నీ ఆకాశం కింద:
చీకటి కుమ్మరించే సూర్యుళ్ళు
వెన్నెల దాచుకునే చంద్రుళ్ళు
గాలిని మింగేసే దిక్కులు
కాళ్ళకు బేడీలు వేసుకున్న
సముద్రాలు.
అన్నీ ఉన్న
నా ఆకాశం కింద
ఏమీ లేనట్టు.
ఏడుపాగట్లేదు అని నువ్వన్నపుడు
గద్గదమైన నా గొంతును పూరించే
నాదే అనుకున్న
ఒకే ఒక్క పదం కూడా మూగబోయింది.
నీ చీకటి నిండుమేఘం అనే కదా
నా చీకటిని నువ్వు హత్తుకోనిది.
నీ ఆకాశానికి నిప్పంటుకుందనే కదా
నా ఆకాశాన్ని నువ్వు కలుపుకోనిది.
నీ కన్నీటిమేఘం
నన్ను ముంచెత్తినా సరే
నీ దేహపు సెగ
నన్ను నిలువునా కాల్చినా సరే
ఒక్కసారి హత్తుకోవూ..
రెండు ఆకాశాలూ కలిసిపోయేట్టు
రెండు చీకట్లూ కరిగిపోయేట్టు.
*
చిత్రం: సత్యా బిరుదరాజు
Nice poetry