రిఫ్రెష్ ఫ్రం టియర్స్

వెలుపల నువ్వు,

లోపల నేను!

ఎగసిపడుతున్న జ్వాల, ఒక్కొక్కరీతిగా

నీ- లోపల,

నా- వెలుపల!

** **

ఊటబావులు కూడా ఇంకిపోయిన క్షణాలు! ఎక్కడి నుంచి పుడుతున్నదో తెలియని మంట! నిస్పృహలోంచా, నిస్సహాయతలోంచా, కడుపులోంచా, యిగిరిపోయిన కన్నీళ్లలోంచా? రేగే మంట సలుపుతున్నప్పుడు, రెండు కళ్లలోనూ రెండేసి చుక్కలు కార్బాక్సీ మిథైల్ సెల్యులోజ్ సోడియం వేసుకుంటావు నువ్వు, ‘రిఫ్రెష్ టియర్స్’ రూపంలో! వెక్కుతూనే. నీళ్లూరుతాయి. నేత్రాలు మళ్లీ సజలాలౌతాయి. కంటికీ మింటికీ ధార కడతాయి. ఈ దుర్మార్గదృశ్యాన్ని జవలుడిగి చైతన్యరహితంగా చూస్తుంటాను నేను.

ఇలాంటి సమయం, ఏ రూపంలో ముంచుకు వచ్చిందనేది ముఖ్యం కాదు. కానీ, దేహం ఇక ఐహిక భారం ఓర్వలేనని స్పష్టంగా చెప్పేస్తోంది. నీ కళ్లలో ఆశ, ప్రయత్నంలో పదును, ఈ స్పర్శను ఇలా శాశ్వతంగా నిలిపేయాలనే పరుగు అందరినీ ఉరకలెత్తిస్తుంటుంది.

శారీరకమైన శక్తి, వల్లకాదంటున్నప్పుడు రంగప్రవేశం చేసిన యంత్రం ఒక కొత్త ఆశ! వెంటిలేటర్ ప్రాణవాయువును నిమిషానికి లీటర్ల తూకంతో లోనికి బయటకి నెడుతుంటుంది. జీవాన్ని నిలబెడుతుంటుంది. శరీరధర్మం తనంతగా దేనినీ స్వీకరించనప్పుడు.. ఆశలు ఐవీల రూపంలో లోనికి ప్రవహిస్తుంటాయి. రోజుల్ని క్షణాల గుణకాల మీద ముందుకు నెడుతుంటాయి.

రంగస్థలం మీదినుంచి పాత్ర నిష్క్రమణానికి సిద్ధం అవుతున్న వేళ, ‘వన్స్‌మోర్’ అంటున్న విజిళ్లు ఒక రకమైన ఆనందాన్ని కలిగిస్తుంటాయి. ఆర్తి, ఆర్ద్రత, తడి, ఆశలు.. నిండి ఆ విజిళ్లు బరువుగా ధ్వనిస్తుంటాయి. నిభాయించుకోవాలి- ఆ ఆశల్నీ నువ్వూ, ఆ ఆనందాన్ని నేనూ!

అనాయాస మరణం, వినా దైన్యేన జీవితం- మాటలన్నీ రుచిగానే ఉంటాయి. కానీ అంపశయ్య మీద సంక్షిప్త నిరీక్షణ అంతర్లోచనానికి, ఆఖరి సందేశానికి ఒక అవకాశం అనిపిస్తుంది.

** **

ఆలోచనలు జ్ఞాపకాల్ని నెమరువేస్తుంటాయి. ఎక్కడో కోయంబత్తూరులో వైభవంగా వెలగబెడుతుండిన ఉజ్జోగాన్ని వదిలేసుకుని ఇలా పాలమూరుకు వచ్చేసిన సందర్భం గుర్తొస్తుంటుంది నాకు. అనుభవాలు పునరుక్తం కావడం ఒక అనుభూతి. అప్పుడు నాన్నకోసం నేను! ఇప్పుడు నాకోసం నువ్వు. సర్వస్వమూ పక్కకు గిరవాటేసి!

చరమాంకంలోని ఉద్విగ్నత, పాత్ర అస్తిత్వమాత్రమైనప్పటి స్తబ్ధత! ఇంద్రియాలు నిశ్శబ్దంలోంచే సమస్తం గ్రహిస్తుంటాయి. కళ్లు, పరిసరాల్లోని కన్నీళ్లను జల్లెడపడుతుంటాయి. చెవులు, మౌన రోదనల్ని ఆలకిస్తుంటాయి. ముక్కు, చుట్టూ ఉన్న గాలిలోని ప్రాణభయాన్ని పసిగడుతుంటుంది.

నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ.. ఇహపరమైన వ్యవహారాలు అనేకం చక్కబెట్టకుండానే.. ఈ వందల అంపశయ్యల మీదకు చేరిన జీవితాలు.. అలమటిస్తున్న తీరు.. మొత్తం అనుభవంలోకి వస్తోంది.

కొవిడ్ హాస్పిటల్. ఈ పేరు వింటేనే బాహ్య ప్రపంచం భయపడుతోంది. లోనికి రావడం, బెడ్ దొరకడం అనేది కటిక చీకటిలో ఒక అదృష్టరేఖ! ఆస్పత్రుల బయట ఆశగా, శ్మశానాల బయట వేదనగా అంబులెన్సులు వరుస కడుతున్నాయి. వరండాలు, ఆస్పత్రి మెట్లూ, ఆవరణలో చెట్ల నీడలూ కూడా ఐసీయూ పడకలుగా మారిపోతున్నాయి. విమానాలూ ఓడలూ రైళ్లూ లారీలూ అన్నీ మూకుమ్మడిగా తరలిస్తున్న ఆక్సిజన్ మన దాకా దొరికితే చాలు, ఆశలు మిణుకుమిణుకు మంటున్నాయి. అవి కాస్తా కొడిగడితే.. కుయ్ కుయ్ మంటూ పరుగుతీస్తున్న అంబులెన్సులు, రోడ్డు పక్కగా దేహాన్ని దించేసి పారిపోతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల కౌంటర్లలో కరెన్సీ నోట్లు మాత్రమే వెల్లువగా కురుస్తున్నాయి. కొవిడ్ సీజనల్ ఆఫర్- ఆస్తులూ పుస్తెలూ మార్కెట్లో కారుచౌకగా మారుబేరానికొస్తున్నాయి. ఇలాంటి వాతావరణం మధ్య, ఆస్పత్రిలో బెడ్ మీద ఆక్సిజనూ వెంటిలేటరు సాయంతో సేద తీరుతూ క్షణాలను లెక్క పెట్టడం అదృష్ట రేఖ కాక మరేమిటి?

ఆస్పత్రికి వెళ్లిన అమ్మానాన్నా ఉన్నారో పోయారో వస్తారో రారో కూడా తెలియకుండా బంధువుల ఇళ్లలో ఆడుకుంటూన్న చిన్నారులు.. భార్య ఆస్పత్రినుంచి నేరుగా శ్మశానానికే వెళ్లిపోతే- ఆ సంగతి కూడా తెలియకుండానే శ్వాస ఆగిన జీవులు.. కుటుంబంలో ఒక్కొక్కరుగా రాలిపోతోంటే, బరువైపోయిన బతుకు ఎప్పటికి రాలుతుందో తెలియకుండా కుములుతున్న దౌర్భాగ్యులు.. ఎన్నెన్ని వ్యథలు!

భగీరథుడికి జేజమ్మవు అయిఉంటావు నువ్వు. నీ ప్రయత్నం చూస్తుంటే ముచ్చటేస్తుంది. కొన్ని వారాలుగా చేతిని అంటిపెట్టుకున్న కాన్యులా సాక్షిగా.. ఐవీ ఫ్లూయిడ్లలోంచి నెమ్మదిగా ప్రవహిస్తున్న మందుల ఒక్కొక్క బొట్టూ ఒక్కొక్క యుద్ధంగా.. నన్ను తిరిగి ఇంటికి తీసుకువెళ్లడానికి, మళ్లీ నీ కౌగిలింతలో బిగించుకుని గారాలు కురిపించడానికి జరిగే తమాషాలాగా అనిపిస్తుంటుంది నాకు!

నా రెండో చేతి మీద నీ వెచ్చటి చేతి స్పర్శ. నిరీక్షణ పర్వానికి విరామం ఇస్తూ నేను కళ్లు తెరుస్తాను. ‘నేను. గుర్తుపట్టావా’ అంటావు నువ్వు. మరో రకంగా ఎలాంటి సంకేతమూ ఇవ్వలేక ‘అవు’నన్నట్లు రెప్పలారుస్తాను. ‘నీకేం కాదు. డాక్టరు గారు చెప్పారు’ అంటావు. రెప్పలల్లార్చడం కూడా మానేసి, ఆగిపోతాను. రెప్పలాడిస్తే, ఆ సందేశం, బతుకు మీద నా ఆశకు సూచికగా, నిన్ను లోపలినుంచి మెలిపెడుతుందని భయమేసి! తేజస్సు లేని నా కళ్లలోకి, అశ్రువులు ఆవిరైపోయిన నీ కళ్లు కలిపి చూస్తావు. ఆ కమ్యూనికేషన్‌లో నీవు నాలోకి పంపదలచుకున్న ఆశ, ధైర్యం నా వరకూ అందాయో లేదోనని నీకే భయమేస్తుంది! పొడిబారిన కళ్లు మండుతాయి. బ్యాగులోంచి రిఫ్రెష్ టియర్స్ మందు అందుకుని చెరో కంట్లో రెండేసి డ్రాప్స్ వేసుకుంటావు, మంట తగ్గడానికి. అవి మళ్లీ సజల నేత్రాలు అవుతాయి. ఇక నువ్వు నా వైపు తిరగవు!

** **

ఐసీయూలో ఉన్నప్పుడు, కనీసం పక్క బెడ్ తో మాట కలిసేది. మనుషులు బెడ్‌లుగా మారిపోయిన చోట ఎవరిని కదిపినా వ్యథలే. స్కూలు కెళుతున్న పిల్లల ముచ్చట్లు చెబుతున్నప్పుడు ఆ బెడ్ కళ్లు మెరుస్తాయి. ఆ పిల్లల్ని మళ్లీ చూస్తానో లేదో అని అంతలోనే తడి అవుతాయి. ఇదే మహమ్మారి తన భార్యను కూడా తినేసిందన్నప్పుడు అవే నిర్జీవం అయ్యేవి. ఈ బెడ్ దిగి, తిరిగి తను ఇల్లు చేరకపోతే ‘పిల్లలు ఏమైపోతారో’ అనే మాట పూర్తిగా బయటకు రాకుండానే.. అవి కరిగినీరయ్యేవి. నిండా నలభయ్యేళ్లుండవు!

నాకు నువ్వు గుర్తుకొస్తావు. నా నలభయ్యేళ్లూ, నీ పసితనమూ గుర్తుకొస్తుంది. నేను ఐసీయూలో ఉన్నానని, యంత్రాలమీద నడుస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఏది ఆఖరుది అవుతుందో తెలియని స్థితిలో ఉన్నాననే స్పృహ దూరమౌతోంది. నీ అల్లరి, నీ మొండితనం, నీ ప్రేమ అన్నీ ఒకేసారి గుర్తుకు వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి.

బాసింపట్టు వేసుక్కూచుని పేపరు చదువుతుంటాను.. వెనుకనుంచి పరుగెత్తుతూ వచ్చి మెడ చుట్టూ వాటేసుకుని ఒదిగిపోతావు. స్కూలు నుంచి రాగానే పుస్తకాల సంచి పక్కన పారేస్తావు.. పాఠం చెప్పడం కూడా టీచర్లకు ఎలా చేత కావడం లేదో అక్కడ వదిలేసిన తగాదాను ఇక్కడ నాతో కొనసాగిస్తావు. రోడ్డు మీద ఎవ్వడో అల్లరి పని చేస్తుండగా చూస్తే ఊరుకోవు- వాడితో గొడవ పెట్టుకోవడం సరేసరి, ఆ గొడవను ఇంటికొచ్చాక కూడా నాతోనే కొనసాగిస్తావు. ఇదంతా రోడ్లతో ఆఫీసుల్తో ఆగుతుందా.. ఏ గవర్నమెంటు ఏం చేసినా- వాళ్ల వాళ్ల వెధవాయిత్వం మీద గయ్యిమని ఒంటికాలిపై లేస్తావు. గల్లా పట్టుకోడానికి అవతలి వాడెవడూ నీ చేతికి చిక్కడు గనుక.. ఫేస్ బుక్కులోనో, ట్విటర్లోనో నీ క్రోధాన్ని ఆక్రోశాన్నంతా కక్కేసి దారినపోయే తగాదాల్ని నెత్తికి చుట్టుకుంటావు. ‘మనకెందుకు’ అన్నానంటే, ఆ మాట కోసమే కాచుకున్నట్టుగా, నాతో తగాదా పెట్టేసుకుంటావు!

‘సరదాగా కొన్నాళ్లు ఫ్రెండ్ వాళ్ల ఊరికెళ్తా’ అన్నావు ఓసారి. ‘నువ్వు లేకుండా ఎలాగ’ అన్నాను. నీకేం అర్థమైందో.. మానుకున్నావు. ఆ తర్వాత ఎన్నడూ ఎక్కడకీ వెళ్లకుండానే నా ప్రతి క్షణమూ నీవే అయి ఉండిపోయావు. చదువుల్లో ఎంత చురుగ్గా ఉండేదానివి. నీ తెలివితేటలకు తగ్గట్టు ఎన్నెన్ని పెద్ద చదువుల అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. నేనున్న చోటులోనే ఆ ఆఫర్లూ ఉండకపోవడమే లోపమన్నట్టుగా అన్నీ వదిలేసుకున్నావు. నన్ను వదలి వెళ్లాల్సి వస్తుందని!

ఉద్యోగానికొచ్చావు. నన్ను వీడిపోవాల్సిన అవసరం ఉండని చోటుగనుకే ఒప్పుకున్నావు. ఉదయాన్నే వెళతావు. ఏరాత్రికో వస్తావు. ప్రతి ఉదయం నువ్వు బయల్దేరాక, లిఫ్టు కిందికి కదలగానే హాల్లోంచి ‘బై’ చెప్పేసి.. అది నిన్ను కిందికి చేర్చేలోగా.. బాల్కనీకి నా కళ్లు రెండూ అతికించి చూస్తూ నిల్చుంటాను. ప్రహరీ గేటు తిరిగి మూసేశాక తలపైకెత్తి చూసి నవ్వి.. మళ్లీ ఓసారి ‘బై’ చెప్తావు. నీకు నవ్వులాటగానే అనిపించినా రెండు బైలు వింటేగానీ తృప్తిగా తిరిగొచ్చి నా కుర్చీలో కూర్చోలేను. ఇక్కడ నా చుట్టూ ఇంట్లో అందరూ ఉంటారు. అక్కడ నీ చుట్టూ నిత్యబీభత్సప్రధానమైన ప్రపంచంలోనూ అందరూ ఉంటారు. కానీ ఇక్కడా, అక్కడ కూడా మనసుల్లో ఒక మూల ఒకే రకమైన నిశ్శబ్దం! తిరిగి రాత్రివేళ కాలింగ్ బెల్ మోగేదాకా!

నన్ను వదలి ఎక్కడకూ వెళ్లవు నువ్వు. నీ అంతటి పంతం, మాట నిలకడ  ఉన్నవాడిని కాను. నేను మాత్రం నీతో ఎప్పటికీ ఉండలేకపోతున్నాను. ఆ మాట అంటే నీకు కోపం వస్తుంది. కళ్లలో అది కనిపిస్తుంది. చల్లార్చడానికి మళ్లీ రెండేసి డ్రాప్స్ వేసుకుంటావు!

** **

కొవిడ్ మహమ్మారిని ఎన్నయినా తిట్టుకుందాం. కానీ అది మోగించిన మరణమృదంగం ధ్వనుల నడుమ లీలగా శ్రావ్యంగా వినిపించిన సుస్వరాల మాటేమిటి! నిరుడు సుదీర్ఘకాలం లాక్ డౌన్ తో లక్షల బతుకులు నిలువునా శిథిలమైపోయిన దుర్వార్తలు చూశాం. కానీ.. కాలుష్యం తగ్గి ప్రకృతి మొత్తం తుల్యంగా మారిన తమాషాలు కూడా మన కళ్లపడ్డాయి. అవన్నీ ఎందుకు- అనుబంధాలు, వ్యవహారాలు చాలా వరకు రీడిఫైన్, రీస్ట్రక్చర్ అయిన మాట నిజం కాదా?!

ఎవడు ఎప్పుడు ఎందుకు చచ్చిపోతాడో తెలియదు- ఆ భయంలో, ఆప్తుల్ని మిత్రుల్ని బంధువుల్ని అప్పుడప్పుడూ పలకరిస్తూ ఉన్నాం! కాలం ఎంతటి వాడినైనా చిటికెలో చిదిమేయగలదు- ఆ ఆలోచనలో, రోడ్డు మీది బతుకులపై రవ్వంత సానుభూతి చూపిస్తున్నాం! వ్యాసంగాలకి, విలాసాలకి బలవంతపు అంటకత్తెర పడిపోయింది- ఆ అనివార్యతలో, అవసరాలు మాత్రమే చాలుననుకునే స్పృహలోకి వచ్చాం! వృత్తులకి, వ్యాపారాలకి గడ్డుకాలం దాపురించింది- ఆ వెలితిలో, ఖర్చులకి కోతపెట్టుకుంటూ జాగ్రత్త నేర్చుకున్నాం! నాలుగు గోడల మధ్య దారుణంగా బందీలైపోయాం- ఆ యిరుకులో, మౌలికమైన నిశ్చలమైన బంధాలు ఇవేననే అనుభవంతో వాటిని మరింత అందంగా అల్లుకుంటున్నాం!

‘ఈ ఏడాదిలో పిల్లలతో కుటుంబంతో మమకారం పెరిగిపోయింది సారూ’ అంటున్నది నా పక్క బెడ్! ఉదయం ఆఫీసుకెళ్తే సాయంత్రం ఫ్రెండ్స్‌తో బలాదూర్ కూడా పూర్తిచేసుకుని ఏరాత్రికో యింటికి చేరే బతుకు- యిటీవలి కాలంలో పొద్దస్తమానమూ కుటుంబంతోనే గడుపుతూ ఆ రుచికి కొత్తగా అలవాటు పడిపోయిందంటున్నాడు. బడికెళ్లడం అలవాటు చేసుకుంటున్న వాడి చిట్టితల్లి ముచ్చట్లన్నీ నవ్వుతూ చెప్పుకున్నాడు. ‘డెయిరీ మిల్క్ సిల్కు పెద్దది అడిగింది సారూ.. లాక్ డౌన్ ఎత్తేశాక కొనేసి ఉంటే పోయేది… కొనచ్చులే అనుకున్నాను. ఈ ఖర్మొచ్చింది’ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘పని అనుకున్నాక ఆగడం పాపం సార్’ నీళ్లూరుతున్న కళ్లలో చింత తొంగిచూస్తోంది.

‘ఏం కాదు అంతా  మామూలుగా అవుతుంది. నువ్వు హాయిగా ఇంటికెళ్లాక నేనే తెచ్చి గిఫ్ట్ ఇస్తాను మీ చిట్టితల్లికి’ అని ధైర్యం చెప్పాను, యిక్కడినుంచి బయటకు ఎలా వెళ్తానో క్లారిటీ లేని నేను! చిన్నప్పుడు చాలా రోజుల పాటూ ఊరించి, నీకోసం కొన్న ఫైవ్ స్టార్ చాక్లెట్ గుర్తుకొచ్చింది. నా స్థాయికి మించినదని, అప్పట్లో కొనకపోయి ఉంటే యిప్పుడు నేనుకూడా చింతపడేవాణ్నా? యింకా, యే చింతలు మిగిలున్నాయి? అనుకున్నాక ఆగిపోయినవి ఏమున్నాయి? గెమనానికి రావడం లేదు. లేవా? మరచిపోయానా? లేకపోతే సుఖం! మరచిపోయిఉంటే, ఆ మతిమరపు ఒక వరం!

అలా అనుకుంటున్న సమయంలోనే.. ఈ ఏడాదిలో నా చుట్టూ మరింత గట్టిగా పెనవేసుకున్న ప్రేమానురాగాలు గుర్తుకొస్తాయి.

నిద్రకళ్లతో నువ్వు డైలీ రొటీన్‌లో పడతావు.. కాఫీ అంత వేడిగా. నేను నెమ్మదిగా ఆ పూల దుప్పటిని మడతలు పెట్టి, దానికి థాంక్స్ చెబుతాను. రాత్రంతా నిన్నువెచ్చగా పొదవుకుని, రక్షగా నిలిచి నా, నాటి పాత్ర పోషించినందుకు. వర్క్ ఫ్రం హోం అంటూ మొదలెడతావు. ఆ ప్రపంచంలో నీ బాధానందాలన్నింటినీ.. క్యాంటీన్‌లో కలిసిన ఫ్రెండ్‌కి మల్లే నాతో సమస్తమూ పంచుకుంటావు. నువ్వు చదివిన పుస్తకాలకి నేను పాఠకుడిని! నువ్వు చూసిన సినిమాలకు నేను ప్రేక్షకుడిని! నువ్వు లేవనెత్తే వాదాలకు నేను శ్రోతని! నువ్వు సంస్కరించదలచుకుంటున్న ప్రపంచానికి నేను సాక్షిని! సమస్తమైన నీ నిత్య వ్యవహారాలలో అవిభాజ్యంగా నేనూ ఉంటాను. నా సమస్త ప్రపంచమూ నువ్వై ఉంటావు. కాఫీల మీదుగా, టీల మీదుగా, టీవీ వార్తల మీదుగా, కాల్స్ మోసుకొచ్చే కబుర్ల మీదుగా సాగిపోయే మాటల ప్రవాహాలు మన ఆలోచనల్లో ఏకతను చూపిస్తూ, భిన్నత్వాన్ని స్పృశిస్తూ మొత్తంగా బంధాల్ని పెంచుతుంటాయి.

నాలుగు గోడల ప్రపంచంలో మిగిలిన పాత్రలన్నీ సహాయ భూమికలనే పోషిస్తుంటాయి. అందరమూ కలిసి యిల్లు కదలకుండా బతుకుతూ, ఒకరితో ఒకరు మరింతగా గొడవలు పడుతూ, ఒకరినొకరు మరింతగా ప్రేమించుకుంటూ, ఒకరికొకరు మరింతగా సహకరించుకుంటూ ఎంతో గొప్పగా చిక్కబడిన బంధాలు! ప్రేమలు, మమకారాలు, అనురాగాలు అన్నీ గాఢంగా మారుతున్న ఈ వేళలో వెళ్లిపోవాలా! యిలా? ‘యింత ప్రేమ గాఢతలోంచి వెళ్లిపోవాలా’ అనే బాధ కంటె, వెళ్లిపోయేముందు అది యింత గాఢమైనందుకు ఒక తృప్తి! థాంక్స్ చెప్పుకోవాలి. దేవుడికా? కోవిడ్‌కా?

‘దేవుడు లే’డంటావు నువ్వు. వెధవది- యిప్పుడసలు వాడి గొడవ ఎందుకంటాను నేను. ‘వాడున్నాడని, వాడిని మొక్కమనీ ఏనాడైనా నేన్నీకు అలవాటు చేశానా? నువ్వా పని చేశావా? తీరా ఇప్పుడు మాత్రం మన మధ్యలోకి వాడిని లాక్కొచ్చి తిట్టడం ఎందు’కంటాను. ‘యింత నరకం పెడతాడా? ఒకేసారి ఎత్తుకుపోవచ్చు కదా’ అని తూలనాడుతావు. ‘నువ్వు నన్ను చాలా సుఖప్రదమైన స్థితిలోనే ఆస్పత్రిలో ఉంచావనుకుంటున్నానే, నరకంగా ఎందుకు భావిస్తావు’ అనుకుంటాను.

అసహాయత నీలో బుసలు కొడుతుంటుంది. నువ్వు డాక్టరుతో తగాదా పెట్టుకుంటావు. నిప్పులు కురిపిస్తావు. చేతగానితనమనీ, నిర్లక్ష్యమనీ, అశ్రద్ధనీ చెర్నాకోల దెబ్బల వంటి మాటలతో తూర్పారపడతావు. అన్నీ విని, ‘మనవైపు నుంచి చేయగలిగిన దానికంటె ఎక్కువ చేశాం మేడం. ఆయన వైపు నుంచి ఏమీ లేదు. కాపాడుకోగల దశ దాటిపోయింది. ఇప్పుడు కేవలం దాన్ని వెనక్కు నెడుతున్నాం రోజులుగా, గంటలుగా..’ అంటాడు డాక్టరు నీతో శాంతంగా.

మతిమరుపు ముదిరి నిన్నూ నన్నూ కూడా మరచిపోక ముందే, యిలా వెళ్లిపోగలుగుతున్నందుకు ఒక రకమైన ఆనందంలో, జ్ఞాపకాల చివరి నెమరువేతలో పడతాను నేను. బుసలు కొట్టి అలసిపోయి, ఆ మాటల్ని స్వీకరించే ధైర్యం లేక, క్రోధంగా డ్రాప్స్ అందుకుంటావు నువ్వు.

** **

అందరికంటె ముందు నాకు అర్థమైంది. డాక్టరుకు కూడా అర్థమైంది. నీకు కూడా అర్థమౌతుంది. ‘ఇక చాలు’ అని ఎవ్వరమూ చెప్పం, చెప్పలేం. నాది నిస్సహాయత. డాక్టరుది సంకోచం. నీది ఆశ! స్క్రిప్టు ప్రకారం నిష్క్రమణ కూడా పూర్తయిన పాత్ర, సభా రంజకత్వం కోసం వేదికమీద అటూ ఇటూ ఓసారి కలియతిరిగినట్లుగా ఉంది నా పరిస్థితి. ఎందుకింత కాలహరణం? ఇన్నాళ్ల జీవితం కలిగించని అపరాధభావం పుడుతోంది నాలో. నాలోకి బలవంతంగా నెట్టబడుతున్న ప్రాణవాయువు, ఈ కొద్ది సమయంపాటు, శరీరంగా కూడా సహకరించే మరెవ్వరికైనా ఇస్తే కొంత ఫలముంటుంది కదా.. అనే భావన! ఆ భావన ముదురుతోంది. నా బలాన్నంతా కూడగట్టుకుంటాను. మీరంతా కలిసి బలవంతంగా లోపలకు నెడితే, నేను అంతకంటె పట్టుదలగా తిరస్కరిస్తాను. కాసేపటికి డాక్టరు నా మొహానికి తొడిగిన ఆ ఆక్సిజన్ మాస్కును తొలగిస్తాడు.

వెక్కుతావు. ఆ కళ్లలో నీళ్లూరవు. ఆ గుండెల్లో మంటలు చల్లారవు. అంతకంటె ఏం చేస్తావు నువ్వు. మహాఅయితే, ‘నిన్ను వెళ్లనివ్వను’ అంటూ నా చేతిని గట్టిగా వడిసి పట్టుకుంటావు! డాక్టరు నీ భుజం తట్టి పక్కకు తప్పిస్తాడు. మహాఅయితే నా బుగ్గ మీద ఒక ముద్దు పెట్టుకుంటావు, కాసేపయితే అది కూడా దొరకదు. నేను ప్యాక్ అయిపోతాను!

గదిలో ఒక మూలగా కూర్చుని ఉంటావు. నీ తపనని, క్షోభని, క్రోధాన్ని, ప్రయత్నాన్ని పరిహసిస్తూ అనివార్యమైన ఈ క్షణం ఎదురైనప్పుడు- ఏ గుండెలు బద్ధలవుతాయనే భయంలో ఇన్నాళ్లూ మధనపడుతున్నావో, ఎవ్వరెవ్వరినైతే మానసికంగా ఈ క్షణానికి సిద్ధం చేస్తూ వచ్చావో వారితో నీ కన్నీళ్లను పంచుకుంటావు.

‘మోయడానికి ఆ నలుగురినీ సంపాదించుకుంటే చాలు బతుకు ధన్యం’ అని నేర్చుకుంటూ వచ్చిన జీవితవిలువలు అన్నీ యిప్పుడు మంటగలిసిపోయాయి. మంచితనపు తూకాలతో నిమిత్తం ఉండని మరణాలు, అసందర్భ మరణాల్ని అలవాటుగా మార్చుతున్న వేళ… స్ట్రెచర్‌పై ప్యాక్‌డ్‌గా నన్ను తొలుత అంబులెన్సులోకి చేరుస్తుంది. అంబులెన్సు మహా ప్రస్థానానికి చేరుస్తుంది. నలుగురెక్కడ? నికరంగా ఒక్కరైనా వెంటఉండని, ఉండలేని, ఉండనివ్వని తుదియాత్రలను ప్రపంచానికి అనుభవంలోకి తెస్తుంటుంది. ఈ వాతావరణం- బతుకు పట్ల, బంధాల పట్ల, యావత్తు ప్రపంచం పట్ల నిస్సంగత్వాన్ని చాలా కఠినంగా, చేదుగా నేర్పుతోంది.

మహా ప్రస్థానం… సిరిగంధపు దుంగలూ నేతి డబ్బాలూ, మామూలు కట్టెలూ కిరసనాయిలూ.. కూడా చూసిన సమవర్తి! ఇప్పుడు ఎలక్ట్రిక్ జ్వాలలతో బూడిద చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంతదనుకా వచ్చినందుకు నేను చాలా ప్రివిలేజ్డ్ అనుకోవాలి. మొన్న- జేసీబీలతో పెద్ద గోతులు తవ్వి గుట్టలుగా పోసి కప్పెట్టేశారు! నిన్న- పదులుగా విశాలకాష్టంపై పడుకోబెట్టి ఒకేసారిగా పెట్రోలుతో తగలెట్టేశారు! నేడు- వందలుగా ఏ తెరువూ లేకుండా గంగలో తేలుతూ కొట్టుకుపోతున్నాయి! యిప్పుడు, యీ కోవిడ్ పుణ్యమాని, ధర్మం సాంప్రదాయం ఆచారం పద్ధతి యిలాంటి పసలేని ముసుగుల్లో ఇన్నాళ్లు గుట్టుగా బతికిన అంతిమ సంస్కార విధులకు కూడా రకరకాలుగా కాలం చెల్లిపోతున్నది! యిన్నింటి నడుమ- మహాప్రస్థానం వాకిట్లో వరుసగా క్యూలైన్లో ఆగిఉన్న మృతదేహాలలో ఒకడుగా వేచి ఉండి, నా వంతు వచ్చినప్పుడు ఫర్నేస్ బెడ్ మీద ‘ఒంటరి’గా విశ్రమించి భస్మమైపోవడం ప్రివిలేజీ కాక మరేమిటి.

ఉండి చేసేదేమీ లేదు. కానీ, ‘నేను అక్కడే ఉన్నా’ననే స్పృహ నిన్ను వెళ్లనివ్వదు. లైటు వెలుతురు కూడా అందుకోని చీకట్లో కూర్చుని ఉంటావు ఒంటరిగా. మండుతున్న కళ్లలో రెండు డ్రాప్స్ వేసుకుంటావు. చెక్కిళ్ల మీద జారడానికి చాలినన్ని నీళ్లూరుతాయి! మండుతున్న గుండెల్లో ఏం డ్రాప్స్ వేసుకుంటావు? ఎలా చల్లారుతాయి? ఇంతలో వాడొచ్చి ‘నెక్ట్స్ మీ డేడీ మేడం’ అంటాడు.

ట్రాక్ మీద నెడుతూండగా.. ఫర్నేస్ బెడ్ మీదికి చేరుకుంటాను. ఉక్కు తలుపు గట్టిగా బిగుసుకుంటుంది. స్విచ్ నొక్కుతాడు. వెలుపల నువ్వు, లోపల నేను! ఎగసిపడుతున్న జ్వాల, ఒక్కొక్కరీతిగా. నీ- లోపల, నా- వెలుపల! మిన్నంటుతూ. నన్నంటుతూ!

‘టైం పడుతుంది మేడం.. తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకోండి’ అంటాడు. చీకట్లో చీకటిగా కలిసి, లోపలి చీకటిని బయటి చీకటితో ముడివేస్తూ కదిలివెళ్తావు.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్ని వేషాలు, ఎన్ని రూపాలు ధరించాను. జీవిక కోసం అనేకానేక వేషాలు. జీవితంలో అనేకానేక రూపాలు. మానుషత్వాన్ని నిరూపించుకోవడంలో పసిబిడ్డగా, కొడుకుగా, భర్తగా, తండ్రిగా, ఫ్రెండుగా, గురువుగా, చివరికి- ఆశలు విడిచిన యోగిగా, ఆశలుడిగిన రోగిగా ఎన్నెన్ని రూపాలు ధరించాను. ఇప్పుడిక అంతిమమైన, అచేతనమైన, ధూసరమైన భస్మరూపం దాల్చే లోగా యింకో నాలుగు మాటలు చెబుతాను..

నీకు తెలియని స్వప్నం నాకు లేదు. నాకు ఉండగల భయం నీ దృష్టికి రాకుండా పోలేదు. నువ్వు పంచుకోని సంతృప్తిని నేను ఎరగను. నేను అనుభూతించిన శాంతికి ఆదరవులు అన్నీ నువ్వెరుగును. ఇంకా ప్రత్యేకించి ఏం చెప్పాలి నేను! ఏం అప్పగించాలి నేను!

అనివార్యతలు కట్టగట్టుకుని ప్రతి ఇంటినీ పలకరిస్తున్న దుర్మార్గపు సందర్భం ఇది. అశ్రువులు ఎరగని కళ్లని భూతలమంతా వెతుకు! దొరక్కపోవడమే నీకు సత్యాన్ని బోధిస్తుంది. యెడబాటుతో కుంగకుండా, నిలబడగల ధైర్యం చిక్కబడుతుంది!

‘రిఫ్రెష్ టియర్స్’తో నీళ్లూరని కళ్లను తడిచేసుకోవడం చాలదు. ఆ టియర్స్ బుగ్గల మీదికి జారకుండా రిఫ్రెష్ కావాలి.

నా దస్కతువు నువ్వు. నువ్వు నేనై, నా ప్రపంచంలో మిగిలి ఉండాలి.

*

చిత్రాలు: ముని సురేష్ పిళ్లై

మునిసురేష్ పిళ్లె

సురేష్ పిళ్లె స్వతహాగా జర్నలిస్టు. శ్రీకాళహస్తిలో పుట్టి, పెరిగి హైదరాబాదులో స్థిరపడ్డారు. కథలు, కవితలు, రాజకీయ వ్యంగ్య రచనలు, సీరియల్ నవలలు రాశారు. కార్టూన్లు గీస్తారు. వృత్తి ప్రవృత్తి ఒకటే కావడం అదృష్టం. జర్నలిజంలో పీజీ, బీఎల్ చేశారు.
Facebook :: https://www.facebook.com/kamspillai

10 comments

Leave a Reply to AM Saarathi Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Refreshed a lot! కదిలించే కథ, చదివించే కథనం. అభినందనలు సర్.

  • Aardrathaa anubhavam, anubhoothee kalisi , aalochanaalochanaalloki thewsikelle andamaina aa kruthi mee ee katha. Andukondi naa abhinandanalu, abhivandanaaloi

  • “నాది నిస్సహయత…. డాక్టర్ ది సంకోచం…నీది ఆశ”…
    ఈ మాటలు చాలు. హృదయం బరువెక్కిపోయింది. ఒకరకమైన వైరాగ్యం లోకి తీసుకు పోయింది. ( ఇలాంటి బాధాకర అనుభవం నాకు 20 ఏళ్ల క్రితమే ఉంది. ఆ బాధ నేనూ అనుభవించా).
    ఆసుపత్రి లో ఒకరు జీవన్మరణ పోరాటం…. బయట కుటుంబ సభ్యులకు ఏమాత్రం అర్థం కానీ పరిస్థితి కల్పించే అంతులేని ఆవేదన, దాన్నుంచి వ్యవస్థ మీద కలిగే ఆగ్రహం, తమ మీద తమకి కలిగే ఆక్రోశం…. కనీసం మాటల్లో కూడా చెప్పలేని ఇవన్నీ కూడా అక్షరాల్లో కూర్చాలి అంటే గుండె ఎంతో దిటవు చేసుకోవాలి. అన్నా, నువ్వు రాసింది నా ఫ్రెండ్ కుటుంబం లోని ఆవేదనభరిత అనుభవాన్ని కాబట్టి మరింతగా గుండెను పిండేసింది.

  • దుఃఖ కాసారంలో ముంచిన వేదన విషాదభరితం కావడం నేటి కథాసందర్భం. ముసుగు లోంచి పారదర్శకంగా చూడగలిగే జీవన దృశ్యాలు కళ్ళు తుడుచుకుంటూ చూడాల్సిందే. గొంతులు తడబడుతూ మాట్లాడుకోవాల్సిందే. కథ పూర్తయ్యాక ఒక వైరాగ్య భావన ఇంకొంచెం తాత్విక చింతన ముసురుకుందని మాత్రం చెప్పగలను. ఒక విభిన్న శైలిలో మీదైన అక్షరాలు కొత్తగా ఉంది, మునిసురేష్ పిళ్శై గారూ అభినందనలు.

  • అవును, గుండెల్లోని మంటల్ని ఆర్పుకోటానికి ఏ డ్రాప్స్ వేసుకోవాలి?
    ఒక విషాణువు వికటాట్టహానాినికి గుట్టలుగా పడిన అనేకానేక విషాదగాథల సంక్లిష్టభరిత ఆవేదనకు అక్షరరూపం ఈ కథ.
    అయిదు రోజులపాటు ఆస్పత్రిలో ఉంచినా తండ్రి కోలుకోకపోగా, ఓ సాయంత్రం డాక్టరు పిలిచి ‘రేప్పొద్దుటికైనా స్మశానంలో స్థలం బుక్ చేసుకోండి’ అని చెప్పినప్పడు తన హృదయం ఎంతగా తల్లడిల్లిపోయిందో ఓ మిత్రురాలు కన్నీటి పర్యంతమవుతూ చెప్పిన విషయం ఈ కథ పొడవునా నా గుండెల్లో ప్రతిధ్వనించింది. భిన్నశైలితో ఈ కథను ఆవిష్కరించిన మిత్రుడు సురేష్ పిళ్లెకు అభినందనలు.
    – ఎమ్వీ రామిరెడ్డి

  • సందర్భానుసారమైన కథావస్తువు తో హృద్యమైన కథను అందించిన సురేష్ గారికి అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు