పేరు : సి.యమున
స్వస్థలం: విజయవాడ
స్థిరనివాసం: హైదరబాద్
చదివింది : గ్రాడ్యుయేషన్, కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా.
రచనలు: 2011, జులై లో నవ్య కథానికల పోటీలో బహుమతి పొందిన ‘రెక్కలొచ్చాయి‘ కథతో ఆరంభం. వివిధ ప్రముఖ పత్రికలలో, అంతర్జాల పత్రికలలో దాదాపు డెబ్భై పైగా కథలు పబ్లిష్ అయ్యాయి. రచన, ‘కథాపీఠం’ అవార్డ్ తో పాటు, దాదాపు పాతిక కథలకు బహుమతులు లభించాయి. ‘రెక్కలొచ్చాయి’ అనే పద్దెనిమిది కథల సంపుటిని ప్రచురించాను. ఆ సంపుటికి, ఇరు తెలుగు రాష్ట్రాల నుండి మూడు పురస్కారాలు లభించాయి. కొన్ని కవితలు, రేడియో కథలు రాసాను. 2020, జూన్ లో తానా వారు ‘ఘనుడు నాన్న_ త్యాగధనుడు నాన్న’ అనే అంశం పై నిర్వహించిన కవితల పోటీలో విశిష్ట బహుమతి అందుకున్నాను.
*
“సంజయ్, వస్తున్నావా?ఏవో సెలవులు కూడా కలిసొస్తున్నాయిగా”
“లేదమ్మా, నాకు రావటం బహుశా కుదరదు“
“అదేంటీ”
“ఓ ముఖ్యమైన పని ఉంది“
“వస్తున్న సెలవులకి ఇంకో రెండు రోజులు సెలవు పెట్టుకుని, మా దగ్గర నాలుగురోజులు ఉండేటట్లు వస్తావనుకుంటే ఇట్లా చెపుతున్నావా ? నీకు మంచి పెళ్లి సంబంధాలు చాలా వస్తున్నాయి. నువ్వు కూడా వస్తే, ఏదన్నా సెటిల్ చేసుకోవచ్చని ఆలోచనలో ఉన్నాము. ఇంకోసారి ఆలోచించు “
“అమ్మా, నా పెళ్లి గురించి నీకో విషయం చెప్పాలి “
‘కొడుకు ఎవరినన్నా ఇష్టపడ్డాడా’ అన్న తనలోని అనుమానాన్ని ప్రక్కనపెట్టి
“ఏమిటో చెప్పు” అంది సౌమ్యంగా సంగీత.
“నా కొలీగ్ ని ఇష్టపడుతున్నాను “
కొడుకు మాటలకు సంగీత షాక్ అవ్వలేదు. ప్రేమించి పెళ్లి చేసుకోవటం నేటి తరంలో తను చూస్తూనే ఉంది. సంగీతలో ఆసక్తి తో పాటు ‘సరియైన ఆమెనే ఎన్నుకున్నాడా‘ అనే ఆందోళన కూడా కలిగింది.తనను తాను నిభాయించుకుంటూ
“ఎవరు ఆ అమ్మాయి నాన్నా“ అంది విషయం చెప్పమని ప్రోత్సహిస్తున్నట్లుగా ప్రేమనంతా గొంతులో నింపి.
“మహారాష్ట్ర అమ్మాయి, నీకు కూడా తెలుసు”
‘పరాయి రాష్ట్రం అమ్మాయా ?’ గతుక్కు మంది సంగీత.
“ఊహూ, వాడిది తొందరపడే స్వభావం కాదు. ఏదైనా వాడు ఆలోచించందే చెయ్యడు“ కొడుకుపై ఉన్న విశ్వాసంతో
“ఎవరామ్మాయి, గుర్తు రావటం లేదు. చెప్పు చెప్పు“ అంది ఉత్సాహంగా.
“అమ్మా, ఆ మధ్య నువ్వు నా దగ్గరకు వచ్చినపుడు మా కొలీగ్స్ నలుగురిని డిన్నర్ కి పిలిచాను జ్ఞాపకం ఉందా ?”
“ఊ..ఊ “ అంది మరింత హుషారుగా.
“వాళ్ళల్లో ఒకమ్మాయి శ్వేత. నీకు బాగా హెల్ప్ కూడా చేసింది. గుర్తుందా “
“అవును, కాస్త బొద్దుగా, చామన ఛాయలో ఉంది “
“ఆ, తనే ”
“కాని అమ్మాయికి డివోర్స్ అయ్యింది. ఓ బాబు కూడా కదూ“ అనుమానంగా అడిగింది సంగీత.
“అవునమ్మా, ఆ అమ్మాయే. నీ మెమొరీని మెచ్చుకోవాలి. ఆ బాబుతో మనందరం ఆడుకున్నాము. తనకు పి.జి. అయిపోగానే పెళ్ళిచేశారు. పెళ్లి అయిన ఆరునెలలకే భర్త నరకాన్ని చూపించటం మొదలెట్టాడు. ఇహ ఓర్చుకునే శక్తి , ఓర్పు నశించి రెండేళ్ల క్రితం బాబు కడుపులో ఉన్నప్పుడే విడిపోయింది….”
“ఏమి మాట్లాడుతున్నావురా“ నమ్మలేనట్లుగా అడిగింది సంగీత.
“శ్వేత కి యెంత ఆత్మస్తైర్యమో తెలుసా ? అంత ఇబ్బందిలో కూడా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా యెంతో కష్టపడి ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అయ్యి ఉద్యోగం తెచ్చుకుంది. ఇప్పుడు కూడా ఇటు ఉద్యోగం, అటు పిల్లవాడిని యెంత చక్కగా మానేజ్ చేస్తుందో ! ఆఫీసులో తనకి మంచి ఎంప్లాయి గా ఎంతో పేరు. గ్రేట్ కదమ్మా….. “
సంగీత నెత్తిన పిడుగు పడ్డట్లు అయ్యింది. తన స్నేహితుల పిల్లలు, బంధువులలో కొంతమంది ఇతర కులస్థులని , మతస్తులని పెళ్లి చేసుకున్నవాళ్ళు ఉన్నారు. అందువల్ల వేదన పడ్డ ఆ పిల్లల తల్లి తండ్రులని ‘ఈ రోజుల్లో ఇవి తప్పటం లేదు‘ అని తను ఓదార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. తన కొడుకు, పరాయి రాష్ట్రము, భాష పిల్లని చేసుకుంటానంటే సర్దుబాటు చేసుకునేదేమో కానీ ఇలా డివోర్సీ ని, అదీ ఒక పిల్లాడి తల్లిని పెళ్లి చేసుకుంటాననటం భరించలేకపోతోంది.
“ఆ అమ్మాయి తప్ప నీకెవరూ దొరకలేదా ?” మాట పెగుల్చుకుని అడిగింది సంగీత .
“మంచితనం , టాలెంట్ ఉన్న తనని పెళ్లి చేసుకోవటం నా అదృష్టం. ఇప్పటికి కూడా నా మాటలకు తను పూర్తిగా కన్విన్స్ కాలేదు. అటూ ఇటూ గా మాట్లాడుతోంది. భయపడుతోంది. అందుకే ఈ సెలవులకి వాళ్ళ ఊరు వెళ్ళి ఆమె పేరెంట్స్ తో చెప్పి ఒప్పిద్దామనుకుంటున్నాను. ఒప్పుకుంటారో లేదని టెన్షన్ గా ఉందమ్మా… “
ఇహ ఆ పై మాటలు సంగీతకు వినపడ లేదు. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. నవ నాడులు కుంగిపోయిన్నట్లు అయ్యింది. మాట్లడలేనట్లు ఫోన్ పెట్టేసింది. ఎలా బెడ్ మీదకు చేరిందో ఆమెకే తెలియదు. బయట కురుస్తున్న వెన్నెల, వీస్తున్న చల్ల గాలి ఆ రాత్రి ఆమెను నిద్ర పుచ్చలేకపోయాయి.
*****
“ఒక్కగానొక్క కొడుకు. ఎన్ని కలలు కంది వాడి పెళ్లి గురించి. ఎంత మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి వాడికి. ఇలా చేసాడా,నన్ను క్షోభ పెట్టటానికి. ఎవరికి చెప్పుకోవాలి గుండెల్లో బాధ. ఇటు తల్లి తండ్రులు, అటు అత్తా మామ ఇద్దరూ పెద్దవాళ్ళు, ఈ విషయం విని తట్టుకోగలరా! సంఘంలో ఎంత అవమానం” అలవాటైన వంటను చేతులు చేసుకుంటూ పోతున్నాయి కానీ సంగీత మనసు మటుకు ఎగసిపడ్డ ఆలోచనలతో ఆవేదనకు గురవ్వుతోంది. ఎలాగో వంట పూర్తి చేసి మనసు నిగ్రహించుకుంటూ, పూజా మందిరంలోని విగ్రహాల ముందు కూర్చుంది అనుగ్రహం కోరుతూ.
“ఏం నేరం చేసానని నాకు ఈ శిక్ష తల్లీ . ఏదో మార్గమో , మహిమో చూపు. నా కొడుకు మనసు మార్చు“ ఆర్తిగా అమ్మవారిని అర్ధించింది సంగీత.
“ఏమో, ఆ పిల్ల తల్లి తండ్రులు ఒప్పుకోవాలి…కూతురిని ఒప్పించాలి. ఆ రెండూ జరగపోతే బాగుండు “అనే ఆశా భావము అంతలోనే తొంగి చూసింది సంగీత మనస్సులో.
“ అమ్మా, ఇంకా ఎటువంటి ఆశలు పెట్టుకోకు. నీ కలలు గురించి ఏమో నాకు తెలియదు. నా కలైతే పండుతోంది” అన్నట్లుగా ఆ రోజు రాత్రి సంజయ్ ఫోన్ చేసి, శ్వేత పెళ్ళికి ఒప్పుకుందని ఆనందంగా చెప్పాడు.
మాటలేని శిలే అయ్యింది సంగీత.
“నువ్వే నన్ను బాగా అర్ధం చేసుకుంటావమ్మా. ఈ విషయం నాన్నకు, బామ్మ తాతయ్యలకు…అందరికీ నువ్వే చెప్పాలి” అంటూ తన నిర్ణయం అయిపోయిందని మరింత స్పష్టం చేసాడు.
“ఏరా, ఆ అమ్మాయి అమ్మా, నాన్న నిర్ణయం కావాలి కానీ మాది అక్కరలేదా?” ఆ పరిస్థితిలో కూడా అవతలి వారికిచ్చిన విలువ తమకి ఇవ్వలేదనే అక్కసు, ఆవేదన కట్టి కుదుపుతుంటే ఓర్చుకోలేక అడిగింది సంగీత.
“నేను వెళ్ళింది వారి నిర్ణయం కోసం కాదు. భయపడుతున్న శ్వేతకు ధైర్యం చెప్పి, ఒప్పించమని అర్ధించటానికి. శ్వేత ముందే ఒప్పుకుని ఉంటే మీకు లాగానే వారికి కూడా సమాచారం మాత్రమే వెళ్ళేది. అయినా, రెండేళ్ళగా కలిసి పనిచేస్తున్నాము. ఓ వయసుకు వచ్చిన వాళ్లము. మా మనస్తత్వాలు ఎక్కడో ఉన్న మీకు ఏమి తెలుసని నిర్ణయాలు చెపుతారు”
“ఇన్నేళ్ళు పెంచిన మా మనస్థత్వాలు అర్ధం చేసుకోకుండా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏమిటో….”
“అమ్మా, అంత మాట అనకు. తను చాలా ….”
సంజయ్ మాటలు పూర్తి కాకముందే తన అసహాయతను , వచ్చిన కోపాన్ని చేతిలోని మొబైల్ మీద చూపుతూ టక్కున దాని పీక నొక్కేసింది. నిన్న ఆరంభమైన ఆమె నిద్ర లేని రాత్రికి నేడు ద్వితీయ విగ్నం లేకుండా ఇంకో రాత్రి జత కూడింది.
*****
సంగీత మనసు నిరంతరం కొడుకు ప్రేమ వ్యవహారం గురించిన ఆలోచనతో నిస్తేజంగా అయిపోతోంది. అసంకల్పితంగా ఊరుతున్న కంటిలోని నీటిని, ఎవరి కంటాపడకుండా కొనగోటితో తుడుచుకుంటోంది. కలిగిన షాక్ నుండి తనే కోలుకోలేకపోతోంది…..సర్దుబాటు చేసుకోలేకపోతోంది. ఇంకా భర్తకు , మిగతావారికి ఆ వార్త చెప్పే పరిస్థితి లో లేదు.
“చూడు సంగీత, నాలుగు రోజులుగా చూస్తున్నాను. నువ్వు ఎందుకో బాధ పడుతున్నట్లున్నావు. యెర్ర పడ్డ నీ కళ్ళు, పీక్కుపోయిన మొహము చెపుతున్నాయి నువ్వు వ్యధ చెందుతున్నావని …”
అత్తగారు, ‘దుర్గమ్మ’ మాటలు పూర్తి కాకముందే సంగీత మదిలోని వెత కన్నీళ్ళుగా జాలువారాయి.
“చూడు తల్లి , ముప్పై ఏళ్ళ మీ వైవాహిక జీవితంలో నేను ఎప్పుడూ నీ కన్నీళ్లు చూడలేదు. ఈనాడు చూస్తున్నానంటే, వాటికి కారణం నా కొడుకు అంటే నేను నమ్మలేను. బహుశా నీ కొడుకు వలనేమో అనిపిస్తోంది”
ఆవిడ ఊహాశక్తికి సంగీత ఒక్కసారి విబ్రమ చెందింది. మౌనం వీడి, కొడుకు పెళ్లి నిర్ణయాన్ని చెప్పింది.
విన్న దుర్గమ్మ కూడా షాక్ కు గురయ్యింది. నిన్న మొన్నటి దాకా తన ప్రక్కలో చేరి కబుర్లు, కథలు చెప్పించుకున్న చిన్నవాడు, తన మనవడు ఇలా చేస్తాడంటే నమ్మశక్యం కావటం లేదు. కృంగిన కోడలి పై జాలితో మనసు నిండిపోయింది.
“సంగీత, ధైర్యంగా ఉండు. సాయంత్రం, మురళీ ఆఫీసు నుండి వచ్చిన తరువాత వాడికి, మీ మామగారికి కూడా విషయం చెపుదాము. ఆ తరువాత అందరం కలిసి ఆలోచిద్దాము. భోజనం చేసి కాస్త నిద్రపో. శక్తి లేని శరీరం , విశ్రాంతి లేని మనసు చురుకుగా పనిచెయ లేవు“అని కోడలిని బుజ్జగించి కాస్త సేదతీరేటట్లు చేసింది.
*****
విషయం తెలుసుకుని మురళీ, శ్రీనివాసు గారు ముందు అయ్యోమయానికి ఆపై ఆవేదనకు గురయ్యారు.
సంజయ్ కి ఫోన్ చేసి నిలదీశారు. చీవాట్లు పెట్టారు. అర్ధించారు. ‘కన్న తల్లితండ్రులు మీరే నా ప్రేమను అర్ధం చేసుకోక పోతే, ఇంకెవరు అర్ధం చేసుకుంటారు’ అని సంజయ్ వారి కన్నప్రేమకే పరీక్ష పెట్టాడు కాని, తన పట్టు విడువలేదు.
ఎవరు ఎవరికి ఓదార్పు అందివ్వాలో తెలియని పరిస్థితి. డెబ్బై ఏళ్ళ జీవితానుభవం, తన కొడుకు సంసారం పై మమత , కోడలిపై జాలి, ఆమె ఆధ్యాత్మిక జ్ఞానం… దుర్గమ్మను తను తాను నిభాయించుకునేటట్లు చేసి మిగిలిన ముగ్గురికి ధైర్యం చెప్పేందుకు పురిగొల్పింది.
“కాలంతో పాటు ఎన్నో మార్పులు వస్తున్నాయి.వాడికి గాంధీ గారి సత్యవాదము, ఝాన్సీ భాయి వీర గాధలు చెప్పాము. గురజాడ , కందుకూరి ఆదర్శాల గురించి, సంఘంలో తెచ్చిన మార్పుల గురించి వాడికి మనమే గొప్పగా పరిచయం చేసాము. మనం కేవలం పాఠ్యాంశాలుగా నేర్పాము. సంజయ్ వాటిని అనుసరణలో చూపటానికి సిద్ధపడ్డాడు. మనం అల్లాడి పోవటం ఎందుకు? అడ్డదారులలో నడవకుండా పెళ్ళితో పవిత్ర బంధాన్ని ఏర్పరుచుకోవాలనుకుంటున్నాడు. వాడి ఆనందం ముఖ్యం. తను సంతోషంగా ఉండాలని కోరుకుందాము“ అంటూ తన మనసులోని వేదనను ప్రక్కనపెట్టి వాళ్ళను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది.
*****
రోజులు గడుస్తున్నాయి. మగవారిద్దరూ గత్యంతరం లేని పరిస్థితిని అర్ధం చేసుకునో, లేదా పురుష మనస్తత్వమో విషయాన్ని కొంత తేలికగా తీసుకుని తేరుకున్నారు. సంగీత మటుకు జీర్ణించుకోలేక పోతోంది. తోబుట్టువులతోనో, స్నేహితులతోనో పంచుకుందామన్నా, నవ్వి పోతారేమో అనే భయంతో పెదవి విప్పకుండా తనలో తనే క్రుంగిపోతోంది. కోలుకోలేక పోతున్న కోడలు పరిస్థితి దుర్గమ్మకు అర్ధమయ్యింది. నిద్రాహారాలు లేకుండా గడుపుతున్న ఆమె మానసిక స్థితి ఆమెను భయపెడుతోంది.
“సంగీత, సంజయ్ నిర్ణయం నిన్నే కాదు మల్నిందరినీ బాధిస్తోంది. కన్నతల్లిగా నీ కష్టం ఎక్కువ. కానీ కాస్త బయటపడు. నీ ఆరోగ్యం పాడుచేసుకోకు “ కోడలిని దగ్గర కూర్చోపెట్టుకుని లాలనగా చెప్పింది.
“యెట్లా బయటపడాలి అత్తయ్య ఇంత అగ్ని పరీక్షనుండి”
“ ‘మా పెళ్లి మా ఇష్టం. మీ కష్టం మా కనవసరం’ అని పిల్లలు నిర్ణయాలతో ఎంతోమంది తల్లి తండ్రులు పడుతున్న అవస్తే ఇది. చూస్తూనే ఉన్నాముగా “
“పెరుగుతున్న ప్రేమ వివాహాలు, తల్లి తండ్రుల మనో వ్యధలు నేను గమనిస్తూనే ఉన్నాను. కానీ మరీ ఇంత
ఘోరమా ? ఎన్ని ఆశలతో, కలలతో వాడిని పెంచానో తెలుసా” దుఖం అడ్డం పడి గొంతు పూడుకు పోయింది సంగీతకు.
“టి.వి. లలోను సినిమాల్లోనూ తల్లి తండ్రులు ఓ విలన్స్ గా , ప్రేమ కు అడ్డుపడే రాక్షసులుగా చూపుతున్నారు. నిజంగా అమానుషంగా ప్రవర్తించే తల్లి తండ్రులు కొంతమంది లేకపోలేదు. కానీ బిడ్డల జీవితం తప్పితే, మరో ప్రపంచం లేని ఇలాంటి తల్లుల పరిస్థితి ఏమిటి? వారి గాయపడ్డ మనసులు ఎలా రక్షించుకోవాలో ఏ చానెల్స్, సినిమాలలోను చూపరే?” అనుకుంటూ నిట్టూర్చింది దుర్గమ్మ.
*****
“ఏంటి , నన్ను మర్చిపోయావా తల్లీ. ఫోన్ చేసినా తియ్యటం లేదు “ ఇంట్లో అడుగుపెడుతూనే సుడిగాలి లాగా చుట్టేసింది లావణ్య సంగీతను. ఇద్దరూ డిగ్రీ లో క్లాస్ మేట్స్. హాస్టల్ లో రూమ్ మేట్స్ కూడా. మూడేళ్ళ స్నేహమే అయినా అనుబంధం చాలా ఎక్కువ. పెళ్లిళ్లు అయ్యి భాగ్యనగరం లోనే స్థిర పడటంతో ఆ స్నేహం కొనసాగుతోంది.
“నెలగా నువ్వు ఫోన్ తీయకపోవటంతో ఇహ ఊరుకోలేక వచ్చేశాను “ అంది గల గలా.
“ఫోన్ తియ్యనందుకు సారీ “ అంది ముభావంగా.
“ఏమిటీ, ఆ ఫేసు. పాతిక కిలోమీటర్లు పడి వచ్చాను. కనీసం మంచి నీళ్ళు కూడా అడగవా ?” అంది నిష్టూరంగా.
“లావణ్య , నువ్వూ, సంగీత గదిలోకి వెళ్ళి కూర్చుని మాట్లాడుకోండి. నేను కాఫీ తీసుకువచ్చి ఇస్తాను“
ఎప్పుడూ లేనిది సంగీత ఫోన్ తియ్యక పోవటం, దుర్గమ్మ గారు ‘రూమ్ లోకి వెళ్ళి మాట్ల్లాడుకోండి’ అనటంతో లావణ్యకి అర్ధమయ్యింది ఏదో విషయం ఉందని.
సంగీతను తీసుకుని వాళ్ళ బెడ్ రూమ్ లోకి నడిచింది.
“ఇప్పుడు చెప్పవే, ఏంటి విషయం“ అంది ఆప్యాయంగా సంగీత భుజం మీద చెయ్యేసి.
“ఇంకో సంతానం కంటే వీడికి ఏం తక్కువవుతుందో అని ఒక్కడితో సరిపెట్టుకున్నాము. నా ఉద్యోగాన్ని కూడా వదులుకుని, పంచప్రాణాలు పెట్టుకుని పెంచాను. మరి వాడు మా గురించి ఆలోచించకుండా అంత తెలివి తక్కువ నిర్ణయం తీసుకోవటమేమిటి. మమ్మల్ని ఇంత వెన్నుపోటు పొడవటం న్యాయమేనా?“ విషయం అంతా చెప్పి బావురుమంది సంగీత.
స్నేహితురాలి బాధ అర్ధం చేసుకున్నట్లుగా సంగీత వీపు నిమురుతూ కొంతసేపు మౌనంగా ఉండిపోయింది లావణ్య.
“నీ బాధ లో అర్ధం లేదనను. కానీ నువ్వు అర్ధం చేసుకుంటే కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను “
మౌనంగా చూసింది సంగీత.
“సంజయ్ నిర్ణయం అనేక కోణాలలో నిన్ను ఇబ్బంది పెడుతోంది. ఒకటి, అందరి కొడుకులకు జరిగినట్లు కాక తన పెళ్లి భిన్నంగా జరగబోవటం, నీ ఆశలు విచ్చిన్నమవ్వటం. రెండోది, సంఘం ఏమనుకుంటుందో , మొహం ఎత్తుకుని ఎలా తిరగాలో అనే ఆలోచన ..కదూ”
“అవును, నేను కొడుకుని ఎంతో క్రమశిక్షణగా పెంచాను అని ఇన్నాళ్ళు ఓ గర్వం. ఇప్పుడు అందరూ అనే మాటలకి నేను ఎలా తలెత్తుకోను”
“అన్ని విషయాలకు మనం సమాజానికి జవాబుదారి కాదు”
“ఆ సమాజంలోనే కదా బ్రతకాలి”
“ ఒక్కోసారి సమాజాన్ని మరిచిపోవాలి, తప్పదు. మనల్ని మనమే రక్షించుకోవాలి. అసలు అందరి తల్లుల్లాగా నిన్ను నువ్వు ఎందుకు అనుకోవాలి”
“అందరిలాగా కాక మరి ప్రత్యేకత ఏమిటి నాకు?” అర్ధం కానట్లు అడిగింది సంగీత.
“నువ్వు, విశాల భావాలు ఉన్న కొడుక్కి తల్లివి. మనసు యెంత సున్నితమో , అంత గట్టిది కూడా సంగీత. అది రెండు వైపుల పదునున్న ఆయుధం. దానికి మనమిచ్చే ఆలోచనే ఆహారం. పాజిటీవ్ ఆలోచనలతో దానిని నింపితే అది ఏ బాధను అయినా మరిచి బలిష్టమవుతుంది. అదే నెగటీవ్ గా చూస్తే , బలహీనపడి కుంగిపోతుంది. నేను చెప్పినట్లుగా ఆలోచించి చూడు”
“అంటే “
“ నిన్ను నువ్వు ఆదర్శం కల వ్యక్తిగా అనుకో. విశాల హృదయంతో, నీ కొడుకు వివాహాన్ని ఆమోదించి కోడలను సాదరంగా ఆహ్వానిస్తున్న స్త్రీగా నిన్ను నువ్వు మలుచుకో. గుండెల్లో అగ్నిపర్వతాన్ని నీ చిరునవ్వు వెనుక దాచెయ్యి. ఆ నవ్వు చూసిన ఈ సమాజంలో ఎవరూ నీ ముందు నోరు విప్పే సాహసం చెయ్యరు”
“నటించాలా ? అది నా వల్ల కాదు“ ఉబికి వస్తున్న దుఖాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు సంగీత.
“ నేను చెప్పింది నటన కాదు, సాధన. మన ఆడపిల్లే అలాంటి పరిస్థితిలో ఉండి, నీ కొడుకులాంటి వాడు పెళ్లి చేసుకోవటానికి ముందుకొస్తే సంతోష పడవా? ఒక్కసారి అలా, ఆ కోణం లో ఆలోచించు. అలా ఉన్నతమైన ఆలోచనలను సాధన చేసి , మనల్ని మనమే కృంగి పోకుండా రక్షించుకోవాలి…మార్చుకోవాలి. కాలం నీ గాయం మాన్పి, బహిరంగంగానే కాదు అంతరంగం లో కూడా నీ కొడుకు సంసారాన్ని సంతోషంగా ఆమోదించేటట్లు చేస్తుంది”
లావణ్య మాటలలో నిజాయితీ, పదును సంగీతను మరో కోణంలో ఆలోచింపచేసింది…మనసు లో మార్పుకు సాధన ఆరంభమయ్యింది.
“అవును, మనసనే విలువైన ఆయుధాన్ని మంచి ఆలోచనలతో బలంగా చేయాలి. నా బాధ నుండి, నన్ను నేనే రక్షించుకోవాలి. శ్వేతను కోడలిగా సంతోషంగా ఆహ్వానించాలి“ స్థిరంగా అనుకుంది సంగీత.
*****
చాలా బాగుంది కథ. మారుతున్న కాలానికి పరిస్థితులకు అనుగుణంగా విద్యాధికులు ఉద్యోగస్తులు అయిన పిల్లల మానసిక పరిపక్వత తో తీసుకున్న నిర్ణయాలను గౌరవిస్తూ మనం “” మరోకోణం “” ఆలోచించ valasivundi . కాలానికి అనుగుణంగా ప్రస్తుత పరిస్థితుల కనుగుణంగా ‘ యమున గారు అర్థ వంతమైమైన అద్భ్తమైన కథ రాశారు . హృదయ పూర్వక అభినందనలు యమున గారు.
మీ చక్కటి సమీక్షకు ధన్యవాదాలు సర్ !
యమునా మేడం గారి “మరో కొణం” కథ తల్లిదండ్రులను బిడ్డల కోణంలో ఆలోచింపచేసి వారి కోరికలను, నిర్ణయాలను పెద్దలు ఆమోదిస్తే ఈ నవీన కాలంలో అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది అని తెలిపే దిశగా సాగింది. సారంగా లో బహుమతి పొందినందుకు మేడం గారికి అభినందనలు 💐💐
మీ అభిప్రాయం తెలియచేసినందుకు చాలా ఆనందంగా ఉంది. థాంక్స్, రోహిణి గారు!
యమునా గారూ యువతకు మరియు తల్లిదండ్రులకు మంచి సందేశంతో కథను చక్కగా వివరించాru. సందేశంలో ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా అనుకూలత, అవగాహన, అంగీకారం ఉన్నాయి.
Really it was very good.
చాలా బాగుందండి కథ … మారుతున్న పరిణామాలకి ఆలొచనా విదానంలో మార్పు యెంతో అవసరం అని చక్కగా చెప్పారు.