బహుశా నాకప్పుడు పది, పన్నెండేళ్ల వయసు వుండి వుండవచ్చు. ఒక రోజు మా పెదనాన్న పిల్లందరినీ దగ్గర కూచోబెట్టుకుని కబుర్లు చెబుతూ, మన ఊరిపక్కనే వున్న పెదమద్దాలి వాడే కాకిమాధవరావు మంచి తెలివైన వాడు, కలెక్టర్ గా పనిచేస్తున్నాడు చాలా ప్రతిభావంతుడు అని చెప్పాడు. ఆ రోజే ఆయన పేరు నా మెదడు పొరల్లో నిక్షిప్తమయిపోయింది.
తర్వాత నేను పెరిగి పెద్దయి పుట్టి పెరిగిన ఊరయిన పామర్రులోనే మెడికల్ ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పణ్ణించీ ,పెదమద్దాలి పేషెంట్ల నోట ఆయన పేరు వింటూ ఉండేదాన్ని. కానీ ఆయనని చూస్తానని గానీ ,ఆయనతో పరిచయమవుతుందని గానీ ఊహల్లో కూడా లేదు. అలాంటిది సుమారు పదేళ్లక్రితం తెన్నేరులో జయశ్రీ దంపతుల ఇంట జరిగిన సాహితీ విందులో పరిచయమయ్యారు అంతర్జాతీయ ద్రవ్యనిధిలో పనిచేసిన ఆరిగెపూడి ప్రేమ్ చంద్ గారు. ఆయనా నేనూ కలిసి విశ్వనాథ సత్యనారాయణ వ్యక్తిత్వం గురించీ, బాలసరస్వతీ, రాజేశ్వరరావు పాటల గురించీ మాట్లాడుకున్న గుర్తు. ప్రేమ్ చంద్ గారికి , కాకి మాధవరావు గారితో బాగా పరిచయమట, వారిద్దరూ హైద్రాబాద్ లో ఇరుగూ పొరుగూ అట.
ప్రేమ్ చంద్ గారు నా గురించి యేం చెప్పారో యేమో ,ఒక రోజు మాధవరావు గారు ఫోన్ చేసి తాను పామర్రు వస్తున్నాననీ, నన్నుకలవడానికి వీలవుతుందా అనీ అడిగారు. వారు వచ్చింతర్వాత తెలిసింది, వారికి సంగీతమంటే చాలా మక్కువ అని.మా ఇద్దరికీ కామన్ ఇంటరెస్ట్ యెంకి పాటలు.
ఆయన చాలా చక్కగా పాడగలరు,అంతే కాకుండా చక్కటి బాణీలు కూడా కట్ట గలరు.నేనాయన కట్టిన బాణీలూ,పాడిన పాటలూ విని డంగై పోయాను.సుతిమెత్తని గాత్రం ఆయనిది,సున్నితంగా పలికే సంగతులు .
అప్పటినుండీ యెప్పుడయినా పామర్రు వచ్చినప్పుడు వీలయితే వచ్చి కనపడి తన కొత్తపాటలు వినిపించే వారు.నా “గీతాంజలి” పుస్తక సభకి ప్రేమ్ చంద్ గారితో కలిసి వచ్చి నన్నాశీర్వదించారు .చలం “గీతాంజలి “లోంచి రెండు పాటలు కూడా పాడారు.
ఈ మధ్య ఆయన స్వీయ చరిత్ర వెలువడిందని తెలిసి ఫోన్ చేశాను. ఇంగ్లీషులో తానే స్వయంగా రాశాననీ త్వరలో తెలుగులో వెలువడుతోందని చెప్పారు.నేను హైద్రాబాద్ లో కలిసినప్పుడు గోల్ఫ్ క్లబ్ లో భోజనానికి తీసుకు వెళ్లబోయే ముందు పుస్తకం చేతిలో పెట్టారు.
పుస్తకం మొదలు పెట్టిన దగ్గరనుండీ తలపక్కకు తిప్పకుండా చదివించింది. చక్కటి ఇంగ్లీషు ,కొత్త కొత్త పదాలున్నప్పటికీ ఎక్కడా బ్రేకులు పడకుండా చదివించే పుస్తకం.
ఒక నిరుపేద దళిత కుటుంబంలో 1939లో కృష్ణాజిల్లా పెదమద్దాలిలో జన్మించిన మాధవరావు చదువుకోవడానికి నానా కష్టాలూ పడ్డారు. ఒక భూస్వామి దగ్గర నమ్మకంగా విశ్వాసపాత్రంగా పనిచేసే ఆయన తండ్రికి తన పిల్లలు కూడా తనలాగే పాలేర్లుగానే బతుకు సాగించాలనే ఒకఅభిప్రాయం వుండేది. వాళ్లు చదువుకోవడానికి ఆయన యేమాత్రం ఇష్టపడకపోగా యెన్నోరకాలుగా అడ్డుపడేవారు.చాలా సార్లు ఆయన దండనకు పిల్లలే కాక అడ్డొచ్చిన ఆయన భార్యకూడా గురయ్యే వారు.
పిల్లలు చదువుకోవాలనే స్థిరమైన అభిప్రాయంతో వారితల్లి మాధవరావు గారినీ వారి సోదరుడైన రాఘవేంద్రరావు గారినీ ప్రోత్సహించి బడికి పంపేవారు.
మాధవరావు గారు చదువుమీద గట్టి పట్టు చూపేవారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసమంతా పెదమద్దాలిలోనూ,ఎలమర్రు,పామర్రు హైస్కూళ్లలోనూ సాగింది. ఆ తర్వాత మచిలీ పట్నంలో నాలుగు సంవత్సరాలు చదువుతో ఇంటర్మీడియట్ ,డిగ్రీ పూర్తి చేశారు.మచిలీపట్నంలో చదువుకునేటప్పుడు రాంజీరావు నడిపే హాస్టల్ లో వుండేవారు. ఆ సమయంలో హాస్టల్ నిర్వహణకి నిధుల కొరత వలన ఆహారం చాలా మితంగా తీసుకోవలసి వచ్చేది.ఈ అలవాటుని ఆయన జీవితాంతం కొనసాగించారు,ఆహారానికీ కొదవ లేకపోయినా. గతాన్ని మరిచి ప్రవర్తించడం ఆయనకి ఇష్టం వుండేది కాదు.
ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుండీ బి.ఏ. ఆనర్స్ పట్టా పొందారు.ఉస్మానియా యూనివర్సిటీ నుండీ న్యాయవాద డిగ్రీ పొందారు.1962లో ఇండియన్ అడ్మిన్స్ట్రేటివ్ సర్వీస్ లో చేరారు. అంచెలంచెలుగా జరిగిన ఈ యెదుగుదల ఆయన కృషినీ పట్టుదలనీ తెలుపుతుంది. దీనికంతటికీ ఆయన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన ,ఆయన వ్యక్తిత్వాన్నే మార్చివేసినదాని గురించి చెప్పాలి.
ఆయన స్కూల్లో చదువుకునే సమయంలో ఆయన బంధువు ఒకాయన ఒక నిరుపేద , చెరువుల్లోని తామరాకులు కోసుకొచ్చి ,అవి రోజూ యెండబెట్టి సాయంత్రానికి పోగుచేసి మిఠాయి కొట్లకీ,మాంసం కొట్లకీ అమ్ముకుని పొట్టపోసుకునే వాడు.
ఒకరోజు సాయంత్రం గాలికి ఆ తామరాకులన్నీ కొట్టుకుపోతుంటే ఆయన రోదించసాగాడు.అది చూసి జాలిపడి ఈయన ఆయనకి ఆకులు పోగుచేసి సహాయం చేసేసరికి ఇంటికెళ్లడానికి ఆలస్యమయింది.
ఆలస్యానికి కారణం అడగకుండానే తండ్రి బాగా కొట్టడం ఆయన హృదయాన్ని బాధించింది. అప్పటి నుండీ సుమారు ఏడు సంవత్సరాలు ఆయన ధర్మాగ్రహాన్ని ప్రకటిస్తూ ఎవరితోనూ మాట్లాడకుండా, చాలా తక్కువ ఆహారం తీసుకుంటూ, తల వెంట్రుకలు కూడా తగ్గించుకుని మౌనంగా తన పనేదో తను చూసుకునే వారట. తల్లి సమాధాన పరచాలని చూసినా ఆయన సమాధాన పడలేదట. అయితే చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు.
ఈ సంఘటన తనలో ఒక పట్టుదలను పెంపొందించి , తన వ్యక్తిత్వాన్నే మార్చివేసిందంటారు ఆయన. ఆయన కలెక్టరయినాక తల్లిదండ్రులని యేంకావాలని అడిగితే తండ్రి ఒక ఐదెకరాలు పొలం కొనిపెట్టమంటే , తల్లి మాత్రం “వృత్తిలో ఉన్నతస్థాయినందుకో -పేదసాదల పట్ల దయగా వుండు” అని చెప్పిందట. తల్లి చెప్పిన మాట ఈనాటి వరకూ మరిచిపోలేదాయన. ఆయన కలెక్టరయినా ,తన వేళ్లని మరిచిపోలేదు .పేదలపట్లా ,బాధిత జీవులపట్లా ఆయన హృదయంలో కరుణ గూడుకట్టుకుని వుండేది.
కలెక్టర్లందరూ కలలు కనే పదవి చీఫ్ సెక్రటరీ అది కూడా సాధించారాయన,తర్వాత చీఫ్ ఎలక్షన్ కమీషనర్ చేశారు.ఇంకా యెన్నో రంగాలలో వివిధ హోదాలలో పని చేశారు. ఎంత ఎత్తుకు యెదిగినా యే పదవిలో వున్నా న్యాయబధ్ధంగా పని చేయడం ,తనకు చేతనైనంత మేర పీడిత ప్రజల పక్షాన నిలబడి వారి ప్రయోజనాలకై పాటు పడటం మరువలేదాయన.అలా పని చేయడం వలన యెన్నో అడ్డంకులు ఎదురయినాయి.
వరంగల్ జిల్లాలో పనిచేసేటప్పుడు అనవసరమైన యెన్ కౌంటర్లను ఆపినందుకు “నక్సలైట్ కలెక్టర్ “అనే అపవాదును కూడా యెదుర్కోవాలిసి వచ్చింది.కొన్ని విపత్కర పరిస్థితులు యెదురైనప్పుడు, అవసరమైతే కలెక్టర్ గిరీని వదులుకుని సామాన్య వుద్యోగమైనా చేయడానికి మానసికంగా సిధ్ధమయ్యారే కానీ ఆత్మాభిమానాన్ని వదులుకోలేదు. అనుక్షణం బీదల అభ్యున్నతిని కాంక్షిస్తూ పాటుపడే ఎస్ .ఆర్ శంకరన్ తో చాలా దగ్గరగా మసిలారు .ఆయన్ని తన మానసిక గురువుగా స్వీకరించారు.ఆయనతో కలిసి యెన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు. క్షేత్రస్థాయిలో ఊరూరా తిరిగి పనిచేసేవారు. ఎంతో మందికి వెట్టి చాకిరీ నుండి విముక్తి కలిగించారు.
హైద్రాబాద్ లో కె.బి.ఆర్ పార్క్ ,నెక్లెస్ రోడ్డుయేర్పడటం వెనకా,విజయవాడలో వస్త్రలత నిర్మాణం వెనకా ఇంకా రాష్ట్రాభివృధ్ధికి తీసుకున్న యెన్నో కీలకమైన నిర్ణయాల వెనకా ఆయన పథక రచన వుందనే విషయం ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది.ఇంకా ఐ.ఎ..యస్ ఆఫీసర్ గా ఆయన అనుభవాలూ,ప్రధాన కార్యదర్శిగా కొంతమంది ముఖ్యమంత్రులతో ఆయన పడిన ఇబ్బందులూ ,సాధించిన విజయాలూ,ఆయన వ్యక్తిగత జీవితమూ ,అభిరుచులూ ఇలా యెన్నోసంగతులు వున్నాయి ఈ పుస్తకంలో.
ఒక కుగ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఒక చిన్న పిల్లవాడు తన దీక్షతో, పట్టుదలతో అనేక సంకెళ్లను ఛేదించుకుంటూ, ఉన్నత విలువలు పాటిస్తూ జీవితంలో అత్యున్నత స్థానానికి యెలా యెదిగాడో చెప్పేదే ఈ స్వీయచరిత్ర.
కృషితో సాధించలేనిది లేదని చెప్పే స్ఫూర్తిదాయకమైన ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవ వలసిన అవసరం వుంది.
*
చిత్రం: అన్వర్
Add comment