రెక్కల మనిషి

మూలరచన: గాబ్రియల్ గార్సియో మార్క్వజ్

తెలుగు అనువాదం: ఎయం.అయోధ్యారెడ్డి

లాటిన్ అమెరికా లెజండరీ పోయెట్ పాబ్లో నెరుడాకు సమఉజ్జీగా ఖ్యాతినార్జించిన మహా రచయిత గాబ్రియెల్ గార్సియా మార్క్వజ్ (1927-2014) , కొలంబియా దేశస్థుడు.1927లో కొలంబియాలోని అరకాటకాలో ఒక పేద కుటుంబంలో పుట్టాడు. పన్నెండుమంది సంతానంలో అందరికన్నా పెద్దవాడు. కథ, నవల, సినీ, కాల్పనికేతర రచయిత అయిన మార్క్వజ్ న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్ అయినా, ఆయన పాత్రికేయ వృత్తిని ఎంచుకున్నాడు. ఎక్కువకాలం జర్నలిస్టుగా, సినీ రచయితగా పనిచేశాడు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్నో నవలలు, కథలతోపాటు, విస్తృతమైన సాహిత్య సృజన చేశారు. దక్షిణ అమెరికా సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కించిన మేజిక్ రియలిజం ఉద్యమాన్ని తన రచనలతో మరింత పరిపుష్టం చేశారు.

ముఖ్యంగా1967లో వెలువడిన ఆయన అత్యద్భుత గద్య కళాఖండం“వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్” నవల ప్రపంచ సాహిత్యంలో ప్రకంపనలు సృష్టించింది. ఆయనకు ఖండాంతర ఖ్యాతితోపాటు,1982లో నోబెల్ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. సాహిత్యానికి నోబెల్ అవార్డు పొందిన లాటిన్ అమెరికన్ రచయితల్లో మార్క్వజ్ నాలుగోవాడు.

ఆయన రచనలన్నీ సామాన్య పాఠకుడు మొదలు విమర్శకుల అభిమానాన్ని, ఆదరణను పొందినయి. వాణిజ్యపరంగానూ గొప్ప విజయం సాధించినయి. వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్, క్రానికల్ ఆఫ్ ఎ డెత్ ఫోర్టోల్డ్, లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా(నవలలు); నో వన్ రైట్స్ టు ది కల్నల్, ఇన్నోసెంట్ ఎరెండిలా, ఎ వెరీ ఓల్డ్ మ్యాన్ విత్ ఎనార్మస్ వింగ్స్ (కథా సంపుటాలు); మెమొరీస్ ఆఫ్ మై మెలంకలీ వోర్స్ (ఆత్మకథ) మార్క్వజ్ ముఖ్యమైన రచనలు. పదుల సంఖ్యలో ఆయన పొందిన ప్రపంచ పురస్కారాల్లో న్యూస్టాడ్ అంతర్జాతీయ బహుమతి(1972), నోబెల్ బహుమతి(1982) ప్రధానమైనవి.

78 ఏట 2014లో మరణించిన గార్సియా మార్క్వజ్ జీవితాంతం నిబద్ధత గల వామపక్షవాదిగా సోషలిస్ట్ నమ్మకాలకు కట్టుబడి ఉన్నాడు. ఫిడేల్ కాస్ట్రోకు సన్నిహిత మిత్రుడైనా తనదైన దూరాన్ని పాటించాడు. క్యూబా విప్లవం సాధించిన విజయాలను ప్రశంసించినవాడే, కాస్ట్రో పాలనాంశాలను తీవ్రస్థాయిలో వుమర్శించాడు.

వారంలో ఓ బుధవారం కేవలం అరగంట వ్యవధిలో ఒక గదిలో జరిగిన సంఘటనల ఆధారంగా1955లో రాసిన“లీఫ్ స్టార్మ్” అనే మొట్టమొదటి నవల ఆయనకు విశ్వస్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. చిన్నప్పటి నుంచి తను పెరిగిన తాత, అమ్మమ్మల ఇల్లు, అనుభవాల ఆధారంగా ఒక నవల రాయాలనుకున్నాడు. అట్లా ప్రతిరోజూ క్రమం తప్పక ఏడాదిన్నరలో రాసిన, 1967లో ప్రచురణ పొందిన “వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్” ఒక ప్రభంజనం సృష్టించి ఏకాలానికైనా ఈనాటి పుస్తకమై భాసిల్లుతున్నది. ఈ నవల ఆంగ్లానువాదం ఆ రోజుల్లోనే మూడు కోట్లకు పైగా కాపీలు అమ్ముడై చరిత్ర సృష్టించింది. ఈ నవలతో వొచ్చిన అంతర్జాతీయ ఖ్యాతి వల్ల కొలంబియా ప్రభుత్వం, గెరిల్లాల మధ్య జరిగిన అనేక చర్చల్లో ఫెసిలిటేటర్‌గా వ్యవహరించే అవకాశం ఆయనకు కలిగింది.

వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ నవల నేపధ్యం వాస్తవికతే అయినా ఫాంటసీ, హారర్, హాస్య పాత్రల అనూహ్య విన్యాసాలు, ప్రతిస్పందనలతో చదువరులను ప్రకంపణకు గురిచేస్తూ వారి ఊహాశక్తిని సవాలు చేసింది. సాహిత్యంలో ఒక ఉద్యమమై మ్యాజిక్ రియలిజంగా పేరొందింది. రచయితలు జీవితాన్ని చూసే దృష్టినే ఈ నవల పూర్తిగా మార్చేసింది. ప్రేమలు, ఎడబాట్లు, యుద్దాలు, చావులు, శాంతి సర్దుబాట్లు, కోరికలు గుర్రాలై పరిగెత్తే యువతరం, చరమాంకాన్ని మోస్తున్న వృద్ధులు, ఇట్లా కళ్ల ముందు ఒక మహస్వప్నాన్ని ఆవిష్కరిస్తాడు. ఇలాంటి మహాకావ్యాన్ని చదవడమే జీవితంలో గొప్ప అనుభవమని యావత్ లోకం అంగీకరించింది.

1955లో వచ్చిన మార్క్వజ్ ప్రసిద్ధ కథా సంపుటం“ఎ వెరీ ఓల్డ్ మ్యాన్ విత్ ఎనార్మస్ వింగ్స్” లోని టైటిల్ కథకు ఇది తెలుగు అనువాదం.

——————————–

మూడ్రోజులుగా ఉధృతంగా గాలివాన, తుఫాను బీభత్సం.

భూమీ ఆకాశమూ ఏకమై ప్రకృతి మీద పగబట్టి శిక్షిస్తున్నయి. కల్లోల కడలిలో ఉవ్వెత్తున లేచిన అలలు భూమ్మీదకు విరుచుకపడి అల్లకల్లోలం చేసినయి. పెలయో ఇల్లంతా బురదనీరు ముంచెత్తింది. తడిసిన చెత్తా చెదారంతో నిండింది. నీళ్ళతోపాటు కొట్టుకొచ్చిన వివిధ జలచరాల కళేబరాలు కుళ్లి కంపు కొడుతున్నయి. ముఖ్యంగా ప్రాణాలతో వున్న పీతలు వందలసంఖ్యలో ఇంట్లో ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ చిరాకునూ, భయాన్నీ కలిగిస్తున్నయి. పెలయో, అతని భార్య ఎలిసెందా కష్టపడి పీతలన్నిటిని చంపేశారు. రాత్రంతా చంటిపిల్ల తీవ్రజ్వరంతో మూసిన కన్ను తెరవకుండా పడున్నది. ఇంట్లో దుర్వాసన కారణంగానే చంటిది జబ్బుపడ్డదని వాళ్ళు భావించారు.

పెలయో వాటన్నిటినీ ఎత్తుకెళ్ళి సముద్రంలో పడేశాడు. అతడు తిరిగొస్తుంటే పెరట్లో కొంచెం దూరంలో ఏదో ఆకారం కదిలినట్టయింది. మూలిగినట్టు కూడా వినిపించింది. అతడు దగ్గరకువెళ్ళి చూస్తే అక్కడో వృద్ధుడు బురదలో పడివున్నాడు. ముఖం కొంతమేర మట్టిలో కూరుకుపోయి సరిగా కనిపించలేదు. గంప కిందపడేసి అతన్ని తట్టి లేపబోయాడు. కానీ ఎంత కుదిపినా వృద్ధుడు లేవలేదు. పెలయో అప్పుడు గమనించాడు… విచిత్రంగా అతని రెండు భుజాల మీదా రెక్కలున్నయి. చాలా పెద్దవైన ఆ రెక్కలు కొంతవరకు మట్టిలో దిగబడి అతడు లేవలేకపోతున్నడు. పెలయో భయంతో తనకు తెలియకుండానే కేక పెట్టాడు. ఇక అక్కడుండకుండా పరుగున వెళ్ళి ఎలిసెందాతో ఈ సంగతి చెప్పాడు. ఆమెను వెంటబెట్టుకొని పెరట్లోకి వచ్చాడు.

ఇద్దరూ భారీ రెక్కలున్న ఆ వృద్ధున్ని మాటలురాని వాళ్ళలా చూస్తుండిపోయారు. అపరిచిత రెక్కలమనిషి ఎంతో వికారంగా, చెత్త కుప్పలో చెత్త మాదిరి కనిపించాడు. మూడొంతుల పైగా వున్న బట్టనెత్తిమీద రంగేదో తెలియని కొన్ని వెంట్రుకలు బురదగొట్టుకొని ఉన్నయి. తెరిచిన నోట్లోంచి రెండో మూడో మిగిలివున్న పళ్లు బయటికి కన్పిస్తున్నయి. వృద్ధున్ని అట్లా దయనీయ స్థితిలో చూస్తుంటే పెలయోకు చచ్చిపొయిన తన తాత గుర్తొచ్చాడు. అతనిలో ఏ మూలలో మానవత మేల్కొన్నది. భార్యభర్తలు చాలా దగ్గరికెళ్లి రెక్కల మనిషిని పరిశీలించారు. భుజాల మీద రెక్కలు మినహా అంతా సాధారణంగా ఉండటంతో వాళ్ళు కొంత కుదుటపడ్డారు. అతనూ తమలాంటి మనిషేనని భావించారు. దీంతో ధైర్యంగా వృద్ధునితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. పెలయో అడిగే  ప్రశ్నలకు వృద్ధుడు ఏదో భాషలో వింత శబ్దాలు చేస్తూ ముక్కలు ముక్కలుగా గొణిగాడు. వాళ్ళకేం అర్థం కాలేదు.

కానీ పెలయో అతి తెలివితో ఏవేవో ఊహించుకున్నాడు. ఏదో విదేశీ నౌక తుఫానులో చిక్కుకొని మునిగిపోగా అతడిట్లా ఒంటరిగా తీరానికి కొట్టుకొచ్చిన నావికుడై వుంటాడని భావించి అదే విషయం భార్యకు చెప్పాడు. చివరికి ఎటూ తేల్చుకోలేక వెళ్ళి తమ పక్కింటి తలపండిన ముసలవ్వను పిలుచుకొచ్చారు. ఆమె తన సుదీర్ఘ జీవితానుభవంలో ఎన్నో జనన మరణాలను, చిత్ర విచిత్రాలను చూసివున్నది గనుక వృద్ధుని సంగతి సరిగ్గా చెపుతుందని భావించారు. ఒక్క చూపులోనే ఆమె ఏదో గ్రహించినట్టు తలూపుతూ“ఇతడు మనిషి కాదు, దేవదూత” అన్నది గంభీరంగా.

“దేవదూతనా?” ఆశ్చర్యపోయారు దంపతులు.

“అవును.. ఇతడు దేవుని తరఫున వచ్చినవాడు. జబ్బుతో వున్న మీ చంటిదాని కోసం వొచ్చివుండొచ్చు. ఐతే గాలివాన మధ్యలోనే కూల్చేసి ఇతని ఉనికి బయటపెట్టింది. దేవలోకం నుంచి వెలివేయబడ్డ దూతలు ఇట్లా మనుషుల మధ్యకు వొస్తుంటారు”

ఆమె చెప్పింది విని నోరు తెరిచారు పెలయో, ఎలిసెందా.

**

మర్నాటికి ఈ సంగతి గాలివాన కంటే వేగంగా వ్యాపించి పొయింది. పండు ముసలవ్వ అనుభవంతో హెచ్చరించినా వినకుండా

పెలయో ఒక వింత రెక్కల దేవదూతని ఇంట్లో పెట్టుకున్నాడన్న వార్త చుట్టుపక్కల వాళ్ళకు తెలిసింది. రెక్కల మనిషి పట్ల

లోపల తెలియని భయం ఉన్నప్పటికీ పెలయో కొంత సానుభూతి చూపాడు. ఆ ముసలతన్ని అట్లా వొదిలేయలేక పోయాడు.అయితే దినమంతా వింత మనిషి మీద కన్నేసి వుంచాడు.

రాత్రి పడుకోబోయే ముందు వృద్ధున్ని బురదలోంచి లాక్కొచ్చి పక్కన కోళ్ళషెడ్డులో కోళ్ళతో పాటు పడేశాడు.

అర్ధరాత్రి దాటిపోయాక కూడా పెలయో, ఎలిసెందాలు ఇంకా ఇంట్లో అక్కడక్కడ తిరుగుతున్న పీతలను వేటాడి చంపుతూనే వున్నారు. కొంతసేపటికి చంటిది నిద్ర లేచింది. దాని జ్వరం పూర్తిగా తగ్గిపొయింది. జ్వరంనుంచి తమ పాప కోలుకోవడం వాళ్ళను ఆనందపరిచింది. “ఇదంతా ఆ దేవదూత ప్రభావమే” అన్నాడు పెలయో సంతోషంగా. అవునని తలూపింది ఎలిసెందా.

రెక్కల మనిషి పట్ల వాళ్ళకి సానుభూతి మరింత పెరిగింది. ప్రతిగా అతనికేదైనా చెయ్యాలనుకున్నారు. తెల్లారిన తర్వాత వృద్ధున్ని ఒక తెప్పమీదకు చేర్చి, మూడుదినాలకు సరిపడా ఆహారం, మంచినీళ్ళూ పెట్టి సముద్రంలో అతని అదృష్టానికి వదిలేయాలని నిర్ణయించారు.

కానీ వాళ్ళు అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. పొద్దున్నే పెరట్లో కలకలం వినిపించింది. చుట్టుపక్కల వాళ్ళంతా కోళ్ళషెడ్డు ముందు గుమిగూడి పోయారు. అక్కడ చాలా హడావిడిగా ఉన్నది. రెక్కల మనిషిని ఊరికే చూడకుండా జనం తలోమాట అంటూ వినోదిస్తున్నారు. అతడు దేవదూత కావొచ్చునన్న యోచన లేకుండా వేధిస్తున్నారు. కొందరు తమదగ్గరున్న పదార్థాలు షెడ్డు లోపలికి విసురుతున్నారు.  వృద్ధున్ని తినమని గట్టిగా అరుస్తున్నారు. జనం ధోరణి చూస్తే లోపలున్నది ఒక అసాధారణ ప్రాణి అని కాకుండా సర్కస్ జంతువు అన్నట్టున్నది.

ఎనిమిది గంటలయ్యేసరికి ఈ వార్త తెలిసి ఫాదర్ గొంజగా అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మూగిన జనం ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు. విషయజ్ఞానం లేకుండా తమకు తాము ఏర్పరచుకున్న నమ్మకాలతో వృద్ధుని ఉనికి గురించి, అతని భవిష్యత్తు గురించి ఉచిత సలహాలిస్తూ సానుభూతి కురిపిస్తున్నారు.

“అతడు దేవదూత. కాబట్టి అతన్ని ప్రపంచానికే మేయర్ గా ప్రకటించాలి” ఒకతని అభిప్రాయం.

“ లేదు.. దేవదూత గనుక అతనికి దైవశక్తులుంటాయి. అతన్ని జనరల్ గా నియమించాలి. అప్పుడు అన్ని యుద్ధాలూ అలవోకగా గెలిచేస్తాడు” మరొకరి వ్యాఖ్య.

“అతనికి మూడులోకాల బాధ్యతలు అప్పజెప్పాలి”

“ కాదు, అతని చెవులకు పోగులు ధరింపజేసి రెక్కల మేధావులకు నాయకుణ్ణి చేయాలి”

ఫాదర్ గొంజగా ఎవరి మాటలు పట్టించుకోకుండా షెడ్డు వద్ద నిల్చొని ఒకసారి చేతిలో మత సంబంధ ప్రశ్నోత్తర గ్రంధం క్షుణ్ణంగా తిరగేశాడు. అతడు అంత తేలిగ్గా దేన్నీ ఒప్పుకోడు. తర్వాత షెడ్డు తలుపులు తెరవమని ఆదేశించాడు.

షెడ్డు పరమ గలీజుగా ఉన్నది. చిరాకు పడుతూ లోపలికి పోయాడు. లోన బురద మరకలంటిన కోడిపిల్లల నడుమ శుష్కించిన పెద్దకోడిలా కనిపించాడు వృద్ధుడు. అతనికి దగ్గరకు వెళ్ళాడు ఫాదర్. బలహీనంగా, దీనమైన స్థితిలో కనిపించాడు వృద్ధుడు. షెడ్డులో ఎండపడుతున్న చోటుకు జరిగి రెక్కలు ఆరబెట్టుకుంటున్నట్టు పడుకొని వున్నాడు. జనం విసిరిన పండ్లు, కూరగాయలు, బ్రెడ్డు ముక్కలు చుట్టూ చిందరవందరగ పడివున్నయి.

వృద్ధుడు వాటిని పట్టించుకున్నట్టు లేదు. ఫాదర్ వైపు ఒకసారి కళ్ళెత్తి చూశాడు. తన యాసలో ఏదో గొణిగాడు.

ఫాదర్ మరింత సమీపానికి వెళ్ళి“శుభోదయం బిడ్డా…” అన్నాడు మతభాష లాటిన్ లో.

వృద్ధుడే మాత్రం స్పందించ లేదు. దైవభాషగా కీర్తించబడే లాటిన్ లో శుభోదయం చెబితే అతనికి అర్థం కాకపోవడం, ఒక ప్రీస్ట్ అయిన తనలాంటి పెద్దవారిని ఎట్లా గౌరవించాలో తెలియకపోవడం ఫాదర్ కు చిత్రమనిపించింది. రెక్కల మనిషి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న మోసగాడన్న అనుమానం కలిగింది. వృద్ధున్ని పరిశీలనగా చూశాడు. రెక్కలు మినహా దాదాపు సాధారణ మనిషిలాగే వున్నాడు. కానీ అతణ్ణుంచి భరించలేని దుర్గంధం వ్యాపిస్తున్నది. అతని పెద్దపెద్ద రెక్కల వెనుక ఎన్నో  క్రిమి కీటకాలు, పరాన్నజీవులు చిక్కుకొని చనిపోయి వున్నాయి. దుర్గంధానికి కారణం అదే కావొచ్చు. గాలివాన తాకిడికేమో రెక్కల ఈకలు చాలావరకు రాలిపోయి చర్మం అసహ్యంగా కనిపిస్తున్నది.

దేవదూతకు వుండాల్సిన అసాధారణ లక్షణం ఏ ఒక్కటీ అతనిలో లేదని ఫాదర్ గ్రహించాడు. నిజమైన దేవదూతలు ఇంత మురికిగా వుంటారా? అనుకొని ఇక అక్కడుండలేక బయటికొచ్చాడు. గొడవగా మాట్లాడుకుంటున్నజనాన్ని ఉద్దేశించి “ఆ వృద్ధుణ్ణి ఎవరైనా అల్లరి పెట్టినా… వేధించినా అది మీకే ప్రమాదం” అని హెచ్చరించాడు.

అయితే అతడు దేవదూత కాదని తను అనుమానిస్తున్నట్టు బయటికి వెల్లడించలేదు. “మూఢ నమ్మకాలతో వుండేవాళ్లను మాయచేసేందుకు ఇట్లాంటి విచిత్రశక్తులు ఎన్నోయుక్తులు పన్నుతాయి. సైతాన్ ఈవిధంగా మారు రూపంలో వొచ్చి మనల్ని పాపంలోకి నెట్టుతాడు. మీరంతా జాగ్రత్తగా వుండాలి” హితబోధ చేశాడు.

వృద్ధుడు కలిగివున్న రెక్కలకు ఏమాత్రం ప్రాముఖ్యత లేదని స్పష్టం చేశాడు.

“ఆకాశంలో ఎగిరే గద్దలకూ, విమానాలకూ తేడా కనిపెట్టేందుకు రెక్కలు ప్రామాణికం కాదు. ఒక దేవదూతను గుర్తించేందుకు రెక్కల ప్రసక్తి అవసరం లేదు” అన్నాడు. అయినప్పటికీ తానీ విషయం బిషప్ కు లేఖ రాస్తానని ఫాదర్ తెలిపాడు. చర్చి అధిపతికి, అక్కణ్ణుంచి పోప్ దృష్టికి కూడా తీసుకెళ్ళి రెక్కల మనిషి విషయంలో తుది తీర్పు తెప్పిస్తానని గొంజగా ప్రకటించాడు.

వార్త బయటికి పొక్కకుండా వుండేందుకు ఫాదర్ ఇదంతా చెప్పాడు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. జనం ఆయన హెచ్చరికల్ని తేలిగ్గా తీసుకున్నారు. కొన్నిగంటల వ్యవధిలో వేగంగా వ్యాపించి చూస్తుండగానే పెలయో ఇంటి పెరడు జాతర స్థలంగా మారిపొయింది.

రెక్కల మనిషిని చూసేందుకు జనం ఎగబడ్డారు. గందరగోళం… తొక్కిసలాట జరిగింది. పోలీసులొచ్చి జనాన్ని చెదరగొట్టారు.

జనజాతర వల్ల పెలయో వాకిలంతా చెత్తాచెదారంతో నిండింది. అదంతా ఊడ్చి ఎత్తిపోసేసరికి నడుము విరిగినంత పనైంది. జనాన్ని, దీనికి కారణమైన రెక్కల మనిషిని మనసులో తిట్టుకున్నాడు. ఆ విసుగులోనే అతనికి ఒక బ్రహ్మాండమైన ఆలోచన కలిగింది. పెరటి చుట్టూ కంచె నిర్మించి రెక్కల మనిషిని చూడ్డానికొచ్చే వాళ్లనుంచి ఐదు సెంట్ల చొప్పున ప్రవేశరుసుం వసూలు చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అందుకు ఏర్పాట్లు చేశాడు.

పెలయో ఈ ట్రిక్ అద్భుతంగా పనిచేసింది. చుట్టుపక్కల ఏటా జరిగే పండుగలు, ఉత్సవాలను సైతం పట్టించుకోకుండా జనం రెక్కల మనిషిని చూసేందుకు ఎగబడ్డారు. పెలయో, ఎలిసెందాలకు డబ్బులే డబ్బులు. వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు. కొద్దిరోజుల్లో వాళ్ళ చిన్నకొంపలో డబ్బులు కుప్పలుగా పడ్డాయి. ఆ ఊరివాళ్లే కాకుండా దూరప్రాంత ఊర్ల నుంచి కూడా సందర్శకులు బాగా పెరిగిపోయారు.

ఇంత హడావిడి జరుగుతున్నా తనకు సంబంధం లేనట్టు ఉన్నాడు రెక్కల మనిషి. దీనికంతటికీ కేంద్రబిందువు అతనే అయినా అందులో అతనికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. కోళ్లషెడ్డులో అట్లానే పడివున్నాడు. పెద్దగా కదలికలు లేక ఉన్నచోటనే సౌకర్యంగా వుండేందుకు ప్రయత్నిస్తున్నాడు.

వైర్లతో అల్లబడిన షెడ్డు గోడల చుట్టూ వందల సంఖ్యలో సందర్శకులు వెలిగించిన నూనె దీపాలు, కేండిల్స్ కారణంగా వేడికి తట్టుకోలేక పోతున్నాడు. శతాధిక వృద్ధురాలు తన అనుభవంతో చెప్పిన సలహా మేరకు భక్తులు రెక్కల మనిషికి ఆహారంగా కర్పూరం బిళ్ళలు, నవ్వొత్తు గడ్డలు, కలరా గోళీలు అతని ముందు విసిరారు. దేవదూతలు ఇష్టంగా తినే ఆహారం ఆదేనని పండు ముసలవ్వ చెప్పింది. కానీ రెక్కల మనిషి వాటివంక అయిష్టంగా చూశాడు. పాపభీతితో అక్కడికొచ్చిన భక్తులు సమర్పించిన నైవేద్యాలను కూడా తిరస్కరించాడు. అందుకు కారణం ఎవరికీ బోధపడలేదు. అతడు దేవదూత కావడం వాళ్లనా? లేక వృద్ధాప్యంతో గట్టి ఆహారం తినడం చేతకాక పోవడం వల్లనా?  వాస్తవానికి అప్పటివరకు రెక్కలమనిషిలో ఒక్క దైవ లక్షణం గానీ, అద్భుత శక్తిగానీ ఎవరూ చూడలేదు.

ఒకేఒకటి మాత్రం అందరినీ ఆకట్టుకున్నది. అది అతనిలోని సహనం.

పెలయో అతన్ని కోళ్ళషెడ్డులో పడేసిన కొత్తలో షెడ్డులోని కోడిపిల్లలు కూడా వృద్ధున్ని  లెక్కచేయలేదు. అతన్ని  ప్రాణమున్న జీవిగా భావించక అతని రెక్కల చాటున చచ్చిపడున్న కీటకాలు, జలచరాల కళేబరాలను ఎగబడి ముక్కులతో పొడుచుకు తిన్నాయి.

కోళ్ళు అంతలా పొడుస్తున్నా వృద్ధుడు కిమ్మనలేదు. కొందరు గడుగ్గాయిలు అతని పైకి రాళ్లు విసిరారు. రాళ్లు తగిలితేనైనా అతడు లేచి నిలుచుంటాడని, అప్పుడతని పూర్తి ఆకారాన్ని చూడొచ్చని ఆతృతపడ్డారు. అయినా అందరికీ నిరాశే ఎదురైంది.

నొప్పే కలిగిందో, తట్టుకోలేని క్షోభే కలిగిందో అతడు కనీసం వ్యక్తం చేయలేదు. కొంచెం కూడా కదల్లేదు. కానీ… పొడవైన ఇనుప చువ్వలు కాల్చి అతని దేహానికి గుచ్చినప్పుడు మాత్రం బాధ తట్టుకోలేక అటూఇటూ కదిలాడు. కన్నీళ్ల పర్యంతమవుతూ అర్థం కాని భాషలో గొణుగుతూ అందరివైపూ దీనంగా చూశాడు. రెక్కలు పొడవుగా చాపి టపటపా నేలమీద కొట్టుకున్నాడు. ఆ గాలికి షెడ్డులో దుమ్ము పైకి లేచి దుర్గంధం వ్యాపించింది.

“ఇది దేవదూత ఆగ్రహం కాదు, కేవలం బాధను తట్టుకోలేక అట్లా ప్రవర్తించాడు” అని కొందరు అభిప్రాయపడ్డాడు.

అప్పటినుంచి జనం కొంత వెనక్కి తగ్గారు. రెక్కల మనిషిని విసిగించి బాధపెట్టొద్దని భావించారు.

“అతని సహనమూ, స్తబ్దతా శుభప్రదం కాదు. రాబోయే ఉపద్రవానికి ముందు ప్రశాంతత” అని కొందరు వ్యాఖ్యానించారు.

ఇదంతా చూస్తూ కూడా ఫాదర్ గొంజగా జనాన్ని వాళ్ళ ఊహాగానాలకు వదిలేశాడు. ఆయన మతపెద్దల నుంచి వచ్చే తీర్పు కోసం చూస్తున్నాడు. కానీ ఎన్నిరోజులైనా రోమ్ నుంచి ఎలాంటి సందేశమూ రాలేదు. మతపెద్దలు తొందరపడి నిర్ణయాన్ని ప్రకటించకుండా నిదానంగా గొంజగా నుంచి వివిధ సందేహాలు నివృత్తి చేసుకున్నారు.

రెక్కల మనిషికి నాభి ఉన్నదా? అతడు మాట్లాడే భాషకూ… ప్రాచీన ఆరామిక్ భాషకూ ఏదైనా పోలిక కనిపిస్తుందా? అతడు దైవదూత అనేందుకు ఇంకేమైనా అసాధారణ అర్హతలున్నయా? ఏమైనా మహిమలు చేస్తున్నాడా? అతడు రెక్కలు కలిగిన నార్వేజెన్ మాత్రమేనా? లేక మరెవరన్నా అయ్యే అవకాశం ఉన్నదా?

ఇటువంటి సందేహాలతో పైనుంచి వచ్చే లేఖలకు ఫాదర్ తనకు తెలిసిన సమాచారం ఎప్పటికప్పుడు పంపించాడు. అయితే ఈలోగా ఫాదర్ ఆతృతను దూరంచేస్తూ ఊర్లో ఒక అనూహ్య సంఘటన జరిగి పరిస్థితి మొత్తం మారిపోయింది.

మామూలుగానే ఓ రోజు సంచార కళా ప్రదర్శకుల బృందం ఊర్లో కొచ్చింది. ఆ బృందంలో పెద్ద సాలెపురుగు ఆకారంలో వున్న ఒక స్త్రీ అందరినీ ఆశ్చర్యపరిచింది. తలవరకూ అందమైన స్త్రీ రూపం, మిగతా భయం గొలిపే సాలీడు దేహం కలిగివున్నది. తల్లిదండ్రుల పట్ల  ఆవిధేయత చూపినందుకు ఆ మహిళ శపగ్రస్థురాలై సాలీడు రూపాన్ని పొందినట్లు ప్రదర్శకులు తెలిపారు.

ఈ వింత చూసేందుకు జనం ఎగబడ్డారు. ఐతే ఇక్కడకూడా ప్రవేశ రుసుము పెట్టారు. అది రెక్కల మనిషి దర్శన రుసుము కంటే తక్కువుండటం జనానికి నచ్చింది. పైగా ప్రజలు ఆమె సాలీడు అవతారానికి సంబంధించి ఏ ప్రశ్నలయినా ముఖాముఖి అడిగి తెలుసుకునేందుకు అనుమతిచ్చారు.

జనానికి అంతకన్నా ఏం కావాలి! ఆ వింత స్త్రీని దగ్గర నుంచి చూసే అవకాశంతో పాటు ఆమె గురించి పూర్తి వివరాలు ఆమె నోటి నుంచే తెలుసుకునే వీలు కలిగింది. ఆమె వికృత ఆకారం కంటే ముఖంలో కనిపించే దైన్యం, మాటల్లో ధ్వనించే వేదన చూసేవాళ్లను కలచివేస్తుంది. సాలీడు మహిళ తన విషాదగాధ అడిగిన వాళ్ళందరికీ చెపుతున్నది. తనకీ ఖర్మ ఎందుకు పట్టిందో వివరిస్తున్నది.

చిన్నతనంలో ఒకరోజు తల్లిదండ్రులకు చెప్పకుండా ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయి ఒక డాన్స్ షోలో పాల్గొన్నది. రాత్రంతా ఆడి పాడి  తెల్లారే ముందు ఇంటికి తిరిగొస్తుంటే పెద్ద గాలి దుమారం, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపు మెరిసి కొద్దిదూరంలో పిడుగు పడింది. అంతే… ఆ మరుక్షణం నుంచే ఆమె సాలీడు రూపానికి మారిపోయింది. ఇదంతా తన తల్లిదండ్రుల ఆగ్రహ ఫలితమేనని ఆమె ఇప్పటికీ నమ్ముతున్నది.

ఈ కథను జనం బాగా నమ్మారు. పైగా ఆమె, రెక్కల వృద్ధుని మాదిరి కాకుండా వాళ్ళు విసిరిన మాంసం ముక్కలను చక్కగా

తీసుకొని ఆరగించింది. వింతగా… వినోదంగా వున్న ఆమె మాటలు, కదిలించే గతం, మనిషి అనుభవాలకు దగ్గరగా వున్న ఆమె గత జీవిత ఘటనలు అందరికీ నమ్మకం కలిగించాయి.

రెక్కలమనిషి దీనికి భిన్నం. ఇటు మనిషి లక్షణాలు పూర్తిగా లేక, అటు దేవదూత అనదగ్గ ఒక్క అర్హతా లేక వృద్ధాప్యంతో బలహీనంగా వున్న అతన్ని ప్రజలు త్వరగానే మరిచిపోయారు. అప్పటివరకూ రెక్కల మనిషి మహిమలుగా చెప్పుకుంటున్న చిన్న చిన్న విశేషాలను కూడా భ్రమలని జనం కొట్టిపారేశారు. చాలరోజులుగా అంధుడైన ఒక వృద్ధునికి కొత్తగా మూడు ముందు పళ్ళు రావడం; పక్షవాతంతో మంచం లోంచి లేవలేని మరోవ్యక్తికి అనూహ్యంగా లాటరీ తగలటం; ఒక కుష్టురోగి వొంటిమీది పుండ్లు పొద్దు దిరుగుడు పూలవలే మారిపోవడం వంటి కొన్ని విచిత్రాలు ఉత్త పుకార్లని ప్రజలు అనుకోసాగారు.

రెక్కల మనిషిని కొంతవరకు దేవదూతగా భావించడానికి దోహదపడ్డ విశేషాలన్నీ ఇప్పుడు పుకార్లని జనం భావించడంతో వృద్దుని ఆదరణ పూర్తిగా దెబ్బతిన్నది. ముఖ్యంగా సాలీడు స్త్రీ ఖ్యాతి ముందు రెక్కలమనిషి ఉనికి కొట్టుకపోయింది. ఈ పరిణామం చర్చిఫాదర్ గా గొంజగా తలమీద పెద్ద భారాన్ని దింపినట్టయింది. రెక్కల మనిషి దేవదూతనా? లేక మామూలు మనిషేనా అన్నది తేల్చలేక ఇప్పటివరకూ సతమత మయ్యాడు. ఇప్పుడా సమస్య లేదు. ఎందుకంటే సాలీడు స్త్రీని ఎవరూ దేవదూతగా భావించడం లేదు. మరోపక్క రెక్కల మనిషిని మర్చిపోయారు. సమస్య అట్లా పరిష్కారమైంది.

అంతవరకూ ఒక జాతరలా కొనసాగి పెలయోకు కనకవర్షం కురిపించిన అతనింటి పెరడు ఇప్పుడు బోసిపోయింది. పెరడులో రెక్కలమనిషి రాకకు ముందున్న స్థితి నెలకొన్నది. కానీ పెలయో దంపతులకు ఎంతమాత్రం విచారం లేదు. ఎందుకంటే వాళ్ళప్పటికే ఎంతో డబ్బు వెనుకేసుకున్నారు. ఆ డబ్బుతో కొద్దిరోజుల్లోనే పెలయో అందమైన రెండంతస్థుల మేడ కట్టాడు. అందమైన రెండు బాల్కనీలు, పెరడంతా చక్కటి తోట. గాలివానలప్పుడూ, శీతాకాలంలోనూ పీతలూ… మరే  కీటకాలు ఇంట్లోకి రాకుండా చుట్టూ చిక్కని ఇనుప కంచె నిర్మించుకున్నాడు. అలాగే రెక్కల మనిషి లాంటి విచిత్ర జీవులేవీ లోపల ప్రవేశించకుండా కిటికీలకు వైర్లతో జాలీలు ఏర్పాటు చేయించాడు. పట్నంలో సొంతంగా కుందేళ్ళ ఫారం ప్రారంభించాడు. అప్పటివరకూ చేస్తున్న కోర్టు బంట్రోతు నౌకరీ వొదిలేసి పూర్తిగా వ్యాపారంలో దిగిపొయాడు. మరోపక్క అతని భార్య అవతారం కూడా మారిపొయింది. కొత్త సిల్కు దుస్తులు, కొత్త జోళ్లు, ఆమె కట్టూ బొట్టూ నడవడీ అన్నీ మారి ఆధునిక మహిళ అవతారమెత్తింది. ఇదంతా రెక్కల మనిషి కారణంగా సమకూరిన సంపద మహిమే.

చిన్న ఇల్లు పోయి రెండంతస్థుల భవనం వచ్చినా రెక్కలమనిషిని వుంచిన కోళ్ళషెడ్డును మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. పెలయో అప్పడప్పుడు షెడ్డు శుభ్రంచేసినా అది రెక్కల మనిషి పట్ల విధేయత వల్లనో, కృతజ్ఞత వల్లనో కాదు. అడుగుపెట్టే వీల్లేని విధంగా నిండిపోయి కంపుకొడుతున్న కోడి పెంటను ఎత్తిపారెయ్యడానికి.

పెలయో కూతురు కాస్త పెద్దదై నడకనేర్చింది. పిల్లను షెడ్డు దగ్గరకు పోకుండా పెలయో దంపతులు జాగ్రత్తలు తీసుకున్నారు. వృద్ధుని వల్లా, ఆ పరిసరాల వల్లా పిల్ల తిరిగి జబ్బు పడుతుందని వాళ్ళు భయపడ్డారు. అయితే రోజులు గడిచేకొద్దీ వారిలో భయం తొలిగింది. ఆ పిల్ల అప్పుడప్పుడు ఆడుకునేందుకు షెడ్డులోకి వెళ్ళడం మొదలుపెట్టింది. రెక్కల మనిషి పాప పట్ల ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. ఆమె రావడాన్ని అభ్యంతర పెట్టలేదు. గతంలో తనను అల్లరి పెట్టిన ఆకతాయిలను పట్టించుకోనట్టే ఇప్పుడీ పిల్లను కూడా పట్టించుకోలేదు.

ఒకసారి విచిత్రంగా ఆ పాపకి, రెక్కల మనిషికి ఏకకాలంలో ఆటలమ్మ సోకింది. పాపకి చికిత్స చేసిన వైద్యుడు రెక్కల వృద్ధున్ని కూడా పరీక్షించాడు. అతని పరిస్థితి ఎంతమాత్రం బాగలేదని గ్రహించాడు. గుండె బలహీనంగా అడుతున్నది. మూత్రపిండాల్లో ఏవో వింత శబ్దాలు వినిపిస్తున్నయి. ఇతర కొన్ని అవయవాలు సైతం సరైన రీతిలో పనిచేయడం లేదని, అతడు ఎక్కువ రోజులు బతకడం కష్టమని భావించాడు.  కానీ వృద్ధునికి గల పెద్ద రెక్కలు వైద్యున్ని ఆశ్చర్యపరిచాయి. వాటి వెనుక లాజిక్ ఏమిటో బోధపడలేదు. అతని రెక్కలు కృత్రిమంగా లేవు. చాలా సహజంగా, దేహంలోని ఇతర అవయవాల మాదిరిగానే ఉన్నయి. డాక్టరుకు ఒకటి అర్థం కాలేదు. “వైద్యశాస్త్రంలో ఇదెక్కడా లేదే? మనుషులందరికీ ఇట్లా రెక్కలెందుకు లేవు?” అని ప్రశ్నించుకున్నాడు.

పెలయో కూతురు స్కూలుకు పోవడం ప్రారంభించింది. ఒకసారి పెద్ద గాలివానొచ్చి కోళ్ళషెడ్డు కూలిపొయింది. దాంతో వృద్ధునికి

అనుకోని స్వేచ్ఛ లభించింది. మెల్లగా బయటికొచ్చి అటూ ఇటూ తిరిగాడు. కొత్త బంగాళాలోకి కూడా వొచ్చి అంతటా తిరగసాగాడు. పడకగదిలోకి కూడా ప్రవేశించాడు. ఇదిచూసి పెలయోకు కోపమొచ్చింది. ఆ కోపంలోనే వృద్ధుణ్ణి ఒక ఈత చాపలో చుట్టి ఎత్తుకొచ్చి బయట పడేశాడు. కొద్దిసేపటికే వృద్ధుడు మళ్ళా వంటగదిలో ప్రత్యక్షమయ్యేవాడు. అట్లా అతడు ఇంట్లో అన్నిచోట్లా కనిపిస్తూ తనకెన్నో రూపాలూ, మహిమలూ ఉన్నాయన్న సందేహాన్ని పెలయో దంపతులకు కలిగించాడు.

“వృద్ధుడు ఒక్కడేనా? లేక అతని కారణంగా ఇంకెందరో రెక్కల మనుషులు పుట్టుకొచ్చి ఇల్లంతా నిండిపోతున్నారా?” అని వాళ్ళు భయపడ్డారు. ఇంతమంది దేవదూతలున్న ఇంట్లో నివసించడం అరిష్టమని ఎలిసెందా మొగుడి మీద కేకలేసింది.

**

రోజులు గడుస్తున్నయి. వృద్ధుడు అంతకంతకూ శుష్కించిపోసాగాడు. సరైన ఆహారం లేకనో, పరిసరాలు సరిపడకనో తెలియదు. ప్రాచీనత ప్రతిఫలించే అతని కళ్ళలో పొగమంచు కమ్మినట్టు చూపు తగ్గసాగింది. గుడ్డిగా గెంతుకుంటూ ఒక చోటంటూ లేకుండా పెరడంతా తిరుగసాగాడు. అతని రెక్కల నుంచి ఈకలు రాలిపోతూ కదిలిన చోటల్లా పడుతున్నయి.

ఒక రాత్రి వృద్ధుడు జ్వరతీవ్రతతో పెద్దగా మూలుగుతుంటే పెలయో అతని అవస్థ చూడలేకపోయాడు. వృద్ధుడు బాగా వొణికిపోతూ నాలుక గట్టిగా కరుచుకుంటున్నాడు. ఒక గొంగడి తెచ్చి కప్పి వరండాలో పడుకోబెట్టాడు. పెలయో దంపతులు మొదటిసారి రెక్కల మనిషి ఆరోగ్యం పట్ల కంగారు పడ్డారు. తెల్లారేపాటికి చచ్చిపోతాడేమోని భయపడ్డారు. మరణించిన దేవదూతల భౌతికకాయాన్ని ఏంచేయాలో, అంత్యక్రియలు ఎట్లా జరపాలో తెలియదు. బహుశా పక్కింటి ముసలవ్వకూ తెలియక పోవచ్చని వాళ్ళు భావించారు.

కానీ వాళ్ళ భయాలను పటాపంచలు చేస్తూ రెక్కల మనిషికేమీ కాలేదు. గడగడ వొణికించే శీతాకాలం గడిచి ఎండాకాలం మొదలయ్యే నాటికి బాగా కోలుకున్నాడు. ఆ తర్వాత అతన్ని తిరిగి మళ్ళా ఎవరూ పట్టించుకోలేదు. ఆలనాపాలనా లేకుండా పెరట్లో ఓ మూల రోజులు గడిపాడు. బయటివాళ్ళు సరే… ఇంట్లోవాళ్లు కూడా మరిచిపోయారు.

శీతాకాలం చివరి రోజుల్లో వృద్ధుని దేహంలో కొన్ని మార్పులు రావడం మొదలైంది. అతని రెక్కల్లో కొత్తగా ఈకలు మొలవసాగినయి. డేగ ఈకల మాదిరి అవి దృఢంగా వున్నయి. తనలో వస్తున్న మార్పుల గురించి తనకు మాత్రమే అవగాహన వున్న రెక్కలమనిషిలో కొత్త కళ వొచ్చింది. హుషారు పెరిగింది. ఈకలు రావడం ఎవరూ గమనించకుండా జాగ్రత్త పడ్డాడు. సంతోషంలో రాత్రివేళ చుక్కలు పరుచుకున్న ఆకాశం కింద నావికులు ఆనందంగా పాడుకునే జానపదాలను అప్పుడప్పుడు కూనిరాగాలు తీశాడు. అయితే తను పాడటం ఎవరూ వినకుండా అప్రమత్తంగా ఉన్నాడు.

**

ఒకరోజు ఉదయం పది గంటలప్పుడు…

ఎలిసెందా వంటింట్లో పనిచేసుకుంటున్నది. హఠాత్తుగా బయటి నుంచి పెద్ద గాలితెర కిటికీగుండా వంటగదిలోకి దూసుకొచ్చింది. ఆమె దిగ్గున లేచి కిటికీలోంచి పెరట్లోకి తొంగిచూసి దిగ్బ్రాంతి పడింది. వృద్ధుడు చాలాకాలం తర్వాత ఎగిరేందుకు రెక్కలు విప్పుకొని టపటప లాడిస్తున్నాడు. నేలమీద నొక్కిపెట్టిన అతని చేతివేళ్లలో బలం లేక, పొడవైన గోళ్ళు మడతలు పడ్డాయి. కొంచెం పైకెగిరి అక్కణ్ణుంచి గాలిలో పట్టు సాధించలేక గోడకు తగులుతూ కిందపడ్డాడు.

ఎలిసెందా పరుగెత్తుకొని గుమ్మం దాకా వచ్చి చూసింది. రెక్కల మనిషి మళ్ళా ప్రయత్నించి మరింత ఎత్తుకు ఎగిరాడు. ఇంకా ఎత్తుకి… ఇంకా ఇంకా ఎత్తుకి. ఆకాశంలో పైపైకి. స్వేచ్చగా… పుష్పక విమానంలా దిగంతాల్లోకి సాగిపోయాడు. అతడు కనపడినంత సేపు కళ్ళు చిట్లించుకొని చూసింది ఎలిసెందా. ఒక సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచింది గుండెల మీది భారమేదో దిగిపొయినందుకు తేలికపడుతూ. మరోపక్క రెక్కల మనిషి తనదైన ప్రపంచంలోకి పోతున్నందుకు సంతోషపడుతూ. అతడు ఆకాశంలో కలిసిపోయాడు. జీవితంలో మళ్ళా కనిపించడు. అతడు ఇంకెప్పుడూ తమకు భారం కాడు. చికాకు కలిగించడు. కోపం తెప్పించడు. కానీ సముద్రం అంతమయ్యే చోట ఆకాశాన ఒక ఊహాత్మక గురుతుగా మాత్రం మిగిలిపోతాడు.

*

 

అయోధ్యా రెడ్డి

8 comments

Leave a Reply to Y.Hanumantha rao Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ అనువాదం చాలా బాగుంది అయోధ్యా రెడ్డి గారు

  • “వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్” నవల తెలుగు అనువాదం వచ్చిందా తెలుపగలరు

  • చాలా సరళంగా ఉంది. కొత్త ఒక వింత…ఒక్కసారిగా వచ్చిన సంపద…వింత మనిషి ఆకాశంలో అంతర్ధానం కావడం… అంతా మనిషి ఊహలు…నమ్మకాలు…కల్పనలు…ఒక విచిత్ర కథనం…
    బాగుంది…

  • కథ అనువాదం బాగుంది. కథనం ఆసక్తికరమైన ది గా ఉంది…అయోధ్యా ఇలాగే విదేశీ కథలు తెలుగు పాఠకులకు పరిచయం చేయండి.

  • ‘కాల్పనికేతర రచయిత’ అన్నారు. అంటే ఏమిటో వివరిస్తే బాగుండేది. వ్యాసాలు వగైరా కూడా రాశారు అనా మీ అభిప్రాయం?

  • రెక్కల మనిషి ఊహాత్మకమే అయినా అసలు మనిషి స్వార్థాన్ని, నిజాయితీ లేని తనాన్ని బయట పెట్టించిన రచయిత నేర్పు ప్రశంసనీయం. అయోధ్య అనువాదం, దృక్పథం అభినందనీయం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు