రేడియో అంటే సమయపాలన 

1988 జనవరి 7వతేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అడుగుపెట్టాను.మొదటిసారేమో అంతా కొత్తగా ఉంది.రెండేళ్ళపాటు ఒక పెయింట్స్ కంపెనీలో పనిచేసిన నాకు ఆ వాతావరణం కొత్తగా అనిపించింది.ఎవరి హడావుడి లో వారుండేవారు.జాయిన్ అయ్యే సమయంలో నిష్ఠగా పనిచేస్తానని ప్రమాణం చేయించారు.. అలా చేస్తారని నాకు తెలియదు.దాన్నే oath తీసుకోవటం అంటారుట. 

అక్కడే ఉద్ధండులను చూశాను. చెప్పాలంటే ఎంతోమంది. ముందుగా నండూరి సుబ్బారావు వి.బి.కనకదుర్గ..చిన్నతనంలో వీరివురి నాటకాలు ఎన్నో విన్నాను.నా ఊహలో వారి స్వరూపం..చూసిన రూపాలు మేచ్ కాలేదు. వారు స్టాఫ్ ఆర్టిస్ట్ లు గా ఉండేవారు.

అలాగే న్యూస్ రీడర్స్ ప్రయాగ రామకృష్ణ,కొప్పుల సుబ్బారావులను మొదటి సారి చూశాను. మిగిలినవారి గురించి రాబోయే రోజుల్లో చెబుతాను.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఒక well-oiled machine లా ఉంది. ఎవరి పని వారు చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.నేను డ్యూటీ ఆఫీసర్ గా చేరాను.షిఫ్ట్ డ్యూటీలుండేవి.వీటిని రేడియో పరిభాషలో ట్రాన్స్మిషన్ డ్యూటీలనేవారు.ఆరోజుల్లో మూడు ప్రసారాలు ఉండేవి.ఉదయం ఐదుగంటల నలభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్ఫై నిముషాల వరకు.

మధ్యాహ్నం పదకొండు గంటల నలభై నిముషాల నుంచి మూడు గంటల వరకు..

సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల పదినిమిషాల వరకు అంటే రేడియో ప్రారంభమయే సమయానికన్నా కనీసం ముప్ఫై నుంచి నలభైఐదు నిముషాల ముందుండాలి డ్యూటీ ఆఫీసర్, అనౌన్సర్.

రోజుకు మూడు ట్రాన్స్మిషన్ లుండేవని చెప్పాను కదా.ఒక్కో ట్రాన్స్మిషన్ కు ఒక డ్యూటీ ఆఫీసర్,ఒక అనౌన్సర్ ఉంటారు.డ్యూటీఆఫీసర్ పని ట్రాన్స్మిషన్ సాఫీగా జరిగేటట్లు చూడటం.అనౌన్సర్ ని గైడ్ చేయటం.అనుసంధానంగా కంట్రోల్ రూం ఉండేది.అక్కడ ఇంజనీర్లుండేవారు.రేడియోకి సంబంధించినంతవరకు అది టెక్నికల్ విభాగం.ప్రసారాలు వినపడాలంటే ట్రాన్స్మిటర్ లు అవసరం.అవి నంబూరు లో ఉండేవి.స్టూడియో నుండి నంబూరు వరకు ప్రత్యేకమైన టెలిఫోన్ కేబుల్స్ ఉండేవి.

స్టూడియోలో ట్రాన్స్మిషన్ బూత్ అన్నటువంటి ప్లే బ్యాక్ స్టూడియో ఉండేది.ఇక్కడ రికార్డు లు, రికార్డు చేసిన కార్యక్రమాలు(ఇప్పటి లాగా కంప్యూటర్ లు లేవు.టేప్ డెక్ లుండేవి.వాటిపై స్పూల్ టేపులను ప్లే చేసేవారు.) మధ్య మధ్యలో వినిపించే వినిపించే విరామ సంగీతం రికార్డులుండేవి.వాటిని fillers అనేవారు.అప్పుడు రికార్డు ప్లేయర్లు ఉండేవి.ఇప్పుడు లేవు.వాటిపై సినిమా రికార్డులు, శాస్త్రీయ సంగీతం రికార్డు లు ప్లే అవుతుండేవి.

పాత తెలుగు చిత్రాల పాటలు 78rpm స్పీడ్ లో ఉండేవి. rpm అంటే revolutions per minute. 

 కొంచెం కొత్త సినిమాలు 45rpm. వీటిని EP రికార్డులనే వారు. ఇక మిగిలినవి ఎల్పీ రికార్డులు(long playing records).ఇవి ఎక్కువగా ఒకే సినిమాలోని అన్ని పాటలుగాను, కర్నాటక శాస్త్రీయ సంగీతం లో ప్రముఖుల గానాలు,వాద్య కచ్చేరీలు వంటివి ఉండేవి.ఎమ్మెస్ సుబ్బలక్ష్మి మొదలు ఎమ్మెస్.గోపాలకృష్ణన్ వరకు ఎంతోమంది ఆర్టిస్ట్ ల రికార్డులుండేవి.ఆకాశవాణి లైబ్రరీ లో ఇవన్నీ ఉండేవి.

1988ప్రాంతంలో సినిమా పాటలు రికార్డుల రూపంలోను,కేసెట్స్ రూపంలో వచ్చే వి.సి.డి.లు రావటానికి ఇంకో పదేళ్ళు పట్టింది.

గ్రాంఫోన్ ప్లేయర్ మీద రికార్డు తిరుగుతుంటే పాట వినిపించటం చూసినప్పుడు నా చిన్నప్పుడు బందరు లో కీ ఇవ్వటంతో కుక్క బొమ్మ ఉన్న రికార్డు తిరిగే గ్రాంఫోన్ ప్లేయర్ గుర్తుకొచ్చేది.

ప్లే బ్యాక్ స్టూడియో కాకుండా ఇంకో మూడు స్టూడియోలుండేవి. అవేమిటంటే ప్రసంగాల స్టూడియో.దీన్నే టాక్స్ స్టూడియో అనేవారు.ఇంకోటి డ్రామా స్టూడియో, మ్యూజిక్ స్టూడియో.టాక్స్ స్టూడియోలో ప్రాంతీయ వార్తలు లైవ్ చదువుతారు.ఇవికాకుండా ఇన్స్ట్రుమెంట్ రూం ఉండేది.అందులో తాన్ పురాలు,మృదంగాలు,తబలాలు, వీణలు,ఫ్లూట్ లు, వయొలిన్లు ఉండేవి.వీటినన్నిటిని అనుసంధానిస్తూ కంట్రోల్ రూం ఉండేది. 

రేడియోలో ప్రతీదీ టైం ప్రకారం జరుగుతుంది.ప్రతి ట్రాన్స్మిషన్ సిగ్నేచర్ ట్యూన్ తో మొదలవుతుంది.

ఈరోజున ఆ సిగ్నేచర్ ట్యూన్ వాట్సాప్ లోను, యూట్యూబ్ లోను సర్క్యులేట్ అవుతోంది.ఆ రోజుల్లో రేడియోలో ప్లే చేసినప్పుడే వినగలిగేవాళ్ళం.ఆ సిగ్నేచర్ ట్యూన్ వ్యవధి దాదాపు రెండు నిమిషాలు ఉంటుంది.దాన్ని స్వరపరచినవారు వాల్టర్ కాఫ్ మాన్.వలసవచ్చిన యూదు జాతీయుడు.ప్రేగ్,బాన్ నగరాల్లో ఎన్నో ఛాంబర్ ఆఫ్ మ్యూజిక్ ప్రదర్శనలు ఇచ్చినవాడు.అతను భారతదేశం వచ్చినప్పుడు ఆలిండియా రేడియో కోసం ఈ సిగ్నేచర్ ట్యూన్ కంపోజ్ చేశాడు.ఇందులో వయొలిన్,వయోలా,సెల్లో,తాన్ పూరా వాద్యాలను ఉపయోగించి ఆ ట్యూన్ తయారుచేశాడు.శివరంజని రాగం ఆధారంగా రూపొందింది ఆ సిగ్నేచర్ ట్యూన్  బోంబే సింఫనీ మ్యూజిక్ ఆర్కెస్ట్రా ఫౌండర్ మెహ్లీ మెహతా వయొలినిస్ట్ గా ఈ సిగ్నేచర్ ట్యూన్ కు పనిచేశాడు.ఇదెప్పటిమాట..1937ప్రాంతంలో కంపోజ్ చేసిన ఈ వాద్యమంజరి ఇప్పటికీ ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ గా కొనసాగుతోంది.

రేడియోలో ఏదైనా టైం ప్రకారం ప్రసారమవ్వాల్సిందే.

ఆలస్యం అవటానికి వీల్లేదు.ఇలా ఖచ్చితంగా ఫలానా సమయానికి ఫలానా కార్యక్రమం ప్రసారం జరగాలని ఎవరు నిర్ణయిస్తారు?ఎలా అమలు చేస్తారు?

అది నేను చేరిన కొత్తల్లో తికమకగా ఉండేది.

రేడియో ప్రసారాలను ఎప్పుడు ఏది ప్రసారమవ్వాలని నిర్ణయించే కాల పట్టికను cue sheet అంటారు.

అందులో ఏముంటుందంటే…

*

సి.యస్.రాంబాబు

5 comments

Leave a Reply to ఆర్.ఎస్. వెంకటేశ్వరన్. Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సేవలలో లేదు గానీ సుప్రీమ్ కోర్టు సేవలో చేరగానే మాత్రం ప్రమాణ స్వీకారం ఉంది.

  • రాబాబు గారు మీరు చెప్పే శైలి బాగుంది. ఆకాశ వాణి సంగతులు తో పాటు అందులో ఉండే సాంకేతిక పరిజ్ఞానం కూడా అందరికీ అర్ధం అయ్యేలా అరటి పండు వలిచి పెట్టినట్లు చెప్తున్నారు. చాలా తెలియని విషయాలు కూడా ఉన్నాయి.

    • అయ్యా
      ఆకాశవాణి ని మా కళ్లముందు వుంచారు.సాంకేతికపరమైన అనేక అంశాలను
      పూసగుచ్చినట్టు చెప్పారు.మీకు అభినందనలు.
      —–డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్
      రేడియో ప్రేమికుడు
      సికిందరాబాద్/హన్మకొండ.
      2-04-2025

  • తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు సార్ ముఖ్యంగా సిగ్నేచర్ ట్యూన్ గురించి ఇంతవరకు తెలియదు

  • ఇప్పుడు నిలయంలో సమయం ఆరు గంటలా నలభై నాలుగు నిమిషాల ముప్పై మూడు సెకన్లు. కొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
    (సంగీతం)
    ఆకాశవాణి… వార్తలు చదువుతున్నది…

    ఇలా సమయసూచికగా ఉండేది ఆకాశవాణి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు