రేమండ్ కార్వర్ కథల్లో విషాద వాస్తవాలు

కార్యకారణ సంబంధాలకంటే, మానుషత్వం విలువైనది. దుఃఖం సర్వవ్యాప్తమైనది.

ద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, రేపు ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసినవాళ్ళు, వలసపోయే వాళ్ళు, విడిచివచ్చిన భర్తలమీద, పిల్లలమీద ప్రేమమిగుల్చుకొన్న మాజీ భార్యలు, జారిపోతున్న జీవితాల్ని ఒడిసిపట్టుకొనే ప్రయత్నశీలురు. దుఃఖాకులిత సమయాల్లో ప్రేమని, సంయమనాన్ని కోల్పోని మనుషులు, మోసగించ బడేవాళ్లు, ఒకళ్లనొకళ్ళు పట్టించుకోని మనుషుల మధ్య నిరంతరం సతమతమయ్యే వాళ్ళు, సాదా సీదా మనుషులు, మారే ప్రపంచంలో విడిచివేయబడ్డవాళ్ళు, ముసలి వాళ్ళు, నడి వయస్కులు, పిల్లలు గలవాళ్ళు, పిల్లలులేని వాళ్లు, క్షుభితులు, దుఃఖితులు – ఒక శతాబ్దపు అమెరికా ప్రజ, రేమండ్ కార్వర్ పాత్రలు వీళ్ళందరూ.  ప్రత్యేకంగా దిగువ మధ్యతరగతి ప్రజ.
తనను తాను పలుమార్లు మానసిక ఒత్తిళ్ళనించి రక్షించుకొన్నవాడు. త్రాగుడికి బానిసగా మారి, ప్రయత్న పూర్వకంగా బయటకొచ్చిన వాడు. సొంత గొంతుకనీ, ప్రత్యేకతని సంతరించుకుని అమెరికా కథకుల్లో  పేరెన్నికగన్న వాడు రేమండ్ కార్వర్.

నయా వాస్తవిక వాదానికి కార్వర్ ప్రముఖ నిదర్శనం. కథల్లో అవసరానికి మించని వర్ణన, సునాయాచితంగా  పాత్రలపరిచయం, అతి తక్కువ పదాల్లో కథావస్తువుని, పాత్రలని ప్రవేశ పెట్టడం, కథలకి పేరు కూడా ఆసక్తికరంగా ఉంచడం కార్వర్ లక్షణాలు.
అతని రచనల్లో ఎక్కువగా కనిపించే ‘మినిమలిజం’ అతన్ని  ఇతర అమెరికన్ రచయితలనుంచి వేరుపరుస్తుంది. ఫాల్కనర్, హెమ్మింగ్వేల రచనా విధానాన్ని ఇష్టపడుతూనే వాళ్ల  ప్రభావంలో పడకుండా వుండడడానికి తన విశిష్ట రచనాశైలిని పదును పెట్టుకున్నాడు.

పేజీన్నర చిన్న కథల్నించి, పాతిక ముప్పై పేజీల పెద్ద కథల్లో కూడా ఎక్కడా అసమగ్రత కాని, విస్తారభీతి కానీ కనపడదు.
విడిపోయిన భార్యాభర్తలు చెరో చేతినీ గుంజి పసిపిల్లని పంచుకున్న(Popular Mechanics) కథ చిన్నదే, కానీ అది మనపై వేసే ముద్ర బలమైనదే.

So much water  so close to home కథ లో నలుగురు స్నేహితులు చేపలవేటకి వెళ్తారు. వాళ్ళకి నది తీరానికి చేరగానే నదిలోకొట్టుకుపోతున్న ఆడ పిల్ల శవం కనిపిస్తుంది శవాన్ని ఒడ్డుకు చేర్చి, తాపీగా, తమ పిక్నిక్ ముగిసేక – క్యాంపింగ్, తాగుడు, చేపలు పట్టడం, అన్ని అయ్యేక పోలీసులకి ఫోన్ కొట్టి, ఏమి జరగనట్టు ఇంటికొచ్చి తనతో రమించిన భర్త ప్రవర్తనకి అసహ్య పడుతుంది క్లైర్. భర్త ఆమెను సమాధాన పరచడానికి ప్రయత్నిస్తాడు. ఏం తప్పుచేసేను అని అడుగుతాడు. ‘ఆ పిల్ల చచ్చిపోయింది కదా. చెయ్యడానికేం ఉంది? అప్పటికే 5 మైళ్ళు నడచి ఆ చోటు చేరుకున్నాం. వెంటనే ఏం బయల్దేరి వస్తాం. అందరం ఆలోచించే అలా చేసేం. నేనేం తప్పు చేయలేదు.’

18 సంవత్సరాల పిల్లని మానభంగం చేసి, పీక నులిమి శరీర అవయవాలు ఛిద్రం చేసి నదిలో విసిరేశారని, ఎక్కడినుంచో కొట్టుకొని భర్త, స్నేహితులు చూసినచోటికి చేరుకొందని తెలుసుకొంటుంది. మనసు వికలమవుతుంది.  చాలా ఏళ్ల క్రితం తన స్నేహితురాలికి కూడా ఇలాగే జరిగింది. Madrid brothers తన స్నేహితురాల్ని మానభంగం చేసి తలనరికి చంపేసేరని గుర్తుచేసుకొంటుంది. భర్త ఆమెని అనవసరంగా ఆలోచిస్తున్నావని గదమాయిస్తాడు. పెల్లుబికిన కోపంతో చాచి లెంపకాయ కొడుతుంది.

వండివార్చడం చేసినా భర్తతో ఎడం గానే ఉంటుంది.
117 మైళ్ళ దూరంలో ఉన్న  ఊర్లో అంత్యక్రియలకి వెళ్తుంది. వెళ్లే ఘాట్ రోడ్డులో ఆమెను అనుసరించిన ట్రక్ డ్రైవర్ ప్రవర్తనతో స్త్రీల మాన ప్రాణాలకి రక్షణ లేదని అనుభవమవుతుంది.

తిరిగి వచ్చేక భర్తతో దూరంగా ఉండాలని వేరేగదిలోనే పడుకోవాలని నిర్ణయించుకొంటుంది.  భర్తతో పడుకోవడానికి తిరస్కరిస్తుంది.
భర్త సర్దుబాటు చేసుకోవడానికి పూలసజ్జ పంపించి ఆఫీస్ నించి ఫోన్ చేస్తాడు.

కథలో కొన్ని వాక్యాలు:
‘రెండు విషయాలు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు 1. ఇతరులకు ఏమైనా సరే, మనుషులు పట్టించుకోరు.2.దేనివల్లా ఒరిగేదేమిలేదు. ఏది ఏమైనా పెద్దగా మార్పేమీ ఉండదు. (ఆ అమ్మాయి అట్లా చనిపోయిందా!)ఈ ఘటన వల్ల స్టువర్ట్(భర్త)లో కానీ, నాలో కానీ ఏ మార్పు జరగదు. నిజం చెప్పాలంటే, ఒక మార్పు జరుగుతుంది-మెం ముసలివాళ్ళమవుతాం. కావాలంటే చూడండి ఇద్దరం ఒకేసారి బాత్రూం లో ఉన్నప్పుడు అద్దంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏవో చిన్నచిన్న మార్పులుండచ్చేమో అంతకంటే పెద్ద తేడా ఉండదు.’

మనుషుల మధ్య సంబంధాలు అవసరాల మేరకే అని వ్యక్తమవడం, తోటి మనిషి శవాన్ని పక్కనే పెట్టుకొని, ఏమీ జరగనట్టు, తమ వినోదాలకి భంగం కాకుండా మెలగడం,తమ తిండి, తమ వినోదం,తమ సెక్స్ ఇవే ముఖ్యంగా మారిన  మనిషి మీద అసహ్యం వేస్తుంది.

A small, good thing కథ లో  స్కాటి 8వ పుట్టినరోజు కోసం తల్లి బేకరీలో కేక్ పురమాయుస్తుంది. అయితే పిల్లవాడు పుట్టినరోజు నాడే ఓ కారు  ప్రమాదంలో కోమాలోకి వెళ్లి రెండు రోజులు ఆస్పత్రిలో ఉండి చనిపోతాడు. తల్లి, తండ్రి వంతులవారీగా పిల్లని కనిపెట్టుకొని ఆసుపత్రిలోనే ఉంటారు. మధ్యలో ఓసారి ఇంటికొచ్చినప్పుడు బేకర్ రాత్రనక, పగలనక, ఫోన్ చేసి విసిగిస్తాడు. తానెవరో చెప్పకుండా చేసిన విరుపు మాటలు చాలా కోపం తెప్పిస్తాయ్. అర్ధరాత్రి  కోపంతో తల్లి, తండ్రి బేకరికి వెళ్లి బేకర్తో ఘర్షణపడతారు. అతని ఒంటరి తనం, తమదుఃఖం, కలపోసుకొని అలసిపోయిన శరీరానికి, మనసుకి అతనిచ్చిన వెచ్చటి అల్పాహారంతో ఊరట పొందుతారు. ఆసుపత్రిలో వేరే ఆఫ్రికన్ అమెరికన్ కుటుంబంతో మాటలు, వాళ్ళదుఃఖం, వేదన, అనిశ్చితస్థితి, డాక్టర్ ఓదార్పు వాక్యాలు, కథంతా ఒక గంభీరమైన వాతావరణంలో నడుస్తుంది.

కథలో ఒక పొల్లు వాక్యం లేదు. ఒక అనవసర శబ్దం లేదు. ఆద్యంతం బిగి సడలకుండా నడుస్తుంది. కథ ముగిసేటప్పటికి, కోపాలు తాపాలు తగ్గి వాతావరణం మారుతుంది. ఉదయం అవుతుంది. ఇంకా స్నేహంగా మాట్లాడుకోవాలనే అనిపిస్తుంది.

బాధలో మనుషులంతా ఒక్కటే. కార్యకారణ సంబంధాలకంటే, మానుషత్వం విలువైనది. దుఃఖం సర్వవ్యాప్తమైనది. ఒక స్పర్శ, ఒక చూపు, ఒక మాట , ఒక వ్యక్తత చాలా అవసరం దుఃఖాన్ని దాటడానికి అని తేటతెల్లమవుతుంది.

మరణించి పాతికేళ్ల దాటినా, రేమండ్ కథలు యూనివర్సిటీల్లో పాఠాలుగా, నిరంతరం చర్చల్లో ఉన్నాయి. ఏభై సంవత్సరాల జీవితకాలంలో నిత్య సృజనకారుడిగా, అనేక గుర్తింపులు పొందిన రచయితగా, అమెరికన్ జీవితాన్ని ఒడిసిపట్టిన మహాకథకుడిగా, రేమండ్ కార్వర్ చెరగని ముద్ర వేసేడు.

[రేమండ్ కార్వర్ (1938-1988), రేమండ్ తల్లి ఎల్లా బీట్రీస్ కాసే. తండ్రి Clevie రేమండ్. తండ్రి సామిల్ లో పనిచేసేవాడు. రేమండ్  చిన్నప్పుడే యకిమా,వాషింగ్టన్ దగ్గరకి మారేరు. బాల్యం, ప్రేమ అన్ని ఆ ఊర్లోనే.  రేమండ్ పంతొమ్మిది సంవత్సరాల వయసులో  స్నేహితురాలు మర్యాన్ని(Maryann) పెళ్లిచేసుకొన్నాడు. అప్పటికే ఆమె గర్భవతి. ఇద్దరూ చదువుకుంటూ, ఉద్యోగాలు చేసుకొంటూ మరో బిడ్డకి జన్మనిచ్చేరు.   చదువు, పని, సృజనాత్మకత కలిసి జీవితమయ్యింది. గొప్ప రచయితలు, కవులతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఉపాధ్యాయ ఉద్యోగాలు కలిసి వచ్చేయి. కవిగా పేరు వచ్చింది. కథలు రాస్తూనే ఉన్నాడు. చాలా ఊర్లు మారేరు. ఒక్కోసారి ఒంటరిగా ఉండడం, సాహితీ స్నేహితులతో తాగడం, కొన్నాళ్ళకి తాగుడు నారి ఎక్కువై  అనారోగ్యం పాలయ్యేడు. రీహాబిలిటేషన్ సెంటర్లో చేరేడు. బయటకొచ్చేక పూర్తిగా తాగుడు మానేసేడు. రెండుసార్లు ఆర్ధికంగా దివాళా తీసేడు.
40సంవత్సరాల వయస్సులో టిస్ గల్లఘర్ తో పరిచయం అయ్యింది. ఆమె జీవితమూ సాహిత్యమే. గొప్ప కవయిత్రి, రచయిత్రి,  కలిసి జీవించేరు. కార్వర్ చనిపోవడానికి కొన్ని రోజులు ముందు పెళ్లి చేసుకున్నారు. 1988 ఆగస్ట్ 2 వ తేదీన రేమండ్ కాన్సర్ వ్యాధితో మరణించేడు.]

Indraganti Prasad

4 comments

Leave a Reply to Sivarama Krishna Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ముందుగా, ధన్యవాదాలుసర్!.మీరు పరిచయం చేయకపోతే, ఈ సాహిత్యం ని,చదివేఅవకాశం, వుండేది కాదు.కథ లోకొన్నివాక్యాలు, నిజ జీవితానికి దగ్గర గా ఉన్నాయి!.👌.

  • చాలా బావుంది మీ వ్యాసం. వైరల్ వీడియోల్లో కనిపిస్తున్న సమకాలీన tone deaf ధోరణులకు ‘కార్వార్’ అద్దం పట్టినట్లున్నారు. దశకాలు తిరిగినా దేశాలు మారినా మనిషి దశ ఇంతేనా అన్పిస్తున్నట్లుగా..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు