రాజనాల బండ

సాంబడి ఊరి దగ్గరలో రాజనాలబండ కాడసత్య ప్రమాణాలకు నిలయమైన  ఆంజనేయ స్వామి గుడి వుందంట. గుడి పెద్దూరు దేవరెద్దుకుదాని ఆలనాపాలనా చూసుకొనేందుకు  దాసప్పకావల్సి వుందంట.శుక్రవారం నాడు దేవరెద్దే దాసప్పను ఎంపిక చేసుకొంటుందంట.ఊర్లు ఊర్లన్నీ ఈ వేడుకను చూసేదానికి రాజనాల బండ గుడికాడికి వస్తాయంట.

              ”వచ్చి పోరాదా, వేడుక చూడరాదా” అని ఒకటికి పది మార్లు చిన్న నాటి స్నేహితుడు సాంబడు  పిలిస్తే పుంగనూరు పురుషోత్తం కదిలినాడు, చౌడేపల్లి బస్సు ఎక్కినాడు.

తెల్ల పంచె, తెల్ల చొక్కా వేసి, తెల్ల రంగు బూట్లు వేసి, సదుం సలీం  ఇచ్చిన సెంటుకొట్టి, తలకి తెల్ల టోపీ తగిలించి ఇంటి నుంచి బయలుదేరినాడు.

ఆకాశం నల్ల మబ్బులేసి  ఉంది.  ‘వచ్చేదా, పొయ్యేదా’ అన్నట్లుగా అప్పుడప్పుడు చినుకులు రాలుతున్నాయి. ఎందుకైనా మంచిదని ఆ మధ్యనే గురువాయూరు నుంచి తెచ్చుకున్న వంద రూపాయల తెల్ల రంగు గొడుగు తీసుకొని  బయలుదేరినాడు.

XXXXXX

బస్సు దిగినాడో లేదో, సాంబడు ‘మిత్రమా’ అంటూ పరిగెత్తుకొంటూ వచ్చి వాటేసుకున్నాడు. ఇద్దరూ లక్ష్మన్న బొరుగుల బట్టీ కాడ కూర్చొన్నారు. బైరెడ్ల బొరుగులు తింటూ ఊర్లల్లో వున్న  రాజకీయాలన్నీ చర్చించుకున్నారు. కొత్త సినిమా కథలు, పాత సినిమా పాటల గురించి  మాట్లాడుకున్నారు.  సందిట్లో సడేమియాగా బొరుగుల బట్టీ కాడి న్యూస్ పేపర్లన్నీ వరస బెట్టి చదివినారు. టీ తెప్పించుకొని టీ లో ఉప్పు బిస్కెట్లు అద్దుకొని జాలీగా తిన్నారు.

రాజనాల బండ ఆంజనేయస్వామి గుడికి వెల్దామని ఇద్దరూ  నడక ప్రారంభించినారు. అడుగడుక్కీ  వేరుశెనగ తోటలు, టమాటో తోటలు వీరిని పలకరించినాయి.

చిన్నగా సాంబడు తను ఎన్నాళ్లగానో అడగాలనుకున్న విషయం అడగడం మొదలు పెట్టినాడు. “మిత్రమా, ఏమీ అనుకోకు, మాకు ఎప్పుడో పెండ్లిండ్లు అయిపోయి మా పిలకాయలకు సంబంధాలు కూడా  చూస్తున్నాము. నీకు నాలుగు పదులు నిండినాయి కదా, ఇప్పుడైనా ఒక ఇంటివాడు అవ్వచ్చు కదా” అని ముద్దుముద్దుగా అడిగినాడు.

పెళ్లి మాట విని పురుషోత్తం సిగ్గు మొగ్గలైనాడు. “ఏమి చెప్పేది సాంబా, వచ్చిన సంబంధాలకు  జాతకాలేవీ అతకలేదు. ఒకటీ అరా బాగున్నవి ‘పెండ్లి మేము చేయలేము, మీరే చేసుకోండి’ అన్నారు.

పైసలు ఖర్చు అవుతాయని మా నాయనమ్మ  ‘నా మనవడి పెండ్లికి అప్పుడే తొందరెందుకు? వాడికి అంత వయస్సు ఎక్కడ వచ్చింది? వాడికన్నా ఊర్లో ముదురు బెండకాయలు దండిగా  వున్నాయి. ఒక మగ బిడ్డ అన్నాక, ఒక ఆడ బిడ్డ ఈ భూలోకంలో ఎక్కడో ఒక చోట పుట్టి వుంటుంది. దేనికైనా టైము రావాలి. టైము వస్తే అపరంజి బొమ్మ  లాంటి సంబంధం వెదుక్కొంటూ వస్తుంది’  అని సముదాయిస్తోంది” అని వివరంగా చెప్పినాడు.

ఏ బండ రాయితో తల కొట్టు కోవాల్నో అర్థం కాలేదు సాంబడికి. ‘అంత సులభంగా తెగే సమాచారం కాదులే ఇది’ అని నోరు కట్టేసుకున్నాడు.

XXXXXX

ఇద్దరూ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. గుడి ముందర కూర్చొని దేముడికి కొట్టిన టెంకాయను కొట్టుకొని తింటున్నారు.

ఇంతలో గళ్ళ లుంగీ కట్టిన సూరిగాడు సైకిల్ లో సర్రున దిగినాడు. సూరిగాడి భార్య బాలామణి  ముత్యాల ముగ్గు సినిమాలో సంగీత లెక్కన సంప్రదాయబద్ధంగా, భయం భక్తిగా మొగుడి పక్కనే తల ఒంచుకొని నిలబడి వుంది.

“ఎవరబ్బీ నువ్వు, బండలు పగిలే ఎండలు కాస్తా వుంటే వాన పడుతుందని గొడుగు తెచ్చుకున్నావా” అని పురుషోత్తంతో వెటకారంగా అన్నాడు.

“అవును, మా ఊర్లో చినుకులు పడతా వుంటే ఎందుకైనా మంచిదని తెచ్చుకున్నా” అని బదులు చెప్పినాడు.

సూరిగాడు పడీ పడీ నవ్వుతూ “నేను నిక్కరేసే రోజుల్లో వానంటే దేశమంతా కురిసేది. మళ్ల  కొన్ని రోజులకి ఉత్తరాదిలో  వాన వస్తే,  దక్షిణాదిలో వచ్చేది కాదు. నేను హైస్కూలు చదివేటప్పుడు  తెలుగు రాష్ట్రంలో వాన వస్తే, తమిళ రాష్ట్రంలో  వుండేది కాదు. నాకు మీసాలొచ్చే వయసొచ్చాక మన చిత్తూరు జిల్లాలో  వాన వస్తే, పక్క  జిల్లా అనంతపురం జిల్లా లో వచ్చేది కాదు. మొన్నటి దాకా  మా ఊర్లో వాన వస్తే,  పక్క  ఊర్లో వుండేది కాదు.  ఇప్పుడు మా వీధిలో వాన వుంటే  మీ వీధిలో వాన ఉంటుందన్న గ్యారంటీ లేదు. కాలం మారిపోయిందిరా అబ్బీ” అంటూ భార్యని తొడుకొని గుడికెళ్లినాడు.

మాట్లాడినోడు సూరిగాడు అని, తాగి పెళ్లాన్ని తుక్కుతుక్కుగా కొడుతుంటాడని వాళ్ళ వీధిలోనే వుంటాడని చెప్పినాడు సాంబడు.  పోతున్న సూరిగాడి వైపు కసికసిగా చూసినాడు పురుషోత్తం.

XXXXXX

పెద్ద పెద్ద షామియానాలు కట్టి వున్నారు. మేళ తాళాలు మోగుతున్నాయి. భక్త బృందాలు ఎగిరెగిరి కోలాటాలు, చెక్కభజనలు చేస్తున్నాయి. జనాలంటే జనాలు కాదు. ఇసుక వేస్తే రాలనంత జనం. గుడి ముందర గుంపుగా చేరి ఒకరి నొకరు తోసుకొంటున్నారు. పొడుగు మనుషులతో పోటీ పడలేని  పొట్టి మనుషులు చెట్టెక్కి కూర్చొన్నారు. పసి పిలకాయలు అమ్మ, నాయనల భుజాలెక్కి సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు.  బలమున్నోళ్లు  బండలెక్కి చూస్తున్నారు.

డ్రమ్ములు ‘ఢమ ఢమ’ మని మోగ సాగాయి.  పెద్దూరు దేవరెద్దు సభా స్థలమంతా రాజ ఠీవితో  తిరగసాగింది.  రంగురంగుల గుడ్డలతో దేవరెద్దు ఒళ్ళంతా సింగారించి వున్నారు. మెడకు కట్టిన గంటలు గణగణమని మోగుతున్నాయి. కొమ్ములకు చుట్టిన పూలు వయ్యారంగా గాలిలో వూగుతూ వున్నాయి.

పెద్దూరు, మర్రిమాకుల పల్లి, గాజులవారి పల్లి, కొలింపల్లి, వెంగళపల్లి పిలకాయలు దుప్పట్లు పరుచుకొని వాటి పైన కూర్చొని వున్నారు. వాళ్లంతా 17 సంవత్సరాల లోపు మగ పిలకాయలే. తెల్లారినుంచి ఒక్కపొద్దు[ఉపవాసం] వుండి కోనేరులో తల స్నానం చేసి స్వామి ప్రసాదం, గరిక, అరటిపండు, బెల్లం వంటివి అరటి ఆకులో పెట్టుకొని కూర్చొన్నారు. ఎవరి చేతిలోని ప్రసాదాన్ని దేవరెద్దు ఇష్టంగా తింటుందో వాళ్ళు ఆ దేవరెద్దుకు దాసప్ప అవుతారు. ‘దేవరెద్దు చూపు తమ పైన పడబోతుందా’ అని పిలకాయలందరూ గుడ్లప్పగించి చూస్తున్నారు.

దేవరెద్దు గంభీరంగా అట్ల తిరిగింది, ఇట్ల తిరిగింది. అది అట్లా, ఇట్లా తిరిగే కొద్దీ  మంగళ వాయిద్యాలు ఊపందుకున్నాయి. అది చూడ ముచ్చటగా నడుస్తుంటే చూడడానికి  రెండు కళ్ళు చాలవనిపించింది. దేవరెద్దు అక్కడక్కడ ఆగి పిలకాయల వైపు చూస్తుంటే ఏమి జరుగనున్నదోనని  జనాల గుండెలు డబుక్కు డబుక్కుమని కొట్టుకోసాగాయి.

చివరికి పెద్దూరు దేవరెద్దు ‘ఘల్ ఘల్’ శబ్దం ఒక చోట  ఆగింది. గట్టిగా గాలి పీల్చి గాలి వదిలింది.  మర్రిమాకులపల్లె కిష్టప్ప కొడుకు నరేష్  కళ్ళల్లోకి సూటిగా చూసింది. చిన్నగా నరేష్ చేతిలోని పచ్చి మేత, పండ్లు బియ్యం తిన సాగింది.

ఊపిరి బిగ బెట్టి చూస్తున్న జనం ఒక్కసారిగా “దేవరెద్దుకు  దాసప్ప దొరికినాడు”అంటూ గట్టిగా అరిచినారు. చెవులు బద్దలవుతాయేమో అన్నట్లుగా మేళతాళాలు మార్మోగాయి. కుర్రకారు చిందులేసినారు. ఊళలు, ఈలలు, చప్పట్లు, కేరింతలు కొట్టినారు. దాసప్పను భుజాలపైన ఎక్కించుకొని ఉరేగించినారు.  అడుగు లేయగలిగినోళ్ళు అడుగులేసినారు. ఎగర గలిగినోళ్ళు ఎగిరి నారు. ఆడోళ్ళు పైట కొంగు అడ్డం పెట్టుకొని ముసిముసి నవ్వులు నవ్వినారు.  లేవలేని ముసలోళ్లు కూర్చొనే  నవ్వుల పువ్వులు విసిరినారు.

బడి పిల కాయలు  చింగ్  చింగ్   చింగిరి చక్కం…చింగ్  చింగ్   చింగిరి చక్కం  అంటూ డ్యాన్సులేసినారు.

“దాసప్ప ఎంపిక అందరికీ సమ్మతమేనా” అని గుడి పెద్దలు జనాన్ని అడిగినారు. జనాలు చప్పట్లు చరుస్తూ, జేజేలు కొడుతూ సమ్మతమేనని చేతులు విసిరినారు. డ్రమ్ముల శబ్దం ఊపు అందుకొంది. అందరూ గుంపుగా దాసప్పను కోనేటి వద్దకు తీసుకెళ్లి ముమ్మార్లు  మునకలేయించినారు. స్వామి వారి కుంకుమను దాసప్ప తలపై పోసినారు. నుదిటిన  తిలకం దిద్దినారు. పూలమాలలు వేసినారు. భక్తిగా  దేవరెద్దుకు ప్రసాదం తినిపించినారు. దాసప్పను ఆంజనేయస్వామి దగ్గరకు తీసుకెళ్లి “నీతి నియమాలతో వుంటాను. దేవరెద్దు బాగోగులు చూసుకొంటాను. రాజనాల బండ ఆంజనేయస్వామి గుడి పవిత్రతను  కాపాడుతాను” అని  సత్యప్రమాణం చేయించినారు.

నిదానంగా  జనాలు అందరూ వారివారి ఇండ్లకు  బయలు దేరినారు.

గొడుగు గిరగిర తిప్పుతూ “కార్యక్రమం అంతా అయిపోయింది కదా, నేను మా ఊరు వెళ్తా”  అన్నాడు  పురుషోత్తం.

“ఒరేయ్ పురుషోత్తం, లేక లేక వచ్చినావు మా పల్లెకు. రాత్రి వుండి తెల్లార్తో లేచి పోదువు లేరా” అని గెడ్డం పట్టుకొని అడిగినాడు శాoబడు. ‘ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకొన్న స్నేహం కదా మా ఇద్దరి మధ్య వుండేది, రాత్రి ఇంటికి పోయి పొడిసేది ఏముందిలే’ అనుకొని మిత్రుడితో కలిసి వాళ్ళింటి వైపు నడిచినాడు. పోతూ పోతూ ఉడకబెట్టిన సెనిక్కాయలు కొనుక్కొని తింటూ మంచీ చెడ్డా మాట్లాడుకొంటూ ఊరు చేరినారు.

XXXXXX

ఉడుకు ఉడుకు అన్నం, ఉలవ చారు చేసి అందులోకి మునగాకు తాళింపు చేసినారు. మొగుడూ పెళ్ళాలిద్దరూ  పురుషోత్తంకి కొసరి కొసరి వడ్డించి కడుపారా తినిపించినారు. కంచంలో పెట్టింది అంతా మెతుకు మిగల్చకుండా తినేసి వాళ్ళ ఇంటి ముందర చింత  చెట్టు కింద నార మంచమేసుకొని కూర్చొన్నారు.

‘చింతచెట్టు కింద పడుకుందామా’ అని అడిగినాడు సాంబడు. ‘నన్ను దయ్యాలకు పట్టిద్దామనుకుంటున్నావా, అదేమీ వద్దు. సన్న జాజి చెట్టు కింద చలవ కదా, అక్కడ పడకేద్దాం’ అన్నాడు పురుషోత్తం. అరనవ్వు నవ్విన సాంబడు మంచం మీద మెత్తటి బొంత ఒకటి వేసి  సన్నజాజి చెట్టు కింద పడుకోబెట్టాడు పురుషోత్తంని.  వచ్చీరాని నిద్రతో అటూ ఇటూ పొర్లుతున్నాడు  పురుషోత్తం.

కంది తోటల నుంచి చల్ల గాలులు చిన్నచిన్నగా వీస్తున్నాయి. తిరిగి తిరిగి అలిసినాడేమో సాంబడు, నేల పైన గుడ్డ వేసుకొని నేల మీదనే పడుకున్నాడు. క్షణాల్లో గురక పెట్టి నిద్రలోకి జారుకున్నాడు.

కయ్యిలలోని కప్పలు ‘బెకబెక’ అరుస్తున్నాయి. పనీపాటా లేని వీధి కుక్కలు  ‘భౌ భౌ’ మని మొరుగుతున్నాయి.

కొద్దిసేపటికి వీధి మొదట్లో వున్న సూరిగాడి ఇంటిలోనుంచి   మొగుడూ పెళ్ళాల అరుపులు పురుషోత్తం చెవిలో పడ్డాయి. కాసేపటికి బాలామణి ఏడుస్తూ పాడుతున్న పాట వినిపించింది. “అయ్యో ఈ రోజు కూడా సూరిగాడు తాగివచ్చి పెళ్ళాన్ని కొట్టినట్లు వున్నాడు. పెళ్లాలను కొట్టే మొగాళ్ళను తుపాకీ తో కాల్చేయాలనిపిస్తుంది” అనుకొంటూ మంచం మీది నుంచి లేచినాడు.

అలికిడికి లేచిన సాంబడు “ఉడుత కెందుకు ఊర్లో పెత్తనం, కండ్లు మూసుకొని పడుకోరా” అని గట్టిగా అరచి, ఆవులిస్తూ మళ్ళీ పడుకున్నాడు. వినినట్లే విని బాలామణికి ఏమి అన్యాయం జరిగిపోతోందోనని పంచె ఎగ గట్టుకొని సూరిగాడి ఇంటికి బయలుదేరినాడు పురుషోత్తం. పోతూ పోతూ సూరిగాడిని కొట్టడానికి అనువుగా వుంటుందని గురువాయూరు గొడుగు పట్టుకెళ్లినాడు.

xxxxxx

కానుగ చెట్టుకింద కూర్చొని  బాలామణి  ఏడుస్తూ-

              “నా  బంగారు  మొగుడో, నా ముద్దూల  మొగుడో

              ఏమాయె నీకు….నా వయ్యారి మొగుడో ….

              ఏ మందు పెడ్తిరో ,ఏ మాయ చేస్తిరో

              నేనెట్టా మొగుడో, నా బతుకెట్టా మొగుడో    అని రాగాలు తీస్తూ పాడుతోంది.

సూరిగాడు కాలు మీద కాళ్ళేసుకొని ఆకాశం వైపు చూస్తూ, తిన్నె పైన వెల్లకిలా పడుకొని నక్షత్రాలు లెక్కిస్తున్నాడు. కడుపు రగిలిపోయింది పురుషోత్తంకి. ‘కట్టుకున్న పెళ్ళాన్ని ఏడిపిస్తూ కులకతా వుండాడు పనికి మాలిన వాడు’ అనుకొంటూ ఆవేశంగా  “ఆడదంటే అలుసా నీకు? ఇక్కడ మగాళ్లెవరూ లేరనుకొంటున్నావా? ఇక పై నీ పప్పులేవీ ఉడకవు”  అంటూ ధభీ ధభీ మని నాలుగు పిడిగుద్దులేసినాడు.

మొగుడ్ని కొట్టేది చూసిన బాలామణి పాడుతున్న పాటను టక్కున ఆపి, స్ప్రింగు లెక్కన లేచి  చీర నడుముకు  చుట్టి పరిగెత్తుకొంటూ వెళ్లి పురుషోత్తంని నిలదీసింది. “తాళి కట్టిన నా మొగుణ్ణి నా ముందరే కొడతావా? ఎక్కడి వాడివి? ఏ ఊరి వాడివి? ఎందుకొచ్చినావు ఇక్కడికి? తిడితే కొడితే పడేవాళ్ళు లేరిక్కడ. మా ఇంటాయనకి వెనకా ముందూ ఎవ్వరూ లేరనుకొంటున్నావేమో. ‘కో’ అంటే కోటి మంది నిన్ను పులుసులోకి ఎముకలు లేకుండా కొట్టేస్తారు. పో…  పోవయ్యా పెద్ద మనిషీ” అని గట్టిగట్టిగా అరిచింది.

“నువ్వు గమ్మునుండు చెల్లెమ్మా, నీకు తెలియదు చెల్లెమ్మా, ఇట్లాంటోళ్లని చాలా మందిని చూసినా. పెళ్ళాల కాడ పులులు వీళ్ళు. వీధుల్లో పిల్లులు వీళ్ళు. దబాయించినా, కొట్టినా, గమ్మున ఇంటి పట్టున పడి  వుంటారని పెళ్లాలంటే చులకన వీళ్ళకి. నాలుగు తగిలిస్తే దారిలోకి వస్తారు” అరిచి అరిచి చెప్పినాడు.

చెప్పిన మాట వినే మనిషిగా లేడని బాలామణి  ఊర్లోకి పరుగులు తీసింది.

“కనకక్కా …. జాతరక్కా…..మన  ఊరు గాని ఊరి వాడు, మన ఊరికొచ్చి, మా ఇంటికొచ్చి, నోట్లో వేలు పెడితే కొరకలేని నా మొగుణ్ణి కొడుతున్నాడు. రండి రండి. తాడో పేడో తేల్చేద్దాం”అంటూ రచ్చ బండ కాడ నిలబడి కేకలేసింది.

సూరిగాడిని గుద్దులు గుద్దింది చాలక, చేతిలోని గొడుగుతో పొట్టలో, నడుములో ఎగిరెగిరి కుమ్మినాడు పురుషోత్తం. “ముక్కలకాడికి తాగి ఇంట్లో పెళ్లాలను కొట్టేది మగతనమనుకొంటున్నావా? చూడు ఆ బిడ్డ కండ్లల్లో నీళ్లు! నీకు ఎట్లా ఒప్పి చస్తావుండాది, ఆడ  బిడ్డను ఏడిపించేదానికి” అంటూ మళ్ళీ గొడుగెత్తినాడు.

ఎత్తిన గొడుగును ఎత్తినట్లే పట్టుకున్నాడు సూరిగాడు. ‘హమ్మయ్య’ అనుకుంటూ సూరిగాడు-

“గొడుగు అబ్బీ, గొడుగు అబ్బీ, నేను చెప్పేది వింటావా? ఆ పిల్లకి నేనంటే పిచ్చి. నాకు ఆ పిల్ల అంటే డబుల్ పిచ్చి. మా లవ్వు మాములు లవ్వు కాదు.  అసలు  బాలామణిని నేను ఈ రోజు తిట్టలేదు, కొట్టలేదు. కనీసం ఉరిమి కూడా చూడలేదు. ఆ పిల్ల వాలకం నీకు తెలియదు. పెండ్లయిన పదేండ్లకి కానీ, నాకు ఆ పిల్ల వాలకం అర్థం కాలేదు. నిమిషాల్లో  నీకు ఎట్ల అర్థం అవుతుందిలే!

నేను ఎప్పుడైనా తాగివచ్చి తిడితే, కొడితే గమ్మున వుంటుంది. తాగకుండా ఇంటికి వచ్చి ఆ పిల్ల పెట్టింది తిని గమ్మున పడుకొంటే దానికి ఉత్త అనుమానం. నేను ఏ పిల్ల బుట్టలోనైనా పడినానేమోనని దానికి భయం. మందు పెట్టో, మాకు పెట్టో, అది చెప్పో, ఇది చెప్పో, ఏ పిల్లైనా నన్ను తన వశం చేసుకొందేమోనని దానికి  ఒకటే కలవరం. ఆ పిల్లని తిట్టి కొట్టని రోజున  ఇట్లా  ఏడుస్తూ రాగాలు తీస్తుంది” అన్నాడు.

సూరిగాడి సమాధానం విన్న పురుషోత్తంకి ఎవరో పెద్ద సుత్తితో తల పైన ఫటీ ఫటీమని పదిసార్లు కొట్టినట్లు అనిపించింది. ఏమి చెయ్యాలనో తెలియక కాసేపు తల, కాసేపు గెడ్డం గొక్కొంటూ దిక్కులు చూస్తూ నిలబడినాడు. ఎక్కడో రేడియోలో “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే” సినిమా పాట జోరుజోరుగా వినిపిస్తోంది.

XXXXXX

రచ్చ బండ కాడి కెళ్ళి గొంతు చించు కొని అరిచి అరిచి అప్పుడే ఇంటికి వచ్చింది బాలామణి.

పురుషోత్తంని పక్కకి తోసి, చిన్నగా లేచి ఒంటి మీది దుమ్ము విదిలించుకున్నాడు సూరిగాడు. గబగబా వెళ్లి  ఇంటి గోడకి ఆనించి వున్న సైకిలును బయటికి తీసినాడు. సీటు పైనున్న దుమ్ము తట్టి, సైకిల్ ఎక్కి రెండుసార్లు  బెల్లు కొట్టినాడు. తలలో సెంటు మల్లెలు పెట్టుకొంటూ  పురుషోత్తంని శాపనార్థాలు పెడుతూ బాలామణి  జింక పిల్ల లెక్కన పరిగెత్తుకొంటూ వెళ్లి  ఎగిరి సైకిల్ వెనుక సీట్లో కూర్చొంది. ఇద్దరూ గుసగుసలాడుతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ సైకిల్ పై సెకండ్ షో సినిమాకి తుర్రుమని  వెళ్తున్నారు.

ట్రింగు ట్రింగు మని సూరిగాడు కొడుతున్న సైకిల్ బెల్ శబ్దం పురుషోత్తం  చెవుల్లో గింగిర్లు కొడుతోంది. ఊర్లో వాళ్ళు వీధుల్లోకి వచ్చి’ఇదంతా మాములే’ అన్నట్లుగా  పకపక నవ్వుతున్నారు.

విషయం తెలిసి పరుగులు తీస్తా వచ్చిన సాంబడికి అక్కడి సీను అర్థమైపోయింది. “పొడుగాటి కొమ్ములున్న  పందెం పొట్టేళ్ల మధ్యన నిలబడితే బతికి బట్ట కడతామేమో గానీ, మొగుడూ పెళ్ళాల మధ్య మధ్యస్థానికి పోతే పచ్చడే పచ్చడి …” అని అంటూ పురుషోత్తం భుజం తట్టి ఇంటికి తీసుకొచ్చినాడు.

“దేముడా దేముడా, మా వాడికి మంచి పిల్లను చూసి మంచి ముహూర్తంలో మూడు ముళ్ళు వేసే అదృష్టం కలిగించు. సంసార యోగం ప్రసాదించు”అని దేముణ్ణి మనసులోనే వేడుకున్నాడు.

వారికి రెండు ఫర్లాంగుల దూరంలో  వున్న రాజనాల బండ మెరుస్తూ నవ్వుతూ వున్నట్లు  కనిపించింది.

*

ఆర్. సి. కృష్ణ స్వామి రాజు

పుట్టి పెరిగింది చిత్తూరు జిల్లా పుత్తూరు శల్య వైద్య కేంద్రమైన రాసపల్లి. పొట్ట కూటి కోసం తిరుపతిలో నివాసం. ముప్ఫై ఏళ్ల ముందు మూడేళ్ళ పాటు ఈనాడులో విలేఖరి ఉద్యోగం. గత ముప్ఫై ఏళ్లుగా ఎల్ ఐ సి లో డెవలప్ మెంట్ ఆఫీసర్ కొలువు. మూడు వందల పై చిలుకు చిన్నా పెద్దా కథలు ప్రముఖ పత్రికలలో తొంగి చూశాయి.
ఇప్పటి దాకా వెలుగులోకి వచ్చిన పుస్తకాలు ముగ్గురాళ్ళ మిట్ట, సల్లో సల్ల కథా సంపుటిలు. చిత్తూరు జిల్లా మాండలికంలో రాసిన ముగ్గురాళ్ళ మిట్టకు మక్కెన రామసుబ్బయ్య పురస్కారం, సల్లో సల్లకు శివేగారి దేవమ్మ పురస్కారం లభించాయి.ఇవి కాక ప్రస్తుతానికి రాజు గారి కథలు[ముప్పై బాలల బొమ్మల కథలు], పకోడి పొట్లం[అరవై కార్డు కథలు] పుస్తకాలుగా వచ్చి ఉన్నాయి.

2 comments

Leave a Reply to Padmalatha Jayaram Nandiraju Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బావుంది. ఇలాంటి పూజారులు ఉంటారనీ, ఎంపిక విధానం, దేవరెద్దు సంరక్షణ అన్నీ క్రొత్త విషయాలే! సూరి గాడి పెళ్ళాం లాంటి వాళ్ళతో కూడా మీ వల్లే పరిచయమైంది. చాలా బావుంది Sir.

    • చిత్తూరు జిల్లాలో పడమటి మండలంలోని ఆ గుడిలో జరిగే వాస్తవ విషయాలే ఈ కథలో రాయడం జరిగింది.
      మీకు నచ్చినందుకు ధన్యవాదములు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు