బొంబాయికి సోయా ఆయిల్ తీసుకొచ్చారు. అది అక్కడ డిశ్చార్జ్ చేసి, ఖాళీ అయిన టాంకులతో మొజాంబిక్ బయిల్దేరారు – పెట్రోలియం ప్రోడక్ట్స్ లోడ్ చేసేందుకు.

మరి కాసేపట్లో ఇద్దరు గోవన్ స్ట్యువర్డ్ లు వచ్చి మృతులపై తెల్లటి దుప్పట్లు కప్పారు. మొహాలు మాత్రం కనిపిస్తున్నాయి. కళ్లు మూసుకుని నిద్రిస్తున్నట్లుగా ఉన్నారు – ప్రశాంతంగా, అన్నిటికీ అతీతంగా. సూర్యాస్తమయం అవుతోంది. నడి సంద్రంలో ఓడ తన సుదూర ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది.

***

ఆ రాత్రంతా క్రూ సభ్యులూ, కొంతమంది ఆఫీసర్లూ జాగారం చేశారు. హిందువులు భజనలు చేశారు. మహమ్మదీయులు, క్రైస్తవులు ప్రార్థనలు జరిపారు. రేవు చేరడానికి మరో వారం రోజులైనా పడుతుంది గనుక సముద్రయాన సాంప్రదాయం ప్రకారం ఆ ముగ్గుర్నీ జలసమాధి చెయ్యాలని కంపెనీతో సంప్రదించిన మీదట కేప్టెన్ నిర్ణయించాడు. ఆ ఏర్పాట్లలో భాగంగా శరీరాల్ని కేన్వాస్ గుడ్డలో పెట్టి కుట్టేసారు. కుట్టేముందు బరువైన పాత ఇనుప ముక్కల్ని లోపల ఉంచారు – తేలకుండా నీటిలోకి వెళ్లిపోయేందుకు. అప్పుడు క్రూలోని హిందువులు తమ నిరసన తెలియజేసారు. వాళ్ల తరఫున డెక్ సరంగు చీఫ్ ఆఫీసర్ కి విన్నవించుకున్నాడు–

“మౌలీం సాబ్! కేన్వాసు గుడ్డలో శరీరాల్ని చుట్టి కుట్టేసారు కదా! వాళ్ల ఆత్మలు ఎలా బయట పడతాయని హిందువులు ఆందోళన చెందుతున్నారు. వాళ్ల సూచన ఏమంటే, కేన్వాస్ సంచులకి కనీసం రెండు అంగుళాల కన్నం ఉంచాలి.”

చీఫ్ ఆఫీసర్ ‘అలాగే చేద్దాంలే’ అన్నాడు. పటేల్, రాజుల శరీరాలకు చుట్టిన కేన్వాసు సంచులకు కన్నాలు పెట్టారు. ఆ రోజు మధ్యాహ్నం షిప్పుని ఆపుజేసారు. అఫీసర్లంతా యూనిఫాంలో ఉన్నారు.  ఒక్కో శరీరం మీదా జాతీయ పతాకాన్ని కప్పి నీళ్లలోకి వదిలేముందు జెండాని పైకి లాగే విధంగా ఏర్పాటు చేశారు. అలా ఒక దాని వెంట ఒకటిగా మూడూ నీళ్లల్లోకి వెళ్లిపోయాయి. రెండు కేన్వాస్ సంచులనుండి గాలి బుడగలు ధారాళంగా వెలువడ్డాయి. ఆఫీసర్లు సెల్యూట్ చేశారు. హిందూ క్రూ దండాలు పెట్టుకున్నారు. ముస్లింలు అరచేతులు తెరిచి అల్లాను వేడుకున్నారు. క్రైస్తవులు శిలువ సంకేతాన్ని వేసుకున్నారు. బ్రిడ్జిపై డ్యూటీలో ఉన్న సెకెండ్ ఆఫీసరు ఓడ హారన్ ని సుదీర్ఘంగా మ్రోగించాడు. ఇంజిన్ ని స్టార్ట్ చెయ్యాల్సిందిగా ఇంజిన్ రూమ్ కి సందేశం వెళ్లింది. ప్రొపెల్లర్ తిరిగింది. ఓడ వెనుక భాగంలో నీళ్లు సుడులు తిరిగి నురగలు కక్కాయి. ఓడ భారంగా కదిలింది.

***

మొజాంబిక్ లోని మపూటో పోర్టు చేరడానికి వారం రోజులు పట్టింది. ఆ వారం రోజులూ ఓడలో ఉన్నవారందరికీ మహా దుర్భరంగా గడిచాయి. “ఈ ఘోరం ఎలా జరిగింది?” ఇదే అందరి ఆలోచన; సంభాషణ.

“కార్గో ట్యాంక్ వెంటింగ్ ఫ్యాన్ ముందుగానే ఎందుకు స్టార్టు చెయ్యలేదు? ట్యాంక్ లో ఆక్సిజన్ శాతం ఎంత ఉన్నదో పరీక్షించకుండా మనుష్యుల్ని లోపలికి ఎందుకు పంపారు?” ఈ ప్రశ్నలతో సతమతమవుతున్న మహేశ్ – ఎవరిని అడగాలో తెలియక చివరికి బక్షీని అడిగాడు.

“ఏముందీ, అంతకుముందున్న కార్గో వంటనూనే కదా అని చీఫ్ ఆఫీసరు ఆ జాగ్రత్తల్ని పట్టించుకోలేదు,” అని మరో వాక్యం చేర్చాడు బక్షీ – “ఇలా నేనన్నానని ఎవరితోనూ అనకు. పోర్టు చేరగానే ఎంక్వైరీ ఉంటుంది. వెంటింగ్ ఫ్యాన్ ముందే స్టార్టు చేసామని ఇంజిన్ లాగ్ బుక్ లో రాయమని చీఫ్ ఆఫీసర్ పట్టుబడుతున్నాడు. మీ బడా సాబ్ (చీఫ్ ఇంజినీరు) మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.”

మర్నాడు మపూటో చేరుతున్నామనగా మహేశ్ ని చీఫ్ ఆఫీసర్ తన కేబిన్ కి పిలిపించాడు. వెళ్లేసరికి అక్కడ సెకండ్ ఇంజినీరు, బక్షీ కూడా ఉన్నారు.

“మపూటో చేరగానే చనిపోయిన క్రూ సభ్యుల సామాన్లను సేకరించి వారివారి ఇళ్లకు పంపేస్తాం. రాజు సామాన్లు సర్దినప్పుడు నువ్వు కూడా దగ్గర ఉండాలి. మీ ఊరివాడే కదా. నీతో బాటు బక్షీ, డెక్ సరంగూ ఉంటారు.”

మహేశ్, అతని బాస్ అయిన సెకండ్ ఇంజినీరు వైపు చూసాడు, అనుమతి కోసం. బాస్ తల ఊపాడు.

తీరా రాజు కేబిన్ కి వెళ్లాకే తమకి అప్పజెప్పిన పని ఎంత దుఃఖభరితమో అర్థం అయింది. సీనియర్లు ఆ పనిని తమవంటి పిల్ల కాకులమీదకి నెట్టివేసి తప్పుకున్నారని కూడా బోధపడింది. బక్షీ మాత్రం, ఇదేదో రోజూ చేసే పనే అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు;  తన మొహం మీద ఏ భావమూ కనబడకుండా ఉండాలని తంటాలు పడుతున్నాడు. మహేశ్ అతడిని అనుకరించే ప్రయత్నంలో ఉన్నాడు. రాజు సామాన్లన్నింటినీ పోగుచేసి లిస్టు తయారు చేసే పని మొదలు పెట్టారు. రాజు కేబిన్ సహచరుడు అక్కడ ఉండలేక మరొకరి కేబిన్ కి మారిపోయాడు. రమ్మంటే రాలేనన్నాడు. డెక్ సరంగు, ‘మిగతా ఇద్దరి సామాన్లూ సేకరిస్తున్నాం, మీరిద్దరూ రాజు కేబిన్ పని చూడండి’ అన్నాడు.

టేబిల్ మీద వెంకటేశ్వరుడి పటం. టేబిల్ పై సొరుగులో పాస్ పోర్టు, సర్టిఫికేట్లు. ఒరిజినల్సు, ట్రూ కాపీలు. ఒక కవర్లో రెండువందల డాలర్లు; అవికాక ఇండియన్ డబ్బు సుమారుగా మూడువేల రూపాయిలు. ఒక మనీ పర్సు. ఒక మౌత్ ఆర్గాన్. రాజు పెళ్లి చేసుకోవాలనుకున్న రెండు జెడల అమ్మాయి బ్లాక్ అండ్ వైట్ ఫోటో – తలనిండా పూలతో, కాటుక కళ్లతో – అమాయకంగా చిరునవ్వు చిందిస్తూ. హాల్ టికెట్ నుండి చించినట్లు తెలుస్తోంది. అంతకు ముందొకసారి అతడు తనకు చూపించినదే.

“చూడు మహేశ్, ఇవేవో మీ భాషలో ఉన్నట్టున్నాయి.”

రెండో సొరుగులో బైండు చేసిన పాటల పుస్తకాలు. సంవత్సరం పాటు పేరుకుపోయిన ఉత్తరాల కట్టలు.

అట్టడుగున ఉన్న సొరుగులో మూడు ప్లేబాయ్ మేగజీన్లు. “అబ్బో, మీ రాజు తక్కువవాడేం కాదు – అమాయకంగా కనబడతాడు గానీ,” అని కన్ను గీటాడు బక్షీ. వాటిని విడిగా అట్టేపెడుతూ,

“వీటిని ఇంటికి పంపిస్తే ఏం బాగుంటుంది? ఇంట్లో వాళ్లు ఏమనుకుంటారు? మనమే ఉంచేసుకుందాం,” అన్నాడు.

మూడే మూడు సొరుగుల్లో రాజు ప్రైవేటు జీవితం మొత్తం బట్టబయలు అయిపోయింది. తాము రాజు ఏకాంతాన్ని భంగం చేస్తున్నట్లు, అతని ప్రైవెసీ మీద దొంగదాడి చేస్తున్నట్లు మహేశ్ కి అనిపించింది; అతను సిగ్గుతో ముడుచుకుపోయాడు.

ఒక పెద్ద సూట్ కేసు లోనూ, మరో చిన్న సంచిలోనూ మొత్తం సామాన్లు సర్దేసారు. సీలు వేసారు. డబ్బు ఉంచిన కవర్ని కూడా సీలు చేశారు. రెండు బ్యాగుల్నీ కామన్ రూమ్ లోకి మార్చారు. రాజు కేబిన్ ఖాళీ. మొన్న అతని శరీరం నీటి మూటగా  జారిపోయింది. ఈరోజు అతను వెంట తెచ్చుకున్న కొద్దిపాటి సామాన్లను మూట కట్టారు. తమ మధ్య అతనొకడు ఉండేవాడనేది ఇప్పుడొక జ్ఞాపకం మాత్రమే; అదీ కొద్ది మందిలోనే, కొంత కాలం వరకే. మొన్నటి వరకూ రాజారాం అనే పేరుతో చెలామణీ అయిన వ్యక్తి ఇపుడు ప్రమాదాల గణాంకాలలో చేరిపోయిన ప్రాణంలేని ఒక సంఖ్య.

క్యాష్ ఉన్న కవరు పైనా, వస్తువుల జాబితాపైనా సాక్షి సంతకాలు పెట్టి చీఫ్ ఆఫీసరుకి అందజేశారు.

***

మర్నాడు బీరు తాగడానికని మహేశ్ కేబిన్ కి వచ్చిన బక్షీ మామూలుగా తాగే ఒక గ్లాసుకన్నా మరొకటి ఎక్కువగా తాగాడు. ఎప్పుడూ హుషారుగా ఉండేవాడు ఆనాడు దిగులుగా ఉన్నట్లు కనిపించాడు. ‘ఏమీ పట్టనట్టు ఉంటాడుగానీ వీడిని కూడా ఈ ఏక్సిడెంటు దెబ్బ తీసింది’ అనుకున్నాడు మహేశ్. గ్లాసు కింద పెట్టి, బక్షీ అన్నాడు –

“నువ్వు ఎవరితోనూ అనకు. కేప్టెన్ కి కంపెనీ నుంచి ఒక రేడియో మెసేజి వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే – ‘ఏక్సిడెంటు విషయం తెలిసి విచారిస్తున్నాం. చనిపోయిన వారి కుటుంబాలకు తెలియపరిచాం. మపూటోలో జరగబోయే విచారణ మూలంగా ఎటువంటి జాప్యం జరగకుండా మేనేజ్ చెయ్యండి. లోడింగ్ సత్వరంగా పూర్తిచేసుకొని రెండో రోజుకల్లా బొంబాయి తిరుగు ప్రయాణం కట్టండి’. ఇంకో విషయం తెలిసింది. బొంబాయి చేరగానే చీఫ్ ఆఫీసర్ని ఇంటికి పంపించేస్తారు,”

“అంటే?”

“అంటే అతగాడి ఉద్యోగం ఊడినట్టే. సర్టిఫికేటు పోగొట్టుకున్నా ఆశ్చర్యం లేదు,”

“మరో సంగతి. వెంటింగ్ ఫ్యాన్ స్టార్టు చేసిన టైం విషయమై కెప్టెనూ, చీఫ్ ఇంజినీరూ ఘర్షణ పడుతున్నారు. ఎంక్వైరీ కమిటీకి మొత్తం చెప్పేస్తానని బడా సాబ్ బెదిరిస్తున్నాడు. తను తీసిన ఫోటోలు కూడా పెట్టి రిపోర్టు తయారుచేసాట్ట. రిపోర్టును అధికారులకు అందజేసినా ఆశ్చర్యపడనక్కరలేదు. ముక్కుకి సూటిగా పోయే రకం; మహా మొండిఘటం. అదే జరిగితే కేప్టెన్ ఉద్యోగం కూడా ఊడుతుంది.  ఏమవుతుందో చూడాలి.”

బొంబాయి రేవు చేరుకోగానే రెండు నెలలుగా హెడాఫీసులో పేరుకుపోయిన ఉత్తరాలు కట్టలు కట్టలుగా వచ్చాయి. అందరిలోనూ మళ్లీ ఉత్సాహపు ఛాయలు కనబడ్డాయి. తీరం వెంబడే మరో వోయేజ్ (సముద్ర యానం) చేసాక సెలవు మంజూరు అయిన వాళ్లు ఇళ్లకు వెళ్లిపోవచ్చని కబురు వచ్చింది.

అయితే ఎవరూ ఊహించని మార్పు ఒకటి సంభవించింది.  కంపెనీ యాజమాన్యం  చీఫ్ ఆఫీసర్ ని గానీ, కేప్టెన్ ని గానీ ఇంటికి  పంపించలేదు; చీఫ్ ఇంజినీరు లాహిరీ ని  ఉద్యోగం నుండి తొలగించారు.

 

2

సంఘటన జరిగిన పదిహేనేళ్లకి కాబోలు – చీఫ్ ఇంజినీర్ సర్టిఫికేట్ అప్ గ్రేడ్ ట్రైనింగ్ కని మహేశ్ కలకత్తా వెళ్లినప్పుడు తన మొదటి షిప్పులోని చీఫ్ ఇంజినీరు లాహిరీ అకాడెమీలో ప్రొఫెసర్ గా కనిపించాడు. జుత్తు బాగా నెరిసిందిగానీ ఫిట్ గా ఉన్నాడు. మహేశ్ ని ట్రైనింగ్ ఆఖరి రోజున వాళ్లింటికి డిన్నర్ కి పిలిచాడు. చీఫ్ ఇంజినీర్ భార్య మిసెస్ రీమా లాహిరీ, వారి తనయుడు నయన్ రంజన్ కూడా మహేశ్ కి షిప్పులో ఉండగా పరిచయమే. ఆమెను అందరూ రీమాదీ అని పిల్చేవారు. అందరితోనూ కలుపుగోరుగా ఉండేది; రబీంద్ర సంగీత్ బాగా పాడేది. నయన్ కి మహేశ్ చదరంగం నేర్పాడు.

ఆ సాయింత్రం పూట వైన్ బాటిల్ ఒకటి తీసుకొని ఆలీపూర్ లో ఉన్న లాహిరీ వాళ్ల ఫ్లాట్ కి టాక్సీలో వెళుతూంటే రీమాదీకి సంబంధించిన ఒక సంఘటన గుర్తుకొచ్చి మహేశ్ కి నవ్వు తెప్పించింది. ఆఫీసర్లు, క్రూ కలిసికట్టుగా జరుపుకున్న దివాలీ పార్టీ నాడు రీమా ‘పురానో సెయి, దినేర్ కొథా…’ అనే రబీంద్ర సంగీత్ మధురంగా పాడింది. మహేశ్ పట్టుబట్టి రాజు చేత తెలుగు పాటలు పాడించాడు. అతడు ‘నా హృదయంలో నిదురించే చెలీ…’ అని పాడగానే,

“అరె! ఇది మా బెంగాలీ పాట! ‘అమార్ స్వప్నే దేఖా రాజకన్యా థాకే…’, ‘సాగరిక’ అనే ఉత్తమ్ కుమార్ సినీమాలోది.  శ్యామల్ మిత్రో పాడాడు.” అనేసింది రీమా.

మహేశ్ కి చిర్రెత్తుకొచ్చింది. “ఇది పదహారణాల తెలుగు పాట. సందేహం లేదు. శ్రీశ్రీ రాశాడు. ఘంటసాల పాడాడు” అన్నాడు. రాజు కూడా వంత పాడాడు – “అవును మేడం, అది నాగేశ్వర రావు సినీమాలో పాట” అంటూ.

వెంటనే ఆమె ఆ బెంగాలీ పాటను పాడి వినిపించింది. మహేశ్ అవాక్కయిపోయాడు. నమ్మకద్రోహం జరిగినట్టుగా అనిపించింది. చిన్నతనంలో గాంధీగారు తెలుగువాడు కానే కాదనీ, ఆయనెప్పుడూ తెలుగులో మాట్లాడలేదనీ తెలుసుకున్నప్పుడు ఎంత క్షోభకి గురయ్యాడో, మళ్లీ అంతగా బాధపడ్డాడు.

మహేశ్ టాక్సీ దిగాడు. జాగ్రత్తగా పెంచి పోషించిన గడ్డి తివాసీల మధ్య విరిసిన పూలమొక్కల నడుమ కాలపు కోరలకు చిక్కకుండా నిబ్బరంగా నిలుచున్న అలనాటి భవంతులతో నిండిన వీధి అది. ఆ సాయంత్రం పూట – అస్తమిస్తూన్న సూర్యుని పచ్చని బంగారు కిరణాలను భవనాల అద్దాలు, చెట్ల వెనుకనుండి ప్రతిఫలిస్తున్నవి. చిన్నగా చలి, పల్చటి పొగమంచు. అంతటా గుబురుగా చెట్లు; గూళ్లకు చేరుకుంటూన్న పక్షుల కలకల ధ్వనులు.  పాత కలకత్తా నగరం తన సొగసుని ఎవరి కంటా పడకుండా దాచుకుంటోంది ఈ కాలనీలో. కొత్త డబ్బుతో నిర్మించే ఆధునిక కట్టడాలలోని జాణతనం అక్కడ కానరాదు.

పాతకాలపు కటకటాల లిఫ్టు ఎక్కి మూడో అంతస్తులో ఉన్న లాహిరీ ఇంటి ముంగిటకి చేరుకున్నాడు. పిలిచే గంటను నొక్కాడు. లోపల ఎవరో హార్మోనియం వాయిస్తూ సంగీత సాధన చేస్తున్నారు. లాల్చీ, షరాయిలో ఉన్న లాహిరీ తలుపు తీశాడు. ఆప్యాయంగా పలకరించి కౌగలించుకున్నాడు. డ్రాయింగ్ రూములో రీమా హార్మోనియం వాయిస్తూ పిల్లలకు సంగీత పాఠాలు నేర్పుతోంది. గోడకి పెద్ద సైజు టాగోర్ ఆయిల్ పెయింటింగ్. రీమాలో వయోభారం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది; చురుకుదనం తగ్గింది.  మహేశ్ ని చూడగానే లేచివచ్చి, ఆత్మీయంగా కరస్పర్శ చేసి, భుజాన్ని తాకుతూ పలకరించింది  –

“ఎలా ఉన్నావు మహేశ్? నిన్ను చూసి ఎంతో కాలం అయిపోయింది. పెద్దవాడివి అయిపోయావు. చీఫ్ ఇంజినీర్ వి అయ్యావట కదా? కంగ్రాచ్యులేషన్స్! మీరు మాట్లాడుతూ ఉండండి, అయిదు నిమిషాలలో ఈ పిల్లల్ని పంపించి వచ్చేస్తాను,”

“పద, మనం లోపలికి వెళ్దాం,” అని లివింగ్ రూమ్ వైపుకి దారితీశాడు లాహిరీ. తను తెచ్చిన వైన్ సీసాని అతనికి అందజేశాడు మహేశ్.

“ఇవన్నీ ఎందుకు మన మధ్య?” అంటూనే సీసాని పరికించి, “రీమాకి ఈ రెడ్ వైన్ నచ్చుతుంది,” అని స్వీకరించాడు. వైన్ లాకర్ లోపల్నించి తీసిన స్కాచ్ బాటిల్ ఓపెన్ చేసి ఇద్దరికీ పోశాడు; తన భార్య కోసం వైన్ గ్లాసులో మహేశ్ తెచ్చిన వైన్.

రీమాదీ ని ఉద్దేశించి, “మీ మహేశ్ భాయ్ నీ కోసం రెడ్ వైన్ తీసుకొచ్చాడు,” అన్నాడు లాహిరీ, బెంగాలీలో.

ఆమె ఒక సిప్ తాగి, “నేను కొంచెం వంట సంగతి చూడాలి…మహేశ్, నువ్వు చేపలు తింటావు కదా?”

“బెంగాలీ వాళ్ల ఇంటికి భోజనానికి వచ్చి చేపలు తిననంటే ఎలా కుదురుతుంది, దీదీ?”

ముగ్గురూ నవ్వుకున్నారు. వంటింట్లోంచి ఆవనూనె వాసన ఘాటుగా వస్తోంది.

మరి కాసేపట్లో వారిద్దరి సంభాషణ వారు పని చేసిన ఓడలోని సహోద్యోగుల వైపు, అలనాటి దుర్ఘటన వైపు మళ్లింది.

లాహిరీని ఉద్యోగం నుండి తొలగించాక ఏం జరిగిందో అనే కుతూహలం మహేశ్ లో ఉన్నది. ఆయనే చెప్పుకొచ్చాడు.

“కొన్నాళ్లు ఇంటిపట్టునే ఉన్నాను. నా రిపోర్టు కాపీలను కొంతమందికి పంపించాను. ఎటువంటి స్పందనా రాలేదు. ఒక స్నేహితుడి సహకారంతో మంచి యూరోపియన్ షిప్పింగ్ కంపెనీలో ఉద్యోగం దొరికింది – చీఫ్ ఇంజినీరుగానే. జీతం ఐదు రెట్లు పెరిగింది; అది కూడా డాలర్లలో. ఇన్కంటాక్స్ లేదు. పదేళ్లపాటు అక్కడే పని చేసాను. తంతే బూరెల గంపలో పడ్డట్టు అయింది నా పని. అలా గడించిన డబ్బుతోనే ఈ ఫ్లాట్ కొన్నాను. పిల్లల్ని పై చదువులకి విదేశాలకు పంపగలిగాను. అయితే అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. జర్మన్లతో పని చెయ్యడం వల్ల ఒక ప్రొఫెషనలిజం అలవడింది. ముఖ్యంగా సేఫ్టీ (భద్రత) విషయంలో. చెప్పడానికి చాలా వివరాలూ, సంఘటనలూ ఉన్నాయి గానీ, మనకీ వాళ్లకీ మధ్య ఉన్న ప్రధానమైన తేడాల గురించి చెబుతాను. అ దేశాల వారిది సమస్యలకు ఎదురు వెళ్లి వాటిని సమూలంగా పరిష్కరించే మనస్తత్వం; మనది పూర్తి స్థాయి వినాశనం అయ్యేవరకూ ఏమీ జరగనట్లు నటించే తత్వం. అందుకే వాళ్లు సమస్యలనుండి నేర్చుకుంటూ ముందుకి సాగుతారు; మనం చేసిన తప్పులే మళ్లీమళ్లీ చేస్తూంటాం,”

“మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంది.”

“బంగ్లాదేశ్, బీహార్ నదీ జలాల్లో ఇప్పటికీ జరిగే పడవ ప్రమాదాలను చూడు. అదే టైటానిక్ విషయంలో ఏమి జరిగిందో మనందరికీ తెలుసు. లైఫ్ బోటు కెపాసిటీ దగ్గరనుండీ, రేడియో కమ్యూనికేషన్ వరకూ సమూలమైన మార్పులు, చట్టాలు వచ్చాయి. నిజానికి టైటానిక్ కన్నా కూడా ఎక్కువ ప్రాణ నష్టం కలిగించిన ప్రమాదాలు ఆఫ్రికా తీరంలోనూ, ఫిలిప్పైన్స్ లోనూ జరిగాయి. వాటిని పట్టించుకొనే నాధులు లేరు. కొన్ని దేశాల్లో ప్రాణాలకు విలువలేదనే మాట నిజం అనిపిస్తుంది ఒక్కోసారి”,

“మరీ అంత నిరాశపడనక్కరలేదు సార్! ప్రపంచవ్యాప్తంగా భద్రతా వ్యవస్థల్లో మార్పులు వచ్చాయి కదా?”

“నిజమే. అయితే అవి ప్రధానంగా ఎగువ నుండి రుద్దబడినవి. మన మనుష్యుల లోపల్నించి వచ్చినవి కాదు. లోపం మన చదువుల్లోనో, పెంపకంలోనో, లేక ‘అంతా రాసిపెట్టినట్టే జరుగుతుంది, మనం నిమిత్త మాత్రులం’ అనే విశ్వాసంలోనో, మన వనరుల కొరతలోనో  – ఎక్కడో ఉంది. మూలాలకి వెళ్లాలి. అందుకే ఎకాడెమీలో చేరాను. ఈ అంశాలపై కొన్ని పరిశోధనలు,  ప్రాజెక్టులు మొదలుపెట్టాను. నా కెరీర్ చివరి దశలోనైనా ఈ దిశలో పని చెయ్యగలనేమో అని,”

“ఇప్పటివరకూ ఏం తెలుసుకున్నారు?”

“ముఖ్యంగా రెండు విషయాలు తెలిసాయి. మన మేనేజర్లు, ఇంజినీర్లు ఏకాకి వ్యక్తులుగా, కెరీరిస్టులుగా, యాజమాన్యం చేతుల్లో కీలుబొమ్మలుగా చాలా తొందరగా మారిపోతారు. వృత్తి బాధ్యతలలో పాటించాల్సిన విచక్షణని గాలికొదిలేస్తారు.”

నాలుగు డబ్బులు కనబడగానే అంతా తమ ప్రయోజకత్వం అని విర్రవీగే వాళ్లు చాలామంది తెలుసు మహేశ్ కి.

“…ఇక రెండోది – పుస్తకాల్లో, ట్రైనింగులో నేర్చుకొనేది వేరు, నిజ జీవితంలో, పనిలో అమలు చేసేది వేరు అనే ద్వంద్వ భావం మన వాళ్లల్లో చిన్నతనంలోనే ఏర్పడిపోతుంది. సిద్ధాంతం, ఆచరణా రెండూ కూడా ఒకే గొలుసులోని లింకులుగా ఉండాలనే ఆలోచన తక్కువ”.

మహేశ్ కి చిన్నప్పుడు స్కూల్లో ‘మా బడి’, ‘మా ఇల్లు’ అనే పాఠాలు, వాటికి వేసిన అందమైన బొమ్మలు – అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉండిన అతని బడి, ఇల్లు గుర్తుకొచ్చాయి. పుస్తకం వేరు, వాస్తవం వేరు అనే గ్రహింపు అతనికి అప్పుడే ఏర్పడిపోయింది – అందరిలాగే.

“మరి దీనికి పరిష్కారం?”

“ఒక స్థాయికి ఎదిగాక పనితనం, పరిజ్ఞానం సరిపోవు. సాటి మనుషుల పట్ల గౌరవం, చేసే పని అంటే స్వాభిమానం ఉండాలి. ఎక్కడున్నా, ఏం చేసినా మనం సమాజంలో భాగం అనే ఎరుక ఉండాలి. మీ సంగతి నాకు తెలియదుగానీ, ఈ విషయంలో మా బెంగాలీలకు సాహిత్యం, సంగీతం – వీటి ద్వారా సమాజంతో సంబంధాలు కొనసాగేందుకు మాత్రం కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. అలాగని మావాళ్లంతా సాంస్కృతిక సైనికులని అనను,”

“నాకర్థం కాలేదు,”

“ఉదాహరణకి – రబీంద్ర సంగీత్, నజ్రుల్ గీత్ తెలియని బెంగాలీలు ఉంటారని అనుకోను. కనీసం స్కూలు వరకూ చదువుకున్న వాళ్లకయితే బంకిం, శరత్, టాగోర్, బిభూతి భూషణ్, సత్యజిత్ రే, ఇంకా ఇతరుల రచనలతో తప్పకుండా పరిచయం ఉంటుంది. చిన్నప్పుడే ఈ అభిరుచి, ప్రవేశం ఏర్పడితే అవి జీవితాంతం కొనసాగుతాయి. మనుష్యుల పట్ల సున్నితత్వానికీ, సమాజంతో సంబంధాలు కొనసాగించడానికీ ఇవి బాగా ఉపయోగపడతాయి. పైగా మా వాళ్లు కొంచెం అవేశపరులు; అనుబంధాలు కూడా ఎలాగూ ఎక్కువే,”

“మా వాళ్లుకూడా అవేశపరులే గాని మా అనుబంధమంతా సినిమాలతోనే లెండి. భాష, సాహిత్యం, సంగీతం – స్వయంగా నిలదొక్కుకొనే అవకాశం మాకు చాలా తక్కువ. రేడియో ప్రభావం ఉన్నంతకాలం కొంత ఉండేది,”

వంటింట్లోంచి బయట పడ్డ రీమా, చేతులు తుడుచుకుంటూ అందుకుంది, “అవును కదా? అందుకే మీ రాష్ట్రాలలో అయితే సినీమా నటులు ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయిపోతారు!”

ముగ్గురూ మరోసారి నవ్వుకున్నారు.

“మీ అబ్బాయి నయన్ ఎలా ఉన్నాడు? నాన్నలాగే షిప్పులో ఇంజినీర్ ని అవుతాననే వాడు, చిన్నప్పుడు,” నయన్ రంజన్ అని లాహిరీ దంపతుల ఏకైక పుత్రుడు. మహేశ్ తో బాటు ఓడలో ఉన్నప్పుడు అతడి వయస్సు ఎనిమిదేళ్లు.

“వాడికేం, బాగానే ఉన్నాడు. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు; షిప్పులో జాయిన్ అవుదామనే అనుకున్నాడు మొదట్లో. కానీ కుదరలేదు. సాఫ్ట్ వేర్ లో చేరాడు. ‘ ఈరోజు క్లయంట్ తో టెలీ కాన్ఫరెన్స్ ఉంది, ఆలస్యంగా వస్తాను’ అన్నాడు,”

“మనం తినేద్దాం. వాడి కోసం చూడొద్దు,” అంది రీమా, వంటింట్లోకి వెళుతూ.

“అతనికి షిప్పులో పనిచెయ్యాలని ఇంకా ఆసక్తి ఉంటే చెప్పండి, మా కంపెనీలో ట్రెయినీగా చేర్పించే ఏర్పాటు చేస్తాను,”

“ఇప్పుడా టాపిక్ వద్దులే.” అనేసాడు లాహిరీ, గొంతు తగ్గించి – రీమాకి వినిపించకుండా.

మహేశ్ ఏదో అనబోతూంటే సౌంజ్ఞ చేసి వారించాడు.

భోజనాలయ్యాక రీమాని పాట పాడమని అడిగాడు మహేశ్. ఆమె హార్మోనియం తీసుకొచ్చి ‘జఖోన్ పోర్బెన మార్ పాయేర్ చిహ్నో ఎయ్ బాటే…(ఇక పడబోవు నా పాద చిహ్నాలు ఈ బాటపై…)’ అనే రబీంద్ర సంగీత్ పాటని హృద్యంగా పాడింది. పాట మధ్యలో లాహిరీ లేచి వెళ్లి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె భుజం చుట్టూ తన చేతిని ఉంచాడు – మృదువుగా. ఈ పాటకూడా మహేశ్ కి బాగా తెలుసు. ఇష్టం కూడా. ముఖ్యంగా చివరి చరణాలు –

‘మళ్లీ ఆ ప్రభాత వేళల్లో నీ చెంతనే నేను ఉండనని ఎవరన్నారు?

నన్ను మరో పేరుతో పిలుస్తావు, అంతే.

మరోసారి మనం ఈ దారుల్లోనే సంచరిస్తాం,

చిన్ననాటి ఆటలు ఆడుకుంటాం,

… … … …

ఇప్పుడు మాత్రం నన్ను గుర్తు చేసుకోకు, ప్రియతమా –

అదిగో, ఆ సుదూర నక్షత్రాలనుండి వెనుతిరిగి రమ్మని నను పిలువబోకు’

 

మహేశ్ బయిల్దేరాడు.

“టాక్సీ స్టాండుదాకా దింపి వస్తాను,” అన్నాడు లాహిరీ తన భార్యతో.

“కారు తియ్యకు. అసలే తాగి ఉన్నావు,”

“అబ్బా!… నాకు చెప్పాలా? నడిచే వెళతాంలే,”

“మహేశ్, మళ్లీ వచ్చినప్పుడు నీ భార్యనీ, పిల్లల్నీ తీసుకురావాలి. ఒక్కడూ రావడం కాదు. ప్రామిస్,” అని మహేశ్ చేతిని తన చేతిలోకి తీసుకుంది రీమా. లిఫ్టు వరకూ వచ్చి, భర్తకి శాలువ అందజేసి, మహేశ్ కి వీడ్కోలు చెప్పింది.

లిఫ్టు దిగుతూంటే ఒక యువకుడు ఎదురయ్యాడు. అతడు క్రచెస్ సహాయంతో నడుస్తున్నాడు. కుడి కాలు తొడ వరకే ఉంది.   లాహిరీ అతన్ని, “వీడే మా అబ్బాయి, నయన్. చిన్నప్పుడు చూశావు. గుర్తు పట్టావా?” అని పరిచయం చేసాడు.

“నయన్, ఈయనే మహేశ్. గుర్తున్నాడా? నీకు చాకలెట్లు తెచ్చిస్తుండేవాడు; నీకు చెస్ నేర్పించాడు,”

“ఎంత పెద్దవాడివి అయిపోయావు, నయన్?! మీ అమ్మగారు కోక్ తాగనివ్వుడం లేదని నా కేబిన్ కి వచ్చి తాగేవాడివి, చెస్ ఆడినంతసేపూ!”  అన్నాడు మహేశ్.

నయన్ కరస్పర్శ చేసి, “ఐ ఆమ్ సారీ, అంకుల్! మీరు వస్తున్నట్టు అమ్మ చెప్పింది. మీరు బాగా గుర్తున్నారు. మన ఇద్దరికీ నాన్నగారు తీసిన ఫోటోలు నావద్ద భద్రంగా ఉన్నాయి. మీరు నేర్పిన చెస్ నాకు సర్వస్వం అయిపోయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో యూనివర్సిటీ ఛాంపియన్ ని కూడా అయ్యాను. మీరు మళ్లీ వచ్చినప్పుడు తప్పక కలుద్దాం,” అంటూ లిఫ్టు ఎక్కాడు.

“మహేశ్ తో డిన్నర్ మిస్సయ్యావు, నయన్!  అమ్మ నీకోసం ఎదురు చూస్తోంది. వెళ్లి భోజనం చెయ్యి.”

ఇద్దరూ టాక్సీ స్టాండు వైపు నడుస్తున్నారు. చలిగా ఉంది. రాత్రి పదకొండు అవుతోంది. లాహిరీ శాలువ కప్పుకున్నాడు. ‘స్వెట్టర్ తెచ్చుకోవాల్సింది’ అనుకుంటూ మహేశ్ పేంటు జేబుల్లో చేతులు పెట్టుకున్నాడు.

“నయన్ కి ఏమైంది?” అడక్కుండా ఉండలేకపోయాడు.

“ఫైనల్ ఇయర్లో ఉండగా స్కూటర్ మీద వెళుతూ ఉంటే రోడ్డు ప్రమాదం జరిగింది. హెల్మెట్ ఉంది గనక బతికిపోయాడు. నాలాగే మావాడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు – భద్రత విషయంలో,”

ఏమనాలో తెలియలేదు మహేశ్ కి.

“…రెండు వారాలు కోమాలో ఉన్నాడు. మా ఇద్దరికీ నరకం. ‘నొసటి వ్రాత’ అని సమాధాన పరచుకోలేకపోయాం. రీమా ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో చేరి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చాలా పట్టుదలగా పని చేస్తోంది – జీతం తీసుకోకుండా,”

మహేశ్ టాక్సీ ఎక్కాడు.

లాహిరీ, “చాలా ఏళ్లు ఆర్థిక భద్రత కోసం ఖర్చయిపోయాక మనుషుల భద్రత అన్నిటికన్నా ముఖ్యం అని మాకు తెలిసివచ్చింది. మిగిలిన కొద్ది సంవత్సరాలలోనైనా నలుగురికీ ఉపయోగపడే పని చెయ్యాలి. ఇదే మా లక్ష్యం” అని చెయ్యూపాడు.

లాహిరీ కనులవెంట నీళ్లు తిరగడం ఎదురుగా వస్తోన్న వాహనపు వెలుగులో మహేశ్ గమనించాడు. టాక్సీ ముందుకి ఉరికింది.

–o0o—

గమనిక: ఇది సుమారు నలభై ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఆధారంగా వ్రాసిన కథ. అయితే కాలక్రమేణా ఓడలలో భద్రతా ప్రమాణాలు, సాధనాలు ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడ్డాయి. ఇందుకు ప్రధాన కారణాలు అవగాహన, చైతన్యం, శిక్షణ; కొన్ని సంస్థలూ, కొందరు వ్యక్తులూ చేసిన అపారమైన కృషి. ఫలితంగా ఈ కథలో చెప్పిన దుర్ఘటనలు జరిగే అవకాశాలు తగ్గిపోయాయి.

 

ఈ కథలో ప్రస్తావించిన పాటలు:

 

Unudurti Sudhakar

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నాకీ కథ చాలా నచ్చింది. నేను ఓడలలోనూ సబ్మెరైన్లలోనూ పనిచేసినప్పటి సంఘటనలు కథలు చెయ్యవచ్చనే ఆలోచనే తట్టలేదు. ఆ రోజులలో వాటిని పత్రికలు వేసేవో లేదో తెలీదు గాని అవి కథలకి పనికివస్తాయని గాని, అవీ చెప్పవలసిన కథలే అనిగాని ఎందుకు అనిపించలేదో తెలీదు.
    ప్రత్యోకించి ఈ కథలో గమనించి తీరవలసిన వాక్యాలు ఇవి,
    1.జర్మన్లతో పని చెయ్యడం వల్ల ఒక ప్రొఫెషనలిజం అలవడింది. ముఖ్యంగా సేఫ్టీ (భద్రత) విషయంలో. చెప్పడానికి చాలా వివరాలూ, సంఘటనలూ ఉన్నాయి గానీ, మనకీ వాళ్లకీ మధ్య ఉన్న ప్రధానమైన తేడాల గురించి చెబుతాను. అ దేశాల వారిది సమస్యలకు ఎదురు వెళ్లి వాటిని సమూలంగా పరిష్కరించే మనస్తత్వం; మనది పూర్తి స్థాయి వినాశనం అయ్యేవరకూ ఏమీ జరగనట్లు నటించే తత్వం. అందుకే వాళ్లు సమస్యలనుండి నేర్చుకుంటూ ముందుకి సాగుతారు; మనం చేసిన తప్పులే మళ్లీమళ్లీ చేస్తూంటాం,”
    2.బంగ్లాదేశ్, బీహార్ నదీ జలాల్లో ఇప్పటికీ జరిగే పడవ ప్రమాదాలను చూడు. అదే టైటానిక్ విషయంలో ఏమి జరిగిందో మనందరికీ తెలుసు. లైఫ్ బోటు కెపాసిటీ దగ్గరనుండీ, రేడియో కమ్యూనికేషన్ వరకూ సమూలమైన మార్పులు, చట్టాలు వచ్చాయి. నిజానికి టైటానిక్ కన్నా కూడా ఎక్కువ ప్రాణ నష్టం కలిగించిన ప్రమాదాలు ఆఫ్రికా తీరంలోనూ, ఫిలిప్పైన్స్ లోనూ జరిగాయి. వాటిని పట్టించుకొనే నాధులు లేరు. కొన్ని దేశాల్లో ప్రాణాలకు విలువలేదనే మాట నిజం అనిపిస్తుంది ఒక్కోసారి”,

    “మరీ అంత నిరాశపడనక్కరలేదు సార్! ప్రపంచవ్యాప్తంగా భద్రతా వ్యవస్థల్లో మార్పులు వచ్చాయి కదా?”

    “నిజమే. అయితే అవి ప్రధానంగా ఎగువ నుండి రుద్దబడినవి. మన మనుష్యుల లోపల్నించి వచ్చినవి కాదు. లోపం మన చదువుల్లోనో, పెంపకంలోనో, లేక ‘అంతా రాసిపెట్టినట్టే జరుగుతుంది, మనం నిమిత్త మాత్రులం’ అనే విశ్వాసంలోనో, మన వనరుల కొరతలోనో – ఎక్కడో ఉంది. మూలాలకి వెళ్లాలి. అందుకే ఎకాడెమీలో చేరాను. ఈ అంశాలపై కొన్ని పరిశోధనలు, ప్రాజెక్టులు మొదలుపెట్టాను. నా కెరీర్ చివరి దశలోనైనా ఈ దిశలో పని చెయ్యగలనేమో అని,”

    “ఇప్పటివరకూ ఏం తెలుసుకున్నారు?”

    “ముఖ్యంగా రెండు విషయాలు తెలిసాయి. మన మేనేజర్లు, ఇంజినీర్లు ఏకాకి వ్యక్తులుగా, కెరీరిస్టులుగా, యాజమాన్యం చేతుల్లో కీలుబొమ్మలుగా చాలా తొందరగా మారిపోతారు. వృత్తి బాధ్యతలలో పాటించాల్సిన విచక్షణని గాలికొదిలేస్తారు.”
    3.పుస్తకాల్లో, ట్రైనింగులో నేర్చుకొనేది వేరు, నిజ జీవితంలో, పనిలో అమలు చేసేది వేరు అనే ద్వంద్వ భావం మన వాళ్లల్లో చిన్నతనంలోనే ఏర్పడిపోతుంది. సిద్ధాంతం, ఆచరణా రెండూ కూడా ఒకే గొలుసులోని లింకులుగా ఉండాలనే ఆలోచన తక్కువ”.
    ఈ 3వ వాక్యం అక్షర సత్యం. భద్రత విషయంలో నా ఉద్యోగానుభవంతో నేను చెప్పగలిగేది ఒకటుంది. అది కేవలం రూల్సు పాటించకపోతే పడబోయే శిక్షకి భయపడి చేస్తాం.
    ధాంక్స్ సుధాకర్ గారూ మంచికథ చెప్పారు.

    • మీనుండి ఈ స్పందన వచ్చిందంటే నా ప్రయోగం విజయవంతం అయినట్టే. ధన్యవాదాలు.

  • ఒక గొప్ప విదేశీ కథని అనువాదం చేసారేమో అనేంత బావుంది సార్ కథ

    తెలుగు కథా లోకంలో కొత్త ఒరవడి మీది

    సూటిగా వుండే వాక్య నిర్మాణం
    తీసుకున్న వస్తువు పై లోతైన పరిశోధన,అవగాహన
    గొప్ప మానవానుభావం
    మీ కథల బలాలు

    ఇవేవీ అవసరం లేని నేటి (మన)కథాలోకానికి చాలా దూరంగా స్వచ్చంగా వున్నారు ….. అలాగే వుండాలని కోరుకుంటూ…

    • మీరన్నది నిజం, నరసింగ గారూ! కాస్తంత ఎడంగా జరిగి, మన సమాజాన్ని సమగ్రంగా చూడాలని, చూపించాలని నా ప్రయత్నం. ధన్యవాదాలు.

  • సుధాకర్ గారి కథల్లో సున్నితత్వం, నీళ్లు నవలకుండా చెప్పే సందేశం ఆకర్షిస్తాయి. ఈ కథలో కూడా ఆచరణకి నేర్చుకున్నదానికి మధ్యనున్న భేదం చాలా నేర్పుగా వ్యక్తపరుస్తారు. ఎక్కడా కథ కృత్రిమంగా అనిపించదు. సందేశం కోసం రాసినట్టుగా అనిపించదు. మహేష్ మీద సంఘటన ప్రభావం ఏమిటో ఎక్కడా చెప్పకపోవడం లోపమేమో. అతను ఒట్టి కథకి వాహకుడు కాదు కదా?!

    • ధన్యవాదాలు, ప్రసాద్ గారూ. మహేశ్ అనుభవంతో పాఠకులు మమేకమై, అతడి అనుభూతితో తాదాత్మ్యం చెందటం నా లక్ష్యం. అవసరం ఉన్నంత మేరకు సంఘటనలను వివరంగా చెప్పాలి తప్ప భావోద్వేగాలన్నిటినీ విడమరిచి చెప్పడం భావ్యం కాదు – నా దృష్టిలో. కథకుడు వాటిని పాఠకులలో పలికించాలి. చివరి మాట. ఆ దుర్ఘటన శాశ్వతమైన ముద్రను వేసి ఉండకపోతే నలభై ఏళ్ళ వ్యవధి తర్వాత ‘మహేశ్’ కి ఈ కథను చెప్పడం సాధ్యం అయేది కాదు.

    • ధన్యవాదాలు, అనిల్! నా వరకూ ఇదొక నూతన ప్రయోగం.

  • చాలా వివరంగా కదిలించేలా రాశారు. అభినందనలు. వివిన గారు దహరించిన భాగాలు బావున్నాయి.

    హృదయం లో నిదురించే చెలీ పాట బంగ్లా పాటకు అనుకరణ అని చెప్పగానే రావి శాస్త్రి గారు జ్జ్ఞాపకం వచ్చారు. ఆయన ఎవరి పాటలను ఎవరు కాపీ కొట్టెరో వివరంగా చెప్పేవారు.

    • ధన్యవాదాలు, సుబ్బూ. పొడిగా ఉండే కథాంశాన్ని తడిగా చెప్పే ప్రయత్నం.

  • మంచి కథ…చివరకంటా చదివించే తీరు…కథ చెప్పే విదానం నచ్చాయి సుధాకర్ గారు. ఓ దృశ్యం కళ్ళముందు కదలాడింది. ట్యాంకులలో మరణాలకు భధ్రతా ప్రమాణాలు వెనుక వేరేదో కారణముందనిపించింది. ఆక్సిజన్ శాతం చూసుకోకపోవడం….వెంటింగ్ ఫ్యాను వేయకపోవడంలాంటి తక్షణ కారణాలు కాదనిపించింది. ఏ మరణాలతో మీరు కథను పాఠకుడి మదిలో ఒక ఉచ్చ స్థితికి తీసుకుపోయారో దాని వెనకున్న అసల కారణపు అన్వేషణతో కథ ముగుస్తుందనుకున్నాను. Any how different story. Thank you.

  • సుధాకర్‌గారికి ధన్యవాదాలు – ఇంత మంచి కథ రాసినందుకు.

    “మా వాళ్లుకూడా అవేశపరులే గాని మా అనుబంధమంతా సినిమాలతోనే లెండి. భాష, సాహిత్యం, సంగీతం – స్వయంగా నిలదొక్కుకొనే అవకాశం మాకు చాలా తక్కువ. రేడియో ప్రభావం ఉన్నంతకాలం కొంత ఉండేది,”

    ఇది నిజం కాకపోతే బావుండుననిపించింది – కానీ నిజమే! 🙁

  • మీ ఇతర కథలలోని భాష, శైలి కి కొంచెం భిన్నంగా ఉన్నట్టనిపించింది.
    కాలింగ్ బెల్ ని ‘పిలిచే గంట’ గా తెలుగు చదువుకోవడం కొంచెం తమాషాగా అనిపించింది.
    జర్మన్స్ ప్రొఫెషనలిజం ప్రస్తావిస్తారనుకున్నాను. మన వాళ్ల కరీరిజం కూడా అంతే. వృత్తి వ్యాపకం పట్ల నిబద్దత తో ఉండేవాళ్లు తక్కువ.

    మనం సముద్రం మీద మరణాన్ని గురించి మాట్లాడుకుంటునప్పుడు మీరు కథలో ఉదహరించినవి (మతాలు, నమ్మకాలు వగైరా) మళ్ళీ గుర్తు వచ్చినవి.

    కథ, కధనం బాగుంది. మీ కథలు మర్చంట్ నేవి గురించి ఉన్నవి.

    తెలుగులో నౌకలు, సముద్రం నేపధ్యంతో మా నాన్న అట్లూరి పిచ్చేశ్వరరావు కొన్ని కథలు వ్రాసారు. అవి భారతదేశం, స్వాత్రంత్యం నేపధ్యం తో ఉన్నాయి.

    Thank you for this story.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు