రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు

  ” కంఠంలో నినాదంగా స్వీకరించిన పోరాటమే

ఊహలకు ఇంతగా కాంతినిస్తుంటే

ప్రజల రాజ్యాధికారం కత్తిని నిర్మించే కొలిమిలో

మనం రవ్వలమైతే ఎంత వెలుగు !”

(వరవరరావు -1974)

ఒక సాహిత్య పత్రికగా ‘సృజన’ను అనధికార ప్రతిపక్ష గొంతుగా వినిపించిన వరవరరావు జీవితాంతం తాను రాసిన అక్షరాలకే నిబద్ధుడై బతుకుతున్నాడు. అదే ఆయన బలమైతే,అందుకే ప్రభుత్వాలకి ఆయనంటే అంత కన్నెర్ర అయ్యింది. 1966 లో ‘సృజన’ ద్వారా, 1970 లో ‘విరసం’ ద్వారా వరవరరావు చెవి చూపు గొంతుగా నిలిచాడు. అందుకే గత అయిదున్నర దశాబ్దాలుగా ఆయన జీవితాన్ని నిషేధాలు నిర్బంధాలు వెన్నాడుతూనే ఉన్నాయి. అయినా ఆయన కలం గళం మూగవోలేదు. ఆయన సహచరి హేమలత, పిల్లలు సహజ అనల పవనలు ఆయన వెన్నంటే ఉంటూ ఆ నిర్బంధాలను పరోక్షంగా అనుభవిస్తున్నారు. ఆయన, ఆ కుటుంబ సభ్యులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వివి ది ‘కమ్యూనిస్ట్ కుటుంబం.’ఈ రోజుల్లో ఇది అతి అరుదైన విషయం.

విప్లవ రచయితల జీవితాల్లో ఎదురవుతోన్న నిర్బంధాలు వాళ్ళ కదిలికల మీద నియంత్రణ పెట్టగలవేమోగాని, వాళ్ళ సృజనాత్మకతను చంపలేవు. హొచిమిన్ నుంచి వరవరరావు దాకా కటకటాలనుంచి కూడా సమాజానికి విప్లవానికి నిబద్ధమయ్యే రచనలే చేశారు. ‘భూగోళమంతా ఒక విధ్వంస ప్రయోగం’ (వివి) జరుగుతున్న వేళ మేధావి అలీనంగా ఉండలేడు. నక్సల్బరీ శ్రీకాకుళం ముషాహారీ నుంచి తెలంగాణ దాకా నాగేటి చాళ్ళలో రగిలిన రైతాంగ పోరాట జ్వాలలు 1970 ల తరం దశ – దిశ ని నిర్దేశించాయ . వివి లాంటి వాళ్ళు ఆ ‘రక్త చలన సంగీత శృతి ‘ ని నిరంతరాయంగా ఆలపిస్తూనే ఉన్నారు.

ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయ పంథా, మొక్కవోని స్వేచ్ఛా కాంక్ష ఈ రాజకీయ విశ్వాసానికి పునాది అయ్యింది. రాజ్యం కుట్రలని ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తున్నందు వల్లే విప్లవకారులు ఎన్కౌంటర్లలో చనిపోతున్నారు; రచయితలు రాజద్రోహం కుట్రకేసుల్లో మగ్గుతున్నారు. ఈ ప్రశ్నించే గొంతులపై అమలయ్యే నిర్బంధంలో భాగమే నిన్నటి సాయిబాబా నుంచి నేటి కాసీం వరవరరావుల దాకా అమలవుతున్న రాజ్యహింస. సాయిబాబా ‘ శరీరం 90 శాతం అశక్తతకు గురైనా, మిగిలిన ఆ 10 శాతమే భయపెడుతోంది’ అని తీర్పు ప్రకటించడమంటేనే, ఎటువంటి మధ్య యుగాలనాటి శిక్షా స్మృతి ఇప్పటికీ అమలవుతుందో అర్థమవుతోంది.

80 ఏళ్ళు పైబడిన వివి లో ‘ ఒక ప్రమాదకరమైన నక్సలైట్’ ఉన్నట్లు న్యాయస్థానం పదేపదే అంటోంది. జాతీయ అంతర్జాతీయ మేధావులు రచయితలు ప్రముఖ పాత్రికేయులు దాకా వీరి విడుదల లేదా బెయిల్ గురించి ఎన్ని విజ్ఞప్తులు చేసినా , అవేవీ పాలకుల చెవికెక్కటం లేదు. సాయిబాబా విషయంలో ఆయన సహచరి వసంత, వరవరరావు విషయంలో ఆయన సహచరి హేమలత, కాసీం విషయంలో ఆయన సహచరి స్నేహ పరోక్షంగా ఈ నిర్బంధపు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయినా ఎంతో మనో నిబ్బరంతో వారి సహచరుల విడుదలకోసం చేయగలిగినన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

1974 లో అఖిల భారత రైల్వే సమ్మె జరిగినప్పుడు ఆ సమ్మెను బలపరుస్తూ తెచ్చిన ‘సృజన ‘ సంచిక ఎడిటర్ హేమలత. అదే పెద్ద రాజద్రోహ నేరంగా జడ్జి ఆమెకు జైలు శిక్ష విధిస్తూ ‘ ముగ్గురు ఆడపిల్లల తల్లియై కూడా ఆమెలో పశ్చాత్తాపం లేదు ‘ అంటాడు జడ్జి. “పశ్చిమాన సూర్యుడు ఉదయిస్తే, పశ్చాత్తాపం ప్రకటిస్తాను మైలార్డ్ ” అని ఆమె తరఫున వివి కవిత రాశారు. అప్పటినుంచే హేమలత వివి రాజకీయ విశ్వాసాల బాధ్యతను పంచుకోవడం మొదలయ్యింది. వివి ప్రతి అడుగులో అడుగై ఆమె సాగుతోంది. కుటుంబ సాహచర్యం కూడా ఒక ‘విప్లవ విలువ’ గా ఉండబట్టే, ఈ నిర్బంధాలు వాళ్ళ గుండె నిబ్బరాన్ని దెబ్బతీయ లేకపోయాయి.

వరవరరావు వయస్సు 80ఏళ్ళు దాటుతోంది. ఆయన నడకకు, నడతకు రెండు ముఖాలు లేవు. ప్రభుత్వాలు గత 47 ఏళ్లుగా ఆయన్ని 25 కేసుల్లో ఇరికించి, విచారణ నెపంతో దీర్ఘకాలం వేధించాయి. ఈ అన్ని కేసుల్లోంచి ఆయన నిర్దోషిగా విడుదలయ్యాడు. 1973 అక్టోబర్ 10 న మొదలైన ఈ నిర్బంధాలు 2018 ఆగస్టు నెలలో బనాయించిన ‘ భీమా కోరేగావ్ ‘ కుట్రకేసు దాకా కొనసాగాయి. కనీస వసతులు కూడా కరువైన పూణేలోని యెరవాడ జైలులో 2018 నవంబర్ నుంచి వివిని మిగత సహా నిందితులతో పాటు నిర్బంధించారు. కోర్టులు బెయిల్ అప్పీళ్లను తిరస్కరిస్తున్నాయ. కనీసం జైలులో ములాఖత్ కూడా అనేక షరతుల మధ్య కుటుంబ సభ్యులను అనుమతిస్తున్నారు. ఒక్కోసారి అదీ అనుమతించరు. 2020 ఫిబ్రవరిలో నవీ ముంబై లోని ‘తలోజ’ జైలుకి తరలించారు. న్యాయవాదులను కూడా జైలులో కలువనివ్వని దారుణ నిర్బంధం అమలవుతోంది.

1975 నుంచి 2017 దాకా వరవరరావు రాసిన సుమారు 400 కవితలు రెండు వాల్యూములుగా వచ్చాయి. వివి ‘తెలంగాణ విమోచనోద్యమం- తెలుగు నవల ‘ మీద ప్రామాణికమైన పరిశోధనా గ్రంధం వెలువరించారు. గూగీ నవలలో కొన్ని అనువదించారు. జైలులో ఉన్నా బైట ఉన్నా ఆయన కలానికి విరామం లేదు; ఆయనకు విశ్రాంతి లేదు. పర్ స్పెక్టివ్స్ 1989 జులైలో వివి జైలు నుంచి రాసిన ‘సహచరులు’ ప్రచురించింది. ఇదే ఆ తర్వాత ఇంగ్లిష్ లో వెలువడింది. 1990 జనవరిలో ‘సృజన సంపాదకీయాలు’ మా నాలుగవ ప్రచురణగా తెచ్చాం. అక్రమంలోనే 2008 జనవరి నుంచి 2019 జులై వరకూ గడిచిన 11 సంవత్సరాల కాలంలో వెలువడిన అల్లం రాజయ్య 6 సాహిత్య సంపుటాలకు వివి సంపాదకత్వం వహించారు. వాటికి 240 పేజీల ముందుమాటలు రాశారు. అవి నిజానికి ఆ రచనా కాలానికి అద్దంపట్టిన తెలంగాణ లోని నక్సలైట్ ఉద్యమ సాంస్కృతిక రాజకీయాల చరిత్ర. ఆయన తప్ప మరొకరు రాయలేని పొలిటికల్ డాక్యుమెంట్.

రాజకీయ ఉద్యమాలు, పార్టీలు ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ, ఈ సమస్యలకు పరిష్కారం దొరకకుంటే చేజేతులా తిరిగి ఫాసిజం పడగ నీడన మగ్గిపోవాల్సి ఉంటుంది. సామాజిక సాంస్కృతిక రంగాల్లో క్రియాశీలంగా పనిచేస్తున్న వాళ్ళు తమ నిరసనని పదేపదే వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ‘ఎవరూ చేయని నేరం / రచయితలే ఏం చేశారు?’ అన్న వరవరరావు ప్రశ్నకు జవాబు మరో ఉద్యమానికి సంసిద్ధం కావటమే. చివరిగా 1977 లో వరవరరావు అన్న మాటలని మరోసారి యాది చేసుకొందాం.

“నేరమే అధికారమై

ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతుంటే

ఊరక కూర్చున్న

నోరున్న ప్రతివాడు నేరస్తుడే!”

                      *

 

 

ఆర్ కె

4 comments

Leave a Reply to Manchala Achyutha Satyanarayana Rao Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Manchala Achyutha Satyanarayana Rao
    July 3, 2020 at 7:58 am
    సారంగ (3-7-2020) లో ఆర్ కె గారు రాసిన రాసిన ” రెక్క విప్పిన రెవల్యూషన్ వరవరరావు” వ్యాసములో ఎంతో లోతైన తాత్విక విశ్లేషణ తో పాటు విప్లవ రచయితల సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విప్లవం పట్ల MLM
    సిద్ధాంత ఆచరణతో , సోషలిస్టు కమ్యూనిస్టు సమాజ నిర్మాణానికి, నిబద్ధతతో మరింత త్యాగంతో సాహసంగా , రాజ్యం యొక్క అణచివేతను మోసపూరిత కుట్రలను చేదించుకుంటూ విరసం పట్ల నిబద్ధతతో ఆశయ సాధనలో వచ్చే మిత్ర వైరుధ్యాలను పరిష్కరించుకుంటూ లొంగుబాటుకు
    తల ఒగ్గక అంతర్ బహిర్ సమస్యలను
    ఆత్మ విమర్శలతో పరిశీలించుకుని,
    చారిత్రక అవసరంగా ఏర్పడిన
    విప్లవ రచయితల సంఘాన్ని మరింత విశాలంగా భారత దేశ వ్యాప్తంగా, ప్రపంచ నలుమూలల ఏర్పడాల్సిన ఆవశ్యకతను అంతర్లీనంగా తెలియజేస్తుందని నేను ప్రగాఢంగా భావిస్తున్నా.
    ఈనాడు భారతదేశ నియో- ఫాసిస్ట్ పాలకులు
    విప్లవ కమ్యూనిస్టులపై అరెస్టులు ప్రకటించారంటే దాని అర్థం!? మనకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కనుక భారత పాలకులు ఒకవైపు,మరొకవైపు సామ్రాజ్య దేశ నియంతలు పిరికితనము తోభయకంపితులై, ప్రజా మేధావుల పై అబద్ధపు కేసులు బనాయించి జీవిత శిక్షలు అమలు చేస్తున్నారు. ఈ మేధావులంతా చట్టపరమైన లోపం కారణంగా జైలులో ఉన్నారు. కమ్యూనిస్టు కవి వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబా వారి సహచరులు అంతా కూడా MLM అభిప్రాయాల కోసం భారత ప్రభుత్వంచేత హింసించ బడుతున్నారు. ఆర్ కె ” వరవరరావు” పై రాసిన వ్యాసము చదువుతున్నంతసేపు టర్కిష్ కమ్యూనిస్ట్ విప్లవ కవి నా జామ్ హిక్మాత్(Najam Hikmet) జైలు జీవితంలోని సంఘటనలను అన్ని ఒక్కసారిగా నా చుట్టుముట్టాయి. Najam Hikmet అతని రాజకీయ అభిప్రాయాలు కారణంగా 1938-1965
    వరకు టర్కీ లో అతని రచనలు నిషేధించబడ్డట్టు గానే, వివి రచనలు కూడా కొన్ని భారత ప్రభుత్వం నిషేధించాయి, కుట్ర కేసులు కూడా బనాయించారు. 1940 లో నాజామ్ ను అరెస్టు చేసి జైలు శిక్ష విధించినప్పుడు ప్రపంచంలోని మేధావులంతా ఐక్యమై జీన్ పాల్ సాత్రే ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి అందులో పాబ్లో పికాసో,
    పాల్ రోబెసన్ వీళ్లంతా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చేపట్టి దేశవ్యాప్తంగా పిటిషన్లు సంతకాలతో, నిరాహార దీక్షలతో ఉద్యమం చేపట్టారు.
    అతని తల్లి సెలీలే కూడా నిరాహార దీక్ష చేపట్టింది.
    Najam Hikmet జైల్లో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు, నేడు నవి ముంబై తలోజ జైలులో వరవరరావు గారు పరిస్థితి కూడా అలాగే ఉంది. భారత న్యాయ స్థానం వరవరరావు తరఫున ఉన్న న్యాయవాదుల, డాక్టర్ల అభ్యర్థనను తిరస్కరిస్తున్నారు. ప్రపంచంలోనే కమ్యూనిస్టు ఉద్యమ కారుల జీవితాలు కూడా కష్టాలతో త్యాగాలతో ముడిపడి ఉంటాయి గావును. అందుకే ఈ సందర్భంలో 1950 లో మ్యూజింగ్స్లలో చలం అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి.
    ” నా మనసు కమ్యూనిస్టుల కాళ్ళ మీద పడుతోంది​.
    నమ్మిన ఆశయాల కోసం తమ ప్రాణాల్ని తృణప్రాయంగా త్యజిస్తూన్నారు. —చలం
    ప్రపంచంలో ధైర్యమైన దృశ్యం ఏమిటంటే ఒక గొప్ప మనిషి ప్రతికూలత కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు.
    ” The boldest view in the world Is that a great may is fighting against negativity.”
    Lucius Annaeus Seneca

  • వివి గారి గురించి మంచిగా రాశారు

  • ఊరక కూర్చున్న

    నోరున్న ప్రతివాడు నేరస్తుడే!…….

    అవును అందరం నేరస్తులమె…..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు