రాత్రి దృశ్యం 

చందమామ అందాన్ని ఆరాధిస్తూ_
సందె పొద్దంతా మబ్బుల కవాతు.

పచ్చగడ్డిపై రాలిపడ్డ టేకు చెట్టు పూలలాగా_
నింగంతా లెక్కలేని చుక్కలు.

కొండగుట్టల మీద తిష్టేసిన బైరాగుల్లా_
వేటికవే ధ్యానంలో మునిగిన అష్టదిక్కులు.

వీధి కొళాయి దగ్గర అమ్మలక్కల ముచ్చట్లలాగా_
రాత్రంతా కీచురాళ్ళ గుసగుసలు.

కొత్తరాగం సాధన చేస్తున్నట్టు_
శృతిలయలు పదేపదే సవరించుకుంటూ పాడుతున్న గాలి.

పడుకున్న ప్రకృతి కల చెదరకుండా_
మునివేళ్ళ మీద మంద్రంగా నడిచెళ్ళే నది.

గుండెను పొడుస్తున్నట్టు అదేపనిగా కూసే_
ఆమె తాలూకు పేరు తెలియని పిట్ట.

దాచుకున్న కొంత ప్రాణం
తన గొంతులోంచి
ఎప్పుడు పిలుస్తుందోనని
నా గుడ్లగూబ చూపు.

 

2.

మో క్ష 

 

నీ కళ్ళు పలకరించిన వాళ్లంతా,
అప్పటికప్పుడు, హృదయాల్ని కని,
పచ్చి బాలింతల్లా నెమ్మదైపోతారు.

కొత్త ప్రేమగుచ్ఛాన్ని
ఒళ్ళో పెట్టుకుని,
ముద్దు మురిపాల అమ్మలైపోతారు.

శిలలపై నీ పలుకులొలికి,
శాపగ్రస్తులు పైకి లేస్తారు.

మనుషులుగా మారి
యిక జీవించడం ఆరంభిస్తారు.

నీ నవ్వును చూసినవాళ్ళేమో,
తారల్లా మారి గగనాలకేగుతారు.

మిణుకు మిణుకు మంటూ అనంతంగా నవ్వుతూనే ఉంటారు.

నీ చేయి తగిలిన కొందరు మాత్రం, కరిగిపోయి, మోక్షమొందుతారు.

జీవనదులై యుగయుగాలుగా
పారుతూనే ఉంటారు.

ప్రాణకోటి కోసం,
ప్రేమ సంద్రాలను నిరవధికంగా నింపుతూనే ఉంటారు.

 

3.

చూపు సూత్రం 

 

ఒక చూపు_
శరీరాన్ని తాకుతుంది.

ఒక చూపు_
తిన్నగా మనసుతో కబుర్లాడుతుంది.

ఒక చూపు_
చూసుకునేలోపే నీలో కలిసిపోయుంటుంది.

ఒక చూపెంత దూరం వెళ్లగలదనే రహస్యం_
అది పుట్టే చోటు చెపుతుంది.

కంటి మీద పుట్టే చూపు_
ఒంటిని తాకి రాలిపడుతుంది.

లోపలెక్కడో పుట్టిన చూపు_
లోపలి వరకూ చొచ్చుకెళుతుంది.

హృదయాన్ని హృదయంలో గుమ్మరించే చూపు_
పాత జన్మలోంచి నేరుగా వచ్చి
ప్రాణంతో కూడుతుంది.

మిగిలిపోయిన కథను
మళ్ళీ మొదలెడుతుంది.

*

ప్రమోద్ వడ్లకొండ

తెలంగాణలోని హనుమకొండ మా స్వస్థలం. ప్రస్తుతం బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో హెలికాప్టర్ డిజైన్ డిపార్టుమెంటులో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నాను. కవిత్వం అంటే కొంచెం పిచ్చి. బాగా చదువుతాను. అప్పుడప్పుడు రాస్తాను.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు