మిథ్యా ప్రపంచంలో మరో సారి గాలిబ్ గురించి..

గాలిబ్ కవితలకు మూడు ప్రాణాలున్నాయి. అవి నిగూఢత, గతితర్కం, తాత్వికత.

నిజాముద్దీన్ వెళ్లినప్పుడల్లా నన్నెందుకో గాలిబ్ పిలుస్తాడు.

కొద్ది రోజుల క్రితం షాహిన్ బాగ్ వెళ్లాను. రిపబ్లిక్ డేకు ఒక రోజు ముందు అనుకుంటా. అక్కడ ఎక్కడ చూసినా జాతీయ పతాకాలు రెపరెపలాడుతున్నాయి. నిరసన కారులు దేశ భక్తి గీతాలు ఆలపిస్తున్నారు.

భారత దేశంలో ఇదొక విచిత్ర పరిణామం.

తమకంటే మించిన దేశ భక్తులు లేరనుకునేవారు ద్వేషించే వర్గమే దేశ భక్తి గీతాలను ఆలపిస్తోంది.

చరిత్ర మలుపులో ప్రతి సారీ ఒక ప్రశ్న మనం వేసుకోక తప్పదు.

ఎవరు దేశ భక్తులు?

తిరిగి వస్తుంటే మళ్లీ నిజాముద్దీన్(వెస్ట్) దాటకుండానే గాలిబ్ పిలిచాడు.

బహదూర్ షా జఫర్ పట్టుబడిన, దారాషిఖో సమాధి అయిన హుమాయూన్ సమాధులు రాకముందే ఎడమ వైపు ఒక చిన్న రోడ్డు ఉంటుంది. అత్యంత సంపన్నులు నివసించే నిజాముద్దీన్ ప్రాంతం ఈ రోడ్డు వైపు మళ్లగానే ఆశ్చర్యం కలిగించే విధంగా వేలాది మంది ముస్లింలు సంచరించే రకరకాల సందుగొందుల వాడగా మారుతుంది. వందలాది చిన్న చిన్న దుకాణాల్లో అమ్ముతున్న రకరకాల అత్తర్లతో ఆ ప్రదేశం గుబాళిస్తుంది. రోడ్డుకు ఇరువైపులా నూనెలో వేపుతున్న అనేక తినుబండారాల వాసనలు కడుపులో పేగుల్ని కదిలిస్తాయి. ఉర్దూ పుస్తకాల షాపుల్లో పుస్తకాల పుటల్లోంచి పాత జ్ఞాపకాలు తరుముకుంటూ వస్తాయి. కరీమ్ హోటల్ లో పర్షియన్, అఫ్గానీ ఆహారం రుచి చూడకుండా వెళ్లడానికి కాళ్లు సహకరించవు. చార్మినార్, పత్తర్ గట్టీ, లాల్ దర్వాజా, గౌలీపురా, బాలాగంజ్, సుల్తాన్ షాహీ, మేకల బండ, అల్యాబాద్,సైదాబాద్ గల్లీల్లో తిరిగిన వాడిని కదా, నిజాముద్దీన్ గల్లీల్లో తిరుగుతుంటే బాల్యం భుజాన చేయి వేసి నడిపిస్తున్నట్లనిపిస్తుంది.

అవును అక్కడే ఉన్నది గాలిబ్ సమాధి. ఎన్ని సార్లు వచ్చినా ఆ సమాధి నన్ను నిస్తబ్దుడిని చేస్తుంది. గుండెల్లో ఒక ప్రశాంతత ఆవరించినట్లనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతమే హజ్రత్ నిజాముద్దీన్ దర్గాగా ప్రసిద్ది గాంచిన సూఫీ సాధువుల నిలయం. ప్రేమ, సహనం, దాపరికంలేని తత్వాన్ని బోధించిన చిస్టీ సూఫీ పరంపరను ప్రతిబింబించే ప్రాంతం. అఫ్గనిస్తాన్ నుంచీ అజ్మీర్ దర్గా వరకూ, ప్రపంచ వ్యాప్తంగా గులాబీ అత్తర్లలా ప్రేమ పరిమళాల్ని పంపించిన సూఫీల వెలుగుల్ని ప్రసరించే ప్రదేశం.

ఇదే నిజాముద్దీన్ దర్గా సముదాయంలో ఉన్నది షాజహాన్ కూతురు జహనారా సమాధి. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ శిష్యురాలై తన సోదరుడు దారా షిఖో తో పాటు సూఫీ తత్వాన్ని ప్రేమించి జీవితాంతం కన్యగా ఉండిపోయిన ప్రేమమయి, రచయిత్రి జహనారా. ఆమె రాసిన ఖ్వాజా మొయినుద్దీన్ జీవిత కథలో సాహితీ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయంటారు. ఇక్కడే ఆమె తాను జీవించి ఉండగానే నీలి ఆకాశాన్ని హత్తుకునే ఒక పాలరాతి సమాధిని నిర్మింపచేసుకున్నారు. ఇక్కడే ఆమెను మరణానంతరం సమాధి చేశారు. తన సమాధిని పచ్చికతో కప్పమని, అదే పేదలకు ఆశ్రయమిస్తుందని ఆమె రాసుకున్న వాక్యాలు ఇంకా ఇక్కడ ఫలకంపై ఉన్నాయి.

గాలిబ్ సమాధి కూడా నిజాముద్దీన్ దర్గాకు సమీపంలో నే ఉంటుంది. పక్కనే ఉన్న మైదానంలో పిల్లలు ఆడుకుంటుంటే, పాలరాతి ఆరుగులపై వృద్దులు నిద్రిస్తుంటే, ఆనుకుని ఉన్న గాలిబ్ అకాడమీలో పాఠకుల వ్రేళ్లు పుటల్ని తిప్పుతుంటే, చెట్లపై ఉన్న పక్షులు రెక్కలు చప్పుడు చేస్తూ ఎగురుతుంటే, సందుగొందుల్లోంచి అత్తర్ల పరిమళాలు గాలిలో పయనిస్తుంటే, మసీదు లోంచి ప్రార్థన శూన్యాన్ని ఛేదిస్తుంటే గాలిబ్ పెదాలపై చిరునవ్వు విరిసినట్లుంటుంది ఆ సమాధి.

అసలు భారత దేశంలోనే ఒక అంతుబట్టని తత్వం ఉన్నదనిపిస్తుంది. దాన్ని అన్వేషించేందుకు జరిగే పయనంలో మన కాళ్లు ఆగే ఒక ప్రదేశం గాలిబ్. గాలిబ్ సమాధి వద్ద పైకి కనిపించని ఒక జ్వాల రగులుతున్నట్లనిపిస్తుంది. అసలు ఆయన పదాల్లోనే చాలా సార్లు అర్థాలు ఛేదించలేని ఒక నిగూఢమైన, సృజనాత్మకత అబ్బురం కలిగిస్తుంది. ఒక కవితాత్మక కళాత్మక రహస్యాత్మ ఆయన అక్షరాల్లోనే సంచరిస్తున్నట్లనిపిస్తుంది. మన రోజువారీ దుర్భర జీవనాన్నుంచి మనను బలంగా లాగే అద్భుత శక్తి దానిలో ఉన్నదనిపిస్తుంది. మనకు తెలియకుండానే చేసే ప్రయాణంలా మారుతుంది.

ఆమె గురించి ఏదైనా

గుండెను పట్టి లాగుతుంది

ఆమె మాటలు, చూపులు

ఆమె ఆకర్షణా శక్తి మహిమ…

అన్నాడు గాలిబ్. అది ఆయన కవిత్వానికీ వర్తిస్తుంది. కవిత్వానికి మించిన శక్తిని వర్ణించలేం. ఒక మహాద్భుత అందాన్ని వర్ణించడానికి పదాలు లేనట్లు.. అని ఆయనే చెప్పుకున్నారు. ‘ఒక నీటి చుక్క కావడం కన్నా ప్రేమికుడి కన్నీటి చుక్క కావడం మిన్న..’ అన్న గాలిబ్ ఆ కన్నీటి చుక్కలోనే విశ్వ ప్రేమను చూడగలడు.

తన సమకాలీన కవులతో పోల్చలేని ఒక అంతుబట్టని ఆకర్షణ గాలిబ్ కవిత్వంలో ఉన్నది.అర్థానికి మంచిన అర్థం అందులో ఉన్నది. ఆ నిశ్శబ్ద మౌన భాషను అర్థం చేసుకునేందుకు, ఆ కవిత్వ రహస్యాన్ని కనిపెట్టేందుకు ఎందరో విమర్శకులు ఒక శతాబ్ద కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన కాల్పనికుడా, సాంప్రదాయికుడా, ఆధునికుడా, తాత్వికుడా అని మీమాంసలు చేస్తూనే ఉన్నారు.

నేటి ప్రపంచంలో మనం మన లోలోపలి మౌనపు భాషను కోల్పోయినట్లు కనిపిస్తున్నాం. ఒక స్వచ్చతను, పసి అమాయకత్వాన్ని, ఆర్ద్రతను కోల్పోయినట్లు కనిపిస్తున్నాం. మధ్య యుగాల సూఫీలు, సాధువుల అతీంద్రియమైన, పారమార్థికమైన మార్మిక బోధనల వివేచనను, తాత్వికతను చేరుకోలేని పామర నాయకత్వ పరిధిలో కొట్టుమిట్టాడుతున్నాం. మన గుండె లోతుల్లోని శూన్యపు విలువను తెలుసుకోలేకపోతున్నాం. కలుషితమైన మన అంతర్గత దర్పణాన్ని శుభ్రం చేసుకోలేకపోతున్నాం. ఏది సంకుచితమో, ఏది స్వేచ్చకు సంకేతమో, ఏది పిడివాదమో, ఏది మూఢ విశ్వాసమో, ఏది అసహనమో అర్థం చేసుకోలేకపోతున్నాం. సత్యం ఎవరి గుత్త సొత్తూ కాదు. సత్యాన్వేషణాపథం అందరికీ చెందుతుంది.

‘ప్రతి పనీ సులభం కావడం అసాధ్యం, మనిషి మనిషిగా ఉండటమే ఎంతో కష్టం’

అన్న గాలిబ్ వాక్యాలు నీలోపలికి నీవు వెళ్లడానికి దోహదం చేయకపోతే నీవు మనిషిగా ఉండలేవు. గాలిబ్ ను సులభంగా అర్థం చేసుకోవడం ఇంకా అసాధ్యమవుతుంది.

‘ఒక చేతిలో అగ్ని, మరో చేతిలో నీరు ధరించానంటుంది’ దేవుడి శాశ్వత అందాన్ని ఆరాధించిన తొలి మహిళా సూఫీ కవయిత్రి రబియా బస్రీ. దానర్థం ఏమిటని ఎవరో అడిగారట. నేను అగ్నితో స్వర్గాన్ని దహించి , నీరుతో నరకంలోని మంటల్ని ఆర్పాలనుకుంటున్నాను.. అన్నదట ఆమె. స్వర్గమూ, నరకమూ రెండూ అంతమైతే ఇక మిగిలేదేముంటుంది మానవ జాతి తప్ప! దురాశా, దుఃఖమూ లేని మానవ జాతి, నిస్వార్థంగా దైవత్వాన్ని తనలో ఒంపుకునే, ప్రేమలో దైవత్వాన్ని చూసే మానవ జాతి! కవులు ఆశించిందిదే!

గాలిబ్ కూడా ఇదే భావం వ్యక్తపరచకుండా ఉండలేదు.

మదిర, మకరందం కావాలని

స్వర్గ సుఖాలకోసం

జనం ప్రార్థిస్తారు.

స్వర్గాన్ని ఎత్తి

నరకంలో ఎందుకు

తోసేయకూడదు?

–అని ఆయన ప్రశ్నించారు.

నేర్చుకోవాల్సిన పాఠం

పైపు చూడలేని ప్రపంచం

భూమ్యాకాశాలు రెండూ

తిప్పివేసిన పుటల్లాంటివి..

–అన్నాడు గాలిబ్

గాలిబ్ కవితలకు మూడు ప్రాణాలున్నాయి. అవి నిగూఢత, గతితర్కం, తాత్వికత. ఆ ప్రాణాలను మనలో సంలీనం చేసుకోకపోతే గాలిబ్ మేఘాల్లో తచ్చాడుతున్నట్లనిపిస్తాడు. ఈ మూడింటి ద్వారా ఆయన మత విద్వేషాలు, భావోద్వేగాల మధ్య రగులుతున్న ప్రపంచానికి విశ్వజనీన సందేశాలు పంపాడు.

‘అంతంలేని భ్రమల ప్రపంచంలో నీవనుకునేదే వాస్తవికత.’. అంటాడు ఒక చోట. ఏది వాస్తవికతో, ఏది భ్రమో తెలియక కొట్టుమిట్టాడుతున్నాం మనం…

తన్ను తాను కొల్లగొట్టుకుంటున్నదా ఈ ప్రపంచం? ఒక చోట అది జన్మిస్తోంది. మరో చోట అది ధగ్దమవుతోంది..

‘కల తన గొంతు తాను నులుముకుంటున్నది..’ అన్నాడొక ఆధునిక కవి.. ఇదొక స్వయం ధగ్దమవుతున్న హృదయ ఘోష. గాలిబ్ కాలం నుంచీ అది మనను వీడలేదు..

షాహిన్ బాగ్ లూ, జఫ్నా బాద్ లూ ధగ్దమవుతున్నాయి. మనం సృష్టించిన ప్రపంచాన్ని మనం ధగ్ధం చేసుకుంటున్నాం.

‘బ్రాహ్మణుడు తన జీవితమంతా విగ్రహాల మధ్య ఆరాదిస్తూ గడిపితే, అతడికి కాబాలో సమాధి అయినంత పుణ్యం దక్కినట్లు..’ అన్న గాలిబ్

మన భ్రమాన్విత జీవితం గురించి ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాడు. విశ్వమానవుడు. విశ్వప్రేమికుడు కమ్మని చెబుతుంటాడు. భక్తికి మతం లేదంటాడు.

ఏ ఉనికీ లేనప్పుడు దేవుడున్నాడు

ప్రతి ఉనికీ మాయమైనప్పుడూ దేవుడుంటాడు

నా ఉనికే నన్ను ఓడించింది

నేనే లేకపోతే ఏమై పోయేవాడిని?

గాలిబ్ సమాధి వద్ద పాలరాతి ఫలకంపై రాసిన ఈ వాక్యాలు ప్రతి సారీ నన్ను నిశ్చష్టుడిని చేస్తుంటాయి. కొత్త అనువాదానికి ప్రేరేపిస్తుంటాయి

అవును. మన ఉనికే మనను పరాజితుడిని చేస్తోంది. మన జీవితాలను దుర్బరంగా మారుస్తోంది. అన్ని విలువలూ కోల్పోయిన ఈ ప్రపంచంలో జీవించడం కన్నా మనం లేని శూన్యం కోసం అన్వేషణలోనే గడుపుదామా?

మాయంటావా, అంతా మిథ్యంటావా?

*

 

 

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

9 comments

Leave a Reply to ashok.k Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మిత్రులు కృష్ణారావు గారికి కృతజ్జ్ఞతలు గాలిబ్ గురించి ఇంత వివరంగా చక్కని బాషలో తెలిపినందుకు. కృష్ణరావు గారిలో ఉన్న కవిహృదయం ఎంతబాగరాశారు. నిజానికి ఢిల్లీ లో 51 సంవత్సరాలగా ఉంటున్న నేను ఇప్పటి దాకా నిజాముద్దీన్ వెళ్ళేదని నా మీద నాకే చిరాకు కలిగించారు గురువు గారు.

  • సూఫీల మతోల్బణం….

    కృష్ణారావుగారూ, సూఫీ కవులు, బాబాల గురించి నేనో ఫేస్ బుక్ పోస్ట్ పెట్టాను. దానిలోని వివరాలన్నీ ఇక్కడ వ్రాసి స్థలాన్ని వృథా చేయాను. మీకు ఆసక్తివుంటే దానిని చూడవచ్చు. దానిలోని సాధికారిక, చారిత్రక ఆధార సహిత సమాచారమంతా పరిశీలించి నాణేనికి రెండోవైపు కూడా చూడవలసినదిగా కోరుతున్నాను.

    సూఫీ గురువు నిజాముద్దీన్ వ్యాఖ్యలు… Nizamuddin Auliya (1238–1325), toeing the orthodox line, condemned the Hindus to the fire of hell, saying: ‘The unbelievers at the time of death will experience punishment. At that moment, they will profess belief (Islam) but it will not be reckoned to them as belief because it will not be faith in the Unseen… the faith of (an) unbeliever at death remains unacceptable.’ He asserted that ‘On the day of Resurrection when unbelievers will face punishment and affliction, they will embrace faith but faith will not benefit them… They will also go to Hell, despite the fact that they will go there as believers.’ In his khutba (sermon), Nizamuddin Auliya condemned the infidels as wicked, saying, ‘He (Allah) has created Paradise and Hell for believers and the infidels (respectively) in order to repay the wicked for what they have done.’

    ‘సూఫీల రక్త చరిత్ర’…
    https://www.facebook.com/Sreenivasudu/posts/2493788257576646

      • నాకు ఏ దృష్టి, ఆలోచన లేదండి. ఒకవేళ వున్నా దానికి సప్రమాణమైన, ఆధారసహితమైన, హేతుబద్ధమైన పునాది లేకపోతే అది మూఢనమ్మకమో లేక అంధవిశ్వాసమో అవుతుంది. నేను అనావృతంగా వున్నాను.

        చరిత్రని ఒక వ్యక్తిని గురించి అంచనా వేసేటప్పుడు అతడి సమస్త రచనలు, మాటలు అన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అతడిపై మనకున్న ఆరాధనాభావంతోనో, లేక కవిత్వం యొక్క గాఢతపైన మమకారంతోనో, లేక అతడి తాత్త్విక స్థాయి వ్యక్తీకరణ అద్భుతంగా వుండడం చేతనో అతడిని మెచ్చుకోవడం, అనుసరించడం ఒక పద్ధతి. అదే సమయంలో అతడు ఆ కాలంలో తన మతం పట్ల, అది నిర్దేశించిన విషయాల పట్ల పరమ విశ్వాసం కలిగి, తన మత గ్రంథంలో చెప్పినవాటిని (అంటే తన మతాన్ని, తన దేవుడిని విశ్వసించని అవిశ్వాసుల పట్ల ఏ విధంగా ప్రవర్తించమని చెప్పిందో, అంటే కాఫిర్ కాన్సెప్ట్) తు.చ, తప్పకుండా ీజీవితాంతం పాటించి, ఆ విధంగానే మాట్లాడిన ప్రస్తావన కూడా తప్పకుండా మనం అతడి గురించి చెప్పినప్పుడు ప్రస్తావించాల్సిందే. చరిత్రలో ప్రకృతి, వికృతి రెండూ వుంటాయి. అతడి వికృతి చరిత్ర వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా నాశనమైన, నామరూపాలు లేకుండా పోయిన, హింసకు గురైన వ్యక్తి ఒక్కరు వున్నా సరే అతడి ప్రస్తావన మనం తేవాల్సిందే, దానికి కారణమైన ఈ మహావ్యక్తి గురించి చెప్పుకోవాల్సిందే.

        నేనిచ్చిన ఆధారాలన్నీ ఆయా సూఫీ కవులు స్వంతంగా వ్రాసుకున్న మాటలే, ఆయా ముస్లిం చరిత్రకారులు అప్పట్లోనే లిపిబద్ధం చేసిన విషయాలే. ఇందులో నేను ప్రత్యేకంగా ద్వేషంతో చూసింది, వక్రీకరించింది ఏమీలేదు.

        నేను అడిగేదల్లా ఒకటే, ఇవన్నీ సత్యాలే కదా. వీటిని మీరు చదివి రెండో వైపు కూడా చూస్తారని, వాళ్ల గురించి ప్రస్తావించేటప్పడు ఇవి కూడా ప్రస్తావిస్తేనే సత్యవలయం పూర్తవుతుంది, సంపూర్ణ సత్యం ద్యోతకమవుతుందని నా విన్నపం. చరిత్ర గురించిన అసత్యాలు, అర్థసత్యాలు, పాక్షిక సత్యాలు చెప్పి కొన్ని ప్రాంతాలవారికి, కొన్ని మతాలవారికి వందల ఏళ్లుగా ఎంత ద్రోహం చేసామో మనకు టిపు సుల్తాన్ ని దేశభక్తుడిగా, సెక్యులర్ గా కీర్తించిన ఉదంతంలో అనుభంలోకి వచ్చింది. అలాంటిది సూఫీ గురువుల గురించి కూడా జరగకూడదని నా ప్రయత్నం, అంతే.

        ఆ పైన మీ యిష్టం. దయచేసి నేను యిచ్చిన సమాచారమంతా ఒకసారి చదవండి. మిమ్మల్ని మీ దృక్కోణం మార్చుకోమనడం లేదు.

  • మాయ అంటావా, మిధ్య అంటావా?👌👌సర్,గాలిబ్ కవితలు, గురించి, బాగా వివరించారు.. ధన్యవాదాలు, సర్!

  • చాలా బాగా రాశారు సర్ . గాలిబ్ గారి గురించి కవిగా వినటమే తప్ప తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఢిల్లీలోనే 8 సంవత్సరాలు వున్నా .. ఎంత సేపు రాజకీయ నేతల చుట్టూ తిరగటం మినహా నేను వ్యక్తిగతంగా , వృత్తి పరంగా పెద్దగా సాధించిందేమీ లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. మీ కింద పని చేశాననే వ్యక్తిగత సంతృప్తి మినహా చెప్పుకోదగిన జ్ఞాపకాలు ఏమీ మిగల్లేదు సార్. అశోక్.కె

  • చాలా బాగా రాశారు సర్ . గాలిబ్ గారి గురించి కవిగా వినటమే తప్ప తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఢిల్లీలోనే 8 సంవత్సరాలు వున్నా .. ఎంత సేపు రాజకీయ నేతల చుట్టూ తిరగటం మినహా నేను వ్యక్తిగతంగా , వృత్తి పరంగా పెద్దగా సాధించిందేమీ లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. మీ కింద పని చేశాననే వ్యక్తిగత సంతృప్తి మినహా చెప్పుకోదగిన జ్ఞాపకాలు ఏమీ మిగల్లేదు సార్. అశోక్.కె

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు