ఆరో అడుగు: పలాయనం

నిన్ను అవమానించే సంఘటనల నుంచి తప్పించుకోవాలన్న నీ ప్రయత్నాలన్నీ నీకు విపరీతంగా అనిపిస్తున్నాయి. నీ పరిస్థితి అలాంటిది. నీ జీవితం నీ చేతుల్లోంచి జారిపోవడం నీకు తెలుస్తూనే వుంది కదా. ఇదంతా ఆపేయ్యాల్సిన అవసరం నీకు కనపడటం లేదా?

అందుకే. ఇక్కడ్నుంచి వెళ్ళిపో.

అన్నీ ఆపేసి. వెనక్కి తిరిగి వెళ్ళిపోయి మొదట్నుంచి మళ్ళీ మొదలుపెట్టగలవా? మరోసారి జీవితం ప్రారంభించగలవా?

ఎందుకు భయపడుతున్నావ్? ఎవరు ఏమంటారని వెనకాడుతున్నావ్? ఈ ప్రపంచానికి నువ్వు ఎంతో ముఖ్యమైనదానివని అనుకుంటున్నావా? నో బడీ కేర్స్. ఎవరూ పట్టించుకోరు. నీ బ్రతుకు నువ్వు బ్రతికితే కొంత కాలానికి నువ్వెవరో మర్చిపోయే మనుషులు వీళ్లంతా.

నువ్వు భయపడుతున్న ప్రళయం కేవలం నీ భయం. నీ ఊహ. అంతే. నువ్వు పారిపోతే నందుకి ఏమీ కాదు. అతని కుటుంబంలో నువ్వు ఒక భాగమని అతను ఎంత బలంగా నమ్ముతున్నాడు? నమ్మడం లేదనే కదా నీ సమాధానం. అందుకే వెళ్ళిపో. పారిపో. పారిపో.

ఇప్పుడే. ఒంటరిగా వెళ్ళిపో. ఎక్కడికి? ఏం తీసుకెళ్ళాలి? ఎవరికైనా చెప్పాలా? డబ్బులు? ఎంత కాలం?

ఎం..త.. కా.. లం? ఇది తాత్కాలికమా? శాశ్వతమా?

శాశ్వతంగా వెళ్ళడమే పరిష్కారం. తాత్కాలికంగా వెళ్ళి పోయి తిరిగి వచ్చినా మళ్ళీ ఇదే పరిస్థితిలో నిలబడతావు. మళ్లీ ఇదే చర్చ. ఈ చర్చ మొత్తానికి ఫలితం పారిపోవడమే అయినప్పుడు మళ్లీ మళ్లీ ఆలోచించాల్సిన పని ఏముంది? నువ్వు శాశ్వతం వెళ్లిపోవడానికి ఆత్మహత్యే మార్గం అనుకున్నావు. నువ్వు నీకు తెలిసిన ఈ మనుషుల మధ్య నుంచి వెళ్లిపోవటం సరే! దానికి ప్రాణమే తీసుకోనక్కర్లేదు. అటు నందుకి ఇటు శశాంక్ కి కనపడకుండా దూరంగా, శాశ్వతంగా వెళ్లిపోతే సరిపోతుంది.

వాళ్లిద్దర్ని వదిలేయ్. మిగిలిన ప్రపంచం నిన్ను మర్చిపోతుందా? నువ్వు కనపడటం లేదన్నది దాచిపెడితే దాగేది కాదు. తెలుసుకున్న ప్రపంచం ఏమంటుంది? నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఏ విషయాలు చర్చకు వస్తాయో, ఇప్పుడూ అవే విషయాలు చర్చకు వస్తాయి. వెళ్లిపోయింది అనరు. పారిపోయింది అనరు. లేచిపోయింది అంటారు.

ఏ కారణానికి ఆత్మహత్య మానుకున్నావో అదే కారణం వల్ల పారిపోయే ఆలోచనని కూడా మానుకోవాలి. నువ్వు లేనప్పుడు నీ గురించే మాట్లాడుకుంటుంది ప్రపంచం. వాళ్లంతా నీ క్యారెక్టర్ మీద జడ్జిమెంట్ పాస్ చేస్తారు. కనీసం ఆత్మహత్యలో నువ్వు అదంతా చూడలేవు. కానీ పారిపోయితే, నువ్వు తిరిగి వచ్చిన రోజు వాటన్నింటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అది ఆత్మహత్య కన్నా కష్టమైనది.

వాళ్ళెవరితోనూ నీకు సంబంధం లేదనుకోవచ్చు. కనిసం ఇలా నీ జీవితం మీద వాళ్ల వాళ్ల అభిప్రాయాలని తీర్పులుగా వెలువరించే సమాజాన్ని నువ్వు తిరస్కరించి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవడం కూడా మంచిదే. నీకు స్వాంతన కాకపోయినా కాస్త క్లారిటీ వచ్చేదాకా అయినా ఎక్కడికైనా వెళ్లు. కొన్ని రోజుల తరువాత తిరిగి వచ్చేయ్.

అవును. శాశ్వతంగా వెళ్లిపోకపోయినా, కొంతకాలం ఎటైనా వెళ్లి మళ్లీ తిరిగి వచ్చే ఆలోచన కూడా మంచిదే. కొంత కాలం కనిపించకుండా వెళ్లిపోయి మళ్లీ కనపడితే క్షమించే అవకాశం వుంది. అప్పటికి పరిస్థితులు పూర్తిగా మారిపోవచ్చు. నువ్వు చేసింది తప్పా కాదా అన్న చర్చ కన్నా, అది ఒక వాస్తవంగా మాత్రమే మిగిలిపోయే దాకా ఆగగలిగితే చాలు. అప్పటికి నందుకి నీ అవసరం తెలిసిరావచ్చు. శశాంక్ తన భార్య పిల్లలతో తన లోకంలో వుంటూ నిన్ను పూర్తిగా మర్చిపోయి వుండవచ్చు.

నిజంగానే నిన్ను మర్చిపోతాడా? శశాంక్.

నందు మర్చిపోతాడా? ఎందుకు మర్చిపోతాడు?

నందు కాదు. శశాంక్ కాదు. వాళ్ల గురించి ఆలోచించడం మేనయ్.

నీ కోసం వెళ్లిపో.

శాశ్వతంగానైనా సరే కొంత కాలమైనా సరే, వెళ్ళిపో ఇక్కడ్నుంచి. మాయమైపో. కనపడకు. నువ్వొక్కదానివే వెళ్ళు. నందు నీతో వుండాల్సిన అవసరం లేదు. నువ్వు అతనితో లేనప్పుడు అతని గురించి నువ్వు ఎంత ఆలోచిస్తావో అతను నీతో లేనప్పుడు నీ గురించి కూడా అంతే ఆలోచిస్తాడని మర్చిపోకు.

బుకాయించకు. నువ్వు ఒక్కదానివిగా వున్నప్పుడు నీ ఆలోచనలలో వుండేది నందు కాదు. శశాంక్. నందు ఆలోచనలలో నువ్వు వున్నావో లేదో అన్న వాదన పక్కనపెడితే, నీ ఆలోచనలలో నందు లేడన్నది నిజం. ఇంకేంటి కంప్లెయింట్?  డొల్లగా వున్న సంసారాన్ని పట్టుకోని అంతా బాగానే వుందని బయటికి చెప్పే వేలాది సంసారాలలో నీదీ ఒకటి.

నందు అలోచనలలో నువ్వు వున్నా లేకపోయినా అతని పక్కన భార్యగా నువ్వు కావాలి.

నీ ఆలోచనలలో నందు లేకపోయినా నీ పక్కన భర్తగా అతను నీకు కావాలి.

ఏం తేడా వుందని ఇంత చర్చ చేస్తున్నావు?

అసలు నువ్వో విషయం గుర్తించటం లేదు. నందు గురించే ఆలోచిస్తుంటానని పిచ్చి భ్రమలో వున్నావు నువ్వు. ఇంకా ఎంతకాలం వుంటావలా? నిజం తెలుసుకో. నువ్వు నీ గురించి తప్ప ఇంకెవరి గురించీ ఆలోచించడం లేదు. నందు గురించి ఆలోచించడం అంటే నందు నిన్ను ఏమంటాడు? నందు నిన్ను ఏం చేస్తాడు? నందు ప్రవర్తన నీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇదంతా ఏంటి? నందు గురించా? నీ గురించా? అవును. ఇదే నిజం. నువ్వు స్వార్థపరురాలివే!

స్వార్థం తప్పేం కాదు. ఇప్పుడు కూడా అదే స్వార్థంతో ఆలోచించు. స్వార్థంగా ఆలోచిస్తే అందరి వదిలేసి వెళ్ళిపోవడం ఉత్తమమైన పరిష్కారమని అర్థమవుతుంది.

కొన్ని రోజులైనా వీటన్నింటికి దూరంగా వెళ్లలేవా?

ఎందుకు వెళ్లాలి అంటున్నావా?

నీ కోసం వెళ్ళు. అవును. ఇదో అవకాశం అనుకో. ఈ ఒక్క అవకాశం అందుకో. వెళ్ళి పో. ఒంటరిగా. పూర్తి స్వాతంత్రం అనుభవించు. నీకు కావాల్సిందేమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఏదైనా సముద్రపు ఒడ్డుకు వెళ్ళు. ఒక రిసార్ట్ వుండే చోటు. అలలను చూడు. సముద్రం ఒడ్డున నడిచి చూడు.

నీ మీద వున్న స్పాట్ లైట్ వెలుగు దాటి బయటికి వెళ్తే జీవితం నువ్వు ఊహించినదానికన్నా బాగుంటుందని తెలుసుకో. నిన్ను నువ్వు కొత్తగా తెలుసుకో.

నందుని శశాంక్ ని మర్చిపోయి కొన్నిరోజులు ఉండగలవా? ఎవరి భార్యా కాకుండా, ఎవరి ప్రియురాలు కాకుండా నువ్వు నువ్వుగా, నువ్వు ఎలా వుండాలనుకుంటే అలాగ. వుండగలవా?

నీ కోసం ఎవరైనా వెతుకుతారనుకుంటున్నావా?

నందు వెతుకుతాడా? ఎందుకు? నీ కోసం. సమాజం అతని పక్కన భార్యగా నిన్ను పెట్టి ఫోటో తీసి నట్టింట్లో వేలాడదీసింది కాబట్టి ఆ సమాజానికి సమాధానం చెప్పడానికి నీ కోసం వెతుకుతాడేమో?

మరి శశాంక్? అసలు వెతుకుతాడా…?

ఎందుకు వెతకడు? వెతుకుతాడు.

ఎందుకు వెతుకుతాడు? వెతకడు.

బహుశా ఫోన్ ట్రై చేస్తాడు. కలవదు. ఒక మెసేజ్ లేకపోతే వాట్సప్ పెడతాడు. ఆ తరువాత? మర్చిపోతాడు. ఇంటికి వెళ్ళి అడగడు. నందుకి ఎదురుపడటం అవివేకం అని అతనికి బాగా తెలుసు. అంత కన్నా ఏం చెయ్యలేడు.

మరి ఇన్ని రోజులు కలిసిన ప్రతిసారి ఐ మిస్డ్ యూ ఎ లాట్ అని చెప్పిన మాటలు? నిజాలేనా? కల్పితాలా?

అసలు శశాంక్ ప్రేమ నిజమా? కల్పితమా?

అతనికి నీ పైన ప్రేమ వుందన్న నమ్మకంతోనే ఇంత దూరం ఆలోచించావు. ఇన్ని ఆలోచనలకి పునాది అదే కదా? అదే అబద్ధమైతే? ఈ పరిస్థితి కేవలం నీ భ్రమలోంచి పుట్టుకొచ్చిన ఒక ప్రపంచం కావచ్చు. కాకపోవచ్చు. నువ్వు వాదిస్తూనే వుండు. నీ స్వార్థం నీది. నందు స్వార్థం అతనిది. శశాంక్ స్వార్థపరుడు కాదు. అదే కదా నీ వాదన. నిజమేనా అది?

శశాంక్ ప్రేమించాడా? కేవలం కామం మాత్రమేనా? వాడుకున్నాడా? ప్రేమ లేదని కాదు. కానీ ప్రేమ ప్రతిసారి శారీరకం కానక్కర్లేదు కదా? అతనితో కలిసిన ప్రతిసారీ అది శారీరకంగానే వ్యక్తమైంది. కాకపోతే కేవలం శారీరికం మాత్రమే కాదు. శశాంక్ నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. నీకు నచ్చినదేంటో తెలుసుకోని అది అందిచ్చాడు.

సరే. శశాంక్ నిన్ను ప్రేమిస్తున్నాడనే అనుకో. అయితే నీతో వుంటాడా? నీతోనే వుంటాడా?

ఏమౌతావు అతనికి? భార్య? రేఖ వుంది కదా? సెటప్? కీప్?

కోపం ఎందుకు? ఈ లోకం అలాగే అంటుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా.

అయితే ఒక విషయం చెప్పు – నువ్వు నందుని వదిలేస్తే, అతను రేఖని వదిలేసి నీ దగ్గరకు వస్తాడా? దీనికి సమాధానం అవును అయితే బాగుండు అనుకుంటున్నావు నువ్వు. జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేవు.

అవును నిజమే. అలా జరిగితే బాగుంటుంది.

ఇద్దరు వున్నారు. ఒక ఆడ. ఒక మగ. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆ తరువాత కలుసుకున్నారు. ఒకరికొకరు కరెక్ట్ అని తెలుసుకున్నారు. తమ తమ వివాహబంధాన్ని కాదని, ఇద్దరూ కలిసిపోయారు.

ఎగుడుదిగుడు దారి అయినా గమ్యం ఆమోదయోగ్యం కాబట్టి, నిన్ను సమర్థించే వాళ్ళు వుంటారు. ఇది అలాగే ముగుస్తుందా? నమ్మకంగా చెప్పలేకపోతున్నావు నువ్వు.

శశాంక్ రేఖని వదిలేస్తాడని నీకు అనిపించడం లేదు. నువ్వు నందు గురించి ఆలోచించినట్లు శశాంక్ రేఖ గురించి ఆలోచిస్తున్నాడేమో.  నువ్వు వెయ్యాల్సిన అడుగులను బేరీజు వేసుకున్నట్లు అతను కూడా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడేమో.

ఏదీ నీకెప్పుడూ చెప్పలేదే?

నువ్వు చెప్పావా అతనికి?

నీ మనసులో ఆలోచనలు అతనికి తెలియదు. అతని మనసులో కూడా ఏవో ఆలోచనలు వుండే వుంటాయి. అవి నీకు తెలియదు. ఇవేనా మీ ఇద్దరి మధ్య బంధాన్ని నిలబెట్టేవి?

అతనీ ఈ బంధాన్ని ఎలా నిర్వచిస్తున్నాడో తెలుసా? కనీసం ఆలోచించు. నీ వైపు నుంచి ఆలోచించినట్లే అతని వైపు నుంచి ఆలోచించు.

నందుకి తెలిసిపోయిందని ఎలా అనుకున్నావో రేఖకి కూడా అలాగే తెలిసిపోయిందనుకో. శాశాంక్ ఏమని చెప్తాడు?

నాకు ఒక ఎఫైర్ వుంది. ఫలానా నియతి అనే అమ్మాయితో.

చెప్తాడంటావా? రేఖ కూడా అడుగుతుంది కదా. ఎలా మొదలైంది? ఎందుకు చేశావు? అని. ఏం చెప్తాడతను?

నా తప్పేం లేదు. ఆ అమ్మాయే….

నో నో… అలా చెప్పడు. మరి?

రేఖతో కలిసి వుండాలని అనుకుంటున్నవాడు. కొత్తగా మొదలవబోతున్న తండ్రి హోదాని అనుభవించాలని అనుకుంటున్న వాడు. నీతో వున్న సంబంధం గురించి చెప్పాల్సి వస్తే క్షమించమనే అడగాలి. అతన్ని రేఖ క్షమించాలంటే తప్పు అతను చేసినట్లు కాకుండా ఇంకెవరో చేసినట్లుగా చెప్పాలి. నువ్వు అనుకున్నట్లుగానే.

నేరం నాది కాదు. నియతిది. షీ ఈజ్ ఎ బిచ్

అవును. నువ్వే కదా ఫోన్ చేసి కలుద్దామన్నావు. అంతకు ముందు నువ్వే వద్దనుకోని వెళ్ళిపోయావు. నిజమే. కానీ మళ్ళీ మొదలువదానికి కారణం నీ ఫోనే కదా. నువ్వే అతన్ని ఇందులోకి లాగావు. అతను వద్దు వద్దు అన్నా వినలేదు. నీకు భర్త దగ్గర సుఖం లేదు. అందుకే ఇంకొక మగాడి అవసరమైంది.

నీకు నచ్చకపోవచ్చు. కానీ ఇదే నీ గురించి మాట్లాడుకోబోయేది.

పోనీ నువ్వే వెళ్లి  శశాంక్ ని అడుగుతావా? ఏమని అడుగుతావు?

నేను నీకు ఎవర్ని? అని. ఏం చెప్తాడు?

నమ్మదగిన నిజం చెప్తాడా? నమ్మించే అబద్ధం చెప్తాడా? ఏది నిజం? ఏది అబద్ధం?

అతనికి ఊహలాగా వుండే అబద్ధపు ప్రపంచం నువ్వే. అతనికి ఒక ఎస్కేప్ నువ్వు. అంతే! అతని వాస్తవ ప్రపంచం వేరే వుంది. అందులో నువ్వు లేవు.

ఇదే నిజం.

ఇది నేరుగా నీతో చెప్పగలడా శశాంక్?

ఇంక చాలు నియతి. ఇటు పెళ్ళి అటు ప్రేమ రెండు విఫలమయ్యాయని స్పష్టంగా తెలుస్తోంది. నీకు ఇప్పుడు నందు అక్కర్లేదు. శశాంక్ అక్కర్లేదు. నీకు నువ్వు కావాల్సిన క్షణాలు మొదలౌతున్నాయి. వెళ్ళిపో ఇక్కడ్నుంచి. నువ్వు ప్రేమను పంచుకున్న క్షణాలుగా భ్రమపడిన కాలానికి గుర్తుగా ఒక బిడ్డ కలుగుతుంది. ఇక నీ జీవితం ఆ బిడ్డతోనే. సింగిల్ మదర్ గా కొత్త అవతారంతో ఇంకేదో వేరే ప్రపంచంలో.

అసలు నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీకేం కావాలో తెలుసా? మొదట ప్రేమ అనుకున్నావు. మరెప్పుడో సెక్యూరిటీ అన్నావు. ఎమోషనల్ మ్యాచ్, ఇంటలెక్చువల్లీ స్టిములేటింగ్…. ఇంకా ఏవేవో చెప్తావు. అండర్ స్టాండింగ్, ఆర్టిస్టిక్, మిస్టిక్… నీకు ఏం కావాలి నియతి?

ఏం.. కా.. వా… లి?

ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికైనా నువ్వు ప్రశాంతమైన చోటుకి వెళ్ళిపోవాలి.

శశాంక్ అలాంటివాడు కాదనే అనుకుందాం. అతను నిజంగానే నిన్ను ప్రేమిస్తుండచ్చు. కానీ నువ్వు అతన్ని నిజంగానే ప్రేమిస్తున్నావా? ఈ ప్రేమ ఎల్లకాలం వుంటుందని నీకు నమ్మకం వుందా? నందు కొంతకాలం బాగానే వున్నాడు. తరువాత నచ్చని  విషయాలు తెలిసాయి. ఇప్పుడు శశాంక్ నచ్చాడు. అతనిలో కూడా నచ్చని విషయాలు కనపడతాయి. నీకు ఇంకేదో కావాలనిపిస్తుంది. అది శశాంక్ ఇవ్వలేకపోతున్నాడు అనిపిస్తుంది. ఆటలో తరువాత అంకం అదే. అప్పుడేం చేస్తావు? తప్పదు. నువ్వు అవతలి వ్యక్తికి బోర్ కొట్టకముందే వాళ్ళు నీకు బోర్ కొడతారు. నీకు నచ్చని విషయాలు మరింత స్పష్టమౌతాయి. ఎవరూ పర్ ఫెక్ట్ కాదు. ఆ విషయం నీకు అర్థం అవుతుంది. ఆ తరువాత?

ఇదంతా నీ వల్లే జరిగిందని నీకు అర్థం అవుతోందా? పొగమంచు కరిగి దృశ్యం స్పష్టమౌతోంది కదా?

ఎన్ని రకాల పరిష్కారాలు ఆలోచించావు? కొనసాగించాలనుకున్నావు. బుకాయించాలనుకున్నావు. ధిక్కరించాలనుకున్నావు. ఇవన్నీ నీలో వున్న లోపాన్ని తెలియనివ్వకుండా తప్పించుకునే మార్గాలు. అవేవీ సాధ్యపడవని నీకు అర్థం అయ్యింది.

క్షమాపణ చెప్పడానికి నువ్వు ఒప్పుకోవు. నందు క్షమించడు అన్నది ఒక కారణం కావచ్చేమో కానీ అసలు కారణం క్షమించమని అడగటం నీకు ఇష్టం లేకపోవడం. అంటే నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదని అనుకోవడం. తప్పు వుందా లేదా, అసలది తప్పా కాదా అన్ని మీమాంస ఆ నిర్ణయాన్ని పక్కకు నెట్టింది.

ఇక మిగిలింది రెండే – ఆత్మహత్య చేసుకోవడం లేదా పారిపోవడం.

కథ ముగింపు దగ్గరకు వచ్చేశాము మనం. నువ్వు లేకుండా పోవటం ఇప్పుడు జరగాలి. ఇప్పటి దాకా నీ నుంచి నువ్వే పారిపోయావు. ఇప్పుడు అందరి నుంచి పారిపో. వెళ్ళిపో!

అది శాశ్వతంగా వెళ్లిపోవడం కూడా కావచ్చు.

అది మరణానంతరమే నీకు దొరకచ్చు.

కాదు, కాదు… మరణం సమాధానం కాదు. అది ఇంకెన్నో ప్రశ్నలకు బీజం. వెళ్లిపోవాలి. అంతే.

నీకు నువ్వు దగ్గరగా వుండే చొటుకి .

నందు, శశాంక్ వీళ్ళంతా అవసరం లేని చోటుకి. నీకు నువ్వే అవసరం అయ్యే చోటుకి.

నీతో నువ్వు వుండే చోటుకి. బ్రతికినా చనిపోయినా.

ఇక నిర్ణయం నీదే!

అరిపిరాల సత్యప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు